[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
[ఉగాది పండుగ కావడంతో, అమలాపురం సమీపంలోని గ్రామంలో ఉంటున్న పార్వతమ్మ ఇంట్లో పూజ చేసుకుని కాఫీ తాగి వంటకి సిద్ధమవుతారు. రెండో కొడుక్కు ఫోన్ చేయడానికి ప్రయత్నించి నెంబరు కలవక, తమ ఇంటి ఓనర్ వసంత దగ్గరికి వస్తుంది. వసంత ఫోన్ కలిపి, స్పీకర్ ఆన్ చేసి ఇస్తుంది. చిన్నకోడలు మాట్లాడుతుంది. ఆమె కొద్దిగా వేళాకోళంగా మాట్లాడడంతో పార్వతమ్మ మనస్సు చివుక్కుమంటుంది. అది గమనించిన వసంత ఆవిడ కాస్త కుదుటపడేలా మాట్లాడి పంపిస్తుంది. వసంత హెడ్ మాస్టరుగా పని చేసి రిటైరంది. భర్త వెంకట్రావు ఓ షాపులో ఎకౌంట్స్ రాస్తాడు. వసంతా వెంకట్రావు దంపతులకి ఒక కూతురు, ఒక కొడుకు. పిల్లలిద్దరికీ వసంత సర్వీస్‌లో ఉండగానే పెళ్లిళ్లు అయిపోయాయి. కొడుకు శైలేష్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తాడు. కూతురు నిర్మలని ఓ ధనవంతుల కుటుంబం ఏరి కోరి కోడలిగా చేసుకుంటుంది. ఆమె భర్త శ్రీరామ్ సౌమ్యుడు. నిర్మల కొడుకు పుట్టినరోజు వస్తుంది. అందరూ పెద్ద మొత్తాలలో కానుకలు చదివిస్తారు. వసంత ఐదువేలు ఇవ్వబోతే, నిర్మల విసుక్కుని తమ హోదాకి తగ్గట్టుగా కనీసం పదివేలయినా ఇవ్వలని చెప్పి, మిగతా ఐదువేలు తను వేస్తుంది. కూతురు ప్రవర్తన వసంతని బాధిస్తుంది. కూతురు గొప్పలు పోతుంటే, అల్లుడు మాత్రం స్నేహంగా ఉంటాడు, అత్త మామలంటే గౌరవం కలిగి ఉంటాడు. నిర్మల పిల్లలు మాత్రం అమ్మమ్మ, తాతయ్యలతో హాయిగా ఆడుకుంటారు. వెంకట్రావుకి మాత్రం కూతురు ప్రవర్తనలో తప్పేం కనబడదు. ధనవంతుల కోడలు అంటూ సమర్థిస్తాడు. పార్వతమ్మ భర్త చనిపోయాకా వచ్చిన ఆస్తిని కొడుకులిద్దరికీ సమానంగా పంచేస్తుంది. మురమళ్ళలోని తమ ఇంటిని అమ్మేసి ఆ డబ్బూ, ఇంట్లో ఉన్న కొంత రొక్కం తల్లిపేరు మీద పెడతారు కొడుకులు. వచ్చే వడ్డీ ఆమెకు అందేట్టుగా ఏర్పాటు చేస్తారు. పార్వతమ్మ పల్లెటూర్లో ఉండాలని అనుకుని, వసంత వాళ్ళింట్లో అద్దెకి దిగుతుంది. వసంత కూడా ఆవిడని ‘పిన్నిగారూ’ అని పిలుస్తూ, తనకి చేతనయిన సాయం చేస్తుంది. వసంతను కూతురిలా భావిస్తుంది పార్వతమ్మ. ఒకరోజు మధ్యాహ్నం పార్వతమ్మ వసంత దగ్గరకి వస్తుంది. పెద్ద కొడుకు వచ్చి తనని హైదరాబాదు తీసుకువెళ్తాడని చెప్తుంది. కొడుకు షష్టిపూర్తి గొప్పగా జరగబోతోందని, అందుకే తనని పిలుస్తున్నారని అంటుంది. వసంత ఆమెకి సర్దుకోవడంలో సాయం చేస్తుంది. పార్వతమ్మ పెద్ద కొడుకు భార్యతో సహా వచ్చి తల్లిని హైదరాబాదు తీసుకువెళ్తాడు. నారాయణ ఒక పెద్ద ఫార్మా కంపెనీలో ముఖ్యమైన పదవిలో ఉంటాడు. షష్టిపూర్తి ఘనంగా జరుగుతుంది. ఆ హడావిడి అయిపోయాకా, పార్వతమ్మని ఎవరూ పట్టించుకోరు. కొడుకు ఆఫీసు పన్లతో, కోడలు షాపింగులతో, సినిమాలతో తీరిక లేకుండా ఉంటారు. ఇక అక్కడ ఉండడానికి విసుగెత్తిన పార్వతమ్మ కొడుకుకి చెప్పి తన ఇంటికి వచ్చేస్తుంది. వసంత వచ్చి ఆప్యాయంగా పలకరిస్తుంది. ఆ పూటకి తమతోనే భోజనం చేయమంటుంది. ఒకరోజు వసంతకి వాళ్ళక్క ప్రమీల ఫోన్ చేసి – తమ కూతురు భార్గవి, అల్లుడు ఇండియాకి వచ్చేస్తున్నారని చెప్తుంది. వసంత సంతోషిస్తుంది. నిర్మల కొడుకు పుట్టినరోజున నిర్మల తనతో ప్రవర్తించిన తీరుని కొడుకు శైలేష్‌కి చెప్పి బాధపడుతుంది వసంత. అక్కతో తాను మాట్లాడాతానని అంటాడతను. ఒకరోజు వసంత పెదనాన్న కొడుకు రామచంద్రం ఫోన్ చేస్తాడు. తాను అమలాపురం వస్తున్నానని చెప్తాడు. రామచంద్రం జీవనోపాధి కోసం రకరకాల పనులు చేసి చివరికి హైదరాబాదులో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద స్థిరపడతాడు. ఇక చదవండి.]
[dropcap]హై[/dropcap]దరాబాద్‌లో రామచంద్రం పిల్లలు ముగ్గురినీ చదివించుకున్నాడు. కొడుకు బాగా చదివి ఒక బ్యాంకు ఉద్యోగి అయ్యాడు. ఈలోగా నాలుగేళ్ల క్రితం పెద్ద కూతురు ఒక క్రిస్టియన్ కుర్రవాడిని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని తెలుసు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు వసంతకి తెలుస్తున్నాయి.
అప్పట్లో ఒకటి రెండుసార్లు ఫోన్ చేసి రామచంద్రాన్ని పలకరించింది వసంత. ఒకసారి ఫోన్ చేసినప్పుడు పెద్ద కూతురు అలా చేయడం వల్ల రెండో అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావడం లేదని బాధపడ్డాడు. పోయిన సంవత్సరమే చిన్న కూతురి పెళ్లి, దేవుడి దయవల్ల కుదిరిందనీ, రావలసిందనీ తెలియపరిచాడు ఫోన్లో. కొన్ని కారణాల వల్ల ఆ పెళ్ళికి వెళ్ళడానికి వసంతకి వీలు కాలేదు. పెళ్లయ్యాక ఫోన్ చేసి మాట్లాడింది కూడా, “అన్నయ్యా! పెళ్ళికి రాలేకపోయాను” అంటూ. “ఫర్వాలేదులే చెల్లెమ్మా! అంతా బాగా జరిగింది. అల్లుడికి కూడా హైదరాబాద్ లోనే ఉద్యోగం” అని చెప్పాడు. పోనీలే చిన్న కూతురు పెళ్లి చేసేసాడు. రోజులు మారుతున్నాయి అక్కగారు ప్రేమ వివాహం చేసుకుందని చెల్లెలికి పెళ్లి కాకపోవడం గతంలో ఉండేది. ఇప్పుడు మనుషుల్లో కాస్త విశాలత్వం పెరిగింది. అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఈ కులాంతర, మతాంతర వివాహాలు కూడా సాధారణం అయిపోయాయి కదా! అనుకుని సంతోషపడింది వసంత. మరో ఆరు నెలలకి కొడుకు పెళ్లి కూడా చేసేసాడు. ఫోన్ చేసి పిలిచాడు. కార్డు కూడా పంపాడు. దానికీ వెళ్లలేకపోయింది వసంత. ఆ తర్వాత మళ్ళీ ఇదే వస్తానని ఫోన్ చేయడం. వసంత అన్న రాక కోసం ఆనందంగా ఎదురుచూస్తోంది.
