[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]రోజు తెలుగువారి నూతన సంవత్సర పండుగ ఉగాది. కోనసీమలోని అమలాపురం పట్టణానికి సమీపాన ఉన్న ఆ గ్రామంలోని ఇళ్ళూ, వాకిళ్ళూ చిక్కని ముగ్గులతో నిండి ఉన్నాయి. విరబూసిన వేపచెట్లూ, గుత్తుల మావిడికాయలతో గున్న మావిళ్ళూ ఆ వీధిలోని చాలా ఇళ్లల్లో ఉన్నాయి. వాటిమీద కోయిలలు ఉండీ ఉండీ తియ్యగా కూస్తున్నాయి.
పార్వతమ్మ ఉదయాన్నే అయిదుగంటలకు లేచి శ్రీ రామ నామం చెప్పుకుంటూ మొహం కడుక్కుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని రాముడి విగ్రహాన్ని శుభ్రంగా తడిబట్టతో తుడిచి వాకిట్లోకి నడిచి కొన్ని పువ్వులు కోసుకుని తెచ్చుకుంది. తన నోటికి వచ్చిన రాముడి పాటలన్నీ పాడుకుంటూ కడిగి పెట్టుకున్న కుందుల్లో దీపాలు వెలిగించి, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి, దొడ్లోకి వెళ్లి తులసి మొక్కకి ప్రదక్షిణం చేసి నీళ్లుపోసింది. ఆ తర్వాత వంటింట్లోకి ప్రవేశించి ఫ్రిజ్ లోంచి పాలు తీసుకుని గ్యాస్ స్టవ్ వెలిగించి కాచుకుని స్టీల్ గ్లాస్ నిండా కాఫీ కలుపుకుని తులసమ్మ ఎదురుగా ఉన్న సిమెంట్ గట్టుమీద కూర్చుని త్రాగుతూ ఆలోచనల్లో పడింది. భర్త ఉండగా, పిల్లలు చిన్నవాళ్ళప్పుడు నలుగురూ కలిసి జరుపుకున్న ఉగాది పండగలు గుర్తొచ్చాయామెకు. ‘ఆయన మహారాజులా దేవుడిలో లీనమయ్యారు. పిల్లలు వాళ్ళ వాళ్ళ సొంత గూళ్ళలో కుదురుకున్నారు.నేనేమో ఇలా ఒంటరిగా మిగిలిపోయాను’ అనుకుంది. అంతలోనే ధైర్యం తెచ్చుకుని ‘భక్త శబరిని నేను. ఏదొక రోజు ఈ జీవుడికి విముక్తి దొరికేదాకా తప్పదుకదా ఈ సంసారం’ అనుకుందామె.
ఆవిడ బహు నెమ్మదిగా వంటకి సంబారాలన్నీకూర్చుకునేటప్పటికి సహాయకురాలు, డెభై ఏళ్ల సీతమ్మ వచ్చేసింది. “అప్పుడే లేచి పూజ కూడా సేసేసుకున్నారా” అంది నవ్వుతూ. “అయిదయ్యాక లేచాను. అసలు పండగ అంటే నాలుక్కే లేచేవాళ్ళం వయసులో” అందావిడ. సీతమ్మ మాట్లాడకుండా పనంతా చేసుకుని వెళ్లిపోతుంటే “మళ్ళీ రా! నాతో పాటే తిందువుగాని ఈ పూట” అంది పార్వతమ్మ. సీతమ్మ కూడా ఒంటరిగానే ఉంటుంది. ఓపికున్న చిన్న చిన్న పనులు చేసుకుని పొట్టపోసుకుంటుంది. కొడుకు దగ్గరికి వెళ్లొచ్చు కదా అంటే, ‘పిల్లలతో వాళ్ళను వాళ్ళే పోషించుకోవడం కష్టం. నా బరువెందుకని?’ అంటుంది తప్ప మరో మాట చెప్పని అభిమానవతి సీతమ్మ. “అలాగేనమ్మా” అంటూ వెళ్లిపోయింది సీతమ్మ. పార్వతమ్మ వంటపని ముగించుకుని వాటిని దేవుడికి సమర్పించి, ఆ ప్రసాదం కొంత తిని కాసేపు నిద్రపోయింది. తర్వాత లేచి చిన్నకొడుకుపైకి మనసు లాగి, వరండాలోకొచ్చి కూర్చుని ఫోన్ నంబర్లున్న పుస్తకం దగ్గర పెట్టుకుని ఫోన్ చేసింది. రెండు మూడు సార్లు ప్రయత్నించి, ఇంటి ఓనర్ వసంత పోర్షన్ వైపుకి వెళ్ళిందామె.
“మా చిన్నబ్బాయింటికి కొడుతుంటే ఫోన్ కలవట్లేదేంటి? ఒక్కసారి చూడమ్మా! వసంతా!” అడిగింది పార్వతమ్మ.
వసంత ఫోన్ కలిపి అవతల ఎత్తాక ఇచ్చింది పెద్దామెకి. ఎప్పట్లానే ఆవిడకి సరిగా వినబడాలని స్పీకర్ కూడా పెట్టి ఇచ్చింది.
“ఇందాకటినుండీ చేస్తున్నానే రాణీ” అంది పార్వతమ్మ కుర్చీలో కూర్చుంటూ.
పక్క గదిలోకి వెళ్ళబోయినదల్లా పెద్దావిడ సైగతో అక్కడున్న పేపర్ తీసుకుని చదువుతూ కూర్చుంది వసంత.
కోడలు ఏదో పని హడావిడిలో ఉన్నట్టుగా ఉంది. “అవును పనిలో ఉన్నాను” అంటున్నకోడలు గొంతులో కాస్త విసుగు. దాన్ని దాచుకుంటూ “ఏం చేస్తున్నారత్తయ్యా?” అంది.
“పండగ కదా అని చేశాను.ఎలా ఉన్నారు? మీరంతా?”అడిగింది అత్తగారు.
“బానే ఉన్నాం”
“ఏం వండుతున్నావ్ పండక్కి?” అడిగింది పార్వతమ్మ నవ్వుతూ.
“ఇంకా వంటల పని కాలేదు. మీరేం చేశారు?” కోడలడిగింది.
“పొద్దున్నే కొబ్బరికాయ కొట్టాను. కాఫీ తాగి, కొద్దిగా పాయసం,పులిహోర చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను” అంది పెద్దామె తృప్తిగా.
“మీరే నయం! కావలసినవన్నీ చేసుకుంటున్నారు. మేమే చేసుకోలేక పోతున్నాం. సర్లెండి. ఖాళీ అయితే చేస్తాను” అంది రాణి సంభాషణ ముగిస్తూ.
“రాజేష్ ఏం చేస్తున్నాడు?”
“పైన ఏదో ఆఫీస్ పనిలో ఉన్నట్టున్నారు. పెట్టేస్తున్నా” అంటూ పెట్టేసింది కోడలు.
