[dropcap]శ్రీ[/dropcap]నివాస్ చాలా అసహనంగా ఉన్నాడు. అంతే అసహనంగా తన కారుని నడుపుతున్నాడు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న అందమైన భార్య, గారాల ఐదేళ్ళ కూతురు, అత్యాధునిక సొంత డూప్లెక్స్ ఫ్లాట్, మంచి బ్యాంక్ బాలెన్స్ ఇవేవి అతనికిప్పుడు ఆనందాన్ని ఇవ్వటం లేదు. ‘ఎందుకిలా జరిగింది!’ ఇదే ఇప్పుడతన్ని ఎంతగానో వేధిస్తున్న ప్రశ్న. ఇంతలో కారు తన గమ్యం చేరుకుంది.
అది ‘ఇందురవి’ నివాసం. ఇందు సిటీ లోని ప్రముఖ సైకాలజిస్ట్. తన స్కూల్ నేస్తం. ఈ మధ్యనే మళ్ళీ పాత స్నేహితుల సమావేశంలో కలుసుకున్నారు. కాలింగ్ బెల్ నొక్కగానే ఓ డెబ్భై ఏళ్ళ ముసలావిడ తలుపు తెరిచింది. ఆమె ఇందుకి అత్తగారు. తానెవరో శ్రీనివాస్ చెప్పగానే, “రా నాయనా! నువ్వొస్తావని ఇందు చెప్పింది. ఇలా వచ్చి కూర్చో! మా ఇందు ఈ పాటికి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. నేను నీకు టీ తీసుకొని వస్తాను” అని చెప్పి ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది.
శ్రీనివాస్ తల పగిలిపోతోంది. ‘నాలాంటి ఇంత సమర్థత ఉన్న సీనియర్‍ని ఒక్క ఈ-మెయిల్‍తో ఇలా ఉద్యోగంలో నుంచీ తీసేస్తారా! ఇన్నాళ్ళుగా నేను పడిన శ్రమ, సాధించిన విజయాలు మేనేజ్‍మెంట్‌కి గుర్తు రాలేదా? ప్రపంచం మొత్తం మీద ఇలా ఉద్యోగుల తీసివేత వార్తలు వింటూ ఉంటే నాలాంటి వాడికి ఢోకా లేదు అనుకున్నా. కానీ చివరకు నాకు కూడా అదే గతి పట్టింది. ఎందుకిలా జరిగింది!’ అనుకుంటూ క్రుంగిపోతున్నాడు. ఇంతలో అతని చరవాణి మ్రోగింది. భార్య మైథిలి నుండీ కాల్ వచ్చింది.
“ఆఁ! ఏంటి?” అన్నాడు చాలా చిరాగ్గా.
“ఎక్కడున్నావ్? పాప స్కూల్లో ఇవాళ ‘పేరెంట్స్-టీచర్ మీట్’ ఉందని, నిన్ను వెళ్ళమని చెప్పానుగా. ఎప్పుడూ నేనే వెళ్తాను, ఈసారి ఆఫీసులో అర్జెంట్ మీటింగ్స్ వల్ల నాకు కుదరదని నీకు చెప్పాను. మరి వెళ్ళలేదేమి? వాళ్ళ టీచర్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి మీరేవరూ రాలేదేమని నన్ను అడిగారు” అని అంది మైథిలి.
“నాకు కుదరలేదు! అయినా ఉద్యోగం పోయినంత మాత్రాన నాకు వేరే పనులుండవా? ఖాళీగా కూర్చున్నానుకున్నావా? నీ ఆఫీస్ మీటింగ్స్ ఎప్పుడూ ఉండేవేగా! ఈసారి కూడా నువ్వే వెళ్ళవలసింది. తేరగా ఉన్నాడుగా అని నాకు అప్పజెప్పావు. అందరికీ నేనే దొరికాను. నా జీవితంతో ఆడుకుంటుంటున్నారు. అంతా నా ఖర్మ” అని విసుక్కుంటున్న శ్రీనివాస్‍తో, “అవేం మాటలు శ్రీనివాస్. నీవు ఎంత డిప్రెషన్‍లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. అలా స్కూల్‍కి వెళ్ళి వస్తే కాస్త నీ మనసు మారుతుందని నా అలోచన తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు.” అని అంది.
