[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[ప్రశాంతంగా ఉన్న ఉదయపు ప్రకృతిని ఆస్వాదిస్తూ – తన కూతురు స్ఫూర్తిని తలచుకుంటుంది హిమబిందు. ఇంజనీరింగు కాలేజీలో జాయినైన స్ఫూర్తి – మర్నాడు కాలేజీకి వెళ్ళనని, ర్యాగింగ్ ఇబ్బంది పెడుతోందని ముందురోజు రాత్రి అమ్మతో చెప్పింది. ఇవే మాటలు ఒకప్పుడు తను కూడా తన తల్లితో అన్న విషయం గుర్తు చేసుకుంటుంది హిమబిందు. ఇటీవల మరణించిన తల్లి గుర్తు రాగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అప్పుడే అక్కడికి వచ్చిన భర్త సిద్ధార్ధ ఆమెను ఓదారుస్తాడు. అత్తగారిని తల్చుకుని బాధపడద్దనీ, ఆమె నడిచిన బాటలోనే మనం పయనించి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే ఆమె ఆత్మకి శాంతి కలుగుతుందని అంటాడు. కూతురు కాలేజీకి వెళ్ళనంటోందన్న విషయం సిద్ధార్ధకి చెబుతుంది. వెర్రితలలు వేస్తున్న ర్యాగింగ్‌ని తలచుకుని బాధపడతాడు. స్ఫూర్తిని నిద్రలేపి, ధైర్యం చెప్పాలనీ, లేకపోతే తను కూడా నాలాగే ఇబ్బందులు పడుతుందని అంటుంది హిమబిందు. సిద్ధార్ధ తనకి తెలిసిన హిమబిందు గతం గుర్తు చేసుకుంటాడు. హిమబిందుని తొందరగా లేచి, తయారవమని కాలేజీ బస్ వచ్చేస్తుందని హెచ్చరిస్తుంది వాళ్ళమ్మ ఉమాదేవి. తానీ రోజు కాలేజీకి వెళ్ళనని, ర్యాగింగ్ ఎక్కువగా చేస్తున్నారని తల్లితో అంటుంది హిమబిందు. భయపడకుండా ధైర్యంగా ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనే గుణం అలవర్చుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరని ఉమాదేవి కూతురికి హితబోధ చేస్తుంది. ‘నా జీవితంలా నీ జీవితం అవకూడదు. నీ జీవితం చూసి గర్వంగా తల పైకెత్తుకుని తిరగాలి నేను. నా ఆశలూ ఆశయాలూ అడియాశలవకూడదు. నా కోరికలు సఫలీకృతం చేయాలి నీవు’ అని ఉమాదేవి కూతురితో అంటుంది. తల్లి మాటలకి ధైర్యం తెచ్చుకున్న హిమబిందు కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇక చదవండి.]
అధ్యాయం-3
[dropcap]కా[/dropcap]లేజీ బస్సు కోసం ఎదురు చూస్తోంది బిందు. బస్సు కాంప్లెక్సు దగ్గర ఆగుతుంది. అందుకే ఆర్.టి.సి. కాంప్లెక్సులో బస్సు కోసం ఎదురు చూస్తోంది. తనున్నది బాలాజీ నగర్‍లో. కాంప్లెక్సు తన ఇంటికి దగ్గరే. అందుకే ఇంటి దగ్గర నుంచి పది నిమిషాల ముందర బయలుదేరి కాంప్లెక్సుకు వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తుంది.
కాంప్లెక్సు దగ్గర ప్రయాణికులు ప్రియుని రాక కోసం ఎదురు చూస్తున్న ప్రేయసిలా ఎదురు చూస్తూ ఉంటే బిందు కాలేజీ బస్సు కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది.
తనలాగే చాలా మంది అమ్మాయిలూ, అబ్బాయిలూ కూడా కాలేజీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన మాత్రం ఎబ్బెట్టు అనిపించింది బిందుకి. ఏఁటే, ఒసే అని పిలుచుకుంటున్న అబ్బాయిల పిలుపులు ఆమెకి నచ్చలేదు.
ఇంకా బస్సు రాలేదు. పరిసరాలు పరికిస్తోంది బిందు. కొత్తగా పెళ్ళయినవాళ్ళు, పెళ్ళికాని వారు, దాంపత్య జీవితంలో పాతబడిపోయిన వాళ్ళూ, అన్ని రకాల వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. యువకులు ఒక చోట చేరి జోకులు వేసుకుంటున్నారు. వారున్న ప్రదేశం సందడి సందడిగా ఉంది.
అన్ని విషయాలూ మాట్లాడుకుంటున్నారు. నేటి సినిమాల్లో చోటు చేసుకున్న అశ్లీలత గురించి, ముద్దు సీన్ల గురించి, బూతు పాటలు, డైలాగుల గురించి, డబల్ మీనింగు పాటలు, మాటల గురించి, పాటల రచయితల బూతు పాటలు, అర్థం పర్థంలేని పాటలు వ్రాయడం గురించి, ఆ పాటల్ని గొంతుకులు మార్చేసి, బొంగురు కీచు గొంతుకతో పాడుతున్న వర్ధమాన గాయనీ గాయకుల గురించి, నేటి మాధుర్యం లేని, స్పీడు యుగం సంగీతం గురించి అన్ని విషయాలూ వాళ్ళ మాటల్లో దొర్లుతున్నాయి.
అంతేకాదు సినిమాలోని రేప్ సీన్లు, ముద్దు సీన్లు, నేటి హీరోయిన్ల వస్త్రదారణ గురించి, అన్ని విషయాలూ మాట్లాడుకుంటున్నారు. నిజమే పూర్వం సినిమాలు, టి.వి.లో వస్తే మమ్మీ తనని చూడమంటుంది. ఆనాటి పాటలు వినడానికి ఎంత హాయిగా ఉంటాయి. ఆ పాటలు వింటూ ఉంటే మనల్ని మనమే మరిచిపోతాము. మాటల్లో, పాటల్లో ఎంత నిండుతనం ఉదాత్తత ఉంది. చవకబారుతనం కనిపించే కనిపించదు మాటల్లో, పాటల్లో.
