అరుదైన నటవహ్ని- బల్‌రాజ్ సహ్ని – 4 భాభీ కీ చూడియా

0
10

[dropcap]లం[/dropcap]డన్‌లో పని చేస్తున్నప్పుడు బల్‌రాజ్ సహ్ని ఎందరో హాలీవుడ్ నటులను గమనించేవారు. వారిలో ఆయనకు నచ్చింది డిసిప్లిన్, టైం మేనేజమెంట్. యాక్టింగ్ పట్ల స్పష్టత. మన దేశంలో నాటకం హెచ్చు స్థాయి గొంతుకలతో సాగేది. అదే మన నట సాంప్రదాయం అయిపోయింది. మంచి నటుడంటే గంభీరమైన గొంతుతో కిలోమీటరు దూరం దాకా వినిపించే ఉచ్చారణ, వాచకంతో డైలాగ్ పలకాలనే ఆలోచన ప్రేక్షకులలోనూ, నటులలోనూ పాతుకుపోయింది. దీని వలన సినిమా రంగంలోకి వచ్చిన నటులు అదే నాటకీయ శైలిని తెరపైకి తీసుకొచ్చారు. అదే నటనగా ఈ రోజుకీ చెలామణి అయిపోతూ ఉంది. మనిషిలో దాగున్న అనుకరణ శక్తికి ఇదో పెద్ద ఉదాహరణ. అయితే ఆ రోజుల్లో నటనను మరో పద్ధతిలో నటనలా కాకుండా నిజజీవితంలో సంఘటనలా తెరకెక్కించాలనే ఓ థియరీ రష్యాలో ప్రప్రథమంగా మొదలయింది. దీనికి ఆద్యుడు స్టానిస్లావ్క్సి. వ్లాదిమిర్ నెమిరోవిచ్ డాన్చెకోతో కలిసి ఈయన మాస్కో ఆర్ట్ థియేటర్‌ను స్థాపించారు. దీని ద్వారా నాటక రంగంలో ఓ కొత్త శైలిని ఆయన ప్రవేశపెట్టారు. అదే నటనలో నటించని వాడు నటుడు అన్న సిద్ధాంతం. ఓ సీన్ లోకి మానసికంగా ప్రవేశించి తన జీవితంలోనే ఆ సన్నివేశం జరుగుతుందని ఆ మూడ్‌ని ఆవహించుకుని నటుడు ప్రవర్తించడమే నటన అన్న థియరీ వీరిది. మొట్టమొదట గోర్కి, చెహోవ్ రచనలకు ఈయన ఇదే పద్ధతిలో స్టేజ్‌పై జీవం పోశారు. ఈ శైలిలో నటుడు ఆ పాత్రను, సీన్‌ను స్వయంగా అనుభవించి అది తన స్వీయానుభవంలా ప్రదర్శించాలి.

ఈ ప్రక్రియలో నటుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాత్ర యొక్క చర్యలపై నైపుణ్యాన్ని పొందాలి. అ చర్యలకు దారితీసిన భావోద్వేగాలు, ఆలోచనలను తనలో రేకెత్తించుకోవాలి. అలా తన పాత్రను అర్థం చేసుకుంటూ, అనుభూతి చెందాలి. దీనిని వేదికపై బహిర్గతపరచాలి. ఈ పద్ధతి రష్యన్ థియేటర్‌నే కాదు ప్రపంచ నాటక రీతినే మార్చివేసింది. అప్పటికే ఫ్రాన్స్, ఇటలీలోను ఇలాంటి పద్ధతిపై చర్చలు సాగుతున్నాయి. కాని మొదట ఈ శైలిలో నాటకాలు రూపొందించింది స్టానిస్లావ్క్సి. రష్యన్ సినిమా ఈ ప్రభావంతో అప్పుడు చాలా ఉన్నత స్థితిలో ఉంది. లండన్‌లో ఉన్నప్పుడే బల్‌రాజ్ సహ్ని రష్యన్ సినిమా పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన మొదట చూసి ప్రభావితమయిన రష్యన్ సినిమా ‘సర్కస్’. జాతి దురహంకారం అనే కాన్సెప్ట్ మీద వచ్చిన గొప్ప సినిమా అది. అది చూసిన తరువాత సామాజిక సమస్యల పట్ల కళాకారులకు ఉండవలసిన అవగాహన, సమాజం పట్ల బాధ్యత, ఉన్నతమైన నటన అంటే ఏంటి అన్న విషయం పట్ల బల్‌రాజ్‌లో ఎన్నో ఆలోచనలు కలిగాయి. రష్యా సోషలిజం పట్ల ఆకర్షితులవడమే కాకుండా హలీవుడ్ మెరుపుల కన్నా ఇటువంటి సామాజిక బాధ్యతతో తీసిన సినిమా పట్ల ఆయనకు ప్రేమ పెరిగింది.

