రామప్ప కథలు – 2

0
4

[బాలబాలికలకు కాకతీయుల చరిత్ర, రామప్ప దేవాలయం గురించి కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.]

రుద్రమ దేవి

[dropcap]రా[/dropcap]మప్ప దేవాలయం గురించిన సంగతులు విన్న రవి – కాకతీయ సామ్రాజ్యం గురించిన మరిన్ని కథలు వినటానికి, మదనిక రాక కోసం ఎదురుచూస్తున్నాడు.

ఎప్పటిలా మధ్య రాత్రి నిద్రలో ఉన్న రవి దగ్గరకు మదనిక గాలిలో తేలుతూ పూల వాసనలతో వచ్చింది.

నిద్రలో ఉన్న రవికి ఆ సువాసన, చల్ల గాలికి మెలకువ వచ్చింది. ఎదురుగా తన స్టడీ టేబుల్ ముందు కుర్చీ చిరునవ్వుతో ఉన్న మదనికను చూసి “హలో! ఇప్పుడేనా వచ్చావు? యూ నో నీ కోసం, కాకతీయ కథల కోసం I am eagerly waiting. సారీ సారీ! నీకు అర్థం అయ్యిందో లేదో? ఇంగ్లీష్. నీ కథల కోసం ఎదురుచూస్తున్నా” అన్నాడు రవి.

“అర్థం అయింది లే! శతాబ్దాలుగా యాత్రికులను చూసి, వారి మాటలు విని విని చాలా భాషలు, యాసలు అర్థం అవుతాయి” అంది మదనిక.

“ఓహ్ గ్రేట్. నేను రెడీ కథ వినటానికి” అంటూ మంచం మీద కూర్చుని, నోట్ బుక్ తీసుకున్నాడు, పాయింట్స్ నోట్ చెయ్యటానికి.

మరి మనమూ రవితో పాటు విందామా?

“ఇవాళ నాకు కాకతీయ రాజవంశపు ధ్రువతార.. లెట్ మీ గెస్! ఆఁ, ఆఁ! రుద్రమ దేవి మహారాణి గురించి చెప్తావు, అవునా?” అన్నాడు రవి ఉత్సాహంగా.

“అవును. భలే ఊహించావు” అంది మదనిక. తనకు తెలిసిన కథ చెప్పటం మొదలుపెట్టింది.

మీకు గుర్తుందా? మదనిక రామప్ప దేవాలయపు ముఖ్య ప్రాకారం పైన ఉండే శిల్ప భంగిమల్లోని మహిళలో ఒకరని.

దేవాలయానికి వచ్చిపోతుండే వివిధ యాత్రికుల కబుర్లలో విన్నదే రవికి చెప్పటానికి ప్రయత్నిస్తోంది.

“రవి! రుద్రమ దేవి పేరుకు తగినట్లే చాల ధైర్యవంతురాలు.” అంది.

“అవును విన్నాను. వెరీ బ్రేవ్ అని” అన్నాడు రవి

“రవి! అప్పటికి, ఇప్పటికి సమాజంలో.. అదే సొసైటీలో మహిళలకి సరైన గుర్తింపు, రాజ్య అధికారం కష్టమే. దాదాపు 700 ఏళ్ల కిందట అసాధ్యం తెలుసా? అలాంటి కాలంలో మహారాణిగా ప్రజలు మెచ్చిన మంచి పరిపాలన చేసింది. శత్రువుల్ని ఓడించింది” అంది ఆవేశంగా మదనిక.

“Good governance. అవును, ‘రుద్రమ దేవి’ సినిమాలో చూపించింది నిజమేనా? అబ్బాయిల డ్రెస్ వేసుకుని వార్ స్కిల్స్ అంటే యుద్ధం ఎలా చెయ్యాలి? అనేది నేర్చుకున్నదిట” అన్నాడు రవి

“సినిమా? శాసనమా?” అంది ఆశ్చర్యంగా మదనిక.

“నీకు సినిమా అంటే ఎలా చెప్పాలి? తర్వాత చెప్తాలే” అన్నాడు రవి.