వందేళ్ళ సినీ ప్రస్తానం గురించి గొప్పగా చెప్పుకునే గొప్పతనం నేటి సినిమాల్లో లేదు. వారం రోజులు కూడా ఆడలేని సినిమాలను కూడా పరువు కోసం, పలుకుబడిని ఉపయోగించి రెండు, మూడు థియేటర్లలో ఆడిస్తూ ఉంటే, బాగున్న మంచి చిన్న సినిమాలు ప్రదర్శించడానికి థియేటర్లు కూడా దొరకటం లేదు. సినీరంగంలోని కూడా మిగతా రంగాల వలే రాజకీయాలే. కొంత మంది చేతుల్లో థియేటర్ల గుత్తాధిపత్యం ఉంది. ఇప్పటి సినిమాలు తనకి నచ్చవు. అందుకే ఇప్పటి సినిమాలు తను చూడదు.
ఇంటర్‌లో తన క్లాసుమేటు గీతకి తన భావాలు నచ్చేవి కావు. ఆమె భావాలు, ఆమె ప్రవర్తన తనకి నచ్చేవి కావు. ఇప్పటి సినిమాలు తీరు తెన్నుల్ని తను విమర్శిస్తూ ఉంటే “బిందూ! ఇప్పటి కాలం అమ్మాయిగా నీవు ఆలోచించవు, ప్రవర్తించవు. అమ్మమ్మల కాలంలా చాదస్తంగా ఆలోచిస్తావు. నీ భావాలన్నీ పాత చింతకాయ పచ్చడి బూజుపట్టిన భావాలు” అని హేళన చేసేది.
“నీలా అంత అడ్వాన్సుడుగా నేనుండలేను. నేను పుట్టి పెరిగిన వాతావరణం అటువంటిది” అని తను అనేది. ఎందుకంటే గీతకి బోయ్ ఫ్రెండ్సు ఉన్నారు. వాళ్ళతో క్లోజ్‌గా మూవ్ అవుతుంది. వాళ్ళ భుజాలపై చేతులు వేసి మాట్లాడే చనువు ఆమెది. అబ్బాయిలు కూడా అలాగే ఆమెతో చనువుగా మూవ్ అవుతారు.
బిందు ఇలా ఆలోచిస్తున్న సమయంలో బస్సు వచ్చింది. ఆలోచనా ప్రపంచం నుండి బయటపడిన ఆమె బస్సు వేపు చకచకా అడుగులు వేసింది. అమ్మాయిలూ, అబ్బాయిలూ బస్సు ఎక్కుతున్నారు. అందరిలోనూ హుషారే.
“హలో!” పలకరించాడు ఓ కొంటె కుర్రాడు బిందును. తలవొంచుకుని బస్సు ఎక్కుతున్న ఆమె ఒక్కసారి తలపైకెత్తి చూసింది. ఆమెను పలకరించిన ఆ కొంటె కుర్రాడు తన చూపులు చప్పున మరో ప్రక్కకి మరల్చాడు. ఆమె మీద కొన్ని డజన్ల జతల అమ్మాయిలు, అబ్బాయిల కళ్ళు నిలిచాయి. వాళ్ల చూపుల బాణాలకి తట్టుకోలేనట్లు తడబడ్తున్న కాళ్ళతో బస్సు ఎక్కి తన సీట్లో కూర్చుంది బిందు.
“ఎవరివో, నీవెవరివో.. ఎవరివో, నీవెవరివో? దివినే వదిలి భువికేదెంచిన తేనెల వెన్నల సోనవో? ఎవరివో.. నీవెవరివో?” అంటూ బృందంలో ఓ యువ గాయకుడు తన భావాల్ని పాట రూపంలో వ్యక్తం చేస్తున్నాడు.
“తప్పు.. తప్పు.. గురూ! అలా కాదు నేను పాడుతాను విను” అంటూ “రంభా, ఊర్వశి, తలదన్నే, రమణీలలామ ఎవరీమె? నన్నే వెదుకుతు, భువికి దిగిన కన్నెక రతియే కాబోలు” మరో యువ హృదయం తన భావం వ్యక్తం చేసింది.
“మీవన్నీ బూజు పట్టిన భావాలూ – బూజు పట్టిన పాటలు. నేను పాడుతాను వినండి” అంటూ మరొక అబ్బాయి – హీరోయిన్‌ను టీజ్ చేస్తూ ఓ ఆధునిక సినిమాలో హీరో పాడిన పాటను పాడాడు. అమ్మాయిలూ అబ్బాయిలూ ఆ పాటకి అనుగుణంగా బస్సులోనే నిలబడి చప్పట్లు చరుస్తూ డాన్సు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం బిందుకి ఎబ్బెట్టుగా ఉంది. చిరాగ్గా ఉంది.
ఇలాంటి వాతావరణం తనింత వరకూ ఫేస్ చేయలేదు. మనస్సు అశాంతిగా ఉంది. భావోద్వేగాలు ఆమెలో చోటు చేసుకుంటున్నాయి. పెదవులు అదురుతున్నాయి. కోపంతో పళ్ళు కొరుకుతోంది. వదనం అరుణిమ దాల్చింది. వెర్రి కోపం ఆమెలో చోటు చేసుకుంటోంది.
“ఈ సీతాకోకచిలుక కొత్తగా జాయినయినట్టుంది. ఏ ఏరియావో? మంచి ఫిగరు. ఎవరు లైనులో పెడ్తారో?” ఓ కొంటె కుర్రాడి మాటలకి “అలాంటి వాటిలో నేను రెడీ” మరో ఆకతాయి అన్నాడు.
ఛీ.. ఛీ.. ఏం మగవాళ్ళు? ఈ సమాజంలో ఆడదానికి భద్రత కరువయింది. అభద్రతా భావం క్షణక్షణానికి ఆడదాన్ని వెన్నాడుతోంది. ముక్కు పచ్చలారని పసిపిల్లల నుండి కాటికి కాళ్ళు చాచే పండు ముసలి వరకూ ఆడదంటే ఈ మగాళ్ళు మృగాలుగా మారి కామంతో కళ్ళు మూసుకుపోయి లైంగిక దాడులకి పాల్పడుతున్నారు. ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా లాభం లేకపోతోంది. ఆడదాని మీద అత్యాచారాలు మరింత పెరిగిపోతున్నాయి.