అందుకే ఆయన నటుడిగా మారిన తరువాత, తాను నమ్మిన పద్ధతిలోనే సినిమాలు చేయడం మొదలుపెట్టారు. సినిమా ద్వారా సామాన్య ప్రేక్షకులు తమను తాము మర్చిపోయే ప్రయత్నం చేస్తున్న మన దేశంలో వారిలో సమాజం పట్ల బాధ్యతను, ఆలోచనను రేకిత్తించే ప్రయత్నం తన నటన ద్వారా, ఎన్నుకున్న పాత్రల ద్వారా చేసారు బల్‌రాజ్. ఆయన అనుకున్న రీతిలో అటువంటి పాత్రలు లభించకపోయినా తనకు వచ్చిన పాత్రలలో ఆ బాధ్యతను మేళవించి తెరపై చూపగల ఓ స్వతంత్ర పంథాను ఆయన ఎన్నుకున్నారు. దీనికి బల్‌రాజ్ ఎంత హోం వర్క్ చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. సినీ గ్లామర్ తన భావజాలాన్ని మార్చకుండా తనను తాను కాపాడుకుంటూ నమ్మిన దారిలో ప్రయాణించడానికి మనిషికి చాలా నిబద్ధత కావాలి. దాన్ని జీవితాంతం నిలుపుకున్న ఏకైక భారతీయ నటుడు బల్‌రాజ్ సహ్ని అని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఈ దృష్టి కోణంతోనే ఇప్పుడు బల్‌రాజ్ సహ్ని నటించిన ‘భాబీ కీ చూడియా’ అనే సినిమాను చూద్దాం. 1961లో వచ్చిన ఈ సినిమా 1953లో వచ్చిన ‘వాహినిచ్యా బండ్యా’ అనే మరాఠీ సినిమాకు రీమేక్. ప్రధాన పాత్రలో ఇందులో మీనా కుమారి, బల్‌రాజ్ సహ్నిలు కనిపిస్తారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో బల్‌రాజ్ నటన అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. సినిమా అంతా మీనా కుమారి చుట్టూ తిరుగుతుంది కాని బల్‌రాజ్ కనిపించే సీన్లలో ఆయన ప్రేక్షకులతో సంభాషించే తీరు మనసును హత్తుకుంటుంది.

