[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు
శ్లో.
కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా।
ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి॥
గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర।
చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యథా రయః॥
స్వప్నేపి యద్యహం వీరం రాఘవం సహలక్ష్మణమ్।
పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరీ॥
నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే దృష్ట్వా హి వానరమ్।
న శక్యోభ్యుదయః ప్రాప్తుం ప్రాప్తశ్చాభ్యుదయో మమ॥
(సుందరకాండ, 34. 6, 19, 21, 22)
‘మానవుడు బ్రతికియున్నచో వంద సంవత్సరములకైనను ఆనందమును పొందగలడు’ అను లోకోక్తి శుభప్రదమైనది అని నాకు తోచుచున్నది. (సీత మాటలు).
ఓ వానరా! నాకు ప్రియమైన రాముని గుణముల గూర్చి తెల్పుము. ప్రవాహ వేగము నదీతటములను హరించి వేయునట్లు దాని వలన నా మనస్తాపమును హరించి వేయుదవు.
కలలోనైనను లక్ష్మణునితో గూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనబడియున్నచో నా పరితాపమంతయును తొలగిపోయి యుండెడిది. నా యెడ స్వప్నమునకు గూడా అసూయయే.
స్వప్నమున వానరుడు కనబడినచో శుభములు కలుగుటకు అవకాశం ఉండును. కానీ నాకు శుభమే కలిగినది. కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను.
శ్లో:
రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా।
రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః॥
అర్చిష్మానర్చితోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః।
సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణామ్॥
(సుందరకాండ, 35. 10, 12)
హనుమంతుడు: సర్వప్రాణులకును సంరక్షకుడు, విశేషముగా తనను ఆశ్రయించిన వారిని పరిరక్షించువాడు, లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతి గలవాడు, ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు.. (శ్రీరాముడు)
కాంతిమంతుడు, సర్వలోకములకును అత్యంత పూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతమును పాటించువాడు, సత్పురుషులొనర్చు ఉపకారములను మరువని వ్యవహార జ్ఞాన సంపన్నుడు, లోక కళ్యాణునకై కర్మలను ఆచరించువాడు. ఇతరులచే ఆచరింపజేయువాడు.
శ్లో:
మాల్యవాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిః।
తతో గచ్ఛతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః॥
స చ దేవర్షిభిర్దిష్టః పితా మమ మహాకపిః।
తీర్థే నదీపతేః పుణ్యే శంబసాదనముద్ధరత్॥
తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి।
హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా॥
(సుందరకాండ, 35. 81, 82, 83)
హనుమంతుడు: ఓ వైదేహీ! ‘మాల్యవంతము’ అను పేరు గల ఒక మహా పర్వతం గలదు. అచట నివసిస్తున్న కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళాడు. శంబసాదనుడు అను రాక్షసుడు సముద్ర తీరమున గల అక్కడి పుణ్యక్షేత్రమున ఉపద్రవములు సృష్టించినందుకు దేవతలు, ఋషులు ప్రార్థింపగా, నా తండ్రి ఐన కేసరి ఆ రాక్షసుని హతమార్చాడు. ఆయన భార్య యగు అంజనాదేవి యందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించాను. నా చర్యలను బట్టి లోకమున నాకు ‘హనుమంతుడు’ అను ఖ్యాతి ఏర్పడినది.
శ్లో:
వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః।
రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకమ్॥
ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా।
సమాశ్వసిహి భద్రం తే క్షీణదుఃఖఫలా హ్యసి॥
(ఇత్యుక్త్వా ప్రదదే తసైన సీతాయై వానరోత్తమః)।
గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుః కరవిభూషణమ్।
భర్తారమివ సంప్రాప్తా జానకీ ముదితాభవత్॥
(సుందరకాండ, 36. 2, 3, 4)
దేవీ! మహా భాగ్యశాలినీ! నేను వానరుడను. ప్రజ్ఞాశాలియైన శ్రీరాముని దూతను, శ్రీరామ నామాంకితమైన ఈ ఉంగరమును చూడుము.
నాపై నీకు విశ్వాసము కుదురుకొనుటకై మహాత్ముడైన శ్రీరాముడు దీనిని ఇవ్వగా నేను తీసుకొని వచ్చితిని.
ఊరడిల్లుము, దుఃఖములన్నియు తొలగి, నీకు శుభములు కలుగును.
ఆ కపివరుడు ఇట్లు పలికి, సీతాదేవికి ఆ అంగుళీయకమును సమర్పించెను. సీతాదేవి తన భర్త కరస్పర్శకు నోచుకొనిన ఆ అంగుళ్యాభరణమును గ్రహించి, దానిని పరికించి చూచుచు, భర్తను పొందిన దానివలె మహానందభరితురాలయ్యెను.
