అరుదైన నటవహ్ని- బల్‍రాజ్ సహ్ని – 5 పునర్మిలన్

0
4

[dropcap]బ[/dropcap]ల్‍రాజ్ సహ్ని గురించి విశ్లేషిస్తుంటే ఓ విషయం స్పష్టమవుతుంది. ఆయన సినిమాలలో నటించారు, కాని సినిమాలే ప్రపంచంగా బ్రతకలేదు. సినీ గ్లామర్ అతని జీవితాన్ని ఆక్రమించుకునే విధంగా ఆయన జీవించలేదు. బల్‍రాజ్ సహ్ని తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా సినిమాలు చేశారే తప్ప, సినీ ప్రపంచపు డిమాండ్లకు తల వంచలేదు. ఆయన నటించిన సినిమాలను ఆయన పోషించిన పాత్రలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సినీ ప్రపంచపు మూసలోకి బిగుసుకుపోకుండా తనను తాను స్వతంత్రంగా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయన పబ్లిసిటీ నుంచి చాలా దూరంగా ఉండడం కూడా ఇప్పుడు చాలా మందికి బల్‍రాజ్ సహ్ని గురించి కాని ఆయన సినిమాల గురించి కాని తెలియకుండా ఉండడానికి కారణం.

బల్‍రాజ్ సహ్ని మే 1, 1913 న జన్మించడం యాదృచ్ఛికం కావచ్చు. ఆయన జన్మించిన రోజు మే డే గా ప్రపంచం జరుపుకుంటున్న విషయం కూడా యాదృచ్ఛికమే. కాని కమ్యునిస్టు పార్టీపై నమ్మకాన్ని, ప్రేమను, గౌరవాన్ని ఆయన మరణించేదాకా నిలుపుకునే ఉన్నారు. కమ్యునిస్టు పార్టీకి సంబంధించిన ‘ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్’కు ఆయన మొదటి ప్రెసెడెంట్. జీవితాంతం ఆయనకు ఆ పార్టీ సభ్యత్వం ఉంది. 1959లో బల్‍రాజ్ సహ్ని, శారదా మిత్ర, పీ.కే. వాసుదేవన్ నాయర్‌లు కలిసి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్‌ను స్థాపించారు. ఏప్రిల్ 28 నుండి మే 3 దాకా 1959 సంవత్సరంలో అన్ని రాష్ట్రాల యువ కార్యకర్తలతో ఓ సమావేశాన్ని 250 మంది డెలిగేట్లతో ఢిల్లీలో గురు రాధా కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు, జాతీయ స్థాయిలో ఓ యువ సంస్థ ఉండాలని, దానికి అనుసంధానంగా అన్ని రాష్ట్రాల యువ సంస్థలు పని చేయాలనే నిర్ణయంతో ఏ.ఐ.వై.ఎఫ్. ఆవిర్బవించింది. అప్పటికి బల్‍రాజ్ సహ్ని సినిమాలలో నటుడిగా స్థిరపడ్డారు. కాని పార్టీ కార్యకలాపాలలో అంతే చురుకుగా పాలు పంచుకున్నారు. ఏ.ఐ.వై.ఎఫ్.కి మొదటి ప్రెసెడెంటుగా అలా ఆయన ఎన్నిక జరిగింది.

ఈ సంస్థతో అనుసంధానం అయిన మిగతా సంస్థలలోని యువకులందరూ సోషలిజాన్ని అధ్యయనం చేస్తున్నా వారిలో వారికి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్న విషయం ఈ సంస్థ ద్వారా సమాన హక్కుల కోసం, అన్ని రకాల వివక్షలకు విరుద్ధంగా పని చేయాలని. కేవలం కళా రంగం వరకే పరిమితం అవకుండా నిరుద్యోగం, నిరక్షరాస్యత, సార్వభౌమాధికారం, జాతీయ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, శిక్షణ మరియు ఆరోగ్యం కోసం సౌకర్యాల కొరత మొదలైన వాటిపై పోరాటంలో పాలు పంచుకుంటూ వివిధ కార్యకలాపాలను నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. అంతేకాకుండా దేశ రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. అందువల్ల, ఇది ఒక రాజకీయ సంస్థగా కూడా పరిగణించబడింది. ఏ ఒక్క రాజకీయ పార్టికి లోబడకుండా స్వతంత్రంగా ఉంటూ పని చేయాలని ఏ.ఐ.వై.ఎఫ్. నిశ్చయించుకుంది. అనేక తీర్మానాల ద్వారా, AIYF సమావేశం గోవాను విముక్తి చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది, వలస ప్రజలకు సంఘీభావం తెలిపింది మరియు జెనీవా సదస్సును విజయవంతం చేయాలని కోరింది. మూడవ పంచవర్ష ప్రణాళిక తయారీలో నిరుద్యోగ సమస్యపై తక్షణ దృష్టి పెట్టాలని కోరింది.

