[dropcap]నా[/dropcap]న్నగారిచ్చిన ఉత్తరాన్ని జేబులో పెట్టుకుని మామయ్య ఊరికి బయలుదేరాను. ఉత్తరం నా చేతుల్లో పెట్టినప్పుడు నాన్న మొహంలో దాచుకున్నా దాగని బాధ, నిస్సహాయతను గమనించాను. మూడు గంటల డొక్కు బస్సు ప్రయాణం తర్వాత బస్సు దిగి బయటకు నడిచాను. వాతావరణం వేడిగా వుంది.
వేసవి మొదలయిందని అర్థం అయ్యింది. పేరుకి తాలూకా సెంటర్, కానీ రోడ్లన్నీ ఛండాలంగా వున్నాయి. ఆటోలో వెళదామని చూసా, కానీ జేబులో వున్న అరాకొర డబ్బులు గుర్తొచ్చి నడక కొనసాగించాను. మామయ్య ఆఫీసు చేరుకొని లోపలకి చూసాను. ముందు వేపు వున్న ఆవరణ నిండా జనాలు. దిగాలు మొహాలతో కొందరు, ఆనందంగా కొందరు అటూ ఇటూ తిరుగుతూ వున్నారు.
దాని తీరు తెన్నులు చూడగానే ఇది గవర్నమెంట్ ఆఫీసు అని చెప్పెయ్యొచ్చు.
నిజం చెప్పాలంటే, నాన్నగారి మాటకు ఎదురు చెప్పలేక మామయ్య వద్దకు బయలుదేరాను. బాగా డబ్బులు సంపాదిస్తున్న ఈ మామయ్య వద్ద చేయి సాచటం నాకా మనసొప్ప లేదు. మాకు పేరుకు దగ్గర వరసయిన మామయ్యే కానీ ఎప్పుడూ గంభీరంగా కనపడుతూ, ఖరీదైన దుస్తులు వేసుకుని వుండే ఇతనంటే నాకే కాదు, చాలా మందికి జంకే.
బయలుదేరే ముందు అమ్మ చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి.
“ఇంటికెళ్ళు.. అత్తయ్యను కలిసి ఈ సంచీ ఇవ్వు. ఇందులో అరిసెలు, చేగోడీలున్నాయి” అని నావైపు ఇబ్బందిగా చూసింది అమ్మ. నేనేం మాట్లాడకుండా అమ్మ వేపు చూసా. నా చూపులో భావం అర్థం చేసుకుని “ఏమీ కాదు.. తీసుకెళ్ళు” అంది.
స్వయంప్రభను చూడాలని బలమైన కోరిక ఉన్నప్పటికీ దాన్నలాగే అణిచేసుకున్నా. ఎలా ఉందో ఇప్పుడు? బహుశా బాగా పొడవుగా ఎదిగి పోయుండొచ్చు. పొడవాటి జడలుండేవి ఆ రోజుల్లో. ఇప్పుడెలాగుందో? బహుశా పోనీ టైల్ వేసుకుంటుండచ్చు.
ఎప్పుడో నేను చిన్నగా వున్నప్పుడు, ఆ తర్వాత తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మరదలు స్వయంప్రభను చూసాను. మామయ్య ఆర్థికంగా ఎదిగిపోయాడు. మేము అలాగే మధ్యతరగతిలో ప్రయాణిస్తూ వుండిపోయాం. వాళ్ళు మా ఊరికి రావటం మానేశారు. రోజులు గడిచే కొద్దీ మామయ్య బాగా డబ్బున్న వాళ్ళల్లో కలిసిపోయాడు.
కానీ ఒక రకంగా చెప్పాలంటే అతని లాగా నేను కూడా పెద్ద అంతస్తుకి ఎదగాలనే కోరిక నా మనసులో బలంగా వుంది. మాకు తెలిసిన మొత్తం కుటుంబాలలో ఖరీదైన పెద్ద కారు, అతి పెద్ద బంగాళా అతనికే వున్నాయి. వాళ్ళింటికి కొన్ని సంవత్సరాల కింద శుభకార్యానికి వెళ్ళాము. అదుగో అప్పుడు చూసాను స్వయంప్రభను. చాలా అందంగా వుందమ్మాయి. వరసకు మరదలు అనగానే నా మనసులో చిన్న కదలిక. తాను కూడా నన్ను చూసుకుంటూ తిరగాడిందే కానీ నాతో మాటలాడలేదు. కానీ ఓరకంటి చూపుల్తో చూస్తుండటం గమనించి కాస్త సంతోషించాను.
