మరుగునపడ్డ మాణిక్యాలు – 40: ఫోర్స్ మజ్యూర్

0
4

[dropcap]F[/dropcap]orce majeure అంటే ఊహించని పరిస్థితులు, నియంత్రించలేని పరిస్థితులు. కొన్ని కాంట్రాక్టు ఒప్పందాలలో ఫోర్స్ మజ్యూర్ అనే భాగం ఉంటుంది. ఊహించని పరిస్థితులు ఎదురైతే కాంట్రాక్టరు, యజమాని కూడా ఒప్పందం రద్దు చేసుకోవచ్చు. యుద్ధం, మహమ్మారులు లాంటివి వస్తే ఇలా చేయవచ్చు. మరి వివాహంలో ఊహించని పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి? భార్యకి భర్త మీద నమ్మకం పోతే ఏం చేయాలి? నమ్మకమంటే వేరే ఏదో కాదు.. భర్త తనను, తన పిల్లలను రక్షించే మనస్తత్వం లేనివాడని తెలిస్తే? భార్య భర్త అక్రమ సంబంధాన్ని భరిస్తుందేమో కానీ రక్షణ లేకపోతే భరించలేదు. ఈ ఇతివృత్తంతో వచ్చిన స్వీడిష్ చిత్రం ‘ఫోర్స్ మజ్యూర్’ (2014). ఇందులో సంఘటనలు గంభీరమైనవే అయినా హాస్యం పుడుతుంది. కానీ మనం ఇతరుల్ని చూసి నవ్వుతాం గానీ మనల్ని చూసి మనం నవ్వుకోగలమా? అదే ఈ చిత్రం వేసే ప్రశ్న. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

తొమాస్, ఎబ్బా తమ పిల్లలు వెరా, హ్యారీతో స్వీడెన్ నుంచి ఆల్ప్స్ పర్వతాల్లో సెలవులు గడపటానికి వస్తారు. అదొక విలాసవంతమైన రిసార్ట్. అక్కడ పర్వతాలపై స్కీయింగ్ చేయవచ్చు. వారిది సంపన్నకుటుంబమని తెలుస్తూనే ఉంటుంది. ఒకరోజు స్కీయింగ్ చేసిన తర్వాత భోజనానికి రెస్టారెంట్ డాబా మీద కూర్చుంటారు. అక్కడి నుంచి పర్వతాలు కనపడతాయి. తెల్లని మంచుతో కప్పబడి అందంగా ఉన్న పర్వతాలు చూస్తూ తినవచ్చని వారి ఆలోచన. ఇంతలో దగ్గరలో ఉన్న కొండ మీద మంచు కిందకి జారుతుంది. సాధారణంగా ఇలాంటి చోట్ల అనుకోకుండా మంచు జారి ప్రమాదం జరగకుండా కావాలనే మంచు జారేలా చేస్తారు. అలా అయితే ఎక్కువ మంచు పేరుకుపోకుండా ఉంటుంది. ప్రమాదం జరగదు. ఇది తొమాస్‌కి తెలుసు. అందుకే అతను ఎబ్బాకి, పిల్లలకి ధైర్యం చెబుతాడు. ఫోన్లో ఆ మంచు జారటాన్ని వీడియో తీస్తాడు. అయితే మంచు ధూళి ఎగిరి వారున్న ప్రదేశాన్ని కమ్మేస్తుంది. అందరూ కంగారు పడతారు. ఎబ్బా పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. తొమాస్ అక్కడి నుంచి హడావిడిగా దూరం వెళ్ళిపోతాడు. ఎబ్బా పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళలేక అక్కడే ఉండిపోతుంది. ధూళి తొలగాక తొమాస్ తిరిగి వస్తాడు. ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తాడు.