అన్నట్టుగానే మరో మూడు రోజుల తర్వాత వచ్చి తలుపు తట్టాడు రామచంద్రం. సంభ్రమంగా “అన్నయ్యా రారా. ఎన్నాళ్లకెన్నాళ్లకి?” అంది వసంత అతని చెయ్యి పట్టుకుంటూ.
“నువ్వెలా ఉన్నావ్?” బాగ్ పక్కన పెడుతూ అన్నాడు రామచంద్రం.
“ఎంత బలంగా ఉండేవాడివి. బాగా తగ్గిపోయావు” మంచినీళ్లిస్తూ అంది వసంత ఆప్యాయంగా.
“పెద్దవాళ్ళం అయిపోయాం కదా! ఏవో సమస్యలూ, అనారోగ్యాలూ మనల్ని లొంగదీస్తాయి కదా! బావగారేరీ?”
“మీ బావగారు అకౌంటెంట్ ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. ప్రైవేట్ బట్టల షాప్ కదా! రిటైర్మెంట్ లేదు. ఇంట్లో ఉండడం ఎందుకు? అలా బైటికి వెళ్లి పనిచేసి వస్తూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంది అంటారు. టిఫిన్ తినేసి వెళ్తారు. లంచ్ బాక్స్ ఇస్తాను. సాయంత్రం ఏడు గంటలకు వస్తారు” అంటూ కాఫీ తీసుకొచ్చింది వసంత. ఆ తర్వాత కబుర్లు చెబుతూనే వంటచేసి అన్నగారికి వడ్డించింది వసంత. “నువ్వుకూడా తినవే” అంటే తాను కూడా వడ్డించుకుని చిన్ననాటి సంగతులు కలబోసుకుంటూ అన్నగారితో కలిసి భోజనం చేసిందామె. రామచంద్రం అన్నం తిని పడుకొని లేచాక తమ పిల్లల గురించి చెబుతూ పకోడీలు వేసి, టీ పెట్టింది. ఇద్దరూ టీ తాగుతుండగా “వదినెలా ఉంది? అల్లుడేం చేస్తాడు? కోడలు మనలో కలిసిపోయే పిల్లేనా?” వసంత తీరికగా వివరాలడిగింది, ముందుగదిలో అన్నగారి ఎదురుగా కూర్చుని.
“వదిన బాగానే ఉందిలే! చిన్నల్లుడికి సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగమే. కుర్రాడు మంచివాడు. మా చిన్నమ్మాయి టెంపరరీగా ఒక స్కూల్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. ఏదో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకగలరు.”
“అదే కదన్నయ్యా మనకి కావలసింది” అంది వసంత.
“మా పిల్లాడి బ్యాంకులో పనిచేసే అమ్మాయే మా కోడలు. మన కుటుంబంతో బాగానే కలిసిపోయిందిలే. వాడి బ్యాంకుకు దగ్గరగా మకాం ఉంటారు వాళ్ళు. నెలకోసారి వచ్చిపోతూ ఉంటారు. ఒకోసారి మేమూ వెళుతూ ఉంటాము.”
“అదే మంచిది” అందామె.
“పెద్దమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా అన్నయ్యా? ఎక్కడుందో ఏమిటో? ఇలా అడిగానని ఏమీ అనుకోవు కదా?” అందామె సంకోచంగా. రామచంద్రం మొదలు పెట్టాడు.
“నీ మొహం! అనుకునేదేమిటే? కావలసిన దానివి కనక అడిగావు. పైవాళ్ళు అడుగుతారా? అసలు నేనే ఈ విషయం నీకు చెప్పి సలహా అడగాలనుకుంటున్నా. చిన్న పిల్ల పెళ్లి అయిపోయింది, తర్వాత అబ్బాయి పెళ్లి కూడా అయింది అని కాస్త ఊపిరి పీల్చుకుని అమ్మయ్య అనుకున్నాం. ఇంతలో పెద్దమ్మాయి ఇద్దరు పిల్లలతో ఒకరోజు నాకు బజార్లో కనబడింది. ‘నాన్నా! ఎలా ఉన్నావు?’ అనడిగింది. ఇంట్లోంచి వెళ్లి, పెళ్లి చేసుకుందని తెలిసిన తర్వాత మళ్ళీ ఇదే చూడడం. నేను చాలా ఆనందపడ్డాను. అది కూడా సంతోషపడింది.’ఒకసారి ఇంటికిరా’ అన్నాను.
ఒక వారం తర్వాత ఫోన్ చేసి ఒక రోజు భర్తనీ, కొడుకునీ, కూతుర్నీ తీసుకునొచ్చింది. వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ పూట భోజనం చేసి వెళ్ళింది. భర్త ఒక కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. సంసారం బాగానే చేసుకుంటున్నారు. ‘పిల్ల ఎక్కడుందో ఏమిటో అనుకోకుండా కళ్ళకి కనబడిందిలే’ అనుకుని మీ వదినా, నేనూ తృప్తి పడ్డాం. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత అప్పుడప్పుడూ రాకపోకలు మొదలుపెట్టింది. మేమూ ఏమీ అనుకోలేదు. ‘రోజులు మారాయి, అందరిళ్లలోనూ ఎవరో ఒకరు ఇలాగే ప్రేమవివాహాలు చేసుకుంటున్నారు. రావద్దనడం ఎందుకు? ఎప్పుడైనా వచ్చి చూసి వెళుతుందిలే’ అనుకుని ఏమీ అనేవాళ్ళం కాదు.
ఆ తర్వాత మెల్లగా తన మనసులోని మాట బయట పెట్టింది. ‘నాన్నా! నా పెళ్లి నేనే చేసుకున్నాను. నావల్ల నీకు ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు. మరి నాకేమీ ఇవ్వరా?’ అనడిగింది. నిజమే అది అడగడం తప్పులేదు. కానీ నా పరిస్థితి ఏమిటంటే, పెద్దపిల్ల అలా మరో మతం కుర్రాడిని చేసుకుని వెళ్లిపోవడంతో చిన్నపిల్లకి పెళ్లి కావడం కష్టమైపోయింది. సంబంధాలు ఎక్కువ రాలేదు, వచ్చినవి వెనక్కి వెళ్లిపోతుండేవి. మధ్యవర్తులతో ఇలా అంట కదా! మాకొద్దండీ! ఈ సంబంధం అనేవాళ్ళు. కాలం మారిపోయింది. కుల మత భేదాలు పోయాయి అనుకోవడం మాటల వరకే. మనదాకా వస్తే ఇదీ పరిస్థితి. నాకున్న రెండెకరాల్లో ఆడపిల్లలిద్దరికీ చెరొక ఎకరం ఇవ్వాలని అనుకునేవాళ్లం. మగపిల్లాడికి చదువుంది కదా అనే ఉద్దేశంతో. ఇలా సంబంధాలు రావడం కష్టం అవ్వడంతో మనం కూడా కాస్త కట్నం పెంచవలసి వచ్చింది. ఆఖరికి రెండెకరాలూ చిన్నపిల్లకి ఇచ్చేస్తామంటేనే ఆ సంబంధం వచ్చింది. నీకు తెలుసు కదా! పెళ్లి బేరాలు. సర్లే ఎక్కువ ఆలస్యం కాకుండా చేసెయ్యాలన్నట్టుగా చేసేసాం. అంతా బాగానే జరిగింది.
ఇన్నాళ్లూ నేను హైదరాబాద్‌లో ఎవరి దగ్గర పని చేసానో ఆయన నాకు అన్ని విధాలుగా సాయం చేసాడు. పెళ్ళి ఖర్చులకి కూడా సాయం చేసాడు. ఇప్పుడు నేనక్కడ పని చేయడంలేదు. కొత్త కుర్రాళ్ళు బైట బాగా తిరిగేవాళ్లు చేరారు. నా ఆరోగ్యం నీకు తెలుసు కదా, బీపీ షుగరూ ఉన్నాయి. మర్యాదగా తప్పుకుంటే మంచిదికదా! వెళ్లమనేవరకూ ఎందుకు ఉండాలని మానేసాను. ఇప్పుడు నా పేరున ఉన్న ఒకే ఒక్క స్థలం కూడా నా కొడుక్కి వాడు ఇల్లు కట్టుకోవడానికి లోన్ పెట్టుకోవడానికి అవసరం అంటే రాసి ఇచ్చేశాను. నాకు కొద్దిగా ఊర్లో ఉన్న ఆకుమడి చక్క అమ్ముకొని, అది బ్యాంకులో వేసుకుని ఆ డబ్బుతో మేము నడుపుకుంటున్నాము.
