నేను.. కస్తూర్‌ని-18

0
3

[వృత్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.]

~

[dropcap]హ[/dropcap]రిలాల్ ముస్లింగా మతాంతరం చెందాడు! ఇది నా హృదయం ముక్కలైన వార్త. బొంబాయిలోని ఒక పెద్ద సభలో అబ్దుల్లా గాంధీగా మతాంతరం చెందాడు. అది పత్రికల్లో పెద్ద వార్తగా వచ్చింది. వాడి చావులాంటి ప్రమాదకర వార్తే అది అని ఇప్పుడనిపిస్తుంది, ముస్లిముగా మారితే మాకెందుకు అంత కలవరం అని. కానీ అప్పుడు నేను ఎంత కలవరపడ్డాను అంటే మొదటే ఒకదాని పైన ఒక రోగాలతో, పథ్యాలతో బాధపడుతున్నదాన్ని క్రుంగిపోయాను. హరికి ఊరంతా అప్పులున్నాయి. బొంబాయిలోని పఠాణులతో ఎంత అప్పు పెట్టాడు అంటే వాడి ప్రాణానికి హెచ్చరిక వచ్చింది. ఎందుకు అప్పులు చేశాడనుకున్నావ్? తన అలవాట్ల కోసం – తాగుడుకి, కామాటిపుర వేశ్యలకి. ఎలాంటి కొడుకైపోయాడు హరి? ఎంత ప్రేమించాను వాడిని! వాడినుండి కూడా అంతే ప్రేమను పొందాను. అదెలా నన్ను ప్రేమించి, బాపును వ్యతిరేకించాడు? తన తండ్రిని తెలుసుకోకుండా ఉత్త తల్లినే ప్రేమిస్తే ఎలా? ఒక కంటికి చలవ కళ్ళద్దాలు వేసి, మరో కంటికి సూదితో పొడిస్తే రెండూ కళ్ళల్లో నీరు కారదా? దీన్ని హరి ఎందుకు అర్థం చేసుకోలేదు?

మతాంతర వార్త వచ్చినప్పుడు బాపు నా వద్ద ఉండాల్సింది అనిపించింది. కానీ ఆయన ఎక్కడో దూరంగా దక్షిణ ప్రాంతంలో ఉన్నారు. పత్రికల్లో బాపు అభిప్రాయం ప్రకటించబడింది. “నిస్స్వార్థంగా, ఇస్లాం ధర్మానుసారాన్ని తెలుసుకుని వాడి మతాంతరం చెంది ఉంటే మంచిదే. ఇస్లాం కూడా నేను నమ్మిన మతమంతే సత్యమైన మతం. దేవుడు ఏ మహిమనైనా చూపవచ్చు. రాతిగుండెలను కరగించవచ్చు. పాపులను సాధువులుగా చేయగలడు. అబ్దుల్లా కావచ్చు, హరిలాల్ కావచ్చు, ఏ పేరుతో నైనా నిజమైన భక్తుడయితే దేవుడి వైపు వెళ్ళే మార్గం దొరుకుతుంది. కాని, హరిలాల్‌కు ఐహిక సుఖసంపదల పైన ఆశ ఉంది. అలాంటి ఆశతో మతాంతరం చెంది ఉంటే అది తనకూ, ఆ మతానికి కూడా ఏ రకంగానూ ఉపయోగం కాదు.”

అక్కడ బాపు అలా చెప్పే లోగా నేను దేవదాసును బ్రతిమాలి, బాధపడినదంతటినీ, వాడు ఒక ఉత్తరంగా రాసి పత్రికకు పంపాడు. కుమారుడికి తల్లి ఉత్తరం అని ప్రచురించబడింది. అందులో ఇలా రాయించాను.

