మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-4

0
4

అధ్యాయం 4 – బొంబాయి జీవితపు కొన్ని జ్ఞాపకాలు:

[dropcap]నే[/dropcap]ను బొంబాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు పూనా నగరంలో దాదాపు 14 సంవత్సరాలు గడిపాను. ఆ నగరంలో నా నివాసం నాకు అనేక విధాలుగా విలువైనది, ప్రత్యేకమైనది. ప్రెసిడెన్సీలో బొంబాయి ప్రభుత్వం వినియోగిస్తున్న మూడు ప్రధాన కార్యస్థానాల్లో పూనా కూడా ఒకటి. మిగిలిన రెండు బొంబాయి, మహాబలేశ్వర్ హిల్ స్టేషన్. ప్రభుత్వ పనుల నిమిత్తం బొంబాయి, మహాబలేశ్వర్ సందర్శించమని నన్ను అప్పుడప్పుడు కోరేవారు. ప్రభుత్వంలో అత్యున్నత పదవులను నిర్వహించిన యూరోపియన్ అధికారులు సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే సమయంలో మహాబలేశ్వర్‌ను ప్రభుత్వ కార్యస్థానంగా ఉపయోగించేవారు. ఇదివరకే చెప్పినట్లు, 1905లో నేను బొంబాయి సచివాలయంలో సంవత్సరానికి 10 నెలల పాటు ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించేవాడిని. మొత్తం మీద ఇంత సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగంలో పూనాను నా ప్రధాన కార్యాలయంగా కలిగి ఉండటం ద్వారా నాకు కొంత విశేషమైన స్థానం లభించింది. నేను ప్రాంతీయ అధికారిగా ఉన్న నాలుగు సంవత్సరాలలో, సింధ్ సహా ప్రెసిడెన్సీలోని చాలా ప్రాంతాలకు విధుల్లో భాగంగా ప్రయాణించే అవకాశాలు నాకు లభించాయి. ఈ వైవిధ్యభరితమైన అనుభవాలన్నీ నాకు మొత్తం బొంబాయి ప్రావిన్స్ గురించి, పరిపాలన పనితీరు గురించి, ఆ రోజుల్లో ఉన్న దేశ నాయకుల రాజకీయ, సామాజిక కార్యకలాపాల గురించి మంచి జ్ఞానాన్ని అందించాయి. ఇటువంటి అవకాశాలు నాలాంటి సాధారణ భారతీయ ఉద్యోగులకు చాలా అరుదుగా లభిస్తాయి.

పూనా నగరం శానిటరీ ఇంజనీరింగ్ శాఖ సహా అనేక శాఖల ఉన్నతాధికారులకు ప్రధాన కార్యాలయంగా కూడా ఉండేది. వీటికి అదనంగా పూనా విద్యా, మేధో కేంద్రం కూడా. ప్రభుత్వ సర్వీస్ నుండి పదవీ విరమణ చేసిన భారతీయ అధికారులు పెద్ద సంఖ్యలో ఆ రోజుల్లో ఈ నగరంలోనే స్థిరపడినారు. ఫెర్గూసన్ కళాశాల ప్రొఫెసర్లు, వార్తాపత్రికల సంపాదకులు, కొందరు ప్రభుత్వాధికారులు భారత దేశ రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచేవారు.

