అధ్యాయం 6 – మైసూర్ రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్‌గా నా అనుభవాలు:
[dropcap]మై[/dropcap]సూర్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఎం ఎం మెక్ హచిన్ (Mr. M. M. McHutchin) M.I.C.E., జూన్ 1909లో మైసూర్ రాష్ట్ర సర్వీస్ నుండి పదవీ విరమణ చేయవలసి ఉంది. నేను ఏప్రిల్ 10వ తేదీన నా అమెరికా పర్యటన ముగించుకొని బొంబాయికి తిరిగి వచ్చిన సమయంలో ఆయన వారసుడిని నియమించే అంశం మైసూర్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏప్రిల్ 1909, 31 మార్చి 1909 వరకు మైసూర్ దివాన్‌గా ఉన్న శ్రీ వి పి మాధవరావు, C.I.E. మైసూర్ ప్రభుత్వ సర్వీస్ లో చీఫ్ ఇంజనీర్ గా విధుల్లో చేరమని కోరుతూ ఒక టెలిగ్రామ్ నా బొంబాయి చిరునామాకు పంపారు.
నేను హైదరాబాద్ రాష్ట్రంతో ఇది వరకే ఒక ఒప్పందం కుదుర్చుకున్నందు వలన మైసూర్ రాష్ట్ర సర్వీస్‌లో చేరే ఉద్దేశ్యం నాకు లేకుండింది. నా ఒప్పందం ప్రకారం దానిని నెరవేర్చడానికి నేను హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది. పైగా శ్రీ మాధవ రావు ఇంతకు ముందు నాకు ఈ సంగతి చెప్పి ఉన్నారు. నాకు మైసూర్ సర్వీస్ లో చేరే ఉద్దేశ్యం లేదని కూడా ఆయనకు తెలుసు.
శ్రీ మాధవరావు గారు మైసూర్ దీవాన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో శ్రీ టి. ఆనందరావు గారు దివాన్‌గా బాధ్యతలు చేపట్టినారు. దాదాపు రెండు నెలల తర్వాత 1909 మే 24 న ఆయన నాకు ఒక లేఖ రాశారు.
ఆ లేఖలో ఆయన ఇలా రాశారు:
“మీ ఉన్నతమైన అర్హతలు, విశిష్ట సేవలను దృష్టిలో ఉంచుకొని మైసూర్ రాజా వారు మైసూర్ సంస్థానానికి మీ సేవలు అత్యవసరమని భావిస్తున్నారు. మీరు మైసూర్ సర్వీస్‌లో చేరితే ఆయన సంతోషిస్తారు. పైగా మీరు పుట్టుకతో మైసూర్ భూమి పుత్రులు కూడా.”
“మీరు మా కోరికను అంగీకరిస్తారని రాజా వారు నమ్మకంగా ఉన్నారు. ఇక్కడ మీ మాతృ దేశంలో భూములకు విస్తారమైన నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో మీ శక్తిని, మేధస్సును వినియోగించుకోవడానికి తగినన్ని అవకాశాలు ఉంటాయని మీరు గమనించాలని కోరుతున్నాను. కేవలం అధికారిక పారితోషికాలు మాత్రమే కాదు పని చేయడానికి, ప్రజలకు సేవలు అందించే అవకాశాలకు మీరు అధిక ప్రాధాన్యత ఇస్తారని రాజా వారికి తెలుసు. మైసూర్‌లో మీరు చేపట్టవలసిన పనులు, ప్రాజెక్టుల్లో అలాంటి అవకాశాలు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి.”
నాకు మైసూర్ సర్వీస్‌లో వెంటనే చేరే ఉద్దేశం లేనందున, నేను ప్రత్యుత్తరం పంపే ముందు వారి కోరికను పరిశీలించడానికి పక్షం లేదా మూడు వారాల సమయం అడిగాను. అదే లేఖలో నేను “రాష్ట్రంలో పరిశ్రమలు, సాంకేతిక విద్యను ప్రభుత్వం వారికి అలవాటైన దానికంటే పెద్ద ఎత్తున ప్రోత్సహించే అవకాశం ఉందా లేదా, ఈ అంశంలో నా సేవలు అవసరమా కాదా” అని అడిగాను. నా విదేశీ పర్యటనల్లో ఆ రెండు అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేశానని చెప్పాను. రాజా వారికి కూడా మైసూర్ రాష్ట్రంలో అలాంటి అభివృద్ది ప్రణాళికలను అమలు చేయడంలో ఆసక్తి ఉందని, నాకు ఆ విషయంలో ప్రోత్సాహం ఉంటుందని, అవకాశాలు వచ్చినప్పుడు రాజా వారు నా సూచనలను ఉపయోగించుకుంటారని నాకు సమాధానం వచ్చింది.
