మేనల్లుడు-28

0
3

[విమానంలో ప్రయాణిస్తున్న సునీల్ నానమ్మ కైలాసమ్మ తనకి ఊపిరి అందడం లేదని హడావిడి చేస్తుంది. విమానంలోనే చనిపోతే తన శవాన్ని ఎక్కడ విసిరేస్తారో అని భయపడుతుంది. కొడుకులిద్దరినీ అదిలిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి పెద్దావిడని ఇబ్బంది పెడుతున్నామేమో అని నారాయణరావు అంటే, అదేం లేదని, తన పెళ్ళి చూసేంతవరకూ నానమ్మకి ఏమీ కాదని సునీల్ అంటాడు. కాసేపటికి అమృత, సునీల్ వెళ్ళి కైలాసమ్మ పక్కన కూర్చుంటారు. అమృత ఆవిడకి ధైర్యం చెబుతుంది. అమృతని చూసి ఆవిడ మురిసిపోయి, మెచ్చుకుంటుంది. మగపిల్లాడు పుడితే సుబ్బయ్య అని, ఆడపిల్ల అయితే కైలాసమ్మ అని పేరు పెట్టమంటుంది. ఆమె మాటలు విని అంతా నవ్వుకుంటారు. కాసేపాగి – ఆ దొరల దేశంలో పెళ్ళి చేయడానికి శాస్త్రులుగార్లు ఉంటారా?, కొబ్బరి మట్టలు దొరుకుతాయా అని అడుగుతుంది. సునీల్ లేవబోతే, అమృత అక్కడే కూర్చుందాం అంటుంది. మెల్లగా కైలాసమ్మ నిద్రలోకి జారుకుంటుంది. బామ్మ గురించి సునీల్ ఏదో చెప్పబోతే – పసివాళ్ళు, పెద్దవాళ్ళు.. ఒకలాగే ప్రవర్తిస్తారు.. బామ్మగారు ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. తమవాళ్లు గాని, ఎవరైనా సరే.. ఏమీ అనుకోరని అంటుంది అమృత. కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇంతలో సునీల్ ఫోన్‍ తెరిచి తమ మిత్రులు పెళ్ళికి చేస్తున్న ఏర్పాట్ల ఫొటోలు చూపిస్తాడు. సంతోషిస్తుంది అమృత. కానీ అంతలోనే ఆమె ముఖం వాడిపోతుంది. మామూ లేకుండా పెళ్ళి ఏంటి అని, తను ఎంత బాధ పడతాడో అని అంటుంది. నారాయణరావుగారే ఈ విషయాలేవి వివేక్‍కి తెలియకూడదని తన దగ్గర మాట తీసుకున్నారని చెప్తాడు సునీల్. ప్రయాణం కొనసాగుతుంది. – ఇక చదవండి.]

[dropcap]అం[/dropcap]దరూ బోస్టన్‍లో దిగారు. డేవిడ్, రాధిక సంతోషం నిండిన మొహాలతో ఎదురు వచ్చారు. నారాయణరావు కుటుంబానికి, రామచంద్రుడు కుటుంబానికి రాధికని, డేవిడ్‍ని పరిచయం చేశాడు సునీల్.

“సార్!.. సునీల్ అంతా ఫోనులో నాతో చెప్పాడు. గ్రేట్ సార్.. మేనల్లుడు అంటే ఇంత అభిమానం, ప్రేమ మీరు చూపించడం చూసి.. జెలసీ వచ్చింది సార్!.. ఎందుకంటే నాకున్నది ఒక్కగానొక్క మేనమామ.. మీరు చూపించిన ఎఫెక్షన్‍లో నూరో వంతు చూపించడు సార్..” అంది రాధిక.

“రాధికా ఎమోషనల్ అయిపోతున్నావు” అన్నాడు డేవిడ్.

గభాలున అంది రాధిక – “సారీ!.. సార్! వివేక్‍కి మరిచిపోలేని గిఫ్ట్.. జీవితాంతం సంతోషపడేటట్లు చేస్తున్నారు”.

