చీరాంకిత జీవితాలు

    2
    3

    [box type=’note’ fontsize=’16’] “భావోద్వేగాలు సహజంగానే పుడతాయి మనిషన్నవాడికి! ఏడుపు కోసం, సంతోషం కోసం రకరకాల కాస్ట్యూములనూ బేక్‌గ్రౌండ్ మ్యూజిక్కులనూ ఆశ్రయించాల్సిన అగత్యం లేదు మనసూ, ఆ మనసుకి స్పందనలూ ఉన్న మానవులకి” అంటున్నారు “చీరాంకిత జీవితాలు” కథలో పోడూరి కృష్ణకుమారి. [/box]

    [dropcap]“ఇ[/dropcap]దేమిటే ఈ చీర కట్టావ్?” అంది సుజాత చెల్లెలిని చూస్తూనే. “వదినా..!” అంటూ ఆమెను వారించ బోయిన శాంతి, ఆమె ఎలాగూ ఖాతరు చెయ్యదని తన మాటలు తన గొంతులోనే ఆపేసుకుంది. సుజాతకు చెల్లెలైన సుధ ఇంటికి పరామర్శకు వచ్చారు వాళ్ళిద్దరూ. ఎంతో విషాదభరితం ఆ సందర్భం.

    సుధ చెట్టంత కొడుకు హఠాత్తుగా మరణించాడు.

    అటువంటి సమయంలో చెల్లెలిని అమ్మలా అక్కున చేర్చుకుని ఓదార్చవలసిన అక్క అనవలసిన మాటలా అవి!

    శాంతి మనసు సుధ పట్ల సానుభూతితో కరిగిపోయింది. సుధ పక్కన చేరి భుజాన చెయ్యివేసి దగ్గరకు తీసుకుంది. సుధ శాంతి భుజంమీద ముఖం దాచుకుని నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకుంది. హృదయం కరిగిపోయింది శాంతికి. శాంతి, సుధల మధ్య చక్కని స్నేహం ఉంది. శాంతి అన్న పెళ్ళినాటికి శాంతి, సుధ చిన్నపిల్లలు. అన్న పెళ్ళిలో మొదలైన స్నేహం ఈ నాటి వరకూ వర్ధిల్లుతూనే ఉంది. పెళ్ళిళ్ళై ఇద్దరూ వేరే చోట్ల ఉంటున్నా ఏదో ఒక సందర్భంలో కలుసుకుంటూ చిన్ననాటి ముచ్చ ట్లు చెప్పుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారిద్దరూ.

    ఇవాళ, వృద్ధాప్యానికి చేరువవుతున్న ఈ వయసులో సుధకు కలిగిన కష్టం పగవారికి కూడా కలగకూడనిది. ‘కట్టిన చీరమీద కామెంట్ చెయ్యడానికి ఇదా సందర్భం?’ శాంతి మనసు విలవిలలాడిపోయింది!

    సుధ కొడుకు శ్యామ్ చిన్నవయసులోనే పెద్దపేరు తెచ్చుకున్న ఇంజనీర్. కంపెనీ వారు అతనిని ఎంతో గౌరవిస్తారు, దాదాపు అతనిమీదే కంపెనీ అభివృద్ధి ఆధారపడినట్టు భావిస్తారు. అతనికి వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వృధ్ధాప్యంలో తమకు నీడనివ్వవలసిన చెట్టంత కొడుకు పోయిన శోకంలో ఉన్న చెల్లెలిని ఇలాగేనా పలకరించడం! వచ్చినప్పటి నుంచీ శాంతి గమనిస్తూనే ఉంది. శ్యామ్ పిల్లలిద్దర్లోనూ పెద్దవాడికి ఆరేళ్ళు, రెండో వాడికి మూడేళ్ళు. ఏమీ తెలియని, అర్థంకాని వయసులో ఉన్న ఆ పిల్లలు గాభరా పడకూడదన్న ఉద్దేశంతో అటు సుధ తరఫు బంధువులుగాని, ఆమె కోడలి తలిదండ్రులు, ఇతర బంధువులుగాని ఆ పిల్లల ముందు తమ దుఃఖం ప్రకటితమవకుండా జాగ్రత్త పడుతున్నారు. సుధ కూడా చేతనైనంత మటుకు శోకాన్నంతా కడుపులోనే దాచుకుని మనవల ముందు మామూలుగానే ఉంటున్నట్టు నటిస్తోంది. అంతకంటే ఏం చెయ్యగలదు! పైగా అటువంటి పరిస్థితిలో తను ఏం తింటోందో ఏం కడుతోందో గమనించుకోగలదా ఏ తల్లైనా! శాంతి మనసంతా అల్లకల్లోలమై పోయింది.

