[dropcap]“ఒ[/dropcap]రేయి కుమార్.. ఇంజనీరింగ్ చదివావు, మంచి తెలివితేటలు ఉన్నాయి, మనకు ఎలాగూ ఇక్కడ వచ్చేవన్నీ అరకొర ఉద్యోగాలే. అందుకే మన ఊరి కరణం అబ్బాయి రమణ లాగా కాస్త, ఆ పరీక్షలు ఏవో రాసి విదేశాలు పోవచ్చుగా. ఇష్టం లేకపోవడవేమిటీ? నేను మాత్రం ఇష్టపడి పుట్టిన ఊరు వదిలేసి వచ్చానా? ఉద్యోగం అంటే తప్పదు మరి, మేము ఊళ్ళు, రాష్టాలు దాటి వెళ్లి పనిచేసాము, మీ తరం ఖండాంతరాలు వెళ్లాల్సి వస్తోంది. మగాడు ఇంట్లోనే కూర్చొని ఏదో ఇదే బాగుంది అని అనుకుంటే మరి వృద్ధిలోకి ఎప్పుడు వస్తావురా? నువ్వు ఎన్నైనా చెప్పు? నువ్వు కూడా విదేశాలు వెళ్లి బాగా డబ్బులు సంపాదించి, మంచి ఉద్యోగం చేస్తూ అభివృద్ధిలోకి రావాలి.. అంతే. అంతేకానీ సత్తు పావలా లాగా డిబ్బీలోనే ఉంటానంటావేమిటి?” అంటూ నారాయణ తన పుత్రరత్నం కుమార్‌ను కాస్త మందలించాడు.
“నాన్నా.. విదేశాలు వెడితే డబ్బులు, హోదా వస్తుందేమో కానీ, మనకు సుఖం ఉండదు. కుటుంబం మొత్తానికి దూరంగా, అన్నీ వదులుకుని అనాథలాగా బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాలి. ఒక పండగ, పబ్బం ఏదీ మనలా జరగదు. వద్దు నాన్నా, ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం బాగానే ఉంది. కొన్ని సంవత్సరాలు అనుభవం గడిస్తే ఇంకా మంచి స్థాయికి ఇందులో వెళ్ళవచ్చు. పూట గడవని స్థితి మాత్రం కాదుగా. ఇంక ఈ విషయం వదిలేయి” అంటూ వాపోయాడు కుమార్.
“నువ్వు ఏమైనా చెప్పు, నీకు టాలెంట్ లేకపోతే అనుకోవచ్చు, అన్నీ ఉండి ఈ చిరు ఉద్యోగం పట్టుకుని వెళ్లాడతావేమిట్రా? పైగా నీకు కొత్తగా పెళ్లి కూడా అయ్యింది. తరువాత సంసారం పెరుగుతుంది. నేను ఇంకో రెండు సంవత్సరాలలో రిటైర్ అవుతాను. నువ్వు ఎక్కడుంటే అక్కడకు వచ్చేస్తాను. ఈ వయసులో సంపాదించగలిగినంత సంపాదించాలి. నాక్కూడా నువ్వు విదేశాలు వెడితే గర్వంగా ఆఫీసులో చెప్పుకోవచ్చు. వెధవది మా ఆఫీస్‌లో అటెండర్ కొడుకు కూడా ఆ మధ్య దుబాయి వెళ్ళిపోయి లక్షలు పంపిస్తున్నాడు. నువ్వేమిటిరా బాబూ? సత్తెకాలంలో బతికేస్తున్నావ్.. అబ్బాయి.. ఇదేం కుదరదు. నువ్వు అవేవో పరీక్షలు కట్టి సాధించి వెళ్లవలసిందే. అమ్మాయ్, ..కోడలు పిల్లా మీ ఆయన విదేశాలు వెళ్లి ఉద్యోగం సంపాదించే బాధ్యత నీదే. అర్థం అవుతోందా?” అంటూ కాస్త గట్టిగానే తీర్మానం చేసేసాడు నారాయణ.
