[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
అలనాటి దిగ్గజ నటుడు అజిత్:
అజిత్ అనే పేరుతో ప్రసిద్ధులైన హిందీ నటుడు అసలు పేరు హమీద్ అలీ ఖాన్. బాలీవుడ్‍లో హీరో పాత్రల నుంచి విలన్ పాత్రలకు మళ్ళి – రెండిటిలోను ప్రఖ్యాతి చెందిన అరుదైన నటుడు అజిత్. డైలాగులను విభిన్నమైన రీతిలో పలికే ఆయన తీరు వల్ల ఆయనకు ప్రేక్షకులలో ఆదరణ లభించింది.
అజిత్ హైదరాబాదులోని గోల్కొండ సమీపంలో జన్మించారు. ఆయన తండ్రి బాషిర్ అలీ ఖాన్, నిజామ్ సైన్యంలో పనిచేసేవారు. కుమారుడు సినీ రంగంలోకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. కానీ నటనను వృత్తిగా తీసుకోవాలన్న ఆకాంక్ష బలంగా ఉండడంతో, తండ్రికి ఇష్టం లేకపోయినా, తన కాలేజ్ పుస్తకాలు అమ్మేసి, వచ్చిన డబ్బుతో రైలు టికెట్ కొనుక్కుని, బొంబాయికి పారిపోయారు అజిత్. అక్కడ తెలిసినవాళ్ళెవరూ లేకపోవడంతో, ఆ కలల నగరంలో తన తొలినాళ్లను అతి కష్టం మీద గడిపారు.
ఆయనకి గుర్తింపు తెచ్చిన సినిమా 1946 నాటి ‘షాహ్-ఎ-మిసర్’. ఈ సినిమాలో ఆయన గీతా బోస్ సరసన సహాయక పాత్రలో నటించారు. తొలి సినిమా తరువాత ఆయన సికందర్, హాతింతాయి, ఆప్ బీతీ, సోనే కీ చిడియా వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాల వల్ల ఆయనకి కెరీర్‍కి ఉపయోగపడే గుర్తింపు మాత్రం రాలేదు.
“మా నాన్న తన కెరీర్ ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టారు. గుంపులో మూడో వరుసలో నిల్చునేవారు. ఆయన విశిష్టమైన స్వరం కారణంగా మొదటి వరుసలోకి వచ్చారు. మహేష్ భట్ గారి తండ్రి నానాభాయ్ భట్ – నాన్నకి హీరోగా తొలిసారిగా హీరోగా అవకాశం ఇచ్చారు” చెప్పారు అజిత్ కుమారుడు షెహ్‍జాద్.
అయితే హీరోగా అవకాశాలు వస్తున్నప్పటికీ, అజిత్ సహాయక పాత్రల్లోనూ నటించారు. క్రమంగా ప్రముఖ కధానాయకుడయ్యారు. మీనా కుమారి, మధుబాల, నళినీ జయవంత్, లీలా మిశ్రా వంటి ఆ కాలపు ప్రసిద్ధ నటీమణుల సరసన హీరోగా నటించారు.
మీనా కుమారి, మధుబాల గార్లతో అజిత్ ఎక్కువగా కథానాయకుడిగా నటించారు. మధుబాలతో ఆయన నటించిన మొదటి సినిమా ‘జనమ్‌పత్రి’ (1949). తరువాత 1950లో ‘బేకసూర్’ చిత్రంలో, 1951లో ‘సైయా’ అనే చిత్రంలో నటించారు. ఆపై వీరిద్దరూ పలు చిత్రాలలో నాయికా నాయకులుగాను, సహాయక పాత్రలలోను నటించారు.
అజిత్ మీనా కుమారితో హీరోగా ‘హలాకు’ (1956), ‘గురు ఘంటాల్’ (1956)లతో పాటు ఇంకా పలు సినిమాలో చేశారు. నళిని జయవంత్‌తో హీరోగా ‘నాస్తిక్’ (1954), ‘26 జనవరి’ (1956), ‘భారతి’ (1956) తదితర చిత్రాలలో నటించారు.
