మరుగునపడ్డ మాణిక్యాలు – 41: ప్రామిసింగ్ యంగ్ వుమన్

0
3

[dropcap]థ్రి[/dropcap]ల్లర్ సినిమాలు ఆసక్తిగా చూసేలా చేస్తాయి. అయితే కేవలం అద్భుతరసమే కాక కరుణరసం కలగలిస్తే ఎలా ఉంటుందో చూపే థ్రిల్లర్ ‘ప్రామిసింగ్ యంగ్ వుమన్’ (2020). ఇలాంటి కథ, స్క్రీన్ ప్లే వ్రాయటం సామాన్యమైన విషయం కాదు. అందుకే రచయిత్రి, దర్శకురాలు ఎమెరాల్డ్ ఫెనెల్‌కి ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్కార్ దక్కింది. ఒక యువతి తన గతంలో జరిగిన ఒక దుర్ఘటనని మర్చిపోలేక ప్రతీకారం చేయాలని కాసేపు, క్షమించి వదిలేయాలని కాసేపు ఊగిసలాడి చివరికి ఎలా మనశ్శాంతిని పొందిందో చూపే చిత్రమిది. అపూర్వమైన చిత్రమని చెప్పవచ్చు. నిజంగానే ఇలాంటి కథ నేను ఇంతకుముందు చూడలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. పెద్దలకు మాత్రమే. హిందీ శబ్దానువాదం అందుబాటులో ఉంది.

కాలేజీలో ఉన్నపుడు ఎవరైనా ప్రతిభ చూపిస్తే ‘ప్ర్రామిసింగ్ యంగ్ మ్యాన్/వుమన్’ అనటం పరిపాటి. అంటే అర్థం వారు భవిష్యత్తులో గొప్పవారవుతారని. ఈ చిత్రంలో నాయిక ఎన్నో ఆశలతో కాలేజీలో చేరినా, చదువు మధ్యలో మానేస్తుంది. మరి ఆమె ప్ర్రామిసింగ్ యంగ్ వుమన్ అనే పేరుని ఎలా సార్థకం చేసుకుంది? అదే కథ. క్యాసీ ముప్ఫై ఏళ్ళ యువతి. చిత్రం మొదట్లో ఆమె ఒక బార్లో తప్పతాగి తూలుతూ ఉంటుంది. ఒకతను ఆమె దగ్గరకి వచ్చి పలకరిస్తాడు. అతని పేరు జెర్రీ. ఆమె తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఫోన్ లేకపోతే ట్యాక్సీ పిలవటం కుదరదు. అతను ఆమెని ట్యాక్సీలో ఇంటి దగ్గర దింపుతానంటాడు. ఆమె అతనితో వెళుతుంది. దారిలో “మా ఇల్లు ఇక్కడే. మా ఇంటికి వెళదాం” అంటాడు. ఆమె తాగిన మైకంలో ఉంటుంది. అతను ఆమెని తన ఇంటికి తీసుకువెళతాడు. ఆమె ఏం చేసినా కాదనే స్థితిలో లేదని ఆమెని అనుభవించటానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుని “రేయ్! ఏం చేస్తున్నావ్?” అంటుంది. ఆమె అంతవరకు తాగినట్టు నటించిందంతే. అతను ఖంగుతిని ఉండిపోతాడు. అలా తాగినట్టు నటించి మగవాళ్ళని అయోమయంలో పడేసి, వాళ్ళని హెచ్చరించి వెళ్ళిపోవటం ఆమె అలవాటు. ఇలాంటి అనుభవం ఎదురయ్యేసరికి ఆ మగవారు మళ్ళీ అసహాయులైన యువతుల జోలికి వెళ్ళటానికి జంకుతారని వేరే చెప్పక్కరలేదు.