మొదట్లో ఎబ్బా కూడా ఏం పట్టించుకోనట్టు ఉంటుంది. అయితే సాయంత్రం ఎబ్బా స్నేహితురాలితో, ఆమె ప్రియుడితో భోజనం చేస్తున్నపుడు ఆమె మనసులోని మాట బయటికి వస్తుంది. తొమాస్ తనని, పిల్లల్ని వదిలి పారిపోయాడని అంటుంది. తాను పారిపోలేదంటాడు తొమాస్. అయితే అతనిలో అపరాధభావం ఉంటుంది. పైకి మాత్రం తన తప్పు లేదని అంటాడు. తొమాస్ అలా అనటంతో ఎబ్బాకి ఇంకా అసహనం పెరుగుతుంది. ఇద్దరూ వాదులాడుకుంటారు. స్కీయింగ్ బూట్స్ వేసుకుని పరుగెత్తటం ఎలా సాధ్యం అంటాడు తొమాస్. ఆమె పరిహాసంగా నవ్వుతుంది. ఇద్దరూ తిరిగి గదికి వచ్చాక మాట్లాడుకుంటారు. అతను ఆమెని “నాకు తల తీసేసినట్టయింది. నువ్వు ఏమనుకుంటున్నవో చెప్పు” అంటాడు. ఆమె కాస్త ఆలోచించి “మంచు జారిపడింది. అందరం భయపడ్డాం. కానీ అందరం సురక్షితంగా ఉన్నాంగా” అంటుంది. అతను ఊపిరి పీల్చుకుంటాడు. “అంతే జరిగింది, ఇక మర్చిపోదాం” అంటాడు.

మర్నాటికి ఆమె మనసు మళ్ళీ మారిపోతుంది. తానొక్కదాన్నే స్కీయింగ్ కి వెళతానని బయల్దేరుతుంది. పిల్లలకి వారి ప్రవర్తన చూసి అనుమానం వస్తుంది. చిన్నవాడైన హ్యారీ దురుసుగా ప్రవర్తిస్తుంటే ఏమిటని అడుగుతాడు తొమాస్. “మీరు విడాకులు తీసుకుంటారని భయంగా ఉంది” అంటాడు హ్యారీ. పెద్దవాళ్ళు ఎంత దాచాలన్నా పిల్లలు పసిగట్టేస్తారు. ఇంతకీ ఎబ్బా మనసు ఎందుకు ఊగిసలాడుతోంది? ఇది చాలా మంది భార్యాభర్తలకి అనుభవమే. ఒక సంఘటన ఏదో జరుగుతుంది. మనసు పాడవుతుంది. ఆ సంఘటన ప్రభావంతో ఆలోచన మొదలవుతుంది. భర్తని గానీ, భార్యని గానీ నమ్మవచ్చా అనే అనుమానం వస్తుంది. అంతలోనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది. పెద్ద నష్టం ఏం జరగలేదుగా, ఎందుకు ఉన్న జీవితాన్ని పాడు చేసుకోవాలి అనిపిస్తుంది. అయితే మళ్ళీ అలాంటి సంఘటన ఈసారి నష్టం కలిగేలా జరిగితే ఎలా అనే ప్రశ్న కాసేపటికి తలెత్తుతుంది. ప్రాణభయంతోనే కదా తొమాస్ పారిపోయాడు. అంటే తన భార్యాబిడ్డల ప్రాణం కన్నా తన ప్రాణమే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో మనముంటే ఎలా స్పందిస్తాం అని ఆలోచించుకుంటే సమాధానం దొరకదు. ఏ జీవికైనా జీవితేచ్ఛ (survival instinct) ఉంటుంది. ప్రమాదం వస్తే తనను తాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. మనిషి ఎలా ప్రవర్తిస్తాడనేది ఆ మనిషిని బట్టి ఉంటుంది. అది ఆ మనిషికే తెలియకపోవచ్చు. ఎబ్బా ఒంటరిగా రోజంతా గడుపుతుంది. ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకుంటుంది.