దాదాపుగా 20 ఏళ్ళపాటు హీరోగా, సహాయక నటుడిగా పాత్రలు పోషించిన ఆయన 1960ల నుంచి విలన్ పాత్రలకు మళ్ళారు. విలన్‌గా ఆయన తొలి చిత్రం టి. ప్రకాశరావు దర్శకత్వం వహించిన ‘సూరజ్’ (1966) పెద్ద హిట్ కావడంతో విలన్‍గా స్థిరపడ్డారు. జంజీర్ (1973), యాదోం కీ బారాత్ (1973), కాళీచరణ్ (1976) వంటి గొప్ప హిట చిత్రాలలో విలన్‍గా నటించారు.
“అజిత్ 1950, 60లలో ఎన్నో చిత్రాలలో హీరోగా నటించినప్పటికీ, ఆయన పెద్దగా విజయవంతం కాలేదు. 1960ల మధ్యలో విలన్‍గా మారి, 70లలో – జంజీర్, యాదోం కీ బారాత్, కాళీచరణ్ – వంటి హిట్‍లు అందుకున్నారు. కాళీచరణ్ చిత్రంలో చెప్పిన ఒక డైలాగ్ ‘సారా షహెర్ ముఝే లయన్ కే నామ్ సే జాన్తా హై’ చాలా ప్రసిద్ధమైనది (ఆయన లయన్‍ను లొయిన్ అని ఉచ్చరించేవారు). ‘యాదోం కీ బారాత్’ లోనే కాకుండా ధర్మేంద్ర నటించిన కహానీ కిస్తత్ కీ, జుగ్ను, పత్థర్ ఔర్ పాయల్, ప్రతిజ్ఞ వంటి సినిమాల్లో కూడా విలన్‍గా నటించారు. 1970లలో ఆయన కెరీర్ ఉచ్చస్థాయికి చేరుకుంది, 80లలో హిట్లు తగ్గినా, 1990ల వరకు ఆయన ప్రజాదరణ తగ్గలేదు” అని వ్యాఖ్యానించారు సినీ విమర్శకులు సైబాల్ ఛటర్జీ.
‘యాదోం కీ బారాత్’ లో ఆయన ఫేమస్ డైలాగ్ ‘మోనా డార్లింగ్’ – ఇప్పటికీ జనాలు వాడుతున్నారు. జంజీర్‍లోని ‘లిల్లీ డోంట్ బీ సిల్లీ’ అనే డైలాగ్ కూడా సినీప్రియులకు బాగా గుర్తుండిపోయింది. బాలీవుడ్ విలన్‍లంటే దూకుడుగా, గట్టిగా అరుస్తూ, వీధి రౌడీల్లా ఉంటారనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ – అజిత్ – చక్కని దుస్తులతో – మంచి మాటలతో – కొత్త విలన్ అవతారాన్ని పరిచయం చేశారు. హిందీ, ఇంగ్లీషు పదాలను కలగలుపుతూ ‘హింగ్లిష్’ అనే భాషలో మాట్లాడుతూ సంభాషణలు పలికేవారు. ఇది పరిశ్రమలో మునుపెన్నడూ లేదు.
