[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది
[dropcap]గొ[/dropcap]ర్రె తనకి బలమైన.. ఇష్టమైన ఆహారం పెట్టే కాపరిని నమ్ముతుంది. ఆ ఆహారం తిని పుష్టిగా తయారైతే అమ్ముకునేటప్పుడు అతనికి ఎక్కువ డబ్బు వస్తుందని.. అందుకే అతను తనని చంపటానికి అలా పోషిస్తున్నాడని దానికి తెలియక అతన్నే నమ్ముతుంది. నిజమైన క్షేమం కోసం కాక.. తన స్వప్రయోజనం, స్వార్థం కోసం ప్రేమలు ఒలకపోస్తే ఈ సామెత వాడతారు.
***
“ఏమండి రమణ గారూ.. పనవలేదా? ఇంకా కూర్చున్నారు? అయినా మీ కోసం ఇంట్లో వాళ్ళు ఎదురు చూడరేమో కదా.. మీరొక పని రాక్షసుడు అని వదిలేసి ఉంటారు” అన్నాడు నవ్వుతూ రాంబాబు.
“ఆఁ అయిపోవచ్చిందండీ.. ఇంకో పావు గంట అయితే పూర్తవ్వచ్చు” అన్నాడు ఫైల్ లోంచి తలెత్తి.
రమణకి తన పని గురించి క్షుణ్ణమైన విషయ పరిజ్ఞానం ఉంది.
ఏ పనికి ఎవరిని సంప్రదించాలో.. ఎవరిని కలుపుకుపోతే ఎంత సేపులో పని పూర్తవుతుందో స్పష్టంగా తెలిసిన మనిషి. అందుకే తనకి అప్పచెప్పిన పని.. మళ్ళీ గుర్తు చేసే అవసరం లేకుండా.. నిర్దేశించిన టైం కంటే కూడా ముందే పూర్తి చేస్తాడు.
అందుకే అతనో పని రాక్షసుడిగా పేరు తెచ్చుకున్నాడు.
పై అధికారులు ముఖ్యమైన పనులు అతని స్థాయి కంటే కొంచెం పై స్థాయివి కూడా.. అతనికే అప్పచెబుతారు.
కానీ అతని సేవలు గుర్తించి ప్రమోషన్ల రూపంలో తగిన ప్రతిఫలం చూపించాలని మాత్రం అనుకోరు. రమణకి కూడా పాపం తన సేవకి తగిన గుర్తింపుగా పదోన్నతి అడగచ్చు అని తెలియదు. అన్నిటికీ తననే సంప్రదిస్తారని పొంగిపోతూ ఉంటాడు.
‘అడగందే అమ్మయినా పెట్టదు’ అనే జీవిత సత్యం తెలియని వాళ్ళు ఈ సృష్టిలో ఎప్పుడూ ఉంటారనటానికి రమణే ఉదాహరణ!
జీతం తీసుకుంటున్నందుకు తన ఉద్యోగానికి న్యాయం చెయ్యాలని మాత్రం తాపత్రయపడుతూ ఉంటాడు.
రమణ తీసుకునే పని బాధ్యత వల్ల.. ఆఫీసులో తమ మీద పని ఒత్తిడి లేకుండా హాయిగా రికామీగా తిరుగుతూ స్వంత పనులు చేసుకోవచ్చు కనుక అందరికీ అతనంటే ఇష్టమే!
ఇంటికెళుతూ “రమణ గారూ రండి” అని తమ స్కూటర్ మీద రమ్మని పిలిస్తే.. ఇంటికి త్వరగా వెళ్ళే అవకాశం దొరికిందని పొంగిపోయే అల్ప సంతోషి!
