సంగీత సురధార-25

0
3

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 20 – రెండవ భాగము

రాగము యొక్క పరిణామము:

శ్లో:

యోసౌ ధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః।

రంజకో జన చిత్తానం సరాగః కధితో బుధైః॥

స్వర, వర్ణములచే అలకరింపబడి, విను వారి చిత్తమును రంజింప చేయునది రాగమని చెప్పబడును (రాగము=అస). ఈ రాగములకు గ్రహ, అంశ, మంద్ర, తార, న్యాస, అపన్యాస, సన్యాస, విన్యాస, బహుత్వ, అల్పత్వ అను 10 లక్షణములు యుండునని మతంగాది మునులు చెప్పియుండిరి.

శ్లో:

స్వరస్య కంపో గమకః శ్రోత్రు చిత్త ముదావహః

తా: వినువారి చిత్తమును రంజింప చేయునట్లు స్వరములను కదిలించి పాడుట గాయకులు, సంగీత సంప్రదాయజ్ఞులు శుద్ధ, వికృతి భేదము గల స్వరములను సహజమైన ఆయా ధ్వనుల యందే గానము చేయక వినుటకు రంజకము కలుగునట్లు కదిలించుటను గమకం అందురు. వీటికి 15 లక్షణములు చెప్పిరి.

అవి: 1. కంపితము 2. లీనము 3. ఆందోళితము 4. ప్లావితము 5. స్ఫురితము 6. తిరుపము 7. ఆహతము 8. వళి 9. ఉల్లాసితము 10. నామితము 11. కురుళము 12. హుంపితము 13. త్రిభిన్నము 14. ముద్రితము 15. మిశ్రితము. వీటినే పంచదశ గమకములని అందురు.

రాగము యొక్క పరిణామములో:

రాగము అను పేరును రూపు దాల్చుటకు ముందు రాగము కొన్ని పరిణామలు చెందినది. అవి:

  1. గ్రామ, మూర్ఛన, జాతి
  2. శుద్ధ, ఛాయాలగ, సంకీర్ణ రాగములు
  3. రాగ, రాగిణి, పుత్ర (లేక) పురుష, స్త్రీ, నపుంసక రాగములు
  4. జనక, జన్య రాగములు
  5. మార్గ, దేశీ రాగములు

మార్గములో విభాగాలు

  1. గ్రామ రాగము
  2. ఉప రాగము
  3. శుద్ధ రాగము
  4. భాష రాగము
  5. విభాష రాగము
  6. అంతర్భాష రాగము

దేశీ లో విభాగాలు

  1. గ్రామ రాగము
  2. రాగాంగ రాగములు
  3. ఉపాంగ రాగములు
  4. క్రియాంగ రాగములు

తాళ పరిణామము:

గానము యొక్క గమన కాలమును కొలెచెడి క్రియ తాళము.

ప్రపంచము నందలి గాన పద్ధతులన్నిటిలో భారతీయ గామము నందు తాళ విషయము విశేషముగ అభివృద్ధి చెందినది. ఒకే ఒక అంగమును కల్గి ఒక ఆవర్తమునకు ఒకే ఒక మాత్ర కాలముతో కూడిన, అనగా 4 అక్షరముల కాలము గల ఒక ఘాత (one beat) కూడిన తాళము మొదలుకొని ఒక ఆవర్తమునకు 32 మాత్రలు అనగా 28 అక్షర కాలము తోడను, 18 అంగములతో కూడిన తాళము వరకు అనగా అతి సులభమగు తాళము మొదలుకొని అతి క్లిష్టమగు తాళము వరకు ప్రాచీన కాలము నందు భారత గాన పద్ధతి యందు ఉపయోగించబడుచుండెనని ప్రాచీన సంగీత గ్రంథముల వలన తెలియుచున్నది మరియు రాగము వలెనే తాళములు కూడా విశేషముగ విస్తరించి నటుల గోచరించుచున్నది.

భారతీయ ప్రాచీన గ్రంథముల యందు రాగ విషయమును వివరించుటకు ప్రత్యేక అధ్యాయములు ఎటుల వున్నవో, అటులనే తాళ విషయమును వివరించుటకు కూడా ప్రత్యేక అధ్యాయము ఏర్పడుటయే గాక 1. తాళ లక్షణము 2. తాళ విషయము 3. తాళ విధానము 4. తాళ సముద్రం 5. తాళ దీపిక 6. తాళ లక్షణ సంగ్రహము – ఇత్యాది అనేక గ్రంథములు కేవలము తాళ విషయమును మాత్రమే వివరింపుచు రచియింపబడినవి.

