నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-20

0
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

రజ్వీ గెలుపు

[dropcap]జూ[/dropcap]న్ 11, 1947 న స్వతంత్ర సార్వభౌముడిగా నిజామ్ తనను తాను ప్రకటించుకుని ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందన్న ‘ఫర్మాన్’ (ఆజ్ఞ) జారీచేయగానే  – రాష్ట్ర కాంగ్రెస్, భారతదేశంతో కలిసి ఉన్న బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోరుతూ ‘విలీనం కోసం సత్యాగ్రహం’ ప్రారంభించింది.

దీనికి బదులుగా – కాంగ్రెస్‍కు సవాలు విసుతురున్నట్లుగా, రజాకార్లు, సాయుధ    దళ స్వచ్ఛంద  సేవకులని  – హైదరాబాద్ ఆగస్టు 15 నుంచి స్వతంత్ర దేశమని రజ్వీ ప్రకటించాడు. అన్ని రకాల త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ముస్లింలకు పిలుపు కూడా ఇచ్చాడు రజ్వీ.

జూన్ 19న ఓ బహిరంగ సభలో  మాట్లాడుతూ రజ్వీ – “మహారాజు ఆజ్ఞను (ఫర్మాన్) ధిక్కరించటం, వ్యతిరేకించటం రాజు పట్ల  అవిశ్వాసాన్ని ప్రదర్శించినట్టే. రాజాజ్ఞలను విశ్లేషించవచ్చు. ఆ హక్కు అందరికీ ఉంది. స్వతంత్ర్యాన్ని ప్రకటించుకోవటం హైదరాబాద్ హక్కు. సార్వసార్వభౌమత్వం ముస్లింలదే” అని అన్నాడు.

ఈ వాదాలు, ప్రతివాదాలు, సవాళ్లు, ఎదురు సవాళ్ళు – సాయుధులైన రజాకార్లు, నిరాయుధులైన కాంగ్రెస్ కార్యకర్తల నడుమ ఘర్షణలుగా పరిణమించటం స్వాభావికంగా సంభవించింది. ఈ ఘర్షణలు రజాకార్లకు అనుకూలంగా ముగియటం వల్ల నిజామ్ ప్రభుత్వం ఈ ఘర్షణలను సంతృప్తితో  మౌన ప్రేక్షకుడిలా దర్శించింది.

జూలై 27న హైదరాబాద్ నగరంలో ఇత్తెహాద్ స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంది. రాష్ట్రంలో 345 కేంద్రాలలో ఆగస్టు 7న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో ‘భారతదేశంలో విలీనమయ్యే దినం’గా సంబరాలు జరిగాయి. ఈ సంబరాల సందర్భంగా 100 మంది అరెస్టయ్యారు. ప్రజలపై పలు ప్రాంతాలలో లాఠీచార్జి జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ అరెస్టయ్యాడు.

ఈ సవాలును కాంగ్రెస్ స్వీకరించింది. ఆగస్టు 15 న అన్ని భవనాలపై భారత జాతీయ జండాను ఎగురవేయాలని పిలుపునిచ్చింది.

ఆగస్టు 14, అర్ధరాత్రి, బొంబాయి – మద్రాసు ఎక్స్‌ప్రెస్ హైదరాబాదు చేరగానే, హైదరాబాద్ రాష్ట్ర పోలీసులు – రైలు బయటా, లోపలా ఉన్న భారత జాతీయ జండాలను తొలగించారు.

స్వతంత్ర దినోత్సవం రోజున స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వారిపై, దేశ జండా ఎగురవేస్తున్న వారిపై లాఠీచార్జి జరిగింది. కాల్పులు జరిగాయి. పెద్ద ఎత్తున అరెస్టులు సాగాయి. పోలీసులతో కలిసి  రజాకార్లు, ఎక్కడెక్కడ జాతీయ జెండా కనిపించినా దాన్ని చింపి పారేశారు. ఎన్ని రకాలుగా జాతీయ జండాను అవమానించవచ్చో అన్ని రకాలుగా అవమానించారు. భారత ప్రభుత్వానికి చెందిన భవంతులపైని జండాలు కూడా వీరి ఆవేశాగ్ని నుంచి తప్పించుకోలేక పోయాయి.

ఆగస్టు 29న రాజ్యాంగ సభలో పండిత నెహ్రూ  జండాకు జరిగిన అవమానాల పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. భారత జండాకు  హైదరాబాదులో ఎలాంటి అవమానాలు జరగలేదని నిజామ్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

రాష్ట్ర కాంగ్రెస్ ఆరంభించిన ‘భారత్‍లో విలీనం’ ఉద్యమం కార్చిచ్చులా వ్యాపించింది. 900 మంది భారతదేశ జండాను చేతపట్టుకుని  స్వచ్ఛందంగా అరెస్టయ్యారు.  ఆహార ధాన్యాలపై తప్పనిసరిగా కట్టాల్సిన పన్నును కట్ట నిరాకరించారు. గ్రామాలలో వేల సంఖ్యలో తాటి చెట్లను ధ్వంసం చేశారు. వందల సంఖ్యలో గ్రామీణ అధికారులు రాజీనామాలు  చేశారు. కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు, ప్రజలు కలసి సరిహద్దు ప్రాంతాలలోని కస్టమ్స్ (సుంకం వసూలు) భవనాలను ధ్వంసం చేశారు. స్కూళ్ళు, కాలేజీలలో వేల సంఖ్యలో విద్యార్థులు చట్టాన్ని ఉల్లంఘించారు.