“ఇన్నాళ్ళు నా మేనల్లుడు అనుభవించిన క్షోభ సాధారణమైనదా? నా కోసం గుండెను రాయి చేసుకుని, పైకి మాత్రం మామూలుగా ఉన్నాడు.. మేనమామ కోసం వాడొక్కడే ఏమైనా చేయగలడా?.. అన్నట్లు అల్లుడు గారు చెప్పినట్లు మీరు చేయాలి.. ఎంత మాత్రం నా మేనల్లుడికి ఏది కూడా తెలియకూడదు” అని నారాయణరావు అంటుండగానే

“సార్.. మీకే కాదు.. మాకు కూడా చూడాలని ఉంది.. వివేక్ ఎలా సర్‍ప్రెజ్ అవుతాడో జరుగుతన్నది చూసి..” అని రాధిక అంది.

“నాన్నా!.. మామూ.. ఇది లైట్‍గా తీసుకుంటాడా లేక ఆరోగ్యం బాగోలేని మీరు ఇంత శ్రమ పడి వచ్చినందుకు..” అంది అమృత.

“ఏంటి తల్లీ! నా మేనల్లుడి గురించి నీకు నేను ప్రత్యేకించి చెప్పాలా?.. నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను.. ఇంకేం ప్రశ్నలు వద్దు” అన్నాడు నారాయణరావు.

అందరూ కారుల్లో Hampshire House చేరుకున్నారు.

కైలాసమ్మ చేసిన హడావిడికి, ఆవిడ కబుర్లకి అందరూ ముసిముసిగా నవ్వుకోసాగారు.

***

“ఏంటే!.. సునీల్ పెళ్ళికి రానంటున్నావా? ఒకటికి పదిసార్లు చెప్పాడు.. తాతగారు blessings కావాలి, ఆయన్ని తీసుకుని దివ్యని రమ్మని చెప్పు అని” అంది రాధిక.

“అసలు తను ప్రేమించిన అమ్మాయి ఇండియాలో ఉందని వెళ్లాడు కదా? ఇక్కడ సునీల్ పెళ్ళి జరగడం ఏమిటి?” అంది దివ్య.

ఒక్క నిమిషం షాకై.. “అదీ.. అదీ.. అసలు ఏంటి నీ డౌట్?” అని అడిగి, “అయితే నీకు డౌట్ వచ్చేసిందన్న మాట” అని అంది రాధిక.

“ఆఁ, వచ్చింది. USAలో పెళ్లి.. మరి డౌట్ రాదా?” అంది దివ్య.

“ఆఁ, ఆఁ, అది.. ఫేస్‍బుక్‍లో ప్రొఫైల్ డిలీట్ చేసింది అని సునీల్ చెప్పాడు కదా? తరువాత ఎం.ఎస్. చేయడానికి USA వచ్చింది ఆ అమ్మాయి. అందుకే తాతగారి blessings కావాలంటున్నాడు సునీల్. టైమ్ అయింది పద.. పద.. రండి తాతయ్య గారు” అంది రాధిక.

“తాతయ్యా!.. సూటు వద్దు.. పెళ్ళి కదా?.. అందులోనూ తెలుగు వాళ్ళది.. పట్టుపంచె, లాల్చీ వేసుకోండి” అని దివ్య అంటుండగానే.. “అబ్బబ్బ. ముందు నువ్వు తయారవ్వవే! మంచి పట్టు చీర కట్టుకో.. అన్నట్లు పెళ్ళికూతురిలా తయారవ్వు”

కోపంగా చూసింది దివ్య.

“ఎందుకంత కోపం.. జీవితంలో ఒకసారే ఏ ఆడపిల్ల అయినా పెళ్ళికూతురు అవుతుంది కదా?”

ఉరిమినట్లు చూసి.. “అంత సరదాగా ఉంటే నువ్వు అవ్వు..” అని గభాలున కప్ బోర్ట్ దగ్గరకు వెళ్ళింది దివ్య.

కాసేపటికి అందరూ బయలుదేరారు.

“వివేక్ వస్తాడు కదూ?” సడెన్‍గా అంది దివ్య.