“చాల్లే ఆపు! నీ ఉద్యోగం బాగానే ఉందిగా! హాయిగా చేసుకో! ఈ నంగనాచి మాటలు నా దగ్గర వద్దు” అంటూ ఫోన్ కట్ చేశాడు. భార్య మీద అరిచాడే కానీ తనకీ తెలుసు, తను అనవసరంగా భార్యని నానా మాటలన్నాడని. కానీ ఎంత ఆపుకుందామనుకుంటున్నా ఈ మధ్య ఉద్యోగం పోయిన దగ్గర్నుండీ తన విపరీత కోపాన్ని, ఆలోచనలని అదుపు చేసుకోలేకపోతున్నాడు. ఎక్కడ ప్రయత్నించినా తన హోదాకి, సమర్థతకి తగ్గ ఉద్యోగం మరొకటి దొరక్కపోయే సరికి మరీ అదుపు తప్పి ప్రవర్తిస్తున్నాడు. ఆ విషయం తనకీ తెలిసినా దాన్నుంచీ బయటపడలేకపోతున్నాడు. అందుకే తన మిత్రురాలు, సైకాలజిస్ట్ అయిన ఇందుకి సలహా కోసం ఫోన్ చేస్తే “మా ఇంటికి సాయంత్రం వచ్చేయ్. మాట్లాడుకుందాం” అని చెప్పింది. ఇందూ ఇంకా ఇంటికి రాకపోయేసరికి ముళ్ళ మీద కూర్చున్నట్లుగా అనిపించింది శ్రీనివాస్‍కి. ‘అంతేలే! ఉద్యోగం పోయినవాడంటే అందరికీ అలుసే! ఇంటికి పిలిచి కనీసం టైమ్‍కి వచ్చి స్నేహితుడిని రిసీవ్ చేసుకోలేదు చూడు!’ అంటూ ఇందూ మీద కూడా మనసులో విసుక్కుంటూ కూర్చున్నాడు.
ఇంతలో ఇందూ అత్తగారు ట్రేలో కొన్ని బిస్కెట్లు, టీ కప్పుతో వచ్చి శ్రీనివాస్‍కు అందించింది. టీ త్రాగాక శ్రీనివాస్‍కు కొంచెం ఉపశమనంగా అన్పించింది. “ఆంటీ! ఇందూ రావటానికి ఇంకా సమయం పడుతుందా?” అని మామూలుగా అడిగాడు. “ఆఁ! దానికి ఒక టైమా పాడా! ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తుంది. దాని మొగుడు – అదే మా అబ్బాయి బిజీ కార్డియాలజిస్ట్ కదా! వాడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది దీని పనులతో తిరుగుతూనే ఉంటుంది. భర్త మీద ప్రేమ, గౌరవం ఉంటేగా! అయినా నీ స్నేహితురాలికి అంత పొగరు తగదు అబ్బాయ్! మొన్న మొగుడూ – పెళ్ళాం మధ్యన ఏదో మాటామాటా వచ్చింది. ఇక చివరకు విసిగిపోయి మావాడు దానికి చెంప చెళ్ళుమనిపించాడు. అప్పటికి కానీ దాని తిక్క కుదరలేదు” అంటూ మెటికలు విరిచింది.
ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు శ్రీనివాస్. తన బాధలకి పరిష్కారం కోసం వస్తే, ఇందు మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లుందని అన్పించిందతనికి. ‘అంత పెద్ద డాక్టరు! ఇలా భార్య మీద చెయ్యి చేసుకోవటం ఎక్కడి సభ్యత! పైగా ఈ వెధవ పనికి ఈ ముసలావిడ సపోర్టు’ అని మనసులో అనుకున్నాడు. ఇందూ మీద విపరీతమైన జాలి, ఆమె భర్త మీద, అత్తగారి మీద కోపం, అసహ్యం కలిగాయి ఆ క్షణాన శ్రీనివాస్‍కు. “ఇలా భార్య మీద చేయి చేసుకోవటం చాలా తప్పు!” అన్నాడు ఆవిడతో, ఏదైతే అది అయ్యిందని.