సమాజంలో ఆడదానికి ఆదరణ లేదు. గౌరవం లేదు. వేదిక లెక్కి ‘ఆడదాన్ని ఉద్దరిస్తాం సమాజంలో ఆడదానికి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తాం’ అని ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నేతలు, అధికార్లు, ప్రభుత్వం, వాళ్ళు చేసిన చట్టాలు ఇవేవీ ఏమీ చేయలేకపోతున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్ళయింది కాని ఆడదాని జీవితంలో మాత్రం స్వాతంత్య్రం రాలేదు. ఆమె జీవితంలో చీకటి కోణాలు, అత్తింటి ఆరళ్ళు, వరకట్న చావులు, లైంగిక దాడులు. అందుకే జాతిపిత గాంధీజీ ఆనాడు ‘ఆడది అర్ధరాత్రి సమయంలో కూడా నిర్భయంగా తిరిగిననాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అనుకోవాలి’ అని అన్నారని తను వింది. ఆ మాట నిజమే అని అనిపిస్తోంది.
‘పేదరికం, ఆకలి వీటి వలన ఆడది సమాజంలో అంగడి బొమ్మగా మారిపోతే మరి కొంతమంది ఆడవాళ్ళు నాగరికత పేరుతో జీవమున్న శృంగార జీవులుగా మారిపోతున్నారు. కట్టు, బొట్టూ అన్నింటిలోనూ నాగరికత వచ్చింది. చాలీ చాలని బట్టలు ధరిస్తూ జుత్తు కత్తిరించుకుని విరగబోసిన జుత్తుతో తిరుగుతున్న నేటి ఆధునిక కాల వారసుల్ని చూస్తే మనస్సు బాధగా మూల్గుతుంది.’
‘ఈ మగాళ్ళు ఇలా రెచ్చిపోవడానికి ఇలాంటి ఆధునికతను ఒంట పట్టించుకున్న ఆడవాళ్ళు, అమ్మాయిలూ కూడా కారణం అని తనకి అనిపిస్తుంది. వాళ్ళ గాటనే తనలాంటి వాళ్ళను కడ్తూ అబ్బాయిలు ఇలా ఆట పట్టిస్తున్నారు. ఇది వాళ్ళ తప్పా? లేక నేటి ఆధునికత ముసుగులో వెర్రితలులు వేస్తూ ప్రవర్తిస్తున్న ఈ ఆడవాళ్ళదా?’ అని అనిపిస్తుంది తనకి. వయస్సుకి మించిన భావాలు బిందుని చుట్టుముడ్తున్నాయి.
‘ఆడదాన్ని అన్ని విధాలా అణచివేసి తన స్వార్ధ సిద్ధికి, అవసరాలకి ఆయుధంగా వాడుకుంటున్న మగవాడిలో మార్పు రావాలి. ఆడదానిలో కూడా అణుకువ, కట్టూ బొట్టూ, తీరులో ప్రవర్తనలో మార్పు వస్తే కాని సమాజంలో ఆడదాని స్థితి ఇంతే. నేటి సమాజంలో ఎక్కడ చూసినా ఆడదాని మీద – మానభంగాలు – వరకట్న చావులూ! నేటి ఆధునిక అత్యాచారాలూ సమాజంలో ఎక్కడ చూసినా ఆడదాని స్థితి ఇంతే. నాగరికతలో సమాజం ముందుకు అడుగు వేస్తోంది కాని, సమాజంలో స్త్రీ జాతి మనుగడలో మార్పులేదు’ ఆలోచిస్తోంది బిందు.
స్త్రీని పువ్వుతోనూ, పురుషుడిని ఆ పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెద ప్రాచీన కవులు సరిపోలుస్తూ వర్ణన చేస్తూ కవితలు వ్రాసారు. అది నిజమో, కాదో తెలియదు కాని, స్త్రీలో ఉన్న ఆకర్షణ శక్తికి పురుషుడు ఆమె చుట్టూరా తిరుగుతూ ఆమె దృష్టిలో తన మాటల ద్వారా, చేతల ద్వారా పడాలని తాపత్రయపడ్తాడు. అందుకు నిదర్శనమే బిందు యడల అబ్బాయిల ప్రవర్తన.
ఆడది కనిపిస్తే ఆకలి చూపులు విసురుతున్నారు కొందరు మగాళ్ళు. వాళ్ళ ఆ చూపులు చాలా రోజుల నుండి క్రూర మృగాన్ని తిండీ తిప్పలూ పెట్టకుండా బోనులో బంధిస్తే అది చూపించిన ఆకలి క్రోధపు చూపుల్లా ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ సంస్కారహీనులు కసిగా మనస్సులో అనుకుంటోంది.
ఆమెలో రకరకాల ఆలోచన్లు. తన ఇంటి పరిసరాల్లోనే ఇంజనీరింగు కాలేజీ ఉంటే ఎంత బాగుండును? ఇలా బస్సులో వెళ్ళే బాధ తప్పి ఉండేది. బస్సు కోసం నిరీక్షణ తప్పేది.
బస్సు గమ్యం చేరుకుంది. ‘అమ్మయ్య!’ అనుకుంది బిందు. ఆడదాని జీవితానికి ఎన్ని అగచాట్లు? బొత్తిగా ఆడపిల్లలకి, ఆడదనే వాళ్ళకి రక్షణ లేకుండా పోతోంది ప్రస్తుత పరిస్థితుల్లో.
బస్సు దిగిన బిందు కాలేజీ గేటు వేపు అడుగులు వేస్తోంది. కాలేజీ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. ఆ ప్రాంగణంలో కాలేజీ భవనం ఎత్తైన అశోక వృక్షంలా దర్జాగా, స్థిరంగా నిలబడి ఉంది.
అధ్యాయం-4
కాలేజీ ప్రాంగణం రకరకాల వృక్షాలు, పూల మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. ఆ ప్రాంగణంలో కాలేజీ భవనం అశోక వృక్షం అంత ఎత్తుగా, దర్జాను ఒలకపోస్తూ నిలబడి ఉంది స్థిరంగా.
అక్కడున్న వృక్ష సంపద నీడలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా నవ్వుకుంటున్నారు విద్యార్థులు – విద్యార్థినిలు. వాళ్ళు గుంపులు గుంపులుగా ఉన్నారు.
పరీక్షాధికారి దగ్గర విద్యార్థులు వినయంగా నిలబడి యున్నట్టు సీనియర్స్ అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర జూనియర్స్ అమ్మాయిలు, అబ్బాయిలు నిలబడి యున్నారు. జూనియర్స్ కళ్ళల్లో దీనత్వం, కంగారు, భయం భావోద్వేగాలు కలగపులగంగా అగుపిస్తూ ఉంటే సీనియర్స్ కళ్ళల్లో పైశాచిక ఆనందం, వినోదం, తమ సత్తా చూపాలనే అహంకారం, తమని ఎవరూ ఏమీ అనలేరన్న దీమా అగుపడ్తున్నాయి. కసాయివాడు బలిపశువుని కత్తితో నరకబోతున్న సమయంలో ఆ మూగజీవి కళ్ళల్లో అగుపడుతున్న దీనత్వ భావం జూనియర్స్‌లో అగుపడుతోంది.