ఇంత విపులంగా ఈ సంస్థ గురించి ఇక్కడ రాయడం బల్‍రాజ్ సహ్ని గారి రాజకీయపరమైన ఆలోచనలను మరియు బాధ్యతను ప్రస్తావించడానికి. ఇంతగా సమాజం గురించి పని చేయాలనుకున్న ఆయన సినిమాల పట్ల కూడా అదే భావజాలంతోనూ, బాధ్యతనూ నడిచారని చెప్పడానికి. అందుకు ఆయన నటించిన సినిమాలు, వేసిన పాత్రలను స్టడీ చేస్తే గాని ఆయనకున్న సామాజిక నిబద్ధత అర్థం కాదు. ఆ రోజుల్లో సినిమాలలో నటిస్తున్న నటులందరిలోనూ సినిమాను ఓ బాధ్యతగా తీసుకుని పని చేసిన మొదటి నటుడు బల్‍రాజ్ సహ్ని. అందుకోసం ఆయన స్టార్‌డం దిశగా ఎప్పుడూ పని చేయలేదు.

1961లో ఏ.ఐ.వై.ఎఫ్. రెండవ ప్రెసిడెంట్‌గా పీ.కే. వాసుదేవన్ నాయర్ నియమింపబడ్డారు. అయినా ఏ.ఐ.వై.ఎఫ్ బల్‍రాజ్ సహ్ని జీవితంలో ఓ ముఖ్య భాగంగానే ఉండింది. కుల, మత, వర్గ, లింగ వివక్షల పట్ల ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారి తన గొంతు విప్పుతూనే ఉన్నారు. ఆ క్రమంలో 1964లో బల్‍రాజ్ సహ్ని నటించిన సినిమా ‘పునర్మిలన్’.

ఈ సినిమాకు రవింద్ర దావే నిర్మించారు. ఈయన షౌకత్ హుసేన్ రిజ్వీ శిష్యరికంలో సినిమాను అభ్యసించారు. షౌకత్ హుసేన్ రిజ్వి సుప్రసిద్ధ నటి, గాయని నూర్జహాన్ భర్త. పాకిస్తాన్ సినిమా పితామహుడిగా ఈయనని ఈ రోజు చెప్పుకుంటారు. దేశ విభజన అనంతరం ఈ దంపతులు పాకిస్తాన్ వెళ్ళిపోయారు. రవింద్ర దావే హిందీలోను గుజరాతీ భాషల్లోను సినిమాలు తీసారు. దర్శకుడిగా మంచి పేరు ఉంది ఆయనకు. ఈ సినిమాకు మాత్రం నరేంద్ర దావే దర్శకత్వం వహించారు.

మోహన్ వృత్తి రీత్యా డాక్టర్. మంచివాడు, స్నేహశీలి. చదువు పూర్తి చేసుకుని తన ఊరిలో పని చేయాలని వస్తాడు. బ్రాహ్మణ ధనవంతుల కుటుంబం వీరిది. తండ్రి మరణిస్తే తల్లి అతని పైనే ప్రాణాలు నిలుపుకుని జీవిస్తుంది. డాక్టర్ అయి తిరిగి వచ్చిన మోహన్ వివాహం గురించి తల్లి ఆలోచిస్తుంది. తండ్రి మిత్రుడైన భక్షి కూతురు శోభన మోహన్‌ను ప్రేమిస్తుంది. వీరి వివాహానికి అందరూ ఒప్పుకుంటారు.

అదే ఊరిలో హరిజనవాడలో గంగ తన కూతురు సోనాతో జీవిస్తుంటుంది. సోనాను సునీల్ ప్రేమిస్తాడు. ఉన్నత కులానికి చెందిన అతని వివాహం తక్కువ కులం యువతితో జరగడానికి అతని తాత అనుమతించడు. అయినా సునీల్ తాతకు నచ్చజెప్పి సోనాను సుందరిగా పరిచయం చేసి ఆమె మంచితనంతో కుల ప్రస్తావన రాకుండా తాతను ఏమార్చి సోనాను వివాహం చేసుకోవాలనుకుంటాడు.