“అవెన్ని సార్లో నువ్వు తాగి కేసు నమోదయ్యి, ఎవరి కొడుకువో అని తెలిసాక బయటికి వచ్చావు. నీ అలవాట్ల గురించి ప్రతిరోజూ మీ నాన్నకు ఎక్కడెక్కడినుండో ఉత్తరాలు వస్తాయి. ఆయన ఎంత అవమానం ఎదుర్కొంటారో నీకు తెలుసా? నాకైతే ఎవరికైనా మొహం చూపడానికి కుదరడం లేదు. నీ తండ్రి నిన్నెప్పుడూ క్షమిస్తూనే ఉన్నారు. కానీ భగవంతుడు మాత్రం నీ నడతను ఎప్పుడూ క్షమించడు. తెలుసుకో. ప్రతిరోజూ పత్రికలలో నీ గురించి వార్త వస్తుందేమో అని భయపడుతూనే లేస్తాను. ఈ రోజు ఈ వార్త వచ్చింది. సరే. దీనివలన అయినా నువ్వు శాంతి పొందితే మంచిదే. కానీ మొదటికంటే ఇంకా దుస్థితిలో ఉన్నావని తెలిసింది. నీ నడత వలన నీ కూతురు, అల్లుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నారని మరచిపోవద్దు.

ముస్లిం బాంధవులతో నాదొక మనవి. మీరు ఈ స్వార్థపు పనిని ఖండించి, వాడి స్నేహితులే, వాడిని ఒక సారి ఎత్తేసి, మరోసారి తొక్కేసి ఈ స్థితికి తీసుకు వచ్చారు. దీనివలన మీకేం లాభం? దీన్ని మీరు మీకోసం కానీ, తన కోసం కానీ చెయ్యడం లేదు. కేవలం బాపును అవమానాల పాలు చెయ్యాలని చేస్తున్నారు. సరే. ఇంకేమీ చెప్పడానికి మిగలలేదు నాకు.”

ఒక మంచి వైష్ణవుడు కాకుండా, మంచి ముస్లిమ్ కావడం ఎలా వీలవుతుంది? నా ఉత్తరం వాడి మనసు మార్చుండాలి లేదా ముస్లిమ్ కావడం వలన ఎక్కువ ప్రయోజనం లేదని తెలిసొచ్చుండాలి. ఐదే ఐదు నెలల్లో మళ్ళీ మతాంతరం చెందాడు. అబ్దుల్లా గాంధీగా మారినవాడు, ఆర్యసమాజం వారి సహాయంతో హీరాలాల్ గాంధీ అయ్యాడు. కాని, బాపు మనసులో ఎంతటి బరువును నింపాడంటే వాడి విషయం ఎత్తడానికే నాకు సమస్య అయ్యేది. మా ఇద్దరి లక్ష్యం అతడి వైపు ఉండాలని హరి అలా చేసేవాడా? తెలీదు. కాని, అతడి గురించి మేమేం తక్కువ చింతించామా? అయినా ఏం ప్రయోజనం? బాపు చెప్తున్నది నిజం. వాడికి వ్యక్తిగత పెరుగుదల కోరిక లేదు. పూర్తి చర్మ సుఖం, క్షణిక సుఖానికి అమ్ముడు పోయాడు. అది అతడిని అవనతి వైపు తీసుకెళ్ళింది.

దేన్నైతే బాపు కాదనేవారో ఆయన పెద్ద కొడుకు అదే అయ్యాడు. దీనికి నేను, బాపు ఇద్దరూ సమానంగా బాధ్యతాయుతులం, సమానంగా దుఃఖాన్ని అనుభవించవలసిన వాళ్ళం. అయినా వాడి తప్పులకు బాపు బాధపడుతుంటే నేను పాప ప్రజ్ఞ అనుభవించేదాన్ని. నా కడుపు నుండి పుట్టినవాడు, నా భర్తకు వ్యతిరేకంగా, తన తండ్రికే తిరగబడడం నా లోపమే, బాధ్యతే అని నాకు అనిపించేది. బాపు బాధ చూసి నాకు మరింత దుఃఖం కలిగేది.

వేపకాయైనా కానీ, అది మనకు ఇష్టమయితే బెల్లం కంటే తీపి అంటారు. మాకు మాత్రం బెల్లం కూడా చేదయింది. అయినా కానీ మింగసాగాము. కాని, నా హరి, హీరాలాల్‌గా మారడం వరకు చేరిన అధోగతి ఉందే అది ’నాకిక మానవ జన్మ అక్కర్లేదు. అందులోనూ తల్లి-భార్య అనే రెండు పాత్రల నడుమ నలిగే ఆడజన్మ మాత్రం ఖచ్చితంగా వద్దు..’ అనేలా చేసింది.