“ఏం రాకూడదా?” అంది రాధిక.

“ఏంటమ్మా అలా అంటుననవు?.. ఫ్రెండ్ మ్యారేజ్‍కి వివేక్ రాకుండా ఎలా ఉంటాడు?.. చాలా మంచి అబ్బాయి” అన్నారు రంగారావుగారు.

“అదే నా బాధ తాతయ్యా.. మంచి అబ్బాయి కాకపోతే వాడి ముఖం వైపు.. కోపంగా ఒక్క చూపు చూసి.. ‘నీలాంటి రాస్కెల్ నిజరూపం ముందు తెలియడం మంచిదయింది’ అని ముఖం మీద అనేసేదానిని. కానీ వివేక్.. మంచోడు.. చాలా మంచోడు.. ఎలా మరిచిపోగలను? కాని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మళ్ళీ ఇప్పుడు..”

“అమ్మా! తల్లీ!.. ఆలోచించింది చాలు!.. వచ్చేసాం.. అటు చూడు.. ఎంత బాగా డెకరేట్ చేశారో చూడు..” అంది రాధిక.

గభాలున చూసింది.

“వావ్!.. ఏంటి!.. మామూలుగా లేదు.. చాలా గ్రాండ్‍గా ఎరేంజ్ చేసారు..” అంది దివ్య.

అందరూ నడుచుకుంటూ లోపలికి అడుగులు వేసారు.

అదొక పెద్ద హాలు!.. హాలు నిండా మనుషులు. వీల్ చైర్‍లో నారాయణరావు గారు ఆత్రుతగా వీధి వైపు చూస్తూ.. “అల్లుడు గారూ!.. నా మేనల్లుడు ఇంకా రాలేదు ఏమిటి?.. ఈపాటికి వచ్చేయాలి కదా?” అన్నాడు.

“కంగారు పడకండి మావయ్యా!.. మ్యారేజ్‍కి గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను.. వచ్చేస్తున్నానురా అని చెప్పాడు” అన్నాడు సునీల్.

అప్పుడే గిఫ్ట్ తీసుకుని లోపలికి వస్తూ.. ‘సునీల్ పెళ్ళి అంటే దివ్య తప్పకుండా వస్తుంది.. ఏమో నేను అలా అనుకుంటున్నాను.. రాకపోతే.. ప్చ్.. ఎంతో ఆశతో దివ్య ఇక్కడికి వస్తే చివరిసారిగా చూడాలన్న ఆలోచనతోనే వచ్చాను.. నేను అనుకోవడం.. నాకు ఎరుదుపడడం ఇష్టం లేక పెళ్ళికి రాకపోవచ్చు.ప్చ్..’ అనుకుని బాధగా కళ్ళు మూసుకుని ‘దివ్యా.. ఒక్కసారి కనిపించు.. నీ మనసు గాయపరిచాను’ అని మనసులో అనుకుంటూ లోపలికి అడుగులు వేసాడు.

వివేక్ ముందు దివ్యా, డా. రంగారావు గారు నడుస్తున్నారు.

ఎదురుగా సునీల్, పక్కన అమృత.. నారాయణరావు కుటుంబం, రామచంద్రుడి కుటుంబం వైపు చూసి.. సునీల్ ప్రక్కనే ఉన్న అమృత వైపు చూసి “ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది” అని అంది దివ్య. “ఆలోచిస్తూ ఉండు.. ఈలోగా సమాధానం దొరకవచ్చు” అంది రాధిక చిరునవ్వుతో.

ఆశ్చర్యంగా “సమాధానం దొరకడం ఏమిటి?” అంది దివ్య.

“ఏంటర్రా!.. ఎక్కడ చూసినా మనుషులే ఉన్నారు. పెళ్ళి చేయడానికి శాస్త్రులు గార్లు కనిపించడం లేదు. కొంపదీసి సుబ్బయ్య పెళ్ళి – పంతులు గారు లేకుండా జరిపిస్తారా ఏమిటి?.. నీ విమానం ఎక్కే సరదా మండిపోను.. ఉచితంగా విమానం టిక్కెట్టులు వియ్యంకుడు తీస్తున్నాడని చంకలెగరేసుకొని దొరల దేశంలో పెళ్ళికి ఒప్పుకున్నావు..” అంది కైలాసమ్మ.