ఏదో అలవాటు కొద్దీ ఓపిక లేకపోయినా చిన్న గిన్నెకి స్వీట్, చిన్న బాక్స్‌కి పులిహోర చేసుకున్నందుకు కోడలు మీ పనే బావుంది అనడంతో వసంతకి చివుక్కుమనిపించింది. కాస్త కొడుకు మాట్లాడితే పెద్దావిడ మురిసిపోయేది కదా!
చిన్నబోయిన ఆవిడ మొహం చూసి, వసంత ఆమెను కూర్చోమని కాసేపు కబుర్లు చెప్పి తను చేసిన గారెలు రెండు, ఓ కప్పు సేమ్యా ఇచ్చింది.
“ఇవి తింటే నేను చేసినవి ఎవరు తింటారు?” అంటూ నవ్విందావిడ. “రెండేగా. ఫర్వాలేదు తినండి, నేను కూడా మీతో తింటా” అంటూ తెచ్చుకుంది వసంత. ఇద్దరూ తిన్నారు. నిజానికి ఎనభై ఏళ్ళు దాటిన పార్వతమ్మకి స్వయంగా వండుకు తినే శక్తి ఉండడం లేదు. తప్పక రోజులు వెళ్లదీస్తోంది. అంత పెద్దావిడ మన మీద భారం వెయ్యకుండా, దూరాన ఒక్కతే ఉంటోందన్న కృతజ్ఞత కూడా లేకుండా కోడలు ఎంత కఠినంగా మాట్లాడిందో! ఆఖరికి కొడుక్కి కూడా ఫోన్ ఇవ్వలేదు అనుకుంది వసంత. మరో పది నిముషాలు కూర్చుని నెమ్మదిగా తన పోర్షన్ లోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ.
వసంత ఆ ఇంటి ఓనర్. రాష్ట్ర ప్రభుత్వ హైస్కూల్లో బి.ఎ. బి.యిడి. టీచర్‌గా పనిచేసి, హెడ్ మాస్టర్‌గా గత సంవత్సరమే రిటైర్ అయింది. వసంత భర్త వెంకట్రావు డిగ్రీ పూర్తి చేయలేక పోవడం వల్ల అతనికి ఎక్కడా తగిన ఉద్యోగం దొరకలేదు. చదివిన చదువు బీకామ్ అవడం వల్ల చిన్న చిన్న షాపుల్లో ఎకౌంట్స్ రాసే ఉద్యోగం చేసేవాడు. వసంత ట్రాన్స్‌ఫర్‍లపై వివిధ ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలోనే ఉద్యోగం చూసుకునేవాడు. సహృదయుడు. ఉద్యోగస్థురాలైన భార్యకు తన పూర్తి సహకారం అందించిన భర్త అతను. వసంత ఉద్యోగపర్వం అయ్యి రిటైరయ్యాక కూడా వెంకట్రావు తనకున్నఅనుభవంతో అమలాపురంలోనే తమ బంధువులు నడిపే ఓ పెద్ద బట్టల షాప్‌లో బిల్లులూ, లెక్కలూ చూసే సెక్షన్‌లో పనిచేసే కుర్రాళ్ళని సూపర్‌వైజ్ చేసే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. “మీ పనే బావుంది రిటైర్ అవ్వక్కర్లేదు. మమ్మల్ని పనికి రావని ఇంటికి పంపుతారు” అంటూ నవ్వుతుంది వసంత భర్తతో.
వెంకట్రావు తల్లితండ్రులకి ఒకడే సంతానం. అతని తండ్రి వెంకట్రావుకి పదేళ్లున్నప్పుడే పోయాడు. తల్లి కూడా అతనికి పెళ్లయిన రెండేళ్లకే కాలం చేసింది. వసంతా వెంకట్రావు దంపతులకి ఒక కూతురు. ఒక కొడుకు. పిల్లలిద్దరికీ వసంత సర్వీస్‌లో ఉండగానే పెళ్లిళ్లు అయ్యాయి.
వసంతకి ఉద్యోగవిరమణ తర్వాత వచ్చిన సొమ్ములో కొంత సొమ్ము వెచ్చించి, మరి కొంత బంగారం బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని అమలాపురాన్ని ఆనుకొని ఉన్న ఒక పల్లెటూర్లో తమకు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకున్నారు వసంత దంపతులు. వీధిగదికి కటకటాలుండే, ఆ ఇంటిలో రెండు బెడ్ రూమ్‌లూ, వంటిల్లూ, హాల్ వాళ్ళు వాడుకుంటారు. పక్కగా ఒక పెద్ద రూము, చిన్న కిచెన్, బాత్రూం కట్టి అద్దెకు ఇచ్చారు. పార్వతమ్మ అందులోనే ఉంటున్నది.
వసంత, వెంకట్రావుల అబ్బాయి శైలేష్ చాలా తెలివైన వాడు. క్యాంపస్ సెలక్షన్‌లో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మంచి కంపెనీలో సంపాదించాడు. బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతనికి ఇద్దరు పాపలు. వసంత, వెంకట్రావుల కూతురు నిర్మల పెద్దది. అందంగా ఉండేది నిర్మలని ఏరికోరి అమలాపురం చుట్టు పక్కల కాంట్రాక్ట్స్ చేసే రఘురామయ్య గారు, కోడలిగా చేసుకోవడం జరిగింది. అల్లుడు శ్రీరామ్ ఆ కాంట్రాక్ట్స్‌లో తండ్రికి సహాయకారిగా ఉంటాడు. బాగా సంపాదించుకుంటున్నారు. అమలాపురంలో మంచి సెంటర్లో డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు. కారు, నౌకర్లతో మంచి పొజిషన్లో ఉన్నారు. వసంతకు కూతురు ధనవంతుల ఇంటి కోడలు కావడం ఒక విధంగా అదృష్టమైనా, మరొక విధంగా కొద్దిగా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అటువంటి న్యూనతాభావం ఏర్పడడానికి కారణం అల్లుడు కాకుండా కూతురి ప్రవర్తన కావడం ఒక విశేషం. అల్లుడు సౌమ్యుడు. అత్తామావలు తల్లితండ్రులతో సమానం అనుకునే వ్యక్తి.
ఉగాది వెళ్లిన మూడోరోజు నిర్మల పెద్ద కొడుకు పదో పుట్టినరోజు వచ్చింది. లాభాల బాటలో ఉన్న వియ్యంకుడు ఈసారి ఈ వేడుక భారీ ఎత్తున చెయ్యతలపెట్టాడు. స్థానికంగా ఉన్న మంచి ఏసి హోటల్‍లో డిన్నర్ ఏర్పాటు చేసారు. తన సర్కిల్ లోని బంధు మిత్రులందరినీ పిల్చాడాయన. వసంత దంపతులకి, మనవడి చేతిలో ఆ రోజు ఎంత పెట్టాలీ అన్న మీమాంస వచ్చింది. నిర్మల డెలివరీలు రెండూ మంచి హాస్పిటల్‍లో చెయ్యడం, ఆ తర్వాత బారసాల చేసి పుట్టిన మగపిల్లలకు బంగారం అదీ పెట్టేసరికి వెంకట్రావ్ వసంతలకి బాగానే ఖర్చయ్యింది. ఇటీవల కట్టుకున్న ఇంటికి కూడా మొదట అనుకున్నదానికంటే ఎక్కువే ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక చెయ్యడమే కానీ వెంకట్రావుకి ఆ బట్టల షాప్ వాళ్లిచ్చేది పదివేలే. వడ్డీకి తెచ్చిన కొన్ని అప్పులు, కొన్ని చేబదుళ్ళు, ఇంకా బ్యాంకు బంగారం లోన్ ఒకటి తీర్చవలసింది ఉంది. వసంత పెన్షన్, పార్వతమ్మ గారిచ్చే ఇంటద్దె ఐదువేలు మాత్రమే ఆదాయం వారికి. అన్నీ ఆలోచించుకుని మనవడి పుట్టిన రోజుకి ఓ ఐదువేలు పెడదామని నిర్ణయించుకున్నారు.
