[dropcap]నీ[/dropcap] కొరకై నీవెళ్ళిపోయావు
నిర్ణయాన్ని నీవైపు నుంచే తీసేసుకుని
నిర్దయగా నన్ను నా మానాన వదిలేసి
నిశ్శబ్దం నాలోనూ
నిశీధిలాంటి చిమ్మచీకటి నాతోనూ
నిస్తేజాన్ని నిరాసక్తతను
నిండుగా మోస్తున్న శూన్యం, నా చుట్టూనూ
గొంతులోని దుఃఖం గుండెలోకి మారిందో
మనిషిలోని వేదన మనసులోనికి చేరిందో
హృదయం కొద్దికొద్దిగా
హద్దుదాటి బరువెక్కుతున్నట్టు అనిపించింది
లోనకు, నా లోనికి తొంగి చూస్తూంటే
గుండె గదిలో లీలగా ఎవరో..?
ఆశల దీపం వత్తిని పెంచి గమనించి చూస్తే
నవ్వుతూ నీవున్నావు, నా నీవున్నావు
గర్భగుడిలో కొలువైన ఇష్టదేవతలా..!
కొత్త దారులను నా ముందు పరిచేస్తూ
కొత్త పరిచయాలను నా దారిలోకి మళ్ళిస్తూ
ఇపుడెందుకో..!
నాలో శూన్యతా లేదు, నా చుట్టూ చీకటీ లేదు
నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది మనోజ్ఞ సంగీతం
నిండుగా, నాలోనూ, నా చుట్టూనూ..!