[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
[dropcap]ప్ర[/dropcap]స్తుతం దేశంలోని నెలకొని ఉన్న సమస్యాత్మక వాతావరణం దృష్ట్యా హైదరాబాద్‌తో భారత్ ఏదో ఓ రకంగా సంబంధం కలిగివుండాలని సర్దార్ భావించారు. ఇందుకోసం, అవసరమైతే, నిజామ్‍కు ఆమోదయోగ్యమైన కనీస ప్రతిపాదనలనైనా ఆమోదించాలని సర్దార్ భావించారు. అయితే ఎట్టి పరిస్థితులలోనైనా ప్రభుత్వంలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలని ఆశించారు. ఒక్కసారి హైదరాబాద్ భారత్ పరిధిలోకి వస్తే, ప్రజలు తప్పనిసరిగా తమ కోరికలను సాధించేందుకు ప్రయత్నిస్తారని సర్దార్ ఆశించారు. ప్రజాభిప్రాయం వల్ల ఏర్పడిన ప్రభుత్వం ప్రజల అభీష్టాలను మన్నించాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతో ఆయన నిజామ్‍తో చర్చలలో మౌంట్‍బాటెన్ సహాయాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఇలా ఆహ్వానించటం వల్ల, అవసరమైతే కొన్ని మౌలిక ఆదర్శాల విషయంలో రాజీ పడాల్సి వస్తుందని తెలిసి కూడా సర్దార్ ఇందుకు సిద్ధమయ్యారు.
ఇదే సమయంలో లార్డ్ మౌంట్ బాటన్ ప్రతి విషయంలో సర్దార్ ఆమోదం తప్పకుండా తీసుకునే అడుగు ముందుకు వేసేవారు. కానీ పలు సమయాల్లో సర్దార్, అయిష్టంగానే నిజామ్‍కు అనుకూలమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపేవారు. పలు సందర్భాలలో అనుమతిస్తున్న అనుకూలమైన నిర్ణయాలను నిజామ్ స్వీకరించడని తెలిసికూడా, నేను ఆ విషయం తెలియ చెప్పినా సరే, పరిస్థితులను అనుసరించి సర్దార్ ఆమోదం తెలిపేవారు.
భారత్‍లో విలీనాన్ని ఆమోదించేందుకు నిజామ్‍ను మానసికంగా సిద్ధం చేసేందుకు మౌంట్‌బాటెన్ శాయశక్తులా కృషి చేసినా, నిజామ్, అతని సలహాదార్లు మాత్రం, కాస్త ఓపిక పడితే, సర్ వాల్టర్ తన చాతుర్యంతో ఏదో ఓ రకంగా హైదరాబాద్‍కు స్వతంత్రం సాధిస్తాడన్న నమ్మకంతో ఉండేవారు.
ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం భారతీయ సంస్థానాధీశులు బ్రిటీష్ రాణికి విధేయులుగా ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయించి, బ్రిటీష్ వారు తమ బాధ్యత అయిపోయిందని చేతులు దులుపుకుని, మనస్సాక్షిని సంతోషపెట్టుకున్నారు. అయితే ఇలా మనస్సాక్షిని సంతృప్తి పరుచుకునే ఆత్రంలో వారు, సంస్థానాధీశులని బెదిరించి, ఒప్పించి, దౌత్యం ద్వారా ఒప్పందాలు చేసుకుని, ఒప్పందాలను ఉల్లంఘించి ఒక శతాబ్దిగా గవర్నర్ జనరల్స్ సంస్థానాధీశులను అదుపులోపెట్టాలని చేసిన ప్రయత్నాలను వారు విస్మరించారు. ఆ పద్ధతిని అనుసరించే లార్డ్ మౌంట్‍బాటెన్ ఎట్టి పరిస్థితులలో నిజామ్‍పై ఒత్తిడి చేసి భారత్‍లో భాగం చేయటాన్ని ఆమోదించకూడదని ప్రతిజ్ఞ పట్టాడు. నిజామ్‍ను చర్చల ద్వారా ఒప్పించటం వల్లనే భారత్‍లో విలీనం చేయటం జరగాలన్నది ఆయన పట్టుదల.