ఇప్పుడు పెద్దమ్మాయికి ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు. ఆ మాటే దానికి చెప్పాము. ‘సరే, అయితే నీ దగ్గర ఉన్న బంగారం నాకు ఇవ్వు’ అంటోందట తల్లితో. మీ వదిన ఇవ్వడానికి సిద్ధమయ్యింది. నేనే వద్దంటున్నాను. రేపొద్దున్న నా తర్వాత ఆమెకి ఏ అవసరం వచ్చినా కాస్త ధైర్యం ఉండాలంటే ఆ కాస్త బంగారమయినా ఉండాలని నేనంటున్నాను. ఇప్పుడు పెద్దమ్మాయికి మా మీద కోపంగా ఉంది. అలా అని రావడం మానట్లేదు. ఎంతో కొంత వదిన చేతిలో ఉన్నది వీలు చూసుకుని ఇస్తోందనుకో. అలా ఇచ్చినా అది సంతోషపడడం లేదు. ఇదొక తలనొప్పిగా మారింది. ఉద్యోగం చేసుకునే మా అబ్బాయి మాత్రం ఏమివ్వగలడు? వాడి సంసారం వాడిదయ్యాక మనం ఏమడగగలం? కోడలు బ్యాంకు ఉద్యోగం టెంపరరీదే. తక్కువ జీతం. మీ వదిన బెంగపెట్టుకుంటోంది. ఎవరికీ చెప్పుకోలేని సమస్య. బాధ్యతలన్నీ తీరాయి అని కాస్త ఊపిరి పీల్చుకోగానే ఇలా కొత్త సమస్య వచ్చి పడింది.” అని చెప్పి “కాసిని మంచి నీళ్లివ్వవే” అన్నాడు వసంతని. “ఉండన్నయ్యా! ఆరంజ్ జ్యూస్ ఉంది” అంటూ తెచ్చిచ్చింది.
తర్వాత కూర్చుంటూ “భలే ఉందన్నయ్యా! మీ పెద్దపిల్ల వరస. మనం చెప్పిన సంబంధం చేసుకుంటే అన్నీ చక్కగా చేసేవాళ్ళం. అప్పుడేమో అమ్మా, నాన్నా అక్కర్లేదనుకుంది. ఇప్పుడేమో అన్నీ కావాలనుకుంటోంది. మీరిప్పుడా పిల్లని రావద్దనీ చెప్పలేరు. వచ్చి వెళుతోందన్న ఆనందమూ లేదు. పెద్ద కష్టమే వచ్చి పడిందే. మీ అల్లుడికి తెలుసా ఈ విషయం? భర్తకి చెప్పే మిమ్మల్ని పీడిస్తోందా? లేక తనకు తానే ఆలోచించుకుని అడుగుతోందో?” సాలోచనగా అంది వసంత. ఏమో అన్నట్టు చెయ్యి తిప్పి నిట్టూర్చాడు రామచంద్రం.
“అసలది ఎంతవరకూ చదువుకుంది? డిగ్రీ అయిందా?”
“చదువు ధ్యాస ఉన్నదైతే ఇలా ఎందుకు చేస్తుంది? డిగ్రీ మొదటి సంవత్సరమే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది కదా!”
“ఇప్పుడైనా ఆ డిగ్రీ కట్టి ఎక్కడో ఒకచోట ఓ పదివేలు తెచ్చుకోవాలి కానీ..”
“అంత బుధ్ధి ఉంటే, దానికున్న ఇంటర్ తోనే ఎక్కడో ఒకచోట పని చెయ్యొచ్చు. చిన్నది చక్కగా డిగ్రీ చేసి కంప్యూటర్ కోర్సులు చేసుకుంది. దీనికిలా రాసి పెట్టి ఉంది.”
“తమ్ముడితోనూ, చెల్లితోనూ మాట్లాడుతుందా? మీ ఇంట్లో అందరూ కలిసారా?”
“లేదు. వాళ్లతో మాట్లాడాలని లేదు దీనికి. వాళ్ళ గురించి అడగదు. వాళ్ళిద్దరి మీదా దీనికి అసూయ”
“అయ్యో పాపం వాళ్ళేం చేశారు?”
“వాళ్ళ బతుకులు వాళ్ళు దిద్దుకోలేని వాళ్ళు అందరి మీదా ఏడుస్తారు. అదొక మనస్తత్వం”
“ఎప్పుడైనా ఎదురుపడితే?”
“వాళ్లెప్పుడూ వారాంతంలో వస్తారు. వాళ్ళను కలవకూడదని ఇది వారం మధ్యలో వస్తుంది. ఆ కుర్రాడు భార్యనీ, పిల్లల్నీ తీసుకుని వచ్చి కాసేపు కూర్చుని వెంటనే వెళ్లిపోతాడు తను. మీ వదినేమో ఈ పిల్ల గురించే దిగులు పెట్టుకుని ఆరోగ్యం కూడా పాడుచేసుకుంటోంది. ఎంత చెప్పినా మీ వదిన ధైర్యం తెచ్చుకోలేక పోతోంది. మానసికంగా నలిగిపోతూ ఉంది. అసలు బజార్లో కలిసిన పెద్దమ్మాయిని ఇంటికి తీసుకు వచ్చింది తప్పయిందేమోనే! ఇప్పుడేం చెయ్యగలను?”
“అలా ఎందుకనుకుంటావు? కన్నతండ్రివి కాబట్టి పేగు కదిలి రమ్మన్నావు కానీ ఇలా అవుతుందనుకుంటావా?”
“ఇదీ పరిస్థితి వసంతా? నీ సలహా ఏంటి? చెప్పు”
“నన్నడిగితే, వదిన చెప్పలేదు కానీ. నువ్వే పరిస్థితి అంతా దానికి వివరంగా చెప్పు. నా చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు చెల్లికి ఇచ్చింది వెనక్కి తీసుకోలేను. తమ్ముడు కూడా ఉద్యోగం మీద ఆధారపడ్డవాడే. మాకేదో తినడానికి ఉంది కానీ నీకు ఏమీ ఇవ్వలేము. నీకు ఇష్టం అయినప్పుడు ఫ్యామిలీ సహా వచ్చి నాలుగురోజులుండి వెళ్ళు. అంతకు మించి ఆశించకు అని చెప్పెయ్యి అన్నయ్యా! ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? వదిన్ని క్షోభ పెట్టడం ఎందుకు? ఆవిడేం చెయ్యగలదు? టెన్షన్ పెట్టుకోవడం తప్ప. ఇదే నా సలహా అన్నయ్యా!” అంది వసంత.
“నిజమే! ఎందుకో నోరు రావడం లేదు. కానీ నువ్వన్నట్టే చెయ్యడం మంచిది. దాంతో విషయం ఒక్కసారే సెటిల్ అయిపోతుంది. లాభం లేదని తెలిస్తే నెమ్మదిగా అడగడం మానేస్తుంది.”
“ఒక వేళ కోపం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తే మానెయ్యనియ్యి. నువ్వేమీ ఫోన్ చెయ్యకు. మాట్లాడకుండా ఊరుకో. అప్పుడు వదిన కూడా నెమ్మది పడుతుంది. ఎప్పుడో పరిస్థితులు అర్థం చేసుకుని ఆ పిల్లే వస్తుందిలే. ఎక్కడికి పోతుంది మన పిల్ల?” అన్న వసంత మాటలకి కాస్త ఊరడిల్లాడు రామచంద్రం. రాత్రి ఏడయ్యాక వెంకట్రావు వచ్చాడు. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటుంటే వంట చేసింది వసంత. ముగ్గురూ భోజనాలు చేసి మరికొంచెం సేపు మాట్లాడుకున్నారు.మర్నాడు ఉదయం టిఫిన్ తిన్నాక ఇక నేను పెళ్ళివాళ్ళింటికి వెళ్లి, పెళ్లి చూసుకుని, పెళ్లి బస్సులోనే హైదరాబాద్ వెళ్లిపోతానని బయలుదేరాడు రామచంద్రం. “ఫోన్ చేస్తూ ఉండు” అంది వసంత.
