కుర్చీ

5
3

[dropcap]ఎ[/dropcap]క్కడో అడవుల్లో పుట్టి, అందంగా, ఆకృతి దాల్చిన నన్ను యజమాని ఇంటికి తెచ్చినప్పుడు అతని కళ్ళల్లో గర్వం, ప్రేమ, అభిమానం. వచ్చిన రోజు మొదలు కుర్చీగా నా బాధ్యతల్ని, బరువుల్ని మోస్తూనే ఉన్నా. ఎంతమందికి సేద తీర్చానో, అలసటని పోగొట్టానో. వాళ్లు సేద తీర్చుకోడానికి నా ఒడిలోకి ఆహ్వానించా. రకరకలా మనుషులు, రకరకాల చేష్టలు అన్నీ భరించా. ఏదో ఒకరోజు నా విలువ గుర్తిస్తారనే ఆశ. తెలివైనవారు, తెలివి తక్కువవారు, డబ్బున్నవారు, లేనివారు, అహంకారి, పొగరుబోతు, సొంత డప్పు కొట్టేవారు, ఏమీ లేనివారు, పిచ్చి చూపులు చూసేవారు, తింగరి మాటలు మాట్లాడేవారు, వెకిలి చేష్టలు చేసేవారు – అందర్నీ అందర్నీ ఒకే రీతిలో ఆహ్వానించా, మోశా.

దేని కోసం? నా యజమాని కోసం కదూ. ఎండలో ఉంచితే ఉన్నా, వర్షానికి తడిశా, చలికి కొయ్యబారి పోయా, ఇది ఈ ఆకారం, దేముడిచ్చిన వరం అనుకొన్నా. నా బాధ్యత, నా కర్తవ్యం నేను నిర్వర్తించాలనే ఒక బలమైన భావనతో అంతమందిని మోశా. ఎదురు తిరగననో, తిరగలేననో నా చేతుల మీద కాలక్షేపం లేనప్పుడల్లా మృదంగం వాయించేవారు. కాళ్లని నేలకేసి లాగేవారు. ఏం, కూర్చోడానికి వాడుకొంటున్న నన్ను ఎలా చూసుకోవాలో తెలియాలి కదా! అన్నీ భరించా.. ఒక్క యజమాని నాకొక గూడు కల్పించాడనే విశ్వాసం, మిగిలిన కుర్చీల్లాగా షాప్‍లోనే ఉండిపోలేదనే ఆనందం.

చూస్తూ చూస్తూ ఉండగానే ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఇంట్లో ఏదో చర్చ జరుగుతోంది. అందరూ సోఫా కావాలంటున్నారు. యజమానికి సుతరాము ఇష్టం లేదు, డబ్బు పెట్టుబడి ఒక ఎత్తు అయితే, సామాను పెరిగిపోతుండనే బాధ ఒకవైపు. “ఇది చాలురా ఎవరైనా వస్తే కూర్చోడానికి సామాను పెంచకండి” అంటున్నాడు. Majority votes Sofa కే పడ్డాయి. ఆ రోజే నా గుండెల్లో గుబులు మొదలైంది. ఒక నెలరోజులు గడిచిపోయాయి. రోజూలాగే నేను, నా యజమాని. ఇంక సోఫా రాదేమో అనుకొన్నా. కానీ నా జాతకం మంచిదైతే కదా, రానే వచ్చింది. అనుకొన్నంతా అయ్యింది. అందరూ దాని అందానికి, మెత్తదనానికి, రంగురంగుల హొయలొలుకుతున్న దాని గుడ్డల్ని చూసి మురిసిపోయారు. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా వాడుకొనే నన్ను వదిలేసి, ఈ రోజు సోఫాకి ఒక నిర్దిష్టమైన చోటు, ఎంతో ఆప్యాయతతో కూడిన స్పర్శ, సుతారంగా కూర్చొనే తీరు, decent behaviour ఆహా మనుషులు పై పై మెరుగుల కిచ్చే విలువ ఏమని వర్ణించను?

కష్టం తెలిసిన యజమాని ప్రవర్తన నా పట్ల ఎప్పటిలానే ఉంది. అతనికి నా మీద ఉన్న అభిమానం అలాంటిది. అందరూ సోఫాలో కూర్చొన్నా తను మాత్రం దులుపుకొని నా మీదే కూర్చొనేవాడు. చెప్పొద్దూ నాకు మహదానందంగా ఉండేది. రోజులు, నెలలు, ఏళ్ళు గడిచాయి.