హోటల్లో పార్టీ ఆర్భాటంగా మొదలయ్యింది. నిర్మల, ఆమె అత్తగారూ వంటినిండా నగలతో మంచి పట్టు చీరలతో మెరిసిపోతున్నారు. ‘ఎంతబావుందో నిర్మల! డబ్బుంటే ఆడవాళ్ళ అందం పెరిగిపోతుంది’ అనుకుని నవ్వుకుంది వసంత కూతుర్ని కళ్ళనిండుగా చూసుకుంటూ. చాలామంది బంధువులు, స్నేహితులు వచ్చారు. అందరినీ చూస్తూ ‘కాంట్రాక్టర్స్‌కి పెద్ద సర్కిల్ ఉంటుంది మరి’ అనుకున్నాడు వెంకట్రావు ఆనందంగా.
వచ్చిన వాళ్ళు స్టేజి ఎక్కి పిల్లాడికి అక్షింతలు వేసి గిఫ్ట్ కవర్‌లు చేతిలో పెడుతున్నారు. ఆ పక్కనే ఒక పెద్దాయన ఆ కవర్లు తీసుకుని ఒక బ్యాగ్లో వేసి, పేర్లు రాసుకుంటున్నాడు. వెంకట్రావూ, వసంతా పైకి వెళ్లి అక్షింతలు వేసి పిల్లాడి చేతిలో కవర్ పెట్టారు. నిర్మల హడావిడిగా వచ్చి “అమ్మా ఏం పెడుతున్నావ్?” అంది కవర్ పిల్లాడి చేతిలోంచి లాక్కుంటూ. “ఐదువేలు” అంటూ తల్లి చెప్పగానే “ఇంకా నయం ముందే చెప్పావు” అంటూ బాగ్‌లో వేసుకుని అందరికీ “పదివేలు పెట్టానని చెప్పు. ఇంకో ఐదువేలు అందులో నేను వేస్తాన్లే” అంటూ వెళ్ళిపోయింది.
వసంత మనసు చిన్నబోయింది. భోజనం సంతోషంగా చెయ్యలేకపోయింది. ‘కూతురు ధనవంతురాలయ్యిందని తల్లి ధనవంతురాలు కాలేదు కదా!’ అనుకుంది బాధగా. ఇంటికి వచ్చి భర్తకు కూతురు అన్న మాట చెప్పింది. ఆయన చాలా ఆనందపడ్డాడు. “చూశావా మనమ్మాయి కాబట్టి” అన్నాడు. తాను మనసు కష్టపెట్టుకున్న సంగతి భర్తకు చెప్పింది. “ఇందులో తప్పు చేసుకోవలసిందేముంది వసంతా! నిజమే. దాని స్టేటస్ పెద్దది. అందుకే అలా అంది” అటు తిరిగి పడుకుంటూ అన్నాడాయన. మర్నాడు కూతురు ఫోన్ చేసి, నిన్న జరిగిన వేడుక గురించి చాలా విశేషాలు చెప్పింది. పిల్లాడికి కాష్ రెండు లక్షలు వచ్చిందట. బహుమతులకి లెక్కే లేదట. అవన్నీ విని “చాలా సంతోషంరా నిమ్మీ” అని ఊరుకుంది వసంత.
కూతురు ఎప్పుడైనా చూడడానికి వచ్చినా వసంతకి భయంగానే ఉంటుంది. అల్లుడు శ్రీరామ్ “మీరేమీ హైరానా పడకండత్తయ్యా! ఏది ఉంటే అది తిందాం. సింపుల్‍గా చేయండి స్పెషల్స్ వద్దు” అంటాడు. పైకనడమే కాదు మనసులో కూడా ఆ అబ్బాయి స్నేహపాత్రుడు. అత్త మామలంటే గౌరవం ఉన్నవాడు. మనవలు బంగారు కొండలు. ‘అమ్మమ్మ! తాతయ్య!’ అంటూ ఒళ్ళో కూర్చుని ముద్దులు పెడతారు. వసంత కూతురు మాత్రం “ఏంటమ్మా మేం వస్తే కాస్త స్పెషల్‍గా చెయ్యాలి కదా? బిర్యానీ చెయ్యి. చికెన్ తెమ్మను నాన్నను. అది కూడా చెప్పాలా? స్వీట్స్, కూల్ డ్రింకులు, ఐస్ క్రీం కూడా తెప్పించు” అని విసుక్కుంటుంది. అన్నీ చెప్పినట్టు తెచ్చి పెట్టినా మొహం మాడ్చుకున్నట్టుగానే పెట్టుకుంటుంది తప్ప తల్లితో మనసు విప్పి మాట్లాడదు. మా హోదాకు తగ్గట్టుగా మమ్మల్ని గౌరవించాలి అన్నట్టుంటుంది నిర్మల వాలకం. వెంకట్రావుకి ఇదంతా అర్థం కాదు. ఆయనకి కూతురిపై వల్లమాలిన ప్రేమ. కూతురు వస్తోంది అంటే వసంతకి ఒకలాంటి టెన్షన్ ప్రారంభం అవుతుంది. కోడళ్ల ప్రవర్తనలోని తప్పుల్ని నలుగురికీ చెప్పుకుని ఓదార్పుల్ని పొందొచ్చు. కూతురి పట్ల ఆ ఛాన్స్ లేదు అనుకుంటుంది వసంత విరక్తిగా.
***
పార్వతమ్మ భర్త చనిపోయి పదేళ్ళయింది. మురమళ్ళలో పదెకరాల ఆస్తి గల ఆసామీ భార్య పార్వతమ్మ. భర్త చనిపోయాక ఆస్తిని కొడుకులిద్దరికీ సమానంగా పంచి పెట్టేసిందామె. ఇల్లు కూడా అమ్మేసి ఆ డబ్బూ, ఇంట్లో ఉన్న కొంత రొక్కం తల్లిపేరు మీద పెట్టారు కొడుకులు. వచ్చే వడ్డీ ఆమెకు అందేట్టుగా ఏర్పాటు చేశారు. పార్వతమ్మ స్వతహాగా భయస్థురాలు. భర్త పోయిన తర్వాత ఒక సంవత్సరం ఇద్దరు కొడుకుల దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. తర్వాత ఆమె ఉండలేకపోయింది. పల్లెటూరులోనే ఉండాలనుకుంది. కొడుకులు సరేనన్నారు.