సీనియర్స్ జూనియర్స్‌ని ర్యాగింగ్ చేస్తున్నారు. సమాజంలో ఏ విషయంలోనైనా పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఉంటాయి. పాజిటివ్‌గా ఆరంభమైన కార్యం రానురాను వికృత రూపం దాల్చి నెగిటివ్‌గా మారుతోంది.
ర్యాగింగ్ విషయంలోనూ అదే పరిస్థితి. జూనియర్స్‌లో ఉన్న బెరుకును క్రొత్తదనాన్ని పోగొట్టి వారితో సాన్నిహిత్యం పెంపొందించుకోని స్నేహం పటిష్టం చేసుకోవాలని పాజిటివ్ థింకింగ్‌తో ప్రారంభించిన ర్యాగింగ్ అనే క్రియ రాను రాను నేడు వికృత రూపం దాల్చి హింసాత్మకంగా మారింది. దీనికి తట్టుకోలేని సున్నిత మనస్కులు తమ ప్రాణాల్ని కూడా తీసుకుంటున్నారు.
తడబడ్తున్న పాదాలతో లేని ధైర్యాన్ని కూడ దీసుకుని కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది బిందు. కాలేజీకి బయలుదేరే ముందు తల్లి ధైర్యం గురించి లెక్చరిచ్చి ఆమెను పంపింది కాని కాలేజీ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆ ధైర్యమంతా నీటి ఆవిరిలా ఇగిరిపోయింది.
“ఏ అమ్మాయ్! ఆగు” ఓ సీనియర్ అమ్మాయి గర్జించినట్టు పిలిచింది. ఠక్కున ఆగిపోయింది బిందు. ఆమె గొంతుక పిడచ కట్టుకుపోతోంది. కాళ్ళలో వణుకు ఆరంభమయింది.
“మేము సీనియర్సుమని, మాకు గౌరవం ఇవ్వాలని నీకు తెలుసా తెలియదా?” గట్టిగా అరిచింది ఆ సీనియర్ అమ్మాయి. ఆమె గొంతుకలో అహంకారం, దర్పం తొంగి చూస్తున్నాయి.
“ఇప్పుడే తెలిసిందండీ!” బిందూ సమాధాన మిచ్చింది.
“చాల్లే! నీ తెలివికి చాలా సంతోషించాం కాని మొదట సీనియర్స్ దగ్గర ఎలాగ మెలగాలో, వాళ్ళకి ఎలా గౌరవం ఇచ్చి ఆదరించాలో అన్న విషయం తెలుసుకో,” మరో సీనియర్ అమ్మాయి కసురుతున్నట్టు అంది.
“అలాగే నండీ!”
“అలాగే అంటే సరిపోదు. ఆచరించి చూపాలి. ఏదీ ఆ చేతిలో ఉన్న ఆ కేరియర్ ఇలాతే!” మొదటి అమ్మాయి దబాయింపుగా అంది.
బిందుకి ముచ్చెమటలూ పోస్తున్నాయి. తల్లి మీద కోసం వచ్చింది. ఈ కేరేజి వల్లనే తను ఎంత ఇబ్బందులకి అవమానాలకి గురవుతుందో కేంటిన్‌లో భోజనం చేస్తానంటే తల్లి కేరేజి ఇచ్చింది. వెంటనే తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి. “పాపా! ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండడం నేర్చుకో, ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోడం నేర్చుకో,” పోయిన ధైర్యం ఆమెలో తిరిగి చోటు చేసుకున్నాయి తల్లి మాటలు జ్ఞప్తికి రాగానే.
ఇంతలో మరో జూనియర్ అమ్మాయి రాకతో సీనియర్స్ దృష్టి ఆ క్రొత్తగా వచ్చిన అమ్మాయి మీదకు మళ్ళింది.
“బుజ్జీ ఇలా రా అమ్మా!” ఓ సీనియర్ అమ్మాయి పిల్చింది క్రొత్తగా వచ్చిన అమ్మాయిని.
ఈ అమ్మాయి తనలా కంగారు పడటం లేదేంటి? ఎంత ధైర్యంగా వీళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది. ఈ అమ్మాయిని చూసేనా తను ధైర్యంగా ఉండాలి,” అనుకుంటోంది బిందూ.
“నీ పేరేంటి బుజ్జీ!”
“శకుంతల.”
“ఆఁ.. ఏమన్నావు? నీ పేరు శకుంతలా. నీ తండ్రి విశ్వామిత్రుడు, తల్లి మేనకేనా? పాపం దురదృష్టవంతురాలివి. నువ్వు పుట్టగానే నీ తల్లీదండ్రీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా! పాపం జాలిదలిచి ఆ కణ్వమహర్షి నిన్ను చేరదీసి పెంచాడు కదమ్మా! పాపం ఇంకా ఆ దృష్యంతుల వారి పరిచయం అవలేదా?” హేళనగా, వ్యంగ్యంగా అంటోంది ఓ సీనియర్. ఆమె మాటలకి మిగతా వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. అక్కడికి వచ్చిన అబ్బాయిల జుట్టు కూడా ఆ నవ్వుల్లో పాలుపంచుకున్నారు.
శకుంతల మాత్రం ఏం చలించలేదు. ధైర్యంగా స్థిరంగా నిలబడి ఉంది.
సమాజంలో కొంతమంది స్వభావమే అంత. వినోదం పేరుతో ఎదుటివాళ్ళ వ్యక్తి విషయాల్లోకి తొంగి చూస్తూ ఎదుటి వాళ్ళని కించపరచి వినోదించడమే అలాంటి వాళ్ళ అలవాటు. తన మాటలకి ఎదుటివాళ్ళు ఎంత బాధపడ్తారు, తమ ప్రవర్తన, మాటలూ ఎదుటి వాళ్ళ జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అని ఆలోచించరు. వాళ్ళకి ఆ సమయంలో వినోదమే ప్రధానం.
“మన మాటలకి ఈ మేనకా పుత్రి ఏం చలించటం లేదే. ధైర్యవంతురాల్లాగే ఉందే” మరో సీనియరు అంది.
“అదీ చూద్దాం! ఆ ధైర్యం ఎంత సేపో, నీటి ఆవిరిలా మన దగ్గర ఇగిరిపోవాలి” లావుపాటి అమ్మాయి అంది.
