ఎంగిలి

0
3

[హిందీలో శ్రీ అరిగపూడి రమేష్ చౌదరి వ్రాసిన కథని ‘ఎంగిలి’ పేరిట తెనుగులోకి అనువదించి అందిస్తున్నారు దాసరి శివకుమారి.]

[dropcap]“ని[/dropcap]జంగా ఇది కష్టకాలమే. గడ్డు పరిస్థితి అనుకుంటే గడ్డు పరిస్థితే. కాదనుకుంటే కాదు. కాని మనం ప్రయత్నిస్తే ఏదో ఒక దారి దారి తప్పకుండా దొరుకుంది” అని పిళ్లైగారు తన భార్యతో ఏదో ఒక పొడుపు కథ చెప్పినట్లుగా చెప్తున్నారు.

తన భర్త ఎవరి గురించి చెప్తున్నాడో ఆమెకు తెలుసు. అయినా ఏమీ తెలీనట్లు గానే “ఇంతకీ మీరు చెప్పే విషయం దేన్ని గురించి? మీ సోమసుందరాన్ని గురించేనా?” అన్నది.

“అవును. వాడి గురించే. ఇంట్లో కనపడలేదు. ఎక్కడి కెళ్లాడు? ”

“ఇంకెక్కడికి వెళ్తాడు. ఏ బజారుకో పోయివుంటాడు.”

“సుమతీ కనపడలేదు.”

“అది స్కూల్ కెళ్లింది గదా? ”

“స్కూల్ వదిలే సమయమైంది గదా? ”

“ఇంటికి వస్తూనే వుండవచ్చు.”

“సోమును గురించి సుమతి కేమైనా ఆలోచన వున్నాదా?”

“చిన్న పిల్ల. అదేమాలోచిస్తుంది? దానికెలాంటి ఉద్దేశమైనా వుండవచ్చు. కాని చివరకు నెగ్గేది నా మాటే. నేను నా కూతుర్ని ఏ కసాయి వాడికైనా ఇచ్చి చేస్తా కాని ఒక అసమర్థుడికి మాత్రం ఇచ్చి కట్టబెట్టను. మీకు చెల్లెలి కొడుకూ, మేనల్లుడూ అయితే కావచ్చు. కాని వాడు వట్టి దద్దమ్మ. వెనకాల పొలం పుట్రా లేవు. చేసేందుకు పనీ పాటా లేదు. మంచి రూపసీ కాడు. అతనిలో ఏం చూసి మన బిడ్డనిచ్చి పెళ్లి చేయాలి?”

“నీ ఉద్దేశం నాకు తెలుసనుకో. కాని ‘బావ’ అంటూ సుమతి ఏమైనా అభిమానం పెంచుకుందేమోనన్న అనుమానంతో అడుగుతున్నాను.”

“అభిమానమా? భలే వాళ్లే. అసలతగాణ్ణి చూస్తూనే అది నొసలు చిట్లిస్తుంది. సరిగా మాట కూడా మాట్లాడదు. ఏదో మేనత్త కొడుకు కాబట్టి ఎప్పుడైనా ఎదురు పడితే పెదాల మీదకు ఒక చిన్న నవ్వు తెచ్చుకుంటుంది. అంతే అంతకు మించి మరేం లేదు.”

“హు. సరే అయితే.”

“మీరేమీ ఆదుర్దా కాని, హైరానా కాని పడాల్సిన పని లేదు. మీ చెల్లెలితో నిర్మోహమాటంగా చెప్పండి. నా కూతుర్ని నీ కొడుక్కు ఇచ్చే ఆలోచనే లేదని తేల్చి చెప్పండి.”

“చెప్పు. చెప్పు అంటే ఎలా చెప్పాలి? మా ఇళ్లల్లో ఎప్పటి నుండో బంధువులలోనే పెళ్లిళ్లు జరుపుకునే ఆచారమే వున్నది.”

