చిరుజల్లు-68

0
3

కంటి పాప

[dropcap]చం[/dropcap]ద్రశేఖర్ చాలా బిజీగా ఉన్నాడు. అర్జంటుగా పూర్తి చేసి పంపవలసిన ఫైల్సు నాలుగు ఉన్నయి. పై ఆఫీసరు దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నయి. పన్నెండు గంటలకు మీటింగ్ ఉంది. ఈలోగా నోట్స్ తయారు చేయాలి.

అటెండర్ ఒక కవరు తెచ్చి అతని ముందు పెట్టాడు. అది ఆఫీసుకు సంబంధించినది కాదని, కవరు చూడగానే తెల్సిపోతోంది. అందుచేత కొంచెం ఆశ్చర్యపోతూ కవరు చించి లోపలి లెటరు తీసి చూశాడు. గులూబీ రంగు కాగితం నుంచి వచ్చిన పరిమళం గుప్పుమంది. ముత్యాల్లాంటి అక్షరాల వెంట చంద్రశేఖర్ చూపులు పరుగులు తీసినయి.

“ప్రియమైన చంద్రశేఖర్ గారికి-

మీకు నేను ఎన్నో విషయాలు తెలియజేయాలని కాగితం, కలం తీసుకుంటే, ఎందుకనో కలం ముందుకు సాగటం లేదు. కళ్లు మూసినా, తెరిచినా మీ రూపమే. నా కనుపాప నిండా మీ ప్రతిబింబమే. ఎప్పుడూ మమ్మల్ని తదేకంగా చూస్తుండాలనీ, వెన్నెల రాత్రుల్లో సముద్రపు ఒడ్డున మీతో చెట్టాపట్టాలుగా నడవాలనీ, మీ మౌనరాగాలాపనలే విని తరించాలని అనుక్షణం అనిపిస్తుంటుంది. ఈ నా హృదయ స్పందన మీకు తెలియజేయాలని కాగితం తీసుకుంటే, కలం ముందుకు సాగనివ్వని అభిజాత్యం ఏదో అడ్డు తగులుతుంటుంది. అందుచేత ఇప్పటికి ఇంతటితో సెలవు తీసుకుంటాను. మళ్ళీ రేపో, ఎల్లుండో, వారానికో, నెలకో, ఆరు నెలలకో, ఎప్పుడో మీకు చేరువ కావాలన్న కోరిక గోదావరి వరదల్లా ముంచెత్తినప్పుడు, నా హృదయ నివేదనను విన్నవించుకుంటాను. అంత వరకు ఉండనా మరి..

పాప..”

ఆ ఉత్తరం చదివాక చంద్రశేఖర్ మెదడు కొద్ది సేపు పని చేయటం మానేసింది. ఎవరీ పాప?.. ఈ పేరుగల వాళ్లు ఎవరూ తనకు తెలియదే? బాగా తెల్సిన మనిషిలాగా చాలా సన్నిహితంగా మెలిగిన మనిషిలా రాస్తోంది?

ఫోన్ బజ్జర్ మోగింది. ఆఫీసర్ ఫైలు తీసుకురమ్మని అడిగాడు. హడావుడిగా నోట్ ఫైల్ రాసి తీసుకెళ్లాడు. అది చదివి ఆయన విసుక్కున్నాడు.

“ఏమిటయ్యా ఇది? నేను రాయమని చెప్పిన దేమిటి? నీవు రాసిన దేమిటి?” అని కసురుకున్నాడు.

ఆయన్నే దాన్ని సవరించి నోట్ తయారు చేసుకున్నాడు. మీటింగ్‌కు ఆయనతో పాటు చంద్రశేఖర్‌ని కూడా తీసుకువెళ్లాడు. కారులో వెళ్తున్నంత సేపూ అతని దృష్టి ఆ లెటర్ మీదనే ఉంది. ఉండబట్టలేక జేబులో నుంచి కవరు తీసి చదువుతున్నాడు.

“ఏమిటిది?” అని అడిగాడు వెనక సీట్లో కూర్చున్న ఆఫీసర్.

“హృదయ వేదనా నివేదన..” అన్నాడు అస్పష్టంగా.

“ఏమిటి?” అని ఆయన రెట్టించి అడిగాడు.

“పాప.. పాప..” అని గొణుక్కున్నాడు చంద్రశేఖర్.