దగ్గరి బంధువులెవరో పార్వతమ్మ విషయం విని, ఇచ్చిన సలహా మీద అమలాపురం పక్కనే ఉన్న గ్రామంలో వసంత ఇంట్లో అద్దెకి ఉంటోంది. పనమ్మాయి సాయంతో వండుకుని తింటూ ఉంటుంది. ఏడాదికోసారి కొడుకులిద్దరి దగ్గరికీ వెళ్లి వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సందర్భం వచ్చినపుడు తన డబ్బులోంచి మనవలకి పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడామె వయసు ఎనభై దాటింది. కొద్దిగా రక్త పోటూ, చక్కర వ్యాధీ ఉన్నా అదుపులోనే ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగానే చూసుకుంటుంది కాబట్టి, పెద్దగా ఇబ్బంది లేకుండా ఉండగలుగుతోంది. ఇంట్లో టీవీ, వాషింగ్ మిషన్, కుక్కర్, గ్రైండర్, ఇన్వర్టర్ అన్నీ ఉన్నాయి.
నిజానికి ఆవిడ అక్కడ ధైర్యంగా ఉండగలుగుతోందంటే కారణం వసంతే. ఆమె స్వయంగా టీచర్, ఆపై సహృదయం గల స్త్రీ కనుక పార్వతమ్మకి ఇల్లు ఇచ్చేముందే ‘ఆమెకి తన సహాయం అవసరం ఉంటుంది. చెయ్యాలి’ అని నిర్ణయించుకుంది. అటు ఇటు తిరుగుతూ ఆమెను పలకరిస్తూ, సలహాలు చెబుతూ ఉంటుంది. కాస్త నలతగా ఉంటే కాఫీ, భోజనం పట్టుకెళ్ళి ఇవ్వడం, మందులు తెప్పించి ఇవ్వడం చేస్తూ ఉంటుంది. వెంకట్రావు కూడా ఆమెకి బైటినుంచి ఏదైనా తెమ్మని చెబితే తెస్తూ ఉంటాడు. కూరలూ, సరుకులూ కూడా వసంత తాను తెచ్చుకున్నప్పుడు ఆమెకీ తెచ్చిస్తూ ఉంటుంది. పార్వతమ్మ కూడా స్నేహపాత్రురాలే. వసంతను ‘నువ్వు దేవుడిచ్చిన కూతురువి’ అంటూ అభిమానిస్తుంది.
ఒకరోజు మధ్యాహ్నం భర్త భోంచేసి వెళ్లిపోయాక వస్తున్న నిద్ర ఆపుకుంటూ ఫోన్‍లో వంటలు చూసుకుంటూ దివాన్ కాట్ పై పడుకున్న వసంత తలుపు చిన్నగా చప్పుడైతే వచ్చి తీసింది. “రండి పిన్నీ నిద్ర పోలేదా?” అంటూ లోపలి నడిచింది. “నిద్ర ఎగిరిపోయింది తల్లీ!” అంటూ విచారంగా పార్వతమ్మ కుర్చీలో కూర్చుని మొదలుపెట్టింది.
“ఇప్పుడే మా పెద్దబ్బాయి ఫోన్ చేశాడు. రేపు అత్తగారి ఊరికి కాకినాడ వస్తున్నాడంట. ఎల్లుండి తిరిగి వెళుతూ నన్ను కూడా తీసుకెళతాడంట. రెడీగా ఉండమన్నాడు”
“వెళ్ళండి పిన్నీ! అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటే మీకు కూడా బాగుంటుంది. అయినా ఏమిటో ఇప్పుడంత అర్జెంటు?” అంటూ నవ్వింది వసంత.
“అలా అడుగు. ఈ నెలాఖరుకు మా వాడి రిటైర్మెంట్ ఉందికదా, అందుకన్నమాట. షష్టిపూర్తి గొప్పగా చేస్తారంట. వియ్యంకుళ్ళూ, వియ్యపురాళ్ళూ వస్తారట, మరి వాళ్లంతా మీ అమ్మగారేరీ అనడుగుతారు కదా! అందుకన్న మాట” అంది కినుకగా పార్వతమ్మ.
“మీ అబ్బాయి షష్టిపూర్తికి మీరే ప్రథమంగా ఉండాలి మరి. అమ్మ కంటేనా?” అంది వసంత నవ్వుతూ.
“నాకేమీ వెళ్లాలని లేదు. నేను లేకపోతే అక్కడ ఆగిపోతుందా ఏంటి?”
“వాళ్ళ ఆనందంలో మీరూ ఉండాలిగా! తీసుకెళ్లాల్సిన చీరలూ, సూట్ కేసూ ఎదురుగా పెట్టండి. నేనొచ్చి సర్దేస్తాను” అంది ఆవిడని ఉత్సాహపరుస్తూ వసంత. ‘అలాగేనమ్మా’ అంటూ తన పోర్షన్ లోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందామెకు. మనసు కుదుటపరచుకుని ‘నిజమే. వెళ్ళాలి తప్పదు. వెళ్లి కార్యక్రమం అయ్యాక కొన్నాళ్ళు ఉండి వచ్చేద్దాం’ అనుకుంటూ మనసును నిమ్మళం చేసుకుందామె. మర్నాడు పార్వతమ్మకి బ్రష్‌తో సహా చీరలూ, మందులూ సూట్ కేస్‌లో సర్ది రెడీగా పెట్టింది వసంత.
అన్నట్టుగానే పెద్దకొడుకు నారాయణ, లీలావతి ఏడయ్యేసరికి కాకినాడ నుంచి వచ్చారు. వాళ్ళు తెచ్చిన టిఫిన్ తిని అంతా బయలు దేరారు. వసంత వీడ్కోలు చెప్పింది. కారెక్కుతున్న పార్వతమ్మ మొహం చూస్తే, బలవంతంగా హాస్టల్‌కి తీసుకుపోతున్న విద్యార్థినిని చూసినట్టు అనిపించింది వసంతకి. “ఫోన్ చేస్తుంటాను ఎత్తండి” అంది చెయ్యి ఊపుతూ. ముగ్గురూ “ఉంటాం” అన్నారు.
ట్రాఫిక్ ఎక్కువగా లేదు. వారి ప్రయాణం సాఫీగానే సాగింది. దిల్‌షుక్‌నగర్, హైదరాబాద్ నారాయణ ఇంటికి చేరేసరికి సాయంత్రం ఆరయ్యింది. మరో నాలుగు రోజుల తర్వాత రాబోయే కొడుకు అరవై నిండే పుట్టినరోజుకి జరుగుతున్న ఏర్పాట్లు చూసి పార్వతమ్మ సంతోషపడింది.