ఆమె అలా ఎందుకు చేస్తుంది? ఆమెకి గతంలో ఎదురైన అనుభవమే కారణం. అసహాయ స్థితిలో ఉన్న ఆడదాన్ని చూస్తే సగటు మగవాడి బుద్ధి మారిపోతుంది. అలాంటివారికి బుద్ధి చెప్పాలని ఆమె ఉద్దేశం. ఎంతమందికి బుద్ధి చెప్పగలదు? అది ఆమెకి అనవసరం. ఆమె ఏడేళ్ళ క్రితం మెడికల్ కాలేజీలో చదివేది. చదువు మధ్యలోనే మానేసింది. ఇప్పుడు ఒక కాఫీ షాపులో పని చేస్తుంటుంది. తలిదండ్రులతోనే ఉంటుంది. అయితే అమెరికాలో తలిదండ్రులు పిల్లలు వారి బతుకు వారు బతకాలని కోరుకుంటారు. తగినవారిని వెతుక్కుని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. ఇది అక్కడి సంస్కృతి. క్యాసీ అందరిలా ఉండదు. ఆమెకి జీవితంలో ఆశలేమీ లేవు. స్నేహితులు లేరు. పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఇంత నిర్వేదం ఎందుకు వచ్చింది? ఆమె తల్లి “నువ్విలా ఎందుకున్నావు? నువ్వూ, నీనా చదువు మానేసినప్పటి నుంచి నువ్వు ఆ పిచ్చి కాఫీ షాపులో పని చేస్తున్నావు. రాత్రిళ్ళు ఎక్కడికి వెళతావో తెలియదు. బాయ్ ఫ్రెండ్ లేడు. ఏంటిదంతా?” అంటుంది. క్యాసీకి నీనా అనే స్నేహితురాలుండేదని మనకి తెలుస్తుంది. ఆమె ఏమయింది?

క్యాసీతో పాటు మెడికల్ కాలేజీలో చదివిన రయన్ తిరిగి పరిచయమవటంతో ఆమె గతం మళ్ళీ ఆమె ముందుకు వచ్చి నిలబడుతుంది. క్యాసీ, రయన్ డేట్‌కి కూడా వెళతారు. ఆమె అతన్ని కాస్త దూరం పెడుతూ ఉంటుంది. అతను కూడా అందరు మగవాళ్ళ లాంటివాడే అని అనిపించినా మనసు మార్చుకుంటుంది. రయన్ తమ సహవిద్యార్థుల గురించి చెబుతాడు. మ్యాడిసన్‌కి కవలలు పుట్టారనీ, ఆల్ పెళ్ళి చేసుకోబోతున్నాడని రయన్ చెబుతాడు. మ్యాడిసన్ తనకు గుర్తులేదంటుంది క్యాసీ. “నువ్వూ, మ్యాడిసన్, ఇంకో అమ్మాయి సన్నిహితంగా ఉండేవారు కదా” అంటాడు రయన్. కాదంటుంది ఆమె. ఆల్ పేరు వినగానే ఆమె ముఖంలో రంగులు మారతాయి. ఆల్ మీద ఆమెకి కోపముందని మనకి తెలుస్తుంది. తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఆల్, మ్యాడిసన్ వివరాలు చూస్తుంది. మ్యాడిసన్‌కి సందేశం పంపుతుంది. ఇద్దరూ కలుస్తారు. నవ్వుతూ మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత క్యాసీ “అప్పుడేం జరిగిందో గుర్తుందా? అప్పటి సంగతి వదిలెయ్. ఇప్పుడు గానీ ఒక ఫ్రెండ్ నీ దగ్గరకొచ్చి తనపై అత్యాచారం జరిగిందని చెబితే ఏం చేస్తావు?” అంటుంది. “ఒళ్ళు తెలియకుండా తాగేసి ఎవరో ఏదో చేశారంటే? ఇద్దరి ఇష్టంతో జరిగిందో లేదో ఎవరికి తెలుసు?” అంటుంది మ్యాడిసన్. క్యాసీపై అత్యాచారం జరిగిందా? అలా అయితే మ్యాడిసన్ ఆమె మొహం మీద అలా మాట్లాడుతుందా? మరి ఏం జరిగింది? నీనా మీద అత్యాచారం జరిగింది! ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తూ కొంచెం కొంచెం కథ చెప్పటం ఈ స్క్రీన్ ప్లే లో విశేషం. మ్యాడిసన్ అలా మాట్లాడటంతో క్యాసీ ఆమెకి తగిన శాస్తి చేయాలనుకుంటుంది. మ్యాడిసన్‌ని బాగా మద్యం తాగేలా చేస్తుంది. ముందే మాట్లాడి పెట్టుకున్న ఒకతను మ్యాడిసన్‌ని ఒక హోటల్ గదికి తీసుకెళతాడు. క్యాసీ అతనికి డబ్బులిస్తుంది. ఆ హోటల్ గదిలో ఏం జరిగిందనేది మ్యాడిసన్‌కి గుర్తు ఉండదు. ఆమెకి తెలివి వచ్చేసరికి ఒక మగవాడు గదిలో ఉంటాడు. ఏం జరిగిందో తెలియకపోవటం ఆమెకి క్షోభ.