నిజం. నాకిక చెప్పడానికి ఏమీ మిగలలేదు. ఈ హాలాహలం తాగిన తరువాత ఇక ఏ విషమైనా లెక్కలోకి రాదు.

భోంచేయడం తెలిసినవారికి..

మాటలు నేర్చినవాడికి పోట్లాట రాదు, భోంచెయ్యడం తెలిసినవాడికి రోగం రాదు అని బాపు రోజూ చెప్పేవారు. భోజనం గురించి నా భర్త చేసినన్ని ప్రయోగాలు ఎవరైనా చేశారా అని నాకు తెలియదు. సత్యంతో, అహింసతో చేసినన్నే ప్రయోగాలు తమ కంచంతో కూడా చేశారు బాపు. ఆయన ప్రకారం ఆహారం అన్నది ఆరోగ్యంలోని ఒక భాగం. అది తమాషా కాదు. నోటి చాపల్యం కోసం తినకూడదు. రుచికోసం తిని దేహాన్ని చెత్తబుట్టలా చేసుకోకూడదు. శరీరానికి సుఖం, కడుపుకు దుఃఖం కలిగించేలా తినరాదు. కడుపుకూ విరామం కావాలి. మూడు మార్లు తింటే చాలు. ఎప్పుడూ నోరు ఆడిస్తూ ఉండరాదు. మాకూ అదే అలవాటయ్యింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దేహ రచన తెలుసుకోవాలని లేదు. ఆరోగ్యం – ఆహారం గురించి తెలిస్తే చాలు. బ్రహ్మచర్యం, క్రమశిక్షణ, ఆహార నియమాలతో శరీరారోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేవారు బాపు. రోగాల నుండి ముక్తులయినవారు, ఆయాసం లేకుండా పని చేసేవారు, అన్నిటికంటే ముఖ్యంగా దేహం, మనసుల నడుమ సమన్వయం ఉన్నవారు ఆరోగ్యవంతులు. అలాంటివారు రోజుకు పన్నెండు మైళ్ళైనా నడవగలరని ఆయన లెక్క.

కానీ, ఇదే బాపు ఇంతకు ముందు మోకగా ఉన్నప్పుడు ఎలా తినేవారో తెలుసా? ’పిట్ట కొంచెం కూత ఘనం’ అనే సామెత విన్నావు కదా? అలా. నాకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ తినేవారు. అయినా కానీ సన్నగా ఉండేవారు. లండన్‌కు వెళ్ళిందే వెళ్ళింది, మోక కడుపు కుచించుకుపోయింది. ముందు ముందు రాసిన ఉత్తరాలలో భోజనానికి ఎంత కష్టమవుతోంది, ఇంగ్లీష్ భాష నేర్చుకోకుండా ఏం చేస్తున్నావ్ అనే రాసేవారు. ఇంగ్లండులో మద్యం తాగకపోతే, మాంసం తినకపోతే, బ్రతకడం కష్టం అని, అది చాలా చలిప్రదేశం అని చెప్పేవారు: కానీ తను తన తల్లికి చేసిన ప్రతిజ్ఞలను చెప్పి మద్యం, మాంసం నిరాకరించాననీ, అలా వాళ్ళంతా ఇచ్చిన ప్రమాణ పత్రాలను పెట్టుకున్నానని రాశారు.