“ఏంటి కొనసాగేది! మీరేమన్నా ఇలాంటి పెళ్లి చేసుకున్నారా? లేదు గదా. మరి మీ అమ్మాయి పెళ్లి మాత్రం ఎందుకు చుట్టాలలో చెయ్యాలి? నా కూతుర్లో ఏ లోపమన్నా వున్నదా? పెళ్లి కాకుండా ఇంటపడి అఘోరిస్తున్నదా? ఇవ్వాళ కాకపోతే రేపైనా మంచి సంబంధం చేసుకుని దర్జాగా బతుకుతుంది. ”

“ఆ.. ఆ.. అలానే నువ్వన్నట్లుగా మంచి సంబంధంమే చేద్దాం.” అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. మనసుకు తేలిక చేసుకోవటానికికై సిగరెట్ వెలిగించి పొగ పీల్చసాగాడు. పిళ్లైగారు ఏవిషయాన్నైనా ఎక్కువ సేపు ఆలోచించరు. వచ్చిన సమస్యలు నిదానంగా వాటంతట అవే పరిష్కారం మవుతాయన్న ఆలోచనతో వుంటారు. అది వ్యాపారమైనా కావచ్చు. తన కూతురి పెళ్ల విషయమైనా కావచ్చు.

“ఇంకొక్కమాట. మీ చెల్లెలూ వాళ్లూ నా కూతురికి సరైన నగా నట్రా ఏదైనా చేయించగలరా? కడుపు నిండా తిండి పెట్టడమే గొప్ప. అసలు పెడదామనుకున్నా ఆ యింట్లో ఏమైనా వుంటే గదా?” అంటూ పిళ్లైగారి బార్య ఒకటే నస పెట్టసాగింది.

“అవును. నువ్వన్నదీ నిజమే ననుకో.”

 “పెళ్లంటూ జరిగితే రెండు సమాన స్థాయి గల కుటుంబాల మధ్య జరగాలి. మనమెక్కడ? వాళ్లెక్కడ?”

“వ్యాపారంలో కలిసి రాకపోతే మనం కూడా వాళ్లలాగే బీదరికంలోనే వుండిపోయే వాళ్లం. వాళ్లలాగానే ఒకటి రెండెకరాల బీడు భూమితో కుస్తీ పడుతూ వుండేవాళ్లం. ”

“అలా అంటున్నారా? పోనీ, వాళ్లను కూడా వ్యాపారం చేసి చూపించమనండి. ఉన్న వ్యవసాయమే చేసుకోవం వాళ్లకు రాదు. అటు వ్యాపారమూ తెలీదు. ఇటు వ్యవసాయమూ రాదు. అలాంటి వాళ్లు దేనికీ పనికిరారు.”

భార్య మాటలు వన్న పిళ్లైగారి కోపం నషాళానికంటింది. అయినా తమయించుకున్నారు. అడ్డు ఆపూ లేకుండా వాగే ఆమె నోటికి జడుస్తూ వుంటారు. అయినా మాటలు కూడ దీసుకుంటూ “సమానత్వం సంగతి పక్కన పెట్టు. చుట్టరికాన్ని చూసుకోవాలి గదా. ఆస్తిపాస్తులు లేకపోయినా పిల్లవాడి చేతిలో డిగ్రీ వున్నది.” అన్నారు.

“డిగ్రీతో ఏం చేస్తాడు? ఒక మాదిరి ఉద్యోగం కూడా రాదు. ఈ రాజకుమారుణ్ణి చూసి ఎవరైనా మూడు, నాలుగు వందల కన్నా ఎక్కువ జీతం ఇవ్వటానికి ముందుకొస్తారా ఏంటి? మీరు మేనల్లుడంటూ ఆ దౌర్భాగ్యుడికి నా కూతుర్ని కట్టబెడితే ఆ తర్వాత నాకు పిండాలు పెట్టల్సివస్తుంది. మీకు నేను మళ్లీ చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నా కూతుర్ని ఆ యింటికి మాత్రం పంపను. మీరు కలలో కూడా ఊహించుకోవద్దు. కూతురికీ, మేనల్లుడికీ పెళ్లి చేద్దామన్న ఆలోచనే రానివ్వద్దు” అంటూ ఆమె ఖరాఖండీగా చెప్పింది.

“కాని వాళ్లు మన సంబంధం మీద చాలా ఆశలు పెట్టుకుని వున్నారు. ఆ ఆశతోనే ఏ వంక దొరికినా సోమసుందరం ఇక్కడికి వచ్చి పోతున్నాడు. మరి.. అలాంటప్పుడు..”

