నేటి సిద్ధార్థుడు-3

    0
    4

    [box type=’note’ fontsize=’16’] బాలల కోసం సంచిక ప్రత్యేకంగా అందిస్తున్న సీరియల్ సమ్మెట ఉమాదేవి రచించిన “నేటి సిద్ధార్థుడు“. ఇది మూడవ భాగం. [/box]

    8

    [dropcap]త[/dropcap]మ ప్రాంతానికి వచ్చిన ఈ ఇరువురిని చూసి “ఏ మందులో, మాకులో అమ్ముకోవడానికో వచ్చారో..!  లేక ఏదయినా వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చారో..!” అనుకున్నారు అక్కడి ప్రజలు.

    కొంత దూరం సాగిన తరువాత అక్కడ ఒక ఇంటిముందు వజ వజ వణుకుతున్నఒక పండు ముదుసలి కనిపించాడు. అతను చాలా దుఃఖపడుతున్నట్లుగా అనిపించింది సిద్దార్థునకు. అతనిని చూడగానే సిద్ధార్ధుని మనసు కదిలిపోయింది చెప్పలేని భావమేదో ఎదను కుదిపేసింది. సిద్ధార్థుడు తన అశ్వాన్ని ఆపి ఒక పక్కన నిలిచి..

    “గురువర్యా అతను ఎవరు..? ఎందుకు అలా ఉన్నాడు..? అతనిని చూస్తే భయంగా బాధగా ఉన్నది.?  అతనికి ఏమయ్యింది?” అని ప్రశ్నలు కురిపించాడు.

    “ఏమీ కాలేదు నాయనా! ఆందోళన వలదు. అతనికి వృద్దాప్యం వచ్చినది. సుమారు అరవయి ఏళ్ళు దాటినా తరువాత మనుష్యులు క్రమముగా తమ శక్తులను కోల్పోతారు. ఇన్నాళ్లు ప్రపంచాన్ని చూపిన కన్నులు అలసి చూపును మందగిస్తాయి. ఇన్నాళ్లు శబ్దాలను చురుకుగా గ్రహించిన చెవులు ఇప్పుడు పూర్తిగా వినలేకపోతాయి. ఇక స్వరములో వణుకు ప్రారంభం అవుతుంది. చర్మంపై ముడుతలు వస్తాయి. నిటారుగా నడవలేరు. వేగంగా కదలలేరు. తప్పని సరిగా ఇతరుల సహాయం మీద ఆధారపడవలసి వస్తుంటుంది అలా ఆధారపడడం ఇష్టంలేని కొందరు క్రుంగిపోతుంటారు.”

    “అయ్యో గురువర్యా…! ఎందుకంత క్షోభపడాలి…? వృద్ధాప్యం రాకుండా చూసుకోవచ్చు కదా..?”

    “అలా చూసుకోలేము నాయనా…! అది జీవితంలో సహజంగా వచ్చే పరిణామం “

    “అంటే ఇలాంటి స్థితి అందరికీ వస్తుందా గురువర్యా…?”

    “అవును కుమారా…! ఎవరికయినా ఇది తప్పదు. చూడు నేను కూడా పెద్దవాడిని అవుతున్నాను. కాస్త ముందు వెనుకగా నేను కూడా కొన్నిరోజులకు కొన్నిశక్తులను కోల్పోతాను. “ నేనే కాదు, మీ తండ్రి,  మేనమామలు మీ తల్లిగారు, పిన్నిగారు, అతనూ, ఆమె ఇలా అందరూ ఎప్పటికయినా వృద్దులుగా మారలసిందే…”

    సిద్ధార్థుడు కొంతసేపు మౌనం వహించాడు… జారిపోతున్న ధైర్యాన్ని మూటకట్టుకున్నాడు. అతని గుండె బరువెక్కింది. వెనక్కి మరలిపోయి తడ్రిగారిని చూడాలి అనిపించింది. అమ్మతో మాట్లాడాలి అనిపించింది. ఇక ముందుకు సాగలేనేమో అనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. తనను తానూ నియంత్రించుకున్నాడు. ఆ ముదుసలిని సమీపించి మాటకలిపాడు.

    “ఎవరు బాబు మీరు…? నాకు నమస్కరిస్తున్నారు…” ఆనందంగా ఆశ్చర్యంగా అడిగాడు

    “తాతగారు! మీరెందుకో బాధపడుతున్నట్లుగా ఉన్నారు..?”

