క్షణం, క్షణం.. భయం, భయం
[dropcap]అ[/dropcap]రుణ అందరి లాంటిది కాదు. మరీ సెన్సిటివ్.. సున్నితమైన మనసు. గోరంతలు కొండంతలుగా చేసుకొని భయపడిపోతుంది. బాధపడిపోతుంది.
తెల్లారింది. మరో రోజు మొదలైంది. మసక వెలుతురులో వీధి చివరి దాకా వెళ్ళి పాల పాకెట్లు తెచ్చుకోవాలి. ఇంకా జనం లేవలేదు. సందడి మొదలు కాలేదు. నిన్న ఇదే సమయంలో రెండిళ్ళ అవతల ఉండే ఇల్లాలు వెళ్తుంటే, ఎవరో ఇద్దరు వచ్చి ఆ ఇల్లాలి మెడలో గొలుసు లాక్కుని వెళ్లారు. అందుచేత అరుణకు భయంగా ఉంది. ఎవడైనా వచ్చి తన మీద చెయ్యి వేసి.. కొంచెం సేపు గుమ్మం లోపలే నిలబడి, ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే, ధైర్యం తెచ్చుకొని వాళ్ళ వెనకనే వెళ్ళి పాల పాకెట్లు తెచ్చుకుంది.
ఇంట్లోకి రాగానే అత్తగారి సాధింపులు మొదలవుతయి. తప్పులు వెతుకుతునే ఉంటుంది. ఆమెకు కాఫీ అందించి వచ్చే లోపల ఆమె దండకం ప్రారంభమవుతుంది. వినీ విననట్లు ఉండడం తప్ప, చేసేది ఏమీ లేదు. అత్తా, నీ కొంగు తొలిగిందని చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. అటు వైపు చూసినా తప్పే, చూడకపోయినా తప్పే. చిన్న విషయాన్ని కూడా పెద్ద రాద్ధాంతం చేస్తుంది.
పిల్లాడిని నిద్ర లేపి, స్కూలుకు పంపటానికి రెడీ చెయ్యాలి. నిద్ర లేస్తూనే వాడు తెచ్చిపెట్టే తలనొప్పులు అన్నీ ఇన్నీ కావు. హోం వర్క్ చేసిన పుస్తకాలు తల దిండు కిందనో, టేబుల్ వెనకనో, మంచం కిందనో పడేస్తాడు. డ్రెస్ బాగాలేదనో, రోజూ టిఫెన్ ఇడ్లీయేనా – అనో పేచీ పెట్టేస్తాడు. తీరా వాడిని రెడీ చేసి ఉంచితే, స్కూలుకు వాడిని తీసుకెళ్ళే ఆటోవాడు వస్తాడో, రాడోనని భయం.
వాడి గోల సర్దుమణిగేటప్పటికి, అరుణ భర్త శివరావు మంచం దిగుతాడు. ఆయనకు కళ్ళజోడు, సెల్ ఫోన్, చార్జర్, కలాలు, కాగితాలు ఎదురుగానే ఉన్నా కనిపించవు. ‘అరుణా’ అంటూ ఇంటి పై కప్పు ఎగిరిపోయేలా అరుస్తాడు. ఆయనకు అసలే కోపం ఎక్కువ. పైగా ఓర్పు, సహనం గురించి గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇస్తాడు. ఆయన కాలేజీకి బయల్దేరేదాకా, అరుణ ఉరుములూ, మెరుపులూ లాంటి కేకలతో భయపడిపోతూ ఉంటుంది.
ఆయనను సాగనంపాక, ఇంక అమె రెండు మెతుకులు నోట్లో వేసుకుని ఆదరాబాదరా ఆఫీసుకు బయలుదేరుతుంది. రోడ్డు మీదకు వచ్చాక, బస్ స్టాప్ లలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న జన సమూహాలను చూస్తే, ఆమెకు గుండె ఆగినంత పని అవుతుంది. దాదాపుగా రోజూ ఆటో లోనే ఆఫీసుకు చేరటం తప్పటం లేదు.