ఎవరూ లేని సమయం చూసి తిరిగొచ్చే ఆఖరి రోజు మెల్లిగా అడిగాను “ఏం చదువుతున్నావు” అని.
నన్ను తన కాటుక కళ్ళతో సూటిగా చూసి చెప్పి, “నువ్వూ?” అంది. తనలో అంతులేని ఆత్మనిబ్బరం కనపడింది. బహుశా డబ్బు అంతస్తుతో అది వస్తుందేమో.
అత్తయ్య, మామయ్య పోలికలు కలగలిపినట్లుంది తాను. కాకపోతే వారిద్దరికంటే అందమైనది.
నేను చదువుతున్నది ప్రభుత్వ కాలేజీ కావటంతో కాస్త నెమ్మదిగా చెప్పాను. ఆ విషయం అర్థం కాలేదనుకుంటా అందుకని “ఓహో” అని విని ఊరుకుంది. ఇలా మాట్లాడటం మామయ్య చూస్తే బావుండదేమోనని పక్కకు తప్పుకున్నాను. నేనలా వెళ్లి పోవడానికి కారణం అర్థం కాకపోవటంతో స్వయంప్రభ నా వేపు ఆశ్చర్యంగా చూడటం గమనించాను.
ఇంట్లో విలువైన టేకు ఫర్నిచర్, కార్పెట్లు చూస్తుంటే, ఆ ఇంట్లో నడవాలంటే కూడా కాస్త భయంగా ఉంటుంది.
డబ్బులు విలువ ఆస్తి అంతస్తు ఎలా సంపాదించాడో నాకే కాదు ఎవరికీ అర్థం కాలేదు.
ఆఫీసు మెట్లెక్కి ముందున్న వరండాలో నిలబడి వేడి భరించలేక నుదురు, తల నుండీ కారుతున్న చెమట తుడుచుకున్నాను.
జేబులోనుండీ నాన్న ఇచ్చిన ఉత్తరం తీసి చూసాను. ఏ విషయం రాసారో నాన్న ఇందులో అనుకుని, ఏముంటుంది.. డబ్బులు అప్పుగా ఇవ్వమని రాసి వుంటారు అనే విషయం అర్థం అయ్యి మనసంతా దిగులు నిండి పోయింది. మామయ్యే ఒక్కడే ఎందుకు డబ్బులు సంపాదించడంలో విజయం సాధించాడు? నాన్న ఇంకా మంచి చదువు చదివి కూడా పెద్ద ఉద్యోగం సంపాదించలేదు? నేను కూడా మామయ్య లాగా సంపాదించగలనా? ఈ విధంగా ఆలోచిస్తున్న నన్ను అక్కడున్న ఒక బంట్రోతు చేతితో తట్టి, “ఏం కావాలి.. అలా పక్కకు నిలబడు” అని గదమాయించేసరికి ఈ లోకం లోకి వచ్చి మామయ్య పేరు చెప్పి, నా వరస చెప్పాను. అది విని నాకు వెంటనే నమస్కారం పెట్టి మర్యాదగా లోపలి తీసుకెళ్లాడు.
ఆఫీసు గది చాలా పెద్దగా విశాలంగా వుంది. పెద్ద కుర్చీలో మామయ్య కూర్చుని యేవో ఫైల్స్ మీద సంతకాలు పెడుతూ నా వేపు చూసి కూర్చోమని ఎదురుగా వున్న కుర్చీ వేపు సైగ చేసి చూపించాడు.
అతని చుట్టూ మంది అధికారులు నిలబడి వున్నారు.