పూనాలో ఫెర్గ్యూసన్ కాలేజీ

దేశ ప్రజల సేవ కోసం ప్రభుత్వంలో భారతీయులకు మరింత ఎక్కువగా రాజకీయ అధికారాలను కల్పించడం, ప్రభుత్వ పదవుల్లో అవకాశాలను పెంచడం చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉండేవారు. వీరిలో శ్రీ మహదేవ్ గోవింద్ రనడే విశిష్ట వ్యక్తిత్వం కలిగిన ప్రధాన నాయకుడు. ఆయన గొప్ప సమర్ధత, మంచి అవగాహన, స్థాయి, సంయమనం గల నాయకుడు. అతను స్వయంగా ప్రభుత్వోద్యోగి కూడా. అదే సమయంలో చైతన్యం గల పూనా, మహారాష్ట్ర ప్రజలు రనడేను తమ స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శిగా పరిగణించేవారు. ఆయన పూనా, మహారాష్ట్రలోనే కాకుండా దేశమంతటా రాజకీయాల్లో ఉదారవాద నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అతను దేశంలోని ఇతర ప్రాంతాలలో జాతీయ, సామాజిక సంస్కరణల కోసం డిమాండ్ చేసే అనేక సమావేశాలలో పాల్గొని అధ్యక్షత వహించాడు.

మహాదేవ్ గోవింద రనడె

మహాత్మా గాంధీ తన రాజకీయ దృక్పథాలను, పంథాను అమలు చేయడానికి పండిట్ జవహర్ లాల్ నెహ్రూను వారసుడిగా భావించినట్లే, రనడే కూడా రాజకీయాలలో శ్రీ గోపాల కృష్ణ గోఖలేను తన వారసుడిగా భావించాడు. శ్రీ రనడే గారు చిన్నచిన్న పారిశ్రామిక ప్రదర్శనలను ప్రోత్సహించేవారు. పారిశ్రామిక, వాణిజ్యం రంగాలలో మహారాష్ట్రలో, ప్రత్యేకించి పూనాలో, అవకాశం ఉన్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. బొంబాయి, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కొంతమంది యువరాజులు, సంస్థానాధీశులు, సీనియర్ రాజకీయ నాయకులు అతనిని అనధికారికంగా నిరంతరం సంప్రదించేవారు.

గోపాల కృష్ణ గోఖలే

శ్రీ.జి.కె.గోఖలే పూనాలో ఉన్న ఫెర్గూసన్ కళాశాలలో చాలా కాలం పాటు ఆచార్యుడిగా పని చేశారు. కొన్ని సంవత్సరాలు అతను పూనాలోని ‘సార్వజనిక్ సభ’ కార్యదర్శులలో ఒకరిగా వ్యవహారాలను కూడా నిర్వహించాడు. తరువాత అతను ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’ ని స్థాపించాడు. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది సమర్థులైన, దేశభక్తి కలిగిన నిస్వార్థ నాయకులని ఆకర్శించింది. వారు ఈ సొసైటీకి తమ విలువైన సేవలను అందించారు. సార్వజనిక్ సభ ప్రచురించే పత్రిక వాస్తవానికి శ్రీ రనడే గారే నిర్వహించే వారు. సభ కార్యదర్శి శివరామ్ హరి సాథె అనే వ్యక్తి పేరు నామ మాత్రంగా ఉండేది. ఆయన రనడే గారికి నమ్మకమైన స్నేహితుడైన పెద్దమనిషి మాత్రమే. ఆ పత్రికలో చాలా విలువైన కథనాలు ఇంగ్లీష్‌లో ప్రచురించేవారు. నాకు తెలిసినంత వరకు సెక్రటరీకి సాథే గారికి ఇంగ్లీష్ భాష తెలియదు. శ్రీ. రనడే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సార్వజనిక్ సభ వెలువరించే పత్రికకు రచనలు చేసే వారి పేర్ల జాబితాను తయారు చేసి వారి నుంచి రచనలు సేకరించి ప్రచురించేవారు. అయితే బొంబాయి ప్రెసిడెన్సీలో ఒక విభాగమైన దక్కన్, మహారాష్ట్ర నుండి ఎక్కువగా రచనలు అచ్చు అయ్యేవి. సుమారు 1893 ప్రాంతంలో నన్ను కూడా పత్రికకు వ్యాసం అందించమని రనడె గారు అడిగారు. నేను జాతీయోద్ధరణ అంశంపై రాసిన వ్యాసాన్ని రనడే గారు పరిశీలించి ప్రచురించారు.