నేను 1909 నవంబర్ 15న మైసూర్ సర్వీస్‌లో చీఫ్ ఇంజనీర్‌గా చేరాను. దివాన్‌గా ఉన్న శ్రీ టి. ఆనందరావు నేను ఆయనతో కలిసి పని చేసిన కాలంలో నా పట్ల చాలా దయతో సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. మొదట్లో నా శాఖలో నియామకాలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రజా పనుల విభాగంలోని ఒక ఉన్నత అధికారి కొత్తగా నియామకానికి ఎంపికైన వ్యక్తుల పేర్ల జాబితాను నాకు పంపారు. అదనంగా, వారికి మద్దతుగా సిఫారసులు చేసిన ఉన్నతాధికారుల పేర్లను కూడా పంపించారు. రాష్ట్రంలో ఈ అభ్యర్థులకు వారంతా ఏదో రకంగా సంబంధం కలిగిన వారే. నేను ఆ జాబితాను ఆమోదించకుండా వెనక్కి పంపాను. కూలంకషమైన విచారణ, పరిశీలన తర్వాత అభ్యర్థుల ఖచ్చితమైన సాంకేతిక, విద్యార్హతలకు అనుగుణంగా జాబితాను తిరిగి తయారు చేసి పంపవలసిందిగా ఆ అధికారిని కోరాను. విచారణ, పరిశీలన, చర్చల అనంతరం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తయారు చేశారు. ఈ ప్రక్రియలో సాధ్యమైనంతవరకు ప్రతిభకు, అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
మైసూర్‌లో పెద్ద సంఖ్యలో చక్కటి జలాశయాలు, చెరువులు ఉన్నాయి. అవి తక్కువ నిల్వ సామర్థ్యం కలిగినవి. రాష్ట్రం ఉత్తర సరిహద్దు సమీపంలో మరికనవే అనే ప్రదేశంలో రాతి ఆనకట్టతో రాష్ట్రం లోనే అతి ఎక్కువ నిల్వ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాము.
ఈ జలాశయం కింద కొంతకాలంగా పంటలు సాగు చేస్తున్నారు. సాగుదారులు నీటిని పొదుపుగా, పంటలకు అవసరమైనంత మేరకు కొలతల ప్రకారం ఉపయోగించుకోవడం లేదని, ఈ పద్ధతి ద్వారా వారు పంటలకు ప్రయోజనం చేకూర్చడంలో విఫలమవ్వడమే కాకుండా ఈ ప్రాంతాన్ని మలేరియా ఉత్పత్తి కారక ప్రాంతంగా మార్చారని మా శాఖ సిబ్బంది గమనించారు. నేను దీని గురించి విన్నప్పుడు, 1901-03 నాటి ఇండియన్ ఇరిగేషన్ కమీషన్ వారు ప్రచురించిన రూల్ బుక్ లో సిఫారసు చేసిన బ్లాక్ ఇరిగేషన్ (Block irrigation) పద్దతిని అమలు చేయడానికి ప్రయత్నించాను. గతంలో బొంబాయి ప్రభుత్వంలో ఈ పద్దతిని అమలు చేసి గణనీయమైన అభివృద్ధిని సాధించిన అనుభవంతో ఈ ప్రయోగాన్ని ఇక్కడ కూడా ప్రయత్నించాను. కాని రైతులు సాగు పద్దతిలో ఈ మార్పును రహస్యంగా వ్యతిరేకించారు. పూనాలో జరిగినట్టుగానే పౌర అధికారులు కూడా వారి వైపే నిలబడ్డారు. పొలాలకు అవసరానికి మించి నీటి సరఫరా చేసే పద్దతికి అనుకూలంగా రైతుల్లో బలమైన నమ్మకం ఉంది. పౌర అధికారులు, సాగుదారుల నుండి వ్యక్తం అవుతున్న ఈ వ్యతిరేకతను ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. ప్రత్యేకించి రాష్ట్రంలో అమలు అవుతున్న ఆచరణలకు, పరిపాలనా పద్ధతులకు నేను కొత్త వాణ్ని కాబట్టి నా ఆలోచనల మేరకు సాగు పద్దతిలో సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేయలేక పోయాను. మరికనవ జలాశయం కింద ఆయకట్టులో ఈనాటి వరకు నీటి పంపిణీ సక్రమంగా జరగక పోవడానికి బాధ్యత ఇంజనీరింగ్ అధికారులదే. ఈ విషయంలో వారు సరైన శ్రద్ధ చూపక పోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని అని నా అభిప్రాయం.
మైసూర్‌లో పదవిని స్వీకరించడానికి ముందు H.E.H మహారాజా వారిని నేను కోరిన రెండు అంశాలైన సాంకేతిక విద్య, పరిశ్రమల స్థాపన విషయంలో నన్ను బాగానే ప్రోత్సహించారు. ఈ అంశాలను అధ్యయనం చేయడానికి ఒక్కో అంశానికి ఒక్కో కమిటీని ప్రభుత్వం నియమించింది. సాంకేతిక విద్యకు సంబంధించి ఏర్పాటైన కమిటిలో విద్యా శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ జె. వీర్, మరో ముగ్గురు రాష్ట్రానికి చెందిన భారతీయ అధికారులు ఉన్నారు. నేను ఆ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించాను. మా అధ్యయనం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 1912 లో కమిటీ తరపున ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాము.
ఆర్థిక సదస్సు (Economic Conference):
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఆర్థిక సంబందిత సమస్యలను చర్చించడానికి నా సూచన మేరకు మైసూర్ రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో పాటు ప్రముఖ అనధికారిక పెద్ద మనుషులతో కూడిన ఒక ఆర్థిక సదస్సును ఏర్పాటు చేయాలని మహారాజా వారు నిర్ణయించారు. ఆ చర్చల ఆధారంగా రాష్ట్రానికి తక్షణం ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వగలిగే ముఖ్యమైన పరిశ్రమలను గుర్తించి ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఈ ఆర్థిక సదస్సు లక్ష్యం. మహారాజా వారు స్వయంగా 10 జూన్ 1911 న ఆర్థిక సదస్సును ప్రారంభించారు. సదస్సులో ఆయన చేసిన ప్రారంభోపన్యాసం లోని కొన్ని ముఖ్యమైన అంశాలను కింద ప్రస్తావిస్తున్నాను.