“నిజమేనే! నీ ఆకారం చూస్తేనే వాళ్ళ ధైర్యం నిజంగానే నీటి ఆవిరిలా ఇగిరిపోతుంది” ఓ అమ్మాయి కామెంటు. ఆమె మాటలకి అందరూ గొల్లుమని నవ్వారు. ఆ లావుపాటి అమ్మాయి అలిగినట్టు బుంగమూతి పెట్టింది.
“ఆ ధైర్యవంతురాలి పని తరువాత చూద్దాం. ఈ క్యేరేజి పాప సంగతి చూడండే,” ఇంకో సీనియరు అమ్మాయి అంటోంది.
“అవును కదూ! మరిచిపోయాం. ఏఁ పాపా ఆ కేరేజ్ ఇలా ఇయ్యి” అంటూ ఓ అమ్మాయి బిందూ చేతిలోని కేరేజీ తీసుకుంది. వెంటనే ఓ జూనియర్ అబ్బాయి చటుక్కున ఆ క్యారేజీని లాక్కొని సీనియర్సు అబ్బాయిల దగ్గరకి చకచకా అడుగులేస్తున్నాడు.
జూనియర్సు అమ్మాయిల్ని సీనియర్సు అమ్మాయిలు ఎలా ఆట పట్టిస్తున్నారో జూనియర్స్ అబ్బాయిల్ని అలాగే సీనియర్సు అబ్బాయిలు ఇబ్బంది పాల్జేస్తున్నారు.
“ఆ అమ్మాయి చేతిలో ఉన్న క్యేరేజ్ పట్టుకురా” అని సీనియర్ విద్యార్థులు పంపగా ఆ జూనియర్ అబ్బాయి వచ్చి ఆ క్యేరేజ్ చేజిక్కించుకున్నాడు. “అన్యాయం.. అన్యాయం! మా పాప క్యేరేజ్ మీ అబ్బాయి ఎత్తుకుపోతున్నాడేఁటి?” ఓ సీనియర్ అమ్మాయి గట్టిగా అరిచింది. అమ్మాయిలందరూ ఆ జూనియర్‌ని వెంబడిస్తూ వడివడిగా అడుగులేసి అబ్బాయిల గుంపు దగ్గరికి చేరుకున్నారు.
“భయపడకండి,” శకుంతల బిందుకి ధైర్యం చెప్పింది.
“చూడమ్మాయి, ఆ విశ్వామిత్ర మేనకా పుత్రికను చూసేనా ధైర్యంగా ఉండడం నేర్చుకో”, సీనియర్ అమ్మాయి వ్యంగ్యంగా అంది. బిందూ, శకుంతలా కూడా ఆ గుంపు వేపు నడిచారు.
“ఆ క్యేరేజ్ తెరు,” ఓ సీనియర్ స్టూడెంట్ జూనియర్‌ని ఆజ్ఞాపించాడు. ఆ సీనియర్ చెప్పినట్టు చేస్తున్నాడు జూనియర్.
“ఆ క్యేరేజ్లో ఉన్న కర్రీ ఏంటి బాబూ!” అతడ్ని అడిగాడు సీనియర్.
“వంకాయ మెంతి కూర. “
“ఇంకా?”
“గోంగూర పచ్చడి.”
“ఇంకా?”
“మామిడికాయ పప్పు.”
“మీ మెమరీ పవరు పరీక్షించాలి. పాత సినిమాలో ‘గుత్తి వంకాయ కూరా..!’ అంటూ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాట పాడాడు. ఆ పాట ఏ సినిమాలోదో చెప్పగలవా బాబు!”
“తెలియదండీ.”
“మీకో?” మిగతా జూనియర్సుని అడిగాడు ఆ సీనియర్. అందరూ ఆలోచనలో పడ్డారు.
“అమ్మాయ్! నీ పేరేంటి?”
“హిమబిందు.”
“అహ.. అహ.. అహ! ఏఁ పేరూ? హిమబిందా? అంటే మంచు బిందువన్నమాట.” ఓ సీనియర్ అమ్మాయి జోక్‌గా అంది. అందరూ గొల్లుమని నవ్వుతున్నారు.
“చూడండి మంచు బిందూ! ఆ పాట ఏ సినిమాలోదో చెప్పగలవా?” సీనియర్ అడిగాడు.
“నేనా సినిమా చూడలేదు. నాకు తెలియదండీ!”
“నీవు చెప్పమ్మా కణ్వ మహర్షి పెంపుడు కూతురా?” శకుంతలతో అంది ఓ సీనియర్ అమ్మాయి.
“నాకూ తెలియదండీ!”
“కణ్వ మహర్షి పెంపుడు కూతురేఁటి?” ఓ కొంటె కోణంగి అడిగాడు.
“అదే ఆ అమ్మాయి పేరు శకుంతల.”
“అబ్బా! ఆ పేరు పాత చింతకాయ పచ్చడిలా ఉంది.”
“ఆ పాత చింతకాయ పచ్చడి పత్యానికి పనికొస్తుంది,” ఓ సీనియర్ అమ్మాయి అంది.
“అనవసర ప్రసంగం ఎందుకు కాని, ప్రస్తుత పరిస్థితి వేపు చూడండి,” ఓ సీనియర్ అన్నాడు.
“ఆ పాట ఏ సినిమాలోదో చెప్పడానికి అంత జ్ఞాపకశక్తి లేని మీరు ఎందకర్రా పనికొస్తారు? అంత మెమరీ ఫవరు లేని వాళ్ళు ఇంజనీరింగు చదవడానికి ఎందుకొచ్చినట్టో?” ఓ సీనియర్ గద్దించినట్టు మాట్లాడింది.
“మనదే తప్పు, ఈ స్పీడు యుగంలో ఎన్నో ఆధునిక అరుపు పాటలు ఉండగా ఆ పాత పాట గురించి అడగడం ఏంటి?” ఓ సీనియర్ అన్నాడు.
“మనకి ఈ అరుపు ఆధునిక పాటలొద్దు. పాత పాటలే ముద్దు. పోనీ ఇంకో చాన్సు ఇస్తున్నాం. ఇదీ పాత పాటే. మాడా అనే పాత సినిమాలో ఓ కమేడియన్ ఉండేవాడు. అతను ‘సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు’ అంటూ ఆడదానిలా అభినయిస్తూ పాడిన పాట ఏ సినిమాలోది.”