తన సార్వభౌమత్వాన్ని వదులుకునే విషయంలో నిజామ్‍పై ఎలాంటి ఒత్తిడి తేకూడదన్న విషయాన్ని అవసరం అయినప్పుడల్లా ప్రస్తావిస్తూ ఉండేవాడు సర్ వాల్టర్ మాంక్టన్. నిజామ్‍కు రాసిన ఓ ఉత్తరంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
‘ఆయన (లార్డ్ మౌంట్‌బాటెన్) మన నడుమ జరిగిన చర్చల సారాంశాన్ని ప్రచురించటానికి, బహిరంగ పరచటానికి భయపడుతున్నాడు. నేను చర్చలలో మన వాదనను కరపత్రం రూపంలో బహిరంగ పరచటం ద్వారా మన రాజ్యంతో వ్యవహరించేటప్పుడు భారత్ జాగ్రత్తగా ఉండేట్టు చేయటం మన ఉద్దేశం అన్న నిజాన్ని ఆయుధంలా ప్రయోగిస్తున్నాను.’
నిజామ్, అతని అనుచరులు, సర్దార్ – మౌంట్‌బాటెన్ సహాయాన్ని కోరటం వెనుక ఉన్న కారణాలను తమ దృక్కోణాన్ని అనుసరిస్తూ పూర్తిగా వాడుకున్నారు. భారత ప్రభుత్వం హైదరాబాద్‍కు వ్యతిరేకంగా ఎలాంటి దుందుడుకు చర్య తీసుకోకుండా ఉండేందుకు మౌంట్‌బాటెన్ తమకు రక్షణ కవచం అని వారు భావించారు. అయినా సరే, భారత్ పోలీసు చర్య తీసుకోవటాన్ని నిరోధించటంలో వారు విఫలమయ్యారు. ఇందుకు కారణం వారి అతి మత ఛాందసం. నిజాన్ని గ్రహించలేని వారు భారత్‍లో మౌంట్‌బాటెన్ ఉండడం విలువను తెలుసుకోలేకపోయారు. నెలకొని ఉన్న పరిస్థితులను వారు అర్థం చేసుకోలేకపోయారు.
అధికారాన్ని ప్రేమించే నియంత, ఇస్లామిక్ అధిక్యాన్ని వాంఛించేవాడు అయిన నిజామ్‍ను విలీనానికి ఒప్పించే మౌంట్‍బాటెన్ చాకచక్యం పైన భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఆ కాలంలో. వాల్టర్ మాంక్టన్, మౌంట్‍బాటెన్‍లు వారి వారి అభిప్రాయాల మత్తులో పడి, హైదరాబాద్ ప్రత్యేక రాజ్యంగా ఉండడం భారతదేశం అనే భావనని అంతం చేసేటువంటిదని గుర్తించలేకపోయారు. మౌంట్‍బాటెన్ భావిస్తున్నట్లు భౌగోళికంగానే కాదు, చరిత్ర, భాష, సంస్కృతి, సజాతీయత, రాజకీయ ఐక్యత వంటి విషయాల ఆధారంగా కూడా హైదరాబాద్ భారత్‍లో అంతర్భాగం కావటం తప్పనిసరి.
ఈ సమయ్ంలో మౌంట్‍బాటెన్ దృక్కోణాన్ని కాంప్‍బెల్-జాన్సన్ చక్కగా వర్ణించాడు.
