బృందావనం

0
3

[dropcap]అ[/dropcap]ది బాపూజీ వృద్ధాశ్రమం. గేటు లోపల ఉన్న ఖాళీ స్థలం మధ్యలో మహాత్ముడి విగ్రహం. అక్కడ ఏపుగా పెరిగిన మామిడి, అరటి, జామ, సపోట లాంటి పండ్ల చెట్లు, గన్నెరు, సంపెంగ, పారిజాతం, మల్లె, విరజాజి లాంటి పూల చెట్లు, ‘బాపూజీ కరుణకు మేము పాత్రులమే’ అన్నట్లు తలెత్తి చూస్తున్నాయి. ఒక ప్రక్క ఏపుగా పెరిగిన పున్నాగ చెట్టు నుండి రాలి పడ్డ పూలన్నీ కలిసి అందమైన తెల్లటి కార్పెట్‌లా ఉంది. మరో ప్రక్క రకరకాల తులసి మొక్కలు వనంలా పెరిగి బృందావనాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ వసంత శోభను ఆస్వాదించడానికి తెల్లవారు ఝాము ఐదు గంటలు అయిందో లేదో ‘లేవండి, లేవండి’ అంటు తమ బంధువర్గాన్ని నిద్ర లేపుతున్నాయి చెట్ల మీద పక్షులు. సూర్యోదయం కన్నా ముందు నిద్రలేవడం యశోదమ్మకు అలవాటు. అలుపెరుగని శ్రమజీవిలా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ‘మీకన్నా నేనే ముందు’ అన్నట్లు సూర్యదయానికి స్వాగతం పలుకుతుంది. పూలుకోసి దండ కట్టడం, తోటంతా శుభ్రం చెయ్యడం, చెట్లకు నీళ్ళు పెట్టడం, ఆశ్రమం అంతా శుభ్రం చేయించడం, ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు యశోదమ్మ రోజూలా లేదు. ఆలోచిస్తూ చెట్టు క్రింద అలాగే కూర్చుంది. నిన్న జరిగిన సంఘటన పదే పేదే గుర్తొచ్చి బాధ పెడుతోంది.

నిన్న ఇలాగే ఎవరి పనులలో వాళ్ళున్నారు. ఆఫీసు రూములో కూర్చుని లెక్కలు చూసుకుంటోంది అరుణ. ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఆశ్రమం మందు కారులోంచి దిగారు. వాళ్ళిద్దరు సరాసరి అరుణ రూములోకి వెళ్ళి, “మేము యశోదమ్మగారి పిల్లలం. కొన్ని కారణాల వల్ల నాలుగేండ్ల క్రితం ఆమెను ఇక్కడ చేర్పించాం. ఇప్పుడు అమ్మను మాతో బాటు మా ఇంటికి తీసుకెళ్ళి మా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాం. అమ్మను అడిగే ధైర్యం మాకు లేదు. మీరే అమ్మను ఒప్పించి మాతో పంపించాలి” అని అడిగారు. “అలాగే, మీరు రేపు రండి. ఆమెతో మాట్లాడదాము” అంది అరుణ. ఆశ్రమంలోని వృద్ధులను సొంత బిడ్డలా ఆదుకుని, చేయూతనిస్తోంది అరుణ. అలాంటి అరుణ, ఈరోజు తన పిల్లల మాటలు నమ్మి, తనను వాళ్ళతో వెళ్ళమంటే? అమ్మో, మళ్ళా ఆ నరకంలోకా? తను వెళ్ళనంటే వెళ్ళదు. ఆ రోజు తనకు బాగా గుర్తు. రకరకాల కారణాలతో తన పిల్లలే తనని వెలివేసిన రోజు. అమ్మకు జీవితంలో అంతకన్నా విషాదం మరొకటి ఉందా? నూటనాలుగు డిగ్రీల జ్వరంతో ఉన్న తనను ‘మావల్ల కాదంటు’ ఇక్కడ వదిలేసి వెళ్ళారు. వద్దు, వద్దు ఆ రోజులు అసలు గుర్తు చేసుకోకూడదు. అనుకుంటు గుండెల్లో గూడుకట్టుకున్న గుబులుకు గుర్తుగా రాలిన రెండు కన్నీటి బొట్లు తుడుచుకుంది యశోదమ్మ. ఆమె ఊరు వెళితే ఇల్లు బోసిపోతుందనుకునే పిల్లలు వృద్ధాప్యంలో ఆమెను అంటరానిదాన్ని చేశారు. కొద్దిరోజులు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు. తర్వాత రావడం మానేశారు. అక్కడే ఉన్న శ్రీరామ పట్టాభిషేకం ఫోటో వంక తదేకంగా చూస్తోంది యశోదమ్మ. ఆశీర్వదించడానికొకరు, కీర్తించడానికి మరొకరు, ఆత్మీయతకు ఇంకొకరు ఇలా ఎంతో మనోహరంగా ఉన్న ఆ ఫోటో అంటే చాలా ఇష్టం ఆమెకు. ఆమెకు కూడా చాలా మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నింటికీ అరుణే పెద్ద దిక్కు, చిన్న దిక్కు. ఈ రోజు తన ఆరోగ్యం కుదుటపడిందని రమ్మని పిలిస్తే, నేనెలా వెళ్తాను? వెళ్ళనే వెళ్ళను అనకుంది యశోదమ్మ. ఈ రోజు వాళ్ళు మళ్ళీ వస్తారు, తనని తీసుకెళ్ళడానికి, అనుకుంటు ఉండగానే “ఆంటీ, మీరు ఇక్కడున్నారా? మీ కోసం ఆశ్రమం అంతా వెతుకుతున్నాను. రోజు ఈ పాటికి మీ పూజ పూర్తి అవుతుంది. ఈ రోజూ ఇంకా ఇలాగే కూర్చున్నారేంటి?” అంటూ వచ్చింది ఆశ్రమంలో వంట చేసే లక్ష్మి. ఆమె పిలుపుతో ఈ లోకం లోకొచ్చింది యశోదమ్మ. “నువ్వా లక్ష్మి, తెల్లవారేప్పటికి పనిలోకి వచ్చేసావా? బద్ధకమనేది లేదు. నిన్ను చూసి నేర్చుకోవాలి” అంది. “మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను ఆంటీ. టైము, పంక్చువాలిటీ, ప్రతి పనిలోనూ ఎంతో బాధ్యతగా ఉండడం. అన్నింటిలో నాకు మీరే ఆదర్శం” అని చెప్తోంది లక్ష్మి.