దక్కన్ రాజకీయ నాయకుడు శ్రీ బాల గంగాధర్ తిలక్ బ్రిటిష్ విధానాలు, పరిపాలనా పద్ధతులను విమర్శించడంలో కఠిన వైఖరిని అవలంబించేవారు. అందువల్ల, అతను చాలా సంవత్సరాలు జైలులో గడపాల్సి వచ్చింది. తన జైలు జీవితపు కాలాన్ని అతను చరిత్ర, తత్వశాస్త్రంపై పుస్తకాలు రాయడానికి వినియోగించుకున్నాడు. రనడే, గోఖలే వంటి ఉదారవాద, మితవాద పార్టీ నాయకుల తేలికపాటి వ్యూహాలను అతను తరచుగా అపహాస్యం చేసేవాడు.

బాల గంగాధర తిలక్

1890 దశకంలో పూనాలో చాలా మంది విద్యావంతులు ఉండేవారు. వారు సంఘ సంస్కర్తల పాత్రను పోషించడానికి ఇష్టపడేవారు కాదు. ఒక సందర్భంలో, దాదాపు 42 మంది బ్రాహ్మణ పెద్దమనుషులు ఒక క్రైస్తవ సంస్థ ఏర్పాటు చేసిన టీ పార్టీకి ఆహ్వానాన్ని అంగీకరిస్తే వారిని పూనాకు చెందిన సనాతన బ్రాహ్మణలు కుల బహిష్కరణ చేసినారు. వారిని మరాఠీ వార్తా పత్రికల్లో ‘బెచాలీస్’లు (పార్టీకి హాజరైన వారి సంఖ్య నలభై రెండు) అని విమర్శించినారు. అయితే ఈ సంస్కర్తల పట్ల మరింత సహనశీల వైఖరిని అవలంబించడానికి పూనా ప్రజలకు ఎక్కువ సమయం పట్టలేదు.

దక్కన్ క్లబ్:

ఆట పాటల్లో నిమగ్నమైన సమయాల్లో స్నేహితులతో కలిసి తిరుగుతున్నప్పుడు పూనాలో ఇంగ్లీషు వారి తరహాలో ఒక క్లబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. ఆ నగరంలో నివాసం ఉంటున్న తొలి రోజుల్లో స్థానిక క్రీడా మైదానాలలో ఆడే ఆటల్లో నేను కూడా పాల్గొనేవాడిని. వీటిల్లో రనడే, గోఖలే లాంటి ప్రముఖ వ్యక్తులు, కొంతమంది స్థానిక సర్దార్లు, న్యాయవాదులు కూడా పాల్గొనేవారు. 1891 జూలై 14న పూనాలో సబార్డినేట్ జడ్జిగా ఉన్న దివంగత శ్రీ చింతామణి రావు భట్, నేను సంయుక్తంగా ఒక క్లబ్‌ను ప్రారంభించాలనుకుంటున్నామని, అందరి సహకారాన్ని కోరుకుంటున్నామని పేర్కొంటూ పూనాలో నివసిస్తున్న ప్రముఖ పౌరులందరికి ఒక సర్క్యులర్‌ను జారీ చేసాము. మేము శ్రీ ఎం జి రనడే గారి వద్దకు వెళ్లి మా ప్రతిపాదన గురించి ఆయనకు తెలియజేసినాము. పూనాలో చారిత్రక ఖ్యాతి కలిగిన ‘హీరా బాగ్’ అని పిలిచే ఒక పాత భవనాన్ని మా క్లబ్‌కు కేటాయించమని అభ్యర్థించాము. శ్రీ రనడే గారు మొదట మా ప్రతిపాదనను తేలికగా తీసుకున్నారు.