“నేను, ఇజ్మయ్ లండన్ పర్యటించినప్పుడు సయోధ్య కుదిర్చేవాడిగా మౌంట్‍బాటెన్ తన శాయశక్తులా కృషి చేస్తూ విలీనానికి, సంబంధం కలిగి ఉండటానికి నడుమ వారధిగా ఓ సూత్రాన్ని కనుగొనాలని తీవ్రంగా ప్రయత్నించాడు. ఆయన ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళాడంటే, చివరికి చేతితో రాసి ఓ పత్రాన్ని తయారు చేయాలని ఆలోచించాడు. దానికి శీర్షికగా ‘know all men by these presents’ (ఇది ఒక చట్టపరమైన ఒప్పంద పత్రంలో వాడే వాక్యం. నిజానికి ఇది ‘know all men by these present’. అంటే, ఇప్పుడు రాస్తున్న పత్రానికి వీరు సాక్షులు అని అర్థం. అందరూ ఆమోదించి పత్రంపై సంతకం చేయటానికి వీరు సాక్షులు అని అర్థం) అంటూ మొదలుపెట్టాలని ఆలోచించాడు. భారత్, నిజామ్‍లు ఇద్దరూ ఆమోదించి సంతకం చేయటంతో, ఇది చట్టపరంగా ఆమోదం పొందిన పత్రం అవుతుంది. దాని ప్రకారం సర్దార్ కోరినట్టు ‘విలీనం’ అవుతుంది. నిజామ్ ఆశించినట్టు భారత్‍తో ‘సంబంధం’ ఉంటుంది.”
కానీ ఇది చూస్తే, సర్దార్, నిజామ్‍ల పట్ల మౌంట్‌బాటెన్‍కు అంత చులకన అభిప్రాయం ఉందా? అని అనిపిస్తుంది.
భారత్ వదిలి వెళ్ళే లోగా, నిజామ్‍తో ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలని, మౌంట్‌బాటెన్ ఆత్రపడ్డాడు. మౌంట్‌బాటెన్ తొందరను గ్రహించిన లాయక్ అలీ, మొయిన్ నవాజ్‍లు, ఏదో ఓ ఒప్పందానికి మౌంట్‌బాటెన్ సిద్ధమవుతాడనీ, ఎట్టి పరిస్థితులలోనూ చర్చలు ఆగిపోనివ్వడనీ అనుకున్నారు.
భారత్‍తో విలీనం ప్రాతిపదికగా కాక, స్వతంత్ర దేశం ఏర్పాటు ఆధారంగా చర్చలు ఆరంభించాడు నిజామ్. జూలై ఆరంభంలో, అప్పటి ప్రధాని నవాబ్ ఛత్తారీ, సర్ వాల్టర్ మాంక్టన్, రాజ్యాంగ వ్యవహారాల మంత్రి నవాబ్ అలీ యావర్ జంగ్ లను భారత్‍తో చర్చలకు పంపాడు. ఛత్తారీ బృందంతో పాటు కాశిం రిజ్వీ కూడా చర్చలకు వచ్చాడు.
ఢిల్లీలో, వారు జిన్నా సలహా కోరారు. ఆ సంభాషణ ఎలా జరిగిందో నేను సులభంగా ఊహించగలను. నా మిత్రుడు, హోమ్ రూల్ లీగ్ రాజకీయ నాయకుడైన జిన్నా కాలు మీద కాలేసుకుని రాజసం ఉట్టిపడేలా ఏమీ పట్టనట్టు కూర్చుంటాడు. అతని ఒక చేయి ఒకే కంటికి ఉన్న ఒకే అద్దంతో ఆడుతూ ఉంటుంది. మిగతావారు గౌరవంతో, మౌనంగా కూర్చుంటారు. కాస్సేపటికి అధికారం ఉట్టిపడే రీతిలో, ఆగి ఆగి, జిన్నా ఎవరేం చేయాలో చెప్తాడు.