ఇంతలో ఆశ్రమంలో పని చేసే రాము గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. రాము దగ్గరుండి వాళ్ళ పనులన్నీ చేస్తాడు. ఓ ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఆశ్రమంలో పండ్లు, పూలే కాదు కూరగాయలు, ఆకుకూరలు కూడా పండుతున్నాయి. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ ఎరువులతో పండేవి తినడం వల్లనే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఆ తోటను చూసిన వాళ్ళెవరైనా, అది వృద్ధాశ్రమమా? లేక ఫామ్ హౌస్ కావచ్చేమో అనుకుంటారు.

“ఈ గొప్పతనం అంతా అరుణదే” అంటారు ఆశ్రమంలోని వాళ్ళంతా. రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే అరుణ ఆదివారం మాత్రం రోజంతా వాళ్ళతో గడుపుతుంది. అందుకే అందరు ఆదివారం కోసం ఎదురు చూస్తారు. “ఈ రోజు ఆదివారం కదూ” అడుగుతాడు తొంభైఏళ్ళ రామకోటి అక్కడ పని చేసే రామును. “లేదు తాతయ్యా. ఈ రోజు శనివారమే” అంటాడు రాము. “ఈ రోజు ఆదివారమే రాము, మర్చిపోయావా?” అంటాడు ప్రక్కనే ఉన్న రాఘవయ్య. “లేదు బాబాయి, మీరెంత చెప్పినా ఇవాళ శనివారమే. మీ తొందరంతా నాకర్థమైంది. మేడమ్ కోసమే కదా!” నవ్వుతూ అంటాడు రాము. “అవును రాము. అందరు ఎదురు చూసేది ఆ బంగారు తల్లి కోసమే. వచ్చిందంటే తూనీగలా ఆశ్రమం అంతా పరుగులు పెడుతుంది. అందరు ఆమె వెనకే చిన్న పిల్లల్లా పరుగులు పెడుతారు. అందరి నోట్లోంచి మాటలొస్తాయి. అందరి కోరికలు బయటికొస్తాయి.” అన్నది సత్యవతమ్మ. యశోదమ్మ భగవద్గీత శ్లోకాలు, సుశీలమ్మ త్యాగరాజు కృతులు ప్రాక్టీసు చేస్తారు. సత్యవతి ఆ రోజు తానే రుచిగా వంట చేస్తుంది. అందరిలోని అన్ని కళలు బయటికొస్తాయి. అందరు వయసు మర్చిపోతారు. చిన్న పిలల్లా ఆశ్రమంతా తిరిగే వాళ్ళను చూస్తే ఆటస్థలంలో ఆడుకునే పిల్లల్లా కనిపిస్తారు.

