‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ – ఉపక్రమణిక

0
3

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ఉపక్రమణిక

[dropcap]1[/dropcap]988లో డా. అల్లాడి వైదేహిగారి పర్యవేక్షణలో యు.జి.సి. వారి ప్రాజెక్ట్ రిసర్చి అసిస్టెంట్‌గా పనిచేసే రోజుల్లో కాకతీయుల కాలానికి చెందిన తెలుగు సంస్కృత శాసనాలను విశ్లేషించి నివేదిక రాసే పని నాది. ఆ సందర్భంగా ఎన్నో శాసనాలను పరిశీలించే సమయంలో కాకతీయ వంశానికి చెందిన స్త్రీలు, ఇతర స్త్రీలు వేయించిన దానశాసనాలు చూడడం తటస్థించింది. ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఏలిన ఏకైక మహిళ రుద్రమదేవి కాకతీయ వంశానికి చెంది ఉండడం, ఆ కాలంలో స్త్రీలు తమ ధనంతో దానధర్మాలు చేసే స్వాతంత్ర్యం కలిగి ఉన్నట్లు గమనించిన నాకు కాకతీయుల కాలంలో స్త్రీలు సామాజికంగా ఏ స్థితిని పొంది ఉంటారో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఈ విషయంలో పరిశోధన చేయాలనే కోరికతో ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులను కలిశాను. వారు ఈ అంశం బాగున్నదని ప్రోత్సహించారు. 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు నాకు తెలుగులో పి.హెచ్.డి.కి అవకాశం ఇచ్చారు.

ఈ అంశం పైన ఇంతకు ముందు పరిశోధనలు జరగలేదు. డా. అల్లాడి వైదేహిగారు మధ్యయుగం నాటి ఆంధ్రుల సాంఘిక ఆర్థిక స్థితిగతుల గురించి రచించిన సిద్ధాంతగ్రంథం ఆంధ్రుల సాంఘిక-ఆర్థిక చరిత్ర (మధ్యయుగము). అందులో మధ్యయుగం నాటి స్త్రీల గురించి అమూల్యమైన విషయాలను తెలిపారు కానీ గ్రంథం ప్రత్యేకించి స్త్రీల గురించి రచించినది కాదు కనుక వారి గురించిన విషయాలు క్లుప్తంగా తెలిపారు.

ఇవి తప్ప స్త్రీల సామాజిక స్థితిగతుల గురించి ప్రత్యేకంగా ఏ పరిశోధన ఇంతవరకు వెలువడలేదు. నేను కాకతీయుల గురించి, వారి కాలంలోని చారిత్రక స్త్రీల గురించి, ఆనాటి సమాజంలో స్త్రీలు – వర్గాలు, వారి జీవన విధానం, సమాజంలో కుటుంబంలోనూ వారి స్థానం, ఆనాటి రాజకీయాలలో వారి పాత్ర, వివాహాది సంస్కారాలు, వారు నేర్చిన విద్యలు, కళలు, ఆనాటి మత సంప్రదాయాలలో స్త్రీల పాత్ర, వారనుసరించిన వృత్తులు, వారి వేషభూషలు, వస్త్రధారణ అన్న అంశాల గురించి ఈ సిద్ధాంత వ్యాసంలో చర్చించాను. సిద్ధాంత వ్యాసాన్ని తొమ్మిది ప్రకరణాలుగా విభజించాను.

నా పరిశోధనకు ఉపయోగించినవి ఆ కాలానికి చెందిన శాసనాలు, కావ్యాలు. ముఖ్యంగా పాల్కురికి సోమనాధుని బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, నన్నెచోడుని కుమార సంభవం, కేతన రచించిన విజ్ఞానేశ్వరం, దశకుమారచరిత్ర, మారన రచించిన మార్కండేయ పురాణం, మంచెన కేయూరబాహు చరిత్ర, కాకతీయుల కాలంలో రచింపబడక పోయినా కాకతీయ రాజుల గురించి తెలిపిన ప్రతాపరుద్ర చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, ఆ కాలంలో జరిగిన యుద్ధాన్ని గురించి, వీరుల గురించి తెలిపే పల్నాటి వీరచరిత్ర కాటమ రాజు కథలు ఆనాటి వారి గురించి తెలిపే క్రీడాభిరామం. ఇవన్నీ ఆనాటి చరిత్రకు, సమాజానికి సంబంధించిన అమూల్యమైన విశేషాలనెన్నిటినో తెలియజేస్తాయి. తెలుగు దశకుమార చరిత్ర దండి కావ్యానికి అనువాదం అయినా ప్రాసంగికంగా కేతన తన కాలానికి చెందిన అమూలకమైన తెలుగుదేశపు విశేషాలను తెలియజేశాడు. ఆ కాలంలోని ఇతర కావ్యాలలోనూ ప్రసక్తమై కేతన కావ్యంలోనూ ప్రతిబింబించిన సామాజిక విశేషాలను మాత్రమే నేను నా పరిశోధనకు వాడుకున్నాను. సంఘజీవనం సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది కనుక నేను సాహిత్యాన్ని ఉపయోగించుకున్నాను. చారిత్రక వ్యక్తుల గురించి తెలిపేటందుకు, సాహిత్యంలోని సాంఘిక విశేషాలను శాసనాధారంతో బలపరచే ఉద్దేశంతో నేను శాసనాలను కూడా వాడుకున్నాను. కొన్నిచోట్ల ఆనాటి శిల్పాల ప్రతిబింబాలను కూడా ఉపయోగించుకున్నాను.

కాకతీయుల గురించి వారి కాలంలోని విశేషాల గురించి తెలిపిన సుప్రసిద్ధ చారిత్రకులు, ధీమాన్యులు సురవరం ప్రతాపరెడ్డిగారు, వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, ఖండవల్లి లక్ష్మీరంజనంగారు, డా. మారేమండ రామారావుగారు, డా. పింగళి లక్ష్మీకాంతంగారు, డా. చిలుకూరి నారాయణరావుగారు, శ్రీ చిలుకూరి పాపయ్య శాస్త్రిగారు, శ్రీ నిడుదవోలు వెంకటరావుగారు, శ్రీ పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు మొదలైనవారి గ్రంథాలు, కాకతీయ సంచిక, విజ్ఞాన సర్వస్వాలు, భారతి, సాహితి, తెలుగు పరిశోధన పత్రికలు, కాకతీయుల గురించి ప్రత్యేకంగా వెలువడిన సాంస్కృతిక పత్రికలు నాకెంతో ఉపకరించినాయి.

పరిశోధన అంతులేనిది. కాని కాలపరిమితి గ్రంథ విస్తరణ భీతి ఈ థీసిస్‌ను ముగించేలా చేసాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులకు, తెలుగు శాఖాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలర్పించుకుంటున్నాను.

(వచ్చే వారం సిద్ధాంత వ్యాసం లోని మొదటి ప్రకరణం ప్రారంభం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here