“ఉష్..! అమ్మా!.. అందరూ చూసి నవ్వుకుంటున్నారు.. కాసేపు ఆగు.. పంతులు గారు వస్తారు. ఫోన్ చేస్తే కారు పార్కింగ్ చేస్తున్నాను అన్నారట..” అన్నాడు రామచంద్రుడు.

“నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను రా! పంతులు గారు కారులో రావడం ఏమిటిరా?” అంది కైలాసమ్మ.

“అమ్మా!.. అన్నయ్య చెప్పింది కరక్ట్.. ఇక్కడ ఇంట్లో పని చెయ్యడానికి వచ్చే వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది. ఇక్కడ పంతులు గారి జీతం ఎంతో తెలుసా?.. మన ఊరిలో పెద్ద డాక్టరు సంపాదించేంత సంపాదిస్తాడు” అన్నాడు హరిశ్చంద్రుడు.

“నోరు ముయ్యరా.. అన్న మీద ఈగ వాలనివ్వవు.. పిల్లికి ఎలక సాక్ష్యం..”

“నానమ్మా! కాసేపు సైలెంట్‍గా ఉండలేవా” చిరుకోపంతో అన్నాడు సునీల్.

“నీకు అలానే ఉంటుందిరా!.. ప్రక్కన జామపండు లాంటి అందమైన పెళ్ళాం దొరికిందిగా.. ఈ నాయనమ్మ నీకు వెగటుగానే ఉంటుంది” అంది తెగ బాధపడుతూ.

అప్పటికే దివ్య, రంగారావు, రాధిక – నారాయణరావు కుటుంబం దగ్గరికి వచ్చేసారు.

“మావయ్య గారు! నా ఫ్రెండ్స్.. దివ్య, రాధిక.. దివ్య వాళ్ళ తాతయ్య గారు డా. రంగారావు గారు” అని పరిచయం చేసాడు సునీల్.

“నమస్కారం డాక్టరు గారు!.. ఇలా రా తల్లీ” అని నారాయణరావు అనగానే ఆశ్చర్యంగా రాధిక వైపు చూసి అడుగులు వేసింది దివ్య.

అభిమానంగా, దీవించినట్లు తల మీద చెయ్యి ఆన్చి, “నేను గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా.. నా మేనల్లుడు.. వివేకానందుడంత గొప్ప మనిషి. వాడి మనసును దోచుకున్న నువ్వు చాలా అదృష్టవంతురాలివి..” అంటూ, “ఏమే సుమిత్రా.. శారదా.. ఇటు చూడండి.. అమ్మాయి డాక్టరయినా ఆ కట్టూబొట్టూ.. అందం.. అన్నీ చూడగానే నా మేనల్లుడు..” అని నారాయణరావు అంటుండగానే సుమిత్ర, శారద సంతోషంగా దివ్య దగ్గరకు వచ్చారు.

ఆశ్చర్యంగా, కంగారుగా దివ్య చూసేంతలో.. అప్పటికే గిఫ్ట్ ప్యాకెట్టుతో.. అక్కడికి వచ్చిన వివేక్.. నారాయణరావు దగ్గరకు వచ్చి.. గట్టిగా పట్టుకుని “ఏమిటి మావయ్యా ఇది?.. మీరు ఎలా వచ్చారు?.. ఇంత ప్రయాణం ఎలా చేసారు?” అని సునీల్ పక్కనే ఉన్న అమృతని చూసి, “అమ్మూ! నీక్కూడా ఈ వి.వీ. దగ్గర సీక్రెట్స్ ఉన్నాయా?.. సునీల్.. నువ్వు.. అమృత.. అంతా కన్‍ప్యూజింగ్‍గా ఉంది” అని అన్నాడు.