పూనా ప్రజలు తమ సాయంత్రాలను సాధారణంగా పాన్ సుపారీ పార్టీలలో గడపడానికి ఇష్టపడతారు. క్లబ్ స్థాపనకు, యూరోపియన్ తరహాలో క్లబ్‌ను నడపడానికి తగినంత మద్దతు లభిస్తుందా? అని అతను సందేహించారు. నా దురదృష్టం ఏమిటంటే.. క్లబ్ స్థాపనకు నాతో పాటు బయలుదేరిన ఔత్సాహిక సహచరుడు శ్రీ చింతామణి రావు భట్ ప్లేగు వ్యాధితో మరణించారు. అయితే త్వరలోనే పూనా సబర్బన్ జిల్లాలో నివసిస్తున్న కొంతమంది సామాజిక, రాజకీయ పరపతి కలిగిన పార్సీ పెద్ద మనుషులు నాతో చేరినారు. ఈ ఉద్యమం తిరిగి ప్రారంభమై ఊపందుకుందుకున్నది. క్లబ్ స్థాపన ప్రక్రియకు ఒక స్పష్టత వచ్చింది.

క్లబ్ స్థాపన విషయంలో రనడే గారిని మేము మళ్లీ సంప్రదించాము. ఆయన పరపతిని ఉపయోగించుకొని హీరా బాగ్ కమిటీ ద్వారా క్లబ్ ఏర్పాటు కోసం ఆ భవనాన్ని పొందాము. నేను క్లబ్ నియమ నిబంధనలు, లక్ష్యాలను వివరించే ఒక కరపత్రాన్ని రూపొందించి అందరికీ పంపిణీ చేసాను. క్లబ్ నిర్వహణకు అయ్యే ఖర్చును అంచనా వేసాను. ఇద్దరు పెద్దమనుషులు.. ఒకరు శ్రీ నారాయణ్ భాయ్ దండేకర్, రిటైర్డ్ డైరెక్టర్, బేరార్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్, మరొకరు, ఖాన్ బహదూర్ దిన్షా డి. ఖంబట్టా, పూనాలో ఉన్న సైనిక సేవలతో సంబంధం కలిగి ఉన్న పార్సీ పెద్దమనిషి.. ఈ ఇద్దరూ నాతో చేరడానికి అంగీకరించారు. నాతో పాటు క్లబ్‌కు సంయుక్త కార్యదర్శులు అయ్యారు. మేము క్లబ్ ఏర్పాటుకు సంబందించి సన్నాహాల్లో చురుకుగా వ్యవహరించసాగాము. 17 నవంబర్ 1891న క్లబ్ ప్రారంభ సమావేశం ఉందని పూనాలోని పుర ప్రముఖలందరికి నోటీసును పంపిణీ చేసాము. వారి ప్రతిస్పందనల కోసం కోసం వేచి చూసాము. మేము ఈ సందర్భంగా ‘హీరా బాగ్’ భవనాన్ని మరమ్మత్తులు చేసి సిద్ధం చేసాము. కాని సమావేశం ప్రారంభించే సమయానికి చాలా తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సభ ప్రారంభమైన పదిహేను నిమిషాలకు ఆహ్వానించిన సంఖ్యలో 10 మంది కంటే ఎక్కువ మంది రాలేదు. ఈ సంఖ్యను చూసి నాలో నేను కుంగిపోయాను. కానీ అరగంటలో 25 మంది పుర ప్రముఖులు సభకు విచ్చేసినారు. మొదటి గంట ముగిసే సమయానికి పూనాలోని ప్రముఖ వ్యక్తులలో 60 నుండి 70 మంది వరకు సమావేశంలో పాల్గొన్నారు. ఆ రోజుల్లో ప్రజలు సమావేశాలలో పాల్గొనే విషయంలో సమయపాలన పాటించక పోవడం అసాధారణం ఏమీ కాదు. ఎందుకంటే కొంత మంది ప్రసిద్ధ వక్తలు సమావేశాలలో పాల్గొనడానికి వచ్చారని ముందుగా నిర్ధారించుకున్న తర్వాతనే వారు సభకు తరలి వచ్చేవారు.

