(తన యీ పై ఫోటో గురించిన కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యాఖ్యానం వారి నోటనే వస్తే.. నా తోనే అంటే, నేనే వారి మాటలకు లేఖకుణ్ణైతే..!)
***
[dropcap]మ[/dropcap]హాకవి యని లోకము వేనోళ్ళ ప్రశంసించ, ఈయన ఇంట, కూరగాయలు తరుగునా యని ఆశ్చర్యపోవు వారుందురు! అది సహజము!
అది వాని జీవ లక్షణము పై ఆధారపడి యుండును.
ఆడువారి మనసు నెరిగి ప్రవర్తించు మెత్తదనమెదో వానిని, వారికి సాయపడు పనులు చేయించును. అట్లని కవులందరు ఈ తరగతి వారని భావించరాదు!
కొందరయ్యల రాతలకు, చేతలకు పొంతన యుండదు.
లోకమున కాయన యొక ఆదర్శ, అభ్యుదయ భావముల నిధి! ఇంటి వారికి, ఒక కొరకరాని కొయ్య!
ఏమందుము, బాంధవ్యములన్ని మనము ఇష్టపడి ఏర్పరుచుకొన్నవా?! ఈ అనంత కాల ప్రవాహమున ఎవ్వ రెవరితో, ఏ జన్మముల ఏమి నడిపితిరో, ఎందున, వారు వీరుగ మెలగిరో, ఎవ్వరెవ్వరికి అప్పు పడిరో, ఎవరు చెప్పగలరు?! ఎవ్వరు ఉప్పు నిప్పులై యుండిరో, ఈశ్వరునికే ఎరుక!
అది ఆదృశ్యమే, కాని ఆ సూత్రమేదియో వారిని ఒకచో పడవేయును. వారందరు, నదీనదములన్ని సాగరమును కలిసినట్లు కలియవచ్చును, ఆ ఇంట అపుడు సౌమనస్యము వెల్లి విరియును. దీనికి విపర్యయముగ నవ గ్రహముల వలె, ఒకరి కొకరికి పడని ఇళ్ళును తారసపడును!
అది అట్లుండనిండు!
ప్రధానముగ ఇందు చూడదగినది, సంఘమున ఎట్లు కొన్ని భావములు పాతుకొని పోవునో అనునది.
మగవాడు, అందునా కవి యని ప్రసిద్ధుడైన వాడు, ఇట్టి పనులు చేయతగునా యని కొందరి ప్రశ్న!
మూలము తెలియని వారు వేయు ప్రశ్న ఇది!
పూర్వము ఆడువారు వంట యింటికీ, మగవారు వ్యవసాయ ఉద్యోగ వ్యాపారాదులకును పరిమితులైన రోజుల నాటి మాట యిది. ఆమె అప్పుడు తన నెవరో నిర్బంధించి ఆయా పనులు చేయించుచున్నారని భావించలేదు; ఆ పురుషులును, జీవనమున తమ కుటుంబములకు, గ్రాసవాసములకు దైన్య మనునది లేనట్లు చూచుట తమ బాధ్యతగా నెంచి, నడచుకొనెడివారు.
అతి సహజముగా ఏర్పడిన, యొక సాంఘిక ఆచారమో, అలవాటో యనవలె!
కాని కాలమెప్పుడు ఒక్క తీరున యుండునా?!
అట్లుంచిన ఆ భగవంతుని సరదా ఎట్లు తీరును?! సృష్టియె వాని సంకల్పముతో పుట్టిన లీల యని గదా, అట్లైన, ఆయన తన ఆటను ఇంకను రంజకముగ చేయుటకు యత్నించును గాని, తిన్నని రహదారుల వలె మనుష్యుల బ్రతుకుల నెట్లు తీర్చును!
కనుక కాలములో, ఆ కాలముతో పాటు, మనుజుల తెలివి తేటలలో, వారు ఒక విషయమును చూచు దృష్టి కోణములలో, అన్నింటిలో మార్పు తెప్పించియే తీరును.
ఆ మార్పుకు కొందరు సిద్ధమై యుందురు, ఇంకొందరు మాంధాత యుగములలోనె జీవించు చుందురు.
వారి కొలబద్దలు, వీరికి వంకరటింకరలు! వీరి తూనికరాళ్ళు వారికి గుదిబండలు!
ఇక కలయిక ఎక్కడ,?!
అసంభవము.