    సుధ, సుజాతల తల్లి భానుమతి వచ్చి “సుధా రావే, చూడు చిన్నవాడు స్నానానికి రమ్మంటే పేచీ పెడుతున్నాడు” అని పిలిచింది. సుధ నెమ్మదిగా లేచి, భారంగా అడుగులు వేసుకుంటూ తల్లి వెనకాల లోపలి గదిలోకి నడిచింది. శాంతికి అర్థమైంది, ఆవిడ సుధను సుజాత బారినించి తప్పించడానికే అలా పిలిచిందని. శాంతి కూడా వారిద్దరి వెనకే పడకగది లోకెళ్ళింది. పక్కనే ఉన్న నీళ్ళగదిలో గెంతులు వేస్తున్న చిన్న బాబు, “దాదా బామ్మా! దా! మీ ముస్సిలి అమ్మకేం తెలీదు సరిగ్గా నీళ్ళు పొయ్యదూ”అంటూ పిలిచాడు. రాని చిరునవ్వును బలవంతంగా ముఖంమీదికి తెచ్చుకుని వాడి దగ్గరకెళ్ళింది సుధ.

    శాంతిని అక్కడే మంచం మీద కూచోమని సైగచేసి భానుమతి కూడా కూలబడింది. గద్గదమైన గొంతుతో, “విన్నావుగా తల్లీ, నా పెద్దకూతురి మాటలు! ఇంత కష్టం వచ్చి ఇలంటిల్లిపాదిమీ ఈ చంటివాళ్ళ ముఖం చూసి, బాధనంతా గొంతులోనే ఆపుకుని అవస్థ పడుతుంటే వస్తూనే చెల్లెలి చీర గురించి ఎత్తిపొడుస్తోంది అది! అదీ నా కడుపున పుట్టిన కూతురేనా అనిపించింది దాని మాటలు వింటే. ఇంత కఠినంగా దాన్ని నేనే తయారుచేసానా అని అనిపిస్తోంది” అంటూ ఆ వృద్ధురాలు దిండులో ముఖం దాచి వలవలా ఏడ్చేసింది శబ్దం పైకి రాకుండా జాగ్రత్తపడుతూ. “ఇంత ముసిలిదాన్ని నన్ను తీసుకు పోకుండా ఆ పిల్లాడినెత్తుకు పోయాడెందుకో జాలేలేని ఆ దేవుడు!” అని మళ్ళీ కన్నీరు కార్చింది. శాంతి గుండె కరిగి కన్నీరై ప్రవహించింది. చకచకా కళ్ళు తుడుచుకుని. “ఏం చేస్తాం అత్తయ్యగారూ! మన చేతుల్లో ఏమీ లేదు అంతా విధి ఆడించే నాటకం అని మనకి గుర్తు చెయ్యడానికే ఇలా చేస్తాడేమో దేవుడు!” అంటూ, “పిల్లాడి స్నానం అయినట్టుంది కాస్త మనం సంభాళించుకోవాలి. వాళ్ళ ఎదురుగా మనం ఇలా కనబడకూడదు” అంటూ తన కళ్ళు తుడుచుకుని ఆవిడ ముఖం కూడా మెత్తని రుమాలుతో తుడిచి మంచి నీళ్ళందించింది. “శాంతీ! ఇదుగో సూర్యం వొచ్చాడు. వాళ్లూ ఈ ఊళ్ళోనే ఉంటారు” అంటూ పెద్దగొంతుతో గట్టిగా పిలుస్తున్న సుజాత గొంతు విని శాంతి నిట్టూరుస్తూ లేచి, హాల్లోకి వెళ్ళింది. సూర్యం వీళ్ళ దూరపు బంధువుల కొడుకు. వీళ్ళకి వరసకి తమ్ముడవుతాడు.

    ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చిన శాంతిని చూస్తూ, “వీడికీ మధ్యనే ఈ ఊరు ట్రాన్స్‌పరై వచ్చాడు. ఇంకా పెళ్ళాం పిల్లల్ని తీసుకురాలేదుట. నీకీ విషయాలేవీ తెలీదనుకుంటా. చుట్టాలంతా నాతో టచ్‌లో ఉంటారుగా, అందుకని నాకు తెలుసు. నేనే వీళ్ళకి ఫోన్ చేసి చెప్పా. ఇలా మన సుధ కొడుకు పోయాడురా అనుకోకుండానూ అని” అనంటూ పెద్దగొంతుతో అదేదో ఘనకార్యంలా చెప్తున్న సుజాత వాగ్ధోరణికి అడ్డుకట్ట వెయ్యలేక నిస్సహాయంగా ఓ కుర్చీలో కూలబడింది శాంతి. వరండాలో నిలబడి చిన్నగొంతులతో మాట్లాడుకుంటున్న కొందరు చుట్టాలని చూసి, “ఇప్పుడే వస్తానక్కా”అంటూ లేచి ఆ వర్గంలో కలిసాడు సూర్యం. సుజాత శాంతికి దగ్గరగా వంగి, “చూసావా? సుధకేం తెలీదు. కొడుకు పోయినప్పుడు అందరూ పరామర్శల కొస్తారని తెలిసీ ఆ ప్రింటు చీర కట్టుక్కూచుందేమిటీ? అసలు మనవాళ్ళకి ఎవరికీ బుద్ధుల్లేవు! ఈ చుట్టాలమూకా అంతే! అదే వేరే రాష్ట్రాల వాళ్ళని చూడు పరామర్శకి వెళ్ళేటప్పుడు అందరూ తెల్ల బట్టలు కట్టుకు వెళ్తారు. కొందరైతే నల్ల దుస్తులు వేసుకుని పరామర్శకి వెడతారు. అదో పద్ధతి. మన వాళ్ళే ఎలాపడితే అలా వచ్చి పడతారు!” అంటూ చెవిలో జోరీగలా ఊదర గొట్టడం మొదలు పెట్టింది.

    శాంతికి చిర్రెత్తుకొచ్చింది. “అవును మన వాళ్ళు ఇలాంటి విషాదవార్త విన్నప్పుడు దుఃఖం పట్టలేక ఎలా ఉన్న వాళ్ళు అలా పరుగుపరుగున వచ్చి కష్టంలో ఉన్న వాళ్ళని దగ్గరకు తీసుకుని, హృదయానికి హత్తుకుని, ఓదార్పునివ్వాలని ఉన్న పళంగా పరుగెత్తుకొస్తారు. కాస్ట్యూమ్ డిజైనర్స్‌ని కన్సల్ట్ చేసి, దుస్తులరంగు గురించి సలహా తీసుకుని, తీరిగ్గా రావాలనుకోరు” అని పెద్దపెద్ద కేకలు పెట్టి వదిన నోరుమూయించేసెయ్యాలనిపించింది. కానీ, ఎప్పటిలానే గొంతులో మాటలన్నీ గొంతులోనే అణుచుకుని, లేచి మళ్ళీ పడకగదిలోకి వెళ్ళింది. సుధ అప్పటికి మనవడికి నీళ్ళు పోయడం అయిపోయి బట్టలు వేస్తోంది.

    “సుధా, మీ కోడలు రాధ ఏదీ? వచ్చాక ఆ పిల్లని చూడనే లేదు” అడిగింది శాంతి. “అక్కడ ఆ రెండో పడగ్గదిలో ఉంది శాంతీ. తనకి ఈ దుఃఖం వల్లనో ఏమో నిన్నటినించీ అప్పుడప్పుడు ఫిట్స్‌లా వస్తున్నాయి. ఇందాక మీరంతా వచ్చే ముందే డాక్టరు వచ్చింది. అక్కడ పడుకోబెట్టాం. మీరిక్కడ మాట్లాడుతుండగా ఆవిడ దాన్ని చూస్తోంది. పద తీసు కెడతా” అని పిల్లవాడిని చూసుకోమని భానుమతికి అప్పగించి శాంతిని రాధ ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది సుధ.