గోపాల్ రావు హరి దేశ్‌ముఖ్

క్లబ్ ప్రారంభ సభకు రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి సర్దార్ రావు బహదూర్ గోపాలరావు హరి దేశ్‌ముఖ్ గారు అధ్యక్షత వహించారు. సభలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. వీరిలో బరోడా రిటైర్డ్ దివాన్ ఖాన్ బహదూర్ ఖాజీ షహబుద్దీన్, C.I.E, ఆనాటి ప్రజా నాయకుడు శ్రీ ఎం.జి. రనడే గార్లు కూడా ఉన్నారు. సమావేశంలో శ్రీ. రనడే చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్నిపూనా దినపత్రిక నుండి సేకరించినవి కింద పొందు పరచినాను.

“శ్రీ రనడే ఈ విధంగా పేర్కొన్నారు. ఇంతకు మునుపు పూనాలో క్లబ్‌ను ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆనాడు కొందరు పథకం ప్రకారం తమ కుల నియమ నిబంధనలు నిషేధించిన పనులను చేయించడానికి తమ స్నేహితులు కొందరిని లోబర్చుకొని ఈ పనికి పురికొల్పారని భావించారు. ఆ తర్వాత అతను కొన్ని ఇతర క్లబ్‌లను ప్రస్తావించారు. వాటిలో చేరిన సభ్యులు తమలో తాము కలుసుకున్నారు, క్లబ్ లక్ష్యాలను, నియమ నిబంధనలను చదివారు, చర్చించారు, తీర్మానించుకున్నారు. ఈ క్లబ్‌లన్నీ కూడా లక్షణాల రీత్యా తప్పనిసరిగా యూరోపియన్ తరహా సంస్థలే అయినా స్వదేశీ స్వభావం కలిగిన సంస్థలు అని ఆయన అన్నారు. దక్కన్ క్లబ్ ప్రారంభోత్సవం ద్వారా ఇప్పుడు జరుగుతున్నఈ ఉన్నత స్థాయి ప్రయత్నం స్వాగతించదగిన ఉద్యమం అని అన్నారు.”

క్లబ్ ఉన్న ‘హీరా బాగ్’ భవనానికి సంబంధించి అతను ఈ విధంగా చెప్పాడు:

“వారు ఒక చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ప్రాంగణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1768లో మొదటిది పీష్వా శ్రీరంగపట్నంలో హైదర్ అలీకి వ్యతిరేకంగా పోరాటంలో నిమగ్నమై ఉన్న సమయంలో అతను తన భార్యకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. అతను ఒక మంచి తోటలో తగిన ఇంటిని తన భార్యకు నిర్మించి ఇవ్వాలనుకున్నాడు. అతను విదేశీ యాత్రలకు వెళ్ళినప్పుడు తన భార్య ఈ తోటలో సేద దీరవచ్చు అని భావించాడు. అతను శ్రీరంగపట్నంలో ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని గుర్తుచేసుకుని, దాని గురించి తన మంత్రికి లేఖ వ్రాసాడు. ఆ తర్వాత హీరా బాగ్‌ను నిర్మించారు. ఇల్లు, ఇంటి చుట్టూ ఒక తోటను నిర్మించారు. ఇది ఒక యువరాణి కోసం ఒక యువరాజు ఏర్పాటు చేసిన తోట. అందువల్ల వారు తమ క్లబ్‌కు, శాశ్వత నివాసంగా కాకున్నా, అటువంటి స్థలాన్ని పొందడంలో అదృష్టవంతులు. క్లబ్‌కు అతి త్వరలోనే మరింత సౌకర్యవంతంగా ఉండే స్థలాన్ని పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. క్లబ్ గౌరవ కార్యదర్శుల కృషికి కృతజ్ఞతలు తెలిపినారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వేశ్వరాయను ప్రత్యేకంగా అభినందించారు శ్రీ రనడె.” – (ది డైలీ టెలిగ్రాఫ్, డెక్కన్ హెరాల్డ్, పూనా, నవంబర్ 19, 1891.)