నేను అలాగే రెండు గంటలు కూర్చున్న తర్వాత మామయ్య లేచి, వెనకాల వున్న వేరే గదిలోకి తీసుకెళ్లి అక్కడున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని “పనిలో పడి మరిచి పోయాను రా. ఓపికగా కూర్చున్నావు. వెరీ గుడ్. ఏరా రాజు.. అందరూ బావున్నారా?” అని పలకరించాడు. నేను సమాధానం చెప్పి నాన్న ఇచ్చిన ఉత్తరం మామయ్య చేతికిచ్చాను.
రెండు నిమిషాలు అది చదివి పక్కకు పెట్టి “ఏం చదువుతున్నావు, ఎక్కడా?” అడిగాడు.
నేను చెప్పింది విని “అది ఇండియాలో చాలా పేరున్న పెద్ద కాలేజీ, అందులో సీట్ రావడం చాలా కష్టం కద! సీట్ ఎలా వచ్చింది?” ఆశ్చర్యంగా అడిగాడు.
నేనేం మాట్లాడకుండా చిరునవ్వుతో సరి పుచ్చాను. నే చదువుతున్న కాలేజీ వివరాలు విన్న తర్వాత మామయ్య చూపుల్లో తేడా కన్పించింది.
“ఇంటికెళ్లి వచ్చే సమయం లేదు. ఇక్కడే భోంచేద్దాం” అన్న కాసేపటిలో టేబుల్ మీద అన్నీ సర్దేసారు అక్కడ నుంచున్న బంట్రోతులు. నా చేతుల్లో వున్న స్వీట్స్ సంచీని మామయ్య తీసుకున్నాడు కానీ ఇంటికి రమ్మని లేదా వెళ్ళమని చెప్పలేదు.
ఇంతకీ నాన్న అడిగిన డబ్బులు ఇస్తాడో, ఇవ్వడో? అనవసరంగా బస్సుకి డబ్బులు పెట్టాడు నాన్న అనుకున్నాను.
మంచి రుచికరమైన భోజనం చేసాను. ఆఖరున పండ్లు, ఐస్ క్రీం కూడా పెట్టారు. ఇదీ రాజరికం!, ఉద్యోగం అంటే ఇలా ఉండాలి! అనుకున్నాను. మా ఇంటిలో తినే భోజనం గుర్తొచ్చి బాధగా అనిపించింది. ఒకే కూర లేదా పప్పు, పచ్చడితో ముగించటం, ఎప్పుడో నెలకోసారి నాన్న చిన్న స్వీట్ డబ్బా తెస్తే వాటిని అందరం ఎంతో సంతోషంగా, సర్దుకుంటాం.
ఇప్పుడు మామయ్య డబ్బులిస్తే రేపు ఆఖరి సంవత్సరం ఫీజు కట్టగలను. ఇవ్వకపోతే ఎలా అనే ఆదుర్దా నాలోఎక్కువ కాసాగింది.
అసలీ భోజనం పెట్టకుండా డబ్బులిస్తే హాపీగా వెళ్లిపోయే వాడిని.
మళ్ళీ బయటకెళ్ళి మామయ్య పనిలో మునిగి పోయాడు. జేబులో నా పాత సెల్ ఫోన్ మ్రోగసాగింది. “నాన్నా.. చెప్పండి” అన్నాను.
“ఏమైంది.. మామయ్య డబ్బులిచ్చారా?” అవతలి వేపు నుండీ నాన్న కంగారుగా అడిగాడు.
“లేదు. నాన్నా. ఏమీ చెప్పలేదు. గదిలో కూర్చోబెట్టారు. ఇవ్వగానే ఫోన్ చేస్తాను” అన్నాను. సరే అని ఫోన్ పెట్టేసారు నాన్న.
సాయంకాలం వరకూ అలాగే కూర్చోబెట్టాడు మామయ్య. కుర్చీలో అలాగే నిద్రపోయాను. మామయ్య మెల్లిగా వచ్చి తట్టి లేపాడు.
“మొహం కడుక్కో.. కాఫీ తాగి బయలుదేరు” అన్నాడు. అంటే ఇంటికి రావొద్దని చెప్పేసాడనే విషయం అర్థం అయ్యి మనసంతా బాధతో మూలిగింది.
