మరుగునపడ్డ మాణిక్యాలు – 43: ద లాస్ట్ డ్యుయెల్

2
3

[dropcap]చ[/dropcap]రిత్ర లోకి తొంగి చూస్తే ఎన్ని పొరపాట్లు జరిగాయో, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుస్తుంది. విషాదమేమిటంటే చరిత్ర నేర్పిన పాఠాలు పాఠాలుగానే ఉండిపోతున్నాయి. వాటిని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ. పద్నాలుగవ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగిన కథతో అప్పటి స్త్రీల పరిస్థితులను ‘ద లాస్ట్ డ్యూయెల్’ (2021) చిత్రంలో చూపించారు ప్రముఖ దర్శకుడు రిడ్లీ స్కాట్. స్త్రీలు ఎన్ని సంఘర్షణలు ఎదుర్కోవాల్సి వచ్చేదో, శాస్త్రీయ విజ్ఞానం పేరుతో ఎన్ని అపోహలుండేవో చూస్తే విస్మయం కలుగుతుంది. ఇప్పటికీ స్త్రీలు అన్యాయాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇతర వర్గాలు కూడా వివక్షకు గురి అవుతున్నాయి. శాస్త్రీయ విజ్ఞానం కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనుగొంటూనే ఉంది. ఈ సృష్టిని పూర్తిగా అవగాహన చేసుకోవటం శాస్త్రీయ విజ్ఞానానికి సంభవమేనా? తొలుత ఈ చిత్రం ఇద్దరు యోధుల వైరం గురించి అనిపిస్తుంది. కానీ చివరికి స్త్రీల సంఘర్షణను సునిశితంగా చర్చించిన విధానం అభినందనీయం. ఈ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్‌లో లభ్యం. రిడ్లీ స్కాట్ విభిన్నమైన చిత్రాలు తెరకెక్కించాడు. ‘ఏలియన్’, ‘తెల్మా అండ్ లూయీస్’, ‘గ్లాడియేటర్’, ‘ద మార్షియన్’ చిత్రాలు ఆయనకు ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టాయి. ‘గ్లాడియేటర్’ (2000) ఉత్తమ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. అది ఒక చారిత్రక చిత్రం. ఆ కోవ లోదే ఈ చిత్రం కూడా. ఈ చిత్రం విడుదలయ్యేనాటికి రిడ్లీ స్కాట్ వయసు 83 ఏళ్ళు!

ఈ చిత్రంలోని మూడు ముఖ్యపాత్రలు జాన్ దె కరూజ్, జాక్ లె గ్రీ, మార్గెరీత్ దె కరూజ్. కథలోని సంఘటనలను ముగ్గురూ ఎలా గుర్తుపెట్టుకున్నారో చూపిస్తూ చిత్రం నడుస్తుంది. ‘రషొమొన్’ (1950) అనే జపనీస్ చిత్రంలో ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు అకీరా కురొసావా ఈ పద్ధతి తొలిసారి ఉపయోగించాడు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సంఘటనల్ని చెబుతారు. మన జీవితాలలో కూడా గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకునేటపుడు మనం చెప్పిన విధంగా కాకుండా మరో విధంగా అవతలివారు చెప్పటం చూస్తూ ఉంటాం. ఇందులో దురుద్దేశం లేకపోవచ్చు. వారి వారి మానసిక స్థితిని బట్టి అలా మెదళ్ళలో నిక్షిప్తమైపోతుంది. అందుకే ఈ సృష్టి అంతా మనసు కల్పించిన మాయ అని మన ఋషులు, గురువులు అంటారు. ‘రషొమొన్’ తర్వాత ఈ పద్ధతిని అనుసరించి కొన్ని చిత్రాలు వచ్చాయి. అయితే కొన్ని చిత్రాలలో కొన్ని పాత్రలు పచ్చి అబద్ధాలు చెబుతాయి. ఈ చిత్రంలో కూడా ఒక పాత్ర అబద్ధం చెబుతుంది. కానీ తాను అబద్ధం చెబుతున్నానని ఆ పాత్రకు తెలుసు. ప్రేక్షకుడికి కూడా తెలుసు. కానీ మిగతా విషయాలు వారు నిజంగా నమ్మినవే అయి ఉంటాయి. అలా ఎవరి మనసు వారిని మాయ చేస్తుంది.

