కుసుమ వేదన-11

0
3

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

తృతీయాశ్వాసము – ఐదవ భాగము

తే.గీ.॥
తీరబాణుండు పడమట జారసాగె
కుసుమ యత్తారి యింటికిన్; కోరకుండ
ఏగు ఘడియలు యాసన్న మేర్పడంగ
సాగమని చెప్పె తల్లియు సాదరమున. (184)

ఉ.॥
అమ్మరొ; ఏమి వింతగను న్యాయము లేకను ఏగుమంచు; నా
యమ్మగ నీవు నన్ను మరియాదను సుంతయు లేక బల్కితే
నెమ్మది లేక నీ మహిని యీ విధ రీతిని బల్కిపాడియే
కమ్మని పల్కులన్ చెవిన్ కౌతుక మొప్పగ గోరుచుంటినే. (185)

కుసుమ తల్లి హితోక్తులు:

ఉ.॥
అమ్మను గాకబోతినని యాదరమించుక లేక పల్కులున్
యిమ్మహి నివు నన్నిటుల యీ దినమందున పల్కుచుంటివే
సమ్మతి గాదు తల్లి భువి సాటిగ నెవ్వరు నాదరింపరే
నమ్ముము నీవు నాదు పద నాకము సాక్షిగ మానసంబునన్. (186)

చం.॥
వినుమిక నాదు పల్కులను వీనుల యందున భక్తి శ్రద్ధలన్
కనుమిక లోకమందున సకాలము లోపున మంచి చెడ్డలన్
ఘనముగ దాల్చి జూడుమిక కమ్మని గొప్పగు కార్యమంతటిన్
మనమున నుంచి యున్ మసలుమా భువి నార్యులు మెచ్చు నీ ధరన్. (187)

సీ॥
అత్తమామల యందు అతి గొప్ప వినయాన
మసలుమా కుసుమాంబ; మంచిదాన
వంచు మెలగుము నీ వఖిల జగత్తులో
భాసిలి సత్కీర్తి బడయుమమ్మ
యాడు బిడ్డల తోటి; అక్కచెల్లెల తోటి
బ్రియమారగా ప్రేమ బిలువుమమ్మ
యిరుగుపొరుగు వార లింతెంత యనకుండ
గొప్ప మర్యాదను ఒప్పుమమ్మ

తే.గీ.॥
మగడు పనికేగి వచ్చెడి మార్గమందు
నిక్క మెదురేగి జలముల నీయుమమ్మ
స్నానముల నీళ్ళ నేర్పాటు సలిపి నీవు
తగిన రీతిన సేవల తనియు మమ్మ. (188)

కం.॥
ఇప్పటి దాకను మమ్ముల
గొప్పగ తలిదండ్రటంచు గొలిచితివమ్మా
ఇప్పుడు వారలె నీకును
ఎప్పటి సందనక వసుధ నేలెడి వారున్. (189)

కం.॥
వినగదె కుసుమరొ పల్కులు
ఘనముగ మహిళ గమనమును గతియును లేకన్
ఒనరుగ నెక్కడ బుట్టిన
చనగదె నత్తల సదనము చయ్యన ధరలో. (190)

కం.॥
శైశవ యాకృతి నుండగ
యాశగ ముద్దుల నిడెదరు అదియును నిజమౌ
ఈసున రోయుచు నిప్పుడు
పాశము జిక్కియు జగాన పాలన లేకన్. (191)

కం.॥
అంతగ బల్కను యేలను
ఇంతిగ నేనచట బుట్టి యిటకును రానే
ఎంతటి బాధను మ్రింగితొ
సుంతను యోర్చుము తనయరొ చోద్యము గాదే. (192)

తే.గీ.॥
మరియు నా చుట్టుప్రక్కల మగువలంత
పేర్మి మీరగ బల్కిరి; ఓర్మితోడ
యత్తవారింట మసలుము అణకువగను
బుట్టినింటికి బేరును బుడమి దెమ్మ. (193)

తే.గీ.॥
తోడి బెండిలి తనయుండు తోడు రాగ
బాలరాజంత నా వేళ పదము కదుప
యనుసరించెను గుసుమాంబ యట్టి వేళ
గడప దాటగ జారెను కండ్ల నుండి. (194)

తే.గీ.॥
అశ్రు బిందువు లంతట అవని కారె
జూచువారల కా రీతి చోద్యమొప్ప
ఓర్చుకొమ్మింక నా తల్లి ఒప్పుగాదె
మేము సైతంబు నా వేళ ఇట్టి రీతి. (195)