***
సూపర్ మార్కెట్ కౌంటర్‌లో బిల్ వేయించుకుంటున్న విశాలని చూస్తూనే మ్రాన్పడిపోయాడు అప్పుడే ఏదో చెప్పడానికి కౌంటర్ దగ్గరకు వచ్చిన ఓనర్ మాధవ. కలా, నిజమా అనుకున్నాడు. డిగ్రీ చదివేటప్పుడు ఎలా నాజూగ్గా, నేవళంగా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది విశాల అనుకున్నాడతను. ఒక్కసారిగా సంతోషం కెరటంలా ఎగిసిపడింది. ఆ వెంటనే తీవ్రమైన దుఃఖం కలిగింది. ఆమెను పలకరించడానికి ధైర్యం సరిపోలేదు. గబుక్కున ఆమె తనని గుర్తుపట్టకుండా అక్కడున్న నోట్ బుక్ మీద చేతిలో ఉన్న పెన్‌తో ఏదో రాయబోతున్నట్టుగా తలవంచుకున్నాడు. విశాల తీసుకున్న సరుకులన్నీ బిల్ వేసాక “మీ ఫోన్ నంబర్ మేడం?” అడిగాడా బిల్లింగ్ కౌంటర్ కుర్రాడు. ఆమె చెబుతున్న నంబర్ గబుక్కున నోట్ చేసుకున్నాడు మాధవ.
మెల్లగా అతను తలెత్తి చూసేసరికి పాలిథిన్ బాగ్‌లు రెండూ చెరో చేత్తో పట్టుకుని భుజాన ఉన్న హ్యాండ్ బాగ్ సర్దుకుని బైటికి నడిచింది విశాల. నెమ్మదిగా మాధవ కౌంటర్ వదిలి గుమ్మం వరకూ వచ్చాడు. ఒక ఆటో పిలిచి ఎక్కడం చూసాడు. ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటోందన్న మాట. ఈ సూపర్ మార్కెట్ పెట్టి పదేళ్ళయింది. ఇన్నాళ్ళకి నా అదృష్టం కొద్దీ ఇక్కడ అడుగుపెట్టింది విశాల అనుకున్నాడు. రోడ్ వైపు నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నాడతను అప్పటివరకూ అక్కడున్న దేవత మాయమయ్యిందన్నట్టు. ఇంతలో ఎవరో “సార్“ అనగానే ఈ లోకంలోకి వచ్చి లోపలికి నడిచాడు.
ఆ రాత్రి షాప్ మూసేసాక అలవాటు ప్రకారం హోటల్‌లో భోజనం చేసి, ఇంటికి వచ్చి, స్నానం చేసి సోఫాలో కూర్చున్నాడు మాధవ. చేతి పక్కనే రిమోట్ ఉన్నా టీవీ పెట్టబుద్ధి కాక పక్కనే ఉన్న నీల్ కమల్ కుర్చీ ఒకటి లాక్కుని, అందులో కాళ్ళు పెట్టుకుని మెడకింద చేతులు పెట్టుకుని కళ్లు మూసుకున్నాడు. అరవయ్యేళ్ళ మాధవ నలభై ఏళ్ళ క్రితం తాను చదివిన డిగ్రీ కాలేజ్ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు.
అది కోనసీమలోని, రాజోలుకి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉండే ఒక అభివృద్ధి చెందిన గ్రామం. అందులో డిగ్రీ కాలేజ్ ఉండేది. చుట్టుపక్కల ఉండే పది గ్రామాల పిల్లలకి అదొక్కటే కాలేజీ. ఆ పక్కనే ఉన్న ఊరిలో పుట్టి పెరిగిన అనేక మంది పిల్లల్లో మాధవ, విశాలా కూడా ఉన్నారు. ఒకరికొకరు తెలిసింది బియ్యే డిగ్రీ ఆఖరి సంవత్సరంలోనే. విశాల విశాలమైన కళ్ళతో పెద్ద జడతో పచ్చని రంగులో ఎంతో అందంగా ఉండేది. ఆ రోజుల్లో బాగా హిట్ అయిన ఒక నాట్య ప్రధానమైన సినిమా ఆ ఊరికొచ్చింది. అందరితో పాటూ మాధవ కూడా చూశాడు. ఆ హీరోయిన్ మరీ మరీ నచ్చి ఆ సినిమా మళ్ళీ చూశాడు మాధవ. ఆ కథానాయిక తనకు పరిచయం ఉన్నట్టుగా అనిపించి ఆమెను పరికించి చూశాడు. అప్పుడతనికి తట్టింది విశాల ఆమెలా ఉందని.
మర్నాటినుండీ ఆమెను ప్రత్యేకంగా గమనించడం మొదలు పెట్టాడు మాధవ. లీలగా అతనికి గుర్తు రావడం మొదలు పెట్టింది. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచీ ఆమెను చూస్తున్నాడు. ఆమెను చూస్తున్నప్పుడల్లా ఏదో ఇదిగా ఉండేదతనికి. ఆ ఇది ఏంటో ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. యుక్త వయస్కుడవుతున్నందుకు సాక్ష్యంగా విశాలను ఇప్పుడతను ఇష్టపడడం మొదలు పెట్టాడు. ఆమె కదిలి అటూ ఇటూ వెళ్ళేటప్పుడు అతనికి ఆమె ఒక అందమైన అద్భుతంగా అనిపిస్తోంది. ఆమె క్లాస్‌లో లెక్చరర్‌ని సందేహాలు అడుగుతూ ఉంటే, అతనా ప్రశ్నని పట్టించుకోకుండా, ఆమె గొంతు విని ఆనందపడుతున్నాడు. అలా ఆమె నిలబడి అడుగుతుంటే మిగిలిన వాళ్లతో పాటుగా తాను కూడా, ఆ వంకతో ఆమెను ధైర్యంగా చూస్తున్నాడు. విశాల చాలా సిగ్గరి, తక్కువ మాట్లాడేది. ఆమెతో ఉండే మిగిలిన అమ్మాయిలు గలగలా మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అవన్నీ పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ,వింటూ నవ్వుతూ ఉండిపోయేది. ఆమెకు సంబంధించిన ప్రతి విషయమూ మాధవకి ఆసక్తికరంగా ఉంటోంది. ఆమె వేసుకునే లంగా వోణీలూ,ఆమెకొచ్చిన మార్కులూ అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండేవాడు. తన సీట్‌ని నెమ్మదిగా విశాల గొంతు వినబడేంత దగ్గరగా ఉండేట్టు మార్చుకున్నాడు.
నిశితంగా గమనించే కొందరు కుర్రాళ్లిది గమనించి మాధవను ఆట పట్టించబోయారు. స్వతహాగా మెతకగా ఉండే అతన్నుంచి స్పందన తీవ్రంగా ఏమీ లేకపోవడంతో వదిలేశారు. అమ్మాయిలు మాత్రం శుభ్రంగా ఇదంతా గ్రహించారు. తమకు కలిగిన అనుమానాలు విశాల చెవిన పడేసి ఊరుకున్నారు. విశాల నెమ్మదిగా మాధవని రహస్యంగా గమనించడం మొదలు పెట్టింది. చామన ఛాయతో కాస్త పొడవుగా కోటేరు ముక్కున్న మాధవ, విశాలకి ఎంతో ఆకర్షణీయంగా అనిపించాడు. అతని మౌన గీతం ఆమె మనసుని బాగానే తాకింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా ఆ రోజు నుండీ ఇద్దరి మధ్యా ఒక ఆకర్షణా నేస్తమేదో ఏర్పడిపోయింది. అది పరస్పర చూపులతో రోజు రోజుకూ గట్టిపడుతోంది.