“మరీ.. లేదు, ఏమీ లేదు. మీరిలా అనుకునేటట్లైతే అతగాడ్ని మన ఇంటి ఛాయలకే రానివ్వను. నా కూతురు పెళ్లి కాకుండా వుండిపోయినా నా కిష్టమే. మళ్లీ మళ్లీ ఇదంతా మీకు చెప్తున్ను. మీకు మౌనంగా వున్నా, నేను సోమసుందరానికి తగ్గ సమాధానం చెప్పి పంపుతాను.  ”

“వద్దు, వద్దు. నువ్వేం చెప్పొద్దు. సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడుతాను. నువ్వేదైనా రెండు మాటలు అంటే చుట్టాలందరూ కలిసి దాన్ని పెద్దది చేసి నానా రభసా సృష్టిస్తారు. నీకు నేను చెప్పాలా ఏంటి? నువ్వు చాలా తెలివిగలదానివి. బంధుత్వాన్ని అంత తేలిగ్గా తెంచుకోవటానికి. నువ్వేమన్నా పిచ్చదానివా? ఏ వ్యవహారన్నైనా తెగేదాకా లాగవు కదా?” అంటూ పిళ్లైగారు తన భార్యను చొచ్చగొట్టారు. వినియోగదారుణ్ణి మాటలతో మభ్య పెట్టి తియ్యతియ్యగా, మోసం చేస్తూ వాళ్లను బురిడీ కొట్టించినట్లే భార్యను మాయ చేస్తూ వుంటారు. ఇంకా నవ్వుతూ “నీకు విరుద్ధంగా ఒక్క మాట కూడా ఈ ఇంట్లో ఎవరూ మాట్లాడరని, ఏ పనీ జరగదని నీవు మాత్రం ఎరగనిదా ఏంటి?” అంటూ మరింత బుజ్జిగిస్తూ “నా కండువా తీసుకు రా. కొంచెం బజారు దాకా వెళ్లి వస్తాను” అని చెప్తూ ప్రస్తుతానికి ఆ విషయాన్ని అడ్డుకున్నారు.

భార్య తెచ్చిచ్చిన పై కండువా భుజం మీద వేసుకుంటూ ఇంట్లో నుండి బయటకు నడిచారు రామస్వామి పిళ్లైగారు. తన ఇల్లంతా ఎవరో దుమ్ము, ధూళితో నింపినట్లుగా, తనకు ఊపిరాడనట్లుగా అనిపించి బజార్లో సేద దీర్చుకోవాలనుకున్నారు.

పిళ్లైగారు బజారు నుండి ఇంటికి వచ్చేటప్పటికి కూడా మేనల్లుడు ఇంట్లో ఎక్కడా కనపడలేదు. బహుశా వాడు వెళ్లిపోయి వుంటాడనుకుంటూ కొంత బాధపడ్డారు. కాని ఆ బాధను బయటకు తెలియనివ్వకుండా ప్రశాంతంగా కనపడటానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే భార్య అంటే భయమున్నది. ఈ రోజు తను ధనవంతుడిగా, సమాజంలో పెద్దమనిషిలా, చలామణి అవుతున్ననంటే దానికి కొంత కారణం భార్య కూడా. బయటి సమాజానికి అతడు చాలా పెద్ద వ్యాపారస్థుడు. అతడి పేరు ప్రఖ్యాతులు చుట్టు పక్కల ప్రాంతాలకు బాగానే పాకినవి. కాని ఇంట్లో మాత్రం ఇంటి ఇల్లాలే యజమానురాలు.

ఒకప్పుడు రాజకీయంగా కూడా పావులు కదిపాడు. కాని వ్యాపారంలో రాణించినట్లుగా రాణించలేకపోయాడు. ఇంక వాటికి శాశ్వతంగా దూరంగా వుండాలనుకున్నాడు. ఆ ఊర్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వాటిల్లో ఆనందాన్ని పొందుతూ వున్నాడు.

పిళ్లైగారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురిలోకి పెద్దది సుమతి. తరువాతి వాళ్లిద్దరు మగపిల్లలు. ఒక విధంగా యజమానురాలైన భార్య, ఆమె చెప్పుచేతల్లో వుండే పిల్లలు. అలాంటి ఇంట్లో తనకు కావలసినంత సుఖమూ, సంతోషమూ లేవని పిళ్లైగారు బాధపడుతూ వుంటారు. బయట ప్రపంచంలో సుఖసంతోషాలను వెతుక్కోవాలి, అలా వెతుక్కోవటంలో తప్పేమీ లేదన్న అభిప్రాయానికి గట్టిగా వచ్చాడు. కాని తను ఉన్న ఊళ్లో తనను ఎవరూ వేలెత్తి చూపే అవకాశం లేకుండా నడుచుకునే చతురుడు కూడా.