“మరేఁ నాయానా! నీళాగా పెళ్ళాం మీద నోరు పారేసుకోవచ్చునేమో” అంటూ మూతి తిప్పింది ఆవిడ. “ఇందాక నీ భాగోతం వంటింటి దాకా విన్పించిందిలే” అంది. ఒక్కసారిగా ఖంగు తిన్నాడు శ్రీనివాస్. “ఆఁ! అదీ.. నా సమస్య వేరు!” అంటూ నీళ్ళు నమిలాడు. “సమస్యలు ఎవరికి ఉండవు నాయనా? సమస్యలు ఉన్నప్పుడు సంయమనం పాటించటమే మనిషి గొప్పతనం” అని అంది. ఈవిడేనా ఇలా అంటోది అని ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్. “నీ దృష్టిలో భార్యని కొట్టడం తప్పయితే, నా దృష్టిలో అనవసరంగా భార్య మీద నోరు పారేసుకోవటం కూడా తప్పే! మావాడు బంగారం. భార్యని అపురూపంగా చూసుకుంటాడు. మా ఇందు మా ఇంటి మహాలక్ష్మి. ఇందాక చెప్పిందంతా ఉత్తనే అబద్ధం చెప్పాను” అంటూ నవ్వింది. అయోమయంగా బుర్ర గోక్కున్నాడు శ్రీనివాస్. “నీ దృష్టిలో ఒక స్త్రీకి, భార్యకి ఉండే విలువేమిటో తెలుసుకుందామనే అలా అబద్ధం చెప్పాను. ఫరవాలెదే! నేను అనుకున్నదానికంటే నువ్వు మంచివాడేవిఏ” అని అంది.
“చూడు నాయానా! నీ పరిస్థితి ఇందాక ఫోన్‍లో నీ మాటల ద్వారా నాకు అర్థమైంది. ఈమధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు తన ఉద్యోగుల్ని వేలల్లో తీసేస్తున్నాయి. చాలా బాధాకరమే కానీ ఏం చేస్తాం చెప్పు? పోయింది ఉద్యోగమే కానీ జీవితం కాదే! ఉద్యోగం మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ జీవితం చేజారిపోతే తిరిగి పొందడం ఎంత కష్టం! కష్టాల గురించి ఈవిడకేం తెలుసు అని అనుకుంటావేమో! పెళ్ళయి పదహారేళ్ళకే ఒక బిడ్డకు తల్లినై, ప్రమాదవశాత్తు భర్తను కోల్పోయి, ఒక బ్యాంక్‍లో ఆయాగా జీవనోపాధికై చేరాను. అక్కడుండే మహిళా ఉద్యోగులను చూసి స్ఫూర్తి పొంది, వారిలాగా నేనూ చక్కని ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటే, నా బిడ్డను బాగా పెంచగలిగేదాన్నిగా అని అన్పించింది. అక్కడ ఒక మహిళా ఆఫీసర్ ప్రోత్సాహంతో ఆరవ తరగతితో ఆపేసిన నా చదువుని కొనసాగించాలని ప్రైవేటుగా టెన్త్ పరీక్షలకి కట్టి, పొద్దున్నంతా బ్యాంక్‍లో ఆయా పని, ఇంటి దగ్గర బాబును చూసుకుంటూ రాత్రంతా చదివి పదవ తరగతి పాస్ అయ్యాను. అప్పటి నా ఆనందానికి హద్దులు లేవు. ఆయాగా పని చేస్తూనే ప్రైవేటుగా చదువుకుంటూ చివరకు డిగ్రీ పట్టాను కూడా అందుకోగలిగాను. అప్పటి బ్యాంక్ మేనేజర్ నా పట్టుదలను చూసి నాకు బ్యాంక్ పరీక్షలకి కోచింగ్ ఇప్పించారు. ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించి నా బిడ్డను బాగా చదివించాలన్న బలమైన ఆకాంక్ష నాలో జ్వాలగా రగలగా కష్టపడి బ్యాంక్ పరీక్షలకి సిద్ధమైయ్యాను. అదే బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగం సాధించాను. అంచెలంచెలుగా ఎదిగి బ్యాంక్‍లో అసిస్టెంట్ జనరల్ మేనేజరుగా పదవీ విరమణ పొందాను. నా బాబుని మంచి చదువులు చదివించి, గొప్ప డాక్టరును చేయగలిగాను. ఇప్పుడు చెప్పు నాయనా! ఏమీ తెలియని ఒక హదహారేళ్ళ తల్లి, వితంతువుకి ఉన్న కష్టాల కంటే గొప్ప కష్టమా నీది? ఆమె ఎదుటన నాడు ఉన్న సమస్యల కన్నా పెద్దదా నేడు నీ ముందున్న ఈ సమస్య?” అని అడగ్గానే ఏం చెప్పాలో, అసలెలా స్పందించాలో శ్రీనివాస్‍కి అర్థం కాలేదు.