“నువ్వు విన్నది నిజమే. ఆవిడ అసలు పేరు రుద్రాంబ. తండ్రి కాకతీయ మహారాజు గణపతి దేవుడు. తల్లి నరాంబ అని గుర్తు. గణపతి దేవునికి ఆనాటి రోజుల్లో ఉన్న ఆనవాయితీ.. అంటే custom ప్రకారం రాజ్యాన్ని పరిపాలించేందుకు కొడుకులు లేరు. అప్పటికే గణపతి దేవుని పాలనలో ఉన్న కాకతీయ రాజ్యం చాలా పెద్దది. రాజు తన కుమార్తెకు అన్ని విద్యలు నేర్పించాడు. ఆమె పురుషుడిలా వేషం.. డ్రెస్ వేసుకుని ధైర్యంగా దేశం అదే రాజ్యం అంతా తిరిగి ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుంది.”

“అవును, నాకు తెలుసు. ప్రజల్లో తిరిగి వాళ్ళ problems solve చేసింది. సినిమాలో చూసాను” అన్నాడు రవి.

“అన్నీ నీకు తెలిస్తే నన్నెందుకు అడిగావు? ఇంకెవరికైనా చెబుతాను” అంటూ కోపంగా కిటికీ దగ్గరకు వెళ్ళింది మదనిక!

“Wait. ఆగు. వెళ్లొద్దు. నీకు తెలిసిన కథలు ఇంకెవ్వరికి తెలియవు. సైలెంట్‌గా వింటాను” అంటూ ఆపాడు రవి.

“సరే విను. రుద్రమ దేవి భర్త తూర్పు చాళుక్య రాజు వీరభద్రుడు. అతని రాజ్యం నిరవద్యపుర. రుద్రమదేవి పెళ్లి చాలా ఘనంగా చేసారు రాజు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు. కుమారులు లేరు. గణపతి దేవునికి వచ్చిన సమస్యే ఆమెకి వచ్చింది. కాకతీయ రాజుల ధైర్య సాహసాలతో తెలుగు ప్రాంతాలన్నీ ఒక్కటి అయ్యాయట. వాటిని ఇతర నాయకులూ, శత్రువుల నుండి కాపాడటానికి ఆమె తన పెద్ద కూతురు ముమ్మడమ్మ, అల్లుడు మహాదేవుని కొడుకైన ప్రతాప రుద్రుని దత్తత.. అంటే..” అంటూ ఆపింది మదనిక.

“నాకు అర్థం అయింది మదనికా. దత్తత అంటే అడాప్షన్ అని” అన్నాడు రవి.

“తెలివైన వాడివే నువ్వు” అని నవ్వింది.

“ప్రతాప రుద్రున్ని తన కాకతీయ వంశానికి, రాజ్యానికి వారసుడిగా, యువరాజు చేసింది.. Prince గా డిక్లేర్ చేసిందిట”

“మదనికా! రుద్రమ దేవి మహారాణి ఎలా అయ్యింది?” అడిగాడు రవి.

“గణపతి దేవుడు రుద్రమ దేవికి రాజుకు ఉండాల్సిన స్కిల్స్ అన్ని నేర్పించి అతి చిన్న వయస్సులోనే రాజ్యాప్రతినిధిగా నియమించాడట. అప్పటి నుండి ఆమె అతనుగా ప్రజల్లో తిరుగుతూ, అన్ని తెలుసుకునేదిట. రవీ! రుద్రమ తండ్రితో పాటుగా యుద్ధాల్లో కూడా పోరాడిందిట. ఎంత ధైర్యం” మదనిక అంది.

“అవును. సూపర్”

“తండ్రికి చాలా హెల్ప్ చేసిందిట. గణపతి దేవుని తరువాత 1262 A.D. లో రుద్ర మహారాజు అనే బిరుదుతో మహారాణి అయింది.

“Oh. Kakatiya dynasty కి queen, ruler అయ్యింది” అన్నాడు రవి.

“And then? రుద్రమ దేవి క్వీన్ అయితే ఎవ్వరు object చెయ్యలేదా?” అడిగాడు.

“ఎందుకు అడ్డుకోలేదు. అడ్డుకున్నారు. ఒక మహిళా రాజ్యపాలన చెయ్యటం ఇష్టపడని సామంతులు తిరుగుబాటు చేసారట. కానీ ఆవిడ వాటిని తన నాయకులూ, గొప్ప సైన్యంతో అణచివేసింది. రాజ్యాన్ని ఒక్కటిగా చేసింది. ఎవ్వరికి భయపడేది కాదుట. రవీ, ఒక తిరుగుబాటు చేసిన సామంతుడిని ఓడించి, రాజ్యభాగాన్ని వెనక్కి తీసుకుంది. ఇంకా? ఆ! 3 కోట్ల బంగారు నాణేలను.. Golden coins ని యుద్ధ పరిహారంగా తీసుకుంది” అంది.