ఒకరోజు ఉన్నట్లుండి ఎక్కడి నుండి వచ్చాడో మేనల్లుడుట. ఏదో ఫారెన్‍లో ఉంటాడుట. డాలర్స్ సంపాదిస్తాడుట. వాడు వాడి స్టైలూను. నా మీద కూర్చొంటే లాగి లెంపకాయ కొడదామనిపించేలా వాడి బడాయి వేషాలూ, పోకిరి మాటలూ పకపకలూ, వికవికలూనూ. ఉన్నవాడు ఉన్నట్టు ఉండచ్చు కదా. పెద్దవాళ్లకి సలహాలివ్వడం ఎందుకు? వాడి పనివాడు చేసుకువెళ్లచ్చు కదా?

మధ్యాహ్నం భోజనాల వేళలో యజమానితో ఒకటే కబుర్లు, ముచ్చట్లు, ఫారెన్‍లో ఇల్లు, దొడ్లు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫర్నీచర్ ఒకటేమిటి? అదుగో ఆ ఫర్నీచర‌లో భాగంగానే నా ఊసు ఎత్తాడు. “ఏంటి మామయ్యా, ఇంకా ఈ కుర్చీనే వాడుతున్నావా? ఫారె‍న్‍లో అయితే..” అంటూ మొదలు పెట్టాడు. వీడి వాగుడికి నాకు తల తిరిగినంత పని అయ్యింది. ఏంటి వీడి ఉద్దేశం, నన్ను అమ్మేయమంటాడా? లేదా చెత్తలో పారెయ్యమంటాడా? ఎందుకు నా గురించే గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు? అనుమానం, చెప్పులు రిక్కించి వింటున్నా. “మామయ్యా నీ స్టేటస్ పెరిగింది, ఇంటికి వచ్చీపోయే బంధువులూ, ఆఫీస్ వాళ్ళూ, రేప్పొద్దున్న పిల్లలకి పెళ్లిళ్లు చేస్తే వియ్యంకుళ్ళూ, వియ్యపురాళ్ళు, కోడళ్లూ, అల్లుళ్ళూ ఓ కోలాహలం. అప్పుడు ఈ పాత చెక్క కుర్చీ ఓ మూల ఏం బావుంటుంది చెప్పు” అంటూ గుక్క తిప్పుకోకుండా రాజకీయవేత్తలా పనికిమాలిన చెత్త ప్రసంగం. ఇంతలో యజమాని అర్ధాంగి అందుకొన్నారు – “మీ మామయ్య పాతకాలం మనిషి రా, అదేదో సున్నిత మనస్తత్వంట, ప్రాణంలేని, మాటలు రాని వాటిమీద కూడా ఆయనకి జాలి, కనికరమూనూ. అదేదో పెద్ద సింహాసనంలా ఫీల్ అయిపోతారు. ఏమైనా అంటే నేను పోయేటప్పుడు, నాతో తగలెయ్యండి అని అపభ్రంశపు మాటలు. అందుకే ఊరుకొన్నాం”.

ఇంతలో పుత్రికారత్నం అందుకొంది “నాన్నగారూ కాలంతోపాటు మనమూ మారాలి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా అడుగుతున్నారు. ఏంటి మీ ఇంట్లో Antique piece ఏది? ఇదేమైనా హాల్‍కి దిష్టి తగలకుండా పెట్టారా? అని. బావ చెప్పాడు కదా ఇప్పటికైనా తీసేద్దాం నాన్నగారూ ప్లేస్.” “వదిలెయ్యండి, నాన్నగారు అది పాడయ్యేంతవరకూ దాన్ని వదలరు, ఎందుకీ కంఠశోష?” పుత్రరత్నం ఉవాచ.

ఏమిటి వీళ్ళందరూ ఇన్నేళ్ళుగా నన్నే వాడుకొన్నారు? చదువుకోవడానికి, టీవీ చూడ్డానికి, తినడానికి, చర్చలు జరపడానికి ఆఖరుకి కొట్టుకోవడానికి కూడా వేదికలా చేసుకొన్నారే నన్ను? ఇప్పుడేమయ్యింది. అంతేలే, కొత్త ఒక వింత, పాత ఒక రోత ఉట్టిగా వచ్చాయా సామెతలు? యజమాని జవాబు కోసం ఎదురు చూస్తున్నా. “ఏమోరా అల్లుడూ, ఎన్నైనా చెప్పు దీనిలో ఉండే కంఫర్ట్ నాకు సోఫాలో అనిపించదురా! పైగా ఎంతో కష్టపడి, కూడబెట్టి కొనుక్కొన్నా, అంతకీ కూర్చోడానికి వీలుకానంతగా పాడైతే చూద్దాంలే.”

హమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకొన్నా, నా యజమాని మీద చెప్పలేనంత అభిమానం పుట్టుకొచ్చింది. పుట్టుకు రావడమేంటి? ఉన్నదే.