    డాక్టరు పరీక్ష చేయడం పూర్తయింది కాబోలు, నీరసంగా పడుకుని ఉన్న రాధతో నెమ్మదిగా మాటాడుతూ ఓదారుస్తున్నారు. రాధ తల్లి గౌరి, తండ్రి రామంగారు మంచం పక్కనే నిలబడున్నారు. రాధ చేత ఏవో మాత్రలు మింగించిన డాక్టరు, రామంగారికి మందుల చీటీ ఇచ్చి వివరించి చెప్పారు. సుధను చూస్తూనే ఆమె భుజాల చుట్టూ చేయివేసి ఓదార్పు మాటలు పలికింది డాక్టరు. సుధ కళ్ళల్లో నీరు ఉబికి వస్తుండగా, డాక్టరు గారితో పాటు గుమ్మం వరకూ నడిచి వీడ్కోలు పలికింది. చిన్న ఊరడింపుకే కరిగి కన్నీరవుతున్నారు అక్కడున్న వారందరూ. రాధను పొదివి పట్టుకుని కడుపారా ఏడ్చింది శాంతి. ఏడవడం కంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు ఆ పరిస్థితిలో! వేసుకున్న మాత్రల ఫలితమేమో కొంతసేపటికి రాధకు కళ్ళు వాలిపోయి, నిద్ర ముంచు కొచ్చినట్టు మత్తుగా పడుకుండి పోయింది శాంతి చేతిని పట్టుకునే. అమాయకంగా నిద్రిస్తున్న రాధ ముఖం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది శాంతికి. ‘ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందీ అమ్మాయికి!’ అనుకుంటూ బాధపడింది.

    చిన్న గొంతుతో కాసేపు రాధ తలిదండ్రులతో మాట్లాడి, తనకు తోచిన మాటల్లో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. లేచి మళ్ళీ హాల్లోకి నడిచింది. రాధ తల్లి కూతురి మంచం పక్కనే కుర్చీ వేసుకుని, నిస్త్రాణగా చేరబడి కూచుంది. కాసేపటికి రాధ తండ్రి రామంగారు ఇవతలకి వచ్చి మరో గదిలోకి వెళ్ళాడు. శాంతి సోఫాలో కూలబడి కళ్లు మూసుకుంది.

    పరామర్శ చేసేందుకై చాలామంది చుట్టాలు వస్తుండడం గమనించిన శ్యామ్ సహోద్యోగులూ, స్నేహితులూ ఇంట్లో ఎవరికీ ఇబ్బంది రాకుండా చాలా ఏర్పాట్లు చేసారు. అందరివీ బట్టలు ఏ రోజువి ఆ రోజు ఉతికి తెచ్చేందుకై చాకలిని కుదిర్చారు. ఇంటికి ఎందరు చుట్టాలొచ్చినా ఏ లోటూ లేకుండా భోజనాలు, టిఫిన్లూ కాఫీలు ఏ టైముకి కావాల్సినవి ఆ టైముకి ఏర్పాటుచేసి అందించడానికి ఇద్దరు వంటమనుషులను ఏర్పాటు చేసారు. ఆ రోజు ఉతికిన బట్టలు పట్టుకొచ్చిన చాకలి వాటిని రామంగారు వెళ్ళిన గదిలోకి తీసుకువెళ్ళి అక్కడో మూల పెట్టి వెళ్ళి పోయాడు. కొద్ది సేపటికి ఆ గదిలోంచి “వీడేడుస్తున్నాడర్రా! వీడేడుస్తున్నాడు! ఎవరన్నా చూడండి!” అని చిన్న కేకలు వినిపిం చాయి. శాంతి గబుక్కున లేచి ఆ గదిలోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి ఓ క్షణం మతిపోయినట్టు మ్రాన్పడిపోయింది!

