అధ్యాయం 2 – సాగునీరు, తాగునీరు, మురుగు నీరు రంగాలలో నా అనుభవాలు:
[dropcap]సెం[/dropcap]ట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీర్ (లేదా సూపరింటెండింగ్ ఇంజనీర్) కి సహాయకుడిగా పనిచేస్తున్న నేను ఏప్రిల్ 1899లో పూనా నీటిపారుదల జిల్లా బాధ్యత వహించడానికి బదిలీ అయ్యాను. ఇది బొంబాయి ప్రెసిడెన్సీలో సింధ్ మినహా ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు కలిగిన ప్రధాన నీటిపారుదల జిల్లా (Principal Irrigation District). బొంబాయి ప్రెసిడెన్సీలోనే రెండు అతిపెద్ద నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. కాలువల కింద అతి పెద్ద ఆయకట్టు ప్రాంతం కూడా ఈ జిల్లాలో ఉంది. పూనా నగరం సబర్బన్ ప్రాంతం, పూనా, కిర్కీ కంటోన్మెంట్లకు మంచి నీటి సరఫరా కూడా నా బాధ్యతలో భాగమైంది. పూనా నగరానికి వడ కట్టని నీటి సరఫరాను నగరానికి దక్షిణం వైపున కొంచెం ఎత్తులో ఉన్న ముఠా కాలువ నుండి నేరుగా పొందుతున్నది.
పూనా నీటిపారుదల జిల్లా పరిపాలనలో నేను ఎదుర్కొన్న మొదటి ప్రధాన సమస్య ఏమిటంటే.. సాగులో ఉన్న పంటలకు నీటి సక్రమంగా పంపిణీ చేయడం మరియు రైతులు ఆ నీటిని వృథా చేయడాన్ని నియంత్రించడం. నీటి వృథాను అరికట్టాలంటే నీటి పంపిణీని నియంత్రించాలి. రైతులు నీటి వృథాను అదుపు చేయడం అలవాటు చేసుకోలేదు. కాలువ తూములను నీటిపారుదల సిబ్బంది సరైన మరమ్మతులు చేస్తూ మంచి స్థితిలో ఉంచుతూ పర్యవేక్షణ కూడా బాగా చేసేవారు. నీటిని డిస్ట్రిబ్యూటరీలోకి, ఉప కాలువల్లోకి అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ పంపించేవారు. రైతులు ఆ నీటిని వ్యర్థంగా ఉపయోగించేవారు. పూనా నగరం చుట్టుపక్కల ఉన్న ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు సరఫరా పూనా నగరానికి చెందిన అత్యంత సమర్థుడైన భారతీయ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ వి.ఎన్.వర్తక్ బాధ్యత వహించేవారు. ఈ అధికారి 10 రోజులకు ఒకసారి నీరు సరఫరా చేసే వారాబందీ పద్దతిలో రేషన్ ద్వారా నీటి నియంత్రణ, పంపిణీని జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించారు. అయితే ఇష్టమొచ్చినప్పుడల్లా ఇష్టం ఉన్నంత నీటిని తీసుకునేందుకు అలవాటు పడిన రైతులు, భూముల యజమానులు ఈ నీటి నియంత్రణపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలకలం రేగింది. ప్రముఖ మరాఠీ వార్తాపత్రిక ‘కేసరి’ లో రైతుల ఫిర్యాదులను ప్రచురించారు. ఆ రోజుల్లో గొప్ప మరాఠా నాయకుడు శ్రీ బి.జి.తిలక్ ఆధ్వర్యంలో కేసరి పత్రిక వెలువడేది.
నా ఆధీనంలో ఉన్న నీటిపారుదల శాఖ ప్రభుత్వ అధికారులు అనవసరమైన మరియు ఏకపక్ష ఆంక్షలు విధించారని ఫిర్యాదులు కేసరి పత్రికలో అచ్చు అయినాయి. నీటి పంపిణీని ఎందుకు నియంత్రించవలసి వచ్చిందో వివరిస్తూ కేసరి పత్రికలో అచ్చయిన వార్తల కటింగ్ లను ప్రభుత్వానికి సమర్పించాను. ఆయకట్టులో ఉన్న పొలాల యజమానులు ఎక్కువగా పూనా నగరానికే చెందినవారని, పలుకుబడి కలిగినవారని, వారి ప్రభావం వల్లనే పత్రికల్లో ఫిర్యాదుల వార్తలు జోరుగా అచ్చు అవుతున్నాయని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. కాలువల నిర్వాహణ, నీటి సరఫరా విషయంలో ప్రాజెక్టు అధికారులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, కాలువల నిర్వహణ, నీటి పంపిణీకి సంబందించిన కేసులను పరిష్కరించేందుకు నాకు పూర్తి స్వేచ్ఛ ఉందని, నేను నా విచాక్షణాధికారంతో వ్యవహరించ వచ్చునని బొంబాయి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
అయితే రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నాను. ఆయకట్టు రైతులే స్వయంగా వివరించేందుకు వీలుగా నేను ఫెర్గూసన్ కాలేజీ హాల్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. (ప్రస్తుతం సర్) ఆర్. పి. పరంజపే నుంచి అనుమతి పొందాను. కళాశాల సమీపంలోనే రైతుల పొలాలు ఉండేవి.
కళాశాల హాలులో ఆయకట్టు రైతుల సమావేశాలు నిర్వహించాను. నీటి పంపిణీ విషయంలో అవకతవకలకు సంబంధించిన ప్రశ్నలు అడగడానికి, అధికారులు వెంటనే సమాధానం ఇవ్వడానికి ప్రముఖ సాగుదారులు, నీటిపారుదల ప్రాజెక్టు అధికారులు హాజరు కావాలని కోరినాను. ప్రతి 10 రోజుల రొటేషన్‌లో సాగుదారుల సమక్షంలో ప్రతి కాలువ తూముల నుండి విడుదలయ్యే నీటిని కొలవడానికి నిర్ణయించడం జరిగింది. తూముల నుండి విడుదలయ్యే నీటికి పంట భూముల విస్తీర్ణానికి మధ్య సరైన సమతుల్యత కొనసాగించాలని మేము ప్రతిపాదించాము. నీటి విడుదల పరిమాణం మరియు వివిధ రకాల పంట భూముల విస్తీర్ణం రెండూ రోజువారీగా పరిగణనలోకి తీసుకోబడతాయని ప్రతిపాదించాము. మేము ఈ ప్రయోగం చేసే సమయంలో పంటల విస్తీర్ణానికి అవసరమైన నీటి సరఫరా రేటును హామీ ఇవ్వడమే కాకుండా, సాగుదారులు తమకు తామే నీటిని పంపిణీ చేయడానికి అంగీకరిస్తే దానికి సహేతుకమైన శాతంలో అదనంగా నీటిని జోడించడానికి కూడా మేము సమావేశంలో హామీ ఇచ్చాము. రైతులు తమ విచాక్షణతో నీటి పంపిణీని స్వయంగా నియంత్రించడానికి అంగీకరిస్తే నీటి నిర్వహణకు అయ్యే పట్కారీ (నీటి పంపిణీదారు) కూలీని చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ప్రకటించాము. అయితే, చివరికి సాగుదారులు మా ప్రతిపాదనలకు అనుగుణంగా ఎటువంటి బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడలేదు. నీటి నిర్వాహణ, పంపిణీ వ్యవహారాలు నీటిపారుదల శాఖ ద్వారానే కొనసాగించాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు.
శ్రీ బి.జి.తిలక్ సహోద్యోగి దివంగత శ్రీ ఎన్.సి.కేల్కర్ ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరైనవని నమ్మి, తాను సంపాదకుడిగా ఉన్న కేసరిలో వరుసగా వ్యాసాలు రాశారు. శాఖ తీసుకున్న చర్యల వలన కలిగే ప్రయోజనాలను ఆ వ్యాసాలలో వివరించారు. ఇలా పారదర్శకంగా వ్యవహరించడం, కేసరి పత్రికలో కేల్కర్ వరుస వ్యాసాల ద్వారా ప్రచారం చేయడం వల్ల సాగుదారుల కష్టాలు తీరాయి. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా సాగుదారులు తమను తాము మార్చుకున్నారు. ఆ తర్వాత వారి నుండి ఎటువంటి ఫిర్యాదులు వినబడలేదు.
నీటిపారుదల కమిషన్ (Indian Irrigation Commission) సందర్శన:
ఈ దశలో హోమ్ సెక్రెటరీ గారి అనుమతితో భారత ప్రభుత్వం ‘ఇండియన్ ఇరిగేషన్ కమిషన్’ను నియమించడం జరిగింది. భారతదేశం అంతటా పర్యటించి నీటిపారుదల ద్వారా పంటల సాగును విస్తరించేందుకు తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని వారికి నిర్దేశించినారు. ఈజిప్టులో పని చేసిన ప్రముఖ చీఫ్ ఇంజనీర్ సర్ కోలిన్ సి స్కాట్ మోన్‌క్రీఫ్ (Sir Colin C. Scott-Moncrieff) కమిషన్‌కు అధ్యక్షుడిగా నియమించారు. కేంద్ర, ప్రావిన్షియల్ ప్రభుత్వాల రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. బొంబాయి ప్రెసిడెన్సీలో కమిషన్ పూనా నీటిపారుదల జిల్లాను మాత్రమే సందర్శించింది. ఇప్పటికే చెప్పినట్లుగా ప్రెసిడెన్సీలో పూనాను ప్రధాన నీటిపారుదల జిల్లాగా పరిగణించేవారు. కమిషన్‌కు పూనా నీటిపారుదల జిల్లా స్థితిగతులను వివరించి, భవిష్యత్ పథకాల గురించి స్పష్టం చేయడానికి పై అధికారుల ఆదేశాల మేరకు నేను ‘సింధ్ మినహా బొంబాయి ప్రెసిడెన్సీలో నీటిపారుదల పనులపై ఒక నివేదిక’ సిద్ధం చేయాల్సి వచ్చింది. బొంబాయి నీటిపారుదల వ్యవస్థ ప్రత్యేకమైన లక్షణాలను విషదీకరించి భవిష్యత్‌లో వ్యవస్థను మెరుగు పరచడానికి ఇంకా ఏవైనా ఉపశమన చర్యలు తీసుకోవాలా అన్న అంశాలను కమిషన్‌కు ఎరుకపరచడమే ఈ నివేదిక యొక్క ప్రధాన లక్ష్యం. తద్వారా బొంబాయి నీటి పారుదల వ్యవస్థ పరిపాలన, అంచనా, పనుల నిర్వహణలో మరిన్ని మార్పులు తీసుకురావడానికి దోహదం చేయవచ్చు. బొంబాయి ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల కమిషన్ తమ సంతృప్తిని వ్యక్తం చేసింది.
“మీరు జాగ్రత్తగా తయారు చేసిన నివేదికను కమిషన్ వారు అంగీకరించారు. నివేదికలో పొందుపరచిన ప్రణాళికలను కమిషన్ యధాతథంగా స్వీకరించింది. మంచి నివేదికను రూపొందించినందుకు అభినందించారు.” అని 18 ఏప్రిల్ 1899 నాటి వారి ఉత్తరం నం. 2699 లో ప్రశంసించారు. మేము రూపొందించిన నివేదిక కమిషన్ పై కొంత ప్రభావం చూపించిందని అనిపించింది. పూనాలో జరిగిన కమిషన్ సమావేశంలో కమిషన్ అధ్యక్షులు నన్ను బొంబాయి ప్రెసిడెన్సీలో (సింధ్ మినహా) నీటిపారుదలకు సంబందించి వివిధ అంశాలపై రెండు రోజుల పాటు ప్రశ్నించారు. కమిషన్ మా నివేదిక పరిశీలన ముగిసే సమయానికి, బొంబాయి ప్రెసిడెన్సీలో నీటిపారుదల పనులను మరింత జనాదరణ పొందేలా మరియు ప్రభుత్వం ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చును లాభదాయకంగా మార్చడానికి కమీషన్‌కు ఒక వర్కింగ్ స్కీమ్ లేదా పథకాన్ని అందించగలవా అని అధ్యక్షులు సర్ కోన్ సి. స్కాట్-మాన్‌క్రీఫ్ నన్ను అడిగారు. నేను మూడు నెలల వ్యవధిలో ఒక పథకాన్ని సమర్పించడానికి అంగీకరించాను.
పూనా జిల్లాలోని నీరా కాలువను కమిషన్ సందర్శించింది. అప్పుడు ఆ కాలువ నా అధికార పరిధిలో ఉండేది. మొత్తం కమిషన్ కాలువ మీద పడవలో కొంత దూరం ప్రయాణించింది. లేడీ స్కాట్ మాన్‌క్రిఫ్ కమిషన్ బృందంతో పర్యటనలో పాల్గొన్నారు. ఆమె కాలువ హెడ్ వర్క్స్ వద్ద ఒక గ్రూప్ ఫోటో కూడా తీశారు. కమిషన్ బృందం ఫోటో తీస్తున్నప్పుడు నేను ప్రోటోకాల్‌ను పాటిస్తూ వెనుక వరుసలో నిలబడినాను. అయితే మేము కాలువలో పడవ ప్రయాణం చేసేటప్పుడు నా పక్కన కూర్చుని నన్ను చర్చలో నిమగ్నం చేయమని ఆమె భర్తను కోరింది. నీటిపారుదల సమస్యలపై చర్చ జరుగుతుండగా ఆమె మరొక ఫోటోగ్రాఫ్ తీసినారు. అప్పటికి లేడీ స్కాట్ మోన్‌క్రిఫ్ గారికి నేను ఎవరో కూడా తెలియదు. కొన్ని రోజుల తరువాత ఆమె ఫోటో నెగెటివ్ డెవలప్ చేసి గుంతకల్ నుండి నాకు ఫోటో కాపీ పంపారు. ఫోటో పంపుతూ ఈ క్రింది వాక్యాలను రాసినారు.
“కమిషన్ అధ్యక్షుడితో చర్చల జ్ఞాపిక.
లేడీ స్కాట్ మాన్‌క్రీఫ్ నుండి శుభాకాంక్షలతో.”
కమిషన్ అధ్యక్షునికి వాగ్దానం చేసినట్లు నేను ఒక పథకాన్ని సిద్ధం చేసి అంగీకరించిన సమయంలోనే దానిని సమర్పించాను. ఈ పథకానికి ‘Block System of Irrigation’ అనే శీర్షిక పెట్టాము. మేము సమర్పించిన పథకాన్ని కమిషన్ ఆమోదించింది. భారత ప్రభుత్వం ద్వారా బొంబాయి ప్రభుత్వానికి ఈ నివేదికను స్వీకరించాలని సిఫార్సు కూడా చేసింది. వారి నివేదిక (1901-03) లోని పార్ట్ I లో పేరా 291 లో భారత నీటిపారుదల కమిషన్ (Indian Irrigation Commission) ఈ పథకంపై వారి అభిప్రాయాన్ని క్రింది వాక్యాల్లో నమోదు చేసింది:
“పూనా నీటిపారుదల జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రూపొందించిన ఒక అత్యున్నత, ఆసక్తికరమైన పత్రాన్ని బొంబాయి ప్రభుత్వం ద్వారా అందుకున్నాము. అందులో ఆయన లాంగ్ లీజ్ బ్లాక్ సిస్టమ్‌కు సంబందించి అన్ని వివరాలు విషదీకరించాడు. ఈ విషయాన్ని మేము ఇంతకు ముందే మా అనుమతి పత్రంలో బొంబాయి చాప్టర్‌లో ప్రస్తావించినాము. నివేదికలో ప్రతిపాదించిన పథకం మాకు చాలా సమగ్రంగా మరియు బాగా అధ్యయనం చేసిన తర్వాత రూపోందించినట్టు కనిపిస్తున్నది. దీనిని బొంబాయి ప్రభుత్వం ఇంకా పరిశీలించనప్పటికీ ఇందులో ప్రతిపాదించిన సాధారణ సూత్రం సరైనదని మేము భావిస్తున్నాము. దక్కన్ నీటిపారుదల పనులకు కూడా అటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టగలిగితే అది ప్రజలకు మరింత ఉపయోగకరంగాను, ప్రభుత్వానికి మరింత లాభదాయకంగాను ఉంటుందని మా అభిప్రాయం. అందువల్ల శ్రీ విశ్వేశ్వరాయ ప్రతిపాదించిన ఈ వ్యవస్థను అన్ని కోణాలలో త్వరితగతిన పరిశీలించి అమలుపరచడం సాధ్యమవుతుందని మేము ఆశిస్తున్నాము”
నివేదికలో పేర్కొన్నట్టు మేము ప్రతిపాదించిన వ్యవస్థ లక్ష్యం.. 1) అధిక సంఖ్యలో గ్రామాలకు నీటిపారుదల పనుల ప్రయోజనాలను అందించడం 2) ప్రతి గ్రామంలో బ్లాకుల పరిధిలో నేల స్వభావం, స్థానిక పరిస్తితులకు అనుగుణంగా నీటి సరఫరాను కేంద్రీకరించి పంపిణీ చేయడం. ప్రతి గ్రామంలోని బ్లాక్‌ల మొత్తం విస్తీర్ణం సాగునీటి ఆధారంగా పంటను పండించే ప్రతి ఒక్కరికీ తగినంత నీటి వాటా ఉండేలా పెద్దదిగా ఉండాలి. అయితే గతంలో జరిగినట్టు రైతులు బాగా నీటి లభ్యత ఉన్న కాలంలో సాగునీటి సరఫరా ప్రయోజనాలను విస్మరించడానికి, ఇష్టమున్నంత నీటిని వాడుకోవడానికి దారితీసే విధంగా మరీ ఎక్కువ పెద్దవిగా కూడా ఉండకూడదు. ప్రతి బ్లాక్‌లో ఏక కాలంలో మూడింట ఒక వంతుల విస్తీర్ణంలో నీటిని ఎక్కువగా వినియోగించే చెరుకు లేదా వానాకాలం, యాసంగీ పంట కాలానికి విస్తరించే పంటలు ఉండాలి. మిగిలిన మూడింట రెండు వంతులు ఫిబ్రవరి చివరి వరకు ఇతర యాసంగీ లేదా వానాకాలం పంటలు, కూరగాయలు పండించవచ్చు. ఫిబ్రవరి తర్వాత వానాకాలం మొదలయ్యేదాకా మూడు వంతుల విస్తీర్ణంలో బహువార్షిక పంటలకు మాత్రమే నీరు ఇవ్వడం జరుతుంది. ప్రతి బ్లాక్‌లో ఒక విధంగా ఏటా మూడు పంటలకు వంతుల వారీగా నీరు సరఫరా చేయడం జరుగుతుంది.
నీరా కాలువ పై ఈ పథకాన్ని ప్రవేశపెట్టే బాధ్యతను బొంబాయి ప్రభుత్వం నాకు అప్పగించింది. కానీ జిల్లా కలెక్టర్, సబ్ డివిజనల్ అధికారి ఇద్దరూ కూడా యూరోపియన్ అధికారులే. వారిద్దరూ ఈ పథకాన్ని అమలు చేయడానికి అనుకూలంగా ఉన్నట్టు కనిపించలేదు. మామ్‌లాత్‌దార్లు, కిందిస్థాయి రెవెన్యూ అధికారులు కూడా కొద్దికాలం వారికి వైపే నిలిచారు. గ్రామ అధికారులు కూడా ఊహించినట్లుగానే మొదట్లో ఈ పథకాన్ని వ్యతిరేకించారు.
ఈ పథకాన్ని అమలు పరచడానికి ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక ఇంజనీరింగ్ అధికారి.. ఇద్దరు అధికారులతో కూడిన ఒక కమిటీ నా కోరిక మేరకు నియమించారు. ఈ పథకాన్ని గ్రామీణ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చేస్తున్న తమ ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని, జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రోత్సహించడం లేదని ఈ ఇద్దరు అధికారులు నాకు నివేదించారు. రెవెన్యూ అధికారులు సృష్టిస్తున్న ఆటంకాలకు సాక్ష్యాధారాలను సేకరించి, అటువంటి అడ్డంకులకు ఉదాహరణలు ఇవ్వాలని నేను కమిటీ సభ్యులను కోరాను. వారు ఆయకట్టు గామాల చుట్టు తిరిగి, రైతులను సంప్రతించి పౌర అధికారులు ఏయే విషయాలలో అడ్డుకుంటున్నారో చూపించడానికి అవసరమైన సాక్ష్యాలను సేకరించి నాకు ఇచ్చారు. ఇద్దరు అధికారులు సేకరించిన సాక్ష్యాలను ప్రభుత్వానికి సమర్పించి జిల్లా పౌర అధికారులు సృష్టిస్తున్న ఆటంకాలను, వారి కుట్ర పూరిత వ్యూహాలను నిరోధించాలని లేదా ఈ పథకాన్ని అమలుపరచే బాధ్యత నుండి నన్ను తప్పించాలని అభ్యర్థించాను. బొంబాయిలోని సచివాలయంలో సమావేశానికి హాజరుకావాలని ప్రభుత్వం సంబంధిత జిల్లా పౌర అధికారులకు టెలిగ్రాఫ్ ద్వారా సమాచారం పంపింది. పథకాన్ని అమలు చేయడంలో నాకు సహకరించాలని, ఫిర్యాదులో పేర్కొన్న తరహా అన్ని అడ్డంకులను తొలగించమని కోరుతూ ముద్రించిన సూచనలను వారికి అందించింది. ఆ తర్వాత, పథకాన్ని ప్రవేశపెట్టడానికి నాకు అవసరమైన ప్రతి సదుపాయం అందింది. నిర్ణీత సమయంలో పథకం సంతృప్తికరంగా అమలులోకి వచ్చింది.
ఈ పథకాన్ని స్వీకరించేలా సాగుదారులను ప్రేరేపించేందుకు నేను కాలువ ప్రాంతంలో ఇద్దరు ప్రభావశీలత, పలుకుబడి కలిగిన పెద్ద రైతులను సంప్రదించాను. ఈ వ్యవస్థ వలన కలిగే ప్రయోజనాల విషయంలో వారిని ఒప్పించాను. వారితో పాటు మరికొందరు ప్రతిభావంతులైన సాగుదారులు పథకం ప్రధాన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నారు. కాలువ కింద ఉన్న ఆయకట్టులోని అన్ని ప్రాంతాలలో ఈ పథకాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడానికి కమిటీకి వారి నుండి సహృదయ సహకారం లభించింది. బ్లాక్ వ్యవస్థను జయప్రదంగా ప్రవేశపెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలు పని చేసిన అనుభవాల ఆధారంగా బాంబాయి ప్రభుత్వంలో సీనియర్ సభ్యుడు అయిన సర్ జాన్ ముయిర్ మెకెంజీ (Sir John Muir Mackenzie) గారు ఈ వ్యవస్థ అందించిన ఫలితాల గురించి జూన్ 1908 లోపూనాలో బొంబాయి శాసన మండలిలో సమావేశాల్లో ఈ విధంగా ప్రసంగించారు:
“నీరా కాలువ కింద ఆయకట్టులో నీటిపారుదల శాఖ ‘బ్లాక్ సిస్టమ్’ పేరుతో ప్రవేశపెట్టిన పథకం పూర్తిగా విజయవంతం అయ్యింది. ఇది ఈ పథకం పనులకు అనుకూలంగా గట్టి పునాదిని వేసింది. ఇది ప్రభుత్వానికి మూలధన వ్యయంపై దాదాపు 3.5 శాతం తిరిగి చెల్లించడంలో విజయం సాధించింది. ఈ చెల్లింపులు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ వ్యవస్థ అభివృద్ధికి పూర్తిగా శ్రీ విశ్వేశ్వరాయ గారి మేధోపరమైన పనితనమే కారణం. ప్రజా పనుల శాఖలో పని చేస్తున్న సమర్ధులైన యూరోపియన్, భారతీయ అధికారులలో ఒకరైన వీరితో కలిసి పనిచేయడం నాకు ఆనందంగా, గౌరవంగా ఉంది.” (బొంబాయి ప్రభుత్వ రాజపత్రము, 15 ఆగస్టు, 1908)
పేటెంట్ తూముల ఆటోమేటిక్ గేట్లు (Patent Automatic Sluice Gates):
ఖడక్ వాస్లా వద్ద ఫైఫ్ జలాశయంలో నీటి నిల్వ దాని మీద ఆధారపడిన ముఠా కాలువ ఆయకట్టు సాగునీటి అవసరాలను తీర్చడానికి, పూనా నగరం, కంటోన్మెంట్ ప్రాంతాలకు మంచి నీటి సరఫరాకు సరిపడేంత లేదని గుర్తించారు. ప్రతి సంవత్సరం ఖడక్ వాస్లా జలాశయం అలుగు మీద సుమారు ఆరు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు జలాశయం నుంచి నీరు పొంగిపొర్లుతూ నదిలోకి పోతుండేవి. సరస్సు నిల్వ నీటి మట్టాన్ని అలుగు పైన దాదాపు 8 అడుగుల మేర శాశ్వతంగా పెంచడానికి నేను ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థను రూపొందించాను. దీంతో డ్యాం ఎత్త పెంచకుండానే జలాశయం నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 25 శాతం పెరిగింది. గేట్లు సరస్సులో మునుపటి వరదల పూర్తి ఎత్తుకు పెరిగే వరకు నీటిని నిలబెడతాయి. కానీ ఎప్పుడైనా అంతకు మించి నీటి మట్టం పెరగడంతో గేట్లు స్వయంచాలకంగా తెరుచుకుని జలాశయంలోకి ప్రవహించే అదనపు జలాలను కింద నదిలోకి వెళ్లేలా చేస్తాయి. జలాశయంలో నీరు మళ్లీ 8 అడుగుల స్థాయి కంటే దిగువకు పడిపోయినప్పుడు గేట్లు స్వయంచాలకంగా మూసుకుంటాయి. మరింత నీరు నదిలోకి పోకుండా నిలిపివేస్తాయి.
నేను ఈ కొత్త ఆటోమాటిక్ గేట్ల డిజైన్‌కు పెంటెంట్ కూడా పొందాను. లేక్ ఫైఫ్ అలుగు పైన ఈ ఆటోమాటిక్ గేట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడానికి బొంబాయి ప్రభుత్వం తక్షణమే అంగీకరించింది. అయితే ఆ సమయంలో చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న శ్రీ డబ్ల్యూ ఏల్ కామెరూన్ గారు, తర్వాత వ్యాఖ్యానిస్తూ, నా స్వంత పర్యవేక్షణలో పని జరిగినందున ప్రభుత్వం నుండి ఎటువంటి రాయల్టీని అడగడానికి నేను నిరాకరించానని అన్నారు. ఈ గేట్లను బొంబాయిలో మెస్సర్స్ జియో గహగన్ & కంపనీ వారు తయారు చేశారు. వీటిని 1901-03 మధ్య కాలంలో జలాశయం అలుగుపై నా పర్యవేక్షణలో అమర్చినారు. ఈ గేట్లను 45 సంవత్సరాల క్రితం అమర్చినప్పటికీ అవసరమైన సందర్భాలలో సంతృప్తికరంగా పని చేస్తున్నాయని నేను ఇటీవల సరస్సును సందర్శించినప్పుడు తెలుసుకున్నాను.
గ్వాలియర్ నగరానికి నీటి సరఫరా చేసే తిగ్రా డ్యామ్ అలుగు పైన, మైసూర్ నగరానికి సమీపంలో నిర్మించిన కృష్ణరాజసాగర్ డ్యామ్ అలుగు పైన ఈ రకమైన ఆటోమాటిక్ గేట్లను అమర్చడానికి ప్రాజెక్టు అధికారులు నన్ను సంప్రదించినారు. నా సలహాలు, సూచనల ఆధారంగా అదే తరహా గేట్‌ల నమూనాలను స్వీకరించారు.
పూనా – కిర్కీ మంచి నీటి సరఫరా:
పూనా నగరం నీటి సరఫరాలో ఎక్కువ భాగం వడ కట్టని కాలువ నీరే. పూనా, కిర్కీ సైనిక స్థావరాలకు మాత్రం వడ కట్టిన నీటిని సరఫరా చేసేవారు. సుమారు ఆరు సంవత్సరాలు ఈ రెండూ కూడా నా బాధ్యతల్లో భాగంగా ఉండేవి. కంటోన్మెంట్ నీటి సరఫరా వ్యవస్థలో అనేక మెరుగుదలలు చేయాల్సి వచ్చింది. లార్డ్ కిచెనర్ భారతదేశంలో కమాండర్-ఇన్-చీఫ్‌గా ఉన్నప్పుడు కంటోన్మెంట్ నీటి సరఫరా మెరుగుదల ప్రణాళికలను పరిశీలించి, నిధులు మంజూరు చేయడానికి పూనాను రెండుసార్లు సందర్శించాడు. మిలటరీ కంటోన్మెంట్ నీటి సరఫరాతో స్థానిక పౌర అధికారులకు ఎలాంటి సంబంధం లేనందున, ఆ సమయంలో గవర్నర్‌లుగా ఉన్న లార్డ్ లైఫింగ్టన్ మొదటి సందర్శనలో, లార్డ్ సిడెన్ హామ్ రెండవసారి, లార్డ్ కిచెనర్‌తో మూడవసారి నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి నన్ను ఆహ్వానించారు. నేను లార్డ్ కిచెనర్‌ని మూడోసారి కలుసుకోవడం అసాధారణమైన సందర్భంలో జరిగింది. గవర్నర్ లార్డ్ సిడెన్ హామ్ గారి ఎ.డి.సి ఒకనాటి మధ్యాహ్నం పూనాలో నా నివాసానికి వచ్చి సాయంత్రం 5 గంటలకు ఖడక్ వాస్లా (లేక్ ఫైఫ్) వద్దకు గవర్నర్ గారు నన్ను రమ్మన్నారని చెప్పారు. ఖడక్ వాస్లా జలాశయానికి అప్పుడు బాధ్యత వహించిన అధికారి వేరే వ్యక్తి అని, అతని కారణంగా నన్ను వేరే ప్రభుత్వ ప్రజారోగ్య ఇంజనీర్ కార్యాలయానికి బదిలీ చేశారని, అందు వలను తాను అక్కడకి రావడం సమంజసం కాదని వారికి విన్నవించాను.
అయితే గవర్నర్ గారు నన్ను జలాశయం వద్ద చూడాలని కోరుతున్నారని, తన వెంట రావాలని ఏ డి సి పట్టుబట్టారు. పూనా నుండి తొమ్మిది మైళ్ల దూరంలో ఉన్న జలాశయానికి చేరుకున్నప్పుడు గవర్నర్ గారు నన్ను లార్డ్ కిచెనర్‌కు పరిచయం చేశారు. నేను రూపొందించిన ఆటోమేటిక్ స్లూయిస్ గేట్‌ల పని తీరును చూడటానికి అధికారులు ఇద్దరూ ముందుగానే ఖడక్ వాస్లాకు వెళ్లారని నేను గ్రహించాను. గేట్ల పనిని పరిశీలించి, అవి ఎట్లా పని చేస్తాయో నా నుండి వివరణ తీసుకున్న తర్వాత వారిద్దరూ గణేష్ ఖిండ్‌లో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తిరిగి వచ్చారు. 1901లో ప్రజారోగ్య ఇంజనీర్‌గా పనిచేసిన ఇంజనీర్ సెలవుపై యూరప్‌కు వెళ్లినందున పూనా సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నా విధులకు అదనంగా అతని కార్యాలయ బాధ్యతలు నిర్వహించండని ప్రభుత్వం నన్ను కోరింది. తరువాత, ఆ హోదాలో నేను పూనా నగరానికి మొదటిసారిగా ఆధునిక మురుగునీటి పైపుల పథకం కోసం ఒక ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసాను. ఈ పథకంపై చర్చించి, ఆమోదించినప్పుడు పూనా మున్సిపల్ బోర్డుకు ప్రముఖ మరాఠా దేశభక్తుడు, నాయకుడు శ్రీ జి. కె. గోఖలే గారు అధ్యక్షత వహించారు.
పూనాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను ఇంజనీరింగ్ శాఖలో ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో పై అధికారులతో సన్నిహితంగా మెలిగానని చెప్పాలి. దానితో పాటూ ఇంజనీరింగ్ శాఖలో ఆసక్తికరమైన పనులను చెయ్యగలిగాను. బొంబాయి ప్రభుత్వ ప్రజా పనుల శాఖలో నా సేవలు ముగిసే సమయానికి పూనాలో 10 సంవత్సరాల నా నిరంతర నివాసం నాకు చాలా ఆహ్లాదకరంగా, నా భవిష్యత్ జీవితానికి ఉపయోగకర అనుభవంగా ఉండింది. ఈ కాలంలో నాకు ప్రజా పనుల శాఖలో పని చేస్తున్న యూరోపియన్ పై అధికారులతో సన్నిహితంగా పని చేసే అవకాశం వచ్చింది. వారందరూ విశాల హృదయం కలిగినవారు. నా పట్ల ఉదారంగా ఉన్నారు. నేను పూనా మరియు దక్కన్ లోని చాలా మంది భారతీయ ప్రజా నాయకుల విశ్వాసాన్నికూడా పొందానన్న భావన కలిగి ఉన్నాను. ప్రతి సంవత్సరం వర్షాకాలం మూడు లేదా నాలుగు నెలల పాటు పూనా నగరం ప్రభుత్వ ప్రధాన కార్య స్థానంగా ఉండేది. కాబట్టి నాకు బొంబాయి ప్రభుత్వ ఉన్నతాధికారులతో, లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రత్యేక పూనా సమావేశానికి హాజరు కావడానికి సింధ్ సహా ప్రెసిడెన్సీలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చే ప్రముఖ భారతీయ పెద్ద మనుషులతో సామాజిక సంబంధాలు కలిగి ఉండే అవకాశం వచ్చింది.
***