ఉ.॥
భామిని యప్పుడున్ మిగుల బాధను జెందుచు గుందుచుండగన్
ప్రేమను బంచువారలగు పెన్నిధి తల్లియు దండ్రి; విడ్వగన్
యేమరుబాటు గాదు మరి ఏమిటి కార్యము జేయనిప్పుడున్
యీ మహిమానినీ మణులు నేమని జీవిత మందు చుండిరో. (196)

ఉ.॥
జన్మను యిచ్చి వారు నను జాణగ నీధర నిల్పిమించగన్
ఉన్నతమైన రీతిగను కూరిమి విద్యల బుద్ధి జెప్పియున్
నన్నిటు నిల్పినారు సరి; నాదగు వారల నంత నిడ్సియున్
ఎన్నగ నెట్లు ఏగుదును? నీవిధ శిక్షల కంతమెప్పుడున్? (197)

తే.గీ.॥
అనుచు దుఃఖించు చున్నట్టి యబల నపుడు
యిరుగుపొరుగుల వారలు; వినుమ కుసుమ
జగతిలో యాడు బిడ్డల జాతి కిటుల
వీడ వలె తల్లి దండ్రులు; ఇదియ నిజము. (198)

తే.గీ.॥
నీవు ఎచ్చోట నుండిన నిజము వినుము
తల్లిదండ్రుల మనసున తగిన విధము
నుండి మసలుము; నిక్కము; నోర్మి తోడ
యత్తవారింటి కరగుము యతివ యిపుడు. (199)

తే.గీ.॥
యాడు బిడ్దల గన్నట్టి వారికిదియె
హెచ్చు శాపంబు మేధిని యిదియు నిజము
యింత వయసొచ్చు వరకును యిటుల బెంచి
యిట్టి రీతిగ యచ్చోటి కిటుల బంప. (200)

తే.గీ.॥
ముదుసలి వయసు వారగు ముదితలంత
బోధ జేయగ కుసుమాంబ; బోధి తరువు
దిగువ జేరిన బుద్ధుని దీక్ష కలుగ
నయనధారల వ్రేలున నట్లె దుడిచి. (201)

తే.గీ.॥
పుట్టి నాటగు వాకిలి పుడమి గాంచి
తల్లిదండ్రుల పాదంబు దాకి; కనుల
కద్దు కొంచును కుసుమాంబ; కలత వీడి
పోయి వచ్చెద నత్తారి పురము కనెయె. (202)

ఉ.॥
అమ్మరొ; పోయి వచ్చెదను: ఆలిగ బాలరాజు చెంతకున్
యిమ్మహి నాడ బిడ్డవలె నీ విధ రీతి నుపక్రమించెదన్
కొమ్మలు నాదు చెల్లెలును; కోరి చెలంగెడి మిత్ర బృందమున్
యిమ్ముగ పోతినంచు యిపుడీ విధమందున తెల్పు మీ ధరన్. (203)

తే.గీ.॥
అనుచు తన యెదురొందు బాలరాజు
వెనుకకును జేరి యా వేళ; వెతలు మరిచి
అత్తవారింటి కరిగెను యతివ యపుడు
అడుగులును వేసె మగనితో యాత్రముగను. (204)

కం.॥
చక్కని చుక్కగ చేరెను
మిక్కిలి ప్రేమను గురియుచు మేధిని యందున్
మక్కువ తోడుత యత్తను
చిక్కగ జూడగ కదలెను చిత్రముగాగన్. (205)

ఆ.వె.॥
కొత్త కోడలపుడు కోరి రాగను యింట
వెలిగె నత్త మోము వేడ్క మీర
మామ సైతమపుడు ప్రేమను మీరగా
మహిని యాదరమున మనుచు నుండె. (206)

ఉ.॥
ఆ నవ జంట యంతటను ఆత్రము తోడుత కొన్ని నాడులున్
మానవ మాత్రులై భువిని మానక మేధిని సంగమించుచున్
మానిని దేహమున్ మగడు మక్కువ మీరగ సంబరంబునన్
పూని సుఖించె నీ ధరణి పున్నమి వెన్నెల లోన భామినిన్. (207)

చం.॥
చిలుకలు గోరువంక లుగ చెల్లుచు రాజ్యము నేలే వారలున్
పలుకులు జూడ; మైన వలె పాటలు పాటగ పర్వశించె; నా
వలపుల రాణి యంచు బ్రియ వాక్కులు బల్కెను బాలరాజు: యా
సలిలిత మోహనాంగి యను చక్కటి భామిని గూడి యీ ధరన్. (208)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here