“సీక్రెట్స్  నీకే ఉంటాయా ‘మామూ’? దివ్యని ప్రేమించినా మనసులో దాచుకొని ఎంత బాధపడ్డావు?” అని అమృత అంటుండగానే నారాయణరావు అన్నాడు –

“వివేక్ బాబూ!.. జీవితంలో మనిషి ఇతరుల కోసం.. శ్రేయోభిలాషుల కోసం.. తన వాళ్ళ కోసం.. ఎటువంటి త్యాగం అయినా చేయవచ్చు..

కానీ మనసా, వాచా ప్రేమించినవాళ్లని.. త్యాగం చేయడం ఏమిటి?.. నీ ప్రేమని త్యాగం చేస్తున్నాను అని అనుకున్నావు గాని.. నీ జీవితాన్నే త్యాగం చేసానని, నువ్వు బ్రతికి ఉన్నంత వరకూ బాధపడేవాడివి.

ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉన్నప్పుడే వాళ్ళ జీవితం.. సంతోషంగా సాగుతుంది.. నా కూతురు.. కూడా నీలాగే తన ప్రేమను త్యాగం చేసింది..

మీరిద్దరూ కూడా.. రేపో మాపో పోయే నా కోసం మనస్ఫూర్తిగా ప్రేమించిన మీ వాళ్ళని వదులుకోవడం నాకేం నచ్చలేదు.

శరీరానికి బాధ కలిగితే బాధ తగ్గడానికి ఏ నొప్పి మాత్రో వేస్తే.. బాధ తగ్గి ఉపశమనం కలుగుతుంది.

కానీ మీ మనసుల నిండా నిండి ఉన్న ప్రేమకి ఎటువంటి మాత్ర పని చేయదు..

ఇద్దరి ప్రేమ స్వచ్ఛమైనది, పవిత్రమైనది అయితే.. ఎవరిని ఎదిరించైనా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి!

కాలక్షేపానికి ప్రేమించే వాళ్ల గురించి నేను చెప్పడం లేదు వివేక్ బాబూ! మీ ఇద్దరి త్యాగాల వెనుక మీరెంత బాధపడ్డారో నేను ఊహించగలను.

నువ్వు పడ్డ బాధకి ఉపశమనం కలిగించడానికి.. ఇదిగో నీ ప్రేమకి దూరం అయి ఇన్నాళ్ళు మానసిక క్షోభని అనుభవించిన నా చిన్న కూతురు, బంగారు తల్లి దివ్యని కలపడానికి, మేమందరం ఇక్కడికి వచ్చాం! ఈ విషయంలో అల్లుడు గారు నేను చెప్పినట్లే ఎరేంజ్‍మెంట్స్ అన్నీ చేసారు. వివేక్ బాబూ! అల్లుడు గారు.. చాలా మంచి వ్యక్తి.. నేను ఎలాంటి అల్లుడు కావాలనుకున్నానో.. అంతకు పది రెట్లు మంచి మనిషిని అల్లుడిగా ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు” అన్నాడు నారాయణరావు.

జరుగుతున్నది కలా? నిజమా? అన్నట్లు ఉంది దివ్య పరిస్థితి.. సంతోషంగా దివ్య భుజం మీద చేయి వేసారు డా. రంగారావు.

“అసలు ఇలా.. ఎలా జరిగింది అమ్మూ.. మావయ్యకి..” అని వివేక్ అంటుండగానే.. గబగబా దగ్గరకు వచ్చి వివేక్ చెయ్యి పట్టుకొని..

“మామూ!.. నేను బాధపడుతున్నప్పుడల్లా నువ్వు ఒక మాట అనేవాడివి.. ‘మావయ్యను బ్రతికించుకోవడం కోసం.. మనం ఈ ఎంగేజ్‍మెంట్‌కి అంగీకరించాలి.. ఇక పెళ్ళి అంటావా? మనకి కనిపించని విధి.. ఎన్నో అద్భుతాలు చేస్తుంటుంది.. ఏం జరుగుతుందో చూద్దాం అన్నావు’. ఆ విధే.. నాన్నకి నిజం తెలిసేలా చేసింది..” అంది అమృత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here