నిజం. మా అత్తగారు మోకభాయికి మాంసం, మద్య ముట్టుకోలేదని అక్కడి ప్రముఖ వ్యక్తులనుండి ప్రమాణ పత్రాలను తేవాలని చెప్పారు! పడవలో, తాను దిగిన హోటల్‌లో, అద్దె ఇంట్లో బ్రెడ్, కూరగాయల ముక్కలు తిని అలాగని వారినుండి ప్రమాణ పత్రాలను తీసుకున్నారు మోక. అప్పుడే ఉండాలి. కడుపు నిండా తినకుండా కొంచెం కొంచెమే తినడం అలవాటయ్యింది. ఒక ఉత్తరంలో మిఠాయిలు, మసాలాలు వెంటనే పంపాలని రాశారు. తరువాత శాకాహార సంఘంలో చేరారు. ఒక శాకాహారి హోటల్ దొరికిన తరువాత రుచికరమైన కడుపు నిండా భోజనం దొరికుండాలి. దాని తరువాత కూడా ఎవరెవరి పుస్తకాలో చదివి ఉప్పు తినడం మానేశారు. మసాలాలు వద్దన్నారు. బచ్చలి కూర ఉడికించి తిన్నారు. చక్కెర మానేశారు. బదులుగా బెల్లం, తేనె వాడారు.

ఆయన ఆహారానికి ఇచ్చిన హోదాల ప్రకారం పూర్తిగా ఫలాహారం అత్యుత్తమం. ఉప్పు, మసాలాలు లేని కూరగాయలు తినడం తరువాతి స్థానం. ఉప్పు, మసాలాలతో పాటు పళ్ళు, కూరగాయలు తినడం తరువాతది. శాకాహారం, మాంసాహారం రెంటినీ కలిపి తినడం తరువాతి స్థానం. కేవలం మాంసాహారం తినడమన్నది హోదాల్లో చివరిది అనేవారు.

“మనం ఎక్కువగా తిన్నది ఏమిటి అని మలం వల్ల తెలుస్తుంది. మనకు జీర్ణం కావడానికి వీలయినంతే తినుంటే సరైనా ఆకారం గల, గట్టి, గాఢమైన రంగుగల, చెడ్డవాసన లేని కొద్దిగా మలం వస్తుంది” అనేవారు. “కంచంపైన ఎలా శ్రద్ధ పెడతామో అలాగే మనం మలరూపంలో ఏం బయటకు పంపుతామో అనేదాని పైన కూడా అంతే శ్రద్ధ పెట్టాలి” అని ఆయన అభిప్రాయం.

ఆయన భోజనపు అలవాట్లు కొన్నిసార్లు సబబనిపించేవి. కాని కొన్నిసార్లు మాత్రం విసుగు తెప్పించేవి. ఆయన వదిలేసినవన్నీ వదలడం నాకు చేతకాలేదు. ఆయనలా ఉపవాసలు చేయడానికి కూడా చేతకాలేదు. నాకు కాఫి ఇష్టం. ఆయన తాగేవారు కాదు. ఎప్పుడైనా ఒక్కోసారి తామే కాఫి తయారు చేసి ఇచ్చేవారు. కొన్నిసార్లు నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఎవరైనా ఇంటికి వస్తే, నన్ను లేపకుండా రాత్రి తామే ఏదో ఒకటి చేసి ఇచ్చేవారు. కానీ మా మనమలు, మనమరాళ్ళుండేవాళ్ళు కదా, వారికి కూడా ఉప్పు పప్పు లేని, పాలు లేని భోజనం పెట్టు అన్నప్పుడు మాత్రం బాపుతో పోట్లాట, వాదన చేసేదాన్నినేను. “మీరు మీ చిన్నప్పుడు ఏమేమో తినుండలేదా? ఈ పిల్లలకు ఎందుకు వద్దంటారు?” అనడం నా వాదన. చివరికి ఆశ్రమం వంటిల్లు కాకుండా నాకు వేరే ఒక వంటిల్లు ఏర్పాటు చేసిచ్చారు. ఇప్పుటికీ హృదయ కుంజ్‌కు వెళ్తే నువ్వు చూడచ్చమ్మాయ్! అక్కడ పిల్లలకని మిఠాయి, ఉపాహారం చేసేదాన్ని.