శ్లో:
కచ్చిన్న వ్యథితో రామః కచ్చిన్న పరితప్యతే।
ఉత్తరాణి చ కార్యాణి కురుతే పురుషోత్తమః॥
కచ్చిన్న దీన స్సంభ్రాంతః కార్యేషు చ న ముహ్యతి।
కచ్చిత్ పురుషకార్యాణి కురుతే నృపతేస్సుతః॥
ద్వివిధం త్రివిధోపాయమ్ ఉపాయమపి సేవతే।
విజిగీషుస్సుహృత్ కచ్చిత్ మిత్రేషు చ పరంతపః॥
(సుందరకాండ, 36. 15, 16, 17)
సీతాదేవి: శ్రీరాముడు వ్యథకు గురియగుట లేదు గదా? పరితపించుట లేదు గదా? ఆ పురుషోత్తముడు నన్ను పొందుటకై చేయవలసిన కార్యములకు సన్నద్ధమగుచున్నాడా?
రాజకుమారుడైన శ్రీరాముడు నిస్పృహకు, భ్రాంతికి లోనై, అన్యమనస్కుడై, పనులలో పొరపడుట లేదు గదా! ఆయన ప్రయత్నశీలుడై కార్యములను ఆచరించుచున్నాడా?
శత్రుభయంకరుడైన శ్రీరాముడు మిత్రుల విషయమున సౌహార్ద్రముతో సామ దాన ఉపాయములను, శత్రువుల విషయమున జయేచ్ఛతో దాన, బేధ, దండోపాయములను అవలంబించుచున్నాడా?
శ్లో:
న మాంసం రాఘవో భుంక్తే న చాపి మధు సేవతే।
వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమమ్॥
నైవ దంశాన్ న మశకాన్ న కీటాన్ న సరీసృపాన్।
రాఘవో పనయేద్గాత్రాత్ త్వద్గతేనాంతరాత్మనా॥
నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణః।
నాన్యచ్చింతయతే కించిత్ సతు కామవశం గతః॥
అనిద్రస్సతతం రామః సుప్తోపి చ నరోత్తమః।
సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే॥
దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వాన్యత్ సుమనోహరమ్।
బహుశో హా ప్రియేత్యేవం శ్వసంస్త్వామభిభాషతే॥
స దేవి నిత్యం పరితప్యమానః త్వామేవ సీతేత్యభిభాషమాణః।
ధృతవ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృతప్రయత్నః॥
సా రామసంకీర్తనవీతశోకా రామస్య శోకేన సమానశోకా।
శరన్ముఖే సాంబుదశేషచంద్రా నిశేవ వైదేహసుతా బభూవ॥
(సుందరకాండ, 36. 41-47)
హనుమంతుడు: శ్రీరాముడు ఎన్నడూ మద్యమాంసములను ముట్టడు. వనవాసులైన వానప్రస్థులకు విహితములైన స్వాత్వికములైన వన్యఫలములను, కందమూలములను, ఐదు భాగములుగా జేసి, వాటిలో ఐదవ భాగమును ప్రతిదినము శరీర ధారణ నిమిత్తం తగినంత మాత్రమే భుజించును.
నీ మీదనే మనసు లగ్నమొనర్చి, తదన్యమును మరచిన శ్రీరాముడు తన శరీరముపై వ్రాలెడి అడవి ఈగలను, దోమలను, తిరుగాడెడి పురుగులను, పాములను సైతము ఏ మాత్రము పట్టించుకొనడు.
నరోత్తముడైన శ్రీరాముడు ఎల్లప్పుడును నీ ధ్యాసలోనే మునిగి, శోకాకులుడై యుండును, నిన్ను జేరు కోరికతో ఇక దేనిని గూర్చియు ఏ మాత్రము ఆలోచింపడు.
శ్రీరాముడు నిద్రనే ఎరుగడు, ఎప్పుడైనను ఒక కునుకు వచ్చినచో ‘సీతా! సీతా!’ అను మధుర వచనముల పలవరింతలతో ఉలికిపడి లేచును.
ఏదైనా ఒక ఫలమును గాని, పుష్పమును గాని, మనోహరమైన మరియొక వస్తువును గాని చూచినప్పుడు, ‘ప్రియా! ప్రియా!’ అని బహు విధముల పలుకుచు నిట్టూర్పులను విడుస్తాడు.
శ్రీరాముడు నీ కొరకై పరితపిస్తున్నాడు. అతను కఠిన నియమములను పాటిస్తూ నిన్ను పొందుటకే ప్రయత్నిస్తున్నాడు.