ఈ సందర్భంలో, పాకిస్తాన్ నిర్మాత ఆశాభావాన్ని వ్యక్తపరిచినట్లున్నాడు. హైదరాబాద్‍పై ఒత్తిడి అధికమైన పక్షంలో, ఇమామ్ హుస్సేన్‍లా హైదరాబాద్ స్వతంత్రాన్ని వదులుకునే బదులు, తనని తాను కాల్చి బూడిద చేసుకోవాలని సూచించాడు. త్యాగం చేయలని సలహా ఇచ్చాడు.
భారతదేశంలోని రాజ్యాలన్నిటిలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఒకేసారి ఆరంభించటం కుదరదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇందుకు అవసరమైన రాజకీయానుభవం కానీ, శిక్షణ కానీ భారతీయ నాయకులలో లోపించింది. అన్ని రాష్ట్రాలలో సక్రమమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమయం పడుతుంది. కానీ ఎక్కడో ఓ చోట ఆరంభం కావాలి. కాబట్టి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవటం ప్రభుత్వాలకు తప్పనిసరి. కానీ బాధ్యతాయుతమైన ప్రభుత్వం సత్వరం ఏర్పడాలి.
ఇలా మాట్లాడుతున్న జిన్నాకు అడ్దుపడి ఛత్తారీ నవాబ్ ఆయనను భూమికి తెచ్చే ఓ ప్రశ్న అడిగాడు – “ఒకవేళ భారత్ నుంచి ప్రమాదం సంభవించే పరిస్థితులు నెలకొంటే, పాకిస్తాన్, హైదరాబాద్ సహాయానికి వస్తుందా?” అని సూటిగా అడిగాడు. “హైదారాబాద్‍కు పాకిస్తాన్ ఎలాంటి సహాయం చేయదు. సహాయానికి రాదు” అని జిన్నా స్పష్టంగా చెప్పాడు [హైదరాబాద్ ఇన్ రిట్రోస్పెక్ట్, అలీ యావర్ జంగ్].
సంస్థానాధీశుల సమావేశంలో, 25 జూలైన మౌంట్‌బాటెన్, భారతదేశంలో విలీనం అవటం మంచిదని తన చరిత్రాత్మక ఉపన్యాసంలో స్పష్టంగా ప్రకటించాడు. అప్పటికే నవానగర్, బరోడా, మైసూర్, బికనేర్, గ్వాలియర్, పాటియాలా మహారాజులు – విదేశీ వ్యవహారాలు, రక్షణ, సమాచార శాఖలు భారత్ ఆధీనంలో ఉండేట్లు ఒప్పందాలు చేసుకున్నారు. ఆగస్టు 15, భారత్‍లో విలీనమయ్యే ఒప్పందంపై సంతకం చేసేందుకు చివరి రోజు. ఈలోగా, వివిధ రాజ్యాల రాజులు, ప్రధానులతో ఒక చర్చా సంఘాన్ని ఏర్పాటు చేశాడు మౌంట్‌బాటెన్. ఈ సంఘంలో చేరేందుకు నవాబ్ ఛత్తారీ నిరాకరించటంతో, హైదరాబాద్‍తో చర్చలు ఆగిపోయాయి.
జిన్నా హైదరాబాద్‍కు సహాయం చేయటం పట్ల ప్రదర్శించిన వైఖరి ఇత్తెహాద్, నిజామ్‍ల ఉత్సాహాన్ని నీరు కారుస్తుందని భావించాడు రజ్వి. తనకి అలవాటయిన పద్ధతిలో ఆయన చర్చలను దెబ్బ తీశాడు. హైదరాబాద్ తిరిగివచ్చి చర్చల్లో పాల్గొంటున్నవారంతా ద్రోహులు అని బహిరంగంగా ప్రకటించాడు. ఉత్తర ప్రదేశ్‍లో జమీందారీ ఉంది కాబట్టి నవాబ్ ఛత్త్తారీ ద్రోహి. నెహ్రూ, పటేల్‍ల సహచరుడు కాబట్టి అలీ యావర్ జంగ్ ద్రోహి. మౌంట్‌బాటెన్ మిత్రుడు కాబట్టి, వాల్టర్ మాంక్టన్ కూడా ద్రోహియే! పింగళి వెంకట రామరెడ్ది, రహీమ్‍లు మాత్రమే హైదరాబాద్ పక్షాన నిజంగా నిలబడ్డారు. వారే పరిస్థితిని మెరుగుపరిచినవారు. రక్షణ, విదేశీ వ్యవహారాలను భారత్‍కు అప్పగిస్తూ రాసిన లేఖను మౌంట్‌బాటెన్‍కు పంపకుండా అడ్డుపడి, హైదరాబాద్ ద్రోహానికి గురికాకుండా కాపాడినవారు వీరే అన్నాడు రజ్వీ.
