[dropcap]ఎ[/dropcap]న్నో ఆశలతో – ఎన్నెన్నో కలలతో,
కళకళలాడే వదనాలతో..
కళాశాలలో అడుగిడుతున్న-
విద్యాకుసుమాలు వాడిపోయేలా,
చదువుపై ఆసక్తి అడుగంటేలా,
వణికిస్తున్నదే ర్యాగింగ్ భూతం!!
చదువులతల్లి ప్రాంగణమే-
చాలించే జీవితానికి వేదికైతే,
తన పైస్ధాయిలోని మరో విద్యార్థే,
అందుకు కారణభూతమైతే-
ఆ విషాదాన్ని వర్ణింపతరమా??!!
బిడియం వదలి, అభయం పొంది,
పాత, క్రొత్తల కలయికతో సాగే,
విద్యార్థి అమూల్య జీవితానికి,
ఆత్మీయ సమ్మేళనం లాంటిదే,
దశాబ్దాలుగా సాగుతున్నర్యాగింగ్!!
కాలక్రమేణా గాడితప్పిన ర్యాగింగ్,
విశృంఖలతకు మారుపేరుగా,
వినలేని చేష్టలకు చిరునామాగా,
రూపుదిద్దుకున్న ఫలితమే,
నేడు విగతజీవులవుతున్న,
అమాయక యువతీ యువకులు!!
యాజమాన్యాల అంకితభావం,
ర్యాగింగ్ పట్ల అవగాహన,
పాలకుల కట్టుదిట్ట చర్యలు..
మొదలైన మార్పులతోనే..
విద్యార్థులకు సమాజం అందించే-
అమూల్యమైన భరోసా!!