తన చుట్టూ ఏ పని చెయ్యకుండా ఉండే కబుర్ల రాయుళ్ళు.. చేసిన కాస్త పనికి తమని తాము గొప్పగా అధికారుల ముందు ప్రొజెక్ట్ చేసుకుంటూ తన కళ్ళ ముందే ప్రమోషన్లతో వేరే చోటికి బదిలీ అయి వెళ్ళిపోతూ.. “రమణ గారూ మీరు చేసిన సహాయం జన్మలో మర్చిపోమండీ. ఆఫీసులో మీరొక పెద్ద అసెట్” అని నోటిమాటతో చెప్పో.. లేక “మీ అబ్బాయికి ఇది ఇవ్వండి” అని ఏ బ్యాగో, కాలిక్యులేటరో బహుమతిగా ఇస్తేనో.. పొంగిపోతాడు.
ఒక్కసారి కూడా ‘వాళ్ళ లాగా నాకు పదోన్నతి ఎందుకు రాలేదో’ అనుకోడు. “మనకెప్పుడేది ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు” అంటాడు.
తలొంచుకుని పని చేసుకంటూ పోవటం తప్ప.. పాపం తనని తాను పై అధికార్ల ముందు తెలివిగా ప్రెజెంట్ చేసుకోవటం తెలియని సత్యకాలపు మనిషి!
***
ఆ ఆఫీసుకి కొత్తగా బదిలీ అయి వచ్చాడు హరికృష్ణ.
మొదటి చూపులోనే ఆఫీసు విషయాలన్నీ.. రమణ పని తీరు, అతని ఉపకార బుద్ధితో సహా.. ఆకళింపు చేసుకున్నాడు.
వివరాలు అడగటంలో రమణ తన చిన్నప్పుడు పక్కింట్లో ఉండే శర్మ అంకుల్ తమ్ముడని తెలిసింది.
ఎలాగైనా రమణగారిని మాటల్లో పెట్టి మనుషులు.. మనస్తత్వాలు.. వారి స్వార్ధాలు.. ఆఫీసుల్లో ఉండే చిన్న.. చితకా రాజకీయాలు అర్థమయ్యేలా చెప్పాలని కంకణం కట్టుకున్నాడు. కొన్ని తెలివితేటలు నేర్పి.. అతని అన్నేళ్ళ సర్వీసుకి తగిన స్థాయికి తీసుకెళ్ళాలని తాపత్రయ పడుతున్నాడు.
ఆ సంవత్సరం సంస్థ స్వర్ణోత్సవ సందర్భంగా.. సర్వీసులో బాగా సీనియర్లకి రాత పరీక్ష లేకుండా కేవలం నామమాత్రపు వ్యక్తిగత ఇంటర్వ్యూతో ప్రమోషన్ అనేది కానుకగా ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. కానీ మరొక ప్రదేశానికి బదిలీ మాత్రం తప్పదు.
రమణగారికి తను చెయ్యాలనుకున్న సహాయానికి తలుపు తట్టకుండానే మంచి అవకాశం వచ్చింది అని పొంగిపోయాడు హరికృష్ణ.
అప్పటి నించీ “రమణ గారూ.. ఈ సారి మీకు ప్రమోషన్ వచ్చి తీరాలి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా గాడిద చాకిరీ చేస్తూ కూర్చుంటారు? రిటైర్ అయ్యేలోపు పై స్థాయికి వెళ్ళాలని లేదా? ఇప్పటి వరకూ మీరు సీరియస్‌గా తీసుకోకపోవటం వల్లనే ఇలా ఒకే స్థాయిలో ఉండి పోయారు. మీతో పని చేసి పెద్దగా అర్హత లేని వారంతా పై స్థాయిలకి వెళ్ళిపోతుంటే చూస్తూ ఇంకా ఎన్నాళ్ళుంటారు. మీ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళే రేపు మీకు బాసులుగా వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి” అని చెప్పేవాడు.
“ఇప్పుడు వచ్చే ప్రమోషన్‌తో వెంటనే పెద్దగా ఆర్థిక లాభం లేకపోయినా.. ముందు ముందు రాబోయే పదోన్నతులకి క్లియరెన్స్ వచ్చినట్టు అవుతుంది. కొత్త స్కేల్ వస్తే రిటైర్మెంట్ సమయానికి.. గ్రాట్యుయిటీ, పెన్షన్ పెరగచ్చు.”