తన బాల్య స్నేహితురాలిపై అత్యాచారం జరగటంతో క్యాసీ మగవాళ్ళపై అసహ్యం పెంచుకుంది. నీనా మద్యం తాగింది. నిజమే. మద్యం తాగినంత మాత్రాన మగవాళ్ళు అలుసు తీసుకోవచ్చా? పైగా ఆమె తనపై అత్యాచారం జరిగిందని చెబితే ఎవరూ నమ్మరా? అక్కసుతో ఆ నింద వేసిందని అనటం ఎంతవరకు సబబు? అడపిల్లలని జాగ్రత్తగా ఉండమని చెప్పటం మంచిదే. కానీ మగపిల్లలని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని కూడా చెప్పాలి కదా. ఎప్పుడూ ఆడపిల్లలకేనా నీతులు చెప్పటం? మ్యాడిసన్ నీనాకి, క్యాసీకి మంచి స్నేహితురాలు. ఆమె కూడా నీనాని నమ్మలేదు. అప్పుడు జరిగిన విచారణలో నీనా మాట నమ్మలేనని సాక్ష్యం చెప్పింది. దాంతో క్యాసీ ఆమె మీద కసి తీర్చుకుంది. ఇంతకీ నీనా పై అత్యాచారం ఎవరు చేశారు? నీనా ఏమైంది? ప్రేక్షకుడి మదిలో ప్రశ్న మొదలవుతుంది. కీడు శంకిస్తాడు.

తర్వాత క్యాసీ మెడికల్ కాలేజ్ డీన్ దగ్గరకు వెళుతుంది. ఈ డీన్ అప్పట్లో నీనా ఇచ్చిన ఫిర్యాదు మీద విచారణ చేసింది. క్యాసీ తాను మళ్ళీ కాలేజీలో చేరతానని అబద్ధం చెప్పి డీన్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకుంటుంది. “నీనాకి జరిగిన అన్యాయం వల్ల నేను కాలేజీ మానేశాను. నీనా మీకు గుర్తు లేదా? ఆల్ ఆమెని తన రూమ్‌కి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. అతని స్నేహితులందరూ చూస్తుండగా. తర్వాత నీనా మీకు ఫిర్యాదు చేసింది. మీరు తగిన సాక్ష్యాధారాలు లేవన్నారు” అంటుంది. “ఇలాంటి ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క తప్పటడుగు వేస్తే పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. సాక్ష్యాలు సరిపోలేదు కాబట్టి ఆల్‌ని వదిలేయాల్సి వచ్చింది. లేకపోతే ఒక యువకుడి జీవితం పాడైపోయేది” అంటుంది. క్యాసీ “అంటే అబ్బాయి మాట నమ్ముతారు గానీ అమ్మాయి మాట నమ్మరా?” అంటుంది. “సాక్ష్యాధారాలు లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వకతప్పదు. నేరం రుజువు కానంత వరకు ఎవరూ అపరాధి కాదు” అంటుంది డీన్. “కాదనలేని నిజం చెప్పారు” అంటుంది. డీన్ “నీ స్నేహితురాలు బావుందా?” అని అడుగుతుంది. “లేదు. కానీ ఆల్ బావున్నాడుగా” అంటుంది క్యాసీ. మళ్ళీ “మీ కూతుర్ని ఇంతకు ముందే తీసుకెళ్ళి ఆల్ పాత రూమ్‌లో ఇప్పుడు ఉంటున్న అబ్బాయిల దగ్గర వదిలిపెట్టి వచ్చాను. పుష్కలంగా మద్యం కూడా ఉంది. వారు ఆమెని మర్యాదగా చూసుకుంటారని నమ్ముతున్నాను” అంటుంది. క్యాసీ డీన్ దగ్గరకి వచ్చేముందు ఆమె కూతుర్ని ప్రసిద్ధ పాప్ గాయకుల షూటింగ్ పేరు మీద మభ్యపెట్టి తీసుకువెళ్ళింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ఆమె ఫోన్ కూడా తీసుకుంది. డీన్‌కి ముచ్చెమటలు పోస్తాయి. తన కూతురికి ఫోన్ చేస్తుంది. క్యాసీ దగ్గర ఉన్న ఫోన్ మోగుతుంది. డీన్ తన కూతురు ఎక్కడుందో చెప్పమని వేడుకుంటుంది. క్యాసీ ఏం మాట్లాడకుండా తదేకంగా ఆమెని చూస్తుంది. డీన్ కుర్చీలో కూలబడి “నువ్వన్నదే సబబు. నేను తప్పు చేశాను. ఈ మాటేగా నువ్వు వినాలనుకుంటున్నావు?” అంటుంది. “చూశారా? మీ దృష్టికోణం మారితే మీకు న్యాయం ఏమిటో తెలిసింది. మన దగ్గరివాళ్ళయితే గానీ మనం తిన్నగా ఆలోచించం కదా. మీ అమ్మయి క్షేమంగానే ఉంది” అంటుంది క్యాసీ.