అలా తండ్రీ కొడుకులు మధ్య జరిగిన ఆ సంభాషణలో ఆఖరికి తండ్రి మాటలు కాదనలేక తప్పలేదు కుమార్‌కు. ఎంతైనా తండ్రి చాటు బిడ్డ, తల్లి చిన్నప్పుడే చనిపోయినా ఇంకో పెళ్లి చేసుకోకుండా తనను పెంచి పెద్ద చేశారు, ఆయన మాట ఏదైనా చెయ్యవలసిందే.
“ఏమోయి. నారాయణా. ఏమిటి పరధ్యానం. ఎక్కడున్నావ్” అంటూ కుదుపుతూ అరిచిన సుబ్బారావు మాటలకు బయటకు వచ్చాడు నారాయణ.
పై ఘటన జరిగి సుమారు 5 ఏళ్ళు అయ్యింది. వద్దు మొర్రో అంటున్న కొడుకును విదేశాలు పంపించి మొత్తానికి అనుకున్నది సాధించాడు. ఈలోపల తన రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఏదో ఇంట్లో వండుకు తినడం, ఉదయం, సాయంత్రం తనలాగే విరమణ అయిన సహచరులతో కాలం చేస్తూ ఒంటరిగా గడపడం అలవాటు అయిపోయింది. కానీ ఎందుకో ఈ మధ్యే ఒంటరితనం చాలా ఇబ్బంది పెడుతోంది.
“అదిగో మళ్లీ పరధ్యానం లోకి వెళ్లిపోతున్నావ్.. ఏమైంది చెప్పవోయి. మంచైనా, చెడైనా పంచుకునే దేదైనా ఆ మాత్రం పనికిరానా..” అంటూ పాటను అందుకున్నాడు సుబ్బారావు.
“అది కాదురా.. ఈ మధ్య ఎందుకో ఒంటరితనం బాగా తెలుస్తోంది. కొడుకుని, కోడలిని చూడాలని ఉంది. వాళ్ళు విదేశాలు వెళ్లిన తరువాత మళ్ళీ రాలేదు. వస్తామన్నా ఖర్చులు ఎక్కువ అయుపోతాయని నేనే రెండు సార్లు ఆపేసాను. కానీ ఎందుకో ఇప్పుడు మాత్రం అందరం కలిసి ఉండాలని అనిపిస్తోంది. అవే ఆలోచనలు పరధ్యానం లోకి నెట్టేస్తున్నాయి” అంటూ కాస్త దీనంగా చెప్పాడు నారాయణ.
“మరి అయితే ఒకసారి వాళ్ళను రమ్మను. లేదా నువ్వు వెళ్ళు. ఏదో ఒకటి చేయి, నీకు బెంగ కాస్త తీరుతుంది. సరేలే సాయంత్రం అయ్యిందిగా, కాస్త బయటకు నడు. మన సీనియర్ సిటిజన్ బ్యాచ్ అంత కలిసే గ్రంథాలయం పార్కుకు వెడదాం. నీకు వాళ్ళని కలిస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది” అంటూ సుబ్బారావు, నారాయణ భుజం పట్టుకుని నడవమన్నాడు.
“నిజమేలే వెడదాం” అంటూ నారాయణ, ఇంటికి తాళం వేసి నెమ్మదిగా పార్కువైపు అడుగులు వేశారు.
పార్కులోకి వెళ్ళగానే సుమారుగా తన వయసున్న ఒక పదిహేను మంది దాకా ఉన్నారు. అందరూ తెలిసిన వాళ్ళు కావడం ఒక పలకరింపు నవ్వు విసురుకోవడం ఒకేసారి జరిగాయి.
ఇంతలో రామనాధం మాస్టారు ఒక కిలో మిఠాయిలు పట్టుకు వచ్చి అందరికీ ఇవ్వడం మొదలుపెట్టాడు. “ఏమిటి మాస్టారూ.. ఏమిటి విశేషం? మిఠాయిలు పంచుతున్నారు. మంచి విషయం ఏమిటో చెప్పండి, వెంటనే తినేస్తాను. ఎందుకంటే నాకు చక్కెర వ్యాధి కాస్త జాస్తి. కానీ మిఠాయి చూస్తే నోరు ఊరిపోతోంది.” అంటూ వెంకట్రావ్ మాస్టారు చతురతగా మాట్లాడారు.