“నేను చెప్పిన మాట విని ఇంటర్వ్యూలో ఇప్పటివరకు మీరు ఎన్ని ముఖ్యమైన విషయాలు విజయవంతంగా పూర్తి చేశారో చెప్పండి. ఎంత కష్టమైన సవాలునైనా ఎలా ఎదుర్కోగలరో చెప్పండి” అని మధ్యాహ్నం లంచ్ టైంలో కూర్చోపెట్టుకుని చెప్పాడు.
సరిగ్గా రమణ ప్రమోషన్ ఇంటర్వ్యూ టైంకి హరికృష్ణ అత్యవసరమైన పనిబడి పది రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది.
సెలవు నించి వచ్చి “రమణ గారూ ఇంటర్వ్యూ బాగా జరిగిందా? ఈ సారి మీకు ప్రమోషన్ తప్పదు. నాకు మంచి బహుమతి ఇవ్వాలి” అని హుషారుగా అడిగాడు.
“నేను ఇంటర్వ్యూకి వెళితే కదా.. ప్రమోషన్ వచ్చేది” అన్నాడు రమణ మంద్ర స్థాయిలో!
“అదేంటి.. ఏమయింది” అన్నాడు నిరుత్సాహంగా హరికృష్ణ.
“ఆఁ, ‘ఈ వయసులో వేరే చోటికి బదిలీ అయితే పిల్లకి పెళ్ళి సంబంధాలు చూసుకోవటం కష్టం అవుతుంది. పైగా మీ అమ్మగారు పెద్దవారయ్యారు. ఇక్కడైతే అలవాటైన డాక్టర్స్ ఉన్నారు. కొత్త చోట మళ్ళీ అన్నీ వెతుక్కోవాలి. పై స్థాయికి వెళితే ఇప్పుడున్న వెసులుబాటు.. టైము ఉండవు. ఆర్థికంగా మీకొచ్చే కొత్త అధికారాల వల్ల జాగ్రత్తగా ఉండకపోతే కొత్త సమస్యలు రావచ్చు. మనుషుల్లో ఫ్రాడ్యులెంట్ మెంటాలిటీ పెరిగింది. హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఉన్నచోట ఉండక మీకెందుకండీ’ అని మన మేనేజర్ ఒక రోజు పిలిచి తలంటి పోశారు. అసలే భయస్థుడైన రమణ గారు.. మేనేజర్ చెప్పింది నిజమే కదా అనుకుని అసలు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు” అన్నాడు పక్క సీట్ కామేష్.
“ఇంత చెప్పినా.. ‘గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు’ మీరు ఆ మేనేజర్ చెప్పింది విని మోసపోయారండి. మీరు వెళ్ళిపోతే మీలాగా శ్రద్ధగా పని చేసే వాళ్ళు ఉండరని ఆయన వ్యూహం ప్రకారం మిమ్మల్ని ఆపారనిపిస్తోంది. ఆయన ఉన్నన్నాళ్ళు ఆఫీసు పని నల్లేరు మీద బండి లాగా నడవాలంటే ప్రతిఫలం ఆశించకుండా పనిచేసే మీలాంటి నమ్మకస్థులు ఉండాలి. మీకు నష్టం కలిగితే ఆయనకెందుకు? ఆయన పబ్బం గడవాలి. తప్పు చేశారండి రమణ గారూ. ఇలాంటి అవకాశం ప్రతి సారీ రాదు. నేను పడుతున్న తాపత్రయం వృథా అయింది” అన్నాడు నిస్సత్తువగా హరికృష్ణ.
ఏదేమైతేనేం.. రమణ ఏ స్థాన చలనం లేకుండా మళ్ళీ అదే ఆఫీసులో అదే సీటు పని అత్యంత అంకిత భావంతో చేస్తూ మేనేజర్ కోరిక తీరుస్తున్నాడు.
[ఆఫీసుల్లో ప్రతిఫలం ఆశించకుండా రమణ లాగా పని చేసే సత్తెకాలపు సత్తెయ్యలు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటారు.]