కుసుమ వేదన-12

0
3

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

తృతీయాశ్వాసము – ఆరవ భాగము

ఉ.॥
ఆయనురాగ సంగమము నందున మున్గిన క్రొత్త జంటకున్
ఏ యపరాధ భావనలు యీ ధరమందున గానుపించదే
ఏ యవరోధముల్ జనక యీ నవజంటను పొందె సౌఖ్యముల్
కాయము రెండునున్ కరగి కాముని పున్నమి నన్ చరించదే. (209)

చం.॥
పగలును రేయినింక పనిబాటల యందున యా గమించకన్
సెగలను కక్కుచుండు బ్రియ చెక్కిలి నొక్కగ నుత్సహించెడిన్
వగలును చిందు నా సఖియ వాంఛలు దీర్చగ రేయి నంతయున్
బిగియగు కౌగిలిన్ బరసి బ్రేమను గట్టిగ నట్టి వేళలన్. (210)

చం.॥
బనియును బాట లేక గృహభాగము నందు బరుండి యుండి; యా
వనితను మాటలన్ మరపి వాటును వేయుచు కాలమంతయున్
గొనియెను బాలరాజపుడు గొప్ప సుఖంబుల బొందెనత్తరిన్
కనుగొని తల్లిదండ్రియును కాలము గాయని మిన్నకుండగన్. (211)

శీతాకాలంబున కుసుమ:

తే.గీ.॥
కొన్ని మాసంబులును యట్లు గొప్పగాను
సుఖము నందుచు సంసార సౌఖ్యమబ్బ
అంత మోహంపు మైకంబు కరగిపోగ
వాస్తవంబును గ్రహియించె వైన యొప్ప. (212)

తే.గీ.॥
అపుడు శీతల కాలంబు నాగమించ
చలికి వడకుచు నప్పుడు చంచలాక్షి
మగని దేహంబు బిగియార మరువకుండ
కౌగిలించెను జలి చేత కామితాంగి. (213)

తే.గీ.॥
బాలరాజును యా వేళ బలిమి మీర
గట్టి బంధము వైచెను; గాఢమైన
కౌగిలింతను బంధించె కాముకతను
ఇట్టి చలియును వీరికి యెట్లు చేరు. (214)

చం.॥
శునకపు జాతి సంఘములు సృక్కిన కాయము గాసి దీర్చ; యా
పనికి నుపక్రమించ తరుబాదుల ముంగిట గొయ్యి త్రవ్వియున్
కనకపు పీఠమంచు తన కాళ్ళను యందున బారజాపి; యుం
దనదగు దేహమున్ నిలిపి దద్దిన మంతయు నట్లు బండదే. (215)

చం.॥
ఎముకలు గొర్కు చల్లదమనమీ దినమంతయు ముంచివేయగన్
సుముఖత జూపియున్ మగని సొచ్చుక బోయి శరీరమంతయున్
విముఖత జూపకన్ విభుని విన్యస మంతయు జూసినప్పుడున్
సమయము మించిపోవునని చయ్యన ముందుకు సాగెనంతటన్. (216)

చం.॥
చలిచలి వేళలన్ కుసుమ చయ్యన చెక్కిలి దాచుకొంచు; యా
మలిమలి సంజలన్ మలిన మైనటువంటి గృహంబు నంతటిన్
చలనను నిచ్చు చీపురును చయ్యన చేకొని నూడ్చు నత్తరిన్
మలినము బార దోలియును మానక నీళ్ళను జల్లెనీ ధరన్. (217)

ఉ.॥
ఈ కుసుమాంబ వేకువపు వేళల పేడల నీళ్ళు జేర్చి; యా
వాకిలి ముందరన్ కలిపి వైనము తోడుత జల్లె కళ్ళపిన్
ప్రాకటమైన రీతి చిరు బాదుల బూచిన పుష్పగుచ్ఛముల్
చేకొని యందమైనవగు చిన్నగు ముగుల సీమలందునన్. (218)

ఉ.॥
చక్కని రంగులన్ గలిపి చాలగ నింపిన ముగ్గు పాత్ర; చే
జిక్కెడి రంగువల్లులను చేసెను; యక్కడ నుండు వారలున్
మిక్కిలి రీతిగన్ మనసు మేనును మర్చియు విస్తుబోవ; యా
దిక్కున నున్న వారలకు దేవత మారుగ గన్పడెన్ ధరన్. (219)

ఉ.॥
వర్షములాగి నంతటనె వాలుగ బైరులు బచ్చ నుండగన్
కర్షక సంఘముల్ పొలము కన్నుల కింపుగ తీర్చిదిద్దగన్
అర్ష కుటుంబ మందునిది నాదిగ సంభవమవ్వు గాథ; ని
ష్కర్షగ శీతకాలమున శక్యమె శ్యామలమైన పంటలన్. (220)

