నూతన లఘు కవితా ప్రక్రియ ‘సప్తపది’- పోటీ విజేతలు

0
2

[dropcap]రి[/dropcap]కార్డు స్థాయిలో పరివ్యాప్తమవుతున్న సుధామ సృజనకర్త అయిన నూతన లఘు కవితా ప్రక్రియ ‘సప్తపది’.

‘సప్తపది’ పేరిట ప్రముఖ కవి, సాహితీవేత్త సుధామ సరి కొత్త లఘుకవితా ప్రక్రియ నిర్మించారు. సప్తపది అంటే మొత్తం ఏడు పదాలతో రూపొందే లఘు కవిత అన్నమాట. వస్తువు ఏదయినా కావచ్చు. అనుభూతీ, సామాజిక అంశం ఏదయినా సప్తపదిగా సంతరించవచ్చు. కవిత మొత్తం మూడు లైన్లు మొదటి రెండు లైన్లలో ఒక్కొక్క పదమే వుంటుంది. ఆ రెండు పదాలు కూడా అంత్య ప్రాసతో ఉండాలి. మూడవ లైన్‌లో ఆ రెండుపదాలను సమన్వయ పరిచే అనుభూతియో, సామాజిక వ్యాఖ్యయో కవితాత్మకంగా అయిదుపదాలలో వుంటూ లఘుకవిత రూపొందాలి. అంతేకాదు! మూడవ లైన్‌లో అయిదవదైన చివరి పదం మొదటి రెండవ లైన్లలోని పదాల అంత్యప్రాస తోనే తప్పనిసరిగా ముగియాలి. ఏదయినా పదం సమాసపదం అయినప్పుడు దానిని రెండుగా విడగొట్టి  పదాల సంఖ్యను ఏడుగా సప్తపది లఘు కవితలో సరిపెట్టకూడదు.

సుధామ సంతరించిన ఉదాహరణాత్మక సప్తపదులు

(1)
నడక
పడక
వ్యాయామానికీ విశ్రాంతికీ లోటేమరి
అవి కుదరక
~
(2)
కాఫీ
సాఫీ
ఉదయం గొంతులో పడ్డాకే
నిరుత్సాహం మాఫీ
~
(3)
బడి
గుడి
బాల్యం నుండి వృద్ధాప్యానికి సాగు
నడవడి
~
(4)
వలపు
వగపు
ఆమె పురస్కార తిరస్కారాల బతుకు
మలుపు
~
(5)
పాపాయి
సిపాయి
ఇంటికీ దేశానికీ వారి ఉనికివల్లే
హాయి
~
(6)
కవిత
నవత
చేపట్టినప్పుడే పురోగామిస్తుంది నేటి
యువత భవిత
~
(7)
క్రియ
ప్రక్రియ
రెండూ కొత్తవి సృజించిన వారికి
షుక్రియా!

~

ఈ లఘు కవితా ప్రక్రియ 2023 ఏప్రిల్ 16 న ‘ఓ సారి చూడండి.. అంతే’ వాట్సాప్ ప్రసారసంచికలో ప్రకటింపబడి సప్తపదులను ఆహ్వానించగా ఒక్కరోజు గడువులోనే 95 మంది ఈ లఘు రూప కవితా ప్రక్రియ చేపట్టి 600కు పైగా సప్తపది కవితలు రాయడం సాహిత్య చరిత్రలో నిజంగా ఒక రికార్డు. ఈ 95 మందిలో ప్రవాసాంధ్రులు, విదేశీ తెలుగువారు కూడా ఉండడం విశేషం!

~

తొలుతగా ఈ సప్తపది ప్రక్రియను అంది పుచ్చుకుని ఒక లక్ష్యాత్మక సప్తపదిని ప్రముఖ కవి సాహితీవేత్త శ్రీ విహారి గారు రాసారు. 95 మంది పైగా రాయగా ఒక్కరోజులో వెల్లువెత్తిన వందలాది సప్తపదులను ప్రక్రియా సృజనకర్త సుధామ గారి కోరికపై ప్రముఖకవి, విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు, ఇటీవలే తెలుగు విశ్వవిద్యాలయం కవిత్వ ప్రతిభా పురస్కార గ్రహీత డాక్టర్ వై. రామకృష్ణారావు న్యాయనిర్ణేతగా వచ్చిన వాటిలో నుండి తాము ఉత్తమంగా భావించిన  పన్నెండు సప్తపదులను ఎంపికచేశారు. వాటిలో అత్యుత్తమంగా పేర్కొనబడిన ఇద్దరి సప్తపది కవితలకు చెరి 100/-రూపాయల నగదు బహుమతి ప్రదానం చేయబడింది.

విజేతలు:

  • శ్రీమతి తెలికిచర్ల విజయలక్ష్మి
  • శ్రీ వేపూరి నాగేంద్ర కుమార్

~

ఇదే స్ఫూర్తితో సప్తపది కవిత్వ ప్రక్రియలో పలు సాహిత్య గ్రూపులు పోటీలు నిర్వహిస్తూ వుండడం విశేషం!

కవులు ఔత్సాహికులు సప్తపదులు రాయండి. సప్తపది లఘుకవితా ప్రక్రియను పరివ్యాప్తం చేయండి

జయహో కవిత్వం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here