కలవల కబుర్లు-15

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]ఈ [/dropcap]కబుర్లు ఇప్పటివి కాదండీ!

కరోనా కాలం నాటివి. ఇంచు మించు ఏడాది పైగానే.. ఇంట్లో అరెస్టు అయిపోయాము కదూ! అదో కొత్త జీవితం. ఎప్పుడూ కూడా కనలేదు. వినలేదు.

ఎలా గడిపామో.. తలుచుకుంటేనే శరీరం జలదరిస్తోంది. మొదటి వేవ్‌లో.. పేపర్లలో చదవడం, టీవీల్లో చూడడం అంతవరకు మాత్రమే.. తర్వాత తర్వాత రెండో వేవ్,  సునామీలాగే ముంచెత్తింది కదూ!  ఇళ్ళకి ఇళ్లు.. ఎంతమందో బలయిపోయారు.

ఆ రోజుల్లో.. ఎక్కడకీ వెళ్ళేది లేదు. ఇంటి పట్టునే.. వండుకోవడం.. తినడం.. ఇదే పని.

ఎక్కడెక్కడి బంధువులూ గుర్తొచ్చేసేవారు. అందరినీ కూడగట్టుకుని, వాట్స్ అప్ గ్రూపులు పెట్టుకుని, ఎప్పుడూ ముఖాముఖాలు చూసుకోని.. చుట్టాలు కూడా.. వరసలు కలిపేసుకుని.. మెసేజుల మీద మెసేజులు. కరోనా తగ్గగానే కలుసుకుందామంటూ కబుర్లు చెప్పేసుకునేవారు.

ఇళ్ళల్లో కూర్చుని ఆటలు, పాటలు, హౌసీలు.. టెక్నాలజీని ఎంతలా వాడుకోవచ్చో.. అంతకి మించి వాడేసుకుంటూ.. ఆడేసుకునేవారు.

జాం జాం అంటూ.. జూమ్ మీటింగులూ.. వర్క్ ఫ్రం హోములూ.. ఒకటి కాదు.. రకరకాలు.

ఇంటిల్లిపాదికి చేసి పెట్టలేక ఇల్లాళ్ళ అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు.

అలాంటి సమయంలోనే..

మా ఊళ్లో నాకు పరిచయమున్న పెట్రోల్ బంకావిడ గుర్తొచ్చారు.. పెట్రోలు బంకావిడంటే.. ఆ బంకులో ఆవిడ లారీలకి.. కారులకి పంపు పట్టి పెట్రోలు పోసే ఆవిడ కాదు. వాళ్ళాయన ఆ బంకులో మేనేజర్.. బంకు వెనకే వాళ్ళిల్లు ఉండేది.. ఆవిడ పేరేంటో మేము ఎప్పుడూ అడగలేదు.. తెలుసుకుందామని కూడా అనుకోలేదు.. కొంతమందికి ఇలాంటి పేర్లే స్ధిరనామాలయిపోతూంటాయి.. ఆవిడ భర్త అక్కడ మేనేజర్ కాబట్టి ఆవిడ పేరు పెట్రోలు బంకావిడే.. అంతే.. భలే కబుర్లు చెపుతూ ఉండేది. బాగా సీనియర్ కాబట్టి పండంటి కాపురానికి పదహారు వందల సూత్రాలు చెపుతూ ఉండేది. జూనియర్లం నోరు తెరుచుకుని వింటూండేవాళ్ళం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. ఏంటో..

ఇంతకీ ఎందుకు గుర్తొచ్చిందంటే.. “వంటయిందా.. పిన్నిగారూ?”  అని అడిగితే చాలు.. దీర్ఘం తీసుకుంటూ.. చేయి గాలిలో తిప్పుకుంటూ.. “ఆ!  ఎంతసేపమ్మా?  అదో వంట కూడానా? తిప్పి తిప్పి అరగంటలో అయిపోదూ!  ఎటు తిరిగీ కాస్త ముందుగా కూరలు తరిగేసుకుని,  అన్నీ రెడీగా ఉంచుకుంటే..  అరగంటంటే అరగంటే..” అంటూ గంట కొట్టినట్టే చెప్పేది. చిన్న చిన్న వంటలూ,  చురుగ్గా చేసేసుకునేవీ, కూరలు లేకపోయినట్లయితే.. ఇంట్లో ఉండేవాటితోనే ఎలా వండేయాలో.. చిట్కాలు చెప్పేదావిడ. కషాయాలు, పోపుల  పెట్టెలో వుండే దినుసుల వాడకాలు, వాటి గొప్పతనాలు అప్పుడే చెప్పారు. వింటే కదూ!