నారాయణ ఒక పెద్ద ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ముఖ్య పదవిలో ఉన్నాడు. రిటైర్ అయినా నారాయణ ఉద్యోగంలో కొనసాగుతాడు. అతనికి కొడుకూ, కూతురూ ఉన్నారు. ఇద్దరూ సిటీలోనే ఉంటారు. వాళ్ళకి పెళ్లిళ్లయ్యాయి. కొండాపూర్లో సొంత ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. మనవలున్నారు. నారాయణ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి బాగానే సంపాదించాడు. అల్లుడూ, కొడుకూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. అందరూ కార్లలో తిరుగుతూ ఉంటారు. వారాంతంలో తల్లితండ్రుల దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు.
మరో రెండు రోజులకి అంతా వచ్చారు. ఇద్దరు వియ్యంకుళ్ళూ, వియ్యపురాళ్ళూ వచ్చారు. ఆ రోజుకి పార్వతమ్మకి ఖరీదైన చీర కూడా సిద్ధంగా ఉంచారు. షష్టిపూర్తి రోజు ఉదయమే లేచి నారాయణ దంపతులు గుడికి వెళ్లొచ్చారు. టిఫిన్లయ్యాక అంతా తయారయ్యి ఫంక్షన్ హాల్‌కి చేరారు. పిల్లలిద్దరూ ప్లాన్ చేసి ఒక చిన్న సైజు పెళ్లిలా చేసారు తండ్రి షష్టిపూర్తి. నారాయణ మిత్రులూ, ఆఫీస్ వాళ్ళూ వచ్చారు. పార్వతమ్మకి భర్త గుర్తొచ్చి కొంతసేపు దిగులుపడింది. ఆయనుంటే ఎంత పొంగిపోయేవారో అనుకుంది. అందరూ స్పెషల్ లంచ్ చేసి ఇంటికి చేరుకున్నారు. మర్నాడు సాయంత్రానికి ఎక్కడివాళ్ళక్కడ సర్దుకున్నారు. వాళ్ళు వెళ్ళాక కోడలు బాగా అలిసిపోయానంటూ ఆ రోజంతా లేవకుండా రెస్ట్ తీసుకుంది. నారాయణ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. పార్వతమ్మకి దిగులుగా అనిపించింది.
నారాయణ రాత్రి ఎనిమిది దాటాక వస్తాడు. భార్య భోజనం పెట్టగానే తినేసి ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. తల్లితో ఏమీ కబుర్లు చెప్పడు. ఆమె టీవీ ముందు కూర్చుంటే, ఎప్పుడైనా వచ్చి తను కూడా కూర్చుని “తిన్నావా అమ్మా?” అని ఒక మాట అడుగుతాడు. తల్లి పార్వతమ్మ తల ఊపుతుంది. తర్వాత మెల్లగా లేచి తన రూమ్ లోకి వెళ్ళి పోతాడు. ఆ రోజు భోజనాలయ్యాక హాలులో కూర్చున్నప్పుడు “నిన్న నీ కార్యక్రమం అంతా బాగా జరిగిందిరా!” అంది తల్లి తృప్తిగా. “అవునమ్మా!” అనేసి లేచి వెళ్ళిపోయాడు కొడుకు. తాను కూడా లేచింది తల్లి. తన ఇంట్లో పార్వతమ్మ పొద్దున్నే అయిదు గంటలకే మేలుకుంటుంది.. లేచిన వెంటనే మొహం కడుక్కొని కాఫీ చేసుకుని తాగుతుంది. ఇక్కడైతే వాళ్ళు ఒక్కొక్కళ్ళు లేచి కాఫీ ఇచ్చేసరికి ఏడు అవుతుంది. టిఫిన్ ఇచ్చేసరికి తొమ్మిదవుతుంది. ఆవిడ కోసం అంటూ అక్కడేమీ ప్రత్యేకంగా జరగదు. వాళ్లతో పాటు మాత్రమే ఆమెకి అన్నీ పెడతారు. ‘తప్పదుగా! సర్దుకుపోవాలి’ అనుకుని ఊరుకుంటుందామె. పార్వతమ్మ మనవడూ, మనవరాలూ వారాంతంలో కుటుంబాలతో వస్తూ ఉంటారు. వాళ్ళున్న రెండు రోజులూ ఒకటే హడావిడి, మునిమనవల అల్లరితో సందడి సందడిగా ఉంటుంది. ‘వేసవి సెలవులకి నా దగ్గరికి ఇలాగే వచ్చేవారు కదూ నా మనవలు’ వాళ్ళని చూస్తూ అనుకుంటుంది పార్వతమ్మ మురిపెంగా.
నాన్నమ్మ దగ్గర కూర్చుని చిన్ననాటి సంగతులు నెమరేసుకునే తీరిక మనవలికి ఉండదు. రక రకాల వంటలు చేసుకోవడం, హోటల్ నుంచి మరికొన్ని తెప్పించుకోవడం ఇంకా ఐస్ క్రీంలూ, పిజ్జాలూ, సమోసాలూ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవడంలో వాళ్ళు బిజీగా ఉంటారు. అవన్నీ తిన్నాక, షాపింగ్‌కో, సినిమాకో వెళ్లిపోతుంటారు. కోడలు ఎవరూ లేనప్పుడే మనసు విప్పి మాట్లాడదు. ఇక సంతానం వచ్చారంటే అత్తగారెవరో తెలీనట్టు, ఎవరో దూరపు బంధువన్నట్టు అటూ ఇటూ తిరుగుతూ హడావిడిగా ఉంటుంది. పార్వతమ్మ వాళ్ళ మధ్యలో ఆటలో అరటిపండులా నడవాల్సి ఉంటుంది.
పిల్లలు లేకపోతే కోడలు స్నేహితులతో బంగారమో, బట్టలో కొనడానికి బైటికి వెళ్ళిపోతూ ఉంటుంది. భర్త సంపాదన పెరిగిపోతే ఆడవాళ్లు ఐశ్వర్యంలో పుట్టినట్టు ఎంత దర్జా జీవనానికి అలవాటు పడిపోతారో! తమ కాలంలో ఆస్తి ఉన్నవాళ్లూ మధ్య తరగతి వాళ్ళూ ఒక్కలాగే పొదుపుగా బతికేవారు. ఇప్పుడలా కాదు, అనుకుంటుంది పార్వతమ్మ. ఇంట్లో తీరికగా ఉన్నప్పుడు కోడలు సోఫాలో పడుకుని సీరియల్స్ చూస్తూ ఉంటుంది. అత్తగారు భక్తి ఛానల్ చూస్తూ ఉంటే కోడలు “ఇలా ఇవ్వండి సీరియల్ ఉంది నాకు” అంటూ రిమోట్ లాక్కుంటుంది. పార్వతమ్మ లేచి తన గదిలోకి వెళుతుంటే “చూడొచ్చు కదా ఈ సీరియల్స్ బావుంటాయి” అంటుంది.