భార్య పట్టు బట్టిందని కూతురు సుమతిని స్కూల్లో చదువు పూర్తి కాగానే దూరంగా వున్న మద్రాసులోని ఒక కాలేజీలో చేర్పించారు. ఏ నెపంతో కూడా ఆ తర్వాత సోమూ మేనమామ ఇంటికి రాలేదు. సుమతి కోసం మద్రాసు వెళ్లి అక్కడి వీధుల్లో ‘మజ్ను’లాగా తిరగాలన్న ఆలోచనా లేనివాడు.

మేనల్లుడి విషయంలో పిళ్లైగారు మొదట్లో బాధపడ్డారు. కొంత పశ్చాత్తపం లాంటిది కూడా  కలిగింది. ఆయన భార్య మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిశ్చింతగా వుండసాగింది. పిళ్లైగారు కూడా ఆ తర్వాత నిశ్చింతగా వుండసాగారు. ఎందుకంటే ఏ విషయాన్నీ ఎక్కువగా ఆలోచించి బాధపడే మనస్తత్వం కాదు గనుక. దేన్ని గురించీ తల బద్దలు కొట్టుకునే అలవాటు కూడా లేదు.

అప్పుడప్పుడు తనకు ఉల్లాసం, ఆనందం సమకూర్చుకోవాలనే, నెపంతో మాద్రాసు వెళ్లేవాడు. తన ఊర్లోనూ, చుట్టు ప్కకల ఊళ్లోనూ పిళ్లైగారిని చాలామంది ఎరుగుదురు. మద్రాసు మహాపట్నంలో అతడిని గుర్తించేవారు లేరు. పెద్ద పట్నాలలో వుండే వాళ్లు పక్కవాళ్ల గురించే తెలియనంత విచిత్రంగా వుంటారు. ఏదో ఒక ఊరు నుండి వచ్చి ఇక్కడకు వచ్చిపోయే వాళ్ల సంగతి ఎవరికి పడుతుంది?

మళ్లీ ఈసారి మద్రాసు వచ్చారు పిళ్లైగారు. చాలా ఖరీదైన హోటల్లో దిగారు.  బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే అక్కడ దిగుతారు. ఆ హోటల్‌లో అయ్యే ఖర్చు సగటు మనిషి ఊహల్లోకి కూడా రాదు. పిళ్లైగారు హోటల్లో దిగగానే ఎప్పుడూ వచ్చి కలుసుకునే వ్యక్తి వచ్చి కలిశాడు. పిళ్లైగారి ప్రతి కోర్కెనూ ఆజ్ఞలాగా భావించి తు.చ తప్పకుండా ఆచరించే నమ్మినబంటు అతను. అతనే అచ్యుతన్. అచ్యుతన్ గది తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి చేతులు జోడించి ఏమి ఆజ్ఞ అన్నట్లుగా చేతులు జోడించి మరీ నిలబడ్డాడు.

“నేనీ వూరు ఎందుకొచ్చేదీ నీకు తెలుసు. తాజాగా, అదిరిపోయేటట్లు వుండి, మన మనకనుకూలంగా..” అంటూ పిళ్లైగారు ఆపేశారు. ఇంకా ఎక్కువగా వివరించి అచ్యుతన్‌కు చెప్పక్కర్లేదు. ఆ విషయం అచ్యుతన్‌కూ అలవాటే.

“చూపులకు అచ్చం పోత పోసిన విగ్రహమే సార్. కాని రాత్రి పూట కాదు సార్. మీరు సాయంకాలమే ఎదురు చూడాల్సి వుంటుంది సార్.”

“సరుకు మాత్రం సరికొత్తగా వుండాలిని తెలుసుగా” అన్నారి పిళ్లైగారు పక్కా వ్యాపారస్థుడిలాగా.

అచ్యుతన్ అలాగేనన్నట్లుగా తల ఊపాడు.