ఒక రోజు అమ్మాయిలంతా చీరలు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు అనుకోకుండా విశాల బంధువులమ్మాయిని పెళ్ళికూతుర్ని చేసే వేడుకకు వెళ్ళవలసి వచ్చి, అక్కడే భోంచేసి మధ్యాహ్నం వచ్చింది. ఆమె వచ్చేసరికి అంతా లంచ్‌కి వెళ్లిపోవడంతో క్లాస్ అంతా ఖాళీగా ఉంది. ఫంక్షన్‌లో భోంచేసి హడావిడిగా కిలోమీటర్ నడిచి రావడంతో అలసటగా అనిపించిన విశాల బెంచీ వెనక్కి తలానించి కళ్ళు మూసుకుంది. అప్పుడే ఒంటరిగా లంచ్ చేసే అలవాటున్న మాధవ తిని, క్లాస్ లోకి ప్రవేశించాడు. పొద్దున్నుంచీ విశాల రాలేదని దిగులు పడుతున్న మాధవకి అమ్మాయిల వరసలో ఒంటరిగా కళ్ళు మూసుకున్న విశాల కనబడగానే దేవత ప్రత్యక్షమైనంత ఆనందం కలిగి, అప్రయత్నంగా ఆమెకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. రోజూ లంగా ఓణీతో ఉండే ఆమెను మొదటిసారి చీరలో చూసాడు. ‘గులాబీ రంగు చీరా జాకెట్టులో విశాల ఓ పెద్ద గులాబీలా ఉంది’ అనుకుంటూ, అలా ఓ పది సెకన్లు మ్రాన్పడిపోయి చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో కళ్ళు తెరిచిన విశాల ఎదురుగా తనవైపే అపురూపంగా చూస్తున్న మాధవ కనబడి తుళ్ళిపడింది.
మాధవ కంగారుపడుతూ “ఇప్పుడే వచ్చారా?” అన్నాడు పక్కనున్న తన బెంచ్ వైపు వెళుతూ కళ్ళు మాత్రం ఆమె నుంచి కదల్చకుండా. ఆమె తలఊపి చిరునవ్వు నవ్వి తలవంచుకుంది. అప్పుడామె అందం అతన్ని మంత్రముగ్ధుడిని చేసింది. అప్పటి చిత్రంతో ఫ్రేమ్ కట్టిన ఫోటో అతని మనస్సులో ముద్రగా పడింది. అదే అతను తొలిసారి ఆమెతో మాట్లాడడం. కొన్ని క్షణాలు ఇద్దరికీ కాలం ఆగిపోయి చుట్టుపక్కల పరిసరాలు కనబడడం మానేశాయి. ఇంతలో గుంపుగా వస్తున్న స్టూడెంట్స్ మాటలు గట్టిగట్టిగా వినబడడంతో గబుక్కున ఒక పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టాడతను.
కాలేజీ అయ్యాక ఇంటికెలా వెళ్ళాడో మాధవకే తెలీలేదు. కలలోలా ఉంది అతనికిదంతా. ‘నా మీద కోప్పడలేదు. చిరాకు పడలేదు. ఎంత అదృష్టవంతుడిని నేను?’ అనుకుంటూ ఆ రాత్రంతా జాగారం చేసాడు. ఆమె రూపం వేల రూపాలుగా అతని హృదయం నిండా, తల నిండా, గది నిండా నిండిపోయింది. మొదటిసారి చీర కట్టుకుని కాలేజీకి వెళ్లడం, ముందుగా తన మిత్రులకన్నా మాధవ తనని చూడడం వల్ల విశాలకు కూడా గమ్మత్తు అనుభవం కలిగింది. అర్ధ సంవత్సరం పరీక్షలయ్యి సంక్రాంతి శలవులిచ్చారు.
ఆ సంక్రాంతి శలవుల్లో పెద్దపండగ రోజు, పక్కఊరిలో ఉంటూ తమ కాలేజీలోనే చదివే విశాల కజిన్ కోటి వచ్చాడు. కోటి చదివేది బి.కామ్ ఆఖరి సంవత్సరం. విశాల కన్నా ఒకేడు పెద్దవాడే అయినా ఇంటర్లో ఫెయిల్ అయ్యి వెనకబడ్డాడు. భోజనాలయ్యాక, “చెల్లీ నీకో రహస్యం చెప్పాలే” అంటూ తోటలోకి తీసుకెళ్లాడు. అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి “మీ క్లాస్‌లో చదివే మాధవ నిన్ను ప్రేమిస్తున్నాడంట” అన్నాడు. ఒక్క క్షణం ఆమెలో ఒక ఉద్వేగం వెల్లువలా కమ్ముకొచ్చింది. ఆ భావాన్ని దాచుకోవడానికి తలొంచేసుకుందామె. “అవునే, నిన్ను పెళ్లి కూడా చేసుకుంటాడంట, మన వాళ్ళేలే, చేసుకోవచ్చు” అన్నాడు కోటి ఉత్సాహంగా. అప్పటికి సర్దుకున్న విశాల “ఎవరు చెప్పారు నీకు?” అంది తలెత్తి నెమ్మదిగా. “మాధవ బెస్ట్ ఫ్రెండ్ ఒకడు నాక్కూడా ఫ్రెండేలే! వాడు చెప్పాడు. ఇంకెవ్వరికీ తెలీదు. నువ్వుకూడా ఎవ్వరికీ చెప్పకు” అంటూ వెళ్ళిపోయాడు చెల్లెల్ని తోటలోనే వదిలేసి. అక్కడే ఉన్న గట్టుమీద కూర్చుండిపోయింది విశాల. ఇన్నాళ్లుగా అసందిగ్ధంగా ఉన్న ఆమె ఊహలు ఒక్కసారిగా పక్షుల్లా గాల్లోకి తేలుతూ వెళ్లాయి. చిరునవ్వుతో కొంతసేపు అలాగే కూర్చుని ఇంటికి వచ్చేసింది.
శలవులయ్యాక తిరిగి కాలేజీ తీశారు. మాధవ, విశాల మనసులిప్పుడు వారిదగ్గర లేవు. ఒకరిది మరొకరి దగ్గర సర్దుకున్నాయి. ఆ దోబూచులాట అలా మూగగా సాగుతూ ఉండగానే డిగ్రీ ఆఖరి సంవత్సరం పూర్తయ్యే సమయం దగ్గరికొచ్చేసింది. లెక్చరర్లందరూ “డిగ్రీ చేతికి రావాలంటే బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకుంటేనే మీ భవిష్యత్తు బావుంటుంది. ఎందరో డిగ్రీ చేస్తారు. మార్కుల వల్లనే వారికి అవకాశాలు వస్తాయి. జాగ్రత్త! టైం వృథా చెయ్యకండి” అంటూ మళ్ళీ మళ్ళీ హెచ్చరించడం మొదలు పెట్టారు. మాధవకి ఒక్కసారిగా మెలుకువొచ్చింది. ఊహల పల్లకిలో ఊరేగుతున్న అతనికి కర్తవ్యం బోధపడింది. బాగా చదవాలి ఒక బెంగ. డిగ్రీ కాగానే విశాల దూరమైపోతుంది కదా! అన్న భయం మరో పక్క అతన్ని తీవ్రమైన ఇబ్బందికి గురిచేశాయి. సరిగ్గా ఇదే పరిస్థితిలో విశాల కూడా పడింది.
ఎలాగైతేనేం డిగ్రీ క్లాసులు పూర్తయ్యాయి. ప్రిపరేషన్ సెలవుల్లో ఒకటి రెండుసార్లు అందరూ కాలేజీకి అనుకుని రావడంతో, అంతా కలిసి చదవాల్సిన ఇంపార్టెంట్ సిలబస్ గురించి చర్చించుకున్నారు. వారిలో వీళ్లిద్దరూ కూడా ఉన్నారు. రోజూ ఒకరికొకరు కనబడడం లేదన్న బెంగ పడుతూనే పరీక్షలకి తయారయ్యి రాసేశారు. అంతా ఆఖరి పరీక్ష రోజున గార్డెన్లో కూర్చుని, టీ పార్టీ పేరుమీద బిస్కట్లు తిని టీ తాగారు. అందరూ అందరికీ వీడ్కోలు చెప్పుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో! అనుకుంటూ. వీళ్లిద్దరి దిగులు వాళ్లందరికన్నాపది రెట్లు ఎక్కువని వీళ్లకు మాత్రమే తెలుసు. ఆ విషయం మాట్లాడుకోవడానికి కూడా వీలులేక కళ్ళతోనే ఒకరికొకరు ‘బై’ చెప్పుకున్నారు మాధవా, విశాలా.