శ్రీరాముని గుణ సంకీర్తన శ్రవణ ప్రభావమున వైదేహి శోకము తొలగిపోయెను. కానీ శ్రీరాముడు శోకమగ్నుడైన విషయములను విని ఆమెయు శోకమగ్నమయ్యెను. శరత్కాల ప్రారంభమున మేఘములచే కప్పబడిన చంద్రుడు ఆహ్లాదకరుడై ప్రకాశించునట్లు సీతాదేవి శ్రీరాముని గుణ సంకీర్తన వినినంతనే ప్రసన్నమైన ముఖముతో శరత్కాల రాత్రి వలె శోభిల్లుచుండెను. సీతాదేవి స్థితియు శరత్కాల రాత్రి వలె ఒప్పుచుండెను.
శ్లో:
యది నోత్సహసే యాతుం మయా సార్థమనిందితే।
అభిజ్ఞానం ప్రయచ్ఛ త్వం జానీయాద్రాఘవో హి యత్॥
ఇదం శ్రేష్ఠమభిజ్ఞానం బ్రూయః త్వం తు మమ ప్రియమ్।
శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా॥
మత్కృతే కాకమాత్రే తు బ్రహ్మాస్త్రం సముదీరితమ్।
కస్మాద్యో మహరేత్ త్వత్తః క్షమసే తం మహీపతే॥
స కురుష్వ మహోత్సాహః కృపాం మయి నరర్షభ।
త్వయా నాథవతీ నాథ హ్యనాథా ఇవ దృశ్యతే॥
ఆనృశంస్యం పరో ధర్మః త్వత్త ఏవ మయా శ్రుతమ్।
జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలమ్॥
అపారపారమక్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమమ్।
భర్తారం ససముద్రాయా ధరణ్యా వాసవోపమమ్॥
ఏవమస్త్రవిదాం శ్రేష్ఠః సత్యవాన్ బలవానపి।
కిమర్థమస్త్రం రక్షస్సు న యోజయసి రాఘవ॥
(సుందరకాండ, 38. 10, 12, 38-42)
హనుమంతుడు: ఓ పూజ్యురాలా! నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానితో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా ఒక ‘ఆనవాలు’ను దయతో ప్రసాదింపుము.
సీతాదేవి: నా స్వామికి గుర్తుగా శ్రేష్ఠమైన ఈ కథను తెలుపుము.. (కాకాసుర వృత్తాంతం చెప్పిన తరువాత)
..నా కొరకై ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ఓ స్వామీ! నన్ను అపహరించిన ఈ రావణుని హతమార్చక ఉపేక్షించుటకు కారణం ఏంటి?
ఓ ప్రాణనాథా! నీవు మహాపురుషుడవు, మిక్కిలి ఉత్సాహా శక్తి కలవాడవు. ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కులేని దానివలె పడియున్నది. నాపై కనికరము జూపుము.
‘దీనులపై కరుణ జూపుట పరమ ధర్మము’ అని నీవే నాకు చెప్పియున్నావు. నీ పరాక్రమ వైభవమును, మహోత్సాహ శక్తిని, మహాబల సంపదను నేను ఎరుగుదును.
నీ గుణములు, కర్మములు అనంతములు. ఊహకు అందవు. నిన్నెవరూ క్షోభ పెట్టలేరు. గాంభీర్యంలో సముద్రుడవు. సముద్రములే హద్దులుగా గల ఈ విశాల భూమండలమునకు ప్రభుడవు. ఐశ్వర్యములో దేవేంద్రుడవు.
అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడవు. సత్యపరాక్రముడవు. మహాబలశాలివి. ఐనప్పటికీ రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుట లేదు?
~
సీతాదేవిని బాలయే గాక, బేలగా కూడా చెప్పాడు మహర్షి. అటు కాకిని ఆమె పట్టించుకోలేదు. అయినా ఆమె కోసం బ్రహ్మాస్త్రం సంధించాడు శ్రీరాముడు. ‘దీనులపై కరుణ జూపుట..’ మరి నేను ‘హ్యనాథా’ ఇవ – ఇలా దీనురాలినై ఉండగా – ఎందుకు కరుణ చూపుట లేదు అన్నది సంఘటనల పోలికలో నున్న గొప్ప అంశం.
(ఆ వాయసం మీద ఆమె కరుణ జూపినది – ఆమె ఇలా దీనురాలైనప్పుడు ఎందుకు కరుణ కల్గటం లేదన్నది మరో ప్రశ్న!)
శ్లో:
స భూయస్త్వం సముత్సాహే చోదితో హరిసత్తమ।
అస్మిన్ కార్యసమారంభే ప్రచింతయ యదుత్తరమ్॥
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ।
హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ॥
(సుందరకాండ, 39. 3, 4)
సీతాదేవి: ఓ కపివరా! మరల ఉత్సాహము పొందినవాడవై, ఈ కార్యసిద్ధికి అనంతర కర్తవ్యమును ఆలోచించు. ఈ కార్యనిర్వహణకు నీవే తగిన వాడవు. ఓ మారుతీ! నడుము బిగించి, నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము.
(ఇంకా ఉంది)