తిండి గింజలు

23
4

[dropcap]“ఈ[/dropcap] మనుషులు మరీ శాడిస్టులుగా తయారయ్యారు బ్రో.. కాకపొతే మరేంటి..? చక్కగా పొలాల్లో పుట్టి సుఖంగా ఉన్న మనల్ని తెచ్చి ఎండబెట్టి, బాగా ఎండాక పొడి చేస్తారా..? అక్కడితో అయ్యిందా.. లేదు! మళ్ళీ నీళ్లు పోసి తడిపి ముద్ద చేస్తారు. అంతటితో అవుతుందా వీళ్ళ తతంగం.. బాగా నానబెడతారు. అదేదో చపాతీల కర్ర అట.. పెట్టి అదిమి మరీ వెడల్పుగా వత్తేస్తారు. మళ్ళీ పైన మన పొడినే చల్లి పొడి పొడిగా చేస్తారు. మళ్ళీ పొయ్యి మీద పెనం పెట్టి అటూ ఇటూ తిప్పి తిప్పి మరీ కాలుస్తారు. కొంత మందైతే మరీను.. ఆ తిరుగుడు గాళ్ళు.. అదే పొద్దు తిరుగుడు గాళ్ళను పిండి.. వాటి రక్తంతో తడిపి మరీ కాలుస్తారు. ఇంత శాడిస్టులుగా తయారయ్యారు బ్రో.. ఈ మనుషులు..” అంటూ తన ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కుతోంది గోధుమ గింజ తన తోటి గింజతో జుట్టు గింజుకుంటూ..!

“అంతేనా బ్రో.. వీళ్ళు ఇంతటితో ఆగట్లేదు బ్రో.. బాగా కాలాక మన కూరలోళ్లు లేరూ.. వాళ్ళని తెచ్చి ముక్కలు చేసి మరీ వేపుకుని.. మనల్ని తుంచుకుని.. వాళ్ళని నంచుకుని నోట్లో వేసుకుని.. నమిలి నమిలి.. మళ్ళీ ముద్ద చేస్తారు బ్రో.. ఎలా ఉండే వాళ్ళం ఏదో ఏదేదో అయిపోయి.. ఎక్కడికో వెళ్లి పడాల్సొస్తోంది బ్రో..!” అంటూ గొంతు కలిపింది తోటి గోధుమ గింజ.

ఇంతలో.. వడ్ల గింజ లోంచి వచ్చిందో బియ్యపు గింజ..

“మమ్మల్నయితే.. మరీ అంత ఇబ్బంది పెట్టట్లేదోయ్.. చక్కగా చన్నీళ్లతో మొహం కడుగుతారు.. మళ్ళీ వేన్నీళ్ళలో స్నానం చేయిస్తారు.. కాస్సేపు స్నానం చేసాక మళ్ళీ మేము మునుపటిలా నిండుగా తయారవుతాము..

కొందరైతే మాకు పసుపు రంగు వేస్తారు.. కొందరు ఇంకా ఏవేవో రంగులేసి ముస్తాబు చేసి.. టేబుల్ మీద అందంగా సర్దుతారు.. కొందరైతే వెండి గిన్నెల్లో సర్ది.. బంగారు చెంచాలతో నోట్లో వేసుకుంటారు.. తెలుసా..” అంటూ బడాయి పోయింది బాసుమతి.

“సర్లేవోయి.. నీ బడాయి.. ఈ మధ్య మీ వాళ్ళని కూడా మా లాగే నాన బెట్టి, ఎండబెట్టి మరీ పొడి చేసి.. మళ్ళీ తడిపి ముద్ద చేసి.. ఉప్పు, కారం.. కలిపి.. చేత్తో చెడా మడా నాలుగు పీకి పైన.. మీ రక్తమే (రైస్ బ్రాన్ ఆయిల్) పోసి బాగా ఎర్రగా కాల్చి మరీ తింటున్నారటగా.. ఈ మనుషులు?” చెప్పింది కర్ణాటక నుండీ వచ్చిన వార్తతో.. అక్కి రొట్టె గురించి.. గోధుమ గింజ.