విశాల తండ్రి మధ్య తరగతి రైతు. ఓ ఐదెకరాల ఆసామీ. విశాల తర్వాత కొడుకు నాలుగేళ్లు చిన్నవాడు. మగపిల్లవాడిని బాగా చదివించాలి అనుకుని వాడిని ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలో భీమవరంలో మంచి కాలేజీలో చేర్చాడు. కూతురికి డిగ్రీ ఉండాలన్న ధ్యేయంతో పూర్తి చేయించాడు కానీ వాళ్ళ బంధుగణంలో ఆడపిల్లలకి టెన్త్, ఇంటర్ పూర్తికాగానే పెళ్లిళ్లు చేసేసారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందన్న ఉద్దేశంతో డిగ్రీ పరీక్షలు కాగానే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టేసాడతను. ఇంటికి ఎవరెవరో మధ్యవర్తులు రావడం తండ్రి సీరియస్‌గా ఈ వేసవిలో పెళ్లి చేసేయాలని చెప్పడం విన్న విశాల ఖంగుతింది. ఏం చెయ్యాలో తోచలేదు. కంగారుపడిపోయింది. నిద్రలేని రాత్రులు గడిపింది. ‘ఈ విషయం మాధవకి చెప్పెయ్యాలి. మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడడానికి మీ నాన్నగారిని పంపమని చెప్పాలి ఎలా? ఎలా?’ అనుకుంటూ ఉక్కిరిబిక్కిరైపోయింది.
ఆలోచించగా, ఆలోచించగా కోటిఅన్నయ్య గుర్తుకొచ్చాడామెకి. కబురువెళ్లిందతనికి. గంటలో వచ్చాడు కోటి పొరుగూరునుంచి. తోటలోకి తీసుకెళ్లి చెప్పింది. “ఒరే నువ్వే కదరా? మాధవకి నేనంటే ఇష్టమని చెప్పావు. ఇప్పుడు నాకు ఈ సెలవుల్లో పెళ్లి చేసేస్తారంట. ఒక్కసారి ఆ మాధవకీ సంగతి చెబుతావా?” బేలగా అడిగింది విశాల.
“అవునా? అయితే మాధవ ఫ్రెండ్‌కీ సంగతి చెప్పి అడగమంటానే. ఇంకేం చెప్పమంటావ్?” అన్నాడు కోటి.
“ఇలా చెబితే చాలు, మాధవ వాళ్ళ పెద్దవాళ్ళు మా నాన్నతో మాట్లాడేస్తారు” అంది ధీమాగా.
“సరే అయితే, ఇంకెందుకాలస్యం, నేనిప్పుడే వెళ్ళిపోతానే” అంటూ సైకిల్ ఎక్కేసాడు కోటి.
“మళ్ళీ ఎప్పుడొస్తావ్?”
“ఒకట్రెండు రోజుల్లో” అన్నాడు కోటి సైకిల్ స్పీడ్ పెంచుతూ.
ఆలా వెళ్లిన కోటి వారం అయినా రాలేదు. కబురు చేసినా రాలేదు. విశాలకి అంతా అయోమయం అయిపోయింది. ఇంటికొచ్చే చుట్టుపక్కల బంధువులంతా “విశాలకి పెళ్ళైపోతే మమ్మల్ని మర్చిపోతుందా?” లాంటి సరదా మాటలు అంటూ ఉంటే ఆమె బిక్కమొహం వేసుకుంటోంది. వారం తర్వాత మొహం వేలాడేసుకుని వచ్చాడొకరోజు కోటి. ఆత్రంగా ఎదురుచూస్తున్న విశాల మొహం చూడలేక తలవంచుకున్నాడు కోటి. ఇంట్లో ఎవరూ లేరు. “మంచినీళ్లివ్వవే” అన్నాడు కోటి ఊపిరి పీల్చుకుంటూ.
“ఏమైపోయావురా?” అంది మంచినీళ్లిస్తూ.
‘కూర్చో’ అన్నట్టు సైగ చేసి వంటింటి మెట్ల మీద కూర్చున్నాడు కోటి.
“నువ్వు చెప్పిన వెంటనే మా ఫ్రెండ్‌కి చెప్పానీ సంగతి. వాడు వెంటనే చెప్పాడు మాధవకి. తను వాళ్ళింట్లో చెప్పి జవాబు చెప్పేసరికి వారం పట్టింది”
విశాల ఊపిరి బిగబట్టి వళ్లంతా చెవులు చేసుకుంది. కోటి వాలకం ఆమెకి ఆందోళన కలిగిస్తోంది.
“మాధవ వాళ్ళమ్మకి చెప్పాడంట నిన్ను చేసుకుంటానని. ఆవిడకి ఇష్టమేనంట. మీ నాన్న ఆవిడకి బంధువేనట. అన్న అవుతాడంట. కానీ వాళ్ళ నాన్నకి అస్సలు ఇష్టం లేదంట. మనం వాళ్ళు కోరినంత కట్నం ఇవ్వలేమంట. ‘నాకు ఒక్కడే కొడుకు నాకు పదెకరాల ఆస్తి ఉంది. వాళ్ళ ఆస్తి అంతా ఇచ్చినా నేను నా కొడుక్కి చేసుకోను. వాడినింకా పెద్ద చదువులు చదివించి ఇంకో పదెకరాలు తెచ్చే పిల్లను కోడలిగా తెచ్చుకుంటాను’ అన్నాడంట. నీకు తెలుసుగా మాధవ చాలా నెమ్మది మనిషి. వాళ్ళ నాన్న నెదిరించే ప్రసక్తే లేదు. కనక నువ్వు అన్నీ మర్చిపోయి, మీ నాన్న తెచ్చిన సంబంధం చేసేసుకోవే” అంటూ సమస్యకి పరిష్కారం చెప్పేశాడు కోటి.
‘అంత ధైర్యం లేని మనిషి విశాలను పెళ్లిచేసుకుంటాను అని ఆ రోజెలా చెప్పాడు తన మిత్రుడికి?’అన్న ఆమె కళ్ళలోని ప్రశ్న కోటికి అర్థం అయింది.
“పోన్లేవే. పిరికి వాళ్ళు ప్రేమకి అనర్హులంటారు కదా. మాధవ పిరికివాడు మరి. ఏం చేస్తాం? మనిద్దరం ఈ విషయం మర్చిపోదాం. నీకు మంచి భర్త దొరుకుతాడు. ఆల్ ది బెస్ట్ విశాలా!” అంటూ వెళ్ళిపోయిన కోటి మళ్ళీ విశాల పెళ్లి వరకూ రాలేదు.
అంతవరకూ, ఆశల, ఊహల పల్లకీలో ఉన్న విశాల గబుక్కున అందులోంచి దూకేసింది. వాస్తవాల నేలపై నిలబడి నిలదొక్కుకుంది. పెళ్లి చేసుకుంది. భర్త ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి. హైదరాబాద్ చేరుకుంది. ఒకే కొడుకు. అమెరికా వెళ్లి ఎమ్మెస్ చేసి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. అతనికిప్పుడు ముప్పై ఐదేళ్లు. అతనికి పెళ్ళయ్యి ఆరేళ్ళ పాప కూడా ఉంది. విశాల భర్త రిటైర్ అయ్యాక దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. హార్ట్ ఎటాక్‌తో విశాల భర్త అయిదేళ్ల క్రితం స్వర్గస్థుడయ్యాడు. కొడుకు దగ్గరికి ఏటా వెళ్లి ఓ అయిదారు నెలలు ఉండి వస్తూ ఒంటరిగానే ఉంటోంది విశాల.
మాధవ తండ్రి కోరిక మేరకు భీమవరంలో ఎమ్మే సోషల్ వర్క్ చదివినా అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కొన్నాళ్ళు ప్రయత్నించి ఊరుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఉన్నఊరిలోనే ఉండి వ్యవసాయం చూసుకున్నాడు. ఒక్క కూతురికీ లండన్‌లో ఉద్యోగం చేసే కుర్రాడిని తెచ్చి పెళ్లి చేసాడు. ఇప్పుడు అమ్మాయి అక్కడే ఉంది. ఆమెకి ఒక నాలుగేళ్ళ కూతురుంది. మాధవ భార్య పదకొండేళ్ల క్రితం కాన్సర్ వ్యాధితో మరణించింది. అప్పటికే తల్లీ తండ్రీ కూడా కాలం చేయడంతో, తానొక్కడూ తన ఊరిలో ఉండలేకపోయాడు. బంధువొకాయన ‘సూపర్ మార్కెట్ బిజినెస్ మరో బ్రాంచ్ తెరుస్తున్నాను. నీకు వీలయితే నాకు సాయంగా రమ్మ’నడంతో హైదరాబాద్ వచ్చేసాడు పదేళ్ల క్రితం మాధవ.