పార్వతమ్మ తనకిష్టమైన భక్తి సందేశాలు, ప్రవచనాలు అయితే వింటుంది. సీరియల్స్ ఆవిడకి ఏమీ అర్థం కావు. ఆ సీరియల్స్‌లో ఆడవాళ్ళని చూస్తే భయమేస్తుందామెకు. ఆడవాళ్ళు అంతంత కక్షపూరితంగా, భయంకరంగా ఉండడం ఆవిడకి అస్సలు నచ్చదు. ‘ఈ సీరియల్స్‌లో ఉన్నట్టుగా ఆడవాళ్ళు క్రూరంగా ఉంటే ఇంక తోడికోడళ్ళు, అత్తా కోడళ్ళు, ఆడపడుచు వదినలు ఇంతకాలం కాపురాలు చేసేవారు కాదు. ఎప్పుడైనా ఒక మాట అనుకున్నా, చిన్న చిన్న తేడాలు ఉన్నా వాళ్ళందరూ సామరస్యంగా ఉండబట్టే ఆ సంసారాలు ఇప్పటివరకు నిలబడ్డాయి. ఇవన్నీ కాలక్షేపం కోసం సరదాగా తీస్తారేమో! వాళ్ళ ఇళ్ళు చూడాలనిపించేలా భలే బావుంటాయి. అందుకే అందరూ టీవీ ముందు కూర్చుని అంతలా చూస్తారు. నిజంగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు అంతంత ముస్తాబు అవుతారా? అంత చక్కగా తల కట్టు, చీరకట్టు దిద్దుకుని కళ్ళు తిప్పుకుంటూ ఉంటారా ఏమిటి? ఏదో సామాన్యంగా ఉంటారు. అవునులే అలా ఉంటే చూసేవాళ్ళకి బాగుండదు కదా! అందుకని అందర్నీ ముస్తాబులు చేస్తారేమో!’ అనుకుంటుంది. ఈ సందేహాలు కోడలికి చెబితే ఏమనుకుంటుందో అనుకుంటూ ఏమీ మాట్లాడదామె.
పార్వతమ్మకి వస్తూ పోతూ ఉండే మనవడి ఇల్లూ, మనవరాలి ఇల్లూ చూడాలని ఉంటుంది. కానీ వాళ్లెప్పుడూ ‘మా ఇంటికిరా నానమ్మా’ అనరు. ఒకసారి నారాయణ “నానమ్మని తీసుకెళ్ళి ఒకసారి మీ ఇళ్ళు చూపించండిరా” అన్నాడు. వెంటనే కోడలు కల్పించుకొని “ఏం చూస్తారు? అస్తమానూ పిల్లలు వచ్చి పోతూనే ఉన్నారు. కనబడుతూనే ఉన్నారు కదా!” అనేసింది. పార్వతమ్మకి మనస్సు చివుక్కుమని మరోమాట మాట్లాడకుండా ఊరుకుంది.
‘నా కొడుక్కే తల్లితో ఆదరణగా మాట్లాడాలని ఉండదు. ఇంక వాళ్ళకెందుకుంటుంది?’ అనుకుందామె. కొడుకు, కోడలు ప్రత్యక్ష దైవం జన్మజన్మల పుణ్యం అన్నట్టుగా ఉంటాడు. భార్య వెనకే తిరుగుతూ ఆమె చిరాకుగా ఉంటే ప్రసన్నం చేసుకోవడానికి ఏవో కబుర్లు చెబుతూ ఒక సేవకుడులా తిరుగుతూ ఉంటాడు. ‘రోజులెలా మారిపోయాయో! మా కాలంలో భర్త ఏవైనా కబుర్లు చెబితే బావుండును అన్నట్టు ఎదురుచూసేవాళ్ళం ఆశగా’ అనుకుందామె.
పార్వతమ్మ ఎలాగో మరో పది రోజులు గడిపి “ఇంక నేను వెళ్తానురా! నన్ను అమలాపురం పంపెయ్యి నారాయణా! చూసాను కదా! మిమ్మల్నందరినీ. అక్కడికి పోయి నా ముద్ద నేను వండుకుంటాను. మధ్యాన్నాలప్పుడు ఏ రామాయణమో చదువుకుంటా ఉంటే నాకు కాలక్షేపం అయిపోతుంది” అంది ఓ ఆదివారం కొడుకుతో. ‘అయ్యో అప్పుడే ఎందుకు? ఇంకో నెల ఉండు’ అని కొడుకు అనలేదు. కోడలు మనసులో కలిగిన ఆనందాన్ని కోపంగా మార్చి “అంతే లెండి. మిమ్మల్ని కూర్చోబెట్టి వడ్డిస్తే మీకు నచ్చదు. తినీ తినకా అక్కడ ఒంటరిగా ఉండడం మీకిష్టం. చూసే వాళ్ళందరూ కొడుకులు పట్టించుకోవడం లేదు ఒక్కతే ఉంటుంది అనుకోవాలేమో? ఇక్కడ మీకేం తక్కువ అయింది? పిల్లలు కనబడుతున్నారు. సర్లెండి మీ ఇష్టాన్ని మేమెందుకు కాదంటాం?” అనేసి అప్పటికప్పుడు వెళ్లి ఓ రెండు చీరలు కొనుక్కొచ్చి అత్తగారి బాగ్‌లో పెట్టి, మరో రెండురోజుల తర్వాత డ్రైవర్‌ని మాట్లాడి కార్ ఇచ్చి అమలాపురం పంపించేసింది కోడలు.
ఆ ఏర్పాట్లు చూసిన పార్వతమ్మ ముందురోజే వసంతకి ఫోన్ చేసి “రేపే వస్తున్నాను. కాస్త ఓ పాల ప్యాకెట్ తీసిపెట్టి మరో పాల ప్యాకెట్ తోడు పెట్టు వసంతా” అని చెప్పింది. ఆ రోజు పార్వతమ్మ తెల్లవారుఝామున నాలుగున్నరకే లేచి తయారయ్యింది హుషారుగా. “జాగ్రత్తమ్మా!” అన్నాడు కొడుకు నిద్రమొహంతో, కోడలు చెప్పగా లేచొచ్చి. కారు ఆరుగంటలకల్లా బయలుదేరింది. డ్రైవర్ టిఫిన్లకీ, భోజనానికీ ఆపాడు. సాయంత్రం అయిదయ్యేసరికి అమలాపురం చేరిందామె.
కారు హార్న్ వినగానే ప్రహరీ గేట్ తీసుకుని బైటికొచ్చి ఎదురుగా నిలబడ్డ వసంతను చూడగానే కళ్ళు నీళ్లతో నిండాయి పార్వతమ్మకి. డ్రైవర్ సామాను దింపి “ఉంటానమ్మా” అంటూ వెళ్ళిపోయాడు. “కాళ్ళు కడుక్కోండి పిన్నీ!” అంటూ కాఫీ తెచ్చిచ్చి “సాయంత్రం భోజనం మీక్కూడా వండుతున్నాను” అంటూ ఎదురుగా కూర్చుని “చెప్పండి ఎలా ఉన్నారంతా? షష్టిపూర్తి బాగా జరిగిందా?” అనడిగింది. కాఫీ తాగి కబుర్లు చెపుతూ నడుం వాల్చింది పార్వతమ్మ. ‘అమ్మయ్య నా గూట్లోకి నేనొచ్చిపడ్డాను’ అనుకుందామె నిశ్చింతగా. అలిసిన శరీరంతో చిన్న కునుకు పట్టిందామెకు.
