కుసుమ వేదన-14

0
3

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

తృతీయాశ్వాసము – ఎనిమిదవ భాగము

తే.గీ.॥
యిటుల యనుదిన మంతయు వేచి చూచి
వేగివేసారి నిదురయు వేగ రాక
యింటి వెలుపల కేతెంచి వీధియందు
నిలచి యాకాశమును చూసె నిక్కి నిక్కి. (259)

సీ॥
జాబిల్లి యావేళ ఝాముల మబ్బుల
చాటున నిలుచుండె జక్కగాను
కోమలి తారకై కొల్లగా వేసారి
నెచ్చెలి కౌగిలిన్ ఎంచి మదిని
తార సైతము గాన తరము గాక శశియు
తారకలను గూడి తనివిదీర
దోబూచులాడుచున్ దూరుపు వీధులన్
గాలించి పశ్చిమ కరుగ సాగె

తే.గీ.॥
ఎన్ని రాత్రులు వేచిన నేమి ఫలము
కన్నుదోయికి నిండుగా కానరాదె!
అయిన రాదేల యా తార అందముగను
వేగిపోయెనె చంద్రుండు విరహ బాధ. (260)

తే.గీ.॥
ఇప్పుడు మన బాలరాజుకు నిట్టి బాధ
కలిగె నెవరేమి జేతురు; కరుణ లేక
ఆగమించె నాషాడ మాసంబు నవని
లోన; నూతన జంటకున్ రొఖ్ఖమిదియె. (261)

చం.॥
దినము ఘణించుచున్ మనసు దీనముగానట వేచి జూచుచున్
అనయము మానినిన్ మదిని యాతృత తోడుత నెంచి చూసియున్
కనుగొన మాసమింక యును గడ్వదె యేమి విచిత్రమంచు; నా
పనిబడి బాలరాజును యుపాయ మెరుంగక పాటు నొందగన్. (262)

తే.గీ.॥
అటుల యోచుంచు చుండగ నాగమించె
శ్రావణంబును యవనిపై సాగి వచ్చె
ఎంత యానంద మంచును యపుడు వారు
కలుసు కొనగోరె దంపతుల్ కలత లేక. (263)

అన్యోన్య కాపురము

సీ॥
అన్యోన్యమౌ రీతి యా జంట; సంసార
సాగరం బందునన్ సరిగ మునిగి
చీకు చింతను లేక శృంగార జీవితం
బందున యప్పుడున్ బాగు నిలిచి
యౌవనం బంతయున్ ఆత్రంబుతో గూడి
యనుభవించెను గదా యట్టి వేళ
ఒకరి నడిచియు మరియొక రుండజాలరు
పురమందు జాలరుల్ పులకరించ

తే.గీ.॥
గడిపె సంసార బంధంబు గట్టిగాను
నడిపె కాపురం బంతయున్ నాణ్యముగను
చూచు వారల కానంద శోభ గూర్చు
కనుల కనిపించె వారల కాపురంబు. (264)

ఉ.॥
కొన్ని వసంతముల్ భువిని కొల్లగ సాగెను వారి జీవితం
బన్ని విధంబులన్ సుఖము బాగుగ నొందిరి వారి కప్పుడున్
చిన్ని సుతుండు గర్భమున చెన్నుగ వృద్ధిని బొందు చుండగన్
విన్నటువంటి వారలును వేడుక మీరగ సంతసించిరే. (265)

చం.॥
తన సతి గర్భవాసమున తప్పక పుత్రుడె జన్మనొందుటన్
వినయము బెంపు జేసి మరి వీధుల యందున దిప్పకుండ; తన్
మునుకొని శ్రద్ధ చేకొనియు ముందుగ విద్యల నభ్యసించగన్
అనయము గొప్ప పౌరుని తదాశయమొప్పగ దీర్చిదిద్దగన్. (266)

ఉ.॥
కాదు మదీయ గర్భమున ఖచ్చిత మౌనిల నాడుబిడ్డయే
మేధిని లోపలన్ నిజము మెచ్చెడి రీతిని రూపు దిద్దగన్
మోదము గూర్చె నా మనము మోసము లేదిక నమ్ముడింక; నే
వాదము సల్పెదన్ వసుధ వైనము తోడుత జర్గునిద్దరిన్. (267)

ఉ.॥
కాదని వాదమేల నిట కాలము దెల్పును యిట్టి భేదముల్
మోదము తోడుతన్ తనయు మోమును గాంతుము వేచి యుండికన్
వాదము లేలనే వనజవై; ధరయందున వేచియుండుమీ
వేదన నొందకుండ భువి యీ విధ గోచరమయ్యె నమ్మికన్. (268)

తే.గీ.॥
ఇటుల దంపతులిర్వురు అటుల బల్కు
కొనుచు కాలంబు గడిపిరి కోర్కెదీర
కడకు కుసుమాంబ ప్రసవంపు కాలమయ్యె
మగ సుతుండును బ్రసవించె మగత నందు. (269)

తే.గీ.॥
బాలుడైనట్టి యా పసి బాలకుడిని
ప్రేమ మీరగ యందరు బెంచిరపుడు
పెరిగె బాలుండు వేగమె పేర్మి మీర
ఏడు వర్షంబు మించిన యీడు వరకు. (270)