ఈలోగా పిళ్లైగారు తన కూతురు సుమతిని చూసి వస్తానని బయలుదేరి వెళ్లారు. తన ఊళ్లో, తన ఇంట్లో వున్న గ్రామీణ యువతి సుమతి ఇప్పుడు పక్కా మదరాసీగా మారిపోయింది. వంపు సొంపులన్నీ కనపడేటట్లు వేసుకున్న బట్టలు, తైలసంస్కారం లేకుండా, గాలికి ఎగిరిపోయే పొడిపొడి వెంట్రుకలతో వున్నది. రోల్డ్ గోల్డ్ నగలు ఒంటి మీద మెరుస్తూ వున్నాయి. సుమతి ముఖంలో విచిత్రమైన కదలికలు. ఆమె హావభావాల్లో ఆడంబరత కనపడుతున్నాయి. తమ పిల్లల్ని పల్లెటూరి బైతులు అనుకోకుండా నాగరికులుగా తయారు చెయ్యాలని కలలు గంటూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని పట్టణాలకు పంపి, ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఆ బాటలోనే నడిచే పిల్లలు, ముఖ్యంగా బాలికలు తాము ఎంతో నాగరికులమని నిరూపించుకోవటానికి తమ శాయశక్తులా ప్రయత్నించే వాళ్లు. సుమతి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. పైగా ఆమె వైఖరి తండ్రికే మాత్రం నచ్చలేదు. అసంతృప్తిగా హోటల్‌కు తిరిగొచ్చాడు. భోజనం చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత మద్రాస్ నగరంలో కాలక్షేపానికి వెళ్లాడు. నాలుగు గంటవుతూనే, హోటల్‌కు తిరిగొచ్చాడు. గది కొచ్చి సానం చేసి తాజాగా తయారయ్యాడు.

బయట ఇంకా సంజె చీకట్లు అలుము కోలేదు. అచ్యుతన్ లోపలికొచ్చాడు. చేతులు జోడించుకునే  “అయ్యా! మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారు. నేను వారితో అన్ని విషయాలూ మాట్లాడాను. నేనిక్కడ వరండాలోనే వుంటాను. ఏ అవసరమొచ్చినా గంట మోగించండి. నేను క్షణాల్లో వచ్చి వాల్తాను” అన్నాడు.

“అలాగే” అంటూ దర్పంగా తల పంకిస్తూ పిళ్లైగారు స్నానాల గదికెళ్లారు. ఇప్పుడక్కడికి, వెళ్లాల్సిన అవసరమేదీ ఆయనకు లేదు. స్నానాల గది నుండి తిరిగి వచ్చే సరికి మంచం మీద అలంకరణతో మెరిసిపోతున్న ఒక యువతి కూర్చుని వున్నది. ఆమెను చూస్తూనే పిళ్లైగారు అవాక్కయ్యారు. ఇంట్లో నెత్తురుచుక్క లేకుండా పాలిపోయి కొయ్యాబారినట్లైంది. కళ్లముందు చీకట్లు కమ్మి అంతా వలయాలు వలయాలుగా కనపడసాగింది. ఎదురుగా మంచం మీద కూర్చున్న యువతి పరిస్థితి కూడా అంతకు తక్కువగా ఏం లేదు. ఇద్దరూ కూడా ఒకరి వంక ఒకరు సూటిగా చూసుకోలేక కళ్లు వాల్చుకుని నేల చూపులు చూడాసాగారు.

పిళ్లైగారే ముందుగా తెప్పరిల్లారు. తన్ను తాను సంబాళించుకుంటూ “వచ్చావా సుమతీ! నువ్వొచ్చి మంచి పని చేశావు. లేకపోతే నేను మీ హాస్టల్‌కు మరోసారి వచ్చి కలుద్దామనుకున్నాను. ఇప్పుడిక్కడ మనం తీరుబడిగా మాట్లాడుకుందాం” అంటూ తనకు కలిగిన గగుర్పాటును దాచే ప్రయత్నం చేశారు.

సుమతి మంచం మీద నుండి లేచి నిలబడి నేల మీదున్న తివాచీని కాలితో రాయసాగింది. ఆమె తల మీద కొండ ఏదో విరిగిపడ్డట్లుగా వున్నది. తండ్రి అడిగిన దానికి సమాధానం కూడా చెప్పలేక, విలవిలాడుతూ, లోలోపల రోదిస్తున్నది ‘నాన్నాగారే కదా, ఆయనేంటి ఇలా, ఈ హోటల్లో’ అనుకుంటూ కంపించిపోసాగింది.