“అన్ని ఆర్థిక రుగ్మతలకు విద్య అత్యుత్తమ నివారణ అని నా భావన. నా ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో అధిక గ్రాంట్లు ఇవ్వడం ద్వారా, విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం, ప్రజల చైతన్యాన్ని మేల్కొల్పడం ద్వారా చాలా చేసింది. నా ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తూ మీ ముందు ఉంచిన సాధారణ ప్రణాళికలో విద్య విషయానికి ప్రథమ స్థానం ఇచ్చాము.”
“రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై విచారణ ప్రారంభించడం అంటే ఇప్పటికే ప్రజల్లో వ్యాప్తి చెంది ఉన్న అజ్ఞానం, పేదరికం, అనారోగ్యం, అకాల మరణాల కారణాలపై కూడా మేము ఆచరణాత్మకంగా విచారించడం జరుగుతుంది. ఇటువంటి మానవ కల్పిత విపత్తులు ప్రతి దేశంలో ఏదో ఒక స్థాయిలో అన్ని కాలాల్లో ఉంటాయి. అయితే మా లక్ష్యం తప్పనిసరిగా వాటి తీవ్రతను తగ్గించడం. కాలం మారుతోంది. సమాచార రంగంలో సాధించిన పురోగతి దేశాల మధ్య దూరాన్ని నిర్మూలించింది. వ్యవసాయం, తయారీ రంగాలలో పోటీ తత్వాన్ని పెంచుతున్నది. ఇప్పుడు పరుగు పందెం నైపుణ్యం కలిగిన, శక్తివంతుల మధ్య జరుగుతున్నది. మనం ఇంకా పాతకాలపు పనిముట్లతో పని చేస్తే, పాత వ్యాపార పద్ధతులను అనుసరిస్తే విజయం సాధించగలుగుతామని ఆశించలేము.”
అప్పటి నుండి నా పదవీ కాలంలో ఈ ఆర్థిక సదస్సు ఒక రాష్ట్ర సంస్థ లాగా కొనసాగింది. మైసూర్‌లో రాష్ట్ర సర్వీస్ నుండి నేను పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఈ ఆర్థిక సదస్సు కొంతకాలం పని కొనసాగించిందని నేను నమ్ముతున్నాను. ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రంలో అత్యున్నత పదవులలో ఉన్న వ్యక్తుల ఆసక్తిని, చొరవని బట్టి ఈ సదస్సు వివిధ సందర్భాలలో పని చేసింది.
పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చేందుకు ప్రాథమిక చర్యలు తీసుకుంటున్నప్పుడు ఈ పనికి పూర్తి సమయం వెచ్చించడానికి ఒక స్వతంత్ర నిపుణుడిని నియమించాలని ఒక ఆలోచన. ఈ అంశంలో మద్రాసు ప్రభుత్వం నుండి శ్రీ (తర్వాత సర్) ఆల్ఫ్రెడ్ చాటర్టన్ సేవలను పొందేందుకు మహారాజు వారు అంగీకరించారు.
ఆ సమయంలో మద్రాస్ నుండి శ్రీ చాటర్టన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశానికి ఆంతరంగిక కార్యదర్శిగా ఉన్న లార్డ్ మోర్లీ మద్రాస్ ప్రావిన్స్ లోని పరిశ్రమల శాఖను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే.
మైసూర్ సర్వీస్‌లో చేరిన తర్వాత శ్రీ చాటర్టన్‌ని మొదట ప్రత్యేక విధులపై నియమించారు. దానితో పాటు నేను ఛైర్మన్‌గా ఉన్న ఆర్థిక సదస్సులో పరిశ్రమల కమిటీ సభ్యునిగా కూడా నియమించారు. అతను అత్యున్నత విద్యార్హతలు కలిగిన సమర్థుడైన అధికారి. అయితే అతను పంపింగ్ ఇంజన్లు, గ్రామీణ పరిశ్రమలకు చిన్న విద్యుత్ ప్లాంట్లు, గంధపు నూనె కర్మాగారం.. వంటి కొన్నినిర్దిష్ట పరిశ్రమలపై మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాడు. మైసూర్ ప్రభుత్వం స్థాపించాలని అనుకుంటున్న ఇనుము, ఉక్కు పరిశ్రమలు, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి భారీ పరిశ్రమలపై అతను ఆసక్తి చూపడానికి పెద్దగా ఇష్ట పడలేదు
రైలు మార్గాలు:
నేను మైసూర్‌లో ప్రజా పనుల శాఖ చీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన కాలంలో నేను ప్రభుత్వానికి రైల్వే శాఖ సెక్రెటరీగా కూడా వ్యవహరించాను. రాష్ట్రంలో మార్గాల నిర్మాణ పనులు 15 సంవత్సరాల క్రితం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. రైలు మార్గాలను పొడిగించాలని ప్రభుత్వం భావించింది. నిర్మాణం పూర్తి అయిన తర్వాత రైల్వే వ్యవస్థ నిర్వహణను కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆలోచన. ఇవి అప్పటి వరకు మద్రాస్, సదరన్ మహరట్ట రైల్వే కంపెనీ అధీనంలో ఉండేవి. ఇప్పుడివి నేరుగా మైసూర్ ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి. తదనుగుణంగా మైసూర్ ప్రభుత్వం రైల్వేలపై ఒక మెమోరాండంను రూపొందిందించింది. ఇందులో రైల్వేలపై అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. అదనపు రైల్వేల నిర్మాణం, భవిష్యత్ లో వీటి నిర్వహణ రాష్ట్ర ఏజెన్సీ ద్వారా జరపడం, అప్పటి వరకు ఈ ఓపెన్ లైన్ల నిర్వహణకు వీటిని రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ అధీనంలో ఉంచడం తదితర అంశాలు ఈ మెమోరాండంలో పొందుపరచడం జరిగింది.