ప్రశాంతంగా నడిచే రోజులు కరువైపోతున్నాయి. ఇంట్లోవాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. రాను రాను. ఎవరైనా వస్తున్నారంటే చాలు – అందరి దృష్టి నా మీదే. ఆ ముష్టి కుర్చీ తీసుకెళ్ళి లోపలి గదిలో పడెయ్యండి. ఎవరైనా హాల్లో చూస్తే బాగుండదు. బలవంతంగా ఇష్టం ఉన్నా లేకున్నా ఓ జాలి చూపు చూసి యజమాని నన్ను లోపలి గదిలో భద్రంగా పెడతారు. నా దుర్గతి ఏమని చెప్పమ? ఆ జుగుప్సతో చూసే ఇంటి సభ్యుల చూపులకు చచ్చిపోవాలనిపిస్తుంది. యజమాని లేని సమయంలో ఎవరైనా వస్తే నా పరిస్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళ వ్యతిరేకభావం నాకు తెలిసేలా తీసుకెళ్లి మూల విసిరేసేవాళ్ళు. కాళ్ళు నొప్పులుగా అనిపించేవి ఆ ఊపుకి. వచ్చినవాళ్లు, ఎప్పుడెప్పుడు వెళ్లిపోతారు అని ఎదురుచూపులు రోజు రోజుకి ఎక్కువయ్యాయి. నాకూ యజమానికి మధ్య సంబంధం ఏనాటిదో కదా. ఎప్పుడూ అదే ఆప్యాయత, గౌరవం.

బాధ్యతల నుండి ఒకటొకటిగా విముక్తుడవుతున్న యజమానిని చూస్తే ఆనందించాలో, బాధపడాలో తెలియట్లేదు. బాధ్యతలు తీరుతుంటే బంధాల్నించి విముక్తుడవుతున్నట్లు, భగవంతుడికి చేరువవుతున్నట్టు ఏమో, పిచ్చి భావనలా?

యజమానిలో శక్తి సన్నగిల్లుతోంది. నన్ను ఉపయోగించే గంటలు తగ్గుతున్నాయి. అయినా నాకిచ్చే గౌరవం తగ్గలేదు. ఏ మాత్రం ఓపిక ఉన్నా కుర్చీలో కూర్చొనే టి.వి. చూడ్డం లాంటివి చేస్తూనే ఉంటున్నాడు.

నెమ్మదిగా బాధ్యతలు ఇల్లూ, వ్యవహారాలు ఒక్కొటొక్కటిగా యజమాని చేతుల్లోంచి పిల్లల చేతుల్లోకి ఒక మాయ లాగ జారుకున్నాయి. ఆయన మాట్లాడితే చాదస్తంగా, సణుగుడులా, చెప్పినదే చెప్తాడన్నట్లు, పాత చింతకాయ పచ్చడిలా ఇంట్లోవాళ్ళకి అనిపించడం మొదలెట్టింది. కంటిచూపు, నడిచే శక్తి వినికిడి, జ్ఞాపకశక్తి సన్నగిల్లడం మొదలయ్యాయి. ఆ వణుకుతున్న చేతులు, నా చేతులమీద ఆన్చి కూర్చొన్నప్పుడల్లా నన్ను ప్రేమతో, ఆప్యాయతతో లాలిస్తున్నట్లు అనిపించేది.

ఏం ఖర్మమో? నా తలరాత అలా ఉందో, రోజూలాగే కాళ్ళూ చేతులూ వణుకుతుండగా వచ్చి కూర్చొన్నాడు. ఆయన పడ్డాడో, నా కాలే విరిగిందో తెలియదు కానీ ఇద్దరం కింద పడ్డాం. నాకు తెలియలేదు కానీ నాకూ వయసైపోలేదూ? అందరూ కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చారు. అందరి కళ్ళూ మళ్ళీ నా మీదే. అన్నిటికీ బాధ్యత నాదే. నాదే తప్పు. కోపం తీర్చుకొనే ఏకైక వస్తువంటే నేనే కదా? మొదలెట్టారు “వెధవకుర్చీని వదలరు కదా? మూలపడితే ఎవరు చాకిరీ చెయ్యగలరని దాంట్లో కూర్చొన్నారు? ఒరేయ్ డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి కారు తియ్యరా!” అంతా హడావిడి. ఎవ్వరూ నన్ను పట్టించుకొన్న పాపాన పోలేదు సరికదా, ఆ విరిగిన కాలితోనే నా వీపుమీద ఒక్క బాదు బాదాడు వెధవ కుర్చీ, వెధవ కుర్చీ అని. ఛీత్కారాల పరంపర.