తే.గీ.॥
మెరుపు దీగల స్తంభాలు మెరయుచున్న
యగరు వత్తుల వలె దోచెయట్టి వేళ
తరువులందలి పత్రంబు తడిసిపోయి
మధువు చుక్కల గార్చెను మహిని పైకి. (221)

తే.గీ.॥
పాద మర్దన జేకొని పరవశించు
శాద్వలంబులు హిమమందు చంచలించి
తడిసిపోవగ కెంపుల తరగవోలె
మెరిసిపోయెనె నీరెండ మేడ కింద. (222)

గ్రీష్మ ఋతు వర్ణన:

తే.గీ.॥
పనులు పూర్తయ్యె; యే పని పాట లేక
ఏమి చేయను దోచక యెల్లవారు
చెట్ల నీడను చేరిరి చెలిమి తోడ
వివిధ రీతుల క్రియలను వేడ్కతోడ. (223)

తే.గీ.॥
శీతఋతువున కాలంబు చిక్కనయ్యె
గ్రీష్మమున కాల సంపద గెలిచె మిగుల
యిందు చేతనె దివసంబు దీర్ఘమయ్యె
వేడికోర్వక ప్రజలంత వెతలు జెందె. (224)

కం.॥
చండమయూఖుని ధాటికి
ఎండెను కుంటలు చెరువులు ఎల్లలు మీరన్
మండెను పుడమిని సకలము
గుండెల యందున యశేష గుబులును రేపన్. (225)

కం.॥
కొండల మీదుగ వీచుచు
బండల మీదుగ పరుగిడి పదపడి సాగన్
దండిగ పడమటి గాడ్పులు
ఎండకు తోడయ్యె గాదె నేవురు ఏడ్వన్. (226)

చం.॥
జలములు నిండిపోయినవి చైత్రము ముందరి వర్షవేళలన్
కలుషిత నీటిచే కఠిన కర్కశ వ్యాధులు కల్గునీ ధరన్
అలుకగ జేసె కుంటలు జలాశయ; చెర్వులు పాచి వీడి; నా
తెలుపుగ దోచెనే మహిని తేటగ నత్తరి నెండమావులున్. (227)

మ.॥
పడగొట్టన్ ఘనవాయువుల్ కదల నాపాయంబుగన్ దోచగన్
వడగాడ్పున్ భువి మీదుగన్ దొరలగా వాడెన్ మొఖాలున్ మహిన్
వడిగా వచ్చెగదా యిదేటనుచు యా వైనంబు నింపారగన్
యడగన్ బైనము చేసిరీ యవనిపై యా వేళలన్ వేగమే. (228)

సీ॥
మింటికి మంటికిన్ మిగులనే కపుధార
యై సాగె నా వేళ యట్టిగాలి
దృష్టి సాగు మేర దృశ్యంబు ఛిద్రంబు
యవనిలో జనులకు అలుపు మీరె
భువి నుండి దివి మీది కవి లేచి వెదజల్లె
ధూళి దూసర; మంద్ర ధూపమోలె
కండ్ల నిండుగ జేరి కనుపాప పూడెను
మైకమై దూలెనే మహిని మిగుల

తే.గీ.॥
ప్రళయ భీకరమై నట్టి విళయమందు
చిక్కనైనట్టి దుమ్ముతో చెలగు గాలి
వలన యా వేళ ఎర్రటి వాడ వోలె
మారిపోయెను పురమంత మట్టి వలన. (229)

ఉ.॥
ఉదయము నందు సూర్యుడును పూన్చిన తీరుగ సప్తయశ్వముల్
పదపద మంచులోకములు పాలన జేయగ నేగుచుండె; పెం
పొదవెడు చింత చేత భువి పోటుల రీతిగ యెండ కొండలున్
విదలుచు నుండెగా బ్రజలు వీపులు సాపుగ చేయనెంచియున్. (230)

చం.॥
పడమర గాలి చేతబడి పాడయిపోగను పిల్ల తల్లులుం
వడివడి చేరి నీటి కడవందున చేతులు దూర్చి దేహమున్
కడుగుచు సాంత్వనంబుగను గాలిని సాంతము మీరుచుండగన్
విడవడ లేక పిల్లలును వీడక తల్లిని చుట్టుముట్టరే. (231)

ఆ.వె.॥
వేడి గాడ్పు తోడ వేగలేక జనులు
అవని యంతనపుడు నలసిపోయి
ప్రాణులంత నపుడు ప్రాణంబు చేపట్టి
దేవ యేది మాకు దిక్కు యనియె. (232)

తే.గీ.॥
పశువు పక్షి మొదలు గన్ని ప్రాణులంత
బక్క బలచన చేసెను ఉక్కపోత
యిట్టి కాలంబు నెగదోయు టెట్టులంచు
వెదుకసాగిరి బ్రజలంత వేడ్క మీర. (233)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here