ఇందులో బల్‌రాజ్ సహ్ని గారిది శ్యాం అనే ఓ మధ్య తరగతి వ్యక్తి పాత్ర. మంచివాడు, జీవితాన్ని ఉన్నదున్నట్లుగా స్వీకరించే వ్యక్తి. జీవితంలో బాధ్యతలకు పెద్ద పీట వేసే ఓ మామూలు ఉద్యోగి శ్యాం. బల్‌రాజ్ నటించిన సీన్లను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఈ సినిమాలో ఓ సీన్ గురించి విశేషంగా చెప్పుకోవాలి. సినిమా మధ్యలో వస్తుంది ఆ సీన్. ఉన్నంతలో తృప్తిగా జీవించే శ్యాం, తమ్ముడికి పెళ్ళి చేసి గొప్ప ప్రశాంతతతో ఉంటాడు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు నడుస్తూనే ఉంటాయి. కాని అవి అతన్ని పెద్దగా బాధించవు. ఆఫీసులో అతనితో మాట్లాడుతూ తోటి ఉద్యోగి “నువ్వు అదృష్టవంతుడివి, నా పరిస్థితి చూడు, ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవలతో భయం వేసి ఇంటికి వెళ్ళలేకపోతున్నాను” అంటాడు. శ్యాం అతనితో “జీవితంలో ఇలాంటి తుఫానులు వస్తూనే ఉంటాయి. వాటి గురించి భయపడకుండా నవ్వుతూ మనం వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి” అంటాడు. దానికి ఆ ఉద్యోగి “ఆఫీసులో ఈ పై ఆఫీసరు తిట్లు, ఇంట్లో ఆడవాళ్ల గోల. తలవంచుకుని ఏదోలా జీవితాన్ని గడిపేస్తున్నాను” అంటాడు. దానికి శ్యాం పాత్రలో బల్‌రాజ్ “అదే గొప్ప విషయం అండి. పులి బలాన్ని, చిరుత పరుగుని, అందరూ మెచ్చుకుంటారు. కాని తనలోకి తల ముడుచుకుని బ్రతికే కుందేలు కూడా తన రీతిలో ప్రశాంతంగా జీవిస్తూనే ఉంటుంది. మన లాంటి క్లర్కులు ఈ కుందేలు లాంటి వాళ్లు. మనం కుందేళ్లుగా ఎందుకు పుట్టాం అని దేవుడినే ప్రశ్నించాలి. కాని మనల్ని మనం ప్రశ్నించుకోవలసింది, మన జీవితంలో మనం నిజాయితీగా ఉన్నామా లేదా అనే. దీనిలోనే సుఖమూ ఆనందమూ, ప్రశాంతత ఉన్నాయి. దీన్ని గుర్తు పెట్టుకుంటే మనిషి జీవితం స్వర్గమయం అవుతుంది”. ఈ డైలాగ్ బల్‌రాజ్ పలికిన తీరు అతని టోన్ మాడ్యులేషన్, సహజ సిద్ధమయిన సామాన్య మానవుని ఆనందపు జీవితానికి కావలసిన ఫిలాసఫీని తన పెదవులపై చెదరని చిరునవ్వుతో అతను ప్రకటించిన తీరు, సినిమా తరువాత కూడా మన మనసులో నిలిచి ఉంటుంది. ఎంత అద్భుతమైన కంట్రోల్‌తో ఈ సీన్ పండించారంటే ఇది చూస్తూ అయనను గౌరవించలేని ప్రేక్షకులు ఉండరు. అది నటించడం అంటే. వారు ఈ పాత్రను పోషించిన తీరులో ఓ చిత్తశుద్ధి, లోతు, నమ్మకం ఉంటుంది. అవి కదా నటుడికి ఉండవలసిన లక్షణాలు. ముఖ్యంగా ప్రశాంతంగా ఆయన చెప్పే ఈ డైలాగ్ ఎంతమందికి ఊరటనిస్తుందో కదా. సినిమా అంటే ప్రేక్షకులను కాల్పనిక లోకంలో విహరింపజేసేది కాదు, వాస్తవాన్ని ఎదుర్కునే శక్తిని ఇచ్చేది కూడా అని బల్‌రాజ్ సహ్ని తన పాత్రలతో, నటనతో నిరూపిస్తారు.