కావేరీ నదిపై జలాశయం (కృష్ణరాజసాగరం):
నేను చేపట్టిన తదుపరి ముఖ్యమైన ప్రాజెక్ట్.. కావేరి నదికి అడ్డంగా ఒక రిజర్వాయర్ డ్యాం నిర్మాణం. సుమారు 1902 సంవత్సరంలో శివసముద్రం జలపాతం వద్ద కావేరీ నది సహజ ప్రవాహాన్ని ఉపయోగించుకొని జల విద్యుత్ ఉత్పాదనకు సంబందించిన పనులు పూర్తి అయినాయి. సగటున సుమారు 13,000 హార్స్ పవర్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఇందులో 11,000 హెచ్.పి.ల విద్యుత్తు శివసముద్రం ఆనకట్ట నుండి దాదాపు 90 మైళ్ల దూరంలో ఉన్న కోలార్ బంగారు గనులకు సరఫరా చేయడం జరుగుతున్నది. శివసముద్రం వద్ద నీటి సరఫరా హెచ్చుతగ్గులకు లోనౌతూ ఉంటుంది. కొన్నిసార్లు నీటి ప్రవాహం 100 క్యూసెక్కుల కంటే తక్కువకు దిగజారిపోతుంది. దీనితో శివసముద్రం వద్ద విద్యుత్ ఉత్పత్తి కుంటు పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సేరింగపట్నంకు (శ్రీరంగ పట్నం) పశ్చిమాన 10 మైళ్ల దూరంలో ఉన్న కన్నాంబడి అనే గ్రామం వద్ద ఒక పెద్ద జలాశయంను నిర్మించాలనే ప్రతిపాదన చాయాలా కాలంగా ఉన్నది. కానీ శాస్త్రీయంగా సమగ్ర సర్వేల ఆధారంగా డిజైన్ లను సిద్ధం చేయలేదు. కావేరి లోయలో విస్తృత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి పారుదల కోసం నీటి నిల్వను ఉపయోగించుకునే ఉద్దేశంతో ఒక పెద్ద జలాశయాన్ని నిర్మించడానికి తాజాగా సర్వేలు చేపట్టినాము. గతంలో నా విదేశీ పర్యటనల సమయంలో ఈజిప్ట్ లో నిర్మించిన అస్వాన్ డ్యామ్ వంటి పెద్ద నీటిపారుదల డ్యాంలను నేను సందర్శించాను. బొంబాయి ప్రెసిడెన్సీలో, హైదరాబాద్ రాష్ట్రంలో పెద్ద రిజర్వాయర్ల రూపకల్పనకు సంబంధించిన కొన్ని పనులు కూడా నేను ఇది వరకు చేసి ఉన్నాను. ఆ అనుభవంతో కావేరి లోయ అవసరాలకు తగినట్లుగా నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి కోసం కావేరీ డ్యాం డిజైన్‌లు, ప్రాజెక్టు సమగ్ర నివేదికను సిద్ధం చేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు.
సర్ కె. శేషాద్రి అయ్యర్ గారు మైసూర్ దీవాన్ పదవీ కాలంలోనే శివసముద్రం జల విద్యుత్ కేంద్రంను నిర్మించారు. ఆ రోజుల్లో మైసూర్ ప్రజా పనుల శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్ గా సేవలు అందిస్తున్న మేజర్ ఎ సి జె డి లాట్ బినిరీ (A C J De Lot Biniere) R.E. గారి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణం జరిగింది.
ఎండాకాలంలో వేడి వాతావరణ పరిస్థితుల్లో శివసముద్రం వద్ద అతి తక్కువ నీటి ప్రవాహాల కారణంగా విద్యుత్ ప్లాంట్ నుంచి తమకు విద్యుత్ సరఫరా తగినంతగా లేదని, ఈ విద్యుత్‌పై తాము ఆధారపడలేమని కోలార్ బంగారు గనుల మేనేజింగ్ ఏజెంట్లు గుర్తించారు. నేను విద్యుత్ శాఖకు కూడా ప్రభుత్వ కార్యదర్శిగా కూడా ఉన్నందున చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీ హెచ్.పి. గిబ్స్‌తో కలిసి కోలార్ బంగారు గనుల మేనేజింగ్ ఏజెంట్లు మెసర్స్ జాన్ టేలర్ అండ్ సన్స్ ప్రతినిధులతో విద్యుత్ సరఫరా సమస్యలపై చర్చించాను. ఈ చర్చల తర్వాత, శివసముద్రం విద్యుత్ కేంద్రానికి, మైసూరు రాష్ట్రంలోని కావేరి లోయలో వ్యవసాయ యోగ్యమైన భూములకు సాగునీటి పారుదల కోసం నీటిని సరఫరా చేయడానికి సరిపడే విధంగా పెద్ద జలాశయం నిల్వ సామర్థ్యాన్ని, నిర్మాణ దశలను నిర్ధారించినాము.
దాదాపు 48,000 మిలియన్ ఘనపు అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో 124 అడుగుల ఎత్తైన రాతి డ్యాంను రూపకల్పన చేసినాము. దీని ద్వారా అంతిమంగా 1,50,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి, సుమారు 80,000 హార్స్ పవర్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సాధ్యపడుతుందని అంచనా వేశాము. ఈ విధంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును కోలార్ బంగారు గనులకు సరిపోయినంత సరఫరా చేయడమే కాకుండా కావేరీ నది లోయలో పట్టణాలు, నగరాలు, పరిశ్రమల అవసరాలను తీర్చడానికి అదనపు విద్యుత్ కోసం డిమాండ్ ఉండింది.