తన కూతురు ప్రమాదంలో ఉందని తెలిసి డీన్ తల్లడిల్లిపోయింది. నీనా అత్యాచారం జరిగిందని చెప్పినా ఆమె నమ్మలేదు. తన కూతురైతే ఒక న్యాయం, వేరొకరైతే ఒక న్యాయం. నీనా తాగి ఉంది కదా అనవచ్చు. మళ్ళీ ముందటి ప్రశ్నే వస్తుంది. అమ్మాయి తాగి ఉంటే మగవాడికి ఏమైనా చేసే హక్కు వచ్చేస్తుందా? అలాంటి వారికి శిక్ష పడితే కొందరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. డీన్‌కి ఆల్ తలిదండ్రుల నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చిందా? వచ్చి ఉండవచ్చు. ఆమె చేసింది తప్పని ఆమె అంతరాత్మకి తెలుసు. అదిప్పుడు బయటకి వచ్చింది. నీనా ఆత్మహత్య చేసుకుందని ప్రేక్షకుడికి రూఢి అయిపోతుంది. లేకపోతే నీనా తెరపై కనిపించకుండా ఇంత కథ నడవదు. నీనా బావుందా అంటే లేదని క్యాసీ అంది కదా! నీనా మానసికంగా కృంగిపోయి కాలేజీ మానేస్తే ఆమెకి తోడుగా ఉండటానికి క్యాసీ కూడా కాలేజీ మానేసింది. తర్వాత నీనా ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రతీకారం చేద్దామనుకున్న క్యాసీ ముందు అవతలివారికి తప్పు ఒప్పుకునే అవకాశం ఇవ్వటం ఇక్కడ గమనించాలి. మ్యాడిసన్ తప్పు ఒప్పుకోలేదు. క్యాసీ ఆమెని శిక్షించింది. డీన్ మొదట తప్పు ఒప్పుకోకపోయినా చివరికి ఒప్పుకుంది. క్యాసీ ఆమెని వదిలేసింది.

తన ప్రతీకారంలో పడి రయన్‌ని విస్మరిస్తుంది క్యాసీ. అయితే బార్లకు వెళ్ళి తాగినట్టు నటించి మగవాళ్ళని బుట్టలో పడేసి బుద్ధి చెప్పటం మానదు. ఒకరోజు ఒక బార్ దగ్గర మరొకడితో ఆమె ఉండగా రయన్ చూస్తాడు. ఆమెని అపార్థం చేసుకుంటాడు. క్యాసీ నిజం చెప్పదు. ఆమెకి తన ప్రతీకారమే ముఖ్యం. ఇద్దరూ విడిపోతారు. తర్వాత ఆమె ఆల్ తరఫున వాదించిన లాయర్‌ని తన లక్ష్యం చేసుకుంటుంది. ఈ లాయర్లు ఫిర్యాదు చేసిన అమ్మాయి గతాన్ని తవ్వుతారు. ఇంతకు ముందు అమ్మాయిల ఇంటి బయట ఉండే చెత్త డబ్బాలలో వెతికేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. సోషల్ మీడియాయే పెద్ద చెత్త డబ్బా. ఏదైనా పార్టీలో తాగి ఉన్నట్టు ఒక ఫొటో దొరికితే చాలు జ్యూరీ సభ్యులు అమ్మాయికి వ్యతిరేకమైపోతారు. ఇలాంటి ఎత్తులు హిందీలో వచ్చిన ‘పింక్’ (తెలుగులో ‘వకీల్ సాబ్’) లో చూశాం. అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని నిరూపించటమే ఈ లాయర్ల పని. కోర్టుకి వెళ్ళకుండా పరిహారంతో అమ్మాయి నోరు మూయిస్తే లాయరుకి బోనస్. కేసు ఉపసంహరించుకునేలా చేస్తే ఇంకా పెద్ద బోనస్. క్యాసీ లాయరుకి ఎలా బుద్ధి చెప్పింది? ఆల్‌కి కూడా బుద్ధి చెప్పిందా? ఇవి ఉత్కంఠ కలిగించే ప్రశ్నలు.