“ఆ.. అది వేరే జాతి వాళ్ళ గురించి.. మా బాసుమతి వాళ్లనయితే చాలా రాయల్‌గా ట్రీట్ చేస్తారు.. అఫ్‌కోర్స్.. మేము మంచి సుగంధ సువాసనతో పుడతాం గదా.. మా జాతి వేరే.. మా ట్రీట్మెంటూ వేరే..” అంది బాసుమతి ఏమాత్రం తగ్గకుండా..!

“ఏమోలే.. మేము ఎంత మేలు రకం జాతిలో పుట్టినా.. మాకు మాత్రం ఒకటే రకం.. నరకం ట్రీట్మెంటు..” అని నిట్టూర్చింది గోధుమ గింజ.. ధుమ ధుమ లాడుతూ..

***

“ఇప్పుడే అందిన వార్త.. మన వాళ్ళతో పాటు.. ఆ జొన్న, చన్న వాళ్ళని కూడా కలిపి తీసుకెళుతున్నారట.. ఎక్కడికో ఏమో..?” అంటూ ఆందోళనగా చెప్పింది గోధుమ గింజ తోటి గోధుమ గింజతో.

“అయ్యో! నీకు చెప్పలేదు కదూ.. నిన్న రాత్రి ఆ మానవుడు నీరసంగా.. రసం మాత్రమే తింటున్నాడని.. ఇలా అయితే ఒంట్లో బలం ఉండదనీ.. అదేదో మల్టి గ్రెయిన్ అట్టా అట.. మనతో పాటు ఇంకా మన తోటి జాతి గింజల్ని కలిపి.. కలిపి.. కలిపి..” అని నసుగుతున్న గోధుమ గింజతో..

“ఎహె సరిగ్గా చెప్పి ఏడూ. ఎవరెవరికి మనలాంటి కష్టం రాబోతోందో.. ఏంటో..? కనీసం వాళ్లకి చెప్పి సిద్ధం చేద్దాం” అంది మొదటి గింజ.

“అంతేనా.. మన బతుకింతేనా.. కేవలం రాబోయే కష్టానికి సిద్ధపడ్డమేనా.. మనం ఆ మానవులకి కొంచెమైనా బుద్ధి చెప్పలేమా..? ప్రతీకారం తీర్చుకోలేమా..?” అంటూ ప్రశ్నించింది తోటి గోధుమ గింజ.

“లేకేం? ఆలోచిస్తే తప్పకుండా దొరికి తీరుతుంది.. అన్నట్టు నిన్న ఆ బాసుమతి అన్నది కదా.. రాజులోళ్ళ ఇంట్లో రోజూ.. తనకి గొప్ప ట్రీట్మెంట్ ఉంటుందని. దానికి చెపుదాం.. రాజులోరి కొత్త శాసనాలేవిటో.. అవి మనకు ఎలాంటి చేటు తెచ్చి పెడతాయో? కాస్త ముందే చెపితే.. మన వాళ్ళని కాస్త అప్రమత్తం చెయ్యొచ్చు. అలాగే ఏదైనా ప్రతీకారం ప్లాన్ చెయ్యొచ్చు.”

“దాని మొహం. దానికంత సీను లేదు. దమ్మూ లేదు. ఎందుకంటే రోజూ దాన్ని దమ్ చేస్తారు.”

“దమ్ అంటే?” ఆసక్తిగా అడిగింది తోటి గోధుమ గింజ.

“దమ్ అంటే.. దాంతో పాటు.. కాస్త నోరుండి ఎదురు తిరగ గలిగే కోడి, మేక లాంటి జంతువుల్నే.. చంపి ముక్కలు చేసి మసాలా దట్టించి.. ఆ బాసుమతితో పాటు పెద్ద గంగాళంలో కుక్కి.. మూత చుట్టూ పిండిని” అని.. నాలిక్కరుచుకుంది.. గోధుమ గింజ.

“ఏంటి బ్రో.. అక్కడా పిండి అంటున్నావ్?” అడిగింది గోధుమ గింజ.

“అంటే.. గోధుమ పిండిని మూత చుట్టూ పెట్టి గట్టిగా మూసేస్తారన్నమాట.”

“అంటే మన జాతి వాళ్లకు తెలుసా ఇదంతా..?”

“అంటే మనలో కూడా తక్కువ జాతి వాళ్ళ పిండిని అలా ఉపయోగిస్తారు..”