తే.గీ.॥
వారికింకను మరు కాన్పు వాస్తవముగ
రాదెయేమిటి యంచును లక్షణముగ
కలిగియున్నట్టి కొమరుని కామితమున
బెంచి బెద్దగ చేసిరి యంచితముగ. (271)

చం.॥
అతియగు ఎండ నుండి ధరయంతయు శీతల మొందగా ధరన్
కుతియను కాంక్ష చేది విని కూర్మి శిరంబుల నెత్తి జూచుచున్
వెతలను దీర్చువానలిక వేగమె రమ్మని వేడుకొంచు; నీ
గతినెడ బాయుమింకయని దగ్దద వాక్కుల వేడెనీ ధరన్. (272)

ఉ.॥
మండెడి యెండ బారి పడి మాడక గాయుము వానదేవ; నీ
మెండు కృపారసంబును మమేకము జేయుము మానవాళికిన్
దండిగ నిన్ను దల్తుమిక ధారుణి యందున కాటకంబులన్
మొండుగ పారదోలియును మోదము గూర్పవె; నీకు మ్రొక్కెదన్. (273)

ఉ.॥
బాధల జూడవే పుడమి బాధిత సంఘము చూసి రాగదే
కాదనకుండ నీవు భువి కన్నిట దిక్కుగ నిల్చియుండదవే
ఆ దినమందు నుండి మరి ఆజ్ఞను మీరక మేలు సల్పు; నీ
వీ దినమందునన్ మదికి విందును గూర్చవె; స్వాగతించెదన్. (274)

ఉ.॥
యింతటి బాధలన్ పడిన యీ భువి నుండెడి మానవాళికిన్
సుంత మనస్సు దోచెగద శోభితమై చెలువొందు వాన; యీ
యింతిని చేరవచ్చె భువి యిక్కట పాల్బడకుండ జేయుమా
అంతయు బాగు చేయగను ఆగమయ్యెడి వాన కాలమున్. (275)

తే.గీ.॥
అటుల లోకంబు బ్రార్థింప పటుతరముగ
మొరల నాలించెనో యేమొ వరుణ విభుడు
గుమ్మరించగ బూనెను గుణవిభుండు
దనివి దీరగ తాగెను ధరణి యపుడు. (276)

కం.॥
చిటపటమని చినుకులు ధర
తటపటయని భువిని జేరి తాండవమాడెన్
ఇటు జగమున జలబిందువు
తటికిని జేరను పరుగిడె తత్తరపడుచున్. (277)

కం.॥
ఎండకు నెండిన బతుకులు
మండల దీక్ష గను వాన మనసున గోరన్
దండిగ వానలు కురియగ
ఎండిన బతుకులు చిగురులు వేయగ బూనెన్. (278)

సీ॥
పశ్చిమోత్తర మధ్య ప్రాంతంబు నందున
మొగుల సంచయమది మోహరించె
అటునుండి కదలెను అన్ని దిక్కుల వేపు
మందగమన బోలు మధుర నడక
తోడ సాగెను తొల్త తూరుపు దిక్కుగా
మరల సాగెను కదా మారుదిక్కు
మదకరి ఘీంకారమౌ ఘాటు శబ్దముల్
భీకరంబున సాగె భీతి గొల్ప

తే.గీ.॥
నటుల నరుగుచు మేఘుండు యంతలోనె
కరగి తుంపర దేహముల్; కరుణ తోడ
అవనిపై గుమ్మరించగ నార్తి తోడ
పుడమి దాహార్తి పోకార్చి పులకరించ. (279)

శా.॥
జీమూతంబులు గుంపుగా కదలి రాజీ సూత్రమున్ లేకనూ
ఏ మాత్రంబును తగ్గలేదనుచు యాయీ మేఘముల్ గూడనూ
భూమిన్ పాడియు పాడిరాదనగ యీ భూమండలంబున్ సదా
కామంబుల్ నెటులైన దీర్చగలనే కామందు నంచున్ ధరన్. (280)

ఉ.॥
ఎండిన మట్టి బెడ్డ మురిపెంబుగ మారె జలంబు గ్రోలగన్
పండిన యాకులున్ విడిచి పండుగ దీరుగ క్రొత్త శోభలన్
మెండుగ దాల్చెనా తరువు మేధిని యందున యుక్త భామయె
ఉండె వసంత కాలమున మోదము తోడుత ద్వారమేర్పడన్. (281)

ఆశ్వాసాంత గద్యము:

ఇతి శ్రీ మద్వల్లంద్ర రాజవంశ రాకా సుధాకర విరాజిత కీర్తి కాంతాసముపార్జితులౌ, పట్టపు మత్స్యకార్వర్గ, ఆవలాన్వయ సంభూతులౌ, శ్రీ సీతలాంబా ఉపాసిత శ్రీ మస్తానయ్య కుమార రత్నంబగు, సహజ కవీంద్రులై వెలయు, శ్రీ వెంకట రమణ కవీంద్రుని విరచితంబగు కుసుమ వేదనా కావ్యము తృతీయాశ్వాసము సర్వమూ సమాప్తము.

(సశేషం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here