     “వయసు మీదపడి మూలన పడ్డ ముసలివాడిని. నాకు బాధ కాక మరేముంటుంది నాయనా…?”

    “అలా ఎందుకు అనుకుంటారు తాతగారు…? ముసలివారయితే ఏం ? మీరు మాలో ఒకరు కదా…?”

    “మా నాయనే, మా నాయనే…! బంగారంలాంటి మాట అన్నావు. కానీ అందరూ నీలా అనుకోవద్దు…?”

    “ఎందుకు అనుకోరు…? అసలు తాతగారు మీకు వచ్చిన లోటేమిటి నాతో చెప్పండి.”

    “చిన్నవాడివి ఎక్కడి నుండో వచ్చి మరెక్కడికో వెళ్లిపోయే బాటసారివి. నా బాధ విని నువ్వేమి చేస్తావు నాయనా! మా కోడలు పిల్ల కాస్త దాహం ఇస్తే పుచ్చుకుని నీ దారిని నువ్వు సాగిపోనాయనా!” కినుకగా అన్నాడు. సిద్ధార్థుడు వెళ్లి ఆ తాతా పక్కనే కూర్చున్నాడు. అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు..

    “పోనీలే తాతా నీవు నాకు ఏమీ చెప్పుకోకు. నేనే నీ దగ్గర కాస్సేపు కూర్చుని కాస్త ఎండా తగ్గగానే వెళ్లిపోతాను” అన్నాడు. యువరాజు కరస్పర్శకు కదిలిపోయిన తాతకు కన్నుల్లో నీళ్లుతిరిగాయి.

    “ఏమి చెప్పమంటావు నాయనా…! వయసులో ఉన్నప్పుడు చక్రం తిప్పిన వాడిని. ఇప్పుడో చక్రం ఊడిన బండిలా పడిఉన్నాను.”

    “శరీరానికి వచ్చిన వయసు మనసుకు కూడా వస్తే, అన్నీ చంపుకుని ఒక ప్రక్కన కూర్చునేవాడిని.  కానీ మనసు ఆగదుగా…! నాలా వయసు పైన పడినవాడికి  రోజంతా అలా కూర్చుని కూర్చుని, ఏమీ తోచక ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆశ… కానీ ఎవరికీ చెప్పే ఓపిక ఉండదు. ఏవేవో చెప్పుకోవాలని ఆరాటం. ఎవరూ వినరు… ఏదేదో చెయ్యాలని తపన. ఏమీ చేయలేను. ఏదో తోచిన సలహా చెప్పాలని తాపత్రయం. అది ఎవరికీ అక్కరలేదు. మా పెద్దవాళ్ళ గోడు వింటానికి అంత తీరిక ఎవరికుంటుంది చెప్పు బాబు…? ఎవరి జీవితం వారిది అయిపోయింది.” కన్నులు చెమరించగా అన్నాడు.

    సిద్ధార్ధుని మనసు భారమయ్యింది. ఏదేదో అనాలనుకుని వచ్చేముందు తన వారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు.

    “తాతా మీకు ఎంత మంది సంతానం?” అడిగాడు

    “ముగ్గురు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు.”

    “ఇన్నాళ్లు మీరు వారిని పెంచి పెద్దచేశారు కదా! ఇప్పుడు మిమ్ములను వారే సంరక్షించాలి కదా!”

    “సంరక్షించడం అంటే ఏమిటి? తిండి పెట్టడం బట్ట ఇవ్వడమా? అది బాగానే చేస్తున్నారు. ఈ వయసులో మేము తినే పంచభక్ష పరవన్నాలేమి ఉంటాయి కనుక.  వేసుకునే పట్టు పీతాంబరాలేమి ఉంటాయి కనుక? మాకు కావలసింది ఓ చల్లని పలకరింపు, ఒక మంచి మాట, మన్ననా.”

    “అంటే మీ బిడ్డలు మిమ్ముల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదా తాతా?”

    “నేను నా బిడ్డలను తప్పు పట్టడం లేదు కుమారా…! ప్రపంచమంతా వృద్ధుల బాగోగులను చూసుకోని పిల్లలను తిడుతూనే ఉంటుంది గాని, నేను నా లాంటి వృద్దులు ఎప్పుడు మరణిస్తామో తెలియదు. వాళ్లేమో ఎదిగిన పిల్లలు. తమ భవిష్యత్తును నిర్మించుకుంటున్న వారు.  వారి వారి పనులు మానుకుని మేము మరణించేదాకా వారు మా దగ్గరే ఉండి సేవ చేయాలంటే ఎలా చేయగలుగుతారు…?”