జాన్ దె కరూజ్, జాక్ లె గ్రీ ఫ్రాన్స్ సైన్యంలో ఇద్దరు యోధులు. స్నేహితులు కూడా. వారు పియెర్ అనే సంస్థానాధిపతి (కౌంట్) కింద పని చేస్తారు. జాన్ భార్య, కొడుకు ప్లేగు వ్యాధి వల్ల మరణించారు. జాక్‌కి పెళ్ళి కాలేదు. జాన్, జాక్ యుద్ధంలో పోరాడతారు. పియెర్ నుంచి ఆదేశాలు వస్తాయి. లిమోజ్ అనే ప్రాంతాన్ని కాపాడమని, శత్రువులు కవ్వించినా వారితో తలపడవద్దని. శత్రువులు వారి కళ్ళెదుటే ప్రజల్ని చంపుతుంటారు. జాన్ అది చూసి తట్టుకోలేక పియెర్ ఆజ్ఞలు ధిక్కరించి పోరాడతాడు. సైన్యమంతా అతనితో కలిసి పోరాడతుంది. జాన్ జాక్ ప్రాణాలు కాపాడతాడు. మరి కొందరు ప్రజలను కాపాడతాడు కానీ లిమోజ్ శత్రువుల అధీనంలోకి వెళుతుంది. పియెర్ యుద్ధం విరమిస్తాడు. జాన్ మీద కోపంతో ఉంటాడు. కొన్నాళ్ళకి జాక్ పియెర్‌కి చేరువౌతాడు. జాక్ తన మీద ఉన్నవీ లేనివీ చెప్పాడని జాన్ అనుకుంటాడు. తర్వాత జాక్ ఈ సంఘటనల్ని ఎలా గుర్తుపెట్టున్నాడో మనకి తెలుస్తుంది. జాన్ శత్రువుల మీదకి ఒంటరిగా వెళ్ళటంతో అతనికి తోడుగా జాక్ మిగతా సైన్యాన్ని తీసుకుని వెళతాడు. కానీ జాన్ తనని కాపాడాడనే విషయం మాత్రం అతనికి గుర్తుండదు. అయితే పియెర్ ముందు జాక్ జాన్‌ని సమర్థిస్తూ మాట్లాడతాడు. కానీ పియెర్‌కి తన ఆజ్ఞ ధిక్కరించిన జాన్ మీద కోపం. పైగా జాన్ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడని అంటాడు. భార్య, కొడుకులను కోల్పోయినవాడు అలా కాక ఎలా ఉంటాడు? పియెర్ లాంటి వాళ్ళు తమ అనుచరులు ఎప్పుడూ తమతో పాటు విందూ వినోదాలలో మునిగితేలాలని కోరుకుంటారు. పియెర్ వినోదం పేరు మీద విచ్చలవిడిగా స్త్రీలతో శృంగారం నెరుపుతూ ఉంటాడు. జాక్ కూడా ఆ వినోదాలకి అలవాటు పడతాడు. జాక్‌ని పియెర్ తన ఆప్తుమిత్రుడిగా భావిస్తాడు. అతనికి పన్నులు వసూలు చేసే పదవి ఇస్తాడు.

కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు జాక్ జాన్ దగ్గరకి వస్తాడు. జాన్ దగ్గర పన్ను వసూలు చేయటానికి పియెర్ పంపించాడంటాడు. జాన్ తన దగ్గర అంత డబ్బు లేదని అంటాడు. జాక్ తాను పియెర్‌తో మాట్లాడతానంటాడు. జాన్ తన భార్య, కొడుకు మరణించటంతో తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉంటాడు. ఎక్కడ యుద్ధం జరిగినా పొరాడటానికి వెళుతుంటాడు. అలా చేస్తే అతనికి రాజు నుంచి పారితోషికం వస్తుంది. అతని తండ్రి ఒక కోటకి సంరక్షకుడు. తండ్రి తర్వాత ఆ పదవి తనకొస్తుందని జాన్ ఆశ పడతాడు. కట్నం కోసం రాబర్ట్ అనే ఆయన కూతురు మార్గెరీత్‌ని పెళ్ళి చేసుకుంటాడు. ఆమె అసమాన సౌందర్యవతి. అయితే జాన్‌కి కట్నంలో రావాల్సిన కొంత భూమిని పియెర్ రాబర్ట్ పన్నుల కింద జమ చేసుకుని జాక్‌కి కానుకగా ఇస్తాడు. నిజానికి ఆ భూమి విలువ బకాయిల కన్నా చాలా ఎక్కువ. జాన్ ఆ భూమి కోసం రాజుని అభ్యర్థిస్తూ వ్యాజ్యం వేస్తాడు. రాజు తిరస్కరిస్తాడు. రాజు చార్ల్స్ VI వయసులో చిన్నవాడు. పియెర్‌కి వరసకి తమ్ముడవుతాడు. అతను అప్పుడప్పుడూ మతిస్థిమితం కోల్పోయేవాడని చరిత్ర చెబుతోంది. ఈ చిత్రంలో అతను అప్పుడప్పుడూ ఉన్మాదం కనిపించేలా చిరునవ్వు నవ్వటం చూపించారు.

రాజు దగ్గర వ్యాజ్యం వేసినందుకు పియెర్ జాన్ మీద అక్కసుతో ఉంటాడు. జాన్ తండ్రి మరణించాక కోట సంరక్షణ బాధ్యత జాక్‌కి అప్పగిస్తాడు. జాన్ తల్లి “నువ్వు పియెర్ మీద వ్యాజ్యం ఎందుకు వేశావు?” అని ప్రశ్నిస్తుంది. జాన్ తనకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి పియెర్ దగ్గరకి వెళతాడు. తిరిగి వచ్చిన తర్వాత మార్గెరీత్‌తో “నేను మర్యాదగానే మాట్లాడాను. మా తాత, తండ్రి నిర్వర్తించిన పదవికి నేను అర్హుడిని కానా అని ప్రశ్నించాను. జాక్ అక్కడే ఉన్నాడు. అతనే నా మీద విషప్రచారం చేస్తున్నాడని నాకు తెలుసు” అని అంటాడు. “జాక్ గురించి ఆ మాట అందరి ముందూ అన్నారా? ఎంత పని చేశారు!” అంటుంది మార్గెరీత్. తర్వాత జాక్ దృష్టికోణం నుంచి ఈ సంఘటన చూపించినపుడు జాన్ పియెర్తో “మీ చుట్టూ ఉన్నవారు చెప్పుడు మాటలు చెబుతున్నారు. నేను నా పదవి కోసం వ్యాజ్యం వేస్తాను” అంటాడు. పియెర్ “నీది కాని భూమి కోసం వ్యాజ్యం వేశావు. ఇప్పుడు పదవి కోసం వ్యాజ్యం వేస్తానంటున్నావు. నీ దిక్కున్న చోట చెప్పుకో” అంటాడు. జాన్ అక్కడి నుంచి వస్తుంటే అందరూ అతన్ని చూసి నవ్వుతారు. జాక్ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతాడు.