8600 అడుగుల పొడవు, నదీ గర్భం నుండి 130 అడుగులు, పునాది నుండి అయితే 140 అడుగుల ఎత్తైన రాతి డ్యాంను (Masonry Dam) నిర్మించి ఒక పెద్ద జలాశయాన్ని ఏర్పాటు చేయడమే ప్రాజెక్టు డిజైన్ లో ప్రధాన లక్ష్యం. పునాది మట్టం వద్ద డ్యాం వెడల్పు 111 అడుగులు. డ్యాం ఎగువన నది పరివాహక ప్రాంతం 4,100 చదరపు మైళ్లు. ఈ పరీవాహక ప్రాంతం నుండి డ్యాం వద్దకు వచ్చే వార్షిక సగటు నీటి పరిమాణం 2,20,000 మిలియన్ ఘనపు అడుగులుగా అంచనా వేయడం జరిగింది.
జలాశయం నిర్మాణానికి ముందు కాలంలో ఉన్న జల విద్యుత్ సరఫరా, ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా, 13,000 హార్స్ పవర్. అందులో 11,000 హార్స్ పవర్ విద్యుత్తు కోలార్ బంగారు గనులకు సరఫరా చేయడం జరిగేది. కోలార్ బంగారు గనుల మేనేజింగ్ ఏజెంట్లు జాన్ టేలర్ అండ్ సన్స్ ఐదు సంవత్సరాల పాటు 5,000 హెచ్.పి.ల మేరకు అదనపు విద్యుత్తును అందించాలని కోరారు. ఆ తర్వాత సమీప భవిష్యత్తులో తాము డిమాండ్ నోటీసు ఇచ్చినప్పుడు 10,000 హార్స్ పవర్ విద్యుత్ సరఫరా చేయాలని వారు కోరినారు. కావేరీ జలాశయం నుండి తక్షణమే 20,000 హార్స్ పవర్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సరిపడే నీరు శివసముద్రం విద్యుత్ ప్లాంట్‌కు అందించడం జరిగింది. ఇది గతంలో సరఫరా చేసిన విద్యుత్ ఉత్పత్తికి అదనం. శివసముద్రం జలపాతానికి సమీపంలో కొంత దిగువన షింషా అనే ప్రదేశంలో మరింత ప్రయోజనకరంగా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మరొక ప్రాజెక్ట్ కూడా ప్రతిపాదించడం జరిగింది. ఈ రెండు విద్యుత్ స్టేషన్లు పూర్తయినప్పుడు 80,000 హార్స్ పవర్ విద్యుత్ సరఫరా సాధ్యం అవుతుందని అంచనా వేయడం జరిగినది. . ఇప్పుడు ఈ విద్యుత్తు పూర్తిగా వినియోగంలోకి వచ్చింది.
నేను ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే.. కావేరీ జలాశయం ప్రాజెక్ట్ నివేదిక సిద్ధమైన తర్వాత కొంత కాలం వరకు మహారాజు గారి నుండి ఎటువంటి అనుమతి రాలేదు. బహుశా రాష్ట్రంలోని కొందరు అధికారులు ఈ ప్రాజెక్టుపై అంత పెద్ద మొత్తం ఖర్చు చేయడంపై రాజా వారిని ప్రభావితం చేసి ఉంటారు. ఆ సమయంలో ప్రాజెక్ట్ మొదటి అంచనా వ్యయం రూ. 253 లక్షలు. గతంలో ఇంత పెద్ద మొత్తం రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుపై కూడా ఖర్చు చేయలేదు. దివాన్ శ్రీ టి ఆనంద రావు గారు మాత్రం ఈ ప్రతిపాదనకు మనస్పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. ఈ విషయంలో నేను H E H మహారాజు గారిని ప్రభావితం చేయలేనని భావించినప్పుడు రాష్ట్ర సర్వీస్ నుండి తొలగిపోవడమే ఉత్తమమని నాకు అనిపించింది. నేను కొన్ని రోజులు సెలవు తీసుకొని ఉత్తర భారతదేశానికి వెళ్లాను. నేను తిరిగి వచ్చిన తర్వాత కూడా వాతావరణంలో ఎలాంటి మార్పు లేదని నేను గుర్తించాను. కొత్త పనులు, పథకాల పట్ల ప్రభుత్వంలో ఏ ఉత్సాహం కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో నేను అన్నిటికీ దూరంగా ఉండి నా కార్యకలాపాలను కొంత కాలం వరకు నా కార్యాలయం సాధారణ విధులను సమయానుకూలంగా నిర్వర్తించడానికి మాత్రమే పరిమితం చేసాను.