ఆయనుకు ఇతని సంధి ప్రేలాపన అర్థం కాక ఊరుకున్నాడు.

అరగంట తరువాత – మీటింగ్ జరుగుతోంది. చంద్రశేఖర్ ఒక చేత్తో ప్రేమగా జేబులోని కవరును నిమరుతునే ఉన్నాడు.

మీటింగ్‌లో ఉన్నంత సేపూ అతను పరధ్యానంగానే ఉన్నాడు.

మీటింగ్ అయిపోయి, తిరిగి ఆఫీసుకొస్తున్నప్పుడు, ‘పాప’ అని పలవరిస్తూనే ఉన్నాడు. పాప ఎంత అందంగా ఉంటుందో, తనకు ఎంత దగ్గర కాబోతోందో ఊహించుకుంటూ కలల అలల మీద తేలిపోతూనే ఉన్నాడు.

ఇంటికొచ్చాడు. భార్య రోజా కాఫీ అందించింది. ఇవాళ ఎందుకో అతని మనసు ఆనంద తరంగాల మీద తేలియాడుతోంది. భార్య మీదా మనసు పోయింది.

“ఇవాళ వంట చేయకు. ఏదన్నా హోటలుకు వెళ్లి బోజనం చేద్దాం..” అని అన్నాడు.

“ఆ స్టార్ హోటల్స్ కన్నా బ్రహ్మాండంగా వండుతాను. ఏం కావాలో చెప్పండి” అన్నది రోజా.

“అది కాదు. కొస్త వెరైటీ కోసం.. బయట తిరిగొద్దామని అన్నాను” అనీ సర్ది చెప్పుకున్నాడు.

“ఇవాళ నానిగాడి చేత హోం వర్క్ చేయించాలి. రేపు వాడికి ఎగ్జాం కూడా ఉంది.. ఇప్పుడు బయటకు వెళ్లటం కుదరదు.” అని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది.

చంద్రశేఖర్ నిట్టూర్చాడు. అతని ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయింది. ‘ఓ సరదా లేదు. ఓ సంతోషం లేదు.. ఎంతసేపు వాడికి పాఠాలు చెప్పాలి, బుజ్జి మండకు పాలు పట్టాలి, అంట్లు గిన్నెలు తోముకోవాలి. ఇల్లు ఊడ్చుకోవాలి.. ముగ్గలు పెట్టుకోవాలీ..’ అన్న ధ్యాసే తప్ప.. ఓ సినిమాకి వెడదాం.. ఓ పిక్నిక్ వెడదాం.. అన్న ధ్యాసే ఉండదు.. ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికి, మానసికంగా ముసలిదైపోయింది. సంసారం అనే ఊబిలో నుంచి బయటకు రాలేక పోతోంది.

చంద్రశేఖర్‌కి రాత్రి నిద్ర పట్టలేదు. జేబులో లెటర్ అలాగే ఉంది. రేపు బట్టలు ఉతకటానికి తీస్తే, బట్టలతో పాటే, ఆ లెటరూ తడిసిపోతుందన్న ఆలోచన రాగానే, లేచి జేబులోని ఉత్తరం తీసి షెల్ఫ్ లోని పుస్తకాల మధ్యలో దాచి పెట్టేశాడు.

లైటు వేసినందువల్ల రోజాకు మెలుకువ వచ్చింది.

“ఏంటి, లేచారు?” అని అడిగింది.

“నిద్ర రావటం లేదు.. అలా డాబా మీద వెన్నెల్లో కాసేపు కూర్చుందాం.. రా” అన్నాడు.

“మీకేం పనా, పాటా, రోజంతా గొడ్డులా చాకిరీ చేసి అలసిపోయాను. కళ్లు కూరుకు పోతున్నయి. మళ్లీ అయిందింటికి లేవాలి” అని అటు తిరిగి పడుకుంది – పిల్ల మీద చెయ్యి వేసి.

వారం రోజుల తరువాత చంద్రశేఖర్‌కి మరో ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పి చూశాడు. అదే గులాబీ రంగు కాగితం. అదే పరిమళం.