ఎంత తొందరగా వెళ్ళాలని ప్రయత్నించినా, అందరి కన్నా ఆలస్యంగా ఆఫీసుకు చేరేది ఆమే. లేటుగా వచ్చినందుకు ఆఫీసరు చూసే చూపుకు పచ్చిగడ్డి కూడా భగ్గుమంటుంది.
సెక్షన్ లోకి వెళ్ళి సీట్లో కూర్చునే లోపలే సెక్షనాఫీసరు కంగారు పడిపోతుంటాడు. “అమ్మయ్య, వచ్చారా? సెక్రటరీ దగ్గర మీటింగ్ ఉంది. ఆ ఫైలు ఎక్కడ పెట్టారు? ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. బీరువాలలో కనిపించటం లేదు” అని ఆపసోపాలు పడిపోతాడు. ఆ ఫైలు ఆయన టేబుల్ మీదే ఉంటుంది. తీసి ఇస్తుంది. “సీట్లోనే ఉండండి. ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేస్తా” అని హడావిడిగా వెళ్ళిపోతాడు. ఆయన నిష్క్రమించేదాకా అరుణకి కంగారే.
పై అంతస్తు నుంచి సహోద్యోగి నిర్మల వచ్చింది. టీ తాగి వద్దాం రమ్మంటే, అరుణ సీటులో నుంచి లేవలేదు. “మా బంగారం మీటింగ్ ఉందని వెళ్ళాడు. అక్కడ ఎవరన్నా ఏదన్నా అడిగారనుకో, నాకు ఫోన్ చేస్తాడు. అదీ టెన్షన్..” అన్నది అరుణ.
కొంతసేపటికి బిల్దింగ్‍లో అందరిలో ఆందోళన, కంగారు మొదలైంది. ఎక్కడివాళ్ళు అక్కడ అన్ని పనులూ వదిలేసి, లిఫ్ట్‌లలో నుంచీ, మెట్ల మీద నుంచీ పరుగులు పెడుతున్నారు.
“ఏమైంది, ఏమైంది?” అని అడుగుతున్నారు ఎవరో.
“బిల్డింగ్‍లో బాంబు పెట్టారంట. అయిదు నిమిషాల్లో బిల్డింగ్ పేలిపోతుందట. అందుకని అందరూ బయటకు పోతున్నారు” అని చెప్పారు.
జనం పరుగులాంటి నడకతోటి కిందకు వెళ్తున్నారు.
కొద్ది నిముషాల్లో తొమ్మిది అంతస్తుల్లోని వాళ్ళంతా ఆరుబయట చెట్ల నీడల్లో నిలబడి ఉన్నారు. బాంబు పేలుడు శబ్దం వినటానికి సిద్ధంగా ఉన్నారు. అయిదు నిముషాలు కాదు కదా, అరగంట అయినా, గంట అయినా, బాంబు పేలుడు శబ్దం వినిపించకపోవటంతో, ఇందాకటి ఆందోళన, భయం తగ్గింది.
“ఎవరో అందరినీ భయపెట్టేందుకు, ఇలాంటి ఫోన్ కాల్ చేసి ఉంటారు” అని నిర్ణయించారు.
ఒక్కడు, ఒకే ఒక్కడు, ఇన్ని వందల మందిని భయపెట్టాడు. ఎన్నడూ సీటు వదిలి బయటకు రాని మహాశయులు కూడా వచ్చి చెట్టు కింద నిలబడ్డారు. మనిషికి ప్రాణం అంటే ఎంత భయం. ప్రాణ భయం..
భయం మనిషిని క్రుంగదీస్తుంది. ప్రతి నిముషమూ, ప్రతి చిన్న విషయానికీ భయపడుతూ బ్రతికేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.
“ఇంక కుక్కలు వచ్చాయా?” అని అడిగారు ఎవరో.
“ఈ బిల్డింగ్ లోకి కుక్కలు రానిదెప్పుడు?” అని అన్నారు ఎవరో.