ఆరోజు తొమాస్ స్నేహితుడు మ్యాట్స్ తన ప్రియురాలు ఫ్యానీతో ఆ రిసార్ట్‌కి వస్తాడు. అతనికి ముప్ఫై ఐదేళ్ళుంటాయి. ఫ్యానీ ఇరవై ఏళ్ళ యువతి. రాత్రి అందరూ కలిసి తొమాస్, ఎబ్బాల గదిలో భోజనం చేస్తారు. భోజనం అయిన తర్వాత ఎబ్బా తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటుంది. “ఆ అనుభవంతో నాకు ఆనందమే లేకుండా పోయింది” అంటుంది ఎబ్బా. తొమాస్ తలదించుకుని ఉండిపోతాడు. మ్యాట్స్, ఫ్యానీ నిశ్చేష్టులై ఉండిపోతారు. ఫ్యానీ ఎబ్బాకి సానుభూతి చూపిస్తుంది. మాట్స్ “అలాంటి పరిస్థితుల్లో మనమేం చేస్తున్నామో మనకే తెలియకపోవచ్చు. మనం నేర్చుకున్న విలువలకి కట్టుబడి ఉండలేకపోవచ్చు” అంటాడు. “కానీ తర్వాతైనా తప్పు ఒప్పుకోవాలి కదా” అంటుంది ఎబ్బా. ఇంతలో పిల్లలు ఆడుకునే డ్రోన్ అక్కడ పడటంతో మద్యం ఒలుకుతుంది. ఎబ్బా శుభ్రం చేస్తుంది. తొమాస్ పిల్లల గదిలోకి వెళతాడు. మ్యాట్స్ ఎబ్బాతో మాట్లాడతాడు. 1994లో జరిగిన ఎస్టోనియా దుర్ఘటన గురించి మాట్లాడతాడు. ఏస్టోనియా అనే నౌక మునిగిపోవటంతో 850 మంది మరణించారు. బతికిఉన్నవాళ్ళు శవాలని తొక్కుకుంటూ వెళ్ళి ప్రాణాలు దక్కించుకున్నారు. వారికి తాము చేసింది తప్పని తెలుసు. జీవితాంతం ఆ అపరాధభావం ఉంటుంది. అయితే వారు చేసినదానికి శిక్ష ఏమీ ఉండదు. ఎబ్బా “ఎవరూ తమ పిల్లల్ని తొక్కుకుంటూ వెళ్ళరు కదా. ఈ సంఘటన జరిగినపుడు నా ధ్యాస అంతా నా పిల్లల మీద ఉంది. వాళ్ళు చిన్నవాళ్ళు, అశక్తులు. తొమాస్ ధ్యాస అంతా పారిపోవటం మీదే ఉంది” అంటుంది. తొమాస్ అక్కడికి వస్తాడు. మ్యాట్స్ అతన్ని “నీ సమాధానం ఏమిటి?” అని అదుగుతాడు. ఎబ్బా చెప్పినదానితో తాను ఏకీభవించను అంటాడు తొమాస్. తాను పారిపోలేదంటాడు. ఎబ్బా “అంతా ఫోన్లో రికార్డయింది” అంటుంది. (ఎలా రికార్డయిందో నాకు అర్థం కాలేదు. ఆ విషయం పక్కన పెడదాం.) అందరూ ఆ వీడియో చూస్తారు. “ఇందులో చూస్తే నేను పారిపోతున్నట్టే కనిపిస్తోందని ఒప్పుకుంటాను” అంటాడు తొమాస్. ఇదంతా చూస్తుంటే నవ్వు వస్తుంది. కానీ ఎవరో తత్త్వవేత్త అన్నట్టు మన జీవితాన్ని మనకే ఎవరైనా రంగస్థలం మీద నాటకంలా చూపిస్తే పడీ పడీ నవ్వుతాం. వేరొకరి జీవితం చూసి వ్యాఖ్యలు చేయటం సులభమే. ఆ పరిస్థితిలో మనమేం చేస్తాం అని నిజాయితీగా ఆలోచించుకోవాలి. తర్వాత తొమాస్ ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు.