“అదా.. మా అబ్బాయి నరేష్ లేడు, వాడికి వాడి కంపెనీలో మంచి ప్రమోషన్ వచ్చింది. అదే విధంగా మా రెండోవాడు కెనడాలో ఇంకో పెద్ద ఉద్యోగంలో మారాడు. జీతాలు బాగా పెరిగాయి. అదీ సంతోషం.” అంటూ ఆనందంగా మిఠాయిలు పంచడంలో మునిగి పోయాడు.
“ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి, మీ అబ్బాయిలు ఇద్దరూ చాలా తెలివయిన వాళ్ళు మాస్టారు. మీరు అదృష్ట వంతులు.” అంటూ అందరూ తలో రకంగా పొగుడుతుంటే పొంగి పోయారు రామనాధం మాస్టారు.
“ఇంతకూ మీ వాడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు. మా అబ్బాయి అయితే అదేదో.. అబ్బబ్బా.. ఆ వెధవ కంపెనీ పేరు గుర్తుకు రావడం లేదు. వాడు అందులో చాలా పెద్ద పదవిలో ఉన్నాడు. బాగా గడిస్తున్నాడు. ఓ పదేళ్ల నుండి అక్కడే ఉన్నాడు. పెళ్లి చేసి పంపేసాం, మనవడు కూడా అక్కడే పుట్టేసాడు. నేను వెడదాం అంటే వీసా రావటం లేదు” అంటూ అడగకపోయినా ఏదో అవకాశం వచ్చినట్టుగా వాపోతూ చెప్పేసారు మరో సీనియర్ సిటిజెన్ వీరాచారి.
“మాస్టారూ, మా అబ్బాయి కూడా ఇలాగే విదేశాల్లో ఉంటే రెండేళ్ల క్రితం ఒక ఆరు నెలలపాటు ఉందామని నేనూ మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను, మహాప్రభో.. నరకానికి దగ్గరగా ఉండి వచ్చాను. అబ్బాయి, కోడలు ఎవరి ఉద్యోగం వాళ్ళది, మనదేశంలో లాగా ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళడానికి ఉండదు. అన్నీ చోట్ల నిషేధాజ్ఞలే. మన వయసు వాళ్ళు ఎవ్వడూ దొరకరు. దొరికినా ఇక్కడలా సాయంత్రం కలిసి సరదాగా అన్ని సంగతులు చెప్పుకునే అవకాశం ఉండదు. ఏం చెయ్యాలో, ఏది చెయ్యాలో, ఎలా చేయాలో ఏదీ అర్థం కాక పిచ్చి ఎక్కేది. ఎక్కువ కాలం ఉందామనుకుని వెళ్లి రెండు నెలలు తిరగకుండానే డబ్బులు నష్టపోతున్నా వెనక్కు వచ్చేసాము. ఇక్కడకు వచ్చి మామూలు మనిషి కావటానికి ఒక నెల పట్టింది. ఏదో విహార యాత్ర అయితే పరవాలేదు కానీ, నాబోటి వారికి నిజంగా అది జైలే.. ఇంక మళ్లీ రాము అని ఒట్టు పెట్టేసుకున్నాం.” అంటూ తన అనుభవాలను పంచుకున్నారు ఆ ఊరి మాజీ కరణం.
“మా వాడు వెళ్లి పదేళ్లు అయ్యింది, బాగానే సంపాదించాడు. ఎందుకో ఈ మధ్య వచ్చేస్తానని అంటున్నాడు. కానీ కోడలు పిల్లకు ఇక్కడకు ఇంకా రావడం ఇష్టం లేదు. ఈ విషయమై వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు. నాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఇంక సంపాదించినది చాలు నాన్నా, నీ దగ్గరకు వచ్చేస్తాను, ఏదో ఒక ఉద్యోగం అక్కడ చేస్తూ కాలం గడిపేస్తాను అని మా వాడు, లేదు ఇంకో పది సంవత్సరాలు ఇక్కడే ఉండి బాగా సంపాదించి అప్పుడు వెడదాం అని కోడలు.. ఇద్దరి అభిప్రాయం కుదరక, ఏదీ కాదనలేని పరిస్థితి నాది. అర్థం కాని తలనొప్పితో మేము కొంతకాలంగా బాధపడుతున్నాం” అంటూ ఏకరువు పెట్టారు మాజీ యం.ఆర్.ఓ. ఆనందరావు.