మూడు కాళ్లమీద ఒక వైపుకి వంగి ఎన్నాళ్ళున్నానో తెలియదు. హాస్పటల్ నుండి యజమాని డిశ్చార్జ్ అయి వచ్చాడు. పాపం ఏమయ్యిందో ఇంకా సరిగ్గా నయం కాలేదు. నెలలు గడిచాయి. రోజూ మందులూ, ఇంజక్షన్లూ, Bandage Changes ఏదో ఒక బాధతో గడిచిపోయాయి. Physiotherapy లాగా ఉంది. ఏదో జరుగుతోంది. కొన్ని వారాలకి నెమ్మదిగా లేచి నడవడం మొదలుపెట్టాడు. డాక్టర్ సలహాలు – కుర్చీ హైట్‍లో కానీ కూర్చోలేడట, మంచం మీద కూడా పరుపు ఉండకూడదుట. స్వార్థం కదా, నా ఆనందానికి అవధులు లేవు. రెండో రోజే కార్పెంటర్ ఇంటికి వచ్చాడు. నా విరిగిన కాలుకి మరమ్మత్తు చేశాడు. నన్ను, యజమానిని కలిపిన ఆ డాక్టర్‌కీ, దేవునికి శతసహస్రకోటి వందనాలు అర్పించా మనస్సులోనే.

(ఇది సుఖాంతం, కథ కంచికి మనమింటికి)

రెండో ముగింపు:

మూడు వారాలు గడిచాయి. తగ్గుతుందనుకొన్న గాయం తగ్గలేదు. మందులు, ఇంజెక్షన్లు, బ్యాండెజ్‍లు, physiotherapy etc. జరుగుతున్నాయి. యజమాని అతి బలవంతం మీద ఇతరుల ఆసరాతో దైనందిక చర్యలు జరుపగలుగుతున్నాడు. నా పరిస్థితే అంతే. కాల్లో గాయాలు యజమానికైతే, కాల్లో మేకులు నాకు.

ఒకరోజు రాత్రి గదిల్లో కొచ్చి అన్నం పెడుతున్న కొడుకుతో యజమాని ఏదో మాట్లాడుతున్నాడు. వింటున్నా. “ఒరేయ్ అబ్బాయ్ నీతో కొంచెం మాట్లాడాలి రా” అన్నాడు.

“చెప్పండి నాన్నగారూ”

“ఏం లేదురా ఆ కుర్చీ..”

“నాన్నగారూ ఇప్పుడు కూడా కుర్చీ గోలేనా ఒక పక్క ఒంట్లో బాగో లేకుండా” కసిరినట్టు ప్రేమగా అన్నాడు కొడుకు.

“అది కాదురా అబ్బే విను, నాకు ఒకవేళ ఇది తగ్గకపోతే, నేనేమైనా అయిపోతే”

“మీకేం కాదు నాన్నగారూ తగ్గుతుందని డాక్టర్స్ చెబుతున్నారుగా”

“డాక్టర్స్ ఏమైనా దేముళ్ళు ఏట్రా ఆయుష్షు పోయడానికి, తశ్సాంతికి ఏవో మందులు వాడమంటారు కానీ, అదేకాక వాళ్లు అలా చెప్పకపోతే వాళ్ళు బ్రతకద్దూ అంతే. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే నాకు తగ్గకుండా ఏదైనా అయితే ఆ కుర్చీని కూడా నాతో తగలబెట్టేయండిరా, అంతేకానీ పాత సామాన్ల వాడికో, చెత్తా చెదారంలో పడేయ్యడమో చెయ్యద్దురా. ఇదే నా ఆఖరి కోరిక, తీరుస్తానని మాటివ్వరా”

కొడుకు కళ్లు చెమర్చాయి. “అలాగే నాన్నగారు, అన్నం తిని విశ్రాంతిగా పడుక్కోండి.”

“హమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా, నిద్రవస్తోందిరా అబ్బే, దుప్పటి కప్పి వెళ్ళి నువ్వు కూడా పడుక్కో నాయనా.”

తెల్లవారింది. ఇంకా లేవలేదేంటి ఈయన అనుకొనో లోపే కొడుకు గదిలోకి వచ్చాడు. “ఫోన్ వచ్చింది నాన్నగారు, ప్రొద్దుటే ఆఫీస్ నుంచి. లేట్ అయ్యింది పదండి పళ్ళుతోమిస్తా, కాఫీ త్రాగి మందు తీసుకోవద్దూ” అన్నాడు.

ఉలుకూ, పలుకూ లేదు. కొడుకు ఏడుపు లీలగా వినిపించింది. నా చెవులు కూడా ఆ మాట వినడానికి సిద్ధంగా లేవేమో మరి. తల్లి రోదన, నాకు అంతా అవగతం అయ్యింది. నా అంతిమ యాత్రకు సమయం ఆసన్నమయ్యిందని అర్థం అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. యజమాని ‘చితి’లో కట్టెలా ఉయోగపడే సమయం ఆసన్నమయింది. ఇంతకంటే ఆయనకి నేనివ్వగలిగే ప్రతిఫలం మాత్రం ఏముంటుంది? ఆయన కోర్కె తీర్చగలిగా అదే పదివేలు.

(ఇది మరో ముగింపు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here