పాల్కురికి సోమనాథ కవి విరచితమగు ‘పండితారాద్య చరిత్ర’ మున్నగు పురాతన కావ్యములలో కూడ చెప్పబడిన సంగీత విషయములలో స్వర విషయము, రాగ విషయముల వలెనె తాళ విషయములు కూడ వివరించుటయే కాక ఆయా కాలములందు ఉపయోగింపబడుచుండెడి తాళములు కూడ చెప్పబడినవి.

తాళ శబ్దార్థము – నిర్వచనము – తత్ప్రాముఖ్యత:

పాణి తన గ్రంథంలో సంగీతమునకు 8 అంగములు కలవని చెప్పెను. అవి – భావ, రాగ, తాళ, లయ, శ్రుతి, సభ, నఖ, ఆత్మ.

గీతము యొక్క కాల ప్రమాణమును కొలిచెడి విధానమే తాళము.

“తాళస్తల ప్రతిష్ఠాయా మితి ధాతోర్ఞజి స్మృతః

తాళమను పదము ‘తల’ అను ధాతువు నుండి పుట్టినది.

శ్లో:

తకార శ్శంకరః ప్రోక్తో లకార శ్శక్తి రుచ్యతే।

శివశక్తి సమాయోగా త్తాళనా మాభిధీయతే॥

త కారము శంకర బీజాక్షరము. ల కారము శక్తి బీజాక్షరము. శివ, శక్తి సంయోగము చేత తాళము సంభవించినది.

పురుష నటన తాండవమనియు, స్త్రీ  నటన లాస్యమని తాళము నందు తాండవ, లాస్య అను రెండు పదముల యొక్క ప్రారంభాక్షరములు కలవు. స్త్రీ పురుష నటనకు తాళమే ఆధారం. తాళ శాస్త్రమునకు ఆదికర్తలు పార్వతీపరమేశ్వరులు.

యాజ్ఞవల్క్య స్మృతిలో

శ్లో:

వీణావాదన తత్వజ్ఞ: శృతిజాతి విశారదః।

తాలజ్ఞఽప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి॥

వీణా వాదన తత్వమెరిగిన వారాలకును శృతి, జాతి విశారదులకును, లోకజ్ఞులకును మోక్ష మార్గం గలదు అని భావము.

పూర్వాచార్యులు సంగీతమునకు గీత, వాద్య, నృత్య సంయోగము, అదియే గాంధర్వ అనియు, గాంధర్వ లక్షణమని అనిరి.

శ్లో:

గాంధర్వమితి విజ్ఞేయం స్వరతాళ పదాశ్రయం (భరతుడు)

శ్లో:

పద తథా స్వర సంఘతః తలేన సుమితాస్ తథా।

ప్రయుక్తస్ సావధేనేన గంధర్వమ్ అభిజాయతే॥ (దత్తిల ముని)

స్వర, తాళ, పదములను ఆశ్రయించినదియే గాంధర్వం.

భరతముని ఇంకనూ

‘ఛందో హీనోన శబ్దోస్తి నచ్ఛందశ్శబ్ద వర్జితః’

ఛందస్సు లేని శబ్దము లేదు, శబ్దము లేనిచో ఛందస్సు లేదు – అనెను.

తాళ నిర్వచనం:

శ్లో:

హస్త ద్వయస్య సంయోగే వియోగే చాపివర్తతే।

వ్యాపి మాన్యో దశప్రాణ స్సకాలస్తాళ సంజ్ఞికః॥

శుద్ధానంద ప్రకాశం, రాగతాళ ప్రస్తారం, రాగతాళ చింతామణి వంటి గ్రంథములలో తాళశాస్త్రమునకో అధ్యాయము కేటాయించబడినది.

సంగీత శాస్త్రముతో సంబంధం లేని శిలప్పదికారం, పత్తుప్పాటు, కల్లాడం, పురనానురు వంటి తమిళ గ్రంథాలలో తాళ ప్రస్తావన ఉన్నది.

దశ ప్రాణుల అనుసరించిన విధమున హస్త ద్వయ, సంయోగ వియోగ క్రియలే తాళము.

శ్లో:

కాలో మార్గః క్రియాంగాని గ్రహే జాతి కళాలయః।

యతిః ప్రస్తార కశ్చేతి తాళ ప్రాణ దశా స్మృతః॥

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here