[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
చతుర్థాశ్వాసము – మొదటి భాగము
కం.॥
తరిగొండ వెంగమాంబను
కరుణించిన భక్తవరద కాంచన చేలా
సరిలేరిక ధరయందున
కరచరణంబులు భక్తితో నంజలి గొలుతున్. (282)
కం.॥
అప్పుడు వానలు వెనుకకు
జప్పుడు గాకను మరలెను జాగును లేకన్
ఎప్పుడు వెలిసెనో వానలు
అప్పుడె పయణం బయ్యెను అంతట వారున్. (283)
కం.॥
బహుకాలము వానలు పడ
బహుగా చేపలు తినుటకు భావము కలుగన్
బహుగాలము వేటకు జన
బహుగా కోరిక కలిగెను బాగుగ మహిలో. (284)
ఆ.వె.॥
ఇటుల కడలి తీర మీర మీరీతి చేరుచున్
చేప బట్టుటకును చెలగెనంత
బాలరాజు తోటి భాగాల వారలున్
వేగ చేరె సంద్ర వెలుపలకును. (285)
ఉ.॥
అందరు చేరి వేటకును కందువ మాటల మాని వస్తువుల్
చిందర వందరుండగను చెల్లెననంగను దుమ్ము దుల్పుచున్
మందము నైన సాగరము మౌనము దాల్చని నీట తేలగా
అందము నొందగన్ మురిసె అందవికారపు మత్స్యకారులున్. (286)
కం.॥
అందవికారపు గేహము
అందము గలవారు మనసు అంతరమందున్
దెందము లోపల కనుగొన
ఖండిత రీతిన అందము కారణమేమో. (287)
తే.గీ.॥
అలల కావలి వైపుకు అలుపు లేక
చేరినంతనె వారలున్ చెలువు మీర
తెప్పకున్ జేర్చె తెరచాప తెగువ తోడ
ముందుకును సాగె నావను ముదము తోడ. (288)
తే.గీ.॥
అటుల బహుకాల పయనంబు ఆగమించ
తేటముగ యారి లోపల తెప్ప మిగుల
వచ్చెనని జూసి తెరచాప వాల్చిరపుడు
వలను వదిలిరి యంతట వారలపుడు. (289)
ఆ.వె.॥
సిద్ధమైరి వలల చెంగున బట్టుక
కడలి లోకి జార్చి కదలకుండ
తెప్పమీద పండె తెల్లవారు వరకు
లేచి వలను లాగ లెక్క మించి. (290)
తే.గీ.॥
చేపలును పడ వారలు చెమ్మగిల్లి
నటుల సంతసమందిరి నాటి వేళ
మరల వల వేసి కూర్చుండె మానకుండ
కొన్ని గంటల తదుపరి కొల్ల గాను. (291)
తే.గీ.॥
చేపలును జిక్కె వారికి చెలువు మీర
యటుల వల వేసి లాగగ అధికముగను
నీటి పూవుల మాదిరి నీటి నుండి
వచ్చి చేరెను చేపలు వరుస క్రమము. (292)
మ.॥
కరి మబ్బుల్ పెనుగాలి తోడుగను యా కాలుండు యేతెంచెనే
పరివారంబును వెంట బెట్టుకొని పాపాలన్ విచారించగా
దరికేతెంచిన కల్కి మూర్తి వలె కా దా నావుడుంజూడగన్
మరి యా వేళల దృశ్యమున్ గనినచో మా మేను మూర్ఛిల్లెనే. (293)
శా.॥
మార్తాండుండును సంచరించునట మా మధ్యన్ కనుంగానకన్
వార్తన్ దెల్పెడి వేగు లెవ్వరును యీ వార్తన్ నివేదించగన్; మనో
కర్తవ్యంబును బోధ చేయగను; ఏకాకిన్ చేయంగనా
కర్తన్ నిందను జేయుచున్ సకల లోకంబుల్ మదిన్ గుందగన్. (294)
ఉ.॥
అంచితమైన వేళలను ఆడె గద గగనాంతరంబునన్
మించెను గాలివాన బహు మిక్కిలి లెక్కకు మీరిపోవగన్
పొంచిటు జూచుచున్ పుడమి పుణ్యము మాటను దల్చకుండగన్
వంచన జేయగన్ వసుధ; వాంఛితమై ధర ముంచివేయగన్. (295)
ఉ.॥
క్షార జలాబ్ది జేరి మరి జక్కగ నైక్యము నొందగేరి; బహ్
భరముగన్ జలంబులును బాగుగ మేధిని నుండి సంద్రమున్
జేరగ వచ్చె నా విధము చెల్లెను కాల్వ నదీ సమూహమున్
పారగ నేరులై జగతి పాల్బడు నీరములన్ని చేరగన్. (296)
సీ॥
ప్రళయ కాలంబునన్ పరుషమౌ నుర్ములన్
ఘోరమౌ రీతిగా గొల్లుమనుచు
ఘోష నొందుచునట గోలను సల్పుచున్
నురగ దేహము గక్కి నుర్వి మీద
కసిని దీర్చు కడలి కావరమేమందు
మానవాలిని జూసి మతిని బోయి
విలయతాండవమైన యిట్టి కార్యము సల్ప
మనసెట్లు నొప్పెనో మరువకుండ
తే.గీ.॥