“70లు, 80లలో ఆయన ఉచ్చస్థితిలో ఉండేవారు, తన సొంత మానరిజమ్స్ కలిగి ఉండేవారు. అప్పట్లో ప్రతీ విలన్‍కి తనకంటూ ఒక శైలి ఉండేది. అజిత్ కూడా తన సొంత డైలాగ్ స్టయిల్ ఉండేది. ఆ స్టయిల్ ఇతర ఏ విలన్‍కి ఉండేది కాదు. ఆయన ఈ కాలంలో ఉండి ఉంటే, సినిమాల్లో ఆయన మాట్లాడినవన్నీ క్షణాల్లో మీమ్స్‌గా వైరల్ అయ్యేవి. సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఆయన సోషల్ మీడియా స్టార్‍లా వెలుగొందారు. బాలీవుడ్‍లో అందరూ ఆయన సినిమాలు చూసి, ఆయన డైలాగులను అనుకరించాలని ప్రయత్నించేవారు. సంభాషణలు పలికే తీరులో మాత్రమే కాకుండా, దుస్తులు ధరించడంలోనూ ఆయన ప్రత్యేకమైన శైలి కలిగి ఉండేవారు. చక్కని దుస్తులు ధరించి విలక్షణమైన సంభాషణలు పలివేవారు. ఆయన పలికే ఆ సంభాషణలు బహుశా నేటికి పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు.. కానీ ఆ రోజుల్లో అదో వింత, ఎంతో నవ్వు తెప్పించేవి” అన్నారు సైబాల్ ఛటర్జీ.
“అజిత్ బెదిరించే సంభాషణలు పలికినా అవి తమాషాగా ఉండేవి. వాటిని సినిమాల్లో జనాలు చూసినప్పుడు, వాటిలోని తమాషా కోణాన్నే చూశారు. పూర్తిగా ట్రోల్ చేయగలిగే విషయాలు ఉండేవి. ఆయనని ఎవరూ అనుకరించిలేకపోయేవారు. కొద్దిమంది మిమిక్రీ కళాకారులు ఆయన స్వరాన్ని అనుకరించగలిగినప్పటికీ, సినిమాల్లో మాత్రం ఎవరూ ఆయనలా అద్భుతాన్ని చేయలేకపోయారు. ఆ దశాబ్దాలలో విలన్‍గా ఆయనకి పోటీగా ఎవరూ నిలవలేకపోయారు” వ్యాఖ్యానించారు ఛటర్జీ.
1980ల చివర్లో అజిత్ హైదరాబాద్‍కు తిరిగి వచ్చారు. ఆయన 22 అక్టోబరు 1998 నాడు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని గోల్కొండ కోట సమీపంలోని జమాలి కుంటలో ఖననం చేశారు. సింహం ఇక లేకపోవచ్చు, కానీ సంభాషణల రూపంలో ఆయన గర్జింపులు ఆయన అభిమానుల గుండెల్లోనూ, మంచి సినిమా అభిమానుల గుండెలలోనూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
వెండితెర మీద ఆయన ప్రస్థానాన్ని వివరించే ఒక కాఫీ టేబుల్ బుక్ – ‘అజిత్: ది లయన్’ అనే పేరుతో వెలువడింది. సుమారు 11 ఏళ్ళు కృషి చేసి ఈ పుస్తకాన్ని రచించారు ఇక్బాల్ రిజ్వీ. “ఈ పుస్తకంలో చాలా మందికి తెలియని ఆసక్తికరమైన కథనాలు ఎన్నో ఉన్నాయి. అజిత్ అభిమానులకు బాగా నచ్చుతుంది. మా నాన్న ఇంట్లోంచి పారిపోయి, హిందీ సినీరంగంలో ఉన్నత స్థానానికి ఎలా చేరుకున్నారో తెలిపే కథనాలు ఉన్నాయి. ఓ మధ్యతరగతి వ్యక్తి – తన కలలను నిజం చేసుకునేందుకు హైదరాబాద్‍ని విడిచి బొంబాయి చేరి అక్కడి ప్రజల హృదయాలను గెల్చుకున్న వైనం అబ్బురపరుస్తుంది” అన్నారు అజిత్ మరో కుమారుడు షాహిద్ అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో.