“చిల్లర కొట్టు చిట్టెమ్మ,” ఓ జూనియర్ ఠక్కున బదులు పలికాడు.
“గుడ్! ఏదీ ఆ పాట పాడుతూ మాడా అభినయం చేసినట్లు అభినయం చెయ్యి,” ఓ సీనియర్ ఆజ్ఞాపించాడు ఆ జూనియర్‌ని.
ఆ జూనియర్ తన షర్టును పైటలా వేసుకుని ఆడదానిలా వెయ్యి వంకర్లు తిరిగిపోతూ వివిధ భంగిమల్లో వయ్యారంగా అవయవాలను కదిలిస్తూ పాడుతూ అభినయం చేస్తున్నాడు.
“గుడ్! వెరీ నైస్!” అంటూ అమ్మాయిలూ అబ్బాయిలూ పగలబడి నవ్వుతూ, ఆ జూనియర్‌ని ఉత్సాహపరుస్తున్నారు.
ఆగిపోయాడు ఆ జూనియర్.
“ఇక మీరు ఈ అమ్మాయిల చేత పాడిస్తే మా అబ్బాయిలు డాన్సు చేస్తారు. అదీ లేటెస్టు పాటలు వద్దు,” ఓ సీనియర్ అన్నాడు.
“గుడ్ ఐడియా!” అంది ఓ సీనియర్.
“ఓ మంచు బిందూ పాడమ్మా!”
“నాకు సరిగా పాడ్డం రాదండీ.”
“అన్నిట్లోనీ సున్నాయేనా? పాట రాదు అన్న దాన్నీ నీ ఒక్కదాన్నే చూశాను. ప్రతీ వాళ్ళూ ఏదో కూనిరాగమేనా తీస్తారు. పాడమ్మా బుజ్జి తల్లీ! లేకపోతే ఆడతావా?”
“రెండూ రావండి.”
“ఏడ్చినట్టే ఉంది నీ వాటం. ఎందుకు పనికి వస్తావు?”
“ఓ దుష్యంత పత్నీ! నీవు పాడమ్మా! ఓ పాత పాట.”
“దుష్యంత పత్ని ఏంటి?” ఓ కొంటె వాడి ప్రశ్న.
“శకుంతల పతి దుష్యంతుడు కాదా?” అంది ఓ అమ్మాయి.
“ఇంకా ఈమెకి పెళ్ళవలేదు కదా?”
“ఆ.. ఆ.. ఎందుకు పెళ్ళవదు? కణ్వ మహర్షి ఆశ్రమంలో దుష్యంతుల వారితో ఈ శకుంతలకి కళ్యాణం జరుగుతుంది. అప్పుడు మన అందరికీ విందు. దానితోపాటు ఆనందం,” అంది ఓ సీనియర్. అందరూ ఒక్కసారి గొల్లుమన్నారు.
“ఆగండి.. ఆగండి..! దుష్యంతుల వారి దేవేరి పాడుతుంది. అదీ మధురగీతం.”
శకుంతల పాట పాడ్డం ఆరంభించింది. “అలు కదిలినా పాటే, కలలు చెదిరినా పాటే.. కలత చెందినా పాటే! ఏ పాట నేపాడనూ?”
“ఆపు!”
శకుంతల పాట పాడ్డం ఆపింది.
“ఆ పాట ఏ సినిమాలోది?”
“సీతా మహలక్ష్మి”
“ఆ సినిమా వచ్చినప్పుడు నీవు పుట్టే ఉండవు.”
“అవును.”
“నీ పేరేలాగే ఆ పాట కూడా పాత చింతకాయ పచ్చడిలాగే ఉంది. ఈ స్పీడు యుగం పాటపాడు.”
“నాకు రాదు.”
“అయ్యో! కర్మ మాకు దొరికిన ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళే.”
“అబ్బాయిలూ మీరు పాడండి,” ఓ సీనియర్ జూనియర్సుని ఆజ్ఞాపించాడు. ఓ జూనియర్ పాడుతూ అభినయం చేస్తున్నాడు. ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్!’
ఆ పాటకి అనుకూలంగా మిగతా జూనియర్సు చప్పట్లు కొడూ అడుగులు వేస్తూ అవయవాలు కదిలిస్తూ అభినయం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ సీనియర్సు అమ్మాయిలూ, అబ్బాయిలూ చప్పట్లు చరుస్తూ “వన్స్ మోర్,” అంటున్నారు.
“అన్యాయం,” గట్టిగా అరిచాడు ఓ సీనియర్.
“ఏంటి?” ఏక కంఠంతో అమ్మాయిలూ అబ్బాయిలూ ప్రశ్నించారు అతని వేపు కుతూహలంగా చూస్తూ. ఆ సీనియర్ చూపించిన వేపు చూశారు.
“పుస్తకాల పురుగును చూడండి,” ఓ కంఠం పలికింది.
“పూర్తిగా జడ పదార్థం” మరో గొంతు.
“ఆనాటి ఋష్యశృంగుల వారికి రాజ నర్తకిలు బ్రహ్మచర్య వ్రతాన్ని భగ్నం చేసారట. ఈ అపర ఋష్యశృంగుల వారికి ఎవరు వ్రత భంగం చేస్తారో?”
“అసలు ఋష్యశృంగు డెవరు?” ఓ అమ్మాయి అరిచింది.
“ఈ హైటెక్ యుగంలో ఉన్న మనం నెట్లు, సెలఫోన్లు, ఎస్.ఎమ్.ఎస్‌లలో మునిగి తెలుతాం కాని, మన సంస్కృతి, మన పురాణ పురుషులు వేపు దృష్టి పెట్టం. వర్తమానం వేపు, భవిష్యత్తు వేపు దృష్టి పెడ్తున్న మనం భూతకాలం వేపు దృష్టి సారించటం లేదు.
అదంతా ఎందుకు శాంతియుతంగా సత్యాగ్రహం చేసి, దేశ స్వాతంత్ర్య సిద్ధి కోసం పాటుపడిన మన జాతిపిత ఎవరు? అని ఓ ఉద్యోగానికి యింటర్వ్యూకి వెళ్ళిన అబ్బాయిని అడిగితే నాకు తెలియదు అన్నాడంట. మన యువత పరిస్థితి అలా ఉంది. ఇప్పుడే మన యువత అలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటామో ఊహించడానికే భయం వేస్తోంది” ఓ దేశభక్తి గల అబ్బాయి ఉపన్యాస ధోరణిలో అన్నాడు.
