రామప్ప కథలు-4

0
4

[బాలబాలికలకు కాకతీయుల చరిత్ర, రామప్ప దేవాలయం గురించి కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.]

వెయ్యి స్తంభాల గుడి

[dropcap]ర[/dropcap]వి ఎంతగా ఎదురు చూసినా మదనిక రాలేదు. ఆందోళనపడ్డాడు.

మదనికకి ఏమైనా జరిగిందా? డేంజర్? ఎవరైనా రానివ్వకుండా అడ్డుకున్నారా?

తరవాత నవ్వుకున్నాడు. ఎందుకో మీకు తెలుసుగా!

కొద్ది రోజుల తరువాత ఎప్పటిలాగే పూల సువాసనలు వెదజల్లుతూ గాలిలో తేలుతూ మదనిక వచ్చి రవిని నిద్ర లేపింది. చలికి వణికిన రవికి అర్థం అయింది తన కాకతీయ నేస్తం రామప్ప మదనిక వచ్చిందని.

ఆనందంతో లేచిన రవి “Hello! Madanika. How are you? నీ కోసం చాలా wait చేశాను తెలుసా?” అన్నాడు.

“నేను కుశలమే మిత్రమా” అంది.

“ఇవ్వాళ్ళ నాకు ఎవరి గురించి చెబుతావు?” అన్నాడు రవి టేబుల్ దగ్గర కూర్చుని. నోట్ బుక్ రెడీగా ఉంచాడు.

“రవి! నేడు నేను నీకు నువ్వు చూసిన వేయి స్తంభాల ఆలయం గురించి నేను విన్నది చెబుతాను. సరేనా? అన్నట్లు, రవి నీకు ఆ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారో/కట్టారో తెలుసా?” అని అడిగింది మదనిక.

“తెలీదు. మా టీచర్ చెప్పలేదు. కాకతీయులు కట్టారని మాత్రం తెలుసు” అన్నాడు రవి.

“రవి! అన్ని గురువులు అదే టీచర్లు చెప్పరు. కొంత సమాచారం ఇస్తే మిగతాది మీరు శోధించి, మీ భాషలో రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. అది పుస్తక పఠనం వల్లే సాధ్యం” అంది.

“రీసెర్చ్! శోధించటం? అది నాకెలా వీలవుతుంది? నేనేమైన PhD చేస్తున్నానా?” అన్నాడు రవి.

“అది నాకు తెలియని చదువు. ఒక్కటి మాత్రం నిజం తెలుసుకోవాలనే కోరిక ఉంటే కష్టం కాదు. ఏదైనా ప్రదేశానికి వెళ్లి వస్తే చూస్తే చాలదు. అక్కడి విశేషాలు చరిత్ర తెలుసుకోవాలి. ఆ కాలం లోని పరిస్థితులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. నాకు మీ కాలపు భాష సంగతులు తెలియాలని నువ్వు ఎలా అనుకుంటున్నావో, మాకు అనిపిస్తుంది కదా! గ్రంథాలయాల్లో తగిన సమాచారం కోసం వెతకాలి.”

“అమ్మో! మా అమ్మలా మాట్లాడుతున్నావు. ఇంత ప్రాసెస్ నా వల్ల కాదు తల్లీ!” అన్నాడు రవి కంగారుగా.

“సర్లే విను” అంటూ మదనిక చెప్పసాగింది.

వేయి స్తంభాల గుడి గురించి వివరిస్తోంది, మనము విందామా? చరిత్ర పుటలు pages of history /past very interesting /fascinating గా ఉంటుంది నాకు. మరి మీకు?

“రవి! కాకతీయుల అద్భుత నిర్మాణాల్లో ఇప్పటికి కాల ప్రభావాన్ని తట్టుకుని శిధిల సాక్షిలా నిలిచింది వేయి స్తంభాల గుడి. క్రీ.శ. 1163 సంవత్సరంలో కాకతీయ మహారాజు రుద్ర దేవుడు నిర్మించాడట. వేయి స్తంభాలతో నక్షత్ర ఆకారంలో ఉన్న ఆ దేవాలయం అప్పటి రోజుల్లో పండగల్లో నెయ్యి మట్టి దీపాల వెలుగుల్లో మహిళల జిలుగు చీరల, బంగారు నగల ధగధగల్లో అద్భుతంగా మెరిసి వెలిగి పోయిందిట. అది గతం. నేడు శిధిలం” అంది బాధగా.