***
‘ఢోలక్’ సినిమాలో అజిత్, మీనా షోరేలపై చిత్రించిన ‘ఏక్ పల్ రుక్ జానా సర్కార్’ పాటని యూట్యూబ్‍లో చూడండి.
https://www.youtube.com/watch?v=gPKad3WT-jA
నాట్యపు మధురిమల స్వర్ణోత్సవాలు – నర్తకి వైశాలి:
మూడేళ్ళ లేత వయసులో, చాలా మంది పిల్లలకి పరుగు పెట్టడం కూడా రాదు, కానీ వైశాలి ఇరానీ మాత్రం తన నృత్య ప్రదర్శనతో వేదికపై అద్భుతం సృష్టించారు. అప్పటికే ఆమె అక్కయ్య మధుమతి ప్రసిద్ధ నర్తకి. ఆమె ఈ చిన్నారిని అందమైన నాట్య ప్రపంచానికి పరిచయం చేశారు.
తన నాట్య నైపుణ్యం, సినిమాల్లో నటన గురించి వైశాలి గారు ఇలా చెప్పారు:
“నేను కథక్ పండిట్ భీమ్‌రాజ్ గారి నుంచి, భరతనాట్యం గురు కళ్యాణ్ రామన్ పిళ్లైల నుంచి నేర్చుకున్నాను. నేను టీనేజ్‌కి వచ్చేసరికే నాట్యంలో ప్రావీణ్యం సాధించాను. నేను మెదటిసారిగా సినిమాలో నటించినప్పుడు నా వయసు 12-13 ఏళ్ళు ఉంటుందేమో. రాజ్‍కమల్ స్టూడియోలో తీసిన ఆ సినిమాలో అవకాశాన్ని ప్రముఖ నటి, దర్శకులు వి. శాంతారం కుమార్తె రాజశ్రీ గారు ఇప్పించారు.”
“ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను, అమ్మ కలిసి వి. శాంతారాం గారి ఆఫీసుకు వెళ్ళాం. అమ్మ తన హ్యాండ్ బ్యాగ్‍లో నా ఫోటోలు పెట్టుకుంది. అమ్మ వాటిని బయటకు తీయగానే, ‘నావి కెమెరా లాంటి చూపులు, మీ అమ్మాయి నా సినిమాకి ఎంపికైంది’ అని ఆయన అన్నారు.”
“ఆ మర్నాడే కాంట్రాక్టుపై సంతకం చేశాను” చెప్పారామె. ఆ పాత్ర కోసం అంతకు ముందు సుమారు 52 మంది బాలికలని స్క్రీన్ టెస్ట్ చేశారట. వైశాలి అదృష్టం ఏంటంటే, ఎలాంటి స్క్రీన్ టెస్ట్ లేకుండా నేరుగా సెట్‍లోకి ప్రవేశించారు. ఆ సినిమా పేరు ‘బూంద్ జో బన్ గయే మోతీ’.
ఆ తరువాత వైశాలి ఈత కూడా నేర్చుకుని తన నైపుణ్యాలకు మరో అంశాన్ని జోడించారు. ఎస్.డి. నారంగ్ గారు ఎక్కువగా అండర్ వాటర్ సీన్లు ఉండే ‘అన్‍మోల్ మోతీ’ అనే సినిమా తీస్తూ, ప్రధాన పాత్రని వైశాలికివ్వ జూపారు. కానీ ఇరానీగారితో వివాహం కుదరడంతో, ఆమె ఆ సినిమాని వదులుకున్నారు. అప్పుడు ఆ పాత్రకి బబితగారిని ఎంచుకున్నారు. అలాగే సుబోధ్ ముఖర్జీ గారి సినిమా, ఆర్.కె. ఫిల్మ్స్ వారి సినిమాలు కూడా వదులుకున్నారు వైశాలి.
వైశాలి రామ్‍రాజ్ నహతా గారి ‘రాతోం కా రాజా’ లోనూ, ఎస్. ఎస్. వాసన్ గారి ‘తీన్ బహురాణియా’ లోనూ నటించారు. వాసన్ గారి జెమినీ సంస్థలో మరో రెండు అవకాశాలు లభించాయి కానీ, వివాహం కారణంగా వాటిని వదులుకున్నారు వైశాలి.