ఆ మార్పు స్వరూపమేమి, ఆ మార్పు ఫలమేమి అని చూచిన, యది చాలావరకు ఆర్థిక సంబంధి! పెరుగుచున్న జీవన వ్యయమొ, పెరిగిన స్త్రీ విద్యయో, చదువుటకు లభించు ఆ నాటి సాహిత్యమొ, ఆడువారిలో చొరవయొ, అన్ని కలిపి వారు కూడా ఉద్యోగములు చేయు స్థితికి తెచ్చెను. వ్యవసాయాదులు మూలబడి, పురుషు లెట్లును ఉద్యోగార్థులైరి. అనగా, ఉన్న ఒక్క ఉద్యోగమునకు కిపు డభ్యర్థులు పెరిగిరని! పని చేయించువానికి ఆడేమి, మగేమి?! ఎవరు యోగ్యులని తలచునో, వారికే యిచ్చి, తన కార్యము పూర్తి చేయించుకొనును.
ఇది యొక ప్రాణ సంకటమైన ప్రశ్నయై నిలదీయును, కొందరి మగరాయుళ్ళ మనసులను! అట్టి వారె, యిట్టి పోచమ్మ వాదములను లేవనెత్తురు!
పట్టి లాగి సరి జేయుటకీ సంకుచిత బుధ్ధులు, ఈ నాడు దొరకు రబ్బరు బ్యాండులా యేమి?! అవి కరడు గట్టిన బుద్ధులు, ఇంక ఘనీభవించునే గాని బోధల వలన, ఎట్టి మార్పును రాదు!
కనుక, గంతలు వేసికొనిన గుర్రము వలె, ఉచిత మనుకొను దానిని నమ్మి, ఆ దారినె మన వంతుగ మనము బోవుటయే కర్తవ్యము, విశ్వామిత్రుల వారి పట్టుదలతో!
లోకమున కేమి వేయి విధముల యనుకొనును. ప్రశంస, విమర్శ యేదియైన మనసున కెక్కించు కొనిననే! రెంట ననాసక్తునకు, ఏదియు నిజము కాదు.
అది యొక ఎరుక!
గజము మిథ్యయే, పలాయనమును మిథ్యయే యనిన రీతి!
లోకమె లేదనిన, ఇక అది యిచ్చు కితాబుల కేమి విలువ!
కాగితపు పూలు!
నీ ఇంట నీవు మహారాజువే, కూరలె తరుగుదువో, కావ్య రచనయె చేతువో, కాదన్నవారెవ్వరు? ఎవరేమి యన్ననూ, దానను నీ కేమి సేగి?!
యే దారెటు పోవునో ఎవడు చెప్పగలడు?
ఈ సృష్టి వైచిత్రి యనంతము! వైవిధ్యమె ప్రకృతి యైన చోట, ఇట్లుండ రాదు, ఇట్లే యుండవలెను అను మాటాడువారు, బాలురైన కావలెను, బాలిశులైన కావలెను!
ఎవ్వరేదియో, వారికెరుక, ఆ పై వాని కెరుక!
***
ఇంత చెప్పి, అసలు విషయము దాటవేయుట భావ్యము కాదు. మా వరలక్ష్మి పుట్టింటికి పోయినది నాల్గు నాళ్ళు, అందువలన ఈ పాక శాసనావతార పూర్వరంగము! కూర తరిగిన కాని, ఉడుకుటకేమి వేయగల్గుదుము!
ఇదీ ఈ కవీశ్వరుని ప్రస్తుత పరిస్థితి!
***
ఇంకొక్క మాట!
ఆమె కేవల గృహిణియె, యే ఉద్యోగమునకును బోదు. ఆమె ఇంట యున్నప్పుడును, నన్నీ వేషమున చూచుట తటస్థించ వచ్చును! అది చూచు వారిదె భాగ్యము, ఇట్లు చరిత్ర పుటల కెక్కించ వచ్చును!
పిండితార్థము, అడపాదడపా నేనీ శాకా సహవాస ప్రక్రియ చేపట్టుదుననీ, అది ఉన్న మాటయే అని!
చూడగల కన్నులున్న వానికి, ప్రతి పనిలో, ప్రతి దానిలో ఒక స్వారస్యముండును, అది పట్టుటయె ఒక యోగము!
అపుడు, రసహీన మనునదే యుండదు, మానవ జీవితమున!
అది అంతయో, ఆవంతయో నా కలవడి, ఇట్టి పనుల చేయించునని చెప్పవలెను!
ఆ క్షణమున నిండుగ జీవించుటయె జీవన యోగము!
ఈ ప్రాథమికము కడచిన గాని, ఏ ఇతర యోగము లను, తాకను కూడ లేవు.
సరి, అది విషయాంతరము, పోయి రమ్ము!
***
(ఇంతలో పోస్ట్ మ్యాను వచ్చి, “అయ్యా నమస్కారం”, అని ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతాడనుకోండి, అప్పుడూ..)
***
సెలవు అని వీథి వైపు తిరిగానో లేదో, “కొంచెం ఆగవయ్యా, రా, ఇది కూడా వినే పో” అని వారి పిలుపు!