ఒక చిన్న పోర్షన్ అద్దెకి తీసుకుని మిత్రుడిచ్చిన దిల్‌సుఖ్‌నగర్ సూపర్ మార్కెట్‌లో కొంత పెట్టుబడి పెట్టి దాన్ని చూసుకుంటూ ఉంటున్నాడు.
గతం అంతా గుర్తు తెచ్చుకున్న మాధవ నోట్ చేసుకున్న ఫోన్ నంబర్‌ని జాగ్రత్తగా మొబైల్‌లో విశాలగారు అని ఫీడ్ చేసుకుని అపురూపంగా చూసుకున్నాడు. మరి కొంతసేపు ఆమెకి ఫోన్ చేసే విషయమై ఆలోచించాడు. చెయ్యకుండా ఒక్క క్షణం ఉండలేను అనుకున్న తర్వాత టైం చూసాడు. రాత్రి తొమ్మిదిన్నరయ్యింది. మరీ రాత్రి కాదులే అనుకుని ధైర్యం తెచ్చుకుని విశాల నంబర్ రింగ్ చేసాడు. ఫోన్ రింగ్ చప్పుడు కన్నా అతని గుండె చప్పుడు అతనికే పెద్దగా వినిపించింది వెంటనే కట్ చేసి గుండె కొట్టుకోవడం తగ్గాక మళ్ళీ రింగ్ చేసాడు. అటునించి “హలో ఎవరండీ?” అన్న విశాల గొంతు విని మూగవోయాడు. మరో రెండు సార్లు ఆమె ‘హలో హలో’ అని మరికొన్ని సెకన్లు ఎదురుచూసి ఫోన్ పెట్టేసింది. ఎవరనుకుందో? మరో రోజు చేస్తాను. అది ఖచ్చితంగా విశాల తియ్యని గొంతే అనుకుని ఆనందపడ్డాడు మాధవ. మరుక్షణం అతనికి ఆనందంతో నిద్ర పట్టేసింది.
***
ఒక రోజు వసంత టైలర్‌కి చీరలిచ్చి వస్తుంటే క్లాసుమేట్ ప్రేమజ్యోతి ఆమె అక్క స్వరూప కనబడ్డారు. వాళ్ళది కూడా వసంత ఊరే. ప్రేమజ్యోతి, వసంత డిగ్రీలో క్లాస్‌మేట్స్. స్వరూప టెన్త్‌తో ఆపేసింది. ప్రేమజ్యోతి అత్తగారిల్లు వసంత ప్రస్తుతం ఇల్లు కట్టుకున్న ఊరే. జ్యోతి భర్తకి బట్టల వ్యాపారం ఉంది. అప్పుడప్పుడూ ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు. కలిసి చాలా రోజులయ్యింది.
“ఎలా ఉన్నావు జ్యోతీ? మీ నాన్నగారు పోయినప్పుడు వచ్చాను. మీ ఇంటికి. మళ్ళీ కనబడలేదు” అడిగింది.
“అవునే. సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అయ్యింది. నూ అక్కా, చర్చికి వెళ్లి పక్కనే ఉన్న అనాథ శరణాలయానికి వెళ్లి భోజనాలు పెట్టి వస్తున్నాము” అంది జ్యోతి.
“అప్పుడే సంవత్సరం అయ్యిందా? రోజులెలా గడిచిపోతాయి చూడు. మీ అన్నయ్య, తమ్ముడూ కూడా వచ్చారా? వాళ్ళని చూసి ఎన్నాళ్ళయిందో?”
“లేదు. వాళ్లిద్దరూ మేము రాము ఏమీ చెయ్యము. మీరిద్దరే చూసుకోండి అన్నారు” అంటుంటే జ్యోతి కళ్ళలో నీళ్లు.
“అయ్యో! జ్యోతీ! మంచి పని చేసి వస్తున్నావు. కళ్లనీళ్లు పెట్టుకోకు. సరే పోనియ్! అలాంటివి జరుగుతూనే ఉంటాయిలే. బాధపడకు. ఈ రోజు మంచి పని చేసారు మీరిద్దరూ. అక్క ఉంటుందా? మా ఇంటికి తీసుకుని రా ఒక రోజు” అంది వసంత జ్యోతిని దగ్గరికి తీసుకుంటూ.
“అలాగే. మేము కూడా చాలా అలిసిపోయాం, ఉదయం నుంచీ. అక్క ఉంటుందిలే నాలుగు రోజులు. ఒకరోజు వస్తాం” అంది జ్యోతి తెప్పరిల్లుతూ.
అన్నట్టుగానే ఒకరోజు మధ్యాహ్నం ప్రేమ జ్యోతి, అక్క స్వరూపని తీసుకుని వచ్చింది. ఇద్దరూ కొంతసేపు కాలేజీ రోజుల్ని తలుచుకున్నారు. స్వరూప హైస్కూల్‌లో ఉండగా వసంతకి పరిచయం ఉంది. వాళ్లకి స్నాక్స్ పెట్టి, టీ పెట్టి తీసుకొచ్చింది వసంత. అక్క చెల్లెళ్ళిద్దరూ తండ్రి గురించి బాధపడ్డారు.
“మీ తమ్ముడూ, అన్నయ్యా ఎక్కడున్నారే?” అడిగింది వసంత.
“వాళ్లిద్దరూ మన ఊరిలోనే చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకుంటూ ఉన్నారు. ఇల్లు ఉంది కదా నాన్నది, దాన్ని తీసేసి ఇద్దరూ కలిసి మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇద్దరి పనీ బానే ఉంది. పిల్లలు కూడా మంచి చదువులే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. మా అమ్మ ఉన్నంతవరకూ అమ్మా నాన్నా వండుకుని తిన్నారు. అమ్మపోయాక ఓ పదేళ్లు ఆయన అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉండేవారు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి కనుక పెన్షన్ వచ్చేది. డబ్బు సమస్య లేదు. రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బు మా నలుగురికీ సమానంగా ఇచ్చాడు. తర్వాత, తర్వాత ఆయన కొంచెం నీరసపడడం వల్ల ఆయనకి సేవ చెయ్యవలసి వచ్చేది. దాంతో మా వదినా, మరదలూ విసుక్కునేవారు. అందుకే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. ఆఖరి అయిదేళ్లు మేమిద్దరమే చూసాం. ఆయన పెన్షన్ కోసం చూస్తున్నామని మా మీద నిష్ఠూరం వేసేవాళ్ళిద్దరూ. మాకు పౌరుషం వచ్చినా నాన్న మొహం చూసే ఊరుకునేవాళ్ళం. నాన్న పోగానే ఇద్దరూ వచ్చారు. ‘అయ్యే ఖర్చంతా నలుగురం పెట్టుకుందాం’ అన్నాం మేమిద్దరం. ‘ఇన్నాళ్లూ పెన్షన్ తిన్నారు కదా మీరే పెట్టండి’ అని మా మీద గొడవపడి వెళ్లిపోయారు. ఇంకా ఏవేవో చిన్న చిన్న గొడవలు చెప్పలేనివి ఉంటాయిలే” అంది జ్యోతి కన్నీళ్లు తుడుచుకుంటూ.
“పోన్లే. అయిపోయింది కదా! వదిలేయ్ జ్యోతీ” అంది వసంత.
“సంవత్సరం అయ్యింది కదా! అందరూ కలిసి ఈ రోజు చేసుకుందాం. రమ్మన్నాము. ‘మేము రాము ఏం చేస్తారో మీరే చేసుకోండి. ఆయనకి మేమేమీ ఇష్టం కాదు. మీరిద్దరూ అంటేనే ఇష్టం మీతోనే ఉన్నాడు కదా!’ అంటూ కోప్పడ్డారు అన్నయ్యా, తమ్ముడూ. వదినలకి కోపం ఉంటే ఉండొచ్చు కానీ అన్నలకయినా మా మీద అభిమానం ఉండాలి కదా వసంతా” అంది ప్రేమజ్యోతి బాధగా.