“సో.. బాసుమతికి అంత సీన్ లేదంటావ్..! మన జాతి వాళ్లకి అక్కడా అణచివేతే అంటావ్. అయితే ఇది సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయమే. ఏదో పరిష్కారం కనుక్కోవాల్సిందే” అని తీర్మానించుకున్నాయి గోధుమ గింజలు.

“రాత్రికి ఎలాగూ మన రోటీలని.. నంచుకు తినడానికి కూరలోళ్ళనీ, ఆకులోళ్ళనీ పక్క పక్కనే కూర్చోపెడతారు గదా.. వాళ్ళతో చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం.”

“ఓకే.. బ్రో గుడ్ ఐడియా.. అలాగే చేద్దాం..” అని ఆ రాత్రి కోసం ఎదురు చూడసాగాయి గోధుమ గింజలు.

***

ఆ రోజు రాత్రి యథావిధిగా.. మానవులు రోటీలు చేసుకుని డైనింగ్ టేబుల్‌పై పెట్టుకున్నారు. రక రకాల కూరలు.. కాయగూరలు, జంతువులూ ఒకటేమిటి సమస్తం మానవుడికి బలై పోయి కిక్కురు మనకుండా ఉన్నాయి. ఒకడేమో.. అలాగే తింటున్నాడు. ఒకడు నూనెతో చేసుకుని తింటున్నాడు. ఇంకోడైతే వెన్న రాసి మరీ లాగిస్తున్నాడు.

కంచంలో పక్కనే ఉన్నాయ్.. కాయగూరలతో మాట్లాడదాం అనేంతలో లటా లటా లాగించేస్తున్నారు మానవులు..

నోరు తెరుద్దాం అనేంతలో.. నోట్లో నయినా ఉండనిస్తేగా.. వరదలా నీళ్లు పోసి తోసేస్తున్నారు..

చివరికి భువన గిరి.. అదే.. కడుపులో అన్నీ చేరి కిందా మీదా పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయి పేగుల్లో మాట్లాడు కోవడం ప్రారంభించాయి.

తోటకూర వాడి పోయి, వేగి పోయి ఉంది. అది చెప్పకుండానే దాని బాధ కనబడిపోతోంది.

టమాటోని కదిలిస్తే చాలు కోసి కారం పెట్టి, మసాలా దట్టించి తింటున్నారని మొరపెట్టుకుంది..

తననైతే బాగా ఉడకబెట్టి తోలు తీసి కారం ఉప్పు వేసి వేయించి లొట్టలేసుకుని తింటున్నారంది ఆలుగడ్డ.

ఇక వంకాయ బాధ ఏమని చెప్పాలి పాపం నాలుగు వైపులా కత్తితో గాట్లు పెట్టి మసాలా కూరి వేపి.. పులుసు పెట్టి ఉడక బెట్టి మరీ మింగేస్తున్నారంది.

అన్నింట్లోనూ కలిపి కామన్‌గా బాధ అనుభవించేది ఒక్కటే.. గోధుమ గింజ.. రోటి రూపంలో ..

తమ బాధకి విముక్తి.. కనీసం ప్రతీకారం కోసం మొదలెడితే వీళ్ళ బాధలు చెప్పి మనల్ని నీరు గారుస్తున్నాయే అని ఉసూరుమన్నాయి గోధుమ గింజలు.

***

అప్పుడు.. ఆ క్షణంలో.. కనిపించిందో మూల.. చెక్కుచెదరకుండా.. ఉన్న ఆవగింజ.

ఆశ్చర్యపోవడం అన్నింటి వంతయ్యింది. అన్నీ చేరి ఆవగింజని ఉక్కిరి బిక్కిరి చేసాయి. ఎలా తప్పించుకుని తిరగగలుగుతున్నావని, ప్రశ్నలతో ముంచెత్తాయి.. గోధుమ, బియ్యం గింజలు.. ఆకులు , కాయగూరలు.

తన సూక్ష్మమైన ఆకారం తనకో వరమని, తన రుచి తనని మానవుని పంటి కింద పడకుండా కాపాడుతోన్నదని, పంటి కింద పడక పోగా.. తాను ఒక్కోసారి వాళ్ళ పళ్ళ మధ్యలో దాక్కుని చికాకు పెడుతుంటానని.. కష్టపడి తనని బయటకి లాగినా ఎటో విసిరేస్తారే తప్ప తనని మళ్ళీ నోట్లో వేసుకోరని.. ఆవగింజ చెపుతుంటే..