“మీ హాస్టలు ఇక్కడికి దగ్గరేనా?”

సుమతి మౌనంగా వుండిపోయంది.

“నాకు తెలుసే. అప్పుడప్పుడూ కాలేజీల్లో చదువుకునే ఆడపిల్లలు ఇక్కడి కొచ్చి కాఫీలు, టీలు తాగి వెడుతుంటారు. నువ్వు కూడా అలాగే వచ్చావా? కాఫీ ఏమైనా తెప్పించనా?” అంటూ గంటకొట్టాడు.

సుమతి తను లోపలికి వస్తూనే అచ్యుతన్‌కి చెప్పే వచ్చింది “లోపలి నుంచి గంట శబ్దం వినపడగానే నువ్వు లోపలకి వచ్చేయ్యాలి. హాజరుగా వుండు” అని.

దాంతో బాగా పెందలకడనే ఒకే గంట శబ్దం వినిపించే సరికి అచ్యతన్ గభాలున పరుగెత్తుకొచ్చాడు. “ఏం సాబ్!  సరుకు నచ్చలేదా? చాలా ఎంపిక చేసి తెచ్చిన సరుకిది. ఇక్కడి వాళ్లు ఈ సరుకును..” అంటూ ఏదో చెప్పబోయాడు.

“నోర్ముయ్! వెళ్లి కాఫీ తీసుకురా” అని  చెప్పి చిరునవ్వు చిలకరిస్తూ సుమతి వంక తిరిగాడు. పిళ్లైగారి చిరునవ్వు వెనక బడబాగ్ని వున్నది. సుమతిని ముక్కలు ముక్కలు చేయనా? లేక తనే స్వయంగా పొడుచుకుని చావాలా? అని ఆలోచించాడు. సుమతి ప్రవర్తన ఏంటి ఇలా వున్నది. సిగ్గుతో చితికిపోయాననుకున్నాడు. తండ్రీ కూతుళ్లు ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకున్న ధాఖలాలు ఎక్కడన్న వున్నాయా? సుమతిని కలవాలని ఈ హోటల్‌కు నాలాంటి  ఎంతో మంది వచ్చి వుంటారు. ఓరి భగవంతుడా? ఇప్పుడేం జరుగుతుంది?

ఆ విషయాన్ని కాకుండా మరేదైనా మాట్లాడాలి.

“అమ్మ ఏదైనా ఉత్తరం రాసిందా సుమతీ?”

“లేదు నాన్నగారూ!” అంటూ గోడ వైపుకు తిరిగి నిలబడింది.

ఒకరి కెదురుగా ఒకరున్నారు కాని తల ఎత్తి ఎదుటి వారిని చూడాలని ఇద్దరికీ లేదు.

“అమ్మ నిన్ను తీసుకురమ్మనే నన్ను పంపింది. సామాను సర్దుకుని సిద్ధంగా వుండు.”

ఆ మాటలు విన్న వెంటనే గభాల్న లేచి నిలబడింది. పెద్ద పెద్ద అంగలు వేస్తూ గది నుండి బయటకు నడవబోయింది. ఆమెకు నిప్పుల మధ్యలో నిలబడినట్లు గాను నాలుగు వైపుల నుండి అగ్ని జ్వాలలు తనను దహించటానికి వస్తున్నట్లు గాను అనిపించింది.

“కాఫీ తాగి వెళ్లు సుమతీ” అన్న పిళ్లైగారి మాటలు వినిపించుకోనట్లుగా సుమతి బయటకు వెళ్లిపోయింది. పిళ్లైగారు చేతులు కట్టుకుని గదిలో గబగబా పచార్లు చేయసాగారు. అంతకంటే గబగబా ఆయన ఉచ్ఛ్వాసనిశ్వాసాలు వదలసాగారు. రిసెప్షన్‌కు ఫోన్ చేసి వెంటనే తన బిల్ సిద్ధం చేయమన్నారు. ఇంకెప్పుడూ ఈ హోటల్‌లో అడుగు పెట్టనని ఒట్టు పెట్టుకున్నారు.