పెళ్ళికి ముందు, వైశాలి కేవలం ఒకే ఒక సినిమాలో నటించారు. దాని పేరు ‘చౌకీదార్’. “సోహన్‍లాల్ మాస్టర్‍జీ, శ్యామ్ రల్హాన్ గారు మా ఇంటికి వచ్చారు. తమ చిత్రంలో శాస్త్రీయ నృత్యం చేసే పాత్రలో నన్ను నటింపజేయడానికి అమ్మని అనుమతి కోరారు. చాలా రోజుల క్రితమే నేను సినిమాలు మానుకున్నానని అమ్మ వాళ్ళకి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళిద్దరూ గట్టిగా బ్రతిమాలడంతో, వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ – ఆ పాటకి నర్తించాను.” చెప్పారు వైశాలి.
సినిమాల్లో నటించడమే కాకుండా, వైశాలి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. అటువంటి వాటిల్లో ఒకటి – డిసెంబర్ 1968లో జరిగిన నాథూరాం పాస్ – యుద్ధక్షేత్రంలో ప్రదర్శన. “సునీల్ దత్ గారి అంజన ఆర్ట్స్ కల్చరల్ ట్రూప్ వారు – అక్కడ నృత్య ప్రదర్శన ఇవ్వమని నన్ను అడిగారు. అక్కడ ఎముకలు కొరికేంత చలి. మంచులో ప్రదర్శన చేయాల్సి వచ్చింది. సునీల్ దత్ గారు పైన ఓవర్ కోట్ వేసుకుని నాట్యం చేయమన్నారు. కానీ వహీదా రెహ్మాన్ గారు మాత్రం కేవలం శాస్త్రీయ నాట్యం కాస్ట్యూమ్‍తోనే నర్తించమన్నారు. తీవ్రమైన మంచులో నాట్యం చేసిన ఆ అరగంట సమయం నాకింకా గుర్తుంది. ప్రదర్శన పూర్తయ్యేసరికి నా పాదాలు తిమ్మిరెక్కాయి, కానీ హృదయంలో ఎంతో సంతోషం! ఈ కార్యక్రమంలోనే కిషోర్ కుమార్ గారు పాడవలసి ఉంది, కానీ వాతావరణం అనుకూలించక, ఆయన పాడలేకపోయారు” గుర్తు చేసుకున్నారు వైశాలి.
ఈరోజూ వరకూ వైశాలి మన దేశంలోనూ, విదేశాలలోనూ ఎన్నో ప్రదర్శనలిచ్చారు. కుటుంబ స్నేహితుడు, థానే లోని ప్రభాత్ టాకీస్ యజమాని అయిన సరోష్ ఇరానీతో వివాహం నిశ్చయమయ్యేటప్పటికి ఆమె ఖాతాలో పలు సినిమాలు, ఎన్నో నృత్య ప్రదర్శనలు ఉన్నాయి. వివాహం ఆమెకు మరో గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఖాళీగా ఇంట్లో కూర్చునే సమస్యే లేదు కాబట్టి, ఇరానీ గారు ఆమె అభిరుచిని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లదలచారు.