“ఔరా ఆవగింజ..! యు ఆర్ సో గ్రేట్..! నువ్వే మా ఆశా కిరణానివి. మా అణచివేతకీ, ఆక్రందనలకూ.. నువ్వే విముక్తి కలిగించాలి.. మా అందరి తరపున నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి.. ఈ మానవులకి బుద్ధి చెప్పాలి.. మా అందరి ప్రతీకార జ్వాలల్ని నువ్వే మోయాలి..” ఇంకా ఏవేవో చెపుతున్నాయి..

“ఇక చాలు బ్రదర్స్.. మీ బాధ నాకర్థమయ్యింది.. మీరనుకున్నంత కాకపోయినా ఆ మానవులకి ఏదో ఒక రకంగా బుద్ధి చెపుతాను. మీ తరపున ప్రతీకారం తీర్చుకుంటాను.. మీలా కాదు.. నేను ఇదే రూపంలో మానవుల కడుపునుండీ బయటపడగలను.. మీ వాణిని మా జాతి వాళ్లకి చేరవేస్తాను. నన్ను నమ్మండి..” అన్నది ఆవగింజ.

ఆవగింజ మీద నమ్మకంతో కాయగూరలతో సహా తిండి గింజలన్నీ తృప్తిగా నిద్ర లోకి జారుకున్నాయి.

***

ఆ రోజు మానవుడు యథా ప్రకారం బియ్యపు గింజల్ని నానబెట్టి, ఉడకబెట్టి తన హింసాకాండని మొదలుపెట్టాడు.

ఆ రాత్రి కోసం గోధుమ గింజల్ని చిత్రహింసలకు గురి చేసి పిండి చేసి తడిపి ముద్ద చేసి కాల్చుకు తినడానికి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇక కాయగూరల వంతు. ఉల్లిపాయ కన్నీళ్లు కారుస్తున్నా కనికరించలేదు. తనకు కన్నీళ్లు వస్తున్నా తోటి వాటి బాధ వినిపించుకోలేదు. వెల్లుల్లి.. పాపం చిన్నది చిదిమేస్తున్నాడు. మిరపకాయను చీల్చి చెండాడుతున్నాడు. ముందు నిలువుగా, మళ్ళీ అడ్డంగా.. దాని ఒంట్లో నరాలని తీసి పక్కనేసాడు..

పాపం అన్నెం పున్నెం ఎరుగని టమాటా.. ఎర్రగా ముద్దుగా ఉందని కనికరం లేకుండా.. పిసికేసాడు. ఆలుగడ్డని రెండుగా నరికి కుక్కర్‌లో పెట్టి విజిల్ వేయించి మరీ ఉడికించాడు. అంతటితో ఆగాడా.. తోలు ఒలిచి మరీ ముక్కలు చేసాడు.

పాల బుగ్గల పాలకూరని ఒలిచి మొండేన్ని ముక్కలుగా చేసి పక్కనుంచుకున్నాడు. లేలేత కొత్తిమీర పాపం పుట్టి ఇంకా నిండు రెండురోజులైనా కాలేదు వేళ్లతోనే విరిచేసాడు..

వేరుశనగ గింజల్ని పిండి తీసిన రక్తాన్ని వేసి మూకుట్లో కాచి ఆలూ పాలక్, టమాటారసం చేసుకుని ఆరగించాలని సమాయత్తమయ్యాడు.

ఒక వైపు వేరుశనగ రక్తం బాగా కాగుతోంది. తన మారణకాండకి చివరి అంకం మొదలైంది. గోధుమ గింజలూ, బియ్యపు గింజలూ, ఆకులూ, కాయగూరలూ.. మెల్లగా నిరాశ లోకి జారుకుంటున్నాయి..

అప్పుడు జరిగిందో అద్భుతం.. మానవుడి చెయ్యి పోపుల పెట్టెలోకి వెళ్ళింది. పోపుగింజల్ని తీసి కాగిన వేరు శనగ రక్తం లో వేసిన మరుక్షణం..

“ఢాం..”

ఆవగింజలు పేలి.. ఒకటేమో.. మానవుడి చెంప ఛెళ్ళుమనిపించింది. ఇంకోటి కళ్ళలోకి సూటిగా వెళ్లి గుడ్డు ను ఢీకొంది. మరోటి ముక్కులోకి వెళ్లి ఆత్మాహుతి చేసుకుంది.