 “ప్రియాతి ప్రియమైన చంద్రానికి –

చంద్రశేఖర్ గారూ అంటే ఎవరో పరాయి వాళ్లను పిలిచినట్లు ఉంటోంది. అందుకని చంద్రం అనే పిలుస్తాను. కిందటి సారి ఉత్తరం రాసి వారం రోజులు అయింది. ఈ వారం రోజుల వ్వవధీ నాకు క్షణమొక యుగంలా గడిచింది. సదా నీ ద్యాసే. నిన్ను తల్చుకున్నప్పుడల్లా అందమైన ఊహలలో విహరిస్తున్నట్లే ఉంటుంది. నీ కోసం వెతుకుతూ కొండల్లో లోయల్లో తిరుగుతున్నట్లు, తెల్లని మంచుకోండల మీద నీ కాలి గుర్తుల కోసం వెతుకుతున్నట్లు, నీ పిలుపు కోసం దట్టమైన అడవుల్లో సంచరిస్తున్నట్లు.. ఏ నీలినీటి సరస్సు ఒడ్డునో, ఏ పారిజాత వృక్షాల పాదాల చెంతనో, నీవు నేనై, నేను నీవై.. నెరవేరేనా ఈ ఆశ? నిజమైన ప్రేమ ఎప్పుడూ సుఖాంతమే నంటారు. అసలు అంతమే కావనీ అంటారు. ఒక్కోసారి చుట్టుముట్టిన ఈ పరిస్థితుల సంకెళ్లు తెంచుకొని పరుగెత్తకొని నీ దగ్గరకు రావాలని ఉంటుంది. కానీ రాలేను. ఎందుకనీ అంటే మనం మన కోసం బ్రతకటం లేదు. ఆశ్రయించుకున్న వాళ్లందరి కోసం బ్రతుకుతున్నాం. ఏమేమో రాస్తున్నానని అనుకుంటున్నావు కదూ. ప్రేమ మైకంలోనూ తాగిన మైకంలోనూ ఉన్న వాళలు మాట్లాడేది అసంబద్ధపు ప్రేలాపనలాగానే ఉంటంది.

త్వరలో మనం కలవబోయే మధురమైన ఘడియల కోసం ఎదురు చూస్తూ-

పాప..”

ఈ రెండో ఉత్తరం వచ్చినప్పటి నుంచీ అతని ఆతురత మరింత పెరిగింది. ఈ పాపను వెతికి పట్టుకోవాలన్న పట్టుదలా ఎక్కవైంది. ఈ ప్రేమలేఖలు గుప్పించే పాప ఎవరై ఉంటుందో తెల్సుకునేందుకు మనసుకు పదును పెడుతున్నాడు.

బస్ స్టాప్‌లో కనిపించినప్పుడు ఓరగా నవ్వుతుంటుంది. ఆమే అయి ఉంటుంది.

మర్నాడు బస్ స్టాప్‍లో నిలబడ్డాడు. ఆమె వచ్చింది. దగ్గర వెళ్ళాడు. పలకరించాలనుకున్నాడు. ఆమె అదోలా నవ్వింది.

 “నిన్న కనిపించ లేదు” అని అడిగాడు.

“రోజు మీకు కనిపించాలన్న రూలు ఏమన్నా ఉందా?”

“అది కాదు పాపా? నిన్న బిజీగా ఉన్నారో ఏమో తెల్సుకుందామని..”

“తెల్సుకొని ఏం చేస్తారు? మేం ఇల్లు మారుతున్నాం. రేపటి నుంచీ అసలు కనిపించను. అయినా పాప అంటావేంటి? ఎలా కనిపిస్తున్నాను నీకు?” అంటూ కడిగి పారేసింది.

అక్కడితో ఆ పాప ఆమె కాదని తెల్సిపోయింది.

ఆఫీసులో రోజూ లిఫ్ట్ దగ్గర కనిపించే ఇంకొక ఆమె మీదకు అనుమానం మళ్లింది. ఆ రోజూ ఆమె కనిపించింది. అలవోకగా నవ్వింది.

“ఆర్ యూ లేట్?” అని అడిగాడు, ఏదో ఒక వంకతో పలకరించాలని.

“లేట్.. బట్ నాట్ టూ లేట్” అన్నది నవ్వుతూ.

“యస్. యస్.. యూ ఆర్ రైట్ పాప..” అన్నాడు.

“ఆయామ్ నాట్ పాప.. నాకు ఇద్దరు పాపలు ఉన్నారు” అన్నది.

కనుక ఇంకో అనుమానం నివృత్తి అయింది. ఆ పాప ఈమె కాదు. కనిపించిన ప్రతి స్త్రీలోనూ పాప కనిపిస్తుందేమోనని వెతుకుతున్నాడు.

