[dropcap]ఫో[/dropcap]న్ మోగుతున్న శబ్దంతో ఒక్కసారిగా తెలివైంది. బెడ్ పక్కన పెట్టిన ఫోన్ తీసుకొని ఇంత రాత్రి వేళ ఎవరా అనుకుంటూ ఫోన్ చూసాను.
బుజ్జక్క కాల్ చేస్తోంది. ఫోన్ ఎత్తి “హలో” అన్నాను
”పిన్నికి బాగులేదు, బయలుదేరి వచ్చేయ్” అని ఆదుర్దాగా చెప్పి ఫోన్ పెట్టేసింది.
టైమ్ చూసాను. రాత్రి రెండవుతోంది. నా శ్రీమతి పిల్లలు గాఢ నిద్రలో వున్నారు. వెంటనే బట్టలు మార్చుకొని మా ఆవిడని లేపి విషయం చెప్పి బండి బయటికి తీసి పిన్ని ఇంటి వైపు బయలుదేరాను. చలికాలం అవటం చేత ముఖానికి చల్లగాలి రివ్వున కొడుతోంది. మనసంతా భారంతో వున్న నాకు జ్ఙాపకాల దొంతరలు తోడై ఎప్పడో చిన్ననాటి సంగతులను గుర్తుచేస్తున్నాయి..
***
సుశీల పిన్ని, అమ్మకు సొంత చెల్లెలు. సుశీల పిన్ని భర్త రాఘవరావు మా నాన్నకు కజిన్ బ్రదర్, నాకు బాబాయి. రెండు వైపులా బంధుత్వం. రాఘవరావు బాబాయి అంటే అందరికి ఎంతో గౌరవం. చిన్నప్పుడే ఆయన తల్లి చనిపోతే మా తాతయ్యే, మేనల్లుడని ఎంతో గారాబంగా పెంచి పెద్దచేసి మా పిన్నిని ఇచ్చి పెళ్లి చేశారని అమ్మ చెప్తుండేది. బాబాయి పెద్దగా చదువుకోకపోయినా చిన్నప్పుడే విజయవాడ వెళ్లి టింబర్ డిపోలో ఒక వర్కర్‌గా చేరి అంచలంచెలుగా ఎదిగి కష్టపడి పైకొచ్చారు. స్వంత టింబర్ డిపో పెట్టారు. బాబాయి పిన్నిలకు ఒక్కతే కూతురు, మగ పిల్లలు లేరు. బుజ్జి.. బుజ్జక్కగా పిలవడం మా అందరికి అలవాటు.
మా ఇంట్లో వున్న ముగ్గురు మగ పిల్లలం, చిన్న పిన్ని ఇద్దరు మగ పిల్లలు కలసి ఐదుగురం స్కూల్ సెలవుల్లో పండగ రోజుల్లో విజయవాడ సుశీల పిన్ని ఇంటికి వెళ్ళి సరదాగా గడిపేవాళ్లం.
పిన్ని ఇంటికి ఎప్పుడు వెళ్లినా చుట్టాలతో సందడిగా వుండేది. బాబాయి పొద్దున్నే టింబర్ డిపోకు వెళ్లిపోయేవారు. ఎందుకో ఆయనంటే మాకు కొంచెం భయంగా వుండేది. ఆయనటు వెళ్లగానే మేం ఆడింది ఆట పాడింది పాటలాగా వుండేది. విజయవాడ కొత్త వంతెన డౌన్‌లో ఆరువందల గజాల స్థలంలో ఓ మూలలో ఇల్లు వుండేది. మిగతా స్థలం అంతా టింబరు డిపోకు సంబంధించిన పెద్ద పెద్ద దుంగలు కర్రలతో నిండి వుండేది. వాటి మీద కూర్చొని టీలు తాగూతూ టిఫిన్లు తింటూ సరదాగా గడిపేవాళ్లం.
పిన్ని మా అందరిని ఎంతో ప్రేమతో చూసేది, అడిగినవన్ని కొనిపెట్టేది. సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరం విజయవాడ చేరిపోయేవాళ్లం. ఇంక అక్కడ చేసే అల్లరికి ఆనందాలకు సరదాలకు అంతే లేదు. అలాగే పిన్ని ఎప్పుడు వరంగల్ వచ్చిన మాకు పెద్ద పండగే. స్కూల్ డుమ్మా కొట్టి మరి పిన్నితో వుండిపోయేవాళ్లం. పిన్నితో అంత అనుబంధం ఉండేది.