జాన్ నిజంగానే పదవి కోసం వ్యాజ్యం వేస్తానని అన్నాడా? అతను తన భార్యకి ఆ విషయం చెప్పడు. అతను అని ఉండవచ్చు. అయితే అతను వ్యాజ్యం వేయడు. అలా అని ఉంటే వ్యాజ్యం వేయకుండా ఎందుకు ఉంటాడు? మరి జాక్ కల్పించి చెప్పాడా? ఆ విషయం మళ్ళీ ప్రస్తావనకి రాదు కాబట్టి అసలేం జరిగిందనేది బయటివారికి తెలియదు. జాన్ వ్యాజ్యం వేస్తానని అని ఉండొచ్చు. రాజు పియెర్‌కి బంధువు కాబట్టి లాభం ఉండదని మానుకుని ఉండొచ్చు. భార్యకి మాత్రం ఆ విషయం చెప్పలేదు. మనుషుల ప్రవృత్తులు ఇలాగే ఉంటాయి. ఆ పదవి వంశపారంపర్యంగా రావాలనే నియమమేం లేదు. అలాంటపుడు వ్యాజ్యం వేసినా లాభం ఉండదు. ఇప్పటికీ మనం కొన్ని పదవుల కోసం ఆ వంశీయులు, బయటివారు పోటీపడటం చూస్తూనే ఉన్నాం. జాక్ ఎందుకు జాన్ పదవి తీసుకున్నాడు? వద్దని అనవచ్చుగా? కానుకలు, పదవులు వస్తుంటే వద్దనే వారెంతమంది ఉంటారు? స్నేహం కన్నా ఏలినవారి ప్ర్రాపకం ముఖ్యం అనుకున్నాడు జాక్. పైగా జాన్ తన భూమి కోసం వ్యాజ్యం వేశాడని కోపం కూడా ఉంది. ఒకప్పుడు జాన్ కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉండేవాడు. ధనం, పదవులు ముఖ్యం అనుకోవటంతో ఆ స్నేహాన్ని నిలుపుకోవాలని అనుకోలేదు.

ఒక సంవత్సరం తర్వాత జాన్, జాక్ ఒక అధికారి కొడుకు బారసాల వేడుకలో కలుసుకుంటారు. ఇద్దరూ రాజీ చేసుకుంటారు. అందరూ హర్షిస్తారు. ముందు తానే స్నేహహస్తం చాచానని ఇద్దరూ తర్వాత చెప్పుకుంటారు. జాన్ మార్గెరీత్‌ని జాక్‌కి మర్యాదపూర్వకంగా ఒక ముద్దు ఇవ్వమని చెబుతాడు. ఆమె అతని పెదవులపై ముద్దు పెడుతుంది. జాక్ ఆమె కేవలం పెదవులు తాకించకుండా పెదవులు విడదీసి ముద్దు పెట్టుకుందని తనని తాను నమ్మించుకుంటాడు. నిజానికి అతనే పెదవులు విడదీసి ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె సౌందర్యం గురించి అతను విని ఉన్నాడు. ఆమె తనలాగే విద్యావతి. జాన్ చదువులేనివాడు. కాకి ముక్కుకి దొండపండు దొరికిందని పియెర్ ఇంతకు ముందే అన్నాడు. జాక్ ఆమెతో మాట కలుపుతాడు. “మనమిద్దరం అందమైనవాళ్ళమే” అంటాడు. ఆమె అయిష్టంగానే మాట్లాడుతుంది. సాహిత్యం గురించి మాట్లాడుకుంటారు. జాక్ ఆమెకి తనంటే ఇష్టమని అనుకుంటాడు. ఆమే తనని చూస్తోందని అనుకుంటాడు.