“ఏమైనా చెప్పండి.. పిల్లలు బాగా ఎదిగి పెద్ద ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో ఉంటే ఆ హోదా, ఆ దర్జా వేరు. మనం ఎంత పెద్ద ఉద్యోగం చేసి, ఎంత పెద్ద హోదాలో ఉన్నా మన సంతానం అభివృద్ధి లోకి లేకపోతే, ఎంతో మనం నష్టపోయినట్లే. నా మటుకు నాకు మా ఇద్దరి పిల్లలు విదేశాల్లో, అత్యున్నత పదవుల్లో కొలువై ఉండటం చాలా గర్వంగా, అద్భుతంగా ఉంది. ఏదో మా ఆవిడ సరస్వతి అప్పుడప్పుడు గొణుగుతూ ఉంటుంది. పిల్లలకు దూరం అయిపోతున్నాం, ఈ వయసులో మన దగ్గర వాళ్ళు ఉండాలని. నాకైతే మాత్రం చాలా ఘనంగా ఉంది” అంటూ రామనాధం మాస్టారు తన అభిప్రాయం అందరిముందు పరిచేశాడు.
అలా ఆ సాయంత్రం అంతా తమ పిల్లలు, వాళ్ళ బాగోగులు వాళ్ళు విదేశాల్లో పరిస్థితి, వాళ్ళ మనవళ్లు విషయాలు అన్నీ మాట్లాడేసుకుని రాత్రి కల్లా యింటికి చేరుకున్నారు. వీళ్ళ అందరి మాటలు విన్న నారాయణకు మనసులో ఏదో బెంగ మొదలయ్యింది.
‘ఏం చెయ్యాలి, కొడుకును ఇంక చాలు వెనక్కు వచ్చేయమని చెప్పడమా? లేక పరవాలేదు ఇంకో పదేళ్లు అక్కడే ఉండమని, బాగా సంపాదించమని చెప్పడమా, లేదా వీళ్ళు అందరినీ వదిలేసి, ఈ సరదాగా కాలక్షేపం అయిపోయో ఈ సాయంత్రాలు అన్నీ వదిలేసి ఏదో జైలుకు వెళ్లినట్టు అక్కడకీ వెళ్లి పోవడమా? ..ఏం అర్ధం కాకుండా.. ఏదో మనసులో తికమక పడుతోంది’. అలా ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయం సుమారు ఆరు గంటలు అయ్యింది, నారాయణ ఒళ్ళంతా నొప్పులతో ఏదో జ్వరం వచ్చినట్టుగా టెంపరేచర్ కనిపించడం మొదలు పెట్టింది. నెమ్మదిగా లేద్దాం అనుకుంటుండగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ..ఏం చెయ్యాలి.. ఎవరిని పిలవాలి. ఏం పాలుపోక మళ్లీ అదే మంచంపై నిద్రపోయాడు. అలా ఇంకో రెండు గంటల తరువాత మళ్ళీ తెలివి వచ్చింది. మళ్లీ అదే పరిస్థితి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ మొబైల్ ఫోన్ అందుకుని తన స్నేహితుడు సుబ్బారావుకు ఫోన్ చేసాడు.
“ఒరేయ్.. సుబ్బు. ఒంట్లో బాగోలేదురా. ఏదో బాగా నలత చేసినట్లుంది. లేద్దాం అంటే కళ్ళు తిరుగుతున్నాయి. నీరసంగా ఉంది. మంచినీళ్లు, కాఫీ ఏది కావాలన్నా లేవాలిగా.. కళ్ళు తిరిగి పడిపోతానేమోనని భయంగా ఉంది. ఒకసారి నువ్వు రారా. ఏదోరకంగా తలుపు తీస్తాను.. ప్లీజ్” అంటూ నీరసంగా మాట్లాడాడు.