పిన్ని ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించడం నేను చూడలేదు. చేతికి ఎముక లేదేమో అన్నంతగా దానధర్మాలు చేసేది. ఇంటికి ఎవరొచ్చినా అన్ని రకాల వంటలు చేసి తినేదాక వెళ్లనిచ్చేది కాదు. ఎంత పెడితే అంతా తినాల్సిందే, తినేదాక వదిలేది కాదు. బాబాయి రాఘవరావు జేబులోంచి తీసిన డబ్బులే అందరికి ఖర్చు పెట్టేది. ఆయన ఈ విషయంలో పెద్దగా పట్టించుకునేవాడు కాదు.
ఎవరికి ఏ అవసరం వచ్చినా “సుశీలక్క”, “రాఘవరావు బావా” అంటూ బంధువులు ఇల్లు చేరేవారు. అందరి అవసరాలకు సహాయం చేసేది పిన్ని. బంధువులు ఎవరింట్లో పెళ్లి జరిగినా అవసరమైన సామాగ్రి అంతా ఇచ్చి వచ్చేది.
ఇంటి చుట్టుపక్కల వాళ్లు సుశీలమ్మ గారు అనుకుంటూ వచ్చి వారి అవసరాలకు డబ్బులు, బంగారం తీసుకువెళ్లడం నాకు బాగా గుర్తు. కాని అవి చాలా వరకు అటే వెళ్లేవి. తిరిగి వచ్చేవి కావు. అలా ఎందరికో ఎన్నో ఇచ్చింది పిన్ని, అవేవి మళ్లీ తిరిగి రాలేదు.
పిన్ని వాళ్ల ఇంటి గోడకు ఆనుకొని సత్యసాయిబాబా మందిరం వుండేది. అది చాల పెద్ద మందిరం. పొద్దున సాయంకాలం భజనలు, భక్తి పాటలు వినపడుతూ వుండేవి. భక్తులు చాలా మంది వస్తుండేవారు. కిటికిలోంచి ఇవన్ని మాకు కనబడుతూ వుండేవి. ఓ రోజు పిన్ని వాళ్లింట్లో ముందు గదిలో వున్నాను. ఇంటి వెనక సందులో ఆగకుండా గిన్నెతో కొట్టిన శబ్దం వినపడుతోంది. ఏంటా అనుకుంటూ వెళ్లి చూస్తే, సన్నగా పొట్టిగా మేలిమి ఛాయతో వున్న ఓ ముసలావిడ సాయిబాబా మందిరం పిట్ట గోడకు ఆనుకొని స్టీలు డబ్బాతో కొడుతోంది, నన్ను చూసి ఆపి “సుశీలమ్మ గారు లేరా బాబు” అని అడిగింది
దాంతో నేను వెళ్లి పిన్నిని లేపి ఆవిడ పిలుస్తుందని చెప్పాను. పిన్ని గబ గబ వెళ్లి ఆ స్టీలు బాక్స్ తీసుకొని దాన్నిండా వేడి వేడి అన్నం, కూర ఒక గిన్నెలో పెరుగు వేసి ఇచ్చింది. ఇదంతా చూసిన నేను
“ఎవరావిడ” అని పిన్నిని అడిగాను,
“ఆవిడ పేరు కోకిల, ఆవిడకు నా అన్నవారు ఎవరూ లేరు, సాయిబాబా మందిరంలోనే వుంటుంది” అని చెప్పింది.
కొన్ని ఏళ్లు ఆవిడకు అలాగే అన్నం పెట్టింది పిన్ని. ఆవిడను అందరం కోకిలమ్మగా పిలిచేవాళ్ళం. ఆవిడ ఎప్పుడూ “సుశీలమ్మ దేవత” అంటూ వుండేది.
ఆవిడ టిఫిన్ బాక్స్‌తో శబ్దం చేయగానే “అదిగో, నీ భక్తురాలు కోకిలమ్మ వచ్చింది వెళ్లు” అనేవాళ్లం నవ్వుతూ. మా పిన్ని చేత్తో భోజనం ఇస్తేనే ఆవిడ తీసుకునేది, ఇంట్లో ఎవరు ఇచ్చినా తీసుకునేది కాదు.
పిన్ని, వంటలు అద్భుతంగా చేసేది. మటన్, చికెన్, చేపలు, గుడ్లు ఎంతో రుచికరంగా వండిపెట్టేది. కాని నాకు ఊహా తెలిసిన దగ్గర నుంచి పిన్ని నాన్ వెజ్ తినడం నేను చూడలేదు. కనీసం ముట్టుకునేది కూడా కాదు. నాన్ వెజ్ కోయడానికి కత్తిపీట వేరుగా ఉండేది. ఎవరైన కోసి ఇస్తేనే వండేది.
