విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-12

0
3

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

ఐరనీయమ్

[dropcap]భ[/dropcap]గవద్రామానుజుల వారి గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. కానీ అన్ని విశేషాల్లో గొప్ప విశేషం, ఆయన జీవిత సందేశం.. సత్యం కోసం కట్టుబడి ఉండటం, సత్యధర్మాలను ఉద్ధరించటానికి గురువునైనా ఎదిరించి నిలబడగలగటం.

తిరుమంత్రాన్ని ఉపదేశించి, దానిని ఎవరికి పడితే వారికి ఇవ్వవద్దని గట్టిగా చెప్పారు ఆ ఉపదేశించిన గోష్ఠీపూర్ణుల వారు. అయినా రామానుజుల వారు దేవాలయం గోపురం మీదకెక్కి జనులందరినీ పోగు చేసి, మోక్షాన్నిచ్చే మంత్రం అందరికీ చెందాలని అందరికీ వినపడేలా చెప్పారు.

గురువు వచ్చి మందలించబూనారు. నేను నరకానికి పోయినా ఇందరు జనులు మోక్షం పొందుతారంటే నాకు అంతకన్నా కావలసినదేముంది అని అంటారు భగవద్రామానుజులు. గురువు గారిని మెప్పించటమే కాదు, ఆయన ఆర్ద్రతతో కరిగి కన్నీరయ్యేలా చేశారు.

ఇక అన్నిటికన్నా బాగా మనకు ఆయన సహజ రీతిని, ఈరోజు మనుషులు ఎలా ఉండాలి అన్నదానిని మనకు గొప్పగా ఎత్తి చూపే విషయం మరొకటి ఉంది.

రామానుజులు శారదాపీఠానికి వెళతారు. అక్కడ చర్చాగోష్ఠిలో విజయం సాధిస్తారు. సభ ముగిసిన తరువాత ఆయన శిష్యగణంతో బైటకు వస్తారు.

ప్రాంగణం దాటి అడుగు ముందు పెట్టబోతుండగా తెల్లటి వస్త్రాలలో ఒక స్త్రీమూర్తి ఎదురుపడుతుంది. దివ్యమంగళ రూపం. మనోహర వదనం. చిరునవ్వు చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. ఎదురుగా నిలబడింది అమ్మ.

ఆమె తిరు ముఖ మండలం అమిత తేజోమయంగా ఉంది.

శారదాదేవి.

“తస్యయదా కప్యాసం పుండరీక మేవ మక్షణీ!”

ఈ శ్రుతివాక్యానికి నీవిచ్చిన అన్వయం, అత్యద్భుతంగా ఉండి, హృద్యమై భాసిల్లుతున్నది రామానుజా!

అవి ఆమె పల్కులు.

శారదాదేవి మెచ్చిన ఆ అన్వయాన్ని రామానుజుల గురువు మెచ్చరు.

రామానుజులు కాంచీపురంలో యాదవ ప్రకాశకుల వద్ద విద్య నేర్చుకుంటారు. ఆ సమయంలో ఈ వాక్యం విషయంలో గురువు చెప్పిన అన్వయం సరిగ్గా లేదని రామానుజుల వారి వేదన. దాన్నే దాచుకోకుండా గురువు గారికి చెప్తారు.

నాకే ఎదురు చెప్తావా? అని గురువు హుంకరిస్తారు.

చేతనైతే నాకన్నా గొప్పగా నీవు చెప్పు అంటారు.

రామానుజుల వారి పల్లుల్లో ఆ ఉపనిషద్వాక్యం పాలకడలిలో వైకుంఠనాథుడంతటి ప్రసన్నంగా భాసిల్లుతుంది. విన్నవారి హృదయాలు పులకిస్తాయి.

ఒక్క యాదవ ప్రకాశకులకు తప్ప.

గురువునే ధిక్కరించిన రామానుజులు మనకిచ్చిన సందేశం.. సత్యధర్మాలను ఉద్ధరించేందుకు ఎవరినైనా, సాక్షాత్ భగవంతునినైనా ఎదిరించాల్సిందే.

అందుకే శారదాదేవి రామానుజుల అన్వయాన్ని అంతటి విద్వత్ సభలో ఆమోదించి, కాదు కాదు హర్షాతిరేకంతో మెచ్చుకున్నది.

Yours truly: ఎక్కడ చదివానన్నది గుర్తులేదు. చాలాకాలం క్రితం దాచుకున్న నోట్స్. <<< >>> మధ్య రాసింది నా స్వంతం కాదు.