నా మారిన వైఖరిని గమనించి మహారాజు గారు బెంగుళూరులో క్యాంపింగ్ చేస్తున్నప్పుడు నన్ను రమ్మని కబురు పంపారు. నేను కొత్త పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉదాసీనంగా ఉన్నానని, గతంలో చూపించిన ఆసక్తిని ఎందుకు చూపించడం లేదని అడిగారు. నేను నిరుత్సాహానికి గురయ్యానని హిస్ హైనెస్‌తో నిజం చెప్పాను. కొత్త పనులు అమలు చేయడానికి, పురోగతిని కొనసాగించడానికి, నాకు సమకూర్చిన సౌకర్యాలతో, వనరులతో ఆశించిన అభివృద్ధిని సాధించలేనని స్పష్టం చేశాను. రాష్ట్రంలో వాతావరణం ప్రోత్సాహకరంగా లేకపోవడంతో తగినంత ఉండాల్సిన పని లేనందున నేను మైసూర్ సర్వీస్ నుండి తప్పుకోవాలనుకుంటున్నాని రాజా వారికి తెలియపర్చాను. నా మాటలకు రాజా వారి సమాధానం: “తొందరపడకండి, మీకు కోరుకున్నది నేను చేస్తాను.” తరువాతి వారం రాజధాని నగరంలో (మైసూర్ సిటీ) తనను కలవమని ఆయన కోరినారు. అక్కడ రాజా వారు తన వాగ్ధానం పట్ల చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నందుకు సంతోషించాను. పూర్తి విచారణ అనంతరం నేను ప్రభుత్వానికి సమర్పించిన అన్ని ప్రతిపాదనలకు అనుమతి మంజూరు చేసినారు. వాటిలో ప్రధాన ప్రతిపాదన కావేరీ జలాశయం ప్రాజెక్టు. మహారాజు లేదా అతని ఇతర సలహాదారులు ఈ ప్రాజెక్టు విషయమై బయటి ఇంజనీర్లను సంప్రదించారా లేదా అనేది నాకు తెలియదు. ఏది ఏమైనా నా లక్ష్యం నెరవేరింది. నేను ప్రభుత్వానికి సమర్పించిన జలాశయం పథకం ఎటువంటి జోడింపులు, తొలగింపులు లేదా మార్పులు లేకుండా యధాతథంగా మంజూరు చేసినారని గుర్తించాను.
కావేరీ జలాశయం ప్రాజెక్టుపై నా ముందున్న తదుపరి సమస్య మద్రాసు ప్రభుత్వం నుంచి ఎదురయ్యింది. కన్నంబడికి నది మార్గంలో కొలిస్తే .. 60 మైళ్ల దిగువన మెట్టూరు వద్ద అదే నదిపై నది ఒక జలాశయాన్ని నిర్మించడం కోసం ఆ ప్రభుత్వం తన సొంత ప్రాజెక్టును సిద్ధం చేసింది. కావేరీ లోయలోని జలాలను ఎగువన నిల్వ చేయడం వల్ల ఈ పథకం పనికి రాకుండా పోతుందని, నిల్వ చేయాలని ఆశించిన మొత్తం నీటిని పొందలేకపోతామని వారి అనుమానం. మా జలాశయాన్ని ప్రతిపాదించినప్పుడు, వారు కూడా తమ డిజైన్లను మార్చవలసి వచ్చింది. అయితే వారు అందుకు కొంతకాలం పాటు సుముఖంగా లేరు. కావేరీ నదీ జలాలలో మాకు హక్కుగా వచ్చే వాటాను పొందాలని మేము పట్టుబట్టాము. ఈ విషయంలో కల్పించుకొని సమస్యను పరిష్కరించమని మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాము. కావేరీ జలాల్లో మా వాటా ఎంతో మేము జాగ్రత్తగా లెక్కించాము. మా వాదనతో భారత ప్రభుత్వ ఇంజనీర్లు సానుకూలంగా స్పందించారని నేను నమ్ముతున్నాను. డ్యాం నిర్మాణాన్ని కొనసాగించడానికి మాకు అనుమతి ఇవ్వాలని వైస్రాయ్ లార్డ్ హార్డింగ్‌కి విజ్ఞప్తి చేసాము.
భారత ప్రభుత్వం డ్యాం నిర్మాణానికి అనుమతి ఇచ్చినప్పటికీ అది మొదటి దశకు మాత్రమే. అంటే 80 అడుగుల ఎత్తు వరకు డ్యాం నిర్మించడానికి అనుమతి అన్నమాట. అయినప్పటికీ మేము మొదట రూపొందించిన పూర్తి ఎత్తుకు, అంటే 124 అడుగులకు అవసరమైన పునాది వెడల్పుతో డ్యాంను నిర్మించడం ప్రారంభించాము. భవిష్యత్ లో డ్యాం ఎత్తు పెంచుకోవడానికి వీలుగా విస్తృత పునాదితో డ్యాం నిర్మాణాన్ని కొనసాగించాము. మా దావా సరైనదని, న్యాయమైనదని మేము బలంగా విశ్వసించినందున మేము ఈ సాహాసోపేత నిర్ణయం తీసుకున్నాము. చివరికి, భారత ప్రభుత్వం నియమించిన మధ్యవర్తిత్వ కమిటి (ఆర్బిట్రేషన్ కమిటి) ద్వారా అవార్డు పొందిన ఫలితంగా మేము మా తొలుత చేసుకున్న డిజైన్ ప్రకారం పనిని కొనసాగించగలిగాము. వైస్రాయ్ లార్డ్ హార్డింగ్, మైసూర్ లోని బ్రిటిష్ రెసిడెంట్ సర్ హ్యూ డాలీ గార్ల సద్భావన మద్దతు మాకు ఉండింది. ఈ విషయంలో వారు మాకు చేసిన సహాయం మరువలేనిది. అందుకు వీరిద్దరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పవలసి ఉన్నది.
అక్టోబరు 7, 1916 న జరిగిన మైసూర్ ప్రతినిధుల సభలో నేను చేసిన ప్రసంగంలో మధ్యవర్తిత్వ కమిటీకి సూచించిన కావేరీ నీటి పంపిణీ వివాదాలు, విచారణ అనంతరం వారు వెలువరించిన తీర్పు.. మొదలైన అంశాలను వివరించాను. నా ప్రసంగంలోని ముఖ్య అంశాలను కింద ఉటంకిస్తున్నాను.