పురుషుడే కుటుంబరక్షణకి పూనుకోవాలా అనే ప్రశ్న రావచ్చు. కానీ ఇక్కడ ఎబ్బా తాను పిల్లలను రక్షించాలని ప్రయత్నించింది. తొమాస్ నుంచి సహకారం ఆశించింది. అతను తన రక్షణే ముఖ్యమనుకున్నాడు. అయితే అబద్ధం ఎందుకు చెప్పాడు. తాను పారిపోయానంటే అందరూ అతన్ని చులకనగా చూస్తారు. మగవాడంటే ఇలా ఉండాలి అనే ఒక అభిప్రాయం సమాజంలో ఉంది. అది అందుకోలేకపోతే ఏ మగవాడైనా ఆత్మన్యూనతకు లోనౌతాడు. తొమాస్ తన గౌరవాన్ని కాపాడుకోవటానికి అబద్ధం చెప్పాడు. అతను అసంకల్పితంగా చేసిన పనికి సమాజానికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇది అతనిలో అంతర్మథనాన్ని రేకెత్తిస్తుంది.

తర్వాత మ్యాట్స్, ఫ్యానీ తమ గదికి వెళతారు. “నువ్వైతే తొమాస్ లాగే పారిపోయేవాడివి” అంటుంది ఫ్యానీ. మ్యాట్స్ చిన్నబుచ్చుకుంటాడు. “మా తరం వారు మీ తరం వారి కంటే భిన్నమైనవారు. మా తరం వారు తమ కుటుంబాన్ని వదిలి పారిపోరు” అంటుందామె. ఇది ఆయా దేశాలలోని పరిస్థితులని బట్టి వేసే అంచనా. “నా కుటుంబాన్ని నేను బాగా చూసుకుంటాను” అంటాడతను. “నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ మాజీ భార్య దగ్గర కదా. నువ్వేమో నాతో సెలవులు గడపటానికి వచ్చావు. నీ మాజీ భార్య ఏమనుకుంటుందో ఆలోచించు” అంటుందామె. ఇలా వారు రాత్రంతా వాదులాడుకుంటారు. ఇదంతా చూస్తుంటే ఒకరు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినట్టు పక్కనే ఉన్నవారు చూడరు కదా అనిపిస్తుంది. ఒకే విషయం గురించి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అంతా మన దృష్టిని బట్టి ఉంటుంది. ఇతరుల్లో లోపాలు ఎత్తిచూపే ముందు మన లోపాలు కూడా ఆలోచించుకోవాలి. ఒక్క విషయం ఆలోచించండి. మ్యాట్స్ మీద అంత న్యూనమైన అభిప్రాయం ఫ్యానీకి ముందే ఉందా? లేదు. ఎబ్బా చెప్పింది విని ఆమె మ్యాట్స్‌ని అంచనా వేయటం మొదలుపెట్టింది. అతను నమ్మదగినవాడు కాదని అప్పుడు అర్థమైంది. ఎబ్బా తనకు ఎదురైన అనుభవంతో తమ వివాహబంధం గురించి ఆలోచనలో పడింది. ఫ్యానీకి ఆ అనుభవం ఎదురవకపోయినా ఆమె కూడా ఆలోచనలో పడింది. అధికశాతం మనుషులు అసలు ఎదురౌతాయో లేదో తెలియని పరిస్థితుల గురించి ఆలోచించరు. అలా ఆలోచిస్తే సంతోషంగా ఉండలేం.