కుల పట్టింపులు లేని మోహన్ దగ్గరకు ఒకసారి సోనా తన తల్లి వైద్యం కోసం వస్తుంది. ఆ వాడకు వెళ్ళిన మోహన్‌కు ఏవో జ్ఞాపకాలు తరుముతాయి. గంగను చూసిన తరువాత అతనికి తన చిన్నతనం లీలగా గుర్తుకు వస్తుంది. ఊరి బైట తచ్చాడుతూ అతను ఓ సన్యాసిని కలుస్తాడు. అతన్ని గుర్తుపట్టిన ఆ సన్యాసి మోహన్ గతం గుర్తు చేస్తాడు. అతను నది నీటిలో కొట్టుకు వచ్చి మాటపడిపోయిన స్థితిలో తన ఆశ్రమంలో కొన్ని రోజులు ఉన్నాడని, అప్పుడే గతం మర్చిపోయిన అతన్ని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన దంపతలు పెంచుకోవడానికి తమతో తీసుకుని వెళ్ళారని చెబుతాడు. ఇది విన్న మోహన్‌కు తన చిన్నతనం పూర్తిగా గుర్తుకువస్తుంది. తాను హరిజన స్త్రీ అయిన గంగ కొడుకునని అర్థం అవుతుంది.

గంగ తప్పిపోయిన తన కొడుకు గురించి కలవరిస్తూ ఉంటుంది. ఆమె తన కన్న తల్లి అని మోహన్‌కు పూర్తిగా నమ్మకం కలుగుతుంది. పెంపుడు తల్లి కూడా అతని పై ప్రాణాలు పెట్టుకుని జీవిస్తుంది. ఇలాంటి స్థితిలో శోభనతో తన వివాహం ఎంత వరకు సబబో అతనికి అర్థం కాదు. సోనాతో మోహన్ చనువు అపార్ధం చేసుకున్న శోభనకు మోహన్ తన జన్మరహస్యం చేబుతాడు. తాను తక్కువ జాతి వాడినని, అనుకోకుండా ఓ బ్రాహ్మణ స్త్రీ తనను పెంపకానికి తీసుకోవడంతో తాను ఉన్నత స్థితిలో ఉన్నానని చెబుతాడు. శోభన ఇదంతా విని కూడా అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. కాని వీరి వివాహం సమయంలో నిజం బైటపడి మోహన్ తక్కువ జాతి వాడని అందరికీ తెలియడంతో వారి పెళ్లి ఆగిపోతుంది.

మరో పక్కన సోనా సునీల్ బిడ్డకు తల్లి అవబోతుందని తెలుస్తుంది. గంగకు మోహన్ తన కోడుకని తెలిసినా అందరి ముందు అది బైటపెడితే బిడ్డ భవిష్యత్తు పాడవుతుందని భయపడుతుంది. కాని వివాహం ఆగిపోవడంతో మోహన్ గంగ వద్దకే వచ్చేస్తాడు. తక్కువ కులస్థుడని అతని దగ్గర వైద్యానికి వచ్చేవారు కూడా అతనికి మునుపటి గౌరవాన్ని ఇవ్వరు. చెల్లెలు జీవితం బాగుచేయడానికి మోహన్ తాపత్రయపడతాడు. హత్య నేరంలో సునీల్ ఇరుక్కుని పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాడు. కాని చివరకు శోభనతో కలిసి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాడు. ఈ క్రమంలో మారిన పెద్దలు మోహన్‌ని సోనాని వారి కులాలకు అతీతంగా కూటుంబంలో కలుపుకోవడానికి సిద్ధపడతారు. అప్పుడే సోనా శోభన చెల్లెలని, చిన్నతనంలో తప్పిపోయి ఆమె హరిజనవాడలోని గంగ దగ్గరకు చేరి ఇన్ని రోజులు పెరిగిందని తెలుస్తుంది.

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి హరిజనవాడలో పెరిగిన సోనా, హరిజనవాడలో పుట్టి బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన మోహన్ వారి కులం కారణంగా వివక్షను అనుభవించిన విధానంలో ఉన్న సమాజ క్రూరత్వాన్ని చెప్పడం ఈ సినిమా కథ ఉద్దేశం. మోహన్‌గా బల్‍రాజ్ సహ్ని నటన చూడవలసిందే. తన కులం విషయం తెలిసి శోభనతో నిజం చెప్పడంలో ఆయన నిజాయితీ అర్థం అవుతుంది. మంచితనం, నిజాయితీ, మానవత్వం మూర్తిభవించిన వ్యక్తిగా ఈ సినిమాలో ఆయన గుర్తుండి పోతారు.