“ఒరేయ్.. నారాయణ.. అయ్యో.. ఎలా ఉన్నావ్. ఇదిగో ఐదు నిముషాల్లో వచ్చేస్తున్నా. కొద్దిగా ఓపిక పట్టు.” అంటూ సుబ్బారావు ఒక పావుగంటలో అక్కడికి చేరుకున్నాడు.
ఎక్కడ లేస్తే కళ్ళు తిరుగుతాయో అని నారాయణ డేక్కుంటూ వెళ్లి తలుపు తీసి కిందే మళ్లీ పడుకుండి పోయాడు. తలుపు తోసుకు వచ్చిన సుబ్బారావు, నారాయణ పరిస్థితి చూసి చలించిపోయాడు.
“అయ్యో.. ఇలా అయిపోయావేమిట్రా! అయ్యో.. బాగా ఒళ్ళు కాలుతోంది. సరే.. రా” అంటూ నారాయణ భుజం పట్టుకుని నెమ్మదిగా మంచం వైపు తీసుకువెళ్లి పడుకోబెట్టి, కాస్త మంచినీళ్లు తాగించి, లోపల గదిలోకి వెళ్లి మెత్తటి తువ్వాలోకటి తడిపి తీసుకువచ్చి నారాయణ ముఖం తుడిచాడు. అలా కాసేపటికి నారాయణ కాస్త తేలిక పడగానే తాను తెచ్చిన కాఫీ తాగించి మందులు వేసాడు.
“ఒరేయ్. నేను ఇక్కడే ఉంటాను. మందులు వేశానుగా, కొంచెం సేపు నిద్ర పో, అన్నీ సద్దుకుంటాయి. మా ఆవిడకు ఫోన్ చేసాను, జావ లాంటిది ఏమైనా తీసుకు వస్తుంది. నీకు తగ్గేదాకా మేము ఇద్దరం ఇక్కడే ఉంటాం. బెంగపడకు నేనున్నాను” అంటూ నారాయణ ఏదో చెప్పేలోగా సుబ్బారావు ఊరుకోమని సౌజ్ఞ చేసాడు.
అలా రెండు రోజులు పట్టింది, నారాయణ కొద్దిగా కొలుకోవటానికి, సుబ్బారావు భార్య రోజూ ఇంటినుండి వంట వండి తేవడం, అందరూ కలిసి ఇక్కడే తినటం, మొత్తానికి ఒక వారానికి నారాయణ మామూలు మనిషి అయ్యాడు.
ఇలా ఇంకో వారం గడిచింది. ఒకరోజు ఉదయం సుబ్బారావు గబగబా వచ్చి తలుపులు గాబరాగా కొడుతూ “ఒరేయ్.. నారాయణ.. తలుపులు తీయరా” అని అరుస్తుండగా ఉలిక్కిపడి లేచిన నారాయణ గబగబా తలుపులు తెరుస్తూ” ఏమైంది సుబ్బు.. ఏమిటా గాబరా? అని అంటుంటే “ఒరేయ్.. చొక్కా వేసుకో, మనం బయటకు వెళ్ళాలి, దారిలో విషయం చెబుతాను” అంటూ కంగారు పెట్టాడు.
నారాయణ వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని బట్టలు వేసుకుని అలా ఒక పావుగంటలో ఒక ఇంటి దగ్గర ఆగారు.
అక్కడి వాతావరణం చూడగానే నారాయణకు అర్ధం అయ్యింది, ఎవరో చనిపోయారని “ఒరేయి సుబ్బు.. ఎవరిదిరా ఈ ఇల్లు, మనం ఇక్కడకు ఎందుకు వచ్చాం, చూస్తుంటే ఎవరో చనిపోయిన వాతావరణం కనిపిస్తోంది.” అని అంటుంటే
“అదేరా మన రామనాధం మాస్టారు రాత్రి కాలం చేశారు. రెండు రోజుల నుండి కాస్త నలతగా ఉందట, నిన్న రాత్రి ఆఖరి శ్వాస తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న పిల్లలకు కబురు వెళ్ళింది, మరి వాళ్ళు ఎప్పుడు బయలుదేరి వస్తారో, ఎప్పటికి ఈ తంతు ముగుస్తుందో తెలియదు. దగ్గరగా ఉన్న బంధువులు అందరూ వచ్చేసారు, లోపలికి వెళ్లి ఆయన భార్య సరస్వతమ్మ గారిని పలకరించి వచ్చేద్దాం” అంటూ లోపలికి దారి తీశాడు సుబ్బారావు.
