[dropcap]దే[/dropcap]శ చరిత్రలో ఘనత వహించిన కొందరు మహనీయుల ఆత్మకథలను సంచిక పాఠకులకు అందించే క్రమంలో భాగంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.
డాక్టర్ హెచ్.నరసింహయ్య (1921-2005) కర్ణాటక రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, హేతువాది, సున్నిత మనస్కులు, మానవతావాది మరియు నిరాడంబరులు. వీరు పెక్కు పురస్కారాలతో పాటు 1984లో పద్మభూషణ పురస్కారాన్ని పొందారు. బెంగళూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సేవలను అందించారు. కర్ణాటక రాష్ట్ర విధానమండలి సభ్యుడుగా కూడా వ్యవహరించారు. వీరు తమ ఆత్మకథను కన్నడ భాషలో ‘హోరాటదహాది’ అనే పేరుతో 1990వ దశకంలో సుధా వారపత్రికలో ధారావాహికగా ప్రకటించారు. తరువాత ఇది పుస్తకరూపంలో వెలువడి ఐదు సార్లు పునర్ముద్రింపబడింది. ఈ ఆత్మకథకు కర్ణాటక సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
వీరి ఆత్మకథను ‘పోరాట పథం’ పేరుతో అనువదించారు మురళీమోహన్. ఇది వారి తొలి బృహత్ అనువాదం. ఈ అనువాదం 90-95 శాతం యథాతథ అనువాదం కాగా మిగిలిన 5-10 శాతం అనువాదకునిగా కొంత స్వేచ్ఛ తీసుకుని మూల రచయిత భావాలకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అనువదించారు.
***
ఈ ఆత్మకథ మొదటి అధ్యాయంలోని ఒక పేరా:
“దెయ్యాలు, పూనకం రావడం, పిల్లి అడ్డంగా పోవడం, కుడివైపు లేవడం మొదలైన నమ్మకాల గురించి మేము చర్చ చేసేవాళ్ళం. ఆ వయసులోనే నాకు ఇవన్నీ నిజం కాదనే భావన ఉండేది. ఆ కాలంలో (ఇప్పుడు కూడా కొంత మట్టుకు) పిల్లి అడ్డంగా వెళ్తే, విధవ, కట్టెలమోపు, ఒంటి బ్రాహ్మణుడు ఎదురైతే అశుభమని నమ్మకం ఉండేది. ఇలాంటి నమ్మకాలకు అంతూ పొంతూ ఉండేది కాదు. పిల్లి అడ్డంగా వెళితే అనుకున్న పని నెరవేరదని వెనక్కు మళ్ళేవారు లేదా కాస్సేపు కూర్చొని మళ్ళీ బయలుదేరేవారు. ఎవరైనా సరే (హిందువులు) ఎడమవైపు నుండి లేచేవారు కాదు. అకస్మాత్తుగా లేస్తే మళ్ళీ పడుకొని కుడివైపు లేచేవారు. ఇప్పటికీ కుడివైపు లేవడమే వాడుక. నేను రెండు సంవత్సరాల క్రిందట ఒక హైస్కూలు విద్యార్థుల కార్యక్రమంలో భాగం వహించాను. నా ప్రసంగం అయిన తరువాత మీరంతా ప్రొద్దున ఏవైపు నుండి లేస్తారు? అనే ప్రశ్నకు కుడివైపునుండి అని మూకుమ్మడిగా సమాధానం వచ్చింది. ఎడమవైపు లేస్తే ఏమవుతుంది? అని అడిగాను. దానికి ఒక చిన్న విద్యార్థిని “అమ్మ వచ్చి లెంపలు వాయించి నన్ను మళ్ళీ పడుకోబెట్టి కుడివైపు నుండి లేపుతుంది” అని చెప్పింది.”
***
పాఠకులు ఈ అనువాదాన్ని చదివి ఆదరించగలరని విశ్వసిస్తున్నాము. పాఠకులను ఈ ‘పోరాట పథం’ అలరిస్తుందని ఆశిస్తున్నాము.
సంచిక పాఠకుల కోసం వచ్చే వారం నుండి ధారావాహికగా అందిస్తున్నాము.
సంచిక టీమ్