మార్గెరీత్‌కి భర్తతో సంభోగ సమయంలో నొప్పి కలుగుతూ ఉంటుంది. కానీ ఆమె భావప్రాప్తి కలిగిందని అబద్ధం చెబుతుంది. పెళ్ళై ఐదేళ్ళు గడిచినా ఆమె గర్భం ధరించదు. అందుకని ఆమె బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ సైన్యం స్కాట్లాండ్‌తో కలిసి ఇంగ్లండ్ మీద పోరాడటానికి వెళ్ళినపుడు జాన్ వెళతాడు. అయితే స్కాట్లాండ్ ఓడిపోతుంది. జాన్‌కి ‘సర్’ అనే బిరుదు మాత్రం దక్కుతుంది. తర్వాత జాన్ తనకి రావలసిన పారితోషికం తీసుకోవటానికి ప్యారిస్ వెళతాడు. తిరిగి వచ్చాక మార్గెరీత్ “జాక్ మన ఇంటికి వచ్చి నన్ను మానభంగం చేశాడు” అని చెబుతుంది! “నిజమే చెబుతున్నావా?” అని అడుగుతాడు జాన్. అవునంటుందామె. అతను తన సన్నిహితులందరికీ జరిగింది చెబుతాడు. ప్రజల ద్వారా విషయం తెలిసి పియెర్ విచారణ చేస్తాడు. జాక్ నిరపరాధి తేలుస్తాడు. జాన్ రాజ దర్బారుకి వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు. విచారణ జరుగుతుంది. అప్పటి పద్ధతి ప్రకారం విచారణలో నిజం బయటపడకపోతే ద్వంద్వయుద్ధం చేసి తేల్చుకోవచ్చు. నిజం చెప్పేవారికి దేవుడి అండ ఉంటుంది కాబట్టి వారే గెలుస్తారని నమ్మకం. జాక్, మార్గెరీత్‌ల మధ్య అసలేం జరిగింది? చివరికి ద్వంద్వయుద్ధం జరిగిందా? ద్వంద్వయుద్ధం జరిగిందని చిత్రం మొదట్లోనే తెలుస్తుంది. ఈ ప్రశ్నలకన్నా స్త్రీల గురించి ఆరోజుల్లో ఉన్న అభిప్రాయాలు ఎలాంటివో తెలిసి విస్తుపోవటం మన వంతవుతుంది.

‘ద లాస్ట్ డ్యుయెల్’ అంటే చివరి ద్వంద్వయుద్ధం. న్యాయనిర్ణయానికి జరిగిన ద్వంద్వయుద్ధాలలో జాన్, జాక్‌ల యుద్ధం దాదాపు చివరిది. ఆ తర్వాత కొన్ని ద్వంద్వయుద్ధాలు జరిగినా ఇది చరిత్రలో నిలిచిపోయింది. దోషి ఎవరో తేలాలంటే ఇరుపక్షాలవారూ బాహాబాహీ తలపడాలి అంటే ఈరోజుల్లో అనాగరికంగా ఉంటుంది. కానీ ఒకరకంగా చూస్తే నిర్ణయం దేవుడికి వదిలేసినట్టే. ఇద్దరూ సమఉజ్జీలు ఉంటే ఇది సబబే అనిపిస్తుంది. జయాపజయాలు దైవధీనాలు అనే మాట ఎంత నిజమో యతో ధర్మస్తతో జయః (ధర్మమే గెలుస్తుంది) అనేది కూడా అంతే నిజం. మానభంగం సంఘటన జాక్ ఒక లాగ, మార్గెరీత్ ఒక లాగ గుర్తుపెట్టుకుంటారు. ఈ సన్నివేశం రెండు సార్లు వస్తుంది. కానీ తేడాలు ఉంటాయి. నిజజీవితంలో కూడా మనుషులు ఒక్కోసారి తాము చూడదలచుకున్నదే చూస్తారు. ఒకరికి ఆట అయినది ఒకరికి భయంకరమైన అనుభవం. ఈ సన్నివేశాలు తెరకెక్కించిన తీరు సినిమా అనే మాధ్యమం చేసే అద్భుతానికి నిదర్శనం. స్త్రీల పట్ల పురుషులు ఆరోజుల్లో ఎలా ప్రవర్తించేవారో చూసి ప్రేక్షకులకి గుండెలవిసిపోతాయి. మార్గెరీత్ అత్తగారు ఒక సన్నివేశంలో “నా మీద కూడా అత్యాచారం జరిగింది. కానీ నేను గొడవ చేయలేదు. మౌనంగా సాగిపోయాను” అంటుంది. ‘మగవాళ్లింతే’ అనే భావనతో అప్పట్లో స్త్రీలు మౌనంగా అత్యాచారాలను సహించేవారు. ఇప్పటికీ కొందరు నేతలు ‘మగపిల్లలు ఇలాగే ఉంటారు’ అంటున్నారంటే సమాజం ఎటు పోతున్నట్టు?