“భార్యా భర్తలది ఒకేమాటగా ఉంటుందిలే ఇలాంటి విషయాల్లో” అంది వసంత నిట్టూరుస్తూ.
బిక్క మొహం వేసుకున్న స్వరూపని పలకరిస్తూ “చెప్పక్కా” అంది వసంత.
“నాన్న మునిసిపల్ ఆఫీస్‌లో అటెండర్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన తన పెన్షన్ డాక్టర్ ఫీజులకీ, మందులకీ, తన చుట్టలకీ ఖర్చు పెట్టుకునేవారు. ఆయన మా ఇంట్లో ఉన్నందుకు ఖర్చుకి మాకు కొంత ఇచ్చేవారు. మిగిలినది దాచుకునేవారు. అందులోంచి మనవల పుట్టిన రోజులకి డబ్బులిచ్చేవారు. నాన్నకి మేం ఎప్పుడూ ఖర్చు పెట్టలేదులే. మాకు తండ్రి కాబట్టి, ఆడపిల్లలం కాబట్టి ప్రేమగా వండిపెట్టి, సేవ చేసేవాళ్ళం. కోడళ్ళకి కూతుర్లకున్న ప్రేమ ఉండకపోవడాన్ని తప్పు పట్టలేం కదా వసంతా?” అంది స్వరూప.
“అవును మన తండ్రి పట్ల మనకి మమకారం ఉంటుంది. అలాగే వాళ్ళ తండ్రుల పట్ల వాళ్ళకి ఉంటుంది. అసలీ పెద్దలు వృద్ధాప్యంలో తల్లి తండ్రులు కూతుళ్ళ దగ్గరుండే ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది కదా?” అంది వసంత వాతావరణం తేలిక చేసి స్వరూప వీపు రాస్తూ.
“నాన్నమరీ ముసలివాడై మా దగ్గరికి వచ్చాక, నాన్నని వాళ్ళు సరిగా చూడడం లేదని మేం అనకుండా, మా అన్నా తమ్ముడూ మా మీద నిష్ఠూరం వేసి పెన్షన్ కూతుళ్ళకి పెట్టాలన్న ఉద్దేశంతోనే మా దగ్గర ఉండిపోయాడన్న నెపం వేసి, మాతో మాట్లాడడం మానేశారు. నాన్న పోగానే వచ్చి కార్యక్రమం అవ్వగానే వెళ్లిపోయారు.” అంది జ్యోతి.
ఉబుకుతున్న కనీళ్లు తుడుచుకుంటూ అంది స్వరూప “నాకు చిన్నప్పుడు అమ్మా నాన్నా మేం నలుగురం ఉన్న రోజులు బాగా గుర్తొస్తాయి. ఆడుకుంటూ, నవ్వుకుంటూ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం అప్పుడు. ఆదివారం మేం నలుగురం పాడవోయి భారతీయుడా! లాంటి గ్రూప్ డాన్స్‌లు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అమ్మ వాళ్ళిద్దరికీ తలలు రుద్దుతుంటే మేమిద్దరం వాళ్ళ పాదాలు కుంకుడుకాయ తుక్కుతో రుద్ది శుభ్రం చేసేవాళ్ళం. ‘క్షమించితిమి పొమ్ము బాలా!’ అని వాళ్ళు వెక్కిరించేవాళ్ళు. వాళ్ళకి మంచి నీళ్ళందించీ, వాళ్ళు తిన్న పళ్ళాలు తీసీ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. అప్పటిలాగా ఇప్పుడు ఉండలేమా? మేం మా పిల్లల్ని పెంచేటప్పుడు నీది పెద్దమావయ్య పోలిక, నీవి చిన్న మావయ్య బుద్ధులు అని పోల్చుకుని ముచ్చటపడేవాళ్ళం. ఒక్కసారైనా అక్కచెల్లెళ్ళతో బాల్యంలో గడిపిన మంచి రోజులు మగపిల్లలకు ఎందుకు గుర్తు రావు వసంతా?”
“మన ఆడవాళ్లకుండే సున్నితభావాలు మగవాళ్ళకి ఉండవు. వాళ్ళు సంపాదనా మార్గంలో, సంసారాన్ని ఈదడంలో రాటుదేలిపోతారు. ఈ క్రమంలో వాళ్ళ భావాలూ, స్పందనలూ, ఆలోచనలూ భార్యతో మమేకమై పోతాయి. వాళ్లెలా నడిపిస్తే అలా నడవడం అలవాటైపోతుంది. అప్పుడింక వాళ్ళ బాల్యపు జ్ఞాపకాల ఆనవాళ్లు లేకుండా మాయమయి పోతాయన్నమాట. అంతా అంతే అనడం లేదు. ఎక్కువశాతం అని నా ఉద్దేశ్యం” అంది వసంత.
“నాకైతే నా పిల్లల ముందు అన్నదమ్ములతో కల్సి గర్వంగా తిరగాలని ఉంటుంది. వాళ్ళు మాతో మాట్లాడకపోవడం నాకెంతో చిన్నతనంగా ఉంటుంది. మేం ఏం తప్పు చేసాం? నువ్వు చెప్పు” అందామె మళ్ళీ.
“స్వరూపా! మీ అన్నకీ, తమ్ముడికీ మాత్రం తెలీదంటావా? తెలుసు, మీరేమీ తప్పు చెయ్యలేదని. కానీ దాని వల్ల ఫలితం ఏమీ ఉండదంతే. అదీ గాక ఒకోసారి టైం బాడ్ అనుకోవాల్సిందే. ఇవన్నీ తాత్కాలిక బాధలు. పెద్దవాళ్ళిద్దరూ వెళ్లిపోయారు. నా మాట విని, మీ అక్కచెల్లెళ్ళిద్దరూ అదే పనిగా బాధ పడడం మానెయ్యండి. ఒక పండగ రోజు ఇద్దరూ కలిసి వాళ్ళ కోసం స్వీట్స్, పళ్ళూ కొనుక్కుని మన ఊరికి వెళ్లి వాళ్ళిద్దరినీ పలకరించి రండి. మీ అమ్మ చూపించే ప్రేమ వాళ్ళకి చూపించండి. అప్పుడు మీ అమ్మను తప్పక గుర్తు చేసుకుంటారు వాళ్ళు.”
స్వరూపా, జ్యోతీ ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు ఈ సలహా బావుంది కదా అన్నట్టు.
“అవును. ఆ పని చెయ్యండి. అప్పుడు వాళ్ళేం చేస్తారు? ప్రేమగా మాట్లాడక? కాలం గడిచే కొద్దీ కోపాలు కరిగిపోతాయి. మన తరం వెనక్కి వెళుతోంది. మన పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ళకి బంధువులందరితోనూ ప్రేమగా ఉండే మంచి కుటుంబం ఉండడం మంచిది. లాభం వస్తుందని కాదు. అది కొత్త తరానికి మంచి సూచన అవుతుంది. పిల్లల్లో పిల్లలకి మిత్రత్వం ఏర్పడుతుంది. చదువుల్లో, ఉద్యోగాల్లో ఒకరికొకరు అవసరానికి మాట సాయంగా ఉంటారు. మనం అంతా ఒక పెద్ద కుటుంబం అనుకోవడం వాళ్ళకి భరోసానిస్తుంది” అంది వసంత.
ఇద్దరూ అలాగే అన్నట్టు తలూపారు. అలా మనసును తేలిక పర్చుకున్నాక, మరి కొంతసేపున్నారు వాళ్లిద్దరూ. వసంత కూతురి గురించీ కొడుకు గురించీ అడిగి వాళ్ళున్న ఆల్బమ్స్ అవీ చూసి బయలు దేరారు. ఇద్దరికీ బొట్టు పెట్టి జాకెట్టు ముక్కలిచ్చింది వసంత.
“పంతులమ్మగారూ! మీరు చెప్పిన పాఠం విన్నాం. మీరు చెప్పినట్టు చేస్తాం” అంది జ్యోతి తేలికపడిన మనసుతో వసంతను కౌగిలించుకుంటూ. వసంత నవ్వుతూ వాళ్ళకి వీడ్కోలు చెప్పింది.
(సశేషం)