ఈ చిత్రానికి ఆస్కార్లలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి, ఉత్తమ ఎడిటింగ్ నామినేషన్లు వచ్చాయి. క్యారీ మలిగన్ క్యాసీగా నటించింది. స్నేహితురాలి కోసం తన చదువునే వదిలేసిన సున్నిత హృదయం గల పాత్ర ఇది. నీనా మరణించటంతో ఆమె హృదయం మొద్దుబారిపోతుంది. ఆడవారు తమని తాము రక్షించుకోలేని పరిస్థితిలో ఉంటే వారిపై లైంగిక దాడి చేసే మగవారికి తనదైన శైలిలో బుధ్ధి చెబుతుంది. తన దారిన తాను అలా ఉండిపోయేదేమో. నీనా నోరు నొక్కేసినవారు దర్జాగా బతుకుతున్నారని తెలిసి ఆమెలో కసి పెరుగుతుంది. ఈ భావోద్వేగాలను ఎక్కడా అతి చేయకుండా నటించింది క్యారీ. కాఫీ షాప్‌లో ఉన్నప్పుడు బాల్యంలోకి తిరిగి వెళ్ళిపోయినట్టు ఆమె వేషధారణ ఉంటుంది. జుట్టుకి రిబ్బన్ కట్టుకుంటుంది. బొమ్మలున్న టాప్ వేసుకుంటుంది. ఒక్కో చేతిగోరుకి ఒక్కో రంగు వేసుకుంటుంది. అలా చిన్నపిల్లలా ఉంటే మగవారు తన జోలికి రారని ఆమె ఆలోచన. ఇది పైకి చెప్పకపోయినా ఆంతర్యం అదే. బార్లకి వెళ్ళినపుడు మాత్రం కవ్వించే దుస్తులు వేసుకుంటుంది. దుస్తుల్లో కూడా దర్శకురాలు ఎమెరాల్డ్ ఫెనెల్ ఎంత శ్రద్ధ తీసుకుందో దీన్ని బట్టి తెలుస్తుంది. మంచి ఎడిటింగ్ లేకపోతే ఈ చిత్రం ఉత్కంఠభరితంగా ఉండేది కాదు. ఫ్రెదెరిక్ థొరొవాల్ ఎడిటింగ్ అభినందనీయం. చిత్రంలో క్యాసీ తన ప్రతీకారం కోసం కిరాయి మనుషులకి డబ్బులిచ్చి పని చేయించుకోవటం కాస్త అసంబద్ధంగా అనిపిస్తుంది. ఆమెకి వారు ఎలా దొరికారు? అలాంటి వారు తన మీద లైంగిక దాడి చేస్తారనే భయం ఆమెకి లేదా? ఆమె దగ్గర అంత డబ్బు ఉందా అనే ప్రశ్నలు వస్తాయి. సినిమా కాబట్టి కొన్ని విషయాలు పొంతన లేకుండా ఉంటాయి. అయితే చివరికి జరిగేది మాత్రం వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉంటుంది.

ఈ క్రింద చిత్రకథ మరి కొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

క్యాసీ ఆల్ తరఫున వాదించిన లాయరు ఇంటికి వెళుతుంది. తలుపు తీసిన లాయరుతో “నీ పాపాలకి జవాబు చెప్పుకునే రోజు వచ్చింది” అంటుంది. అతను నిర్వేదంతో “ఈరోజు వస్తుందని నాకు తెలుసు” అంటాడు. ప్రేక్షకుడికి ఇది అనుకోని పరిణామం. క్యాసీ లోపలికి వచ్చాక “చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా” అంటాడు లాయరు. క్యాసీ ఆల్ కేసు గురించి అడుగుతుంది. అలాంటి కేసులెన్నో నువ్వు తీసుకున్నావు కదా అంటుంది. “ఆ అమ్మాయి పేరు నీనా కదా?” అంటాడు లాయరు. క్యాసీ ఖంగు తింటుంది. నీనాని గుర్తు పెట్టుకున్న వ్యక్తి ఒక్కడు ఇన్నాళ్ళకి తారసపడ్డాడు. అతను “నాకొక రోజు ఆఫీసులో ఉండగా హఠాత్తుగా నేను చేస్తున్నది పాపమనే విషయం బోధపడింది. డాక్టరేమో నాకు మతి చలించిందన్నాడు. నేను ఉద్యోగం మానేశాను. నాకు నిద్రపట్టటం లేదు. నేను చేసిన పాపాలకి నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను” అని ఆమె చేతులు పట్టుకుంటాడు. ఆమె కన్నీరు పెట్టుకుని “నిన్ను నేను క్షమిస్తున్నాను” అంటుంది. లాయరు భారం దిగిపోయినట్టు నిట్టూరుస్తాడు. నిజానికి క్యాసీ ఒక కిరాయి హంతకుణ్ణి తీసుకుని లాయరు ఇంటికి వచ్చింది. అతను బయట ఉంటాడు. అయితే లాయరులోని పరివర్తనని చూసి క్యాసీ అతన్ని విడిచిపెట్టింది. మ్యాడిసన్‌ది చిన్న తప్పు, చిన్న శిక్ష. డీన్‌ది కాస్త పెద్ద అపరాధం, అయినా తప్పు ఒప్పుకోవటంతో క్షమించింది క్యాసీ. లాయరుది పాపం, అతను పశ్చాత్తాపపడటంతో పాపవిముక్తి ఇచ్చింది. పశ్చాత్తాపం ఉంటే మహాపాతకం కూడా పటాపంచలయిపోతుంది. అయితే మళ్ళీ తప్పుడు పనులు చేయకూడదు.