బాపు ఆహారం మాత్రం మీరు ఊహించుకోవడం కష్టమే. మన దేశం వదిలినప్పడినుండి ఆయన ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడుంటామో అక్కడి ఆహారాలను ఒంటబట్టించుకోవాలి అనేది ఆయన అభిప్రాయం. ఏవేవో తిళ్ళు తినే గుజరాతీల తిండిపోతుతనానికి పోలిస్తే, బాపు భోజనం చాలా సరళంగా ఉండేది. మొట్ట మొదట ఉప్పుడు బియ్యం, దాల్ మా వంటింటి ముఖ్య వంటకంగా ఉండేవి. చాలా కూరగాయలు, ఆకుకూరలు వాడేవాళ్లం. ఆయన ప్రకారం ఆకుకూరను కనీసం ఆరు సార్లు కడిగి వాడాలి. అన్ని పల్లెల్లోనూ ఆకుకూర సమృద్ధిగా దొరుకుతుంది. కానీ అక్కడి ప్రజలకు వీటిని తినే అలవాటు లేదు. వారికంటే పట్టణాల వాళ్ళే ఎక్కువగా ఆకుకూరలు తింటారు అని పల్లెల్లో ఉపన్యాసం ఇచ్చేటప్పుడంతా చెప్పేవారు. ఉత్త వెల్లుల్లి తిని తన రక్తపోటు తగ్గించుకుంటానని వెల్లుల్లి తినడం మొదలుపెట్టారు. తామే తయారు చేసుకున్న బ్రెడ్ తినేవారు. మసాలా లేదు, ఉప్పు లేదు. ఉత్త ఉడికించిన ఆహారం. ఉడికించిన వంకాయ, గుమ్మడి, బీట్రూట్, బ్రెడ్‌తోపాటు కూడా అవే కూరగాయలు. వెన్న లేదు. ఎంతో మందికి దైనందిన ఆహార పట్టీ తయారు చేసి ఇచ్చేవారు. నేతాజీకి కూడా చేసిచ్చారు. అందరు మగవాళ్ళు తిని కూచుని, బొజ్జ పెంచుకుని పని తగ్గించుకుంటే, బాపుది దానికి సంపూర్ణ వ్యతిరేకం. రోజులు గడిచిన కొద్దీ ఇంకా ఎక్కువ నోరు కట్టేసేవారు.

పాలు తాగనని దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడే ప్రతిజ్ఞ చేశారు. ఆవు, బర్రెల పాలు పితికేటప్పుడు వాటికి కలిగే నొప్పిని చూసి పాలు వదిలేశారు. సబర్మతి మందిరంలోఉన్నప్పుడు అనుకుంటాను. మూలవ్యాధి ఆపరేషన్ చేయించుకోవడం అనివార్యమయింది. కానీ ఆయన బరువు ఎంత తక్కువ ఉండిందంటే డాక్టర్ గారు ఇంత అపౌష్టికత, తక్కువ బరువు ఉంటే శస్త్రచికిత్స కుదరదు, మీరు బరువు పెంచుకుంటే మాత్రమే వీలవుతుంది అన్నారు. ‘పప్పు లేదు, గుడ్డు లేదు, తీపి లేదు, పాలు లేవు, పుష్టికరమైన ఆహారం ఏదీ లేకుండా బరువు పెరిగేదెలాగ? అదెందుకు మిమ్మల్ని మీరు హింసించుకుంటారు?’ అని అడిగారు డాక్టర్ గారు. కానీ బాపు ఒక సారి ప్రతిజ్ఞ చేపడితే ఇక అంతే. చివరికి నేనొక ఉపాయం చెప్పాను. “మీరు ఆవు, గేదె పాలు తాగనని ప్రతిజ్ఞ చేశారు కదా? అలాగైతే మేక పాలు తాగండి” అని. అది డాక్టర్ గారికి కూడా సబబేననిపించింది. మేక పాలు తాగినా సరే. అందులో కూడా ప్రోటీన్ అంశాలు పుష్కలంగా ఉంటాయి అన్నారు. బాపుకు ఇది తట్టలేదు. ఆయన దృష్టిలో పాలు అంటే ఆవు పాలు మాత్రమే. చివరికి కళ్ళుమూసి ధ్యానించి ఒప్పుకున్నారు. “నువ్వు బుద్ధిమంతురాలివి సుమా కస్తూర్! ఫర్వాలేదు” అంటూ మీసాల చాటున చిన్నగా నవ్వారు.