మద్రాసు నుండి పిళ్లైగారు తన ఊరు చేరుకున్నారు. ఆలస్యం చేయకుండా తన చెల్లెలి ఇంటికి వెళ్లారు. ఇప్పుడాయన ముందు రెండు సమస్యలున్నాయి. బంధుత్వాన్ని కాదనుకుని వాళ్లతో సంబంధం కలుపుకోనని చెప్పి, వాళ్లను బాధ పెట్టాల్సి వచ్చింది. ఆ బాధను తగ్గించటం మొదటి సమస్య. ఇంత జరిగిన తర్వాత ఏమీ ఎరగనట్టు వాళ్లతో సంబంధం కలుపు కోవటం కోసం వాళ్లను ఒప్పించటం రెండవ సమస్య. తను వాటిని పరిష్కరించగలుగుతానన్న ధైర్యంతోనే అక్కడికెళ్లి మాటలు మొదలు పెట్టారు.

“సుమతి తెలివి గల పిల్ల. తను బావనే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టింది. వాళ్లమ్మ కూడా కూతురు కోర్కెను కాదన లేకపోయింది. ప్రిన్సిపాల్ గారికి సమతి అంటే కోపం. ఆ కోపంలోనే సుమతికి కాలేజీ నుండి టీ.సీ. ఇచ్చి పంపేశారు. దాంతో నేను నా కూతుర్ని మద్రాసు నుండి ఇంటికి తీసుకొచ్చాను.”

వాళ్ల నాన్న చెప్పే మాటలు సుమతికి కూడా అర్థమయ్యాయి. ఆయన ఎందుకిలా చెప్తున్నారో కూడా బాగా గ్రహించింది. పిళ్లైగారి భార్య ఎప్పట్లాగే తన భర్త మీద యుద్ధం ప్రకటించింది. కాని చివరకు కుక్కినిన పేనులాగా ఉండిపోక తప్పలేదు.

“పిల్ల పెండ్లి త్వరగా జరగాలని దేముడికి ఎన్నో మొక్కలు మొక్కాను. ఆయన ఇలా దయ తల్చాడు!” అంటూ సోమసుందరంలోని మంచి గుణాలను అన్నింటినీ అందరి దగ్గర ఏకరవు పెట్టసాగింది. ఇంతకు ముందు సోము పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడని ఆమె ఆ నోటితోనే సోమును పొగడ్తలతో ముంచెత్తసాగింది.

బీదవారికి వారి బీదరికమే పెద్ద సమస్య. పిళ్లైగారు, పిల్ల పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన చెల్లెలికి సంతోషమే కలిగింది. ‘ఏదైనా కానీ, ఇది వరకు బంధుత్వం, ఇరు కుటుంబాల మధ్య వున్న ఆర్థిక తారతమ్యాల వలన ఒకరి కొకరు దూరమయ్యారు. ఇప్పుడే పెండ్లి ప్రస్తావన ద్వారా మరలా తన పుట్టింటి వారి దగ్గరగా వుండొచ్చు. అది చాలు తనకు’ అనుకున్నది.

జరిగిన విషయానికి పిళ్లై మౌనంగా అయిపోయారు. రాత్రింబగళ్లు ఒకటే మథనపడసాగారు. తనలో తను మథన పడటం తప్పితే సుమతితో ఒక్క మాటైనా మాట్లాడలేదు. సమతి కూడా తండ్రి ఎదుట మౌనంగానే వుండిపోయింది.

‘కూతుర్ని చంపాలా? లేక తానే చావాలా?’ అని పిళ్లైగారు రెండు మూడు సార్లు ఆలోచించారు. కాని బాధ్యతలు కట్టిపడవేసి మృత్యువు సంగతి మరుగున పడినయి. కాని లోపల్లోపల అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు. క్షణిక విలాసం కోసం కక్కుర్తి పడి ఇంత పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సివస్తున్నది. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు.

పాపం, అమాయక సోమసుందరం బలయిపోతున్నాడు. బాగా డబ్బున్న తన మేనమామ, బజార్లో ఎంగిలి చేసి పడేసిన భార్యను జీవితాంతం భరించమని తనకప్పగిస్తున్నాడని అతని ఊహకు కూడా అందని విషయం.

సుమతి, సోమసుందరంల వివాహమండపంలో పిళ్లైగారు నిండా సంతోషంగా వున్నారు. ఎందుకంటే చెడిపోయిన వస్తువును కూడా ఎంతో లాభంతో అవతలి వారికి అంటగట్టేశారు కనుక.

హిందీ మూలం: శ్రీ అరిగపూడి రమేష్ చౌదరి

తెలుగు సేత: దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here