రూబెన్ ఓస్ట్లండ్ స్క్రీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించిన చిత్రమిది. కాస్త ఓపిగ్గా చూడాలి. అంతా గబగబా జరిగిపోవాలి అనుకునే ప్రేక్షకులకి ఈ చిత్రం నచ్చకపోవచ్చు. వివాహబంధాలు ఎంత సంక్లిష్టమైనవో చెప్పటానికి ఒక ఉదాహరణగా ఈ చిత్రం నిలిచిపోతుంది. ఎబ్బాగా నటించిన లీసా కోంగ్స్లీ అద్భుతంగా నటించింది. ఎబ్బా మనసులోని సంఘర్షణని ఆమె హావభావాల్లో చూపించిన తీరు గుర్తుండిపోతుంది. యొహాన్స్ కున్క తొమాస్‌గా నటించాడు. మనసులో ఒకలా, పైకి ఒకలా ఉండే వ్యక్తిగా చక్కగా నటించాడు. ఫ్రెడ్రిక్ వెంజెల్ ఫొటోగ్రఫీ ఉన్నత శ్రేణిలో నిలిచేదిగా ఉంటుంది. ముఖ్యంగా పర్వతాల పై తీసిన దృశ్యాలు అపురూపంగా ఉంటాయి. మంచులో ఫొటోగ్రఫీ చాలా కష్టం. కొన్ని స్కీయింగ్ దృశ్యాలైతే నోరు వెళ్ళబెట్టేలా చేస్తాయి. చిత్రంలో ఒక అంశం ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి తొమాస్, ఎబ్బా ఆ సంఘటన గురించి మాట్లాడుకునేటపుడు గది బయటకి వచ్చి మాట్లాడుకుంటారు. పిల్లలు వినకూడదని. అదొక బహుళ అంతస్థుల రిసార్టు. గదులు ఎదురుబదురుగా ఉంటాయి కానీ మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. గది బయట నిలబడితే కాస్త దూరంగా వేరే గదులు కనపడతాయి. పైకి చూస్తే పై అంతస్తులోని గదులు కనపడతాయి. తొమాస్, ఎబ్బా గది బయట మాట్లాడుకునేటపుడు గదులు శుభ్రం చేసే పనివాడు పై అంతస్తు నుంచి వారిని చూస్తూ ఉంటాడు. ఎబ్బా ఆ పనివాడితో “మమ్మల్ని కొంచెం ఒంటరిగా వదిలేస్తావా?” అంటుంది. తర్వాత అదే పనివాడు మ్యాట్స్, ఫ్యానీ వెళ్ళే లిఫ్ట్‌లో ప్రవేశిస్తాడు. చిత్రం ముగిసే ముందు తొమాస్, ఎబ్బా మళ్ళీ గది బయట  మాట్లాడుకుంటారు. అయితే గది తాళం లోపల ఉండిపోతుంది. పనివాడిని పిలిచి తాళం తీయిస్తారు. ఈ పనివాడు దేవుడికి ప్రతీక అని నాకనిపించింది. మొదటిసారి అతన్ని పొమ్మంది ఎబ్బా. అంటే దేవుడిని విస్మరించారు. మ్యాట్స్, ఫ్యానీ లిఫ్ట్‌లో ఉన్నపుడు పనివాడు రావటం ఇదే దైవసంకల్పం అనటానికి ప్రతీక. చివరికి దేవుడి సహాయంతో తొమాస్, ఎబ్బా తిరిగి తమ జీవితాన్ని తిరిగి పొందారు. దేవుడి రూపాలు అనేకం. వాటిలో కొన్ని – సాక్షి, అంతరాత్మ ప్రబోధం, క్షమాగుణం.