శ్యాం ఓ చిన్న ఉద్యోగి. అతని చిన్న తమ్ముడు మోహన్ పసివాడు. తల్లి తండ్రులు ఇద్దరూ మరణించడంతో మోహన్ బాధ్యత శ్యాంది అవుతుంది. తండ్రిలా మోహన్‌ని పెంచుతుంటాడు. వివాహం విషయం కూడా తలపెట్టడు. కాని తల్లి ప్రేమ కోసం అర్రులు చాచుతున్న చిన్నవాడి మనసు గ్రహించి గీతను వివాహం చేసుకుంటాడు. అ చిన్న పిల్లవాడు పెళ్లికి ముందే కాబోయే వదినను కలుసుకుని ఆమె ముఖంలోని ప్రేమకు ఆకర్షితుడవుతాడు. ఆ చిన్న పిల్లవాడి మనసులోని లోటును గీత అర్థం చేసుకుంటుంది. పెళ్ళి చేసుకుని వచ్చిన రోజు నుండి మోహన్ ఆమెకు కొడుకుగా మారతాడు. వదినని వదిలి ఒక్క క్షణం ఉండలేని స్థితికి వస్తాడు మోహన్. శ్యాం ఆ ఇద్దరి ప్రేమను గమనిస్తూ ఉంటాడు. గీతకు పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు. ఆ లోటు ఆమెను లోలోన తినేస్తూ ఉంటుంది. కాని మోహన్ సంరక్షణలో అన్ని మరచిపోయి జీవించగలుగుతుంది.

పెద్దవాడయిన మోహన్ ఓ ధనవంతుని బిడ్డ అయిన ప్రభను ప్రేమిస్తాడు. అతని ప్రేమ విషయం తెలిసి గీత, శ్యాంలు వారిద్దరి పెళ్ళి జరిపిస్తారు. వివాహం అప్పుడే ప్రభ తల్లి అహంకారం వారిని బాధిస్తుంది. మోహన్ కూడా ఇది గమనిస్తాడు. పెళ్లి తరువాత తనను ఇంటి నుండి, అన్న వదినల నుండి దూరం చేయడానికి అత్తగారు ప్రయత్నిస్తుంటే ఆమెకు బుద్ధి చెబుతాడు. భార్యతో ప్రేమగా ఉంటూనే అన్నా వదినల విషయంలో ఎటువంటి తప్పు జరిగినా సహించనని స్పష్టంగా చెబుతాడు. ప్రభ కొడుకుని కంటుంది. అదే సమయంలో గీత మళ్లీ చనిపోయిన బిడ్డను ప్రసవిస్తుంది. గీత బిడ్డ చనిపోయిన రోజునే మోహన్ మామగారు ప్రభకు కొడుకు పుట్టాడన్న కబురు తీసుకుని వస్తాడు. అతనికి గీత బిడ్డ సంగతి తెలియదు. విషయం తెలుసుకుని మౌనంగా తిరిగి వెళ్లిపోతున్న అతని చేతి నుండి తెచ్చిన మిఠాయి జారిపడిపోతుంది. అంత దుఃఖంలోను తమ్ముడి బిడ్డ సంతోషాన్ని ఆ మిఠాయి తాను తింటూ భార్యకు తినిపించి శ్యాం చూపించే సంయమనం, ఇక్కడ బల్‌రాజ్ సహ్ని నటన చూడవలసిందే. ఆయన శరీర భాష ద్వారా చూపే ఆ నియంత్రణ, ప్రేక్షకుల కంట నీరు తెప్పించి తీరుతుంది. ఈ సినిమాలో గమనించవలసిన మరో సీన్ అది. శ్యాం పాత్రను బల్‌రాజ్ తప్ప మరెవ్వరూ చేయలేరు అని ప్రతి ఒక్కరు అనుకునే గొప్ప సీన్ కూడా ఇది.

బిడ్డలు లేని గొడ్రాలని గీత చేతిలో బిడ్డను పెట్టడానికి ప్రభ తల్లి సందేహిస్తుంది. ఆమె ప్రభావంతో ప్రభ కూడా గీతను తప్పించుకుని తిరుగుతుంది. అత్తగారింటికి వచ్చాక వదిన ప్రేమ తెలిసిన మోహన్ తన కొడుకుని వదిన ఒడిలో వేస్తాడు. ఆమె ఆ బిడ్డ పెంపకంలో అన్నీ మర్చిపోతుంది. బిడ్డ కూడా ఆమెకు మాలిమి అవుతాడు. అయితే బిడ్డ జ్వరం బారిన పడినప్పుడు గీత గొడ్రాలని ఆమె చేతిలో బిడ్డను ఉంచడం వలనే బిడ్డ జబ్బు పడ్డాడని ప్రభ గోల చేస్తుంది. మోహన్ ఆమెకు బుద్ధి చెప్పి బిడ్డను వదిన వద్దే ఉంచుతాడు. ఆ బిడ్డకు సేవ చేస్తూ ఉపవాసాలు ఉంటూ గీత తన ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తుంది. ఆమె సేవ చూసి ప్రభ మనసు మారుతుంది. కాని చివరకు ఆరోగ్యం పాడయి గీత మరణిస్తుంది.