రవి మదనిక చెప్పే సంగతులు వింటూ ఊహల్లోకి వెళ్ళిపోతున్నాడు.

“రవి, రవి!” అంటూ పిలిచింది.

“ఓహ్ సారీ మదనికా” అన్నాడు.

“మహిళలకు అవకాశం ఇస్తే ఇల్లు పిల్లలే కాదు, ప్రపంచాన్ని సరిదిద్దగలరు” అంది మదనిక.

“అవును. మా అమ్మ ఇల్లు, జాబ్ చాలా బాగా మేనేజ్ చేస్తుంది” అన్నాడు గర్వంగా రవి.

“అవునా? సంతోషం. మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు కాకతీయ రాజ్యాన్ని అంత తిరిగి చూసి రుద్రమ దేవి పాలన, ప్రజలు, వృత్తులు, వ్యాపారం అన్నింటిని చాల గొప్పగా చెప్పాడట. అతడు చెప్పిన ప్రకారం రుద్రమ పురుష వేషంలో మంచి జాతి గుర్రాన్ని ఎక్కి రాజ్యంలో తిరుగుతూ శత్రువులను ఎదిరిస్తూ ఓడించేదిట. రామప్ప యాత్రికులు కథలు కథలుగా చెబుతుంటే వినటం గొప్పవిషయం.” అంది మదనిక.

“ఇంకా క్లియర్ గా చెప్పు”

“విను. రుద్రమ ఓరుగల్లు రాజధానిగా..” అని చెబుతుంటే.. మధ్యలో మాట్లాడుతూ..

“మదనికా! Kakatiya kingdom capital Orugallu ఇప్పటి వరంగల్. తెలుసా?” అన్నాడు రవి.

“నాకు ప్రస్తుత పేర్లు తెలియవు. క్రీ.శ. 1262-1289 వరకు 27 సంవత్సరాలు ప్రజలు మెచ్చుకునేలా పాలించింది. ఎక్కడో దూరంగా మాకు తెలియని ఢిల్లీ రాజ్యా పాలకురాలు కూడా మహిళే. రజియా సుల్తానా పేరు. యాత్రికులు అంటే విన్నాను. ఇంకా? చరిత్రకారులు/హిస్టోరియన్స్ మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరు వెంకట రమణ మూర్తి – రుద్రమ గురించి ఏమన్నారంటే తెలుగు ప్రాంతాలని పాలించిన రోజుల్లో గొప్ప పాలకురాలు. ప్రజలు ప్రేమతో రుద్ర దేవ మహారాజు అని పిలిచేవారట. తండ్రి పిలిచిన రుద్ర దేవుడనే పేరు సరిగ్గా సరిపోయింది. ఆమెని కొందరు నాయకులు నిరంతర యుద్ధాలతో ఇబ్బంది పెట్టినా, విధేయులైన నాయకులు వాటిని అణచటానికి హెల్ప్ చేసారు. ఒకసారి పురుష వేషంలో తిరుగుతూ ఒక పల్లెకి వెళ్ళింది. అక్కడ సమయానికి వైద్యం దొరక్క ఒక గర్భిణి చనిపోవటం చూసి చాల బాధ పడిందిట.”

“అయ్యో! డాక్టర్‍ని పిలవలేదా? హాస్పిటల్ దూరమా?” అన్నాడు రవి.

“రవి! ఇప్పటి మీ వసతులు నాకు అంతగా తెలియవు. మా అప్పటి రోజుల్లో వందల ఏండ్ల క్రితం దట్టమైన అడవులు, కొండలు మధ్య పల్లెలు ఉండేవి. పట్టణం అంటే రాజధాని మాత్రమే. 10-20 గ్రామాలకు ఒకే డాక్టర్, ఇల్లే హాస్పిటల్‍గా ఉండేది. వైద్యం అందరికి అందేది కాదు. రుద్రమ దేవి పల్లెల్లో వైద్యశాలలు ఏర్పాటు చేసిందిట. రవి! వ్యవసాయం వర్షం మీద ఆధారపడి ఉండేది. మంచి వర్షాలు పడితే మంచి పంటలు. లేకపోతే ఆహరం కొరత. అప్పుడప్పుడు వరదలు. తాగటానికి, పంటలకు సరిపడినంత నీరుని నిల్వ ఉంచటానికి కాకతీయ రాజులు రుద్రమ దేవితో సహా వారి నాయకులూ రాజ్యంలో అనేక చోట్ల పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. అంతే కాదు ఈ చెరువులు గొలుసుకట్టు గా ఏర్పాటు చేసారు.”