అంతే.. మానవుడి దిమ్మ తిరిగింది..

పొయ్యి ఆపేసాడు. తరిగి పెట్టుకున్న కూరల్ని, తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని, వండి పెట్టుకున్న బియ్యాన్ని హడావిడిగా ఫ్రిజ్‌లో సర్దేసాడు. ఉన్న పళంగా కళ్ళు నులుముకుంటూ ఆస్పత్రికి పరుగు లంకించుకున్నాడు.

వేడి వేడి పొయ్యి మీద కాలి, ఉడికి చిత్ర హింసలకు గురవ్వాల్సిన తాము, ఆవగింజల పుణ్యమా అని చల్లగా ఫ్రిజ్ లోకి చేరుకోగలిగామని ఆనంద పడిపోతూ.. పొయ్యి పక్కనే ఉన్న పోపుల పెట్టెలోని ఆవగింజలకు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాయి గోధుమ గింజలు, బియ్యపు గింజలు, ఆకులు, కూరగాయలు.

తమ విజయ గాథని, ఆవగింజల ఆత్మత్యాగాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నాయి పిండి రూపంలో ఉన్న గోధుమ గింజలు.

ఇంతలో ఫ్రిజ్ పై బెర్తులో ఉన్న మినప్పిండి రూపంలో ఉన్న మినప గింజలు..

“ఏం మాట్లాడుతున్నారు గోధుమపిండి? రేపు ఏ పెనం పైనో దోశ గానో, బాణట్లో గారె గానో వేగి వేగి చావాలే అని నిద్ర పట్టక చస్తుంటే ఏంటా గోల?” అంటూ కోపంతో అరిచాయి.

“హలో మినప గుండ్లూ! ఏం కంగారు పడకండి. ఈ మానవుడు కొన్నాళ్ల దాకా మన జోలికి రాడు గాక రాడు.. ఎందుకంటావా.. మేమంతా కలిసి చేసిన కృషి, ఆ ఆవగింజలు చేసిన త్యాగం..” అంటూ మొత్తం కథంతా గింజ గుచ్చినట్టు చెప్పాయి పిండి రూపంలో ఉన్న గోధుమ గింజలు.

విషయమంతా విన్న మినప్పిండి.. ఫ్రిజ్జులో చల్లగా ఉన్నా ఆనందంతో పొంగిపోయింది. పై అర నుండీ క్రింది అరలోకి జారిపోయింది.

అన్నీ కలిసి ఆ మానవుడు తన పుట్టినరోజు కోసం తెచ్చి పెట్టుకున్న ఐస్ కేకు చుట్టూ చేరి పార్టీ చేసుకున్నాయి..!

***

రెండు రోజులు గడిచిపోయాయి. కేకు ఫ్రిజ్ లోంచి వెళ్ళిపోయింది. అంటే మానవుడు మళ్ళీ కోలుకున్నాడన్న మాట. అన్నింటికీ మళ్ళీ దిగులు మొదలయ్యింది. మళ్ళీ మారణకాండ తప్పదా?!

అప్పుడు వచ్చింది తీపి పొంగలి.. ఫ్రిజ్ లోకి. అది ప్రసాదంగా నేరుగా దేవుడి గది నుండి నైవేద్యం అయ్యాక వచ్చింది. వెచ్చగా ఉంది. మంచి నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష వేసి ఘుమ ఘుమలాడుతోంది.

తన చుట్టూ ఉన్న తిండి పదార్థాలన్నీ దిగులుగా ఉండడం గమనించింది. కారణం తెలుసుకుంది. అప్పుడది ఓ ప్రశ్న అడిగింది.

“ఇన్నాళ్లూ లేని ఇలాంటి ఆలోచన మీకెలా కలిగింది? నేనూ మీలాంటి బియ్యం, పెసరపప్పు లాంటి తిండి గింజల జాతి దాన్నే. ఎన్నో తరాలుగా మానవుడికి ఆహారంగా ఉన్నా.. దేవుడికి నైవేద్యంగా ఉన్నా.. అనే పవిత్ర భావన తోనే ఉండేవాళ్ళం.. మేమూ మా పూర్వీకులూ. మీకు మాత్రం ఇలాంటి స్వార్థం, పగ, ప్రతీకారం అనే ఆలోచన వచ్చింది అంటే.. మీ పుట్టుకలో లేదా పెంపకంలో ఏదో తేడా జరిగి ఉండాలి. మీరెక్కడి నుంచీ వచ్చారు? ఎక్కడ పెరిగారు?”