మెలుకువ వచ్చేసరికి టేబుల్ మీద భోజనము ప్లేట్, చిన్న,చిన్నగిన్నెలు పెట్టి వెళుతోంది వసంత. “నెమ్మదిగా లేచాక తినండి పిన్నీ! ఈ సీసాలో మంచినీళ్ళున్నాయి” అంటూ తలుపు దగ్గరగా వేసివెళ్ళిందామె. ‘సొంత కూతురిలా ప్రేమ చూపెడుతోందీ బంగారు తల్లి. ఏనాటి రుణమో! దేవుడు ఎవరో ఒకరిని దిక్కుగా చూపిస్తాడంటే ఇదేనేమో!’ అనుకుంది పార్వతమ్మ తడిసిన గుండెతో. వసంత వంట ఎంతో రుచిగా అనిపించింది పార్వతమ్మకి.
కోడలి వంటలు ఆవిడకి నచ్చవు. తినక తప్పదామెకి. ప్రతీ కూరలోనూ ఏవేవో పొడులు వేస్తుంది. ఆమెకు నోరు బాలేనప్పుడు కాస్త పచ్చడి వేసుకోవడం అలవాటు. “మీకు బీపీ, షుగరు ఉంది పచ్చళ్ళు వేసుకోకూడదు” అంటుంది కోడలు. టేబుల్ మీద స్వీట్‌లుంటాయి. తనకి తినాలని ఉన్నా తినదు, మాటనిపించుకోవడం ఎందుకని. తననొక బాధ్యతగా చూస్తుంది తప్ప ప్రేమగా చూడదు కోడలు. వసంత ఏదైనా స్వీట్ చేస్తే “కొంచెమే పిన్నీ! ఒక్కరోజుకి షుగర్ పెరిగిపోదులెండి” అంటూ దగ్గరుండి తినిపిస్తుంది. “ఈ పచ్చడిలో ఉప్పూ కారం ఎక్కువ లేవు వేసుకోండి” అంటూ చిన్న సీసా ఇస్తుంది. ఇలాంటి ఆదరణ అక్కడెక్కడుంది? మనవరాలు కూడా తింటుంటే దగ్గర కూర్చోదు. కోడలు సరే సరి. “అన్నీ అక్కడే ఉంటాయి. ఎవరో పెట్టేదేంటి భోజనం? పెట్టుకుని తినడమే!” అని హుకుం జారీ చేస్తుంది. తిట్టకర్లేదు కొట్టక్కర్లేదు అలా ఆంటీ ముట్టనట్టుగా ఉంటే ఎలా ఉండగలను? అనుకుందామె కొడుకింట్లో విశేషాలు గుర్తు చేసుకుంటూ.
***
ఒకరోజు మధ్యాహ్నం వసంతకి అక్కగారు ప్రమీల నుంచి ఫోనొచ్చింది. “వసంతా! నీకో శుభవార్త చెప్పాలి” ఆనందంగా అంది ప్రమీల.” ఏమిటే అది? నీ గొంతు వింటే అది చాలా ముఖ్యవార్త అనిపిస్తోంది” అంది వసంత ప్రేమగా. “ఏమిటంటే మన భార్గవి అమెరికా నుంచి ఇండియాకు మకాం ఎత్తుకొని వచ్చేస్తోందే! ఎప్పటినుంచో వాళ్ళ మామగారు వచ్చెయ్యమని అంటున్నార్లే. ఒక్కడే కొడుకు కదా మా అల్లుడు. ‘ఇక్కడున్నఆస్తిపాస్తులన్నీ చూసేవాళ్ళు లేరు. చాల్లే సంపాదించింది. దానికి అంతేముంది? ఇండియా వచ్చేయండి. పిల్లలు కూడా పెద్ద వాళ్ళవుతున్నారు. ఎక్కడో పరాయి దేశంలో ఎందుకు?’ అంటూ ఎక్కువగా గొడవ చేస్తున్నారట. ఇన్ని రోజులూ, చూద్దాం చూద్దాం అన్నారు. పిల్లలకి పదమూడూ, పదకొండూ వస్తున్నాయి అనుకున్నారో ఏంటో! మొత్తానికి ఓ రెండు నెలల్లో ఇండియాకి వచ్చేస్తున్నారు. ఇద్దరూ ఇక్కడే ఉద్యోగాలు చూసుకుంటారట. అమ్మాయి వచ్చేస్తుంది అని నాకు చాలా సంతోషంగా ఉంది. మీ బావగారు కూడా ఆనందంగా ఉన్నారు. దాని పెళ్ళయ్యి పదిహేనేళ్లయింది. పెళ్లి కాగానే భర్తతో వెళ్ళిపోయింది కదా. అమెరికాలో ఉండే పిల్ల ఇక ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటుంది. అదీ శుభవార్త” అంది ఆనందంగా ప్రమీల.
“నిజమే అక్కా! మంచి పని చేస్తున్నారు భార్గవీ, అల్లుడూ. అసలు అమెరికా వెళ్లిన వాళ్ళు తిరిగి రారే బాబూ!, ఆ సుఖాలకి అలవాటు పడిపోయి. ఇదిగో! అదిగో! అంటూ గడిపేస్తారు. తర్వాత పిల్లలు రానంటున్నారు అంటారు”
“అవునే. అదీ నిజమే! మా అదృష్టం బావుంది. మేంకూడా డెబ్భైల్లో పడ్డామా! ఇద్దరికీ, బీపీ షుగరూ ఉన్నాయి. నాకింకా అదనంగా మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. పిల్ల ఊర్లో ఉంటే మనవలూ కళ్ళెదురుగా పెరుగుతారు. మాక్కాస్త ఆసరాగా కూడా ఉంటారు కదే!”
“అవునవును. పెద్దవాళ్ళం అయ్యాక, మనకంతకంటే సంతోషం ఇంకేముంటుందక్కా?”
“మా పిల్లాడు వెళ్లి ఐదేళ్లే అయిందిలే. రెండేళ్ల పిల్ల. వాడు చిన్నవాడు. వాడెలాగూ ఇప్పట్లో రాడు, నాలుగు రాళ్లు సంపాదించుకుంటే కానీ. రమ్మని అడగలేం కూడా. ఇంతా కష్టపడి వెళ్లిన ఫలితం ఉండొద్దూ మరి!.”
“అవునక్కా! ఉన్న ఊరిలో కొడుకో, కూతురో ఎవరో ఒకరుంటే చాలక్కా! ఏ అనారోగ్యం వచ్చినా గబుక్కున వచ్చి చూసుకోవడానికి. వాడూ మరి కొన్నేళ్ళుండి వచ్చేస్తాడులే! మంచి వార్త చెప్పావు. మీ మరిది గారికి కూడా చెప్పాలీ సంగతి. ముచ్చట పడతారు” అంది వసంత.
“ఉన్నారా నేను చెప్పనా?” అంది ప్రమీల. “లేరు.నేను చెబుతాలే” అంటూ సంభాషణ ముగించింది వసంత.