“మదనికా! కాకతీయుల గొలుసుకట్టు చెరువులు, వాటిని కలుపుతూ తవ్విన కాలువలు గురించి తెలుసు. వాటిని రిపేర్ చేసారు. ‘మిషన్ కాకతీయ’గా పిలుస్తున్నాము” అన్నాడు రవి.

“అలాగా! ముందుచూపుతో ప్రజల మంచి కోసం చేసిన పనులు అప్పటి ఇప్పటి ప్రజలకు ఉపయోగపడతాయి. మార్గదర్శకం అవుతాయి. మా కాకతీయ రాజ్యంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. ఎటు చూసిన పచ్చని దట్టమైన అడవులు, వాటి మధ్యలో గ్రామాలూ, పట్టణాలు, పంట పొలాలు, తోటలు జలపాతాలతో ఎంతో అందంగా ఉండేది. సంపన్నంగా ఉండేది. రిచ్.. ఇతర ప్రాంతాలు, దేశాలతో మంచి వ్యాపారం.. ట్రేడ్, జరిగేది. మోటుపల్లి రేవు నుండి జరిపిన సముద్ర వర్తకం గురించి మార్కోపోలో గొప్పగా రాసాడు. రాజులూ, నాయకులూ కళాపోషకులు. పేరిణి నృత్యం ఇక్కడే పుట్టింది. రుద్రమ దేవి మామ జయాప సేనాని ‘గీత రత్నావళి, నృత్య రత్నావళి’ అనే పుస్తకాలూ రాశారట.” చెప్పింది మదనిక.

“మదనికా! కాకతీయ రాజ్యం ఎంత పెద్దది?” అడిగాడు రవి.

“దక్షిణంలో కంచిపురం, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, బస్తర్ సీమ; పడమర బెడద నాడు, తూర్పున బంగాళా ఖాతం వరకు, ఈశాన్యం ఒరిస్సా గంజాం వరకు అని విన్నాను. గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి నమ్మకమైన సామంత నాయకులట. అనేక సార్లు రుద్రమ దేవి చేతిలో ఓడిపోయిన అంబదేవుడనే సామంతునితో జరిగిన యుద్ధంలో పెద్ద వయస్సు 80 ఏళ్ళప్పుడు కూడా భద్రకాళిలా వీరోచితంగా తన నాయకులతో కలిసి రెండు వారాలు యుద్ధం చేసిందట. కానీ ఆ యుద్ధ సమయంలో ఒక కార్తీక సోమవారం శివ పూజలో ఉన్న సమయంలో కుట్రపూరితంగా అంబదేవుడు తనవారిని మారువేషంలో పంపి దొంగ దెబ్బ తీసి చంపారని ఒక వాదన యాత్రికులు చెప్పగా విన్నాను. చందుపట్ల అనే చోట 1289 నవంబర్ 27 న చనిపోయినట్లు రుద్రమ సేవకుని శాసనంలో ఉందిట. ఆవిడకి రాయ గజకేసరి, ఘటోధృతి అనే బిరుదులూ ఉండేవిట. ఎప్పుడు ఎందుకు వచ్చాయో నాకు తెలీదు” అంది మదనిక.

రుద్రమ మరణం గుర్తుకు వచ్చి తనలో తాను గొణుక్కుంటూ, ఏడుస్తోంది. రవికి ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు.

“మదనికా! Please don’t cry. Cunning fellows ఎప్పుడూ face to face fight చెయ్యలేరని తాత అంటారు. మదనికా! రుద్రమ దేవి తండ్రి గణపతి దేవుని గురించి చెప్పవా?” అన్నాడు రవి.

“ఇప్పుడు కాదులే రవి. నా మనస్సు వేదనలో ఉంది. ఇంకో రోజు వస్తాలే” అంటూ గాలిలో తేలుతూ వెళ్ళిపోయింది.

కిటికీ లోంచి సూర్యోదయ తొలి కిరణాలూ లోపలి వచ్చాయి హలో అంటూ.

మదనిక చెప్పిన విషయాలు రాసిన పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టాడు. అటుగా వచ్చిన అమ్మ “రవి! గుడ్ మార్నింగ్” అని అంది.

“గుడ్ మార్నింగ్ అమ్మా! ఫ్రెష్ అయి వస్తాను” అంటూ కదిలాడు రవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here