గీత మరణానికి దగ్గర అయిన సమయంలో భార్యాభర్తల మధ్య నడిచే మరో గొప్ప సీన్ ఉంది. ఆమె తల దగ్గర శ్యామ్ కూర్చుని ఉంటాడు. అన్నా వదినలను దగ్గరగా చూసి గదిలోకి వచ్చిన మోహన్ ప్రభలు వెనుతిరిగి వెళ్ళిపోతుంటే వారిని రమ్మని పిలుస్తాడు శ్యాం. భార్యతో తాను అనుభవించే అనురాగాన్ని, దగ్గరితనాన్ని మోహన్‌తో చిన్నప్పటి నుండి పంచుకున్న అన్న అతను. తన భార్యకు మోహన్‌తో ఉన్న మమతానుబంధాన్ని గుర్తించి గౌరవించిన వ్యక్తి శ్యాం. తనకే భార్య సమయం, ప్రేమ దక్కాలనే అధికార దాహం ఉన్న భర్త కాడు అతను. “మా మధ్య మీ నుండి దాచే ఏం రహస్యాలున్నాయి మోహన్. మామూలుగానే ఏవో మాట్లాడుకుంటున్నాం, ఇది మాకు కొత్త కాదు కదా” అంటాడు. శ్యాం. “చంద్రుని వెన్నెలను ఆస్వాదిస్తూ ఇద్దరు మిత్రులు చంద్రుని చల్లదనాన్ని అనుభవించగలరు కాని చంద్రుని కిరణాలను లెక్కించలేరు కదా మాది అదే స్థితి. మా మాటలకు ఏవీ అర్థాలుండవు. కాని ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మాకు ఆనందం దొరుకుతుంది” అని అంటాడు. తన భార్యతో తనకున్న అనుబంధాన్ని చెబుతూనే భార్యాభర్తల సంభాషణలలో ఉండవలసిన అనుభూతిని ఎంత గొప్పగా వివరిస్తాడో. అసలు ఇంత గొప్ప వాక్యాలు ఏ మాత్రం డ్రమటైజ్ చేయకుండా ఇంత సహజంగా పలకగల నటులు మనకు ఎంతమంది?

బైట చెట్టులో మల్లెలు పూసినట్లు ఉన్నాయని అంటుంది గీత. అది విని ప్రభ బైటకు వెళ్లి కొన్ని పూలు కోసుకుని వస్తుంది. పూలు కోస్తే చెట్టు మోడుపోతుంది అన్న గీత మాటను వారించి శ్యాం ప్రభను పూలు తెమ్మని అడుగుతాడు. చెట్టు నుండి పూలను దూరం చేయలేనంత సున్నిత మనస్కురాలు గీత. ఆ తెచ్చిన పూలను సూది దారంతో స్వయంగా మాలగా కడతాడు శ్యాం. ఆయన మొహంలో అదే ప్రశాంతత, అదే నిశ్చలత. కెమెరా బల్‌రాజ్ పైనే ఫోకస్ చేసి ఉంటుంది. ఆ సమయంలో ఆ మాల కడుతున్న శ్యాం ని ప్రేమించని ప్రేక్షకులు ఉండరేమో.