అయితే మధ్య తరగతి జీవితంలో మాకిలాంటి అవమానాలు భరించడం అలవాటైపోయింది. నిజానికి ఎవరి దగ్గర నుండీ ఏమీ ఆశించకుండా ఉండటం కూడా మాకు జీవితం నేర్పించింది.
నీరసంగా కాఫీ తాగి. లేచి నిలబడి “వస్తాను మామయ్యా” అన్నాను.
“ఇదుగో ఈ డబ్బులు జాగ్రత్త, నాన్నకు ఇవ్వు” అని చేతిలోకి ఒక కవర్ ఇచ్చాడు. అది చూడగానే నాకు ఒంట్లో వున్న నీరసం మొత్తం వెళ్లిపోయింది. డబ్బులు అందుకుంటుంటే మా అసహాయతకు నాకు కళ్ళల్లో నీరు తిరుగుతూ వుంది. అవి కనపడకుండా మామయ్య నుండీ మొహం తిప్పుకున్నాను.
“వీలైనంత త్వరలో, నా చదువు అయిపోయి, ఉద్యోగం దొరకగానే మీ డబ్బులు నేను తిరిగి ఇస్తానండి మామయ్య. మీ సహాయాన్ని నేనెప్పుడూ మర్చిపోను” అన్నాను అని రెండు చేతులతో నమస్కరించాను.
ఆ మాటలు వినగానే నా కళ్ళలోకి సూటిగా చూసాడు మామయ్య. ఏదో ఆలోచనలో ఒక క్షణం వుండిపోయాడు.
బెల్ కొట్టి డ్రైవర్‌ను పిలిచి నన్ను బస్సు స్టాండ్‌లో దింపమని చెప్పాడు మామయ్య.
ఖరీదైన కారులో కూర్చుని మామయ్య అంతస్తుని చూసి సంతోషపడ్డాను. బ్రతికితే ఇలా గొప్ప జీవితం గడపాలి. అక్కడున్న అందరూ నే వెళ్తున్న కారుని గొప్పగా చూడటం గమనించి గర్వపడ్డాను. అసలు మామయ్య ఈ సంఘంలో ఎంత పరపతి, మంచి పేరు, గౌరవం సంపాదించాడు. ‘నువ్ గ్రేట్ మామయ్య’ అని అనుకున్నాను.
నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. “డబ్బు జాగ్రత్తరా” అని పెట్టేసారు. నేను త్వరగా పెద్ద ఉద్యోగం సంపాదించి ఈ అప్పులన్నీ తీర్చి, నాన్నకు బరువు తగ్గించాలి అనుకున్నాను.
అసలు మొదటి జీతంలో అమ్మకు మెడలో మంచి గొలుసు చేయించాలి. అది తీసుకెళ్ళి అమ్మ చేతిలో పెట్టినప్పుడు అమ్మకెంత సంతోషంగా ఉంటుందో? మరి నాన్నకేంటి?. ఏమివ్వాలి? ఇలాంటి రకరకాల ఆలోచనలతో బస్సు స్టాండులో కారు దిగాను.
అలాగే నిలబడి, వెళ్లిపోతున్న మామయ్య కారుని చూస్తూ కాసేపు ఉండిపోయాను. స్వయంప్రభ గుర్తొచ్చింది. ఇంటికోసారి వెళ్లి చూడాలనే కోరిక బలవంతంగా అణుచుకున్నాను. ఎప్పుడో, ఎన్నో కోరికలను చంపుకున్నాను. సంఘంలో మంచి స్థాయి, స్తోమత పొందే వరకూ నన్ను నేను అదుపులో ఉంచుకోవాలన్నది నా దృఢ నిశ్చయం.
డబ్బు లేని వాడి భావాలకు, ఇష్టాయిష్టాలకు, మనసుకి పెద్దగా విలువ ఇవ్వక పోవడం చూసాను.
అలా ఆలోచిస్తున్న నాకు.. పక్కనుండి ఎవరో ఒక వ్యక్తి పిలిచినట్లయ్యింది. ఆలోచనల్లో నుండీ బయట పడి తిరిగి చూసాను.