వండేటప్పుడు అందులోకి మసాలాలు దూరం నుండి ముద్దలుగా చేసి ఒక లెక్కతో వేస్తూ వుండేది. చేసిన వంట మాత్రం అమోఘంగా వుండేది. ముక్క మిగలకుండా పడి పడి తినేవాళ్లం.
ఒకరోజు పిన్ని వాళ్లింట్లో పడకొని వున్నాను. తెల్లారినట్టుంది, “లేరా బాబు పొద్దెక్కింది” అంటూ ఎక్కడో నిద్రమత్తులో వున్న నన్ను పిలుస్తున్నట్టుంది. దుప్పటి తీసి ఎవరా అని చూసాను. నా ముందు ప్లేట్ పట్టుకొని అమ్మోరు తల్లిలా నిలబడి వుంది పిన్ని.
అందులో చూస్తే ఇడ్లీలు వడలు ఒక గిన్నెలో చట్నీ వున్నాయి.
“ఏంటి” అన్నాను లేచి.
“టిఫిన్” అంది.
నా కర్థం కాలేదు.
“ముఖం కడగకుండ టిఫిన్ ఏంటి” అన్నాను.
“అయితే తొందరగా ముఖం కడుగు” అంటూ నేను బ్రష్ చేసేదాక అలాగే నిల్చొని, తినేదాక వదల్లేదు. ఎవ్వరిని ఆకలితో ఉంచేది కాదు పిన్ని. ఇప్పటికి నాకది ఓ తీపి జ్ఞాపకం.
బాబాయి ఎప్పుడూ టింబర్ డిపో వ్యాపారంలో బిజీగా వుండేవారు. పిన్నికి బుజ్జక్కకు మాత్రం ఏ లోటు రానిచ్చేవారు కాదు. మంచి బట్టలు బంగారం కొనిపెట్టేవారు.
ఇంటికి ఎవరొచ్చినా మర్యాద చేసేవారు. ఆయన చాలా సింపుల్‌గా వుండేవారు. కాళ్లకు స్లిప్పర్లు తప్ప మంచి చెప్పులు వేసుకోవడం నేనేప్పుడూ చూడలేదు. కుర్రవాడిలాగా అప్పుడప్పుడు జీన్స్ ప్యాంటులు వేసుకొని తిరిగేవారు. పిన్ని లాగే ఆయనకు కూడా మనసులో కల్మషం వుండేది కాదు.
ఏ ఒక్క రోజు కూడా డబ్బును పొదుపు చేయాలని పిన్ని ఆలోచించలేదు. డబ్బు వ్యవహారాలన్ని బాబాయి చూసుకునేవాడు. అవసరం వున్న వారికి మాత్రం అప్పుగా బాబాయి దగ్గర నుండే డబ్బులు ఇప్పించేది పిన్ని.
ఈలోపు బుజ్జక్క పెళ్లి నిశ్చయమైంది. సంపాదించిన ఆస్తంతా బుజ్జక్కకే ఇచ్చి పెళ్లి చేశాడు బాబాయి. అది జరిగిన కొన్నాళ్లకు, ఓరోజు బాబాయి పొద్దున్నే టింబర్ డిపోలో పేపర్ చదువుతుండగా చాతిలో నొప్పి అంటూ దగ్గర వున్న హాస్పటల్‌లో చేరారు. ఆ ఒక్క రోజే మూడు సార్లు గుండె నొప్పి వచ్చింది, దాంతో ఆయన పోయారు. అంతే పిన్నికి కష్టాలు మొదలయ్యాయి. బాబాయి బ్రతికున్నప్పుడు పిన్నికి అది స్వర్ణయుగం. డబ్బుకు తిండికి లోటుండేది కాదు. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. ఈ హఠాత్ పరిణామంతో మొదటి సారిగా పిన్నికి లోకమంతా చీకటైంది. అంతా అంధకారంలా తోచింది.
కష్టాలు మొదలయ్యాయి. ఆదాయం లేదు. ఇవ్వాల్సిన వాళ్లు ఇచ్చేది లేదు పొమ్మన్నారు. టింబర్ డిపో మూతపడింది. అయినవాళ్లు, బయటి వాళ్లు మోసం చేశారు. ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియని పిన్ని మొదటిసారిగా డబ్బు గురించి ఆలోచించసాగింది. అవసరానికని బంగారం తీసుకన్నవాళ్లు ముఖం చాటేసారు. తను అడగలేదు. చూస్తుండగానే వున్న కొద్ది ఆస్తులన్ని కరిగిపోయాయి. అందరి అవసరాలకు అన్ని ఇచ్చిన సుశీల పిన్ని తనకు మాత్రం ఏమి మిగుల్చుకోలేకపోయింది.
