[dropcap]ప[/dropcap]ర్వతాలను మోస్తున్న భూమిలా కదులుతావు.
నువ్వూ భూమీ ఒకేలా కనపడడం యాదృచ్ఛికం అని అబద్ధం చెబితే అది నిజం అవ్వదు.
భారం దూదిపింజై, నాట్యం
ఆడుతుంటుంది అప్పుడప్పుడూ..
నిజం చెప్పూ?
నువ్వు ఎక్కడ ఎప్పుడు ఓనమాలు నేర్చుకున్నావ్?!
కష్టాలకు భంగిమలు నేర్పిన నీ గురువు ఎవరూ!?.
నది, నీడైనట్లు కదులుతావ్.
సముద్రం, పొర్లినట్లు నవ్వుతావ్.
ఆకాశం, తన మెడనివంచి చూస్తున్నట్లు
మేఘపుమత్తు చల్లుతావ్.
కొన్ని మింగి, మరి కొన్ని వదిలి
వేగపు జీవితాల పరిమళవానని కురిపించడం
నిష్ఠూరపుధ్వని రాగమైతే కాదు.
కొమ్మలు వేర్లకి, వేర్లు కొమ్మలకి
ప్రేమపూల చెక్కిళ్ళమాటలను పంచుతున్నట్లు
మట్టిగంధాన్ని పాదాలకి రాసి
చిటుక్కున ప్రేమరాహిత్యాన్నంతా పారద్రోలతావ్.
చీకటిని, చిద్విలాసపు లాలసతో
ఎవరూ సాకాలనుకోరు
నీ అమాయకత్వంలా..
చీకటి, నట్టింట
చంటిపిల్లలా పారడం
ఎవరూ సహించరు.
వెలుగుని అంటుకుని
దీపాలంకారాల్లో
తూలిపోయేవారే అందరూ.
మరెందుకు నిన్ను పీల్చి బ్రతక్కూడదూ..
కాస్త ప్రాణసారం కావాలి, మా పేలవమట్టి మొహాలకు.
..అనుమతించవూ..