క్యాసీ నీనా తల్లిని కలవటానికి వెళుతుంది. క్యాసీ ఇంకా నీనాకి జరిగిన అన్యాయాన్ని మరచిపోలేదని గ్రహించి ఆమె “అంతా మర్చిపో. నీ జీవితం నువ్వు జాగ్రత్తగా చూసుకో” అంటుంది. లాయరు పశ్చాత్తాపం, నీనా తల్లి ఇచ్చిన సలహా క్యాసీలో ఉన్న ప్రతీకారవాంఛని తగ్గిస్తాయి. ఆమె ఇక గతాన్ని మర్చిపోయి జీవించాలని నిర్ణయించుకుంటుంది. రయన్ దగ్గరకి వెళుతుంది. “ఆరోజు బార్ దగ్గర జరిగినది మళ్ళీ జరగదు” అంటుంది. రయన్ ఆమెని చేరదీస్తాడు. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ఒకరోజు మ్యాడిసన్ క్యాసీని కలవటానికి వస్తుంది. ఆరోజు హోటల్లో ఏం జరిగిందో తెలియక క్షోభపడుతున్నానని అంటుంది. క్యాసీ “ఏం జరగలేదు. అతను నువ్వు మేలుకునేదాకా ఉండి వెళ్ళిపోయాడు. నిన్ను బాధపెట్టినందుకు సారీ” అంటుంది. మ్యాడిసన్ కుదుటపడుతుంది. తన దగ్గర ఒక వీడియో ఉందని అంటుంది. ఆ వీడియో నీనా పై అత్యాచారం జరుగుతున్నపుడు ఆల్ స్నేహితుడు తీసినది. మ్యాడిసన్ ఆ వీడియో ఉన్న ఫోన్ క్యాసీకి ఇచ్చి వెళ్ళిపోతుంది. క్యాసీ భయంభయంగా ఆ వీడియో చూస్తుంది. అందులో రయన్ గొంతు వినిపిస్తుంది! అత్యాచారం జరిగినపుడు రయన్ కూడా అక్కడే ఉన్నాడు. క్యాసీకి భూమి బద్దలయినట్టు ఉంటుంది.

క్యాసీతో విధి ఆడిన నాటకమిది. తలచుకుంటే మనసు వికలమైపోతుంది. తాను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి ఇంత పెద్ద విషయాన్ని దాచాడని తెలిసి ఆమె హృదయం ముక్కలైపోతుంది. రయన్ తెలిసి ఆ పని చేయలేదు. గతాన్ని గతంలోనే వదిలేయాలని అతని ప్రయత్నం. కానీ ఆల్ చేసినది తప్పని సాక్ష్యం చెప్పకపోవటం అతను చేసిన తప్పు. క్యాసీ నిలదీస్తే “అప్పుడు చిన్న వయసు కదా” అంటాడు తప్పొప్పులు తెలియవనే ఉద్దేశంతో. ఒక అమ్మాయి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె మీద అత్యాచారం చేయటం తప్పని తెలియదా, తనని తాను మోసం చేసుకోవటం కాకపోతే? క్యాసీ పరిస్థితి మన ఊహకి కూడా అందదు. ఉన్న ఒక్క ఆలంబన కూడా లేకుండా పోయింది. ఆమె ఇక పూర్తిగా ప్రతీకారం మీదే దృష్టి పెడుతుంది. ఆల్ బ్యాచిలర్ పార్టీ (పెళ్ళికి ముందు అబ్బాయి తన మగ స్నేహితులతో చేసుకునే పార్టీ. ఇవి పచ్చిగా ఉంటాయి) ఎక్కడ జరుగుతోందో చెప్పకపోతే ఆ వీడియో బయటపెట్టి రయన్‌కి భవిష్యత్తు లేకుండా చేస్తానని అతన్ని బెదిరిస్తుంది. అతను చెబుతాడు కానీ “నువ్వు పనికిమాలినదానివి” అంటాడు అక్కసుతో. క్యాసీ నిర్వేదంతో నవ్వుకుని “అంతేలే” అని వెళ్ళిపోతుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. ముగింపు ఇంతకు ముందు ఎప్పుడూ చూడనట్టుగా ఉంటుంది. కాబట్టి చిత్రం చూసే అవకాశం ఉన్నవారు ఇక్కడ చదవటం ఆపేసి చిత్రం చూడమని గట్టిగా కోరుతున్నాను. చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు.