నిజానికి, రక్షణ, విదేశీ వ్యవహారాలను భారత్‍కు అప్పగిస్తూ రాసిన లేఖ, నిజామ్ ఆమోదాన్ని పొందింది. అయితే, అలవాటయిన రీతిలో నిజామ్ సంతకం చేసిన లేఖ, గవర్నర్ జనరల్‍కు నవాబ్ ఛత్తారీ పంపుతున్న లేఖ ఒకటి కాదని ఆరోపించారు. ఆ లేఖ నిజామ్ అనుమతి పొందిన లేఖ కాదని ప్రచారం జరిగింది.
ఆగస్టు 5న ఛత్తారీ, ఇతర సభ్యులు హైదరాబాద్‍కు తిరిగి వచ్చారు. వారు హైదరాబాదులో ఆగ్రహంతో రగులుతున్న నిజామ్‍తో పాటు, వారిని ద్రోహులుగా ఎంచిన హైదరాబాద్ ప్రజలను ఎదుర్కోవలసి వచ్చింది.
భారతదేశ సంస్థానాధీశులు తనను మోసం చేశారు కాబట్టి, బ్రిటీష్ వారు ఇచ్చిన హామీ ప్రకారం తాను తిన్నగా ఇంగ్లాండ్‌తోనే సంబంధాలు నెరుపుతానని, కొత్తగా ఏర్పడుతున్న రెండు దేశాలలోనూ చేరనని ప్రకటించాడు నిజామ్. ఇత్తెహాద్ మంత్రి అయిన రహీమ్, మొయిన్ నవాజ్ జంగ్‌లు, చట్టప్రకారం బ్రిటీష్ వారు దేశం వదలటంతోటే వాస్తవంగా తమకు స్వాతంత్రం లభించినట్లేనని, ఈ రకంగా అడుగులు ముందుకు వేయమని నిజామ్‍కు సలహా ఇచ్చారు.
తనకి అలవాటయిన పద్ధతిలో ఇత్తెహాద్‍లకు సహాయం చేస్తున్నట్టు కనబడాలని నవాబ్ ఛత్తారీ ప్రయత్నించాడు. భారత్‍తో యుద్ధం చేయాలని ఇత్తెహాద్‍లు భావించినప్పుడు, ఏమయినా ఆయుధాలు హైదరాబాద్‍కు అందిస్తాడేమోనని జిన్నాని అడిగాడు నవాబ్ ఛత్తారీ. ‘ఒక్క తుపాకీ కూడా ఇవ్వను’ అన్నాడు ఖైద్-ఎ-ఆజమ్. కానీ యుద్ధానికి ఆయుధాలు అవసరం. కాబట్టి సైన్యాధికారి ‘ఎల్ ఎద్రూస్’ను, ఆయుధాల సరఫరా విషయమై ఏర్పాట్లు చేసేందుకు యూరప్‍కు పంపమని నవాబ్ ఛత్తారీని ఒత్తిడి చేశారు ఇత్తెహాద్ సమర్థక మంత్రులు.