ఇంక తను విజయవాడలో వుండలేక బంధువుల దగ్గరకు వరంగలు వచ్చేసింది. భారమైన గుండెతో విజయవాడకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది.
ఎంతో వైభవంగా బ్రతికి పదిమందికి అన్నం పెట్టిన పిన్ని వరంగలులో ఒక చిన్నరూము అద్దెకు తీసుకోవాల్సివచ్చింది. అలాగే డబ్బులకూ ఇబ్బందిపడాల్సి వచ్చింది. అయినవాళ్లు కూడా దూరం పెట్టారు. కాని వాళ్లు ముఖం చూపడమే మానేసారు. వున్న దాంట్లో మేమంతా కొద్దో గోప్పో సాయం చేసాం. అలా కాలం వెళ్లబుచ్చుతున్న తరుణంలో పిన్ని జీవితంలో మరో కుదుపు,
చెడు అలవాట్లకు బానిసై, ఆస్తిని హారతి కర్పూరంలా అవజేసి, అప్పుల పాలై, అనారోగ్యంతో అల్లుడు పోయాడు. పిన్ని ఇంకా కుంగిపోయింది. అందరికి ఆపన్న హస్తం అందించిన పిన్ని అగాధంలోకి కూరుకుపోసాగింది. తన వాళ్లెవరిని కలవడం మానేసింది. గదికే పరిమితమైంది. ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ పెట్టలేదు.
దాంతో కిడ్ని సమస్యతో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చిపడ్డాయి. క్రమంగా ఆరోగ్యం క్షిణించడం మొదలుపెట్టింది. డాక్టర్లు డయాలసిస్ చేయాలన్నారు. ఒక్కసారి డయాలసిస్ మొదలుపెడితే కంటిన్యూ చేపించాలని చెప్పారు. అంత డబ్బులు ఖర్చు పెట్టలేని పిన్ని మందులతోనే కాలం వెళ్లదీస్తోంది. ఇంత అనారోగ్య పరిస్థితిలోనూ ఎవరూ ఇంటికి వెళ్లిన వున్నదేదో చేసి పెట్టి తినేదాక వెళ్లనిచ్చేది కాదు. ఎందుకు ఇవన్ని అంటే “నా తృప్తి కోసం” అంటుంది..
ఈలోపు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు రావడం మొదలుపెట్టాయి..
***
పిన్ని వాళ్లు కిరాయికి వుండే ఇంటి ముందు నా బండి ఆపడంతో నా ఆలోచనలన్ని ఒక్కసారిగా ఆగిపోయాయి. గబగబ బండికి తాళం వేసి, వెళ్లి తలుపు తట్టాను. బుజ్జక్క తలుపు తీసింది. ఆదుర్ధాగా “ఎలా వుంది” అని అడిగాను
“ఇప్పుడు బాగానే వుంది. పొట్టలొ నొప్పి అంటూ చాలా సీరియస్ చేసింది. డాక్టరు వచ్చి మందులు ఇవ్వడంతో పడుకుంది” అని చెప్పింది. నేను కొంచెం స్థిమిత పడ్డాను. తెల్లవారేవరకు అక్కడే వున్నాను. పిన్ని లేచిన తరువాత “ఇప్పడేలా వుంది” అని అడిగాను.
“పర్వాలేదు” అంది నీరసంతో.
దగ్గరున్న బంధువులందరికి ఫోన్ చేసాను. ఆదివారం అవడంతో అందరూ ఇళ్లలోనే వున్నారు. వెంటనే బయలుదేరుతామని చెప్పారు. ఈ లోపు బుజ్జక్క ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడటం వినపడుతోంది. బయటికి వచ్చిన బుజ్జక్క పార్వతి ఫోన్ చేసిందని, ఇన్ని రోజులు అడ్రస్ తెలీక రాలేదని అమ్మను చూడటానికి ఈ రోజు వస్తానందని చెప్పింది. ‘పార్వతి’ నాకు ఊహా తెలిసినప్పటినుండి పిన్ని ఇంట్లో పనిచేసేది. ఇంచుమించు పిన్నంత వయసుండేది పార్వతికి. ఇంట్లో మనిషి కిందే లెక్క. పార్వతికి ఏ లోటు లేకుండా చూసుకునేది పిన్ని. బాబాయి పిన్ని చేసిన సాయంతోనే తన ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది పార్వతి. పుస్తె మట్టెల దగ్గర నుంచి అన్ని సమకూర్చింది పిన్ని. పార్వతికి పిన్ని అంటే చెప్పలేని అభిమానం.