“ప్రతి చిన్న సమస్యకి బెంబేలు పడిపోయే తరంగా మీ తరం తయారవుతోంది! రేపటి మీ పిల్లల్ని, రేపటి తరాన్ని మీరు ఎలా తీర్చిదిద్దగలరు? సమస్యలను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలి. అధైర్య పడకూడదు. సంయమనం కోల్పోకూడదు. జీవితమన్నాకా కష్ట సుఖాలు ఉండవా? గెలుపు ఓటములు ఉండవా? పరీక్ష పోయిందని, ప్రేమ విఫలమైందని , మొగుడు పెళ్ళాం కలహాలని, ఇలా ప్రతి విషయానికి అతిగా స్పందించి విపరీతమైన నిర్ణయాలు తీసుకునే తరంగా మారుతోంది మీ తరం! నేడు మీ తరానికి కావలసిన సదుపాయాలు, అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కావలసిందల్లా సమస్యలతో క్రుంగిపోకుండా ఉండగలిగే ఆత్మస్థైర్యం ఒక్కటే. అది ఒక్కటీ ఉంటే చాలు. జీవితంలో ఒక దారి మూసుకొనిపోతే, మరొకదారి ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని వెతికి పట్టుకో. నీ కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలుస్తావు. అర్థమైందా?” అని ఆవిడ అంటూ ఉండగానే కాలింగ్ బెల్ మ్రోగింది. ఆదరాబాదరగా ఇందు లోపలికి వచ్చింది.
“చాలా సారీ శ్రీనివాస్. లేటయ్యింది!” అంది సంజాయిషీ ఇస్తున్నట్లుగా. “నీవు లేటుగా రావటమే మంచిదయ్యింది. ఆంటీగారి నుండీ ఎంతో స్ఫూర్తిని పొందగలిగే అవకాశం దక్కింది. మన ముందు తరాల వారు కష్టాలని అంత ధైర్యంగా ఎలా ఎదుర్కునే వారో తెలుసా? ప్రతి ఇంట్లోనూ మీ అత్తగారిలాగ దారి చూపించగలిగే పెద్దవారు ఎవరో ఒకరు ఉండేవారు. వాళ్ళ జీవిత పాఠాలని, అనుభవాలని అందించి ఎంత కష్టాన్నైనా ఎదుర్కునే ధైర్యం అందించేవారు. జీవిత సౌరభాన్ని ఆస్వాదించగలిగే మనఃస్థితిని కల్పించగలిగేవారు” అని ఇందుతో అన్నాకా, ఆమె అత్తగారి వైపు తిరిగి “ఆంటీ! నేడు మీరు నాకు అందించిన స్ఫూర్తి ఎంత గొప్పదో నేను మాటల్లో చెప్పలేను. చాలా కృతజ్ఞతలు మీకు. నన్ను దీవించండి” అని ఆమె పాదాలకి మనసారా మ్రొక్కాడు. నిండు మనసుతో సంతోషంగా ఆశీర్వదించిది ఆవిడ.
“నాకన్నా మా అత్తగారే ఎంతో గొప్ప సైకాలజిస్ట్. మనుషులని, మనసులని ఇట్టే స్ఫూర్తితో నింపేయగలరు” అంటూ సంతోషంతో చప్పట్లు కొట్టింది ఇందు.