రెండు సంవత్సరాల క్రితం అరుణకు వచ్చిన ఆలోచనకు రూపమే ఆ ఆశ్రమం. అక్కడి వృద్ధులంతా ఒకప్పుడు నిరాశానిస్పృహలతో మరణం కోసం ఎదురు చూస్తూ అక్కడ చేరారు. కానీ ఈ రోజు వాళ్ళందరి మనసులోనూ ఒక లక్ష్యం. చివరి మజిలీ వరకు బ్రతకాలనే కోరిక. తమ కోరికలను, ఆశలను చిట్ట చివరి పేజీలోనూ వ్రాసుకోవాలనే తపన. దీనికి కారణం అరుణ. చిన్నప్పుడే తల్లి తండ్రులను పోగొట్టుకున్న ఆమెకు చదువు, సంస్కారం నేర్పి, ఆమెను, ఆస్తిని కాపాడాడు ఆమె బాబాయి. “నరకంలాంటి ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషికైనా శాంతి, సౌఖ్యాలు కలిగించగలిగితే అదే సత్కర్మ.” అనేవాడు బాబాయి. అడిగిన వారికి, అడగని వారికి సాయపడే ఆయన సహృదయాన్ని బాగా వంటపట్టించుకుంది. అందుకే, తనకు రోజూ వంట చేసి పెట్టే సుందరమ్మ సమస్యను తన సమస్యగా అనుకుంది. ఓ రోజు రాత్రి సుందరమ్మ ఏడుస్తూ వచ్చి తలుపుకొట్టింది. తన కొడుకు, కోడలు తన దగ్గరున్న డబ్బు లాక్కుని తనని ఇంటి నుండి వెళ్ళగొట్టారని ఏడుస్తూ చెప్పింది. “వాడిని బతిమాలి, కాళ్ళు పట్టుకున్నా దయ చూపలేదమ్మా” అంది. “పద నీ ఇంటికి, నీ కొడుకుతో మాట్లాడుతాను. గట్టిగా బుద్ధి చెబుతాను” అంటూ బయలుదేరింది. కాని సుందరమ్మ ఒప్పుకోలేదు. “వద్దమా. వాడొక రౌడీ వెధవ. మిమ్మల్ని ఏదన్నా అంటే నేను భరించలేను. వాడు కొట్టిన దెబ్బకి తలంతా ఒకటే నొప్పి. ఇంక నేను ఆ ఇంటికి పోనమ్మ. మీరే నాకేదో దారి చూపించాలి” అంటూ అరుణ కాళ్ళ మీద పడింది. ఆ తర్వాత నాలుగు రోజులకు రోడ్డు మీద జ్వరంతో మూలుగుతూ పడున్న నీలకంఠాన్ని ఇంటికి తెచ్చి వైద్యం చేయించింది. ఇలా ఎంతో మంది రకరకాల కారణాలతో, వృద్ధాప్యాన్ని ఎదుర్కోలేక, మరో ప్రక్క పిల్లలే వాళ్ళను వెలివేసిన రోజున ఎలా బ్రతకాలో తెలియని నిస్సహాయులు చాలా మంది ఉన్నారని అర్థమైంది అరుణకు. ఎలాగైనా ఇలాంటి వాళ్ళందరిలో ధైర్యాన్ని నింపి, వారికి బ్రతుకు మీద ఆశ కలిగించాలనే ఆలోచనతో ఆశ్రమం స్థాపించింది. క్రమంగా ఆశ్రమంలోని వృద్ధుల సంఖ్య పెరిగింది.

దమయంతి ఆరుగురు పిల్లలుండి ఎవరూ చూసుకోలేక ఆశ్రమంలో వదిలి వెళ్ళారు. రామలక్ష్మికి పిల్లలు లేరు. దాయాదులు ఆస్తి మొత్తం లాక్కుని అనాథను చేశారు. ఇరుగుపొరుగు జాలి పడి ఆశ్రమంలో చేర్చారు. వీరభద్రయ్య మోతుబరి రైతు. ఒంటి చేత్తో నాగలి పట్టి పొలం దున్నేవాడు. భార్య చనిపోయి అనారోగ్యం పాలైతే మా వల్ల కాదంటు పిల్లలు ఆశ్రమంలో చేర్చారు. రామకోటి ఒకప్పుడు పెద్ద డాక్టర్. మంచి పేరు, డబ్బు సంపాదించాడు. పిల్లలంతా ఫారిన్‌లో సెటిలయ్యారు. తను వాళ్ళతో వెళ్ళలేక, ఒంటరితనం తట్టుకోలేక స్నేహితుడి సాయంతో ఇక్కడ చేరాడు. ఇలా కంచికి చేరిన కథలెన్నో ఉన్నాయిక్కడ. ఈ రోజు వాళ్ళందరిలోనూ కొండంత ఆత్మవిశ్వాసం నింపింది అరుణ. అందరికీ కష్టపడడం అంటే ఎంతో ఇష్టం. స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల వాళ్ళల్లో నూతనోత్సాహం. మిగిలినవి దగ్గరలో ఉన్న మార్కెట్లో రాము సాయంతో అమ్ముతారు. కొందరు పచ్చళ్ళు, అప్పడాలు తయారు చేస్తారు. లక్ష్మి సాయంతో చుట్టు ప్రక్క ఇళ్ళల్లో వాటిని అమ్ముతారు. ఇవి వాళ్ళలో బాధ్యతను పెంచి, ఆత్మనూన్యతను పోగొట్టాయి.