తన నుదిటిన కుంకుమ చెదిరిపోయిందని దిద్దమని ప్రభను అడుగుతుంది గీత. కుంకుమ తీసుకొచ్చిన ప్రభతో “నేను రోజు దిద్దుకుంటున్నట్లు కాదు. ఆయన నన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు. కాని నెలవంక ఆకారంలో కుంకుమ నాకు బావుంటుందని, అలా పెట్టుకొమ్మని అడిగేవారు. కాని నేను అప్పుడు అలా బొట్టు పెట్టుకోలేకపోయాను. ఇవాళ నువ్వు అలా కుంకుమ దిద్దు” అని అడుగుతుంది. తాను గుచ్చిన పూల మాలను శ్యాం తీసుకుని గీత దగ్గరగా పెడతాడు. అది చూసి చిరునవ్వు నవ్వుతుంది ఆమె. “నా నుదిటిన మీరు కోరినట్లు నెలవంక ఆకారంలో కుంకుమ దిద్దుకున్నాను, బావుందా” అని అతన్ని చూసి అడుగుతుంది గీత. చాలా బావుంది ఆకాశంలో చంద్రునిలా అని బదులిస్తాడు శ్యాం. నా చంద్రుడు ఎక్కడ అని అడిగిన గీతకు బాబును తీసుకుని వచ్చి చూపిస్తుంది ప్రభ. బిడ్డను ఆఖరు సారి చూసి మరణిస్తుంది గీత.

భార్యాభర్తల మధ్య, కుటుంబంలోని వ్యక్తుల నడుమ ఉండే దగ్గరతనానికి గొప్ప గొప్ప మాటలు, ధనం, డాంబికాలు, ప్రగల్బాలు అవసరం లేదని, ఓ చిన్న ఇంట్లో, చుట్టు ఉన్న చిన్న చిన్న వస్తువులతో వెన్నెల, పూలు, కుంకుమ లాంటి అతి చిన్న విషయలతో ప్రేమను పంచుకోవడంలోనే ఓ దగ్గరితనం, ఆత్మీయత, కల్మషం లేని పవిత్రత ఉంటుందనే అనుభవాన్ని ఇచ్చే ఈ సీన్ గురించి చెప్పడం కన్నా, సినిమాగా చూసిన అనుభూతి గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా నీతోనే ఈ ఇంటి ప్రశాంతత నిలిచి ఉంధి అని ఓ మరిదిగా కొడుకుగా వదినను చూస్తూ మోహన్ పాడే పాట ‘తుమ్ సే హీ ఘర్ ఘర్ కెహలాయా’ ముఖేష్ గొంతులో హృద్యంగా పలుకుతుంది.

ఉత్తర భారతదేశంలో ఓ నమ్మకం ఉంది. సతిగా బ్రతికిన స్త్రీ మరణించినా ఆమెతో ఆమె గాజులు కాలిపోవు అని. చనిపోయిన ప్రభ అస్థికలలో ఆమె గాజులు దొరుకుతాయి. “దేవుడు ఉన్నట్లు నిరూపించలేనట్లే, ఈమె కూడా ఉందన్న సాక్ష్యం నేను ఇప్పుడు ఇవ్వలేను. నా జీవితాన్ని అంటిపెట్టుకుని కడదాకా గంధంలా చల్లదనాన్ని ఇచ్చిన స్త్రీ ఈమె” అంటూ ఆమె అస్థికలను ఏరి తన నుదిటికి ఆనించుకుంటాడు శ్యాం. ఏడుస్తున్న మోహన్‌ని ఓదార్చుతాడు. రెండోసారి తల్లిని పోగొట్టుకున్నాను అని ఏడుస్తూ ఆమె చేతి గాజులను బూడిదలోనుండి తీసి చూపిస్తాడు మోహన్. వాటిని ఇంటికి తీసుకువస్తారు అన్నదమ్ములు.