క్యాసీ బాగా మేకప్ వేసుకుని ఒక స్ట్రిపర్ (బట్టలూడదీసుకుంటూ డ్యాన్స్ చేసే యువతి) లాగా ఆల్ పార్టీకి వెళుతుంది. ఇలాంటి వారిని బ్యాచిలర్ పార్టీల కోసం కిరాయి ఇచ్చి పిలిపిస్తారు వరుడి స్నేహితులు. అది ఒక అడవి ప్రాంతంలో ఉన్న ఇల్లు. క్యాసీని ఎవరో పిలిపించి ఉంటారని అందరూ అనుకుంటారు. ఆల్ ఆమెని గుర్తుపట్టడు. ఆమె మిగతావారికి మద్యం పట్టించి ఆల్‌ని తీసుకుని ఒక గదిలోకి వెళుతుంది. బ్యాచిలర్ పార్టీలో ఎంత పచ్చిగా ఉన్నా తప్పులేదని కుర్రకారు ఉవాచ. ఆల్‌కి మాత్రం ఇది ఇష్టం ఉండదు. తన కాబోయే భార్యకి అన్యాయం చేయనని అంటాడు! క్యాసీ అతని చేతులకి సంకెళ్ళు వేసి మంచం రాడ్డులకి బంధిస్తుంది. ఇలాంటి విపరీత సరసాలు బ్యాచిలర్ పార్టీలో మామూలే. క్యాసీ నీనా విషయం ఎత్తుతుంది. ఆల్ వణికిపోతాడు. కేకలేస్తాడు. అతని స్నేహితులందరూ మద్యం మత్తులో చిత్తయి ఉన్నారు. “తెలిసీతెలియని వయసులో జరిగింది. నేనే తప్పూ చేయలేదు. నీనా ఇష్టంతోనే జరిగింది” అంటాడు. “వీడియో చూస్తే అలా అనిపించలేదే” అంటుంది నీనా. ఆల్ తనని వదిలెయ్యమని వేడుకుంటాడు. క్యాసీ “నీనా ఎంత ఉల్లాసంగా ఉండేది. నీవల్ల ఆమె ఉల్లాసమంతా పోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా నీ పేరే వినపడేది. ఆమె పోయిన తర్వాత ఆమె పేరే ఎవరి నోటా రాలేదు. నువ్వు నీనా పేరు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా చేస్తాను” అని అతని పొట్ట మీద చిన్న కత్తితో నీనా పేరు రాయటానికి ప్రయత్నిస్తుంది. అతను పెనుగులాడటంతో ఒక చేతి సంకెల ఊడిపోతుంది. ఆమెని మంచం మీద పడేసి ముఖం మీద దిండు పెట్టి కాలితో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. ఒక సంకెల బంధం ఇంకా ఉండటంతో రాత్రంతా క్యాసీ శవం పక్కన అలాగే ఉండిపోతాడు. పొద్దున్న అతని స్నేహితుడొకడు గదిలోకి వచ్చి చూస్తాడు. ఆల్ వణికిపోతూ ఉంటాడు. ఆ స్నేహితుడు “ఇది ప్రమాదవశాత్తూ జరిగింది. ఎవరైనా అడిగితే ఆమె వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళిపోయిందని చెప్పు” అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళి క్యాసీ శవాన్ని కాల్చేస్తారు.

అయితే క్యాసీకి తాను ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసు. అందుకే ఆల్ పట్టుబడటానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పశ్చాత్తాపపడుతున్న లాయరుకి వీడియో ఉన్న ఫోన్ పంపిస్తుంది. దానితో పాటు ఒక ఉత్తరంలో “నేను ఫలానా అడ్రసులో ఆల్ బ్యాచిలర్ పార్టీకి వెళుతున్నాను. నేను అదృశ్యమైపోతే ఈ ఉత్తరం, ఫోన్ పోలీసులకి అందజేయండి” అని వ్రాసి పెడుతుంది. లాయరు ఆ పని చేస్తాడు. పోలీసులు ఆల్ పార్టీ జరిగిన చోటుకి వెళ్ళి పోలీసు కుక్కలతో వెతికిస్తే క్యాసీ శవం కాల్చేసిన ప్రాంతానికి కుక్కకు తీసుకెళతాయి. సరిగా ఆల్ పెళ్ళి ముగిసే సమయానికి పోలీసులు వచ్చి క్యాసీని హత్య చేసినందుకు అతన్ని అరెస్టు చేస్తారు. ఆ పెళ్ళిలో రయన్ కూడా ఉంటాడు. అతని ఫోన్‌కి క్యాసీ నుంచి షెడ్యూల్డ్ మెసేజ్ (అప్పటికప్పుడు కాకుండా తర్వాత పంపే విధంగా వ్రాసిన ఫోన్ సందేశం) వస్తుంది. “నేను అదృశ్యమైపోతే కథ ముగిసిందనుకున్నావా? ఇప్పుడు ముగిసింది” అని ఆ సందేశం.