ఆ రోజే ఆదివారం. అందరు అరుణ చుట్టు చేరి, వారం అంతా వాళ్ళు చేసిన పనుల గురించి గొప్పగా చెప్పకుంటున్నారు. ఇంతలో యశోదమ్మను తీసుకుకెళ్ళాడానికి ఆమె పిల్లలు వచ్చారు. “మేడమ్ ఈ రోజే మేము అమ్మను మాతో తీసుకెళతాం. ఆమెను పిలుస్తారా” అడిగాడు యశోదమ్మ కొడుకు. “అలాగే, కూర్చోండి.” అని చెప్పి చెప్పింది అరుణ. వాళ్ళను చూసి యశోదమ్మ అక్కడకు వచ్చింది “అరుణా, నిన్న వీళ్ళు రావడం, నీతో మాట్లాడటం అంతా నాకు తెలుసు. కానీ నేను వీళ్ళతో వెళ్ళడానికి సిద్ధంగా లేను. అసలు వీళ్ళు ‘నా పిల్లలు’ అనే విషయమే మర్చిపోయాను. రకరకాల సాకులతో వాళ్ళు నన్ను ఇక్కడ చేర్చారు. ఆరోగ్యం సరిగా లేక, మానసిక వ్యథతో ఒకప్పుడు ఇక్కడ చేరాను. నువ్వు, నేనున్నానంటు కొండంత ధైర్యాన్నిచ్చావు. ఇప్పుడు వీళ్ళు రమ్మన్నా నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను.” అని చెప్తోంది.

ఇంతలో ఆమె కొడుకు అడ్డు తగులుతూ, “అమ్మా మేము నీ కోసమే వచ్చాం. నువ్వు జరిగినదంతా మర్చిపోయి, మమ్మల్ని క్షమించు. నువ్వు మాతో రావాలి” అని అంటుండగానే, యశోదమ్మ “నన్ను రమ్మని అడిగే ధైర్యం మీకు ఎక్కడిది? అసలు మీతో వస్తానని మీరెలా అనుకున్నారు? మీ దృష్టిలో నేనొక పనికిరాని వస్తువును. కానీ ఈ ఆశ్రమం, తోబుట్టువుల్లా, ఆప్తుల్లా పలకరిస్తున్న వీళ్ళందరి వల్లనే నేను తిరిగి కోలుకున్నాను. ముఖ్యంగా అరుణ ఒక దేవత మాకందరికి. నా జీవితమంతా మీ కోసమే ఏడ్చాను. మీ కోసం నవ్వాను. మీకోసమే బ్రతికాను. మొన్న మొన్నటి వరకు మీరు వస్తారని ఎదురు చూశాను. ఇంక మీరు రారు అని తెలుసుకున్నాను. నాలాంటి అభాగ్యులే వీళ్ళంతా. మీరు నిజంగా మారి ఉంటే వీళ్ళందరికీ సాయపడండి. ఆశ్రమం అభివృద్ధికి సహాయం అందించండి. ఇంతకన్నా మీతో మాట్లాడాలని లేదు నాకు.” అని అక్కడ నుండి వెళ్ళిపోయింది యశోదమ్మ.

“మీరు నన్ను క్షమించండి ఆమెను నేను బలవంతంగా పంపలేను.” అన్నది అరుణ వాళ్ళతో. “మా పిల్లలెవరన్నా వచ్చి మమ్మల్ని రమ్మంటే మేము కూడా వెళ్ళము అరుణా. మా జవాబు కూడా అదే” అన్నారు మిగిలిన వాళ్ళు. అరుణ నవ్వుతూ తల ఊపింది.

ఇంక మాట్లాడేదేమీ లేక తలొంచుకుని వెళ్ళిపోయారు యశోదమ్మ పిల్లలు. తోబుట్టువులాంటి యశోదమ్మ ఎక్కడ పిల్లలతో వెళ్ళిపోతుందో అని దిగులుపడ్డ వాళ్ళంతా తేలికగా ఊపిరిపీల్చున్నారు. ‘వీళ్ళెంత అల్ప సంతోషులో కదా! ఇంత మంది పెద్దల ఆశీస్సులు నాకు దొరికాయి’ అని సంతోషపడుతూ తృప్తిగా ఆదివారాన్ని వాళ్ళతో గడిపింది అరుణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here