సినిమా మొత్తంలో ఎలాంటి స్థితిలో కూడా కన్నీరు పెట్టని ఓ గొప్ప తాత్వికతను బల్‌రాజ్, శ్యాం పాత్రలో ప్రదర్శిస్తారు. ప్రేమను, సహనాన్ని, స్నేహాన్ని, ధర్మాన్ని, విషాదాన్ని అదే స్థిర నిశ్చయంతో భరిస్తాడు. ఒక సామన్యమైన మధ్య తరగతి చిరు ఉద్యోగి పాత్ర అది. ఎక్కడా హీరోయిజం లేదు కాని ఇంత కన్నా గొప్ప హీరో ఎవరు అని అనిపించి తీరుతుంది. అంతగా ఆ శ్యాం పాత్రను ఎలివేట్ చేస్తారు బల్‌రాజ్ సహ్ని. మరొకరయితే ఎంతో మెలోడ్రామా రంగరించగల కథ, కథనం ఈ సినిమాలో ఉంది. కాని తన బాలెన్స్‌డ్ నటనతో నూటికి నూరు శాతం ఇదే కథకు గొప్ప సహజత్వాన్ని తీసుకొచ్చారు బల్‌రాజ్. మీనా కుమారి కూడా అంతే అద్భుతంగా నటించిన చిత్రం ఇది.

మోహన్ పాత్రలో సైలేష్ కుమార్ అనే నటుడు కనిపిస్తాడు. వదినతో అతనికున్న అనుబంధాన్ని, అహంకారిగా ఇంట్లో ప్రవేశించిన భార్యను, ఆమె తల్లిని వారి పరిధిలో ఉంచే నిబ్బరాన్ని చాలా బాగా చూపించారు ఆయన తన పాత్రలో. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది సదాశివ్ కావి. లత, ఆశా, ముఖేశ్ పాడిన పాటలు చాలా బావుంటాయి. ముఖ్యంగా ‘జ్యోతి కలష్ చల్కే’ పాటను రాసిన పండిత్ నరేంద్ర శర్మ పాదాలపై ప్రణమిల్లాలనిపిస్తుంది. సుధీర్ ఫడ్కే సంగీత దర్శకత్వంలో ఈ పాటలో లత గొంతు స్వర్గ ద్వారాలు తెరిపిస్తుంది. భూపాల రాగంలో కంపోజ్ చేసిన ఈ గీతం సినీ గీతాలలో ఓ అద్భుతమని ఎందరో ఎన్నో సందర్భాలలో ఒప్పుకున్నారు. ఇంటి ముంగిలిని శుభ్రం చేస్తూ ఓ స్త్రీ ప్రపంచం అంతా తన ఇంటితో పాటుగా వెలుగు కిరణాలు ప్రసరించాలని కోరుకుంటూ ఆనందానికి అనురాగానికి తన ఇంటిలోకి స్వాగతం పలుకుతూ పాడే ఈ పాట భారతీయ స్త్రీ తత్వానికి ఓ గొప్ప నిదర్శనం. స్వతహాగా ముస్లిం అయిన మీనా కుమారి ఈ పాట చిత్రీకరణలో చూపిన సహజత్వానికి ఆమెకు కోటి వందనాలు. ఇటువంటి సీన్లను ముఖ్యంగా బిడ్డను లాలిస్తూ సపర్యలు చేసే మరి కొన్ని సీన్లను ఇప్పటి నటీమణులు ఎందుకు ఇంతలా పండించలేకపోతున్నారు అన్నది ఆలోచించవలసిన విషయం. పిల్లలను ఎలా చేతులలోకి తీసుకోవాలో తెలియని స్థితిలో ఇప్పటి తారలు మిగిలిపోవడం బాధిస్తుంది.

‘భాభీ కీ చూడియా’ సినిమాలో సెంటిమెంట్ ఉంది, డ్రామా ఉంది. కాని వీటన్నిటి నడుమ ఓ ప్రశాంతత, ప్రేమ ఉంది. దాన్ని అనుభవించి ఆస్వాదిస్తే ఆ అనుభూతి అజరామరం. సినిమా ప్రేమికులు మరిచిపోకుండా చూడవలసిన అద్భుత చిత్రం ఈ ‘భాబీ కీ చూడియా’. మర్చిపోలేని పాత్రలు గీత, శ్యాం, మోహన్‌లు. ముఖ్యంగా చిన్నప్పటి మోహన్‌గా నటించిన మాస్టర్ అజీజ్ నటన మర్చిపోలేం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here