“తగ్గు తగ్గు. నీ సోది కట్టి పెట్టి ఆ పురాణ కాలంనాటి ఋష్యశృంగుడు గురించి చెప్పండి.” మరో అబ్బాయి అరిచాడు.
“విభాండక మహర్షి కొడుకు ఋష్యశృంగుడు. తన కొడుకు గొప్ప తపస్సంపన్నుడు అవాలన్న స్వార్థంతో ఆ మహర్షి తన కొడకుని స్త్రీ అంటే ఎవరో తెలియని విధంగా పెంచాడుట. అలా చేస్తే భోగ విలాసాలకి దూరంగా ఉంటూ తన కొడుకు ఉదాత్త చరిత్ర గలవాడుగా తయారవుతాడని అతని భావన. అయితే ఆ తరువాత అటువంటి ఋష్యశృంగుడికి వ్రతభంగం జరిగి అతనూ స్త్రీల వెంటపడ్డాడు ఆ తరువాత, అదీ సంగతి.”
“అయితే మన అపర ఋష్యశృంగుడికి ఎవరు వ్రతభంగం చేస్తారు? మన అపర ఋష్యశృంగుడు అమ్మాయిల సమీపంలో ఉంటూ, చలించకుండా జడ పదార్థంలా మిగిలిపోయాడే!” ఓ అమ్మాయి అంది.
“మంచి ఆలోచన,” లావుపాటి అమ్మాయి అంది.
“నీ శరీరం లావైనా నీ మెదడు మాత్రం చురుగ్గా పని చేస్తోందే” ఓ అమ్మాయి జోకు వేసింది. అందరూ గొల్లుమని నవ్వారు. “అయితే నేను చెప్పను,” బుంగమూతి పెట్టింది అమ్మాయి. “తప్పయింది చెప్పమ్మా!” జోకు వేసిన అమ్మాయి బ్రతిమాలింది. శాంతించింది ఆ లావుపాటి అమ్మాయి. గర్వంగా అందరిని కలియ జూసింది. ఆమె ఏఁటి చెప్తుందా అని అందరి కళ్ళు ఆమె మీదే కేంద్రీకృతమై ఉన్నాయి.
“ఈ మంచు బిందుని ఈ ఋష్యశృంగుడి దగ్గరకు పంపించి అతని చేత ఈ గుత్తి వంకాయ కర్రీ తినిపించేటట్టు చేసి, అతని పేరు కనుక్కుని రమ్మనమని చెబ్దాం,” ఆపసోపాలు పడిపోతూ అంది.
“మంచి ఆలోచనే,” అందరూ ఏక కంఠంతో అన్నారు.
అందరూ బాల్యావస్థ దాటి, ప్రారంభిక యవ్వనావస్థ, యవ్వనావస్థలోకి అడుగుపెట్టిన వాళ్ళే, వీళ్ళకి బాధ్యతలు – బరువులు తెలియవు. కష్టనష్టాలు తెలిసిన వాళ్ళు అరుదు. అప్పో, సప్పో చేసి తమని తల్లిదండ్రులు చదివిస్తున్నారు అని ఆలోచించరు వీళ్ళు. మధ్యతరగతి వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు చాలామంది ముఖ్యంగా తమ పిల్లలకి అమృతాన్ని పంచి ఇస్తూ, హాలాహలాన్ని తాము మ్రింగుతూ దినదిన గండం దీర్ఘాష్యులా జీవితం గడుపుతున్నారని, ఆ వయస్సులో తెలియదు. తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారు.
“ఎప్పుడూ ఉన్న బాధలే, ఎప్పుడూ ఉన్న కష్టాలూ, కన్నీళ్ళే ఎప్పుడూ ఉన్న సమస్యలే, ఇక్కడేనా సంతోషంగా ఎందుకు ఉండకూడదు,” అనే భావన కొందరిది. అయితే వినోదం పేరుతో ఎదుటివాళ్ళ జీవితాల్తో మాత్రం ఆటలాడకూడదు. అందరూ ఒక్కలాగే ఉండరు. కొందరు సున్నిత మనస్కులు. ఈ ర్యాగింగ్ పేరుతో జరుగుతున్న రాక్షస క్రీడకి సమిధలయి పోతున్నారు.
“ఏ మంచు బిందూ! క్విక్! సుకుమారి చెప్పిన మాటలు విన్నావా? ఆ మాటల్ని కార్యాచరణలోకి పెట్టు” ఓ సీనియర్ గద్దించినట్లు అంది.
‘ఆ లావుపాటి అమ్మాయి పేరు సుకుమారా?’ అని అనుకున్నారు. శకుంతల, హిమబిందు.
“నేనా! అమ్మో!” గుండెల మీద చెయ్యి వేసుకుంది బిందు.
“ఊఁ క్విక్!” సీనియర్స్ అమ్మాయిలూ, అబ్బాయిలూ అందరూ తొందర పెడ్తున్నారు హిమబిందుని.
బిందు శరీరమంతా చమటలు పడ్తున్నాయి. కాళ్ళు, చేతులూ వణుకుతున్నాయి. భావోద్వేగాలు ఆమెలో చోటు చేసుకుంటున్నాయి.
“ఊఁ క్విక్!” తిరిగి ఒకేసారి పలికాయి అందరి గొంతుకలూ.
“మరి తప్పదు ధైర్యం తెచ్చుకుని వాళ్ళు చెప్పినట్టు చేయండి.” అంది నెమ్మదిగా శకుంతల బిందుతో.
“చూడు పాపా! ఆ మేనకా పుత్రిని చూసేనా ధైరంగా ఉండడం, మాట్లాడ్డం, డాషింగ్ నేచర్ నేర్చుకో!” ఓ సీనియర్ బిందుకి సలహా ఇచ్చింది.
ఆమె పాదాలు యాంత్రికంగా ముందుకు అడుగులు వేస్తుంటే గుత్తి వంకాయ కర్రీ పట్టుకున్న ఆమె చేతులు వణకుతున్నాయి. చిరు చమటలు పట్టిన ముఖాన్ని చేతి రుమాల్తో తుడుచుకుంటూ ముందుకు అడుగులేస్తోంది.
“ఏఁవండీ!” నెమ్మదిగా పిలిచింది. పుస్తకం చదవడంలో నిమగ్నమై ఉన్న అతను ఉలిక్కిపడి అటు నుండి ఇటు తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో వింత కాంతి మెరిసింది ఆమెను చూడగానే అతను ఆమెను చూశాడు. ఆమె అతడ్ని చూసింది. అతను పరిసరాలను చూశాడు. తమ వేపే ఆసక్తిగా చూస్తున్న అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చూశాడు. పరిస్థితి అర్థం చేసుకున్నాడు.