తనదు యాక్రోశ మంతయున్ ధరణిపైన
గొప్ప రీతిని వార్ధిని గొల్లుమనుచు
విజయమందె దనంచును ఇట్టి ఘోర
ఎన్ని యుగముల సందియో యెన్న గలమె. (297)
చం.॥
పెళపెళ మబ్బులున్ యురుమ భీతిని గల్గెను వార్ధి యందునన్
జల జలమంచు నీ భువిని జారుచు చిన్కులు నాగమించగన్
విలయపు రీతి వాహినియు వీనుల యందున భీతి గల్గగన్
సలిలము కట్టు దాటి మరి చంచలమై భువి పెళ్ళగించగన్. (298)
చం.॥
జలములు గాలి చేతను విజృంభణ రీతిని భీతి గొల్పగన్
కలవరమందె వారలును కాళుని రాత్రము కండ్లజూడగన్
విలవిల లాడె యా జలధి వేకువ ముందర యట్టి ఝామునన్
బలిమిని బైటకున్ బడెది భాగ్యము లేదొకొ; నత్తరిన్ గదా. (299)
చం.॥
అవని విదీర్ణమౌ కరణి యాకృతి మేధిని నావరించగన్
భువనము నందు జీవులను భోరుమటంచును యేడ్వసాగెనే
నవ విధమైన రీతిగను యప్పుడు లోకము నాగమించగన్
పవనము నొల్లు దిక్కులును పైనను యుండియు వీచుచుండగన్. (300)
సీ॥
కారు జీకటి గ్రమ్మె కడలంత నా వేళ
దారి తోచను ఏరి దరము గాదె
మొగులు గరగెనంత మోహమెత్తి నటుల
మళయానిలంబులే మానకుండ
ఆచ్ఛాదనలు లేని యా నావికుల కప్పు
డొడలెల్ల చిరుగాలి హడలు గొట్టె
తండు కర్రనులాగ తడబాటు పడుచుండె
పడవ ముందుకెటుల పయనమగును
తే.గీ.॥
యట్టి చీకటి వేళల గట్టిగాను
వారి పాపంబు పండెనే దారుణముగ
యపుడు యారంభ మాయెను యవనిపైన
ఘోర సంవర్త మేఘంపు గుంపు నుండి. (301)
చం.॥
గగనము నుండి గర్జనల గందరగోళము లేర్పడంగ; యా
పగలును జీకటావరెను పండెడి వేళల లాగు దోచగన్
ఖగవాహుడంపుచే; తన ఖ్యాతిని వీడుచు విశ్రమించెనో
మగవపు డట్టి మేఘముల మౌనము వీడుచు భూమి కంపగన్. (302)
సీ॥
ఘనవాయు వీచికల్ ఘాటుగా చెలరేగి
కడలి నంతయును భీకరము చేసె
సతతంబు కరుణాంత సంభవుడైన; క
డలియంత నురగల డస్సిపోయె
దినము నిట్లుండిన దీనులైన జనులు
వేటను జేయగా వెడల దరమె
రుద్రభూమిని శివుడు రౌద్ర తాండవమాడు
విధముగా జలములు విరిగి పడగ
తే.గీ.॥
ఇంత భీకర జలధిలో అంత సేపు
యెటుట జరిగెనొ సమయంబు ఎరుక లేదె
యెటుల బోదురు జాలరు లేమి కర్మ
మనసు గుందుచు జేరిరి మౌనముగను. (303)
సీ॥
భూనభోంతరములు భువిలోన కదలెడి
శబ్ద తరంగముల్ సంచరించె
పిడుగులు బడినట్టు పిక్కటిల్లె జగాన
భీతి నొందెను వారు బిక్కుమనుచు
పెళపెళంబని భువి పెళ్ళగించినయట్లు
ప్రళయ భీకర శబ్ద విలయ గతిని
కుండపోతగ వాన కురిసెనా సమయాన
దారి గానక నావ దారి తప్పె
తే.గీ.॥
వణుకు చుండిరి గజగజ తడసిపోయి
దారి తెన్నును గానక దరికిపోను
యెటుల జేయుద మిప్పుడు పటు తరముగ
ఏమి మన కర్మ దైవమా ఏది దిక్కు. (304)
సీ॥
చక్రవాకపు వేళ చెలగె సాగరమున
ఘన ప్రశాంతత నెందు గానరాదె
అలలు ఎత్తుగ లేచి చెలగె నా వేళలన్
హోరు మంచును గాలి మేర మీరె
ఘన వాయు పీడన గంభీరముగ లేచె
పడవ నుండెడి వారి ప్రాణ భీతి
మింటిమంటికి వాన మీరె హద్దుల వేళ
కురియు చుండగ వారు కూలబడెనె
తే.గీ.॥
ఆ సమయమందు పడవ యందు నుండ
మత్స్యకారుల మనసులు మ్రగ్గిపోయె
యిట్టి భీకర తరుణాన పట్టు తరము
ఎటుల బోదుమో యీ వేళ యింటి వైపు. (305)
మ.॥
కరివర్ణంబులు దాల్చి మేఘములు యా కాలుండు నీ రీతిగన్
సరగున్నేగుదెంచినట్లుగను యా సంద్రంబునన్ గావడెన్
దరియున్ దోచదు ఏమిటో విధియు; నీ దారిన్ మముంగావుమా
కరిణిన్ గాచిన యార్త రక్ష; మరి నీ కాళ్ళన్ బడన్ గావవే. (306)
(సశేషం)