“మధ్యవర్తిత్వ కమిటి తీర్పు పట్ల గణనీయమైన అపోహలు.. ముఖ్యంగా కావేరి డెల్టా ప్రాంతాలైన తంజావూరు, తిరుచినాపల్లి లోని ప్రజల మధ్య నెలకొని ఉన్నాయని తెలుస్తున్నది. ఈ తీర్పు మైసూర్ రాష్ట్రానికి చాలా అనుకూలంగా ఉందని, మద్రాస్ రాష్ట్ర ప్రయోజనాలకు హానికరంగా ఉందని పత్రికలలో, బహిరంగ సభలలో ప్రకటనలు వెలువడుతున్నాయి. బహుశా ప్రజలకు ఈ విషయంలో సరి అయిన అవగాహన లేకపోవడం వలన ఈ అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చు. వివాదంలో చిక్కుకున్న అంశాలు పూర్తిగా సాంకేతిక స్వభావం కలిగినవి కావడం కొంతవరకు కారణమైతే, సున్నితమైన పరిస్థితి కారణంగా, ఇంతకుముందు మద్రాసు ప్రెసిడెన్సీలో జరిగిన ఏకపక్ష ఆందోళనను వ్యతిరేకించడం ఎవరికీ సాధ్యం కాలేదు.”
“ప్రస్తుతం కావేరి లోయలో మైసూర్ రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు ప్రాంతంలో 1,15,000 ఎకరాలు ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో నది దిగువ ప్రాంతంలో సంబంధిత ప్రాంతం 12,25,500 ఎకరాలు. అంటే కావేరీ లోయలో ఉన్నమొత్తం ఆయకట్టులో 92 శాతం విస్తీర్ణం మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంది. కేవలం 8 శాతం మాత్రమే, మైసూర్‌లో ఉంది”
“నదిలో లభ్యమయ్యే మొత్తం నీటిలో నాలుగింట మూడు వంతులు మైసూర్ భూభాగం ద్వారా వస్తాయి. కానీ, పైన పేర్కొన్న విధంగా, ప్రయోజనాలు మాత్రం మైసూర్ రాష్ట్రం నదికి అందించిన మొత్తం ప్రవాహాల నిష్పత్తితో పోలిస్తే చాలా తక్కువ.”
“ప్రతీ ఏడాది మైసూర్, మద్రాస్ రాష్ట్ర సాగునీటి అవసరాలను తీర్చిన తర్వాత కూడా నదిలోకి పెద్ద ఎత్తున మిగులు జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. మైసూర్ ప్రాజెక్ట్ ఈ మిగులులో కొంత భాగం మాత్రమే నిల్వ చేయడానికి ఉద్దేశించినది.”
“మైసూర్ జలాశయం 48,000 మిలియన్ ఘనపు అడుగుల కంటే కొంచెం ఎక్కువ నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీ లోపల, మైసూర్ రాష్ట్రం సరిహద్దుకు దగ్గరలో ఒక స్థలం వద్ద అదే పరీవాహక ప్రాంతం నుండి వచ్చే నీటిని నిల్వ చేయడానికి మైసూర్ రాష్ట్ర జలాశయం కంటే రెట్టింపు సామర్థ్యం ఉన్నజలాశయాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలను మద్రాసు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది.”
“మైసూర్ రాష్ట్రంలో నీటిపారుదల విస్తరణ ప్రతిపాదన కేవలం 1,50,000 ఎకరాలు మాత్రమే. మరోవైపు, మద్రాస్ ప్రాజెక్ట్, ఆ ప్రెసిడెన్సీలో ఇప్పటికే ఉన్న పెద్ద నీటిపారుదల వ్యవస్థను 3,20,000 ఎకరాలకు విస్తరించాలని ఆలోచిస్తోంది. అంటే మైసూర్ రాష్ట్ర జలాశయం ద్వారా సాగు అయ్యే ఆయకట్టుకు రెట్టింపు ఆయకట్టు అన్నమాట.”
“ఈ వివాదంలో ఇమిడి ఉన్న రెండు వాస్తవాలను గమనించాలి. మొదటిది కావేరీ నదిలో పుష్కలంగా మిగులు జలాలు ఉన్నాయి. రెండవది మద్రాసు ప్రభుత్వం మన కంటే రెట్టింపు నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించి, మన కంటే రెట్టింపు ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించింది. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని విశ్లేషిస్తే మైసూర్ జలాశయంలో నిల్వ, దాని నియంత్రణ సరైన పద్ధతిలో జరిపితే మన జలాశయం నిర్మాణం వలన ప్రస్తుతం మద్రాస్ రాష్ట్రంలో ఉన్న నీటిపారుదలకి ఏ విధంగానూ ఆటంకం కలిగించదని నిస్సందేహంగా రుజువు చేస్తుంది. మద్రాస్ రాష్ట్రానికి దాని ప్రస్తుత నీటిపారుదల వ్యవస్థను కాపాడుకోవ టానికి ఎంత నీరు అవసరమో అంతే నీరు తీసుకోవడానికి మాత్రమే అర్హత ఉందని అందరూ అంగీకరించారు.”
1915 జూలై 1 నాటికి పెద్ద జలాశయాన్ని నిర్మిస్తామని మేము వాగ్దానం చేసినప్పుడు, మేసర్స్ జాన్ టేలర్ అండ్ సన్స్ ఆ పనిని సకాలంలో చేయగల మా సామర్థ్యం గురించి సందేహం వ్యక్తం చేశారు. వారు ప్రత్యామ్నాయంగా మరో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే, కావేరీ జలాశయం పని పూర్తయినప్పుడు, వాగ్దానం ప్రకారం జల విద్యుత్ స్టేషన్‌కు నీరు సరఫరా చేసినప్పుడు, కంపెనీ వారు మేము చేసిన పని పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతే గాక వారు తమ కృతజ్ఞతలను మహారాజుకు తెలియజేశారు.
1911 మే 5న నేను సమర్పించిన మొదటి ప్రాజెక్ట్ నివేదికలో పథకం భవిష్యత్ ప్రభావాలపై నా అంచనాలు ఈ విధంగా వ్యక్తీకరించాను.