‘కొండపల్లి బొమ్మలా ఎంత అపురూపంగా ఉంది? బాపూ గీసిన బొమ్మలా లక్షణంగా ఉంది,’ అనుకుంటున్నాడు. అదే ఆలోచన్లు ఆమెవి కూడా. ‘ఉంగరాల జుట్టు, కోర మీసం, పల్చని ఎర్రటి పెదవులు, ముత్యల్లాంటి పలు వరస, పచ్చని శరీర ఛాయతో హుందాతనం చాటి చెప్తున్న మగసిరితో ఎంత అందంగా ఉన్నాడు?’ అని అనుకుంటోంది ఆమె.
ఆమె వణకుతున్న చేతులూ, ఆ చేతుల్లో ఉన్న గుత్తి వంకాయ కర్రీ తడబడ్తున్న పాదాలు – ఆ మాట తీరు – ముచ్చమటలూ పోసిన ఆమె శరీరం. ఎదురుగా తమాషా చూస్తున్న సీనియర్సు – జూనియర్సు అమ్మాయిలు – అబ్బాయిలూ అందరి వంకా మరొక మారు చూసి పరిస్థితి అర్థం చేసుకుని చిన్నగా నవ్వాడు.
“ఈ కర్రీ మీ నోటి కందించమన్నారు,” మాటలు తడబడ్డూ ఉండగా అంది ఆమె. అలా అంటున్న సమయంలో ఆమె వదనంపై సిగ్గు తెర తొంగి చూడడం అతను గమనించాడు.
“అలాగా! అయితే తినిపించండి.” కొంటెగా నవ్వుతూ అన్నాడు అతను. ఆమె మరింత సిగ్గు పడిపోయింది.
“ఆఁ..!” అంటూ అతను నోరు తెరిచాడు. ఆమె ఆ కర్రీ అతని నోటి కందించింది. అలా అందిస్తున్న సమయంలో ఆమెలో మధురానుభూతి చోటు చేసుకుంది. సిగ్గుతో కనుదోయి బరువుగా వ్రాలి పోయింది. ఆమె అవస్థకు ఓర కంటితో కనిపెడ్తున్న అతను హాయిగా మనస్సులో నవ్వుకున్నాడు.
“కర్రీ చాలా బాగుంది. అందులోనూ మీ స్వహస్తాల్తో ఇవ్వడం వలన మరింత రుచిగా ఉంది. ఈ కర్రీ తయారు చేసిన వాళ్ళ వంట నైపుణ్యాన్ని మెచ్చుకోవాలి,” ప్రశంసా పూర్వకంగా అన్నాడు అతను. సిగ్గుతో తలవొంచుకుని నిలబడింది బిందు.
“మీ పేరు?”
“వాళ్ళు కనుక్కోమన్నారా?”
“ఊఁ..”
“సిద్ధార్ధ, అందరూ నన్ను సిద్ధూ అని పిలుస్తారు,” అన్నాడు. పేరు విన్న వెంటనే ఆమె వెనక్కి తిరిగింది.
“మాట.”
ఏంటి? అంటూ అతని వేపు చూసింది. అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నట్లున్నాయి. తన్మయత్వంగా ఆమెను చూస్తున్నాడు.
“చాలా అన్యాయం. నా పేరు తెలుసుకుని వెళ్ళిపోతున్నారే కాని మరి మీ పేరు చెప్పనే చెప్పలేదు.” సిద్ధార్ధ నవ్వుతూ అన్నాడు.
“హిమబిందు,” అంది నెమ్మదిగా.
“మీ కంఠస్వరం లాగే మీ పేరు కూడా నైస్‌గా ఉంది.” ఆమెను పొగుడుతూ అన్నాడు అతను.
ఆమె మరి వినిపించుకోకుండా గబగబా పరుగు పెడ్తున్నట్లు నడుచుకుంటూ వచ్చేస్తోంది. ఆ దృశ్యాన్ని వినోదంగా చూస్తూ ఆనందిస్తున్నారు అమ్మాయిలూ అబ్బాయిలూ.
“మన అపర ఋష్యశృంగుడికి వ్రత భంగం అయిందిరా. దార్లో పడ్తున్నాడు ఆ పుస్తకాల పురుగు,” ఓ అబ్బాయి అన్నాడు.
“కాంతా కనకాల దగ్గర ఆ మునీశ్వర్లంతటి వారే లొంగిపోయారు. మానవ మాత్రులం, మనమేపాటి. జితేంద్రియులం కాదు కదా!” ఓ అమ్మాయి అంది.
అందరూ అక్కడ తలోవిధంగా మాట్లాడుకుంటూ ఉంటే ఇవతల సిద్ధార్ధ పరిస్థితి మరోలా ఉంది.
పిరుదులు దాటి లోలకంలా అటు ఇటూ ఊగుతున్న నల్లత్రాచులా పొడుగ్గా, బారుగా ఉన్న ఆమె రెండు జడల వేపు అపురూపంగా చూస్తున్నాడు.
ఇప్పటి అమ్మాయిలకి ఇంత పొడుగైన జడలెక్కడ. జుత్తు కత్తిరించుకుని బాల్ద్ హెయిర్ తోనో, పోనీ టెయిల్ (కట్టుకుని) కురచ జుత్తుతోనో లేకపోతే అసుర స్త్రీల్లా జుత్తులు ఎరగబోసుకుని ఇదే ఫ్యాషనంటూ తిరగడమే కదా నేటి అమ్మాయిలు తీరు సిద్ధార్థ ఆలోచిస్తున్నాడు.
‘ఇంత వరకూ ఏ అమ్మాయిని చూసినా స్పందించని నా హృదయం నిన్ను చూడగానే స్పందించింది. అలౌకిక ఆనందానికి, అనుభూతికి లోనయింది. ఐ లవ్ యూ బిందూ! ఐ లైక్ యూ!’ అని గొణుక్కుంటున్నాడు.
‘అమ్మ బాబోయ్! ఈ బిటెక్ చదువుకోవడం నన్ను ఎన్ని ఇబ్బందుల పాల్జేస్తోంది?’ అనుకుంటోంది బిందు.
ఎవరి భావాలతో తనకు సంబంధం లేనట్టు కాలం పరుగులు తీస్తోంది.
(ఇంకా ఉంది)