ప్రముఖ పార్సీ వ్యాపారవేత్త సర్దార్ దొరాబ్జీ పదమ్జీ క్లబ్ కు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. శ్రీ రనడే, శ్రీ గోఖలే గార్లు మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

ప్రభుత్వం నన్ను1894లో సింధ్ లోని సుక్కూర్‌కు బదిలీ చేసేంత వరకు జాయింట్ సెక్రటరీలలో ఒకరిగా నేను క్లబ్ కార్యకలాపాలను చూసుకున్నాను. క్లబ్ నిర్వహణ బాధ్యతలు నెరవేర్చాను. నా బదిలీ సంగతి తెలిసిన క్లబ్ సబ్యులు నేను సుక్కూర్‌కి బయలుదేరడానికి ముందు నాకు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. వారి ఫోటోలతో కూడిన ఆల్బమ్‌ను క్లబ్కు సేవల జ్ఞాపికగా నాకు బాహుకరించారు.

1891లో ప్రారంభమైన క్లబ్ నవంబర్ 1941లో 50 ఏళ్లకు స్వర్ణోత్సవాలను జరుపుకుంది. క్లబ్ గౌరవ సభ్యుడిగా, పూనాలోని ప్రముఖ పౌరులు హాజరైన ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. చెప్పుకోదగిన అభివృద్ది ఏమీ లేనప్పటికీ, క్లబ్ నేటికీ పని చేస్తుండడం విశేషం. 50 సంవత్సరాలుగా దాని సభ్యులకు క్రీడా వినోదాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తున్నది. క్లబ్ ప్రారంభమైన అదే ‘హీరా బాగ్’ భవనంలోనే ఇప్పటికీ కొనసాగుతున్నది.

జపాన్ పర్యటన తర్వాత 1898 సంవత్సరం ద్వితీయార్ధంలో నేను బొంబాయికి తిరిగి వచ్చాను. ఒక సాయంత్రం శ్రీ ఎం.జి.రనడే గారు నన్ను భోజనానికి ఆహ్వానించారు. అప్పటికి వారు హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి ఎదిగి బొంబాయిలో నివాసం ఉండేవారు. మేము జపాన్‌లో పురోగతి గురించి ప్రధానంగా మాట్లాడుకున్నాము. మా సమావేశం ముగిసి నేను బయలుదేరినప్పుడు శ్రీ రనడే గారు తన ఇంటి బయటి మెట్ల దాకా వచ్చి నన్ను సాగనంపినారు. దారిలో మేము దాటిన ఒక గదిని చూపిస్తూ అతని స్నేహితుడు, ప్రసిద్ధ విద్యావేత్త, శ్రీ వామన్ అబాజీ మోదక్ గారు అనారోగ్యంతో అక్కడే మంచానికే పరిమితమయ్యాడు అని చెప్పారు. అతను పలికిన ఖచ్చితమైన పదాలు: “ఆ గదిలో నా స్నేహితుడు ఉన్నాడని మీకు తెలుసా? అతను మొత్తం భారతదేశమే బాధపడుతున్న వ్యాధితో బాధపడుతున్నాడు. నేను వివరంగా అన్ని విషయాలు విచారించి తెలుసుకున్నాను.. శ్రీ మోదక్ పక్షవాతంతో బాధపడుతున్నారు.”