లోపలికి వెళ్ళగానే రోదనలు మిన్న ముట్టాయి.. అక్కడ చాలా మంది రామనాధం మాస్టారి స్నేహితులే, ముఖ్యంగా సాయంత్రం పార్కులో కలిసే వాళ్లే ఎక్కువ. అందరూ పెద్దగా నిట్టూరిస్తున్నారు. పాపం పిల్లలు దగ్గర లేకుండా వెళ్లిపోయాడని బాధపడుతున్నారు. బహుశా ఆ ఇంట్లో బంధువనుకుంటా సరస్వతమ్మగారి దగ్గర ఫోన్ నంబర్ తీసుకుని రామనాధం మాస్టారు పిల్లలతో మాట్లాడుతున్నాడు. సంభాషణలు బట్టి అందరికీ అర్ధం అవుతోంది. వాళ్ళు ఇండియా రావటానికి నాలుగు రోజులు అధమ పక్షం పడుతుందని, వాళ్ళు వచ్చేదాకా ఈ భౌతిక కాయాన్ని ఎక్కడుంచాలి? ఇలా చాలా విషయాలు తర్జనభర్జనలు జరుగుతూ తలలు పట్టుకుంటున్నారు. అలా వారి అందరినీ తప్పించుకుని లోపల సరస్వతమ్మగారిని కలిసి పలకరించారు.
“సుబ్బారావు అన్నయ్య.. మీ మాస్టారు మనల్ని అందరినీ అన్యాయం చేసి వెళ్లిపోయారు. పిల్లలను చూడాలని చాలా రోజులుగా మథన పడుతూ, పైకి మాత్రం మీ అందరి దగ్గరా డాబుగా మా పిల్లలు విదేశాల్లో ఉన్నారనేవారే కానీ మనసంతా వాళ్ళ మీదే ఉండేది. వాళ్ళ అందరితో కలిసి ఉండాలని కలలు కనేవారు. నేనే అలా గొణుగుతున్నానని నెపం నా మీద నెట్టేవారు కానీ, అసలు ఆయనకే ఉండేది. అలా బెంగ పెట్టుకునే గుండె ఆగిపోయింది.
రెండు రోజులుగా ఆయన వాళ్ళని తలుచుకుని కళ్ళంపట నీళ్లు పెట్టని సమయం లేదు మరి. పిల్లలని చూస్తే వాళ్ళు రావటానికి ఇంకా చాలా సమయం పట్టేట్టు ఉంది, కనీసం ఆఖరిచూపు దక్కేట్టు కనిపించటం లేదు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఏదో కానిచ్చేయండి మేము వస్తాం అన్నట్టుగా ఉంది” అంటూ భోరున విలపించింది సరస్వతమ్మ.
ఆమె చెప్పిన విషయాలు విని అంతా విస్తుపోయారు, అయ్యో.. రామనాధం మాస్టారు మనసు ఇదా.. ఇలా బెంగ పెట్టుకున్నారా? అని అనుకుంటూ చాలా బాధపడ్డారు.
జరుగుతున్న అన్ని సంఘటనలన్నీ చూస్తున్న నారాయణ బాగా చలించి పోయాడు. రామనాధం మాస్టారుతో పెద్దగా అనుభంధం లేకపోయినా, ఈ విషయం తెలిసేటప్పటికి తట్టుకోలేనంత దుఃఖం కమ్ముకొచ్చింది.