క్యాసీ ప్రాణాలకు తెగించే వెళ్ళిందని తెలిసి మనకి గొంతుకి ఏదో అడ్డం పడినట్టు ఉంటుంది. ఆమె చేసిన సాహసానికి ఆమెని ఆల్ చంపేయటం వాస్తవప్రపంచానికి దగ్గరగా ఉంటుంది. నిజానికి దర్శకురాలు క్యాసీ శవాన్ని కాల్చేయటంతో కథ ముగించాలని అనుకుందట. కానీ ఇది మరీ విషాదంగా ఉంటుందని నిర్మాతలు అనటంతో ఆల్ అరెస్టయ్యే విధంగా కథ ముగించింది. కానీ ఇలాంటి కథ తీసుకోవటం, ఊహకి అందని విధంగా నడిపించటం ఆమె ప్రతిభ. కొన్ని లోపాలు ఉండొచ్చు గాక. మరో దర్శకుడైతే క్యాసీ ప్రతీకారం తీర్చుకుని తన జీవితం తాను గడిపిందని చూపించేవాడేమో. క్యాసీ వీడియోని ముందే పోలీసులని ఎందుకు ఇవ్వలేదు? అలా చేసి ఉంటే కేసు మళ్ళీ కోర్టుకి వెళ్ళేది. అక్కడ ఇంకో జిత్తులమారి లాయరు తిమ్మిని బమ్మిని చేయవచ్చు. అందుకని ఆమె స్వయంగా ఆల్‌కి శిక్ష వేయాలని వెళ్ళింది. ఆమె ఒకవేళ బతికి బయటపడి ఉంటే ఆమె మీద ఆల్ కేసు వేసి ఉండేవాడు. అయినా అది క్యాసీకి నష్టమేమీ కాదు. జీవితం మీద రయన్ పుట్టించిన ఆశ కూడా మసైపోయింది. ఆమెకి ఇంక జీవితం మీద తీపి లేదు. ఎవరినైనా నమ్మే స్థితి ఆమె దాటేసింది. ఒక విధంగా ఆమె దుర్భరజీవితం నుంచి ముక్తి పొందింది.

2017లో “మీ టూ” అనే ఉద్యమం మొదలయింది. లైంగిక వేధింపులు, లైంగిక దాడి చేసిన ప్రముఖుల్ని కొందరు బాధితులు కోర్టుకి తీసుకెళ్ళారు. మన దేశంలో దిశ చట్టం, నిర్భయ చట్టం వచ్చాయి. అయినా కొందరు ఎలాగోలా తప్పించుకుంటున్నారు. తప్పు జరిగినపుడు అమ్మాయిని దోషిని చేయటం ఇప్పటికీ జరుగుతోంది. కొన్ని తప్పుడు ఆరోపణలూ ఉండొచ్చు. కేసుని సక్రమంగా విచారిస్తే నిజానిజాలు బయటపడతాయి. అంతకంటే ముందు తెలిసినవారు పదిమంది “నువ్వు చేసింది తప్పు” అని ఆ మగవాడిని వెలివేస్తే అతనిలో మార్పు వస్తుంది. శిక్షకి సిద్ధపడొచ్చు. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ‘సాక్షి’ పేరుతో వ్రాసిన వ్యాసాల్లో ఇదే మాట అంటారు. కానీ మనవాడు కదా అని తెలిసినవారందరూ కాపాడటానికే ప్రయత్నిస్తారు. తలిదండ్రులు డబ్బు, పలుకుబడి ఉపయోగిస్తారు. ఇదే పెద్ద లోపం. తప్పు చేసినవాడు మనవాడైనా తప్పు ఒప్పు కాదు కదా! అదే మనం బాధితుల స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే మనసు మారుతుంది. అలా ఆలోచించేవారెంతమంది? ఈ చిత్రంలో క్యాసీ, నీనా ఇద్దరూ ‘ప్రామిసింగ్ యంగ్ వుమన్’లే. ఒక మగవాడి వల్ల ఇద్దరి జీవితాలూ నాశనమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here