రజ్వీ సైతం అత్యంత ఉత్సాహంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. హైదరాబాదు స్వతంత్రం, స్వేచ్ఛలు పొందిందని ప్రకటించాడు. నిజామ్ ప్రభుత్వం కనుక భారత్ యూనియన్‍తో కలిస్తే, ప్రభుత్వానికి తడాఖా చూపిస్తానని (direct action) బెదిరించాడు. భారత్‍లో విలీనమవ్వాలని సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించిన వారిపై దాడులతో దమనకాండ సాగించాడు. భయభ్రాంతులను చేశాడు. సికిందరాబాదు‍కు చెందిన హిందువులు పెద్ద సంఖ్యలో సికిందరాబాద్ వదిలి పారిపోయారు. భారత్ యూనియన్‍కు చెందిన ప్రాంతాలలో రక్షణ పొందారు.

భారత్‍లో విలీనమయ్యేందుకు గడువు తేదీ  ఆగస్టు 15 వచ్చింది, పోయింది. నిజామ్ విలీనానికి ఆమోదం తెలపలేదు. కాస్త ఓపిక పడితే చర్చలు ఫలప్రదమవుతాయని వాల్టర్ మాంక్టన్ ఆశించాడు. ఇంకో రెండు నెలల పాటు చర్చలు సాగించేందుకు లార్డ్ మౌంట్‌బాటెన్‍కు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విషయం సర్దార్ పటేల్‍కు నచ్చలేదు. ఈ కాల పరిధిలో హైదరాబాద్ తప్పనిసరిగా  తన శక్తిని పెంచుకోవాలని ఇత్తెహాద్ నాయకులు భావించారు. అమెరికా, ఇంగ్లండ్‌లతో దౌత్యపరమైన ఒప్పందాలు చేసుకునేందుకు బృందాలను పంపాలన్నారు.

ఆగస్టు 15 న తాను స్వతంత్ర సార్వభౌముడనయ్యానని, ఆగస్టు 27న ఫర్మాన్ (ఆజ్ఞ) ను జారీ చేశాడు నిజామ్. వెంటనే నిజామ్‍ను ‘ఘనత వహించిన మహారాజు’ (His Majesty) అని పిలవాలన్న ఉద్యమాన్ని ఇత్తెహాద్ ఆరంభించింది.

నిజామ్, భారత్‍తో రాజీ పడాలన్న దృఢ విశ్వాసాన్ని వాల్టర్ మాంక్టన్ వ్యక్తపరిచాడు. ఈ సలహా రజాకార్లకు ఆగ్రహం కలిగించింది. రజ్వి బహిరంగంగా అతడిని దూషించటం ప్రారంభించాడు. దాంతో నిజామ్, ప్రభుత్వం తరఫున చర్చలు జరిపే బృందం నుంచి  తాను వైదొగుతున్నట్టు ప్రకటించి వాల్టర్ మాంక్టన్ రాజీనామా చేశాడు. ఛత్తారీ నవాబ్, నవాబ్ అలీ యావర్ జంగ్‍లు కూడా రాజీనామాలు సమర్పించారు. వాల్టర్ రాజీనామా వార్త విని లార్డ్ మౌంట్‍బాటెన్ బాధతో “మన పని అయిపోయింది. మనం మునిగి పోయినట్టే” అన్నాడు. సర్ వాల్టర్ అతని తూరుపుముక్క లాంటి వాడు.

నిజామ్ కూడా ఆలోచనలో పడ్డాడు. తాను అనవసరంగా తొందరపడ్డానని భావించాడు. భారతదేశంతో చర్చలలో ఎంతో ఉపయోగపడే సమర్థుడిని అనవసరంగా దూరం చేసుకున్నట్లు భావించాడు. తేగే వరకూ లాగకూడదని అనుకున్నాడు.  భారత్‍తో జాగ్రత్తగా వ్యవహరించటం ప్రారంభించాడు ఇకపై. ఆగస్టు 17న, నవాబ్ ఛత్తారీ, “ఇంకో వారంలో చర్చలు ఆరంభించటం నిజామ్ అభీష్టం” అని సర్దార్‌కు ఉత్తరం రాశాడు. సర్దార్ సమ్మతించారు.