పూనాలో సంవత్సరానికి ఒకసారి దర్బార్ నిర్వహించడం ఆనవాయితీ. మహారాష్ట్ర డివిజనల్ జడ్జిగా వ్యవహరించే యూరోపియన్ అధికారి దర్బార్‌కు అధ్యక్షత వహించారు. దీనికి రెండు తరగతుల వ్యక్తులను ఆహ్వానించేవారు. సంస్థానాధీశులు, సర్దార్లు ఒక సమూహంలో; ప్రభుత్వ అధికారులు మరొక సమూహంలో ఉంటారు. ఈ సమావేశాలలో ఒకదానిలో భారత ప్రభుత్వ అధికారులు ఎడమ వరుసలో, సంస్థానాధీశులు, సర్దార్లు కుడి వైపున కూర్చున్నారు. నేను ముందు వరుసలో ఎడమ వైపున శ్రీ రనడే గారి పక్కన కూర్చున్నాను. మేము పెద్దగా ఏమీ చేయకుండా చాలా సేపు ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. శ్రీ రనడే గారు నాకు ఎదురు వరుసలో కూర్చున్న కొందరు సంస్థానాధీశులు, ప్రభువుల చరిత్ర, వారి విచిత్ర స్వభావాలు, వైఫల్యాల గురించి కొన్ని విశేషాలను తెలియజేసారు. అరడజను మంది సంస్థానాధీశులు, సర్దార్ల విచిత్రమైన స్వభావాలు, అలవాట్ల గురించి ఆయన నాకు చెప్పినప్పుడు.. “సామాజిక జీవితంలో మీరు తరచుగా వారిని కలుసుకుంటారా? లేకపోతే వారికి సమబండించిన ఇన్ని వ్యక్తిగత విషయాలు మీకు ఎలా తెలుసు?” అని అడిగాను. అతను “నేను వారి వద్దకు ఎప్పుడూ వెళ్ళను, వారికి ప్రభుత్వంతో ఇబ్బందులు లేదా వారి స్వంత రాష్ట్రాల్లో ఏవైనా జటిలమైన సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు వారే సలహా కోసం నా వద్దకు వస్తారు.” అని జవాబిచ్చాడు. ఇదీ శ్రీ. రనడే గారి వ్యక్తిత్వం. ఎందుకంటే.. ఇంతకు ముందు చెప్పినట్లుగా, అతను మహారాష్ట్ర ప్రజలకు ఒక స్నేహితుడు, తత్వవేత్త, మార్గదర్శకుడి పాత్రను పోషించాడు. అతను గొప్ప దేశభక్తి, రాజీ లేని వైఖరి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన ఒక పెద్దమనిషి. అతని జీవితంలోని చివరి సంవత్సరాల నాటికి భారతదేశం సృష్టించిన గొప్ప నాయకులలో ఒకరిగా అతన్ని పరిగణించారు. ఇది వాస్తవం కూడా.

నేను ప్రభుత్వానికి శానిటరీ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, అప్పుడప్పుడు ప్రత్యేక విధులు, అదనపు పనులు నాకు అప్పగించేవారు. నేను ఆరు నెలల పాటు మూడు సూపరింటెండింగ్ ఇంజనీర్ల విభాగాలకు బాధ్యత వహించానని ఇంతకు ముందు ప్రస్తావించి ఉన్నాను. 1907 సంవత్సరంలో రెండు ముఖ్యమైన రాష్ట్రాలు చీఫ్ ఇంజనీర్ పదవిని స్వీకరించమని నన్ను కోరినాయి. నేను ఈ విషయాన్ని బొంబాయి ప్రభుత్వ ప్రజా పనుల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పుడు వారు నేను బొంబాయి ప్రభుత్వ సర్వీసు నుండి వైదొలగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, నా ప్రయోజనాలను విస్మరిస్తారని నేను భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. చాలా సంవత్సరాలుగా నాకు అప్పగిస్తున్న ప్రత్యేక విధులు, బాధ్యతల కారణంగా నేను పెద్ద సంఖ్యలో సీనియర్ ఇంజనీర్లను అధిగమించిన పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో దాదాపు 18 మంది సీనియర్ ఇంజనీర్లను దాటవేసి నాకు బాధ్యతలు అప్పగించారు. పదోన్నతులు పొందిన ఇద్దరు ముగ్గురు అధికారులను ప్రభుత్వం వారి పూర్వ స్థానాల్లోకి మార్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల కారణంగా వారిలో కొంత అసంతృప్తి ప్రబలిందని కూడా నేను తెలుసుకున్నాను. దేశంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల వలన ప్రభుత్వం నన్ను ఇప్పట్లో చీఫ్ ఇంజనీర్‌గా నియమించే అవకాశం చాలా తక్కువగా ఉందని నేను అనుకున్నాను. నా శాఖలో నా సీనియారిటీకి తగిన విధంగా నాకు పదోన్నతి వచ్చే సమయానికే నన్ను చీఫ్ ఇంజనీర్‌గా నియమించడం జరుగుతుంది. కాబట్టి నేను బొంబాయి ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పదవీ విరమణ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా సెలవు ఇవ్వమని ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. అప్పటి వరకు నాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, నేను అలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలియగానే అధికారిక వర్గాల్లో కొంత ఆశ్చర్యం నెలకొంది. నా శ్రేయోభిలాషులైన స్నేహితులు, యూరోపియన్ ఉన్నత అధికారులలో కూడా కొంతమంది నేను పదవీ విరమణ చేయాలనే ఆలోచనను ఇష్టపడని వారిలో ఉన్నారు. అంతే కాకుండా, నేను ఆనాటికి సర్వీస్‌లో పెన్షన్ పొందడం కోసం పూర్తి అర్హతను పొందలేదు కూడా. కొంతమంది శాఖలో పని చేస్తున్న నా సహచరులు నాకు పెన్షన్ అసలే రాకపోవచ్చనే భయాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ బొంబాయి ప్రభుత్వం చివరికి 6 మార్చి 1908 నాటి లేఖ నెం. 1086 లో నాకు పెన్షన్ మంజూరు చేయాలని సిఫారసు చేస్తూ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖలో రాసిన వాక్యాలు కింద ఉటంకిస్తున్నాను.