“ముఖ్య దేవత శివుడు. తూర్పు.. ఈస్ట్ ఫేసింగ్‌గా ఉన్నాడు. నల్లని రాతితో చేసిన నగిషీలు చెక్కబడిన శివలింగ ఆకారంలో ఉంటాడు. సూర్యుని తొలి కిరణాలు శివునిపై పడే విధంగా ఉన్నది నిర్మాణం” అని చెప్పింది.

“Wow!” అన్నాడు రవి.

“రవి! ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ sunrise చూసావా? చూడు. ఎరుపు నారింజ పసుపు రంగుల కలయికతో బంగారు వెలుగులు జిమ్ముతూ వెచ్చని తొలికిరణాలు భూమి పొరల్లోంచి పైకి వస్తున్నట్లుగా అందంగా ఆనందంగా ఉంటుంది. నా భాషలోని భావం అర్థం అయిందా? అవును, మీ కన్యాకుమారి అనే యాత్ర స్థలంలో సూర్యోదయం/సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటాయని నా నెచ్చెలి/ఫ్రెండ్ చెప్పింది. నిజమా?”

“అవునట. నేను విన్నాను. చూడలేదు. వెళ్ళాలి. Sunrise కూడా నాకు తెలీదు. ఎర్లీ మార్నింగ్ లేచి చూడటానికి ట్రై చేస్తాను” అన్నాడు రవి

“సర్లే. ఏదో చెప్పాలనిపించింది. అంతే. వేయి స్తంభాల గుడిని శివ, విష్ణు, సూర్యునికి అంకితం చేశారట. పూజలు జరిగేవి” అంది.

“మదనికా! పెద్ద గుడి కదా! కట్టడానికి ఎంత కాలం పట్టింది?” అడిగాడు రవి.

“ఆ! నాకు తెలిసి, విన్నదాని ప్రకారం 72 సంవత్సరాలు పట్టిందిట. ఒక జీవిత కాలం” అని నవ్వింది.

“మా రోజుల్లో ఇప్పటిలా యంత్రాలు, సాంకేతికత లేదు కదా. దూర ప్రాంతాల నుండి శిల్పులు, అవసరమైన నల్లరాతి శిలలు, పరికరాలను ఏనుగుల సాయంతో తెచ్చారట. అంతా ఎటు చూసినా అడవులు కీకారణ్యాలు. ఇప్పటి మీ కాంక్రీట్ జంగల్ కాదు కదా! కాకతీయుల శిల్ప శైలి అంటే అర్చిటెక్చర్ చాళుక్యుల శైలి.. స్టైల్‌ని పోలి ఉంటుందిట. తరువాతి కాలంలో సొంత శైలి ఏర్పడింది. కాకతీయుల నిర్మాణాల్లో ముఖ్యంగా గుడి, చెరువు పెద్ద ప్రాకారం కలిగి ఉంటాయి. వేయి స్తంభాల గుడిలో స్తంభాలన్నీ అందమైన అనేక చిన్న పెద్ద శిల్పాలతో, లతలు పూలు అల్లికలతో పురాణ కథలతో ఉంటాయి. నల్లని రాత్రే కాదు నలుపులోని అందాన్ని శిల్పులు నల్ల రాతి శిల్పాలలో మనకి చూపించారు. వాటి పైభాగం అద్దంలా నున్నగా మెరుస్తూ ఉంటుంది. గర్భగుడి, మండపము, గుడి వెలుపలి మండపాలు, కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. శివుని గుడికి ఎదురుగ ఉన్న నందిపై అందంగా మువ్వలు, వస్త్రం.. cloth మీద డిజైన్స్ చాలా బాగుంటాయి. నంది శివుని పిలుపుకి పరుగెత్తి రావటానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది” చెప్పింది మదనిక.

“Wow. Interesting” అన్నాడు రవి.

“అవును మరి. పురాతన కట్టడాలను just for fun లా చూడకూడదు. వేయి స్తంభాల గుడిలో అనేక స్తంభాలు ఉన్నా, అవి చూపరులకు అడ్డం రావు” అంది.

“మదనికా! చూపారులంటే? High Telugu లో మాట్లాడకు అన్నాను కదా?” అన్నాడు రవి.