జాన్‌గా మ్యాట్ డేమన్ నటించాడు. అతని ముఖంపై, ఒంటి పై ఉన్న గాయాలు చూసి అతనెంతటి యోధుడో తెలుస్తుంది. మ్యాట్ డేమన్‌కి ఆ గాయాల మేకప్ చేసిన కళాకారుల్ని మెచ్చుకోవాలి. యుద్ధభూమిలోనే కాక జీవనపోరాటంలో కూడా అలిసిపోయిన యోధుడి పాత్రను మ్యాట్ చక్కగా పోషించాడు. జాక్‌గా ఆడమ్ డ్రైవర్ నటించాడు. ‘మ్యారేజ్ స్టోరీ’లో సున్నితమైన పాత్ర పోషించిన అతను ఈ చిత్రంలో స్నేహంగా ఉంటూనే గోతులు తీసే పాత్ర అద్భుతంగా పోషించాడు. మార్గెరీత్‌గా నటించిన జోడీ కోమర్ ఒక అద్బుతమనే చెప్పాలి. అందం, మంచితనం, గుండెనిబ్బరం ఉన్న పాత్ర ఇది. పురుషాధిక్య ప్రపంచంలో భర్తని కూడా నమ్మలేని పరిస్థితి ఆమెకి వస్తుంది. ఆమె నటన చిరకాలం గుర్తుండిపోతుంది. జాక్ అందరి ముందూ ముద్దు పెట్టినపుడు అతను హద్దులు దాటాడని అనిపించినా ‘పోనీలే. ఇద్దరికీ రాజీ కుదిరింది చాలు’ అన్నట్టు ఆమె మౌనంగా ఉండిపోతుంది. అక్కడ కూడా ఆమె నటన గొప్పగా ఉంటుంది. పియెర్‌గా బెన్ ఆఫ్లెక్ నటించాడు. ఇలాంటి పాత్ర చేయటం అతని లాంటి నట దర్శకుడికి సాహసమనే చెప్పాలి. పాత్ర ఎలాంటిదైనా న్యాయం చేయటం ఉత్తమ నటుని లక్షణం. అదే ఇక్కడ కనబడుతుంది. చిత్రంలో అప్పటి కోటలు, దుస్తులు, యుద్ధాలు చాలా ప్రామాణికంగా చూపించారు.

ఈ క్రింద చిత్రకథ మరికొంత ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు.

బారసాల వేడుకలో మార్గెరీత్‌ని చూసిన తర్వాత ఒకరోజు బజార్లో ఆమెని చూస్తాడు జాక్. అతని అనుచరుడు “మీరు ప్రేమలో పడ్డారు” అంటాడు. “స్నేహధర్మం అన్నిటి కన్నా గొప్పది” అంటాడు జాక్. “ప్రేమ కన్నా గొప్పదా?” అంటాడు ఆ అనుచరుడు. ఈ సందర్భాన్ని తర్వాత మార్గెరీత్ దృష్టికోణం నుంచి చూసినపుడు ఆమె “జాక్ అందగాడే కానీ నమ్మదగినవాడు కాదు” అంటుంది తన స్నేహితురాలితో. జాన్ స్కాట్లాండ్ నుంచి తిరిగి వచ్చాక పియెర్‌కి నివేదించటానికి వెళతాడు. జాక్ అక్కడే ఉంటాడు. “ఓడిపోయారుగా” అంటాడు పియెర్. జాక్ జాన్‌తో “నువ్వు వీరోచితంగానే పోరాడావనటంలో సందేహమేమీ లేదు” అంటాడు. “నాకు సర్ అనే బిరుదు వచ్చింