[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
భగవాన్ దాస్ గర్గ్ గారి ‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’:
బి. డి. గర్గ్‌గా ప్రసిద్ధికెక్కిన భగవాన్ దాస్ గర్గ్ మన దేశంలో ప్రఖ్యాతి గాంచిన డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాత. 1948లో తీసిన ‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’ ఆయన తొలి డాక్యుమెంటరీ. కాశ్మీర్ గురించి ఎన్నో కీలకమైన విషయాలు తెలిపే ఈ డాక్యుమెంటరీని భారతీయ సినిమాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు.
గర్గ్ వామపక్షవాది. కాశ్మీర్‍పై ఆయన అభిప్రాయాలు పురోగామి దృక్పథానికి చెందినవి. 1940 చివర్లో ఆయన – షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని రాజకీయ పార్టీ – నేషనల్ కాన్ఫరెన్స్- పట్ల సానుభూతితో ఉండేవారు.
‘ఫ్రాగ్‍మెంట్స్ ఆఫ్ ఎ లైఫ్’ అనే ఆర్టికల్‍లో ‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’ నిర్మాణం ఎలా జరిగిందో వివరించారు గర్గ్.
“దేశ విభజన సందర్భంగా జరిగిన ఘోర పరిణామాల తరువాత, అక్కడి రాజకీయ పరిస్థితులపై ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలని కాశ్మీరు వెళ్ళాను. షేక్ అబ్దుల్లా గారి ఆహ్వానంపై అప్పటికే అక్కడ ఉన్న కె.ఎ. అబ్బాస్ – తన విశాలమైన బోట్ హౌస్‍లో తనతో పాటు ఉండమని నన్ను ఆహ్వానించారు. అప్పుడే మా మధ్య స్నేహం బలపడింది. ఎన్నో సాహసాలు, దుస్సాహసాలు చేశాం. 1948లో కాశ్మీరు గొప్ప ఉత్తేజక ప్రాంతంగా ఉండేది. సరిహద్దులు దాటి వచ్చి దాడికి తెగబడిన వారు – లోయని అల్లకల్లోలం చేశారు, ఎందరో అమాయకులని చంపేశారు. వాళ్ళు క్రైస్తవ సన్యాసినులను కూడా వదల్లేదు. వారి ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టారు. దాడులు చేసినవారి పైన, వారి అరాచకాల పైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలేఖరులు, ఫోటోగ్రాఫర్లు శ్రీనగర్ చేరుకున్నారు. మేముండే బోట్ హౌస్ ఓ ‘ప్రెస్ క్లబ్’ గా మారిపోయింది. అందరూ అక్కడ చేరి జరుగుతున్న పరిణామాలపై చర్చలు జరిపేవారు. ఇలా వచ్చిన వారిలో నాకు బాగా గుర్తున్నది ఫైర్‍బ్రాండ్ స్వర్గీయ డి.పి. ధార్. భుజాన ఓ తుపాకీ వేలాడదీసుకుని వచ్చేవారాయన.
ఇక్కడే నేను దిగ్గజ ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్ బ్రెస్సన్‍ను కలిసాను. ఫొటోల కోసం తను చేసే పర్యటనలో చేరమని నన్ను అడిగారాయన. తన పాత లైకా కెమెరాతోనే, ఎటువంటి ఫిల్టర్లు వాడకుండా, కృత్రిమ వెలుగుని ఉపయోగించకుండా గొప్ప ఫొటోలు తీసేవారు. జీన్ రెనాయిర్‍తో తన కెరీర్ మొదలుపెట్టి, ఆ పై ఫొటోగ్రఫీ వైపు మళ్ళానని ఆయన నాతో అన్నారు. నేనెంతో ఋణపడి ఉండే జార్జెస్ సదౌల్ గారికి నన్ను పరిచయం చేసింది హెన్రీయే.”
గర్గ్ వ్రాసి 2005లో ప్రచురించిన ‘The Art of Cinema: an insider’s journey through fifty years of film history’ పుస్తకానికి ముందుమాట వ్రాసిన స్వర్గీయ దిలీప్ పదగావంకర్ ఈ డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించారు.
ఆ సమయంలో గాంధీజీ ఢిల్లీలో హత్యకి గురయ్యారు. గర్గ్ వెంటనే రాజధానికి పయనమయ్యారు. దేశ విభజన తరువాత ఆయన తల్లిదండ్రులు ఢిల్లీలో స్థిరపడ్డారు. వారి భద్రత ఆయనకు ముఖ్యం. అప్పట్లో ఆయనకి చేతిలో ఏ ప్రాజెక్టు లేదు. ఒకరోజు లాహోర్‍కి చెందిన మిత్రుడు బలవంత్ గార్గి – బి.డి. గార్గ్‌ని ప్రోత్సహించి – సినిమాను కెరీర్‍గా ఎంచుకోమని సూచించారు. అప్పటి జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా – పాకిస్తాన్ నుండి వచ్చిన దుండగులు కశ్మీరులో జరిపిన అరాచకాలను అందరికీ తెలియజేసేందుకు రచయితలను, కళాకారులను కశ్మీరుకు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. వారిద్దరూ కలిసి డాక్యుమెంటరీ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం అబ్దుల్లా గారిని సంప్రదించాలని అనుకున్నారు.
అయితే కాశ్మీరీ నేత – ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు సమకూర్చలేనని అన్నారు. అయితే వారికి అందుబాటులో ఒక బోట్ హౌస్‍ని ఉంచుతానని, రవాణా సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. అతి కష్టం మీద వారు కెమెరాని, ముడిసరుకులని సంపాదించారు. అప్పట్లో వాటి కొరత అధికంగా ఉండేది. రచయిత రాజీందర్ సింగ్ బేడీ కథావస్తువు సూచించారు.
కథలో ముఖ్య పాత్ర – అత్యాచారానికి గురైన యువతి. ఆమె భర్తని చంపేస్తారు, ఇంటిని తగలబెడతారు. ఈ పాత్రకి ఢిల్లీకి చెందిన అచలా సచ్‍దేవ్‍ని ఎంపిక చేశారు. అరాచకాలు జరిగిన బారాముల్లాలో షూటింగ్ మొదలుపెట్టారు. సరిహద్దులు దాటి వచ్చిన దుండగులు అక్కడే ఒక క్రైస్తవ ప్రార్థనామందిరాన్ని నాశనం చేశారు, క్రైస్తవ సన్యాసినులపై అత్యాచారానికి ఒడిగట్టారు.
కాశ్మీరు గర్గ్ గారికి రెండవ ఇల్లు లాంటిది. బాల్యంలో వేసవి సెలవల్లో చాలా సార్లు ఆయన కాశ్మీరు వచ్చారు. లాహోర్ నుంచి కాశ్మీరు వచ్చే ‘నందా బస్ సర్వీస్’ వారి బస్సులో ప్రయాణించేవారు (నేడు నందాస్ – దేశంలోని గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరు). కశ్మీరు గురించి బాగా తెలిసి ఉండడం – డాక్యుమెంటరీ తీయడంలో ఆయనకి ఎంతో ఉపకరించింది. గర్గ్ గారు కల్సిన ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్ బ్రెస్సన్, అమెరికన్ జర్నలిస్ట్ జాన్ గుంతర్, ఇంకా అప్పుడే ఎదుగుతున్న కాశ్మీరు రాజకీయ నేతలు శామ్‍లాల్ వాట్, డి.పి. ధార్ వంటి వారి సహకారం – డాక్యుమెంటరీ రూపకల్పనలో ఉపయోగపడింది. ప్రెస్ క్లబ్‍లా ఉపయోగపడిన అబ్బాస్ గారి బోట్‍హౌస్‌లో అబ్బాస్ గారిచ్చిన సూచనలు ఉపకరించాయి. ఈ డాక్యుమెంటరీకి ‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’ అని పేరు పెట్టారు. కొన్ని రష్‍లు చూశాకా, అబ్బాస్ గారు ఆ పేరు సూచించారు. ఓ వామపక్ష పత్రిక సంపాదకులైన రమేష్ థాపర్ వ్యాఖ్యానం వ్రాసి, దాన్నివినిపించారు. ఐపిటిఎ లో క్రియాశీలకంగా ఉంటూ – ఉదయ్ శంకర్ అకాడెమీలో సంగీతం అందించే – సర్దార్ మాలిక్ ఈ డాక్యుమెంటరీకి సంగీతం అందించారు.
అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు పట్టాభి సీతారామయ్య, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇంకా పలువురు విదేశీ పత్రికా ప్రతినిధులు ఈ డాక్యుమెంటరీని చూసి అభినందించినప్పటికీ, సెన్సార్ వారి అనుమతి లభించలేదు. భారత సైన్యం కాశ్మీరును రక్షిస్తున్నట్టుగా డాక్యుమెంటరీ చూపలేదనీ, షేక్ అబ్దుల్లాను మరీ పొగుడుతున్నట్లు ఉందని సెన్సార్ వారు అభ్యంతరం తెలిపారు. అప్పుడు గర్గ్ గారు సైన్యం ఉన్న చోటుకు వెళ్ళి, అప్పటి కాశ్మీరు ఆపరేషన్స్ ఇన్‍ఛార్జ్ అయిన జనరల్ తిమ్మయ్యతో స్నేహం చేసి – కొందరు సైనికులను చిత్రీకరించి, ఆ సమయంలో అక్కడ ఊరేగింపుగా ‘దురాక్రమణదారులారా జాగ్రత్త, మేం కశ్మీరీలం, మిమ్మల్ని ఎదుర్కుంటాం’ అంటూ నినాదాలు చేస్తూ వెళ్తున్న పిల్లల బృందాన్ని చిత్రీకరించారు. నాలుగు దశాబ్దాల తర్వాత, ఓ వ్యక్తి వచ్చి గర్గ్ గారిని కలిసి – ఆ డాక్యుమెంటరీ తీసినప్పుడు కెమెరా ముందు నుంచి నినాదాలు చేస్తూ నడిచిన పిల్లల్లో తానూ ఒకడినని పరిచయం చేసుకున్నాడు.
ఎట్టకేలకు సెన్సార్ వారి అభ్యంతరాలు తొలగి, డాక్యుమెంటరీ కొన్ని చోట్ల ప్రదర్శితమైంది. ప్రశంసలు పొందింది. పలు ప్రఖ్యాత పత్రికలు తమ కవర్ పేజీలో ఈ డాక్యుమెంటరీ ఫొటోలు వేశాయి, రాశాయి. అయితే ఈ డాక్యుమెంటరీ భారతదేశంలో విడుదల కాకపోవడం దురదృష్టం. 1998లో బొంబాయిలోని తారాదేవ్ లోని ఫేమస్ సినీ లేబొరేటరీ – ఈ డాక్యుమెంటరీ ప్రింట్ ఒకటి తమ వద్ద ఉందని తెలిపింది. ఈ రకంగా అది పూనె లోని నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్‌కు చేరిందని గర్గ్ తెలిపారు.
‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’ డాక్యుమెంటరీపై – మీనూ గౌర్ గారి పరిశోధన గ్రంథం ‘Kashmir on Screen: region religion and secularism in Hindi cinema’ లో సాధికారికమైన వివరాలు ఈక్రింది విధంగా పొందుపరచబడ్డాయి.
~
“కాశ్మీర్ యొక్క పురోగమన వారసత్వం – ‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’ లేదా ‘కాశ్మీర్ తూఫాన్ మేఁ’ అనే ఈ డాక్యుమెంటరీలో బాగా వ్యక్తమైంది. పిడబ్ల్యూ ఎ మరియు ఐపిటిఎ లతో సంబంధం ఉన్న కొందరు రంగస్థల కళాకారులు, సినీనిర్మాతలు, రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. ‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’ ను ఇండియా ఆర్ట్ థియేటర్స్ లిమిటెడ్ నిర్మించగా, ప్రఖ్యాత ఫిల్మ్ అకడమీషియన్, పలు సినీ గ్రంథాల రచయిత అయిన బి.డి. గర్గ్ దర్శకత్వం వహించారు. పురోగమన సంప్రదాయాలను అనుసరించి – ఐపిటిఎ కళాకారులతో పాటు ఈ డాక్యుమెంటరీలో స్థానికులను నటింపజేశారు. ఐపిటిఎ కి చెందిన నటి అచలా సచ్‍దేవ్ ఈ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్ర పోషించారు. మూల కథాంశాన్ని ప్రసిద్ధ రచయిత రాజీందర్ సింగ్ బేడీ అందించారు.
ఈ డాక్యుమెంటరీ టైటిల్‍కి ప్రేరణ – సోవియట్ వారి మూకీ సినిమాలలో ప్రసిద్ధమైన ‘స్టార్మ్ ఓవర్ ఆసియా’ (1928) అని అంటారు. ‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’ ను ఒక డాక్యుమెంటరీగా పేర్కొన్నప్పటికీ, ఫిల్మ్ లోని అధిక భాగం కథాత్మకమై, – శత్రుమూకల దాడిలో ఇబ్బందులు ఎదుర్కున్న సామాన్య కాశ్మీరులను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా – మొత్తం కాశ్మీరుకు వర్తించేలా చెప్పబడింది.
ఈ ఫిల్మ్ – సరిహద్దులు దాటి వచ్చి దాడులు చేసిన దుండగుల దుశ్చర్యలను షబ్బో అనే కాశ్మీరీ మహిళ చూపించడంతో ప్రారంభం అవుతుంది. తన శిశువును కోల్పోయిన షబ్బో – శిధిలాల మధ్య రోదిస్తూ ఉండడంతో ఫిల్మ్ మొదలవుతుంది. ‘మరణం, విధ్వంసం; విద్వేషం, భయం – ఇవీ పాకిస్తాన్ నుంచి వచ్చిన దుండగులు కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన కానుకలు’ అంటూ వ్యాఖ్యానం వినిపిస్తుంది. తర్వాత ఫిల్మ్ – ఫ్లాష్‌బాక్‍లోకి వెళ్ళి – కాశ్మీరులోని అందమైన గ్రామీణ దృశ్యాలను చూపిస్తుంది. కాశ్మీరీ కార్మిక కర్షకుల పోరాటాలను ప్రస్తావించి – షేక్ అబ్దుల్లాను విప్లవ నాయకుడిగా ప్రస్తుతిస్తుంది.
గ్రామంలోకి షేక్ అబ్దుల్లా రాక – ఉత్సాహాన్నిస్తుంది. తమ కష్టాలు తీరబోతున్నాయన్న ఆశ కలుగుతుంది. ప్రజా ప్రభుత్వం కోసం, రైతులకు సంస్కరణల కోసం ఒక ఉద్యమం ప్రారంభమవుతుంది. సైప్రస్ చెట్ల నీడలో కూర్చుని నాయకుడి ఉపన్యాసం వింటూ ఉంటుంది షబ్బో. కొత్త జీవితం కావాలంటే నిరాశ పడకూడదని, తాము అధికారంలోకి రావాలని, అప్పుడే వారు విజయం సాధిస్తారని నాయకుడు చెప్తాడు. అప్పట్లో లోయలోని రైతులు ఎంతో నష్టపోయి ఉంటారు, తమ తలరాత ఇంక మారదేమోనని అనుకుంటారు. ఆ సమయంలో ‘షేర్-ఎ-కాశ్మీర్’గా పేరు పొందిన నేతతో నడిస్తే తమ బ్రతుకులు బాగుపడతాయని రైతులు విశ్వసిస్తారు.
అయితే గ్రామంలోని శాంతియుత జీవనం – ముష్కర మూకల దాడుల వల్ల భగ్నమవుతుంది. దుండగుల దాడులు, మొత్తం గ్రామం శిధిలాలుగా మారటం చూపిస్తారు. తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు దుండగులను ఎదిరించిన దృశ్యాలు వస్తాయి. శ్రామికులు, బాలసేన, మహిళాసేనలు – చేతిలో బ్యానర్లు పట్టుకుని కవాతు చేసే సన్నివేశాలు వస్తాయి. ‘కాశ్మీరు మృతవీరులు వర్ధిల్లాలి’, ‘సిల్క్ వీవింగ్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్, రాజ్ బాగ్’, ‘మా మాతృభూమిని మా చిన్నారుల రక్తంతో కాపాడుకుంటాం’ వంటి నినాదాలు రాసుంటాయి ఆ బ్యానర్లలో. మృత వీరులకు అంజలి ఘటిస్తున్న షేక్ అబ్దుల్లా చిత్రాలు కనబడతాయి. షేక్ అబ్దుల్లా, నెహ్రూలను తెరమీద చూపిస్తూ – సామ్యవాదం పరిధిలో స్వేచ్ఛను, విశ్వాసాన్ని పొందుతామని వ్యాఖ్యనం వినిపిస్తుంది.
‘రేపటి కాశ్మీరు నేడు రూపొందుతోంది. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ తమవంతు పాత్ర పోషిస్తారు. కాశ్మీరు ప్రజలకు తమ ఆత్మ లభించింది. వంగిన వీపులు ఇకపై వంగవు, పేదరికం కారణంగా వాలిన కన్నులు వెలుగును ప్రసరిస్తాయి. పురాతన విద్వేషాలు సమసిపోయాయి. కార్మికులు, కర్షకులు, మేధావుల మధ్య కొత్త స్నేహం వికసించింది. స్వేచ్ఛ తన మూలాలను గుర్తిస్తోంది. అవును, శిధిలాల గుట్ట నుంచి కొత్త కాశ్మీర్ ఆవిర్భవిస్తుంది. ఇది షబ్బో కన్న కల. ఆమె కొడుకు మరణించి ఉండచ్చు, కాని లక్షలాది ఇతర కాశ్మీరీ పుత్రులు కొత్తగా పొందిన స్వేచ్ఛని కాపాడుతారు, వాళ్ళ సారవంతమైన భూములు, గొప్ప పంటని అందిస్తాయి. భయానకమైన అధ్యాయం ముగిసింది. కొత్త కాలం మొదలయింది’ అని వ్యాఖ్యానం ముగుస్తుంది.”
***
అయితే ఈ డాక్యుమెంటరీ – కాశ్మీరు భారత్‍లో – షరతులతో విలీనమవడం గురించిన ప్రస్తావన లేదు. బదులుగా కాశ్మీరు యొక్క గతాన్ని, వర్తమానాన్ని – సోషలిస్ట్ ఇండియా భవిష్యత్తుతో – మేళవించారు.
నటి అచలా సచ్‍దేవ్:
ప్రఖ్యాత హిందీ నటి అచలా సచ్‍దేవ్ 3 మే 1926 నాడు నేటి పాకిస్తాన్ లోని ఫైసలాబాద్‍లో జన్మించారు. బి.ఆర్. చోప్రా గారి ‘వక్త్’ సినిమాలో బల్‍రాజ్ సహ్నీ భార్యగా నటించిన పాత్ర చాలా మంది ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.
కాశ్మీర్‍లోని కొంత భాగం ఆక్రమణకి గురయినప్పుడు అక్కడికి విమానంలో వెళ్ళిన తొలి మహిళ అచలా సహదేవ్. అక్కడ ఆమె మన సైనికుల కోసం నాటకాలు ప్రదర్శించారు.
అచల సుప్రసిద్ధ రంగస్థల నటి. రేడియో ఆర్టిస్ట్. రచయిత్రి. దేశ విభజన అనంతరం ఆమె రంగస్థలానికి ప్రాధాన్యతనిచ్చి, ఐపిటిఎ నాటకాలలో నటించారు. ఆమె 1948లో బి. డి. గర్గ్ దర్శకత్వం వహించిన ‘స్టార్మ్ ఓవర్ కాశ్మీర్’ అనే డాక్యుమెంటరీలో నటించారు. తరువాత ‘కాశ్మీర్’ (1951), ‘జలియన్‍వాలా బాగ్’ అనే సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అయితే విధి మరోలా తలచింది, ఆమె కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటించాకా, సహాయక పాత్రలకు మళ్ళవలసి వచ్చింది. సహాయక పాత్రలలో దాదాపు 130 సినిమాల్లో నటించారు. ఆమె ఎక్కువగా యశ్ చోప్రా గారి సినిమాలలో కనబడేవారు. ‘చాందిని’లో ముఖ్యపాత్రలో నటించారు, ‘దిల్‍వాలే దుల్హనియా లే జాయెంగె’ సినిమాలో కాజల్ నాయనమ్మ పాత్ర పోషించారు. ఆమె చివరిగా నటించిన సినిమా హృతిక్ రోషన్, ఈషా డియోల్ నటించిన ‘నా తుమ్ జానే నా హమ్ జానే’ .
క్లిఫ్ఫోర్డ్ డగ్లస్ పీటర్స్‌ని వివాహం చేసుకుని – అచల పూనెలో నివాసం ఏర్పర్చుకున్నారు. ఆ రోజుల్లో ఆయనకి పూనెలోని భోసారి ఇండస్ట్రియల్ ఏరియాలో ‘మోరిస్ ఎలెక్ట్రాన్సిక్స్’ అనే ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ డియోడ్స్ వంటి చిన్న ఎలెక్ట్రానిక్ విడి భాగాలను తయారు చేసేవారు. తర్వాతి రోజుల్లో ఈ ఫ్యాక్టరీని పిరామల్ గ్రూప్ కొనుగోలు చేసింది. పీటర్స్‌కీ, అచలకీ పరిచయం కూడా సినిమా ఫక్కీలోనే జరిగింది. బొంబాయిలో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా యశ్ చోప్రా – పీటర్స్‌ని అచలకి పరిచయం చేశారట. అప్పటికే పీటర్స్ భార్య చనిపోయారు. అచల కూడా భర్త నుండి విడాకులు తీసుకున్నారు. వాళ్ళ పరిచయం పెరిగి, పెళ్ళి చేసుకున్నారు. మెకానికల్ ఇంజనీర్ అయిన పీటర్స్‌కి భోసారిలో ఫ్యాక్టరీ ఉంది. ఈ దంపతులు కొన్నాళ్ళ పాటు అదే ప్రాంతంలోని ఓ భవనంలో నివసించారు, అనంతరం హదాప్సర్ ప్రాంతానికి మారారు. సినిమాల్లో నటించడం కొనసాగించమని పీటర్స్ అచలని ప్రోత్సహించారు.
పీటర్స్ చనిపోయాకా, అచల ఒంటరి జీవితం కొనసాగించారు. క్రానిక్ బ్రాంకైటీస్ ఆస్తమా పేషంట్ అయిన అచల పూనా క్లబ్ సమీపంలోని తన ఇంట్లో దాదాపు పదేళ్ళు ఒంటరిగా నివసించారు. ఆమె జన్‍సేవా ఫౌండేషన్ అనే సంస్థకు – అచలా సచ్‍దేవ్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే విద్యాసంస్థను స్థాపించేందుకు విరాళమిచ్చారు. జన్‍సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఓ సహాయకుడు రాత్రి పూట అచలకి సహాయంగా ఉండేవాడు. ఈ సంస్థ గిరిజన ప్రాంతాలలోని వారికి ఆసుపత్రులు, రోగుల సంరక్షణ అంశాలలో శిక్షణనిస్తుంది. అచల ఎక్కువ సమయం ధ్యానంలోనూ, ధ్యానానికి సంబంధించిన సంగీతం, బోధనలు వింటూ కాలం గడిపేవారు. తను చనిపోవడానికి ఐదు సంవత్సరాల ముందు పూనె లోని తన ఫ్లాట్‍ని ఆమె జన్‍సేవా ఫౌండేషన్‍కు రాసి ఇచ్చేసారు, తను బ్రతికినంత కాలం తనని చూసుకోవాలనే షరతు మీద.
8 సెప్టెంబర్ 2011 నాడు అచల – మంచినీళ్ళు తాగేందుకు వంటగదిలోకి వెళ్ళి అక్కడ కాలు జారి పడిపోయారు. తొడఎముక విరిగి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఆమెను పూనా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‍లో చేర్పించారు. కాని కొద్ది రోజులకే పంపేశారు. అయితే మెడదులో రక్తం గడ్డకట్టడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకి కాళ్ళూచేతులు పడిపోయి, పక్షవాతం వచ్చింది. అచలకు మొదటి భర్త ద్వారా జన్మించిన కుమారుడు జ్యోతిన్ – చిన్నప్పటి నుండే తల్లికి దూరంగా విదేశాలలో చదువుకుని, అక్కడే స్థిరపడ్డాడు. 2006లో తన మనవరాలి వివాహం సందర్భంగా అచల అమెరికా వెళ్ళారు. అయితే ఆమె కుమారుడు మాత్రం ఇండియాకి వచ్చింది తక్కువే, ఎక్కువగా తల్లితో ఫోన్‍లోనే మాట్లాడేవాడు. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది, బొంబాయిలో ఉంటుంది, కానీ ఆమె తల్లితో సంబంధం కొనసాగించినట్టు లేదు.
అచల 30 ఏప్రిల్ 2012 నాడు మృతి చెందారు.