ఈ క్రింద చిత్రకథ మరికొంత ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

మర్నాడు తొమాస్, మ్యాట్స్ కలిసి స్కీయింగ్‌కి వెళతారు. దరిదాపుల్లో వేరెవరూ ఉండరు. మ్యాట్స్ ఫ్యానీని వదిలేసి వచ్చాడు. అంటే వారు ఒకరికొకరు దూరమౌతున్నారు. మ్యాట్స్ ఉత్సాహంగా స్కీయింగ్ చేస్తాడు. తొమాస్ కాసేపు చేశాక “నాకిక చేయాలని లేదు” అంటాడు. మంచులో చతికిలబడతాడు. మ్యాట్స్ “ఒకసారి గట్టి అరువు. నేను థెరపీ (సైకియాట్రిస్ట్ ఇచ్చే కౌన్సెలింగ్) తీసుకున్నప్పుడు నాకేం ఉపయోగం కనిపించలేదు. కానీ ఒకసారి గట్టిగా అరిస్తే మనసులోని బరువంతా దిగిపోయింది” అంటాడు. తొమాస్ అరుస్తాడు. హోటల్‌కి తిరిగి వచ్చాక ఎబ్బాతో మాట్లాడతాడు. మొదట ఏడుస్తున్నట్టు నటిస్తాడు. ఎబ్బా అతని నటనని పట్టుకుంటుంది. అప్పుడు అతను తన మనసులోని మాటలు చెబుతాడు. ఇంత నిజాయితీగా ఒక భర్త మాట్లాడటం నేను ఏ సినిమాలోనూ చూడలేదు. “నువ్వు నా ఈ రూపం చూసి నిరాశపడ్డావని తెలుసు. నేను కూడా వాడిని చూసి నిరాశపడుతున్నాను. వాడు ఎన్నో తప్పులు చేశాడు. అబద్ధాలు చెప్పాడు. అక్రమసంబంధం పెట్టుకున్నాడు. తర్వాత నిజం చెప్పేశాడనుకో. పిల్లలతో ఆటలాడేటపుడు కూడా తొండి చేస్తాడు. ఎంత దారుణం! వాడితో నేనిక పడలేను. నువ్వే కాదు, నేను కూడా వాడి వల్ల దగాపడ్డాను” అని ఏడుస్తాడు. తనను తాను పరిశీలించుకోకపోతే ఈ నిజాయితీ రాదు. అంతర్మథనం పడకపోతే ఇలా ఎవరూ మాట్లాడలేరు. తన తప్పులను తానే అసహ్యించుకోవటం మనిషి ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. మార్పు ప్రారంభమైనట్టే. ఇక్కడ ఇంకో విషయం మనకు తెలుస్తుంది. అతను గతంలో అక్రమసంబంధం పెట్టుకున్నాడని, దాని గురించి ఆమెకి చెప్పేశాడని. అంటే వారి వివాహబంధంలో పగుళ్ళు అప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఆమె అతని మాటలను నిర్లిప్తంగా వింటుంది. అతను ఏడుస్తుంటే పిల్లలు అతని దగ్గరకు వస్తారు. “నాన్న కాస్త విచారంగా ఉన్నారంతే” అంటుంది ఎబ్బా. పిల్లలు తండ్రి దగ్గర చేరుతారు. తండ్రిని ఓదార్చటానికి ప్రయత్నిస్తారు. కూతురు పట్టుబట్టటంతో ఎబ్బా కూడా వారి దగ్గరకి చేరుతుంది. అయితే ఆమె పూర్తిగా అతన్ని క్షమించలేదు. ఇది తెలిసిపోతూనే ఉంటుంది.