లాయక్ అలీతో కలిసి నవాబ్ అలీ యావర్ జంగ్ కూడా అమెరికా, ఇంగ్లండ్‍లు ప్రయాణమై, వారితో రక్షణ ఒప్పందాలు చేసుకోవాలని కోరారు. నవాబ్ ఛత్తారీ తెలివైన వాడు. అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళే బదులు ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఈయన రాజీనామా చేయటంతో, సున్నీలు అధికంగా ఉన్న ఇత్తెహాదీలు, ప్రభుత్వ కార్యాలయాలలో ఉన్నత స్థానాలలో ఉన్న ‘షియా’లందరినీ బాధ్యతల నుంచి తొలగించి, పదవీ విరమణలిప్పించే ఉద్యమం ఆరంభించారు [హైదరాబాద్ ఇన్ రిట్రోస్పెక్ట్, అలీ యావర్ జంగ్].
ఆగస్టు 14న, చివరి హైదరాబాద్ రెసిడెంట్‍కు వీడ్కోలు పలికే సందర్భంలో నిజామ్ తన మనసులో మాటను బయటపెట్టాడు.
“బ్రిటీష్ కామన్‍వెల్త్ దేశాలలో ఒక దేశంగా ఉండటమే ఇప్పటికీ నా ఆకాంక్ష. ఇన్నేళ్ళ అనుబంధం వల్ల హైదరాబాద్‍ను బ్రిటన్‌తో కట్టి ఉంచిన సంబంధాలు తెగిపోవన్నది నా విశ్వాసం.”
దేశం వదిలి వెళ్తున్న రెసిడెంట్ హెర్బర్ట్, ఆ కాలం నాటి రాజకీయ రంగపుటాలోచనలను తన ఉపన్యాసంలో ప్రకటించాడు:
“హైదరాబాద్, బ్రిటన్‍ల నడుమ నూతన స్థితిని అనుసరించి కొత్త రకమైన సంబంధాలు అతి త్వరలో ఏర్పడాలన్న ఘనత వహించిన ప్రభువు ఆకాంక్షలను నేనూ బలపరుస్తాను. ఇలా నూతనంగా ఏర్పడిన సంబంధాలు పాత సంబంధాలంత గట్టివి, దీర్ఘకాలం మన్నేవి అవ్వాలని ఆశిస్తున్నాను.” [హైదరాబాద్ రిలేషన్స్ విత్ డొమినియన్స్ ఆఫ్ ఇండియా, నిజామ్ ప్రభుత్వ ప్రచురణ].
ఆ సందర్భంగా అక్కడ ఉన్న ఓ అతిథి చెప్పిన దాని ప్రకారం, ఢిల్లీలో ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని, త్వరలో తాను రెసిడెంట్‍గా హైదరాబాదులో అడుగుపెడతానన్న ఆశాభావాన్ని రెసిడెంట్ వ్యక్తపరిచాడు. నిజామ్ కూడా ‘బ్రిటీష్ వారు భారత్ వదిలి వెళ్ళగానే, నేను స్వతంత్ర సార్వభౌముడిని అవుతాను’ అన్న విశ్వాసాన్ని ప్రకటించాడు.
బ్రిటీష్ రెసిడెంట్ కేవలం మాటలతో సంతృప్తి పడలేదు. రెసిడెన్సీ లోని ఫైళ్ళన్నింటినీ నాశనం చేశాడు. సికిందరాబాద్‌లో ఉన్న రెండు సైనిక దళాలను, ఔరంగాబాద్ లోని సైనిక దళాన్ని నిజామ్‍కు అప్పగించాడు. భారత ప్రభుత్వానికి చెందిన రెసిడెన్సీని ఆయుధాలు, సైనిక పరికరాలను నామ మాత్రపు ధరకో, ఉచితంగానో నిజామ్‍కు కట్టబెట్టాడు. హకీంపేట విమానాశ్రయాన్ని సైతం అలాగే వదిలేశారు.
వచ్చే వారం ‘రిజ్వీ గెలుపు’.
(ఇంకా ఉంది)