“ఇంకా తనిఖీలు చెయ్యాలిట. స్పెషల్ టీమ్ వస్తుందిట” అన్నారు ఇంకెవరో.
మొత్తం మీద ఇంక ఆ రోజుకి ఆటవిడుపే. ఆఫీసు లేనట్టే.
“సినిమాకు వెళ్దాం వస్తావా?” అని అడిగింది నిర్మల.
“అమ్మో, సినిమాకా? మా ఆయనకు తెలిస్తే ఇల్లు పీకి, పందిరేస్తాడు” అన్నది అరుణ భయపడుతూ.
“అన్నిటికీ అంత భయపడతావేమే? మనం సినిమాకు వెళ్లామని మీ ఆయనకు ఎలా తెలుస్తుంది? తెలిస్తే మాత్రం ఏంటి?” అని అడిగింది నిర్మల.
అరుణ బస్ స్టాప్ లోకి వచ్చింది. ఎక్కడికి పోవాలో తెలియటం లేదు. ఇంత తొందరగా ఇంటికి వెళ్తే అత్తగారు, కొత్త హిట్లరు చేతికి చిక్కినట్లే. సింగిల్ లెగ్ మీద రెచ్చిపోతుంది. అరుణకు అరవై ఏళ్ళ అత్తగారన్నా భయమే, నలభై ఏళ్ళ మొగుడన్నా భయమే. అయిదేళ్ళ కొడుకు అన్నా భయమే. ఇరుగు పొరుగు పిల్లలతో వాడు తెచ్చే పంచాయితీలు అన్నీ ఇన్నీ కావు.
ఆఫీసులోని బంగార్రాజు గుర్తొచ్చాడు. ఒక్క వాక్యం రాయటం రాదు. సెక్షన్ ఆఫీసర్ అయిపోయాడు. అన్నీ సందేహాలే. ఈ దేహం ఉన్నంత వరకూ ఆయన సందేహాలు తీరవు. తెలియచెప్పలేక అరుణ తల ప్రాణం తోకకు వస్తుంది.
ఎక్కడికి పోవాలా అని ఆలోచిస్తున్నది. ఆమె భర్త శివరావు కాలేజీలో లెక్చరర్. ఈ మధ్య కొన్ని పుస్తకాలు కూడా రాస్తున్నాడు. ఆయన సంపాదన ఎంతో ఇంతవరకూ అరుణకు తెలియదు. తెల్సుకునే ప్రయత్నం చేసినా, ‘ఎంత చెట్టుకు అంత గాలి – ఈ ఇంటి ఖర్చులు ఎంతో ఈకు తెల్సా?’ – అని ఎదురు దబాయిస్తాడు. అరుణ అవాక్కు అయిపోతుంది.
అరుణ బస్ స్టాప్‍లో నిలబడి ఉండగానే, ఆమె భుజం మీద చెయ్యి పడింది. చిన్నప్పటి నేస్తం.. వైదేహి.
“ఏమే నేను గుర్తున్నానా?” అని అడిగింది వైదేహి.
“నిన్ను ఎలా మర్చిపోతాను?” అన్నది అరుణ.
వైదేహికి ధైర్య సాహసాలు ఎక్కువ. దేన్నీ లెక్క చేయదు. పక్కన పిడుగు పడినా పెద్దగా పట్టించుకోదు. అది ప్రకృతి సహజమే కదా అంటుంది. అన్నిటిలోనూ మగపిల్లలతో పోటీ పడేది, పేచీ పడేది. చెట్లు ఎక్కి కాయలు కోసేది. మగపిల్లలు దీనికి రాణీ రత్నప్రభ అని పేరు పెట్టారు. ఒకసారి ఎవడో ఏదో అన్నాడని వాడి కాలర్ పట్టుకొని చెంపలు పగలకొట్టింది. మార్కులు తక్కువ వేశాడని టీచర్‍ని నిలదీసింది.
వైదేహిలో ఆడపిల్లకు ఉండే లక్షణాల కన్నా మగపిల్లలకు ఉండే లక్షణాలే ఎక్కువ.