ఇంతలో సరస్వతమ్మ గారి బంధువు, అప్పటిదాకా వాళ్ళ పిల్లలతో మాట్లాడిన అతను నెమ్మదిగా వచ్చి “పిన్ని.. వాళ్ళు రావటానికి ఇంకో నాలుగు రోజులు పడుతుంది, వాళ్ళు వచ్చేదాకా ఈ భౌతిక కాయాన్ని ఎక్కడయినా ఆసుపత్రికి తరలిస్తే మంచిది. ఒకవేళ ఆగలేకపోతే కార్యక్రమాలు కానిచ్చేయండి, తాము వచ్చి మిగతా తంతు పూర్తి చేస్తామని ఖరాఖండీగా చెప్పేసారు. మరేం చేద్దాం” అంటూ తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు.
సరస్వతమ్మ గారికి బుర్ర గిర్రున తిరిగినంత పని అయ్యింది, అవును ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఏమీ పాలుపోక గుక్కపెడుతూ ఏడవటం మొదలు పెట్టింది. మొత్తానికి అందరూ రామనాధం గారి భౌతిక కాయాన్ని ఊళ్ళో ఆసుపత్రికి తరలించి, పిల్లలు వచ్చిన మొదటి పూటలోనే మిగతా కార్యక్రమం పూర్తి చేసేద్దామని నిర్ణయించారు.
అందరూ అనుకున్న నిర్ణయం ప్రకారం ఆసుపత్రికి ఆ భౌతిక కాయాన్ని తరలించేశారు. మాస్టారూ లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయింది. వచ్చిన బంధువులు అంతా అదే ఇంట్లో మాస్టారి పిల్లల కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు.
అలా నాలుగురోజుల తరువాత ఆయన పిల్లలు రావటం, వచ్చిన ఉదయమే రామనాధం గారి అంత్యక్రియలు కార్యక్రమాలు అన్నీ జరగటం, తరువాత కార్యక్రమాలు అన్నీ వరుసగా ఒక కలలాగా జరగటం అయిపోయింది.
అలా ఆయన పిల్లలు ఇంకో నెల అక్కడే ఉండి మాస్టారి గారి ఇల్లు కూడా అమ్మేయటం, సరస్వతమ్మ గార్ని తీసుకుపోదామని ప్రయత్నం చేస్తే ఆమె ససేమిరా రాను అని అనటంతో పక్క పట్టణంలో ఒక పేరుమోసిన వృద్ధాశ్రమంలో ఒక ఇరవై లక్షలు ఆవిడ పేరు మీద విరాళం ఇచ్చి అక్కడే ఆమెను చేర్పించడం ఏదో ఊహించని వేగంతో జరిగిపోయింది.
సరిగ్గా నెల క్రితం దేదీప్యమానంగా కళకళలాడుతూ ఉండే రామనాధంగారి కలల సౌధం నేడు పరాధీనం అవ్వడం, ఆ ఇంటి మహాలక్ష్మి సరస్వతమ్మ గారు పరుల పంచన చేరటం, అసలు ఇలాంటి పిల్లలను ఎందుకు కన్నానా అని బాధపడే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, మనసు విరిగిపోయి నిరాశలో కూరుకుపోవడం అన్నీ సంఘటనలూ ఒక్క తాటిన జరిగిపోవటం అయ్యింది.