ఆగస్టు 24న, హైదరాబాద్ రాజ్యాంగ సలహాదారుగా వాల్టర్ మాంక్టన్‍ను భారత ప్రభుత్వంతో చర్చలు జరిపేట్టు ఒప్పించమని నిజామ్, మౌంట్‌బాటెన్‌ను అభ్యర్థించాడు. అతని అభ్యర్థన ప్రకారమే మౌంట్‌బాటెన్, వాల్టర్ మాంక్టన్‌ను చర్చలలో పాల్గొనమని అడిగాడు. కానీ మాంక్టన్ పట్టు విడవలేదు. తనపై చేసిన ఆరోపణలను రజ్వీ బహిరంగంగా ఉపసంహరించుకోవాలని కోరాడు. చివరికి సంధిలో పాల్గొన్న బృందంపై విమర్శలను ఖండిస్తూ, నిజామ్ ఫర్మాన్‍ను జారీ చేశాడు. తన రాజ్యాంగ సలహాదారును సంతృప్తి పరచాడు.

హైదరబాద్ ప్రతినిధి బృందం – ఛత్తారీ నవాబ్, సర్ వాల్టర్ మాంక్టన్, అలీ యావర్ జంగ్, సర్ సుల్తాన్ అహ్మద్‍లు ఢిల్లీకి బయలుదేరే సమయం ఆసన్నమైంది. కానీ సర్దార్ సంతోషంగా లేరు.

ఆగస్టు 24న సర్దార్ గవర్నర్ జనరల్‍కు లేఖ రాశారు. ఇతర సంస్థానాధీశులు ఆమోదించిన విలీన పత్రాలకి భిన్నంగా నిజామ్ విలీన పత్రం ఉండకూడదని కోరారు. ఒకవేళ భారత్‍తో విలీనం పట్ల నిజామ్ సందిగ్ధావస్థలో ఉంటే, ప్రజాభిప్రాయం (referendum)  సేకరించాలని కోరారు.

సర్దార్ కోరికను అనుసరించి, ఇతర రాజులు ఆమోదించిన విలీనపత్రంలోని నిబంధనలనే నిజామ్ కూడా ఆమోదించాలని మౌంట్‌బాటెన్ నిజామ్‍పై ఒత్తిడి తెచ్చాడు. సెప్టెంబరు 18న నిజామ్ తాను రాసిన ఉత్తరంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు. విలీనం ప్రస్తక్తి లేదన్నాడు. రెండు స్వతంత్ర రాజ్యాల నడుమ జరిగే ఒప్పందం లాంటి ఒప్పందం మాత్రమే తమ నడుమ జరగాలన్నాడు. భారత్‍లో విలీనం అవటం కానీ, హైదరాబాదులో చట్టం చేసే అధికారం భారత్‍కు ఉండే ఏ ఒప్పందం కానీ ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశాడు. ప్రజాభిప్రాయ సేకరణ అన్న ఆలోచననను కొట్టిపడేశాడు.

నిజామ్ సమర్పించిన ప్రాతిపదిక ప్రకారం హైదరాబాద్ సర్వస్వతంత్ర సార్వభౌమ రాజ్యం. భారత్‍‌తో కొన్ని విషయాలలో మాత్రమే సంబంధం ఉంటుంది. విదేశీ వ్యవహారాలలో భారత్ ప్రమేయం ఉండదు. హైదరాబాద్ సైన్యానికి అవసరమైన సైనికులను ఎంపిక చేయటం, వారికి ఆయుధాలు అందించి పోషించటం వంటి వన్నీ నిజామ్ ప్రభుత్వం అధికారంలో ఉంటాయి. సైన్యాధికారులను కూడా నిజామ్ నియమిస్తాడు. ఒకవేళ భారత్‍కు పరాయి దేశం నుంచి ప్రమాదం ఉన్న సందర్భంలో నిజామ్ సైన్యం భారత్ సహాయానికి వస్తుంది. కానీ ఒకవేళ భారత్‍కు ప్రమాదం పాకిస్తాన్ నుంచి సంభవిస్తే మాత్రం నిజామ్ సైన్యం – భారత్‍కు సహాయం చేయదు. సమాచార వ్యవస్థ హైదరాబాద్ అధికారంలోనే ఉంటుంది. కానీ పాలన సౌకర్యార్థం భారత్‍లో అమలులో ఉన్న ప్రామాణికాలను హైదరాబాద్‍ కూడా పాటించేట్టు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

భారత్‍లో విలీనమవమని ఎలాంటి ఒత్తిడిని ఆమోదించం అన్న బ్రిటీష్ వారి ప్రతిజ్ఞను గుర్తు చేశాడు నిజామ్. బెదిరింపు ఉత్తరం చివర్లో ఉంది. ఒకవేళ భారత్‍లో విలీనమవమని భారత ప్రభుత్వం పట్టుబట్టే పక్షంలో చర్చల వల్ల లాభం లేదు. అవి అనవసరం. ఒకవేళ చర్చలు ఆగిపోతే, తనకూ, లార్డ్ మౌంట్‌బాటెన్‍కు నడుమ జరిగిన చర్చలను తాను బహిర్గతం చేస్తాడు. ఇదీ నిజాం బెదిరింపు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here