అరుణ, వైదేహి ఇద్దరూ హోటల్లో కూర్చున్నారు.
“చెప్పు.. చాలా ఏళ్ళు అయింది మనం కల్సుకుని. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? పిల్లా పీచూ ఉన్నారా?” అని అడిగింది వైదేహి.
“నేను నీలాగా వీరవనితను కాదు గదా. పెళ్ళి అయింది. ఒక పుత్ర రత్నం.. చిన్న గుమాస్తా ఉద్యోగం.. రోజులు అలా, అలా గడిచిపోతున్నయి. మరి నీ సంగతి ఏమిటి? అని అడిగింది అరుణ.
“నేను ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‍గా పని చేస్తున్నాను. అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఇంకో రకంగా మగపిల్లలకు పాఠాలు చెబుతున్నాను..”
“ఎవడినన్నా చొక్కా పట్టుకుని తాళి కట్టించుకోలేకపోయావా?” అన్నది అరుణ.
“అదో పెద్ద సమస్య కాదు. పెళ్ళీ, పెటాకులూ, పిల్లలూ, చదువులూ, సంధ్యలూ.. ఆ లంపటాలు పెట్టుకోదల్చుకోలేదు. పెళ్ళి చేసుకొని, వాడికీ, వాడి తల్లికీ, తండ్రికీ, చెల్లికీ, చెల్లెలు మొగుడికీ, ఇంకా మొగుడిని అడ్డం పెట్టుకుని ఇంటికి వచ్చి తినిపోయే అడ్డమైన వెధవలకీ చాకిరీ చేయటం, క్షణం క్షణం, ఎవడెవడి కోసమో బితుకు బితుకుమంటూ బ్రతకటం అవసరమా?” అని అడిగింది వైదేహి.
“మరి, తాటి చెట్టు లాగా ఇలాగే ఒంటరిగా ఉండిపోతావా?” అని అడిగింది అరుణ.
“అదేం లేదు, మీరు పెళ్ళి చేసుకుని అనుభవించే దాని కన్నా ఎక్కువ సుఖ సంతోషాలనే అనుభవిస్తున్నాను. నాతో పాటే లెక్చరర్‍గా పని చేస్తున్నాడు. ఆయనతో ప్రేమ వ్యవహారం చాలా దూరం వచ్చింది. అతనికి పెళ్లి అయింది గానీ, పెళ్ళాం మీద పెద్ద ప్రేమ ఏమీ లేదు. అదో పర్మనెంట్ వంట మనిషి ప్లస్ పనిమనిషి. అంతే..” అన్నది వైదేహి.
“మరో స్త్రీ జీవితంతో ఆడుకుంటున్నందుకు గిల్టీ ఫీలింగ్ ఏమీ ఉండదా?” అని అడిగింది అరుణ.
“ప్రేమలో పడినవాళ్ళకు పంచేంద్రియాలు పని చేయవు. యుక్తాయుక్త విచక్షణ ఉండదు..”
“ఇంతకీ ఎవరీ నలకూబరుడు? నాకు చూపించకూడదా?”
“చూపించవచ్చు. శివరావు అని ఇంగ్లీష్ లెక్చరర్. ఇప్పుడు గైడ్స్ గట్రా రాస్తున్నాడు. సంపాదన కేమీ లోటు లేదు. మనకి కావల్సింది అదే గదా..” అన్నది వైదేహి.
ఇద్దరూ బయటకు వచ్చారు. విడిపోయారు – చెరో దోవన.
అరుణకు ఉన్న భయాలు చాలక కొత్త భయం పట్టుకుంది.
భవిష్యత్తు పెను భూతంలా కనిపిస్తోంది. ఇక తన బ్రతుకు లోని సుఖ సంతోషాలు ఎండమావులేనా – అన్న చింత ఎక్కువైంది.
ఏ రోగమూ లేకుండానే, జబ్బు పడినదానిలా అయిపోయింది.