***
“మా బంధువుల ఇంట్లో పెళ్ళి విషయమో, మా వేలు విడిచిన మేనమామ ఇంట్లో ఒడుగో అనుకున్నట్టున్నావ్, అదేం లేదు, ఎవరో అభిమాని యట, అతను వ్రాసినదే ఈ ఉత్తరం! ఏం వ్రాస్తాడంటే..”
***
అయ్యా పత్రిక లో మీ ఈ శాకా సంహారాసనము చూసి వ్రాయుచున్నాను.
శ్రీ విశ్వనాథ!!
నవలలు పద్యములు వందలు పలు వేలు వ్రాసి, ఆంధ్రుల
నే విరామము లేక అర్థము కాని వ్రాతల బల్వినోదించిన
కవిరాజ, యింటి వారిని సైతము వదలిన ట్లగుపించదె,
నీ వంటవార్పుల నైపుణి, ఘనునివయ పాషాణపాక ప్రభో!
***
కొసరు: ‘బల్విసిగించిన’, అని కొందరనినను ఆశ్చర్యము లేదు)
***
(స్తుతియే, ప్రశంసా రూపములలో ఇది యొకటి యనుకొనుడు, గురువు గారూ! గౌరీశంకర శ్రృంగము వంటివారు, సహ్రృదయులు, కనుక సాహసించినాను. తమకు ఏమి చెప్పగలను?! మన్నించి, తోచిన రీతి ఆశీర్వదించగలరు)
ఇట్లు మీ ఏకలవ్య శిష్యుడు,
చతుర్వేదుల వామనమూర్తి.
విన్నావుగా!
అదీ అభిమానపు త్రివిక్రమ రూపం! ఒక్కొక్క సిగకు, ఒక్కొక్క కొప్పన్నట్టుల, దేని అందము దానిదే, తీసి పారవేయలేము!
ఏదో పద్యము వంటిది కూడా వ్రాసినాడయా! ఇది పద్యమగునా?! ఏమో, నేను కాదనిన ఔనను వారెవ్వరు?! ఛందస్సు లేని పద్య రచనయా?! అది ఎట్లుండును?!
పక్షులకూ, పావురములకు వేసిన నూకల వలె నుండునా?!
పారిజాతములు, ఆ చెట్టు నీడలోనె, జలజల, విడివిడిగ రాలినట్లుండునా?!
సూత్ర రాహిత్యమే కాని, భావ సౌందర్యము, శబ్దముల గొప్పదనము గ్రహించ వలెనని, ఆ కూర్పు కాబోలు!
నేను కూడా వ్రాసినాను లే, అట్టి రాతలు, తొలి నాళ్ళలో!
సరి సరి బండి ఎటో పొలముల లోనికి పోవుచున్నట్లున్నది! మళ్ళింతము!!
***
సినిమా తారల అభిమానులను చూచుట లేదూ, మన ఊళ్ళయందు!
అది వీరభద్ర గణమో, సుగ్రీవ సేనయో అనుకొన వలె, అట్లు విజృంభింతురు, ఒక్కొక్క సారి!
ఆ నటుడు, వీరి కేమైన, అన్నపానము లిచ్చి పోషించునా యేమి?! ఏమియు లేదు, ఇదియు నంతియే!
మానవ నైజము-కోటి పుర్రెలు, శతకోటి బుద్ధులు!
***
పైగా, ఏకలవ్య శిష్యుడట! ఇట్టి వారు అనేక మంది బయలుదేరుచున్నారు నాకునూ, ఈ మధ్య! మా గురువులు, చెళ్ళపిళ్ళ వారి కుండెడిది, ఈ ఆటవిక బాంధవ్యముల బెడద!
అదేనయ్యా, ఏకలవ్య శిష్య గణము!!
దాచుట కేమున్నది, బొటన వ్రేలిమ్మని ద్రోణుడా ఏకలవ్యు నడిగినది, ఏ కారణమున?!
శిష్యాభిమానమే కాదుటయ్యా?!
కనుక ఈ అభిమానము శతరూప అని తెలియవలెను.
దీని పాయలు లెక్కకు మించినవి సుమా!
ఈ అభిమానము, సహేతుకమా, అహేతుకమా, అకారణమా, సకారణమా అనునది ఇంకొక బెద్ద చర్చ!
***
వీరి పూర్వీకులు, సాకల్యముగ అన్ని వేదములు చదివినవారు కాబోలు, ఇంటి పేరు చతుర్వేదుల అనినాడు!
ఉండిరి, ఆ రోజులలో, అట్టి ఉద్దండ పిండములు!
వారికి విద్యలతో పని కాని, వేరు ధ్యాస యుండెడిది కాదు!
అట్టి వేదమూర్తులకు వేయి నమస్కారములు!!
స్వస్తి!!