చంద్రశేఖర్ స్నేహితుడి ఇంటి తలుపు తట్టాడు. ఆ పక్క పోర్షన్‌లో తన చిన్ననాటి ఫ్రెండ్ ఉంటోంది. అతను వెళ్లిన సమయానికి అతని ఫ్రెండ్ లేడు. పక్క అపార్ట్‌మెంట్ లోని ఆమె కనిపించింది.

“బాగున్నావా చంద్రం” అని అన్నది.

“బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు?” అని అడిగాడు.

“నేను బాగున్నానో లేదో నువ్వే చెప్పాలి” అన్నది నవ్వుతూ.

“నీలో చిలిపితనం పోలేదు ఇంకా? ఈ మధ్య మన ఊరు వెళ్లావా పాపా?” అని అడిగాడు.

“వెళ్లలేదు. కానీ పాప అని ఆ కొత్త పిలుపు ఏమిటి?” అని అడిగింది. అందులో కనిపించని మందలింపు ఉంది.

తను వెతుకుతున్న పాప ఈమె కూడా కాదని తెల్సిపోయింది.

వారం రోజుల తరువాత మరో ఉత్తరం వచ్చింది.

“డియర్ చంద్రం-

నీ అణ్వేషణ పూర్తి కాలేదనుకుంటాను. జీవితంలో చాలా మంది తటస్థ పడుతుంటారు. కొద్దిమంది దగ్గరగా వస్తారు. కానీ వాళ్లేవరూ నీ కంటిపాపలు.. పాపలు కాలేరు. మనకు ఎప్పడు ఎక్కడ వివాహం అయిందీ గుర్తుంటుంది. కానీ ఎందుకు వివాహం చేసుకున్నదీ గుర్తుండదు. కష్టసుఖాల్లో జీవిత భాగస్వామిగా కల్సి జీవిస్తాం అని పెళ్ళినాడు ప్రమాణాలు చేస్తారు. నాలుగుయిదేళ్లు గడిచేటప్పటికి, ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికి భార్యకు ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం అయిపోతుంది. భార్యగా కన్నా, తల్లిగా ఎక్కువ బాధ్యతలు ఆమెను చుట్టు ముట్టేస్తయి. స్త్రీ చేతికి పసి బిడ్డను ఇస్తే చాలు, ప్రపంచాన్ని మర్చిపోతుంది. మగవాడు అలా కాదు. ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిగాక కూడా తరగని, చెరగని అందాల కోసం ఆరాటపడతాడు. భార్యలో ఇది వరకటి సౌందర్యం కనిపించదు. పిల్లల కోడిలా కనిపిస్తుంది. ఇంక అతను రొమాంటిక్‌గా కనిపంచే మరో స్త్రీ కోసం అన్వేషణ మొదలు పెడతాడు. సరే మరి నీ అన్వేషణ ఇంక ఎంతోకాలం కొనసాగించాల్సిన పని లేదు. త్వరలోనే కనిపిస్తాను..

పాప”

ఆ ఉత్తరం చదివాక పాలపొంగు మీద నీళ్లు చల్లినట్లు అయింది.

సాయంత్రం ఇంటికి వెళ్తే, అది తన ఇల్లేనా అనిపించింది.

రోజా చాలా అందంగా ముస్తాబు చేసుకుంది. స్లీవ్‌లెస్ జాకెట్‌లో సిల్క్ చీరలో, బ్యూటీ పార్లర్ అందించిన సరికొత్త అందంలో వింతగా కనిపించింది.

“ఏమిటి ఇవాళ స్పెషల్?” అని అడిగాడు భార్యని.

“మన పెళ్లి రోజు” అన్నది రోజా.

“పిల్లలు ఏరి?”

“మా వాళ్ల ఇంట్లో వదిలి పెట్టాను. త్వరగా స్నానం చేసి రండి. సినిమాకు వెళ్లి హోటల్లో భోం చేసి, వీలుంటే హోటల్లో రూం తీసుకొని..” అని నవ్వులు ఒలకబోసింది.

“ఏమిటి చాలా జోరు మీద ఉన్నావు?”

“ఈ రోజు నాది కాదు. మీరు కోరుకుంటున్నదే..” అన్నది నవ్వుతూ.

చంద్రం భార్య వైపు చూశాడు. అతని కంటిపాపలో ఆమె పాప కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here