ఈ సంఘటనలో జరిగిన ప్రతీ విషయం నారాయణ మనసులో చాలా పాతుకు పొయింది. బాగా చలించి పోయాడు. “ఒరేయి.. సుబ్బు.. ఎలా ఉండే రామనాధం గారి ఇల్లు ఎలా అయిపోయిందిరా? డబ్బు మోజులో ఇంత కర్కశంగా తయారవుతారా పిల్లలు. నా పరిస్థితి ఇదేనంటావా? రామాయణంలో దశరథ మహారాజులాగా నా జీవితం కూడా పిల్లలు రాకుండానే అంతం అయిపోతుందా? ఆనాడు దశరథ మహారాజు భార్య మోజులో రాముడిని అరణ్యానికి వెళ్ళమని ఆదేశించాడు. ఈ రోజుల్లో విదేశాలు, సంపాదన మోజులో మనమే మన పిల్లలని విదేశాలు పంపించేసి దూరం చేసుకుంటున్నామేమో. ఇన్నాళ్లూ కలగని భయం నాకు ఇప్పుడు కలుగుతోందిరా. నాలాగే చాలా మంది తల్లిదండ్రులు, దశరథులుగా మిగిలి పోతున్నారేమో కదా? నా పిల్లాడు చక్కగా ఉండేవాడు. ఏదో కలో, గంజో ఇక్కడే తాగుదాం నాన్నా అని అనేవాడు. నేనే వాడిని బలవంతం చేసి విదేశాలు పంపాను. మధ్యలో ఒకటి, రెండు సార్లు వస్తానన్నా రానివ్వలేదు ఖర్చులు అయిపోతాయని. ఇప్పుడు నాకు ఏమైనా అయితే నా పరిస్థితి ఏమిటి? మన తరం వరకు మన తల్లిదండ్రుల దగ్గర మొత్తం సంతానం లేకపోయినా, చాలా మటుకు ఎవరో ఒకరు ఉండేవారు. ఇప్పుడు మనం కనే ఒకరో, ఇద్దరో విదేశాలు, సంపాదన మోజు వాళ్ళల్లో మనమే పెంచి, పంపించి మనకు మనమే శాపం ఇచ్చేసుకుంటున్నాం. ఇంకా ఏమైనా సరే.. నా కొడుకుని వచ్చేయమని చెబుతాను. నేను నా కొడుకు, కోడలిని దగ్గర పెట్టుకుని చక్కగా శేషజీవితం గడుపుతాను. ఇంక ఈ ఒంటరి జీవితం గడపలేను. ఇవాళే ఫోన్ చేసి నా నిర్ణయం చెప్పేస్తాను.” అంటూ ఉద్వేగంతో తన మనసులో మాట స్నేహితుడితో చెప్పేసాడు నారాయణ.
“అమ్మయ్య.. ఇప్పటికి మంచి పని చేస్తున్నావ్. ఇన్నాళ్లకు నీకు కనువిప్పు కలిగింది. నీ కుర్రాడిని వచ్చేయమను. కుమార్‌కు నువ్వంటే ప్రాణం. నువ్వేమీ చెప్పినా చేస్తాడు. నీ పోరు పడలేక విదేశాలు వెళ్ళాడు” అంటూ సుబ్బారావు తన మాటలతో నారాయణను హుషారు చేసాడు. అలా వాళ్ళు ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు చెప్పుకుని బాగా తేలిక పడ్డారు.
అంతలో నారాయణ మొబైల్ మోగటం మొదలు పెట్టింది. నారాయణ కొడుకు కుమార్ దగ్గరనుండి ఆ కాల్.
“ఒరేయ్ కుమార్.. నీకు నూరేళ్లు ఆయుష్షు రా, ఇప్పుడే నీ గురించే తలుచుకుంటున్నాము. ఎలా వున్నావ్? ఇంతకూ నీకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే..” అంటూ చెప్పేలోపు
“నాన్నా.. ఆగండాగండి. నాకు ఆఫీస్ టైమ్ అయిపోయింది. ఏమైనా ఉంటే రాత్రి వివరంగా మాట్లాడుకుందాం. ఒక శుభవార్త చెబుదామని ఫోన్ చేసాను. నాకు మా కంపెనీలో పెద్ద ప్రమోషన్, నా కన్నా సీనియర్లను కాదని ఇచ్చారు. ఇలా ఇంకో రెండేళ్లు బాగా చేస్తే , నేనే ఈ కంపెనీకి ఒక డైరెక్టర్‌గా అయిపోతాను. ఇదంతా మీ ఆశీర్వచనం. అది చెబుదామనే ఫోన్ చేసాను. ఉంటాను” అంటూ పెట్టేసాడు కుమార్.
ఎంతో ఉత్సాహాంగా ఫోన్ ఎత్తిన నారాయణ అందులో వివరాలు వినగానే ఒక నిస్సత్తువ ఆవహించి నీరసంగా కూలబడిపోయాడు.
“ఏమైయిందిరా” అన్న సుబ్బారావుకు అసలు విషయం చెప్పాడు.
“మరి ఇప్పడు ఎలా.. ఏమో..” అంటూ ఏమీ పాలుపోక ఇద్దరూ ఆలోచనలో మునిగిపోయారు.