    అతను ఇక మాట్లాడలేక ఆయాసపడి ఆగిపోయాడు. “మీది ముందుకు పోయేతరం, మాది. మట్టికి మరలి పోయే తరం. ఇది ఎప్పటికీ తరగని అంతరం… మీరంతా చల్లగా ఉంటే మాకంతే చాలు నాయనా” దుఃఖంతో అతనికి గొంతు పట్టేసింది. సిద్ధార్థుడు అతనికి మంచినీరు ఇచ్చి కొన్ని మధుర ఫలములను ఇచ్చి భుజం తట్టి ముందుకు అడుగువేసాడు.

    9

    దూరం నుండీ అంతా గమనించిన గురువుగారు వచ్చి అతన్ని కలుసుకున్నాడు. సిద్డర్థుని గంభీరమయిన మోము చూసి “తధాగతుని గాథలో వలే ఇతను కూడా వికల మనస్కుడయినాడు. అది విరక్తికి దారితీయదు కదా..?” అని ఒకింత భయపడ్డాడు.

    జ్ఞానముని భయపడుతున్నట్లుగానే అంతలో ఒక శవం ఎదురు వచ్చింది.

    గురువుగారు మ్రాన్పడిపోయారు. ఏదయితే జరుగకూడదు అనుకున్నారో అదే జరుగుతున్నందుకు అతను అమితంగా కలవర పడిపోసాగాడు. వెంటనే కుమారుని పర్యటన గురించి అమితంగా ఆందోళన పడిన మహారాణి మాలినీదేవి గుర్తుకు వచ్చింది. అక్కడినుండి సిద్ధార్థున్నీ దూరంగా తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ ఒక్క అడుగు కూడా వేయడానికి వీలులేకుండా దారంతా జనం నిండిపోయారు. సిద్ధార్థుడు అశ్వమును ఒక పక్కన ఆపి నిలిచి చూసాడు.

    “ఏమి జరిగినది…?” అని ఒక గ్రామస్తున్ని అడిగాడు.

    “మా రంగయ్య చనిపోయాడు. అయ్యో రంగయ్య..! మమ్ములను వదిలి వెళ్లిపోయావా.?” అంటూ ఏడవసాగాడు.

    సిద్ధార్థుడు వెర్రిగా అందరి ముఖాల్లోకి చూస్తున్నాడు. అతనితో అనుబంధం ఉన్నవారంతా అతని గురించి చెబుతూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఆడవాళ్లు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఆ దారంతా జనం  రంగయ్య మంచితనం గురించి పలురకాలుగా చెప్పుకుంటున్నారు. అక్కడ వినబడుతున్న ఏడుపులు, ఆ అగరు వాసనలు. అక్కడ రాలిపడుతున్న పూల పరిమళాలు.. అంతా ఆ వాతావరణమంతా భీతావాహకంగా అనిపించి మనసును తొలచివేస్తున్నది.

    అక్కడ అంతఃపురంలో పొందుతున్న సౌఖ్యాలు… గడిపిన జీవితం, చదివిన శాస్త్రాలు వేరు. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నది వేరు. ప్రత్యక్షంగా ప్రజల రాగోద్వేగాలను చూస్తున్నాడు. ఈ అనుభవాలన్నీ ఆశ్చర్యంగాను, కడు ఆవేదనగాను ఉన్నాయి.

    “అయ్యో రంగయ్యా…! పట్టుమని నలభయి నిండనే లేదు. నీ భార్య పిల్లలు ఏమి కావాలయ్యా…! మమ్ములను ఇంత అనాయ్యం చేసావేమయ్యా  రంగయ్యా…” అంటూ ఏడుస్తున్నారు. ఆ రంగయ్య తనకు ఏమీ కాకున్నా సిద్ధార్థునికి కూడా దుఃఖం కలిగింది.

    “ఇప్పుడు ఏమి చేస్తారు?” అని అడిగాడు గురువు గారిని.

    “ఏమి చేస్తారు కుమారా? మట్టినుండి పుట్టిన మనిషిని, మరణించిన తరువాత ఇక మంటిలోనే కలుపుతారు నాయనా?”