    అంతవరకూ బిగబట్టుకున్న దుఃఖాన్ని ఇంక ఆపుకోలేకపోయారేమో రామంగారు, ఓ మంచం మీద బోర్లాపడి కుమిలికుమిలి ఏడుస్తున్నారు. అప్పుడే అక్కడకు ఆగది తుడవడానికి వచ్చిన పనిమనిషి గబుక్కున చేతిలో చీపురు కింద పడేసి ఆయన వీపు నిమురతూ ఓదార్పు మాటలు పలుకుతోంది. ఇంతకీ అలా కేక పెట్టిన వారు ఎవరంటే, రామంగారి అక్క! ఆమెకూడా తమ్ముడిని పరామర్శించడానికే వచ్చింది! ఓ మూల తన పెట్టె దగ్గర కూచుని ఆరోజు చాకలి ఉతికి తెచ్చిన బట్టలు సద్దుకుంటోంది. లోపలికి వచ్చిన శాంతిని చూసి, ఓ చీర ఎత్తి పట్టుకుని “ఈ చాకలి ఉతుకుచూడండి ఎలా ఏడిసిందో!” అంది. అంతేకానీ, ఏడుస్తున్న తన తమ్ముడి బాధ ఆవిడకి ఏ మాత్రం పట్టినట్టులేదు! ఆయన దగ్గరకెళ్ళి కూచుని నాలుగు ఓదార్పు మాటలు పలకాలని గానీ, కాస్త చేతనైనట్టు ధైర్యం చెప్పాలనిగానీ అనిపించలేదు ఆవిడకి! ఎవరైనా వచ్చి చూసుకోండని తను కేకలు పెట్టిందిగా, అంతటితో తన డ్యూటీ అయిపోయింది! తమ్ముడిని ఓదార్చే బాధ్యత పనిమనిషి తీసుకుందిగా అనుకుంది కాబోలు! శాంతికి అసహ్యం వేసింది. కన్నకూతురికి రాకూడని కష్టం వచ్చి కుమిలి పోతున్న ఆ తండ్రి తన స్వంత తమ్ముడే! ఆ మాత్రం ఆ పనిమనిషి అందిస్తున్న ఓదార్పునందించలేదా స్వంత అక్కగారు? అసలింత కూడా ఇతరుల బాధలకు స్పందించకుండా ఉండగలరా ఎవరైనా? అదీ, తన తమ్ముడి కష్టానికి చలనం లేకుండా ఎలా ఉండగలిగిందీవిడ? చీరల సొగసు చూసుకోడానికి ఇదా సమయం? ఆ అక్కగారి వైపు తల తిప్పకుండా, నెమ్మదిగా మంచం దగ్గరకి వెళ్ళింది. పనిమనిషివైపు కృతజ్ఞతగా చూసి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, చిన్నగా హత్తుకుంది. ఆమె దండం పెట్టి అవతలికి వెళ్ళి పోయింది.

    “అన్నయ్యగారూ, మీ దుఃఖం మేం అర్థం చేసుకోగలం. కానీ పెద్దవాళ్ళం మనమే ఇలా అయి పోతే పాపం రాధ ఇంకా బెంబేలెత్తిపోతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. విధి చేతుల్లోంచి ఎవరం తప్పించుకోలేం. మీకు చెప్పేటంతటి దాన్ని కాదనుకోండి” అంటూ రామంగారు పడుకున్న మంచం పక్క ఓ కుర్చీ వేసుకుని కూచుని తను కూడా ఆయన్ని కాస్త ఓదార్చడానికి ప్రయత్నించింది. “ఏం చెయ్యనమ్మా, పిల్లలు చూస్తుండగా నాలుగు కన్నీటి చుక్కలు కూడా రాల్చలేము. గుండెనిండా పేరుకున్న కన్నీటి వరదను ఆపకుండా పొంగనియ్యడానికి నాకిప్పుడే సమయం దొరికింది” అంటూ మరోమారు తనివితీరా ఏడ్చాడాయన. ఇంతలో,