ఆ వంటేదో కానీ సరిగ్గా అరగంటలోనే అయిపోతోంది.. ఇదివరలా పొద్దున్నే పనిమనిషి కోసం ఇంట్లోకి, గేటు దగ్గరకి పదహారుసార్లు తిరగడం ఇప్పుడు లేదు.. తీరా ఎదురు చూసీ.. చూసీ.. కన్నులు కాయలు కాచి పండయ్యే సమయానికి.. రాననే కబురు రావడం.. దేవుడికి చదివినా చదవకపోయినా.. పనిమనిషిని మాత్రం అష్టోత్తర.. ఓపికుంటే సహస్రనామ స్తోత్రం చేసుకుంటూ.. బారెడు పొద్దెక్కాక.. బరబరా చీపురు పట్టుకుని ఊడవడం.. లాంటివి ఇప్పుడు లేవు.. ఎంచక్కా పొద్దున్నే చీకటితోనే వీధి గుమ్మం ముగ్గుతో కళకళలాడిపోతోంది. ఒక్కసారి కళ్ళారా ఆ ముగ్గు చూసుకుని.. భారంగా నిట్టూర్చి.. వీధి తలుపు మూసేస్తే.. మళ్లీ మర్నాడు పొద్దున ముగ్గు టైముకే తీయడం.. అదీ.. ముగ్గు కోసమే.. ఆ తర్వాత అసంకల్పిత ప్రతీకార చర్యలాగా.. అంట్లు తోముకోవడం, గదులు తుడుచుకోవడం, బట్టల పని చూసేయడం.. ఆటోమేటిక్‌గా టిఫిన్‌లూ.. వెను వెంటనే వంటలూ.. అక్కడ వంటలూ అంటే.. ఏవేవో అనేసుకోకండి.. జాగ్రత్తగా చూసి చూసి.. కోసుకుంటూ కూరలనీ.. ఆచితూచి వాడుకుంటూ.. వంటదినుసులనీ.. ఆకు ఆకు పదిలంగా ఒలుచుకుంటూ.. తోటకూరనీ.. సాధ్యమైనంత వరకూ ఎంత పొదుపు చేయగలమో అంత పొదుపు చేసుకుంటూ.. చేసే వంట సరిగ్గా అరగంటే.. కాదంటారా?  ఇదివరలో ఆకుకూరలు తాజాగా ఉన్నాయని ఆబగా రకానికో రెండు కట్టలు తెచ్చేసి.. ఆ మెంతాకు, పుదీనాలు ఒలవడానికి వళ్ళు బధ్ధకమై.. రెండు రోజుల తర్వాత వాడిపోయిన ఆకుని.. ఆ పళంగా చెత్త బుట్టలో వేసిన సంఘటన గుర్తొచ్చి ఇప్పుడు ఒళ్ళు జలదరించింది. ఇప్పుడు తెలిసొస్తోంది.. మెంతాకూ, చింతాకూ  కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ఇప్పుడు వేపాకు పచ్చడే గతవుతుందని తెలిసొస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదేనేమో..

పాలపేకెట్లూ.. ఆన్‌లైన్‌లో వచ్చిన కూరలనీ కడిగీ కడిగీ.. రెండు చేతులూ శానిటైజర్‌తో రుద్దీ రుద్దీ.. జారిపోయే మాస్కులని పైకి లాగీ లాగీ.. ఏంటో ఆ రోజులు భయం భయంగా.. దిన దిన గండం నూరేళ్ళాయుష్షు లాగా ఎలా గడిపామో? తలుచుకుంటేనే గుండె దడదడలాడుతోంది.

రహదారుల వెంబడి, రక్తమోడు పాదాలతో, పెట్టేబేడా నెత్తిన పెట్టి, పెళ్ళాం పిల్లలతో.. బతికుంటే బలుసాకు తినవచ్చుననుకుంటూ.. సొంత వూరికి, వేలకి వేల మైళ్ళ దూరం.. భారంగా నడుస్తూ.. నడుమ రాలిపోతూ వెళ్లే జీవులని తలుచుకుంటే ఇప్పటికీ ఆగవు కన్నీళ్లు.

చెట్టుకొకరు, పుట్టకొకరు.. వీడిపోయిన జంటలు.. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమలు నోచుకోని పిల్లలు.. ఒకరికొకరు ఏమీకాని, ఏమీ లేని వారైపోయారు. కిటకిటలాడే ఆసుపత్రులు, రోగంతో ఆడుకునే వైద్య శిఖామణులు, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా పీల్చి పిప్పి చేసేసిన మహమ్మారి.. గుర్తు చేసుకుంటే చాలు వెన్నులో వణుకు వస్తుంది.

ఇవి అప్పటి కరోనా కబుర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here