అప్పుడు చెప్పాయి గోధుమ గింజలు..

“నిజానికి మా తల్లిదండ్రులు వేరే వేరే ప్రాంతాల వాళ్ళు.. మమ్మల్ని ఓ ప్రయోగశాలలో పుట్టించారట. అలా మా తరం మొత్తాన్ని మానవులు ఏరి కోరి సృష్టించారు. మమ్మల్ని ఇబ్బడి ముబ్బడిగా పుట్టించారు. ఇక పెంపకం అంటారా.. మేం పుట్టినప్పటి నుంచీ ఏవేవో ఎరువులు, మందులు వేసి బలిష్టంగా అయితే తయారు చేసారు. మా తాత, ముత్తాతలు అనేవాళ్ళు.. మీరు మాకంటే భలే బొద్దుగా, రంగుతో ఉన్నార్రా అని. కానీ వాళ్ళు మాకు మాలా బాధపడుతున్నామని గానీ ఈ మానవులు మనల్ని హింసిస్తున్నారని గాని చెప్పినట్టు గుర్తులేదు. మాకే ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి? ఎందుకు?”

అప్పుడు చెప్పింది ప్రసాదం..

“అర్థమయిందర్రా.. మీరు మాలా సహజంగా పుట్టలేదు. ఈ మానవులు తమ స్వార్థం కోసం మిమ్మల్ని వాళ్లకు కావలసినట్టు పుట్టించారు. అంత వరకు అయితే సరే అనుకోవచ్చు. కానీ అవసరానికి మించి పుట్టించారు. గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. పుట్టినప్పటి నుండీ అవసరానికి మించి విషంతో మీ శరీరాల్ని నింపేశారు. మేము అనుకునే వాళ్ళం పాముకు కోరల్లో విషం. మనిషికి నిలువెల్లా విషం అని. ఇప్పుడు ఈ జాడ్యం మనలో కూడా బయలుదేరింది. మన శరీరాలు మాత్రమే కాదు మనసూ విషంతో నిండిపోతోంది. అందుకే మీకీ విపరీత ఆలోచనలూ.. పగ, ద్వేషం లాంటి నకారాత్మక ధోరణులూ. తప్పు ఎక్కడ జరిగిందో అర్థమయింది.”

“మరి మా భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? మళ్ళీ మేము ఇలా నలుగుతూ ఉండవలసిందేనా? మా పుట్టుకకి మేమెలా బాధ్యులం అవుతాం. మీరే ఓ మార్గం చూపండి!” అని ప్రాధేయపడ్డాయి తిండి గింజలు.

“మీరు చెప్పింది నిజమే. భగవంతుడి ప్రసాదితంగా, మానవుల మరియు సమస్త ప్రాణుల జీవనాధారంగా ప్రకృతి సహజంగా పుట్టాల్సిన మీరు మానవుడి స్వార్థ ప్రయోజనాలకోసం వారి చేతుల్లో జన్మిస్తున్నారు. మీరు ముందు మీ మనసుల్లో సమస్త ప్రాణుల కోసం మనం జీవిస్తున్నామని సకారాత్మక భావనల్ని పెంపొందించుకోండి. అలాగే ఇంకొకరి బాగుకోసం జీవించడం లోనే తృప్తి, ఆనందం ఉన్నాయని గుర్తుంచుకోండి. నేనూ భగవంతుడికి మనందరి తరపునా మొరపెట్టుకుంటాను. ఈ మానవులకి మంచి బుద్ధి ప్రసాదించమని.. ఈ విషాల నుండీ మనందరినీ విముక్తుల్ని చెయ్యమని” – అని సాంత్వన పలుకులు చెప్పి సమాధాన పరిచాయి ప్రసాదం రూపంలో ఉన్న బియ్యం, పప్పు గింజలు.

అప్పటికి గానీ మనసు సమాధాన పడలేదు తిండి గింజలకు. మళ్ళీ యథాప్రకారం తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్న మయిపోయాయి తిండి గింజలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here