ఒకసారి నాకు ఎందుకో బొబ్బట్లు తినాలనిపించింది. మీరా బేన్‌ను పిలిచి బొబ్బట్లు ఎలా చెయ్యాలో వివరించాను. బాపుకు అది ఇష్టమే. నిర్బంధం లేని రోజుల్లో తినేవారు. అదెలాగో బాపుకు బొబ్బట్ల విషయం తెలిసింది. నాకు పప్పు పడదని ఆయనకు తెలుసు. పడేది కాదు.

“ఏమిటి? బొబ్బట్లట?” అన్నారు నన్ను చూసి నవ్వుతూ.

“అవును. ఎందుకో తినాలనిపించింది. ఎలా చేయాలో నేర్పించాను”

“మంచిది. చెయ్యండి, చెయ్యండి”

“అందరికీ అని చేసింది. మీరూ తినవచ్చు. ఈ రోజు ఆదివారం”

“పూర్ణం బొబ్బట్టు అంటే నాకు ముందంతా ఇష్టం. నీకు తెలుసు కదా. దొంతరల కొద్దీ లాగించేవాణ్ణి. కానీ ఇప్పుడు ఒక షరతు”

“మీదెప్పుడూ ఉండేదే కదా ఏదో ఒకటి. ఏమిటి ఆ షరతు చెప్పండి”

“నేను తినాలంటే నువ్వు తినకూడదు”

“..”

చేయించాను సరే. కానీ ఆ రోజు నేను బొబ్బట్లు తినలేదు. బాపు కూడా తినలేదు అని తరువాత తెలిసింది. బా తినలేదు కదా, నాకూ అక్కర్లేదు అన్నారట!

ఇది బాపు. ఆయనకు ఇష్టం, నాకూ ఇష్టం. కానీ నాకు మంచిది కాదు. కాబట్టి ఇద్దరికీ వద్దు. ఇదే మాదిరిగా ఎప్పుడూ. కావాలి వద్దుల చివర్న ఒకసారి నేనుంటే ఇంకోసారి బాపు. అంతే తేడా. నాలోని గుణాలు, దౌర్బల్యాలు రెండింటినీ బాగా తెలుసుకున్నారు బాపు. ఆయనకు సబబనిపించిందల్లా నేను ఒక్కసారిగా ఒప్పుకునేదాన్ని కాదు. నేను ఒప్పుకునేదాకా ఆయన వదిలేవారు కాదు. ఎన్నోసార్లు చెప్పి, నచ్చచెప్పి ఒప్పించేవారు.

దక్షిణ ఆఫ్రికాలో ఉన్నప్పుడు పదే పదే రక్తస్రావమయ్యేది. చాలా బలహీనంగా మారాను. వైద్యులు ఆపరేషన్ చేయాలంటే బాపు ముందు ఒప్పుకోలేదు. తరువాత ఆపరేషన్ ఏమో అయింది. కానీ నేను ఎంత అలసిపోయానంటే ఆహారం, మందులు తీసుకోవడానికి కూడా చేతనయ్యేది కాదు. గోమాంసం యొక్క సూప్ తాగిస్తారనే సూచన దొరకగానే జైలునుండి బయటకు వచ్చిన మనిషి వర్షంలోనే నన్ను ఎత్తుకుని తీసుకుని వచ్చేశారు. ఉప్పు, పప్పు వదిలేస్తే రక్తస్రావం తగ్గుతుంది అన్నారు. నాకది కష్టం అన్నాను. “అయితే నేను ఈ రోజునుండి ఉప్పు, పప్పు మానేస్తాను, ఆపై నీ ఇష్టం” అన్నారు. నేను కూడా వదలాల్సి వచ్చింది. “బలహీనతకు కోడి సూప్ తాగండి” అని ఎవరో సలహా ఇచ్చారు. “కోడి- కస్తూర్ బా ఇద్దరిదీ ప్రాణమే. ఇద్దరి ప్రాణమూ నాకు సమానమే. కోడి చచ్చిపోయి నా భార్య బతకాలనుకుంటే కోడి చచ్చేకంటే తనే చావనీ” అన్నారు!  ఇలాంటివాడు నా మొగుడు.  అందరిలా కాదు.

నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు బాపు ఎక్కువగానే సేవ చేసేవారు. ఆవిరి స్నానం, జలచికిత్స, మాలీష్ ఇలా అవి ఇవి అని కాక అన్నీ చేసేవారు. నాకు అస్తమా. పదే పదే దగ్గు వచ్చి ఊపిరి సరిగ్గా ఆడకుందా చచ్చిపోయేలా అయిపోయినా ఏమైనా మందులు ఇవ్వడానికి ఒప్పుకునేవారు కారు. అన్నిటినీ అవేమిటి, దేంతో చేశారు, ఎలా ఉపయోగపడతాయి అని వివరంగా తెలుసుకుని ఇప్పించేవారు. నిమ్మ రసం ఫలహారంలో పెట్టేవారు.

ఆయనకు రక్తపోటు ఎక్కువయ్యేది. మలేరియా వచ్చింది. ఛాతీలో నీరు నిండింది. రెండుసార్లు ఆపరేషన్ అయ్యింది. ఒకసారి అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. అప్పుడాయన పుణె జైలులో ఉన్నారు. 1924 అనుకుంటాను. భరించరానంత కడుపునొప్పి వచ్చి వెంటనే ఆపరేషన్ చేయాల్సివచ్చింది. ఆపరేషన్ చేసే సమయానికి గాలి దుమారం వచ్చి కరెంట్ పోయింది. చివరికి దీపం పట్టుకుని కర్నల్ మ్యాడక్ అనే ఒక బ్రిటిష్ సర్జన్ ఆపరేషన్ చేసి ముగించారు.

తలకు మట్టిప్యాక్, మాలిషు, జలచికిత్స ఇలా రోజూ ఏదో ఒక ప్రయోగం బాపు పైన జరుగుతూనే ఉండేది. దక్షిణ ఆఫ్రికాలో పదే పదే తలనొప్పి సతాయించేది. పదేపదే మలబద్ధకం అయ్యేది. దానికి మలశోధక మందు తీసుకున్నారు! కానీ తగ్గకుండా పోయినప్పుడు పొద్దుట ఫలహారం మానేశారు! కొన్నిసార్లు ఇది అతిగా మారింది కూడా ఉంది. ఒక దశలో ఉత్త రెండు డజన్ల నారింజ పళ్ళు చాలు, రోజంతా సరిపోతుంది అనేవారు. చివరికి ఒక వైద్యుడు ఒక మనిషి దేహానికి కావలసిన ఆహారపు అవసరం గురించి వివరంగా చెప్పి, ఉత్త నారింజ పళ్ళే తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటే రోజుకు 50-75 పళ్ళు తినాలని హెచ్చరించారు.

బాపు చెప్పేవారు. “నా అనుభవంతో చెపుతున్నాను: మలబద్ధకం అవుతే, రక్తహీనత కలిగితే, జ్వరం వస్తే, అజీర్ణమయితే, తలనొప్పి వస్తే, సంధివాతం అయితే, కీళ్ళనొప్పులు వస్తే, కోపం వస్తే, ఖిన్నత ఆవరిస్తే, చాలా సంతోషమైతే ఉపవాసం చెయ్యండి. ఏ మందూ అక్కర్లేదు”. ఉపవాసం, అతి తేలికపాటి ఆహారంతో అంతా తానే సర్దుకుంటుంది అని భావించారు ఆయన. మా ఇద్దరి బరువు సాధారణంగా ఎంత ఉండేది అని నీకు చెప్తే మా ఆహారం ఎంత తేలికపాటిగా ఉండేదో తెలిస్తుంది. బాపు 40-45 కేజీలుంటే నేను 30-35 కేజీలుండేదాన్ని అంతే!

ఇలా ఉండేవారు బాపు! అతి సాదా మనిషి. అతి మెత్తటి మాట. నాలుక పైన అంటే మాట – రుచి పైన నియంత్రణ చేయగలిగితే అంతా అదుపులో ఉండడానికి వీలవుతుంది అని భావించారు. ఈ నియంత్రణ ఆయనకు చేతనయింది. అందుకే ఉపవాసం కూర్చోవడానికి వీలయ్యేది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here