ప్రమీల వసంతకి పెదతండ్రి కూతురు. పదేళ్లు పెద్దది. వాళ్ళ ఇళ్ళు ఊరిలో కాస్త దూరంగా ఉన్నా, బంధుత్వం వల్ల వసంతకీ ప్రమీలకీ చిన్నప్పటినుండీ మంచి స్నేహమే ఉండేది. బాగా చదువుకునే వసంతను చిన్నప్పటినుంచీ ముద్దు చేసేది ప్రమీల. పెద్దయ్యాక ఉద్యోగం చేస్తోందని వసంతంటే గౌరవం ఆమెకి. “మన కుటుంబంలో, ఉద్యోగం చేసిందే నువ్వేనే!” అని ముచ్చట పడుతుంది.
***
వసంతకి కొడుకు శైలేష్‌తో కూతురు పిల్లాడి పుట్టిన రోజున వేసిన వేషాలన్నీ చెప్పాలని ఉన్నా భర్త ఎదురుగా చెప్పలేక ఊరుకుంటోంది. ఇవాళ శైలేష్ ఫోన్ చేసినప్పుడు భర్త లేకపోవడంతో కుశల ప్రశ్నలయ్యాక,
“నువ్వు కాస్త పక్కకి రారా! ఆ అమ్మాయికి దూరంగా, నీకో సంగతి చెప్పాలి” అంది.
“ఏంటమ్మా అంత రహస్యం!” అంటూ పెద్దగా నవ్వాడు శైలేష్. ప్రతి మాటకీ అలా నవ్వడం అతనికలవాటు.
తాము ఐదువేలు పెట్టబోయినప్పుడు కూతురన్న విషయం, అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పిల్ల కొట్టేన పోజులూ అన్నీ వివరంగా చెప్పింది.
“అక్క సంగతి మనకి తెలిసిందే కదమ్మా! తానేదో పెద్ద ధనవంతురాలినని దాని ఫీలింగ్. ఆ పొగరు బైటివాళ్ల దగ్గర చూపిస్తారెవరైనా. ఇది అమ్మ దగ్గర చూపిస్తుంది. నువ్వు లైట్ తీసుకోవాలి ఇలాంటివన్నీ. ఇంత వయసొచ్చినా దానికింకా మెచ్యూరిటీ రాలేదు అంతే. కొన్నాళ్ళుపోయాక వస్తుందిలే. ఎదురుచూద్దాం” అన్నాడు నవ్వేస్తూ.
“నా తలకాయ వస్తుంది. అసలే ఇద్దరూ కొడుకులు. ఆడపిల్లైనా లేదు. కాస్త అణకువ రావడానికి” కోపంగా అంది వసంత.
“ఓ పని చెయ్యనా? మన పాపాయిల్లో ఒకరిని ఇచ్చేద్దామా? అక్కని పెంచమని. కాస్త గర్వం దిగుతుంది” అన్నాడు.
“పోరా! నీకంతా వేళాకోళమే! నాన్నకేమో అక్క మీద నేరం చెబితే నచ్చదు. మొహం మాడ్చుకుంటారు తప్ప అర్థం చేసుకోరు. ఇంకా వివరించబోతే దాని తరఫున మాట్లాడతారు”
“అమ్మా! నువ్విలా మనసు బాధపెట్టుకోకు. ఈసారి నేనొచ్చినప్పుడు దానికి నచ్చచెబుతాగా!”
“ఏం చెబుతావేంటి?”
“అక్కా ! నువ్వు చీటికీ మాటికీ అమ్మ దగ్గరికి వెళ్ళకమ్మా. నీ లెవెల్‌కి తగ్గవాళ్ళ దగ్గరికే వెళ్ళాలమ్మా! అని చెప్పేస్తా. తిక్క కుదురుతుంది దానికి”
“ఏడిశావులే! వెధవ జోకులూ నువ్వూనూ” అంటూ తేలిగ్గా నవ్వేసి తర్వాత కొంతసేపు కోడలితో, మనవడితో మాట్లాడి పెట్టేసింది వసంత.
***
ఒకరోజు మధ్యాహ్నం వసంత జిడ్డు కృష్ణమూర్తి గారి ‘ధ్యానం’ పుస్తకం చదువుతుండగా వసంత మరో పెదనాన్న కొడుకు రామచంద్రం ఫోన్ చేసాడు. “వసంతా! ఎలా ఉన్నారే? నువ్వూ బావగారూ?”
“నువ్వెలా ఉన్నావ్? ఎన్నాళ్ళయ్యిందో నీతో మాట్లాడి” అంటూ ఆనందపడింది వసంత.
“బావున్నామే. మాట్లాడడం కాదు చూడడానికి వస్తున్నా నిన్ను”
“అబ్బో ఎప్పుడురా?” అంది వసంత ఉత్సాహపడుతూ.
“ఒక పెళ్ళికి, ఒక చిన్న పని మీద అమలాపురం వస్తున్నాను. మీ ఇంటికి వస్తాను రెండు మూడు రోజుల్లో. మళ్ళీ చేస్తాన్లే” అంటూ పెట్టేసాడు.
రామచంద్రానికి చిన్నప్పటి నుంచి ఆట పాటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు. అందరిదీ ఒకే ఊరు. వసంతతోనూ ప్రమీలతోనూ ప్రేమగా ఉండేవాడు. ప్రమీల టెన్త్ చదివి ఆపేసింది. వసంత బియ్యే చేసి పెళ్లయ్యాక బీఈడీ కూడా చేసింది. రామచంద్రం టెన్త్ క్లాస్ కూడా నాలుగైదు సార్లు తప్పాడు. పెళ్లయ్యింది. ఉన్న రెండెకరాల పొలమూ చూసుకుంటూ తండ్రి ఉన్నన్నాళ్ళు తండ్రి వెంట తిరుగుతూ ఉండేవాడు. ఆయన ప్రధాన పంటలతో పాటు మెట్టపంటలు, కూరగాయలు కూడా వేస్తూ జాగ్రత్తగా సంసారం నడిపేవాడు. తర్వాత తండ్రి చనిపోయాక రామచంద్రం ఇద్దరు కూతుళ్ళూ, ఒక కొడుకుతో సంసారం ఈదలేకపోయాడు. పిల్లలు చదువుల కొచ్చారు. అతని ఇబ్బంది చూసి తండ్రికి తెలిసిన ఒకాయన తన మిత్రులెవరో హైదరాబాదులో ద్రాక్ష తోటలు కొంటే వాటి సంరక్షణ కోసం వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఆ విధంగా రామచంద్రం హైదరాబాద్ చేరాడు. పిల్లల్ని దగ్గరగా ఉన్న స్కూల్‌లో వేసుకున్నాడు. అతని పరిస్థితి మెరుగుపడింది. ద్రాక్ష తోటల బిజినెస్ తగ్గిపోయాక దాని యజమాని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. రామచంద్రం నమ్మకస్థుడైనందున యజమాని అతన్ని వదలకుండా తన దగ్గరే పనిలో ఉంచుకుని అతన్ని బాగా చూసుకున్నాడు.
(సశేషం)