“అబ్బా! రవి, చూపారులంటే చూసేవాళ్ళు. ఇంత కంటే సింపుల్ తెలుగు నాకు రాదు. విను, గుడి లోని మెట్ల బావిని చూసావా?”

“లేదు. ఏంటి దాని ప్రత్యేకత?”

“పెద్ద మెట్ల బావి వాన నీటిని ఒడిసిపట్టటానికి, గ్రౌండ్ వాటర్ పెరగటానికి, నీటిని నిల్వ చెయ్యటానికి చాలా ఉపయోగపడింది. పడుతుంది. ప్రజలకు ఉపయోగపడింది. ఎంత పెద్ద గొప్ప బలమైన రాజ్యమైన కాలక్రమేణా కాలగర్భంలో కలసిపోవాల్సిందే. నిరంతర యుద్ధాలు, శత్రువులు దాడిలో నష్టపోయిన కాకతీయ రాజ్యం ముస్లిం రాజుల దాడుల్లో దెబ్బతింది” అంది మదనిక బాధగా.

“అప్పటి యుద్ధాల్లో అనేక కట్టడాలు నేలమట్టం అయ్యాయి. దెబ్బతిన్నవాటిలో వేయి స్తంభాల గుడి ఒకటి” అంది.

“విన్నాను. 2004లో ప్రభుత్వం ఈ గుడిని రిపేర్ చెయ్యటానికి ఆదేశించారుట. కానీ పనులు పూర్తి అయ్యాయో లేదో తెలియదు” అన్నాడు రవి.

“మదనికా ఈ గుడిని ఎవరు కూలగొట్టారు?” అడిగాడు రవి.

“ఆ! బహుశా క్రీ.శ. 1323లో అని గుర్తు. చాలా కాలం అయిందిగా. వయస్సుతో పాటు జ్ఞాపక శక్తి తగ్గుతోంది. 1323లో ఢిల్లీ సుల్తాను కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్‌ని దక్షిణ భరతం మీదకు, కాకతీయ రాజ్యం మీదకు దండయాత్రకు పంపాడట. కాకతీయ రాజైన ప్రతాప రుద్రునికి, తుగ్లక్‌కు మధ్య రెండు పెద్ద యుద్ధాలు జరిగాయట. ఒకదానిలో ప్రతాప రుద్రుడు, రెండవదానిలో తుగ్లక్ గెలిచారు. యుద్ధం అంటేనే అన్నిరకాల విధ్వంసం. ఆ యుద్ధాల సాక్షి ఈ శిధిలాలు. రవి! మీరు మనసు పెట్టి వింటే ప్రతి ప్రాచీన శిధిల కట్టడాలు అనేక కథలు, కన్నీళ్లు చెబుతాయి. మనిషి కున్న అత్యాశ, యుద్ధ కోరిక, అధికారం అంటే కోరిక కలుగచేసే నష్టం అంచనా వెయ్యలేవు.” అంది.

“అవును. ప్రపంచ యుద్ధాల వల్ల చాల destruction, loss of life అయ్యిందని మా సోషల్ టీచర్ చెప్పారు” అన్నాడు రవి.

“అవునా? వాటి గురించి నాకు తెలీదు. ఇంత జరిగిన మీరు మారటం లేదు. ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను జీవితాలను ధ్వంసం చేస్తున్నారు. Destruction ఎవ్వరికి మంచిది కాదు. శాంతి ఎంత అవసరమో మరచిపోకండి. యుద్ధ విధ్వంసం మూలంగా నా తోటివారిని ఎందర్నో పోగొట్టుకున్నాను” అంటూ మదనిక బాధతో ఏదో ఆలోచనల్లోకి జారుకుంది. మౌనంగా ఉన్న ఆమెని చూసిన రవికి అర్థం అయింది. ‘పాపం.. పూర్ మదనిక’ అని అనుకున్నాడు

తొలిపొద్దు వెలుగులో కలిసిపోయింది. వంటింట్లోకి వెళ్తున్న అమ్మ – మదనిక చెప్పిన విషయాలు బుక్‌లో రాసుకుంటున్న రవిని చూసి ‘ఈ మధ్య లేపకుండానే లేచి బుద్ధిగా చదువుకుంటున్నాడు. మంచి పిల్లాడు. ఆకలి వేస్తోందో ఏమో? వేడి పాలు ఇస్తాను’ అనుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here