శ్రీ విశ్వేశ్వరాయ అందించిన సేవలు ప్రసంశనీయంగా ఉన్నాయి. కనుక ప్రభుత్వానికి అందించిన సేవలకు అతను అదనపు పెన్షన్ పొందడానికి పూర్తిగా అర్హుడు అని కౌన్సిల్‌లో గౌరవ గవర్నర్ గారు పరిగణిస్తున్నారు.

బొంబాయి గవర్నర్ లార్డ్ సిడెన్హామ్

బొంబాయి ప్రభుత్వంలో నా సేవలు ముగిసే వరకు ప్రశంసలు లభించాయి. బొంబాయి ప్రభుత్వం నాకు రాసిన ఒక లేఖ ద్వారా ఈ విషయం స్పష్టం అయ్యింది. 18 జూన్ 1909న బొంబాయి గవర్నర్ లార్డ్ సిడెన్హామ్ నుండి వచ్చిన లేఖలోని ఈ వాక్యాలు కింద ఉటంకిస్తున్నాను.

మీరు ఇంకా ప్రభుత్వ సర్వీస్ కొనసాగి ఉండి ఉంటే, నేను కూడా భారతదేశంలో కొనసాగితే, మీ విలువైన సేవలు పట్ల నా ప్రశంసలను చూపించగలిగే వాడినని అనుకుంటున్నాను. అది నా ఆకాంక్ష కూడా.”

1901లో మీ నియామకం ప్రభావం అలా ఉంది. మీరు చాలా మంది సీనియర్ అధికారులను అధిగమించారు. మీకు ప్రభుత్వం అటువంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం సమంజసమే అని నేను భావిస్తున్నాను

మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీలో ఉన్న గొప్ప శక్తి సామర్థ్యాలు, నిరంతరమైన మీ పరిశ్రమ మీరు భవిష్యత్‌లో నిర్వహించబోయే పదవులకు వన్నె తెస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వ సేవలో ఈనాటి వరకు మీరు పొందిన అనుభవం మీ భావి జీవితానికి ఆలంబనగా నిలుస్తుంది. అందుకు మీరు అదృష్టవంతులని నేను భావిస్తున్నాను.

ఈ ఉటంకింపులతో బొంబాయి ప్రభుత్వంలో నా ఉద్యోగ జీవితపు అనుభవాలను నమోదు చేయడం ముగిసింది.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here