మర్నాడు అందరూ స్కీయింగ్ చేయటానికి వెళతారు. పొగమంచు ఎక్కువగా ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే ఎబ్బా కనిపించదు. తొమాస్ వెనక్కి వెళ్ళి కాసేపటికి ఎబ్బాని ఎత్తుకుని తీసుకుని వస్తాడు. ఎబ్బా బాగానే ఉంటుంది. తొమాస్ సంతోషపడతాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎబ్బా పెద్దగా వ్యాకులపడినట్టు ఉండదు. వెంటనే లేచి నడిచి వెళుతుంది. అంటే ఆమె నిజంగా ప్రమాదంలో పడలేదు. భర్తని పరీక్షించినట్టు అనిపిస్తుంది. అయితే ఎవరైనా తప్పిపోతే వెనక్కి వెళ్ళి వారి కోసం వెతకటం పెద్ద సాహసమేమీ కాదు. కాబట్టి ఇది పరీక్ష కాదు. అతని ఆత్మవిశ్వాసాన్ని అతనికి తిరిగి కలిగించటానికి, పిల్లల ఎదుట అతని స్థాయిని పెంచటానికి ఆమె చేసిన పని లాగా అనిపిస్తుంది. ఆమె మంచితనం ఇక్కడ బయటపడుతుంది. ఆమె అతన్ని ఎప్పటికీ క్షమించకపోవచ్చు. కానీ అతనిలాంటి నిజాయితీపరుడు మరొకరు ఉండరు. అతను మళ్ళీ తప్పు చేస్తే? ఇలా అనుకుంటే జీవితం దుర్భరమౌతుంది. ఎక్కడో ఒకచోట నమ్మకం ఉండాలి.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం అపేయగలరు.

సెలవులైన తర్వాత అందరూ తిరుగుప్రయాణమౌతారు. మ్యాట్స్, ఫ్యానీ కూడా వారితో బయలుదేరుతారు. కానీ వారి మధ్య దూరం ఉంటుంది. అందరూ ఒక బస్సులో పర్వతప్రాంతం నుంచి కిందకి దిగుతూ ఉంటాడు. డ్రైవరు ఘాట్ రోడ్దు మలుపుల దగ్గర బస్సు మలుపు తిప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎబ్బాకి కంగారుగా ఉంటుంది. డ్రైవరు పనితనం లేనివాడని బిగ్గరగా అంటుంది. తర్వాత మలుపు దగ్గర మళ్ళీ డ్రైవరు బస్సుని తిప్పలేక ఆపుతాడు. అసలే కొండప్రాంతం. ఏమన్నా అయితే బస్సు లోయలో పడుతుంది. ఎబ్బా డ్రైవరుని తలుపులు తెరవమని అరుస్తుంది. తలుపులు తెరవగానే దిగిపోతుంది. తొమాస్, పిల్లలు బస్సులోనే ఉండిపోతారు. బస్సులో ఉన్నవాళ్ళందరూ కంగారుగా దిగబోతుంటే మ్యాట్స్ వారిని తోసుకోకుండా దిగమంటాడు. అందరూ దిగుతారు. నడిచి కిందకి వెళుతూ ఉంటారు. తొమాస్ పెదవుల మీద ఒక చిరునవ్వు వస్తుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.

ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు ఎబ్బా కూడా ముందు తన మంచే చూసుకుంది. ఎవరి భయం వారిది. ఎత్తు మీద నుంచి కిందకి చూసి ఎబ్బా భయపడింది. పిల్లలని వదిలేసి బస్సు దిగింది. తొమాస్ ఇది గమనించాడు. అన్ని నీతులు చెప్పిన ఆమె అలా చేయటం చూసి అతనికి నవ్వు వచ్చింది. ఎవరి లోపాలు వారికుంటాయి. సర్దుకుపోవటమే జీవితం. ఒకవేళ తొమాస్ ఎప్పుడైనా ఎబ్బాని ఆమె ప్రవర్తన గురించి అడిగితే ఆమె ఏమంటుంది? ఔన్నత్యం ఉంటే నిజం ఒప్పుకుంటుంది. తాను చేసిన పనికి తానే నవ్వుతుంది. ఇంకా గొప్ప వ్యక్తిత్వం ఉంటే తను చేసిన పనికి తానే తొమాస్‌కి క్షమాపణ చెబుతుంది. ఆ పరీక్షకు నిలబడేవారు ఎంతమంది? వివాహబంధాన్ని ఇంత సునిశితంగా పరిశీలించే చిత్రాలు చాలా అరుదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here