    “మరణం గురించి కేవలం పుస్తకాలలోనే చదువుకున్నాను. ఇప్పటిదాకా మరణించిన వారికి ఎవరినీ చూడలేదు. అసలు మరణం అంటే ఏమిటి గురువుగారు?”

    “మరణం అంటే… ఆయువు పోవడం. మరల తిరిగిరాని లోకానికి చేరుకోవడం. అమ్మ కడుపున పుట్టిన దగ్గరనుండి మనిషి, శ్వాసిస్తూ, చరిస్తూ, చైతన్యవంతుడిగా ఉంటాడు. ఎప్పుడయితే ఊపిరి ఆగిపోతుందో అప్పుడు మరణం సంభవించినట్లు. ఎప్పుడయితే మరణం సంభవిస్తుందో ఇక ఆ  చైతన్యం, ఆ జీవంపోయి శవంగా మారిపోతాడు. నిర్జీవుడయిపోతాడు. ఇక అప్పటిదాకా మనిషి అని మనం చెప్పుకునే వాడిని ‘శవము’ అంటాము. చైతన్యంలేని ఆ ‘శవము’ మరి ఎందుకు పనికిరాదు. ఆత్మ శరీరాన్ని వీడిపోతుంది. ఆత్మలేని ఆ కాయం నిరర్ధకం. అందుకే అట్టి ఆ శవాన్నీ ఖననంగాని దహనంగాని చేసేస్తాము.”

    సిద్ధార్థునికి కొంత అర్థమయి, కొంత అర్ధంకాక అయోమయంలో ఉన్నాడు. వారి దుఃఖాన్ని చూడలేకపోతున్నాడు.

    గ్రామస్తులు శవాన్ని తీసుకుని ముందుకు సాగిపోయారు. కానీ ఆ డప్పుల గోల ఇంకా సిద్ధార్థుని చెవిలో మారు మ్రోగిపోతున్నది.

    “అసలు మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుంది…?” అశ్వాన్ని అధిరోహించి గురువుగారిని అడిగాడు.

    “అది తెలిస్తే ఇంకేమి తండ్రి…?  ఎవరికీ ఎప్పుడు ఎక్కడ మరణం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు.” అన్నాడు జ్ఞానముని.

    “ఖేదపడకు సిద్దార్థా…! పుట్టిన ప్రతీవారికి మరణం తప్పదు. ఈ వియోగపు బాధా తప్పదు ఇది  అనివార్యమయిన దుఃఖం నాయనా!”  దారంతా సిద్ధార్థుడు చాలాసేపు చాలా ప్రశ్నలు వేసాడు.  జ్ఞానముని చాలా ఓపికగా జవాబులు చెప్పాడు.

    ఉదయం ఉదయభానుని వలే ఉన్న సిద్ధార్థుని మోము, ఇప్పుడు చీకట్లు కమ్ముకున్న ఆకాశం వలే మారిపోయింది. సమీప గ్రామ శివార్లకు చేరుకున్నారు, అప్పటికే అక్కడకు చేరుకున్న కొందరు అనుచరులు అక్కడ యుద్ధసమయంలో ఏర్పాటు చేసే చిన్న డేరాలాంటిది వేసి తాత్కాలిక వసతిని ఏర్పాటు చేశారు. కేవలము తనకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానికే భటులు వచ్చారుగాని ఎక్కడా తన విహారానికి అడ్డు తగలనందుకు సంతోష పడ్డాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని, స్నానమాచరించి అల్పాహారం తీసుకున్నాడు. అలసిన దేహం విశ్రాంతిని కోరింది గాని, మానసికంగా ఎంతో సంఘర్షణను అనుభవిస్తున్నాడు సిద్ధార్థుడు. ఆలోచనలోమునిగి పోయిన అతను అర్ధరాత్రికి వరకు నిదురపోలేకపోయాడు.

    “ఇక అమ్మ దగ్గరకెళదాం అంతఃపురానికి చేరుకుందాము.” అని అంటాడేమో అనుకున్నారు గురువుగారు. మర్నాడు ఉదయమే లేచి రెండవరోజు పర్యటనకు సిద్ధమయిన సిద్ధార్ధుని చూసి ఒకింత తెరిపిన పడ్డారు. “మొండివాడు సుమా…!” అనుకున్నారు. అల్పాహారం ముగించి సంచారానికి బయలుదేరారు గురుశిష్యులు.