“ఒకసారి ప్రాజెక్ట్ నుండి నీటి సరఫరా ప్రారంభమైన తర్వాత, ఈ పథకం అనేక రంగాల అభివృద్దికి అవకాశాలను విస్తృతం చేస్తుంది. ఇవి రాష్ట్రంలో అపారమైన సంపద సృష్టికి దారితీస్తుంది. అయితే వేగంగా జరిగే అభివృద్ధి పరిణామాలు ఆకస్మికంగా ఉండవు. రాష్ట్ర పాలనా యంత్రాంగం ప్రదర్శించే శక్తియుక్తులు, దూరదృష్టిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. విద్యుత్ కోసం మార్కెట్ ను మెరుగుపరచడంలో, నీటిపారుదల వ్యవస్థను విస్తరించడంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. దేశం ఉత్పాదక శక్తి పెరుగుదల ద్వారా రాష్ట్రానికి అందే పరోక్ష ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇటువంటి పథకం 3 శాతానికి మించి ఆదాయాన్ని చెల్లించకపోయినా సమర్థించయోగ్యమైనదే. అయితే ప్రారంభంలో విద్యుత్ విక్రయాల నుండి లభించే అసాధారణమైన ప్రత్యక్ష రాబడులను ప్రాజెక్టు వాగ్దానం చేస్తున్నందు వలన పెద్ద నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించడం సమంజసమైన ప్రతిపాదన అవుతుంది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ఇటువంటి కార్యక్రమాలకు ఏక కాలంలో అనేక ప్రయోజనాల అవకాశాలను హామీ ఇవ్వడం చాలా అరుదుగా సాధ్యం అవుతుంది.”
ఈ జలాశయం భారతదేశంలో మరెక్కడా లేని కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. అవి:
(1) ఇది బ్రిటిష్ పరిపాలనా కాలంలో గాని, అంతకు ముందు గాని 1912 నాటికి ఇప్పటి వరకు భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద జలాశయం.
గమనిక: అదే నదిపై మద్రాసు ప్రభుత్వం నిర్మించిన మెట్టూర్ జలాశయం దీని కంటే చాలా పెద్దది. అయితే దీని నిర్మాణం జూలై 1925 లో ప్రారంభమైంది. అంటే మైసూర్ జలాశయం నిర్మాణం పూర్తి అయిన 13 సంవత్సరాల తర్వాత వచ్చిన జలాశయం.
(2) ఎడమ ఒడ్డున కావేరి కాలువను తీసుకెళ్ళడానికి కొండను తొలిచి సుమారు 1.75 మైళ్ల పొడవు గల సొరంగాన్ని నిర్మించడం జరిగింది. ఇది భారతదేశంలో ఆ రోజుల్లో ఎక్కడా కనిపించని అతిపెద్ద నీటిపారుదల కాలువ సొరంగం అని పేరుంది.
(3) కృష్ణరాజసాగర పథకాన్ని బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌గా అభివర్ణించ వచ్చు. ఇది సారాంశంలో.. సూక్ష్మ రూపంలో అమెరికాలో ఉన్న టెన్నేసి వ్యాలీ అథారిటీ (T.V.A.) పథకం లాంటిదన్నమాట.
ప్రాజెక్టు నిర్వర్తించే విదులు ఇవి:
- ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,00,000 ఎకరాల భూమి ఇప్పటికే సాగులోకి వచ్చింది. రానున్న రోజుల్లో సాగునీరు మరింత ఎక్కువ భూమికి అందుతుంది.
- ఇది కోలార్ జిల్లాలోని బంగారు గని క్షేత్రాలకు విద్యుత్తును సరఫరా చేస్తుంది.
- ఇది రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో పట్టణాలు, గ్రామాలతో పాటు మైసూర్, బెంగుళూరు నగరాలకు విద్యుత్ కాంతిని, పరిశ్రమలకు విద్యుత్తును సరఫరా చేస్తుంది.
ప్రాజెక్టు నిర్మాణం విస్తృతమైన చెరుకు పంట సాగుకు దారితీసింది. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్చక్తి , చెరుకు సాగు సంయుక్తంగా మైసూర్ రాష్ట్రంలో చక్కెర మిల్లుల పరిశ్రమ అభివృద్ది కావడానికి దోహదం చేసింది. ఇవి భారతదేశంలోనే ఆ తరగతికి చెందిన అతిపెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందింది. ఇది మైసూర్, బెంగళూరు నగరాలలోని పత్తి మిల్లులను, తక్కువ ప్రాముఖ్యత కలిగిన అనేక ఇతర పరిశ్రమలను నడపడానికి కావలసిన విద్యుత్చక్తిని ఉత్పత్తి చేస్తుంది.
మూడేళ్ల క్రితం నా అభ్యర్థన మేరకు మైసూరులో ఉండే చీఫ్ ఇంజనీర్ రాష్ట్రానికి కృష్ణరాజ సాగర పథకం అందించిన ప్రయోజనాలు, ప్రాజెక్టు వచ్చిన తర్వాత మారిన ఈ ప్రాంత ఆర్థిక స్థితిగతులపై ఒక నివేదికని అందించారు. పథకంపై పెట్టిన మొత్తం పెట్టుబడి సంవత్సరానికి సుమారు రూ. 10.50 కోట్లు. ప్రత్యక్ష, పరోక్ష ఆదాయాన్నిలెక్కలోకి తీసుకుంటే ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి సమకూరే వార్షిక ఆదాయం సుమారు రూ. 1.50 కోట్లు. ఇది ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చులో దాదాపు 15 శాతం.
***