<<< “నీల నీరదమూర్తి అయిన పరమాత్ముని ఆర్ద్రనేత్రాలకు సరస్సులో నులివెచ్చని సూర్యకిరణాలు లీలగా విచ్చుకున్న తామర పూరేకులతో పోల్చడం నీకే చెల్లింది రామానుజా. క పి అన్న పదంలో దాగిన అంతరార్థాన్ని వెలికి తీసావు. ‘‘క’’ అంటే నీరనీ, పి అంటే పిబతి, అంటే తాగునది, కిరణాల వేడితో నీటిని తాగేవాడు సూర్యుడు, దాని అర్థం లేలేత రవికిరణాల తాకిడిచేత మెల్లగా విచ్చుకున్న తమ్మిపూవులు, రవికిరణ స్పర్శ చేత వికసిత పులకితమయ్యే పవిత్రపుష్పం తామర. ఆ పురుషోత్తముని కన్నులు భాస్కరకర వికసిత జలజపత్రవర్ణ శోభితమై ఉబ్బుగా, లేత ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్నాయని నీవు పరంధాముని పుండరీకాక్షములను వర్ణిస్తూ ఉంటే అమితానందం కలిగింది నాయనా” అన్నారామె.

“అక్షరాలను విరిచి, వాటికి అసందర్భ అర్థాలను ఏవేవో వివరిస్తూ ఉంటే ఆ కువ్యాఖ్యానాలు విని నేనెంత బాధపడ్డానో. వాగర్థముల అద్వైతాన్ని స్థిరీకరించి, విశిష్టాన్వయంతో ఆ శృతి వాక్యాన్ని విశిష్టాద్వైతం చేసిన నీ భావనాగరిమ నా దుఃఖాన్ని దూరంచేసింది రామానుజా! అని ఆ అమ్మ పలుకుతూ ఉంటే, రామానుజులవారికి అర్థమైంది.

ఆమె ఎవరో కాదు. సాక్షాత్ వాగ్దేవత. సరస్వతీ మాత. >>>

వీణాపుస్తక ధారిణి.

ఈ అన్వయం, మరికొన్నిసార్లు రామానుజులు తన గురువును ఖండించటం వల్ల ఆ గురువే రామానుజుల వారి మీద హత్యా ప్రయత్నం చేస్తారు.

అలాటి రామానుజ సంప్రదాయానుసారిలా ఎర్రటి తిలకాన్ని, నిలువు బొట్టులా ధరించిన అనంతరామ శర్మ పాత్రను తద్విరుద్ధంగా మలచటం విశ్వనాథ్ చూపిన గొప్ప ఐరనీ.

గురువైనా, మరే ఇతర పెద్దలైనా తప్పు చేస్తే దానిని ఎత్తి చూపటంలో ఏమాత్రం దోషం లేదు. కానీ మనకు మొదటి నుంచి పెద్దలను ఎదిరించకు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా వినాలి. తలూపాలి. ఒప్పుకోవాలి అని నూరిపోశారు.

This is the most unkindest cut of all!

తెలుసు కదా. Double superlative. ఇది నిషిద్ధం. కానీ దానిని రాసింది Shakespeare కనుక, ఆయనకు తెలియని ఆంగ్ల భాషా? ఆయన తన ఎమోషన్‌ను గట్టిగా చెప్పటానికి చేసిన పని కనుక..

ఇలా మనకు చిన్నతనంలో స్కూలు రోజులలో గ్రామర్ నేర్పేటప్పుడు చెప్తారు. కానీ గ్రామర్ నియమాన్ని ఎందుకు తప్పాలి? దాని బదులు మరొక పవర్ఫుల్ పదం వేయరాదా? లేదా సృష్టించరాదా?

Shakespeare already ఆ పని చాలాసార్లు చేశాడు కదా. అంతే. పెద్దవాళ్ళు చేస్తే ఒప్పాల్సిందే. That can be acceptable for greater good.

But this is a mere sentence spoken by someone in a drama. He shouldn’t have used double superlative.

“ఇదేమీ వేదం కాదు కనుక..” అని మాకు గ్రామర్ నేర్పించిన శ్రీ ఎన్. సుబ్బారావుగారు అన్న మాట. అంటే వదిలేయమని.

కానీ అనంతరామ శర్మ చేసిన పని? అది వేద మంత్రమే కదా. దాన్ని అపస్వరంతో పలికితే వచ్చే సమస్యలు తెలియవా?

ఇక్కడ మరోసారి అష్టావక్ర మహర్షి కథ మనకక్కరకొస్తుంది. కాకపోతే వర్షన్ మరోలా ఉంటుంది.

ఆ తమాషా ఏమిటంటే..?

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here