    10

    “గురువర్యా అందమయిన పళ్ళాలలో అమర్చిన మధుర ఫలాలనే చూసాను గాని ఇలా చెట్లకు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న కూరగాయలను ఎన్నడూ చూడలేదు. ఎండలో అక్కడ పొలాలలో పని చేసుకుంటున్న రైతులను చేస్తుంటే మేమంతా… ఎంత  సుఖభోగాలలో తేలుతున్నాము అనిపిస్తున్నది. సుందర నిర్మితమయిన అంతఃపుర భవనాలలో మేము నివశిస్తున్నాం ఇక్కడ… రెక్కలు వంచి కష్టపడుతూ సామాన్యులు కడుతున్న సాధారణమయిన ఇళ్లను నేనెప్పుడూ చూడలేదు” తన ఆశ్చర్యానందాలను గురువు గారితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు  సిద్ధార్థుడు. ఆ దారిలో ఒక పాప చాలా పెద్దగా ఏడుస్తున్నది. పాపను సమీపించి

    “ఓ చిన్నారి…! నీ పేరేమిటమ్మా  ఎందుకమ్మా ఏడుస్తున్నావు…?” అడిగాడు.

    “నా పేరు సుజాత!” ఆ అమ్మాయి కళ్ళు తుడుచుకుని చెప్పింది.

    “అవును నాయన పేరుకే సుజాత. కానీ నా కడుపున పుట్టిన నష్ట జాతక.”

    “అదేంటమ్మా…! అట్లా అంటున్నావు…?”

    “ఏమి చెప్పను నాయనా..! గత నెల రోజులుగా మా సుజాత ఆరోగ్యం బాగుండడం లేదు. నోటికి రుచించక ఏమి పెట్టినా తినడంలేదు. రోజు రోజుకి నీరసంగా అయిపోతున్నది.

    “అయ్యో వైద్యుల వారిని పిలిపించక పోయారా…?

    “వైద్యున్ని మేము పిలిపించేంత కలిగినవారం కాము నాయనా…! మేమే ఆయన దగ్గరకు వెళ్ళాము. వారు కొన్ని ఔషధములు ఇచ్చి మంచి ఆహారం, మంచి ఫలములు ఇవ్వడం వలన పాప ఆరోగ్యం బాగుపడుతుందని వైద్యుడు చెప్పారు.”

    “మరి మంచి ఫలములు ఇవ్వొచ్చుకదా తల్లీ.!”

    “మా వంటి సామాన్యులం మంచి పండ్లు ఫలములు ఎక్కడ కొనగలం చెప్పు నాయనా! అది అడగక అడగక నోరు తెరిచి సీమరేగిపండ్లు కావాలన్నది. అవేమో చాల ఖరీదు. ఈ జామపండు తిన్నామ్మా అంటే తినదు. పోనీ అరటిపండయినా తినమ్మా అంటే వద్దు అంటున్నది. ఒకటే ఏడుపు” ఆ తల్లి పరిస్థితి చూసి సిద్దార్ధుని ముఖం బాధతో ముడుచుకుపోయింది. తమాయించుకుని..

    గురువుగారి వద్దనుండి కొన్ని సీమరేగి ఫలములను తీసుకుని ఆ పాపకు ఇచ్చాడు. పాప ఆనందంతో గెంతులు వేసింది. సిద్ధార్థుడు గురువుగారితో ముందుకు సాగిపోయాడు. దారంతా పలురకాల వ్యయవసాయ పంట పొలాలను చూసాడు. కొన్ని రకాల పంటల పేర్లు తెలియనందున వాటి పేర్లు అడిగి తెలుసుకున్నాడు. ఆయా పంటలు ఏయే ప్రాంతాలలో ఎంత వరకు పండుతున్నాయో రైతులను అడిగాడు.

    ఒక్కో పంటా పండే నేలా, అవి పండించడానికి అయ్యే  ఖర్చు తెలుసుకున్నాడు. ఒక్కో పంటా పండే శీతోష్ణస్థితిగతులు.. రాజ్య ప్రజల ఆహార అవసరాలు గురించి పలువుర్ని సంప్రదించి ఆకళింపు చేసుకున్నాడు. ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సిద్ధార్ధుని మనసులో వేల వేల ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి.

     (ఇంకా ఉంది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here