తెల్లని దుస్తులు వేసుకున్న పెద్ద వయస్కుడు నా వేపే చూస్తూ మళ్ళీ అన్నాడు “బాబూ మీదే ఊరు” అని. ఆయనను ఎక్కడో చూసినట్లుగా అనిపించింది.
సమాధానం చెప్పాను. అది విని “ఉదయం మిమ్మల్ని ఆఫీసులో చూసాను, బంట్రోతు మిమ్మల్ని లోపలి తీసుకెళ్లి కూర్చోబెట్టడం” అన్నాడు.
“అవునండీ మా మామయ్యను కలవటానికి వచ్చాను.” అన్నాను మర్యాద పూర్వకంగా నమస్కరించి.
“ఓహో.. ఆయన మీ మామయ్యా బాబూ?” అడిగాడు. అతని గొంతులో ఏదో అర్థం కాని బాధ ధ్వనించింది.
“అవునండీ” అన్నాను ఆయన ముఖ కవళికలను చదువుతూ.
“చాలా గొప్ప వాడు అతను.. నీకు తెలుసా?” నా వంక అదోలా చూస్తూ అన్నాడు.
“తెలుసండీ” అన్నాను సంతోషంగా.
“నేను నా జీవితంలో ఇలాంటి డబ్బు మనిషిని చూడలేదు బాబు” అని కాస్త చిరాకుగా అన్నాడతను.
విషయం కాస్త గంభీరంగా వుందనిపించి నేనేమీ సమాధానం చెప్పకుండా అతడినే చూడసాగాను.
“నువ్వు ఏమీ అనుకోనంటే నీకొక విషయం చెప్తాను” అని ఆగి నా వైపు సందేహంగా చూసాడు.
చెప్పమన్నట్లుగా సైగ చేసాను.
అతని మొహంలో దైన్యం, నిరాశ, దుఃఖం పొంగిపొర్లింది.
“డబ్బు లేనిదే ఏ పని చేయని పరమ దుర్మార్గుడు.. ఛీ ఛీ” అన్నాడు అసహ్యంగా.
ఆ మాట విని తేరుకోలేక పోయాను. గవర్నమెంట్‍లో కొందరు అధికారులు లంచగొండులని తెలుసు. కానీ మామయ్య గురించి ఇతను అన్న తీరు కాస్త షాక్ ఇచ్చింది. నమ్మలేక అలాగే అతడి వేపు చూసాను.
“డబ్బు కక్కుర్తి.. నీచ నికృష్టుడు. ఎదుటి మనిషి రక్తం పీలుస్తాడు. పురుగులు పడి చస్తాడు. దేవుడనే వాడే ఉంటే ఆ సమయం త్వరగా వస్తుంది.” అని తన్నుకొస్తున్న కోపాన్ని అదుపు చేసుకోవటానికి ఆగాడు.
“నిజమా?” అన్నాను ఆశ్చర్యంలో నుండీ కాస్త తేరుకుని.
“అవును బాబు.. ఈ ఊరిలో ఎవరినైనా అడగండి చెప్తారు” అన్నాడు ఊపిరి గట్టిగా పీలుస్తూ.
“మరలాంటప్పుడు మీరు పై అధికారులకు ఈ విషయం తెలియ చేయొచ్చుగా?” అన్నాను.
“వాడు ఈ ప్రాంత మినిస్టర్‍కు కూడా వాటా ఇస్తాడట. ఇక మా మాట ఎవరు వింటారు?” అని కళ్లలోనుండీ ఉబికి వస్తున్న నీటిని ముంజేతి వెనక భాగంతో తుడుచుకుని నిలబడ్డాడు.
ఇంతలో ఒక బస్సు రాగానే మెల్లిగా నడుస్తూ వెళ్లి ఆ బస్సెక్కి కూర్చున్నాడు.