    “రామం ఇక్కడున్నావా? ఏంటోయ్, నువ్వే ఇలాగైపోతే .. పాపం! చిన్నది మీ అమ్మాయి, చంటి భడవలు మీ మనవలు ఎలా తట్టుకోగలరు ఈ కష్టాన్ని” అంటూ రామంగారి స్నేహితుడు ఒకాయన లోపలికి వచ్చాడు. చీర ఉతుకుడు గురించి తెగ బాధ పడిపోతున్న అక్కగారు మాటామంతీ లేకుండా తప్పుకుంది. కష్ట సమయంలో దేవుడిలా వచ్చి, స్నేహితుడికి అండగా నిలబడి, చేతనైన మాటలతో ఆయనకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఆయనకు నమస్కారం పెట్టి, “మాకెవ్వరికీ మనసారా కాసేపు ఏడిచే పాటి ఆస్కారం కూడాలేదు. ఆ ఊహ తెలియని చిన్నపిల్లల ముందు కన్నీళ్ళు పెట్టాలని కూడా మాకెవ్వరికీ అనిపించట్లేదు. అలాంటిది కూతురికి రాకూడని కష్టం వచ్చి ఒళ్ళు తెలియకుండా పడుంటే, మనవల ముఖం చూసి భరించలేని బడబాగ్నిలాంటి దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని కుమిలిపోతున్నారు వీళ్ళు పాపం!” అంది శాంతి.

    “అవునమ్మా మనం పెద్దవాళ్ళమే పరిస్థితినర్ధం చేసుకుని పిల్లల ముందు కాస్త మనని మనమే అదుపులో పెట్టుకోవాలి. తప్పదు. పగవాడికి కూడా రాకూడని కష్టం వచ్చింది పాపం రామం ఒక్కగానొక్క బిడ్డకి! ఇలా సమయం దొరికినప్పుడే కాసిన్ని కన్నీళ్ళు కార్చడం తప్ప ఎవరూ కూడా చెయ్యగలిగిందేమీ లేదు” అన్నాడాయన. కొంచెం సేపు అక్కడ కూచుని ఆయన తనకూ రామానికీ ఉన్న స్నేహం, రాధ చిన్నతనపు సంగతులు, రాధ పెళ్ళినాటి విశేషాలు చెప్తుంటే విని, తనకూ సుధకూ చిన్నతనం నుంచీ ఉన్న స్నేహం గురించి శాంతి చెప్పింది. వీరిద్దరి మాటలూ వింటున్న రామంగారికి కొంచెం మనసు శాంతించినట్టుంది. దుఃఖం నుంచి కొద్ది కొద్దిగా తేరుకుని, పెళ్ళైన నాటి నుంచీ తనకూ, తన అల్లుడికీ మద్య ఏర్పడిన బంధం, అతని మంచితనం చెప్పుకొచ్చాడు. తనకు తన కూతురితో కంటే అల్లుడితో ఉన్న స్నేహం గురించి చెప్పు కొచ్చాడు. “నాకు కొడుకులేని లోటు తీర్చాడు శ్యామ్” అంటూ ఏవేవో సంఘటనలు గుర్తుచేసుకుని చెప్పుకున్నాడు. ఆ కబుర్లు కొంత సేపు వింటూ కూచుని, కాస్సేపయ్యాక రామంగారి స్నేహితునితో, “కొంచెం దగ్గర కూచుని చూస్కోండన్నయ్య గారూ” అని చిన్నగా చెప్పి ఇవతలకొచ్చింది. హాల్లోకి వచ్చేసరికి పరిస్థితి మామూలే. పెద్దగొంతేసుకుని సుజాత, తన పక్కన కూచున్న ఎవరితోనో తాను ఇంతకు ముందు వెళ్ళిన ఏవేవో సందర్భాలలో అక్కడివారు ఏ రకం దుస్తులు ధరించారు. అవి సందర్భంలోని విషాదాన్నిగానీ, ఆనందాన్నిగానీ వచ్చిన వారందరికీ ఎంత బాగా అర్థమయ్యేలా చేసాయో రక రకాలుగా వివరిస్తోంది ఉపన్యాస ధోరణిలో! నిట్టూరుస్తూ ఓ మూల కుర్చీలో కూలబడింది శాంతి.

    ***

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here