నేను ఫోన్ చేసిన వారందరు వచ్చారు పిన్నిని చూడటానికి. మేం మాట్లాడుతుండగా ఓ యువకుడిని వెంటబెట్టుకుని వచ్చింది పార్వతి. పిన్నిని చూడటంతోనే..
”అమ్మగారు” అంటూ ఒక్కసారిగా బావురుమంది. పార్వతిని చూసిన ఆనందంలో పిన్నికూడా కన్నీటి పర్యంతమైంది. మా అందరి గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి.
పార్వతి వెంట వచ్చిన యువకుడి కంటిలో కన్నీటి తడిని నేను గమనించాను.
ఆ యువకుడు మెల్లిగా పిన్ని దగ్గరగా వచ్చి “అమ్మగారు నన్నుగుర్తు పట్టారా” అని అడిగాడు.
పిన్ని అయోమయంగా చూస్తోంది.
”అమ్మగారు నా మనవడు, లలిత కొడుకు” అని చెప్పింది పార్వతి
”నువ్వు లలిత కొడుకువా, ఎంత పెద్దవాడివయ్యావ్ రా” అంది పిన్ని.
“ఈడు బొంబాయిలో పెద్ద డాట్టరు ఉద్యోగం చేస్తున్నాడు, ఆ రోజు మీరు ఈడి సదువుకు సాయం చేయకపోతే సదువు ఆగిపోయేది అమ్మగారు, అయ్యగారికి తెలికుండా మెడలో గొలుసు తీసిచ్చారు. మీరిచ్చిన ఆ గొలుసు అమ్మేసి, ఆ డబ్బుతో ఆడు సదువుకున్నాడు. ఈ రోజు గొప్పోడయ్యాడు. ఇదంతా మీ సలువే అమ్మగారు” అంటూ పిన్ని పాదాలపై పడి ఏడ్చింది పార్వతి.
“అవునమ్మగారు నాకు మీరిచ్చింది డబ్బు కాదు, జీవితం. ఒక జీవితాన్ని నిలబెట్టారు. అందుకే మీ పేరే నా కూతురికి పెట్టుకున్నాను” అన్నాడు ఆయువకుడు.
అప్పుడే బుజ్జక్క అందరికి కాఫీ తెచ్చింది.
ఏదో మరిచిపోయినట్టుగా ఆ యువకుడిని చూస్తూ “అయ్యో.. ఏమైనా తిన్నావా రా బాబు, దోశలు వేసి పెట్టనా” అంటూ లేస్తున్న పిన్నిని చూసి అందరం ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం.
”వద్దు అమ్మగారు” అంటూనే ఆ యువకుడు పిన్ని మెడికల్ రిపోర్ట్స్ అడిగాడు.
బుజ్జక్క ఇచ్చిన రిపోర్ట్స్ చూసిన యువకుడు “ఏం పర్వాలేదు, ముంబయికి రండి. అంతా నేను చూసుకుంటాను, నేను రేపు వెళ్లిపోతాను. మీకు టికెట్స్ అవి పంపిస్తాను. అక్కడికి వచ్చేయండి” అని వివరాలన్ని చెప్పి పార్వతి, ఆ యువకుడు వెళ్ళిపోయారు.
***
ఆఫీస్ నుండి బండి మీద ఇంటికి బయలుదేరాను. జేబులో ఫోన్ మోగుతున్న శబ్దం చిన్నగా వినిపిస్తోంది. బండి పక్కకు ఆపి ఫోన్ చూసాను, ఏదో తెలియని నెంబరు.
“హలో” అన్నాను.
అవతలి నుండి బుజ్జక్క.
“ఏమైంది” ఆదుర్దాగా అన్నాను.
“జీవన్ దాన్ ద్వారా దొరికిన కిడ్నీ సరిపోయింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మ ఆరోగ్యం నిలకడగా వుంది” అని బుజ్జక్క ఆనందంతో చెప్పింది.
ఎంతో టెన్షన్‌తో వున్న నా మనసు చాల తేలికైంది. రెట్టించిన ఉత్సాహంతో బండి స్టార్ట్ చేసి బయలుదేరాను. ఎప్పుడో పిన్ని చెప్పిన మాటలు నా చెవులకు రీ-సౌండ్‌తో వినపడుతున్నాయి..
“దేవుడు ఎక్కడో లేడురా, మనలోనే మన ముందే మరో మనిషిలో వున్నాడు. నువ్వు సరిగ్గా చూస్తే కనపడతాడు..”