హాస్య తరంగిణి-4

0
3

[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.

ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.

31. మేధావి

శివప్రసాద్: అదేంటి? ఆయన చదువుకున్నవాడై కూడా అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు?

నాగబాబు: ఓ! అదా తనను మేధావి అని అనుకుంటారని.

32. రెండు

భార్గవ్: అదేమిటిరా ఈ రోజు విచారంగా ఉన్నావ్?

వెంకట్: రెండు సుడులురా! రెండు సుడులు.

భార్గవ్: రెండు సుడులు ఉంటే మంచిదే కదరా, హాయిగా ఇద్దరితో ఎంజాయ్ చేయచ్చు!

వెంకట్: నాకు రెండు సుడులు ఉంటే ఆనందించే వాడినే రా!

భార్గవ్: మరి రెండు సుడులు ఎవరికున్నాయ్?

వెంకట్: మా ఆవిడకున్నాయిరా!

33. బాసన్లు

వెంకమ్మ: (ఆ రోజుల్లో అమ్మేది) బాసన్లూ, స్టీలు సామాన్లూ, ప్లాస్టిక్ టబ్‌లూ, ప్లాస్టిక్ బక్కెట్లూ, డ్రమ్ములూ (ఈ రోజుల్లో) క్వార్టర్లూ, ఆఫ్‌లూ, ఫుల్ బాటిళ్లూ, బ్రాందీలూ, వీస్కీలూ, రమ్ములూ, స్కాచ్‌లూ, బీర్లూ.

34. చీటింగ్

వెంగళప్ప: ఇక నుండీ నేను మోసపోను రా! నేనే రైల్వేని చీటింగ్ చేస్తాను.

పండరి: ఎందుకని?

వెంగళప్ప: నేను టికేట్ కొన్నా, నాకు సీటు ఇవ్వటం లేదు. కనీసం బర్తు కూడా ఇవ్వటం లేదు. అందుకే టికెట్ కొంటాను కానీ, రైలు ప్రయాణం చేయను. అది చీటింగే కదా!

35. వైద్యుడు

డాక్టర్: చెప్పవయ్యా నీకున్న జబ్బు ఏమిటి?

రోగనాథ్: అర్జంట్‌గా నాకు వంద రూపాయలు ఇవ్వండి డాక్టర్.

డాక్టర్: నువ్వే నాకు ఫీజుగా వంద రూపాయలు ఇవ్వవయ్యా, నేను నీకెందుకు వంద రూపాయలు ఇవ్వాలి?

రోగనాథ్: మీరు డాక్టర్ కాబట్టి!

డాక్టర్: అంటే ఏమిటి నీ ఉద్దేశం?

రోగనాథ్: ‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి.

36. శంఖుస్థాపన

రాయుడు: పంతులుగారూ! మేము కొత్త ఇంట్లో గృహప్రవేశం అయినప్పటి నుండీ ఇల్లు ఊగుతోంది తాగిన వాడిలా. ఇంతకీ ఇంటికి శంకుస్థాపన సరిగా చేశారా లేదా?

పంతులు: నన్నూ, నా శాస్త్రాన్ని శంఖిస్తున్నారా రాయుడుగారు! ఇలా అంటారనే మాంచి శంఖాన్ని తెచ్చి భూమిలో పాతి, పూజ చేయించానండీ!

37. విద్యాధర్

గురువు: విద్యాధర్ అనగా ఎవరో చెప్పము శిష్యా?

శిష్యుడు: విద్యను ధర పెట్టి కొనుక్కునేవాడే గురువుగారూ!

38. పార్టీ టికెట్

నాగరాజు: ఇదేంటి? పార్టీ టికెట్ ఇస్తానని మాట ఇచ్చారుగా! ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారెందుకు?

నాయకుడు: టికెట్ అంటేనే డబ్బులిచ్చి కొనుక్కునేది.

నాగరాజు: మరి సేవ చేసినవారికి టికెట్ ఇవ్వాలిగా!

నాయకుడు: ఫ్రీగా ఇస్తే అది పాస్ అంటారు. అందుకే టికెట్ అంటున్నాం.

39. రెడ్ లైట్

ఇనస్పెక్టర్ : రెడ్ లైట్ ఏరియాపై రైడింగ్ చేయమంటే నీవు ఎందుకు చేయటం లేదు?

పోలీస్ : రెడ్ లైట్ వెలుగుతున్న వీధి ఒక్కటి కూడా కన్పించలేదు సార్!

40. చరమ గీతం

నాయకుడు: ఇదేమిటయ్యా? పార్టీ ఆఫీసులో పాటలు పాడుతూ కూర్చున్నావ్?

కార్యకర్త: మన పార్టీ అధికారంలోకి వస్తే అపోజీషన్ పార్టీకి చరమ గీతం పాడాలని నిన్న మీరు మీటింగ్‌లో చెప్పారు కదా! అందుకే పాటను ప్రాక్టీసు చేస్తున్నాసార్!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here