చాలాసేపు అతని బాధను, అసహాయతను మర్చిపోలేక పోయాను. నా కళ్ళ ముందు అతని కన్నీరు, నిస్సహాయ ఉద్రేకం కనపడింది. బలవంతుడిదే రాజ్యం అన్న మాట నిజమే. దేశంలో ఇలాంటి నిస్సహాయ బాధితులు ఎంతమందో? అసలీ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే వారెందుకు లేరు..? అవినీతిని అంతం చేయాలని అందరూ అంటారు, కానీ ఆ శక్తి సామాన్యుడికేది. ప్రతీ ఎలెక్షన్లలో కొత్త ఆశలతో, నాయకుల మీద నమ్మకంతో ఎవరిని ఎన్నుకున్నా సామాన్యుడి జీవితాలలో ఎలాంటి మార్పు రాదెందుకో? దేవుడి మీద భారం వేసి అన్నింటినీ భరిస్తూ జీవితాలను గడిపే వారెందరో? ఇలా ఆలోచిస్తున్న నాకు జేబులో వున్న మామయ్య డబ్బు మీద అసహ్యం, విరక్తి కలగ సాగింది. అవి తీసి చేతిలో పట్టుకుని చూసాను. వాటి నిండా పేదల కన్నీరు, వారి నుండీ పీల్చిన రక్తపు మరకలు కనపడ సాగాయి.
నాలో కోపం, ఆవేశం ఎక్కువ కాసాగాయి. ఆ డబ్బుని మురుక్కాలవలో విసిరి పడేద్దామని అనిపించింది. పాపం ఏడుస్తూ వెళ్లిన ఆ వృద్ధుడికేం అవసరముందో కదా, పోనీ బస్సెక్కి అతనికే ఇస్తే ఎలా ఉంటుంది? లేదా ఆఫీసు కెళ్ళి మామయ్య మొహం మీద ఆ డబ్బు విసిరేద్దామని రెండడులు ముందుకు పడ్డాయి. నో నో.. ఈ డబ్బులు మర్యాదగా మామయ్యకే వెనక్కి వెళ్లి ఇవ్వడం సరి అయిన పని. ఇలా పరి పరి విధాల ఆలోచనలతో సతమతమౌతూ ఆఫీసు వేపు నడిచాను. ఈ పాపపు సొమ్ముతో మంచి జరగదు. మన అవసరాలు, కష్టాలు ఎలాగో పడదాం, పాపాలు చేసి సంపాదించిన మామయ్య డబ్బులు నాకొద్దు అనే నిశ్చయానికొచ్చాను. కష్టాలకు తల వంచి పాపాత్ములతో పాలు పంచుకోకూడదు. నాన్నకు ఫోనే చేసి ఈ విషయాలు చెప్పేద్దాం అనుకుని సెల్ ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాను.
ఇంతలో సెల్ ఫోన్ మోగసాగింది. చూస్తే నాన్న చేస్తున్నారు. గుండె దిటవు చేసుకుని “నాన్నా చెప్పండి” అన్నాను నిస్పృహతో.
“ఇప్పుడే మీ మామయ్య ఫోన్ చేసాడు రా.. నీ ముందు ముందు చదువుల ఖర్చంతా భరిస్తానని మీ అమ్మతో చెప్పాడు. అంతే కాదు, నువ్ బాగా నచ్చావుట. తన ఒక్కగానొక్క కూతురు.. అదేరా స్వయంప్రభను మనింటి కోడలుగా చేసుకోమని అడిగాడు.. నువ్వు అదృష్ట జాతకుడివిరా..” అంటూ చెప్తూ వున్నారు నాన్న.
సంతోషంలో నాకేమీ వినిపించటం లేదు. స్వయంప్రభ గుర్తొచ్చింది. చిరాకు మాయమై పోయింది. మనసంతా ఆనందం నిండిపోయి గంతులు వేయ సాగింది. కళ్ళ ముందు కొత్త బంగారు లోకం పిలుస్తున్నట్లుగా అనిపించింది. ముందుకు పడుతున్న నా అడుగులు ఆగిపోయాయి. చేతుల్లోని డబ్బుని జాగ్రత్తగా జేబులో పెట్టుకుని, నా లోపల నుండీ గొణుగుతున్న అంతరాత్మను బలంగా అణగదొక్కి, వెంటనే వెనక్కి తిరిగి బస్సు స్టాండ్ వేపు నడిచాను.