[box type=’note’ fontsize=’16’] “పవిత్ర రమదాన్ దినాలలో జకాత్ ప్రాధాన్యం వహిస్తుంది. జకాత్ భావన్ ప్రాధాన్యాన్ని, అంతరార్ధాన్ని వివరించే వ్యాసం యండి. ఉస్మాన్ ఖాన్ రచించిన “జకాత్ పేదల హక్కు” [/box]
[dropcap]ఇ[/dropcap]స్లామ్ అనే సౌధానికున్నటువంటి మూలస్తంభాల్లో ఈమాన్, నమాజ్‌ల తరువాత ‘జకాత్ ‘ మూడవ స్తంభంగా పరిగణించబడుతుంది. పవిత్ర ఖురాన్‌లో కనీసం 32 చోట్ల నమాజుతోపాటు జకాత్ ప్రస్తావన వచ్చింది. దీన్ని బట్టి జకాత్ ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. జకాత్ అంటే పవిత్రత, పరిశుధ్ధత అని శాబ్దిక అర్థాలున్నాయి. కాని ఇక్కడ సంపన్నులు పవిత్రులయ్యే ఉద్దేశంతో సంవత్సరానికోసారి తమ సంపదలోనుండి రెండున్నర శాతం చొప్పున పేదసాదలకు, ధర్మసంస్థాపనా కార్యాలకు వెచ్చించవలసిన ధన, కనక వస్తువుల్నిధార్మిక పరిభాషలో ‘జకాత్ ‘ అంటారు. ఈ విషయాన్నిముహమ్మద్ ప్రవక్త(స) ఇలా వివరించారు:
‘జకాత్ ‘ చెల్లింపును అల్లాహ్ విశ్వాసులకు విధిగా చేశాడు. ఇది వారిలోని సంపన్నుల నుండి వసూలు చేసి, వారిలోని నిరుపేదలకు అందజేయబడుతుంది’.
ఖురాన్‌లో ఇలా ఉంది:
‘సత్యాన్ని విశ్వసించి, సదాచార సంపన్నులై నమాజును ఆచరిస్తూ, జకాతు (పేదల ఆర్థిక హక్కు)ను నెరవేరుస్తూ ఉండేవారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం సిధ్ధంగా ఉంది. పరలోకంలో వారికి ఎలాంటి భయం కాని, దుఖం కాని ఉండదు.’
మరొక చోట ఇలా ఉంది: ‘వారు నమాజును స్థాపిస్థారు, జకాతు చెల్లిస్తారు. అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ భయపడరు. అలాంటివారే సన్మార్గంలో నడుస్తారన్న ఆశ ఉంటుంది’.
ఇస్లామ్ ధర్మం మానవులపై రెండు రకాల బాధ్యతలనుమోపుతుంది. ఒకటి: దేవుని హక్కులు. రెండు: దాసుల హక్కులు. నమాజు మనిషిని దేవుని హక్కులు నెరవేర్చేందుకు సమాయత్తపరిస్తే, జకాత్ దాసుల హక్కులు నెరవేర్చడం గురించిన బాధ్యతా భావాన్నిజనింపజేస్తుంది. ఈ రెండు హక్కుల్నిసక్రమంగా నెరవేర్చడాన్నే ఇస్లామ్ అని, అలా నెరవేర్చినవారిని ముస్లిమ్ అని అంటారు.
మానవుల మనుగడ కోసం దేవుడు ఈ ప్రపంచంలో రకరకాల సంపదలు సృష్టించాడు. అందుకని మనిషి దైవానికి కృతజ్ఞుడై ఉండడంతో పాటు, ఆ సంపదలోని కొంతభాగాన్ని నిరుపేదలైన సాటి మానవ సోదరులక్కూడా అందజేయాలి. ఆర్థిక స్థోమత కలిగిన వారు తమ వద్దనున్న ధన, కనక, వస్తు పశుసంపదలో ప్రతి సంవత్సరం రెండున్నర శాతం చొప్పున తీసి పేదల సాదల హక్కు చెల్లించాలి. ఇదే జకాత్. అంతేకాకుండా, ధాన్యం, అపరాలు, పండ్లు, కూరగాయలు తదితర భూఉత్పత్తుల నుండి కూడా జకాత్ తీయవలసిటుంది. దీన్ని ‘ఉష్ర్’ అంటారు. సంవత్సరానికి ఎన్నిపంటలు పండిస్తే అన్నిసార్లు ఉష్ర్ తీసి పేదసాదలకు పంచాలి. వర్షాధార పంటల నుండి అయితే పదిశాతం, ఖర్చుతో కూడుకున్న నీటి పారుదల సౌకర్యం వల్ల పండే పంటలైతే ఐదు శాతం చొప్పున ఉష్ర్ తీయవలసి ఉంటుంది. ఇదే విధంగా పశుసంపదపై కూడా జకాత్ చెల్లించాలి.
జకాత్ ఎవరుచెల్లించాలి?
ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ జకాత్ చెల్లించాలి. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ(ర) ప్రకారం ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా ఉపదేశించారు: ‘ఐదు ఉఖియాల కంటే వెండి తక్కువగా ఉంటే దానిపై జకాత్ లేదు. ఖర్జూరం ఐదు వసఖ్‌ల కంటే తక్కువ ఉంటే దానిపై జకాత్ లేదు. అలాగే ఒంటెలు ఐదుశాల్తీలకంటే తక్కువ ఉంటే వాటిపై జకాత్ లేదు. ఈ పరిమాణం దాటితే జకాత్ చెల్లించడం తప్పనిసరి.’
ఆ కాలంలో కొంతమంది ధనవంతుల వద్ద సంపద ప్రధానంగా ఈ మూడు రూపాల్లోనే ఉండేది. అందుకే ప్రవక్త మహనీయులు సంపద ఏ రూపంలో ఉండేదో దానికి సంబంధించిన జకాత్ వివరాలు తెలియజేశారు. ఐదు’వసఖ్ ‘లంటే ముఫ్ఫయ్ మణుగులన్న మాట. ఆ రోజుల్లోఒక చిన్నకుటుంబం ఏడాదికాలం గడపడానికి ఐదు వసఖ్‌లు అంటే ముప్ఫయి మణుగుల ఖర్జూరాలు సరిపోయేవి. అలాగే వెండి ఐదు ‘ఉఖియా’ లకంటే ఎక్కువ ఉంటే జకాత్ తప్పనిసరి అవుతుంది. ఐదు ఉఖియాలంటే రెండు వందల దిర్హంలు. తూకం ప్రకారం చూస్తే యాభైరెండున్నర(52 ½ )తులాలు.
ఇదే విధంగా మేలుజాతి ఒంటెలు ఐదు దాటిఉంటేనే జకాత్ ఇవ్వవలసి ఉంటుంది. అందుకని ఈ పరిమాణమంత సంపద (ఏ రూపంలోఐనా సరే) కలిగిన వ్యక్తినే ధనవంతుడిగా పరిగణించి అతనిపై జకాత్ విధిగా నిర్ణయించడం జరిగింది. అలాగే జకాత్ చెల్లింపుకు బంగారం పరిమితి ఐదున్నర (5 ½ ) తులాలు. అంటే అటూ ఇటుగా 65 గ్రాములు. కనీసం ఐదున్నర తులాల బంగారం లేక దానికి సరిపడా నగదు ఎవరి దగ్గరైనా ఉండి, ఒక సంవత్సరం గడిచిపోతే వారిపై జకాత్ చెల్లింపు వాజిబ్ అయిపోతుంది. ఇంతకంటే తక్కువ పరిణామంపై జకాత్ లేదు. ఈ పరిమితికి మించిన సంపద ఏ రూపంలోనైనా (కొన్నిరకాల స్థిరాస్థులు మినహాయించి) – ఒక సంవత్సరకాలం నిల్వ ఉన్నట్లయితే ఆ మొత్తానికి రెండున్నర శాతం చొప్పున లెక్క కట్టి జకాత్ చెల్లించాలి. నిజానికి మానవుల వద్ద ఉన్నదంతా దైవప్రసాదితమే. దాన్ని ఒక అమానతుగా దైవం మన దగ్గర ఉంచాడు. అందుకని ఆయన చూపిన మార్గంలో, ఆయన ఆదేశించిన రీతిలో సద్వినియోగం చేసినప్పుడే దైవప్రసన్నత ప్రాప్తిస్తుంది. ఈ భావన ప్రతి విశ్వాసి హృదయంలో అనునిత్యం, నిరంతరం మెదులుతూ ఉండాలి. వాస్తవానికి జకాత్ వ్యవస్థ సమాజంలో ప్రజలకు ఆర్థికన్యాయం అందించే అపురూప సాధనం. ఇది ప్రజల హృదయాల నుండి స్వార్థం, సంకుచితత్వం, పిసినారితనం, కాఠిన్యం, ద్వేషం లాంటి దుర్గుణాలను దూరంచేసి, ఆ స్థానంలో ప్రేమ, పరోపకారం, త్యాగం, సహనం, సానూభూతి, స్నేహశీలత, ఔదార్యం, కారుణ్యం లాంటి అనేక ఉన్నత మానవీయ గుణాలను పెంపొందిస్తుంది. సమాజంలో ఆర్థిక అసమానతలు అంతంకావాలంటే అందరూ జకాత్ చెల్లించాలి.
రమజాన్ మాసంలోనే జకాత్ చెల్లించాలన్ననియమం ఏమీ లేకపోయినా, ఈ మాసం శుభాల దృష్ట్యా అధికశాతంమంది ప్రజలు ఈ నెలలోనే జకాత్ చెల్లింపుకు ప్రాధాన్యతనిస్తారు. ఈ మాసంలో చేసే దానధర్మాలకు అనేకరెట్లు పుణ్యం లభిస్తుందన్నవిషయం అందరికీ తెలిసిందే. అల్లాహ్ అందరికీ చిత్తశుధ్ధితో జకాత్ చెల్లించే సద్బుధ్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.