1972లో సొంతంగా డాన్స్ అకాడెమీ ప్రారంభించడానికి ముందునుంచీ, 1970 ల నుంచే వైశాలి నాట్యంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. నర్గిస్, గోపికృష్ణ, షకీలా, కమ్మో, షమ్మీ కపూర్ వంటి నటీనటుల సమక్షంలో ఆమె డాన్స్ అకాడెమీ థానేలో ప్రారంభమయింది. ప్రతీ రోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిందింటి వరకూ వైశాలి ఎంతో కష్టపడేవారు. కథక్, భరతనాట్యంలలో క్రాష్ కోర్సులు ప్రవేశపెట్టడం నుంచి గ్రూప్ అరంగేట్రం వరకు – వైశాలి శాస్త్రీయ నృత్యాన్ని కొత్త పుంతలు తొక్కించి, పలువురిని ఆకర్షితులని చేశారు. కథక్, భరతనాట్యంలలో క్రాష్ కోర్సులు ప్రవేశపెట్టడానికి కారణం – నేటి బాలికలు, యువతుల సమయంతో పరుగులు పెడుతున్నారు, ఈ నృత్యాలను నేర్చుకోవటానికి వారు 7-8 ఏళ్ళ సమయం వెచ్చించలేకపోవడమేనని వైశాలి భావించారు. తదనుగుణంగా ఆమె 3-4 ఏళ్ళలో పూర్తయ్యే క్రాష్ కోర్సులు రూపొందించారు. వైశాలి ప్రవేశపెట్టిన మరో అంశం – గ్రూప్ అరంగేట్రం. సాధారణంగా అరంగేట్రం అనేది వ్యక్తిగతమైనది, ఖర్చుతో కూడినది. గ్రూప్ అరంగేట్రం ఏర్పాటు చేయడం వల్ల వీలైనంత తక్కువ వ్యయంతో, ఒక్కొక్కరికి తక్కువ ఖర్చు అయ్యేలా – ఎక్కువమందిని అరంగేట్రం చేయించవచ్చు. “నేను కనుక గ్రూప్ అరంగేట్రం – పరిచయం చేయకపోయి ఉంటే, ఎందరో ప్రతిభావంతులైన నాట్య కళాకారులు, ఆర్థిక ఒత్తిడులకు లొంగి, ఘనంగా అరంగేట్రం చేసుకోవడంలో విఫలం అయ్యేవారు” అన్నారు వైశాలి. “ఒక బృందంలో చేర్చడం వల్ల ఇద్దరు అమ్మాయిలు ఉచితంగా అరంగేట్రం చేయగలిగారు. తమ కుమార్తెలతో పాటు ఈ ఇద్దరినీ నాట్యం చేయడానికి అంగీకరించిన తల్లిదండ్రులకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి” ఆన్నారామె.
1970కి ముందు తాను నాట్యంలో సాధించిన అనుభవాన్నంతా తన స్వంత సంస్థలో ఉపయోగించారు వైశాలి. తమ సంస్థ పురోగతి సాధించటంతో, వైశాలి – హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూల్ లోనూ, సెయింట్ జాన్ బాప్టిస్ట్ హై స్కూలు లోనూ నాట్యం తరగతులు నిర్వహించారు. థానే లోని బృందావన్ సొసైటీలో మరో బ్రాంచి తెరిచారు.
వైశాలి గారికి ఇద్దరు కుమార్తెలు. అనహీత న్యాయవాది కాగా, నమ్రత హోటల్ మానేజ్‍మెంట్ రంగంలో ఉన్నారు. నాట్యంలో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ఒక తల్లిగా తన కుమార్తెల పెంపకంలో ఏ లోటూ రానివ్వలేదు వైశాలి. కుమార్తెలిద్దరూ బాగా చదువుకుని, ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు. అయితే ఆమె కుమార్తెలిద్దరూ ప్రస్తుతం తమ తమ ఉద్యోగాలని వదిలి, తల్లి స్థాపించిన సంస్థకు సేవలు అందిస్తున్నారు. ఉయ్యాలని ఊపే చేతులు ప్రపంచాన్ని పరిపాలిస్తాయన్నది నిజం.
వైశాలి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి – 2006 నుంచి ఆమె చేపట్టిన ఛారిటీ షోలు. తన ఛారిటీ షోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆమె కాన్సర్ రోగుల చికిత్స కోసం ఖర్చు చేస్తారు. “గత 15 ఏళ్ళుగా నేను, నా బృందం, – అద్భుత నటి నర్గిస్ గారికి నివాళిగా – ఎన్నో ఛారిటీ షోలు చేశాము” చెప్పారు వైశాలి. ప్రస్తుతం ఆమె నేతృత్వంలో ఆమె కుమార్తెలు ఈ ప్రదర్శనలని నిర్వహిస్తున్నారు.