ఇంతకు ముందు చాలా సినిమాలలో స్త్రీ పక్షం నుండి కుల సమస్యను చర్చించడం అని భాషలలోనూ జరిగింది. అప్పుడు ఈ కుల వివక్షను ప్రశ్నించే ఓ హీరో కథలో ఉంటాడు. కాని ఇక్కడ హీరో మోహన్ తక్కువ కులంలో జన్మించి పెద్ద కులంలో పెరిగి వివక్షను ఎదుర్కోవడం గమనించవచ్చు. అతన్ని సమర్థించేవారు ఎవరూ ఉండరు. అందువలన ఇక్కడ మోహన్‌పై చూపే వివక్షకు సమాజాన్ని నేరుగా ప్రశ్నించడం జరుగుతుంది. మనుష్యుల ఆలోచనలలో మార్పు రావాలని, ఎవరు ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా వారి సంస్కారం బట్టి వారికి గౌరవం దక్కాలని, సమాజంలో మనిషి ఉన్నతికి కులం ఎప్పుడూ అడ్డు రాకూడన్న సందేశంతో ఈ సినిమా ముగుస్తుంది.

డాక్టర్ పాత్రలో పేషంట్లతో బల్‍రాజ్ ప్రవర్తించే తీరు, తన జీవితపు సమస్యను నిజాయితీతో ఎదుర్కునే తీరు, తన ఇద్దరు తల్లుల దగ్గర ఒకే రకమైన బాధ్యతతో అతను ప్రవర్తించడం చూస్తే, బల్‍రాజ్ నటనలోని ఓ హుందాతనం, గాంభీర్యం ఆకట్టుకుంటాయి. హరిజనవాడలోని అమ్మాయితో కృష్ణుని వేషంలో నృత్యం చేసే సునీల్, కులానికి అతీతంగా ప్రేమతో జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనుకునే సునీల్ నవీన యుగానికి ప్రతినిధిగా నిలుస్తాడు. సునీల్ పాత్రలో జగదీప్ కనిపిస్తారు. సోనా పాత్ర పోషించిన అమీతా ఆ తరువాత కొన్ని మంచి సినిమాలు చేశారు. జగదీప్, అమీతా లపై చిత్రించిన ‘పాస్ బైఠో తబీయత్ బెహల్ జాయేగీ’ పాట రఫీ పాడిన అణిముత్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాటకు సంగీతం అందించిన సీ. అర్జున్ సినీ ప్రస్తానంలోనే ఈ పాట అతి పెద్ద హిట్టుగా మిగిలిపోయింది. ఈ సినిమాలో పాటలన్నీ బావుంటాయి. కాని తరువాత కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం చేసినా ఈయన పేరు మరుగునపడిపోయింది. సంతోషీ మా మీద ఉషా మంగేష్కర్ పాడిన అతి పెద్ద హిట్ గీతం ‘మై తో ఆర్తీ ఉతారూ’ ఈయన సంగీత దర్శకత్వంలో వచ్చిందే.

బల్‍రాజ్ సహ్ని నటనలో గొప్ప సహాజత్వం కనిపిస్తుంది. పెంపుడు తల్లితో భోజన బల్ల వద్ద జరిపే సంభాషణ, కన్న తల్లిని డాక్టర్‌గా పరీక్షించడం, ఆమె తన తల్లి అని తెలుసుకుని, ఆమెకూ నిజం తెలిసి, తన భవిష్యత్తు కోసం మౌనంగా ఉండాలనుకోవడం గమనించి ఆమెను అక్కున చేర్చుకోవడం, శోభనతో నిజాన్ని చెప్పేటప్పుడు అతని శరీర భాష, పెంచిన తల్లితో తన కులం గురించి చెప్పడం, ఈ సన్నివేశాలలో చాలా కూల్‌గా నేచురల్‌గా నటిస్తారు బల్‍రాజ్. సాధారణంగా తల్లి కొడుకుల సెంటిమెంట్ మన సినిమాలలో ఎంతో మెలోడ్రామాతో నాటకీయతతో ఉంటుంది. గొప్ప నటులు, స్టార్‌లు కూడా తల్లి కొడుకుల సెంటిమెంట్ సీన్లలో కొంత అసహజత్వంతో నాటకీయతతో నటించడం గమనించవచ్చు. కాని ఇక్కడ బల్‍రాజ్ నటన వారందరికీ భిన్నంగా కనిపిస్తుంది. ఉదాహరణకు రాజ్ కపూర్ ఆవారా, శ్రీ 420 సినిమాలలో సన్నివేశాలు, దిలీప్ కుమార్ దాగ్, రాం ఔర్ శ్యాం సినిమాలో సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంటూ బల్‍రాజ్ సహ్ని చేసిన ఈ సీన్లను గమనిస్తే బల్‍రాజ్ నటనలోని సహజత్వానికి జీవితానికి దగ్గరగా ఉండేలా సన్నివేశాలను రక్తి కట్టించిన విధానానికి అచ్చెరువు చెందుతాం. బల్‍రాజ్ సహ్ని లోని ఈ సహజత్వాన్ని గుర్తించగలిగే స్థాయిలో భారతీయ ప్రేక్షకులు లేకపోవడం వలన ఆయన గొప్పతనం మరుగున పడిపోయింది కాని, గొప్ప సహజ నటులనిపించుకున్న వారందరూ నటనలో నాటకీయతను ఎన్నుకుని పండించిన సన్నివేశాలలో కూడా తాను నమ్ముకున్న మెథడ్ యాక్టింగ్ శైలిని త్రికరణ శుద్దిగా ఆచరించిన నటుడు బల్‍రాజ్.

ఈ సినిమాలో మోహన్ పాత్ర స్వాభావికంగా గొప్ప నియంత్రణ, ఆలోచనతో సంచరించే వ్యక్తిత్వం ఉన్న పాత్ర. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్ని రకాల పరిస్థితులలోనూ అదే రకమైన సంయమాన్ని పాటిస్తాడు. దీన్ని బల్‍రాజ్ సహ్ని ఏ నిముషం మరచిపోలేదు. అందుకే ఇందులో మోహన్ పాత్ర అతి సహజంగా అనిపిస్తుంది. నటించకుండా సహజంగా ఉండడమే నటన అని నమ్మిన బల్‍రాజ్ సహ్ని సూక్తి ఇక్కడ మరో సారి ప్రేక్షకులకు కనిపిస్తుంది.

ఇదే రకమైన నియంత్రణ చెల్లెలితో మాట్లాడేటప్పుడు గమనించవచ్చు. గర్భవతిగా అయోమయపు స్థితిలో ఉన్న సోనాతో ఆమెకు తానున్నానన్న భరోసా ఇస్తూ ఆమె చేతిలో పుస్తకాన్ని ఉంచుతూ, ఇలాంటప్పుడు స్త్రీకి కావలసింది విద్య అని చెప్పడంలో ఆయన చూపించిన సున్నితత్వం దళితుల జీవన పంథా మార్చుకోవడాని విద్య అవసరం అని ఎలుగెత్తి చాటిన అంబేద్కర్‌ని గుర్తుకు తెస్తుంది. అంబేద్కర్ పేరుతో పేజీల ఉపన్యాసాలను దంచే దళితాభ్యుదయవాదులు ప్రత్యేకించి చూడవలసిన సీన్ ఇది. “నీకు చదువు చెప్పి నేను నిన్ను ఓ స్థాయికి తీసుకువస్తాను. నిన్ను నీవు తెలుసుకోవాలి, నీ అధికారాన్ని తెలుసుకోవాలి. ఆ స్థాయికి నువ్వు రావాలంటే చదవాలి” అని బల్‍రాజ్ చెప్పేటప్పుడు కూడా ఎక్కడా అతిశయం, అతిశయోక్తి కనిపించదు. ఓ నిజాయితీ, స్పష్టత, అవగాహనతో వచ్చిన మెచ్యూరిటి కనిపిస్తుంది. ఇవి కదా నాయకత్వ లక్షణాలు అనిపించి తీరుతుంది. మోహన్ పాత్ర, అతని వ్యక్తిత్వం పట్ల ఓ నమ్మకం కలుగుతుంది ప్రేక్షకులకు.

‘పునర్మిలన్’ సినిమాను దళిత సమస్యను డీల్ చేసిన విధానం కోసం, ఇందులో చర్చించిన కుల నిర్మూలన సిద్దాంతం కోసం ముఖ్యంగా బల్‍రాజ్ సహ్ని నటన కోసం చూడాలి. కొన్ని కోతలతో ఈ సినిమా ఇప్పుడు యూ ట్యూబ్‌లో లభ్యమవుతున్నా రాబోయే తరాలకు ఇది ఎంతకాలం అందుబాటులో ఉంటుందో చెప్పలేం. ఇటువంటి గొప్ప సినిమాలను భద్రపరుచుకోవాలనే కోరిక లేకపోవడం వలన భారతీయ సినీ ప్రపంచం ఎన్నో ఆణిముత్యాలను కోల్పోతుంది. బల్‍రాజ్ సహ్ని నటించిన అత్యుత్తమ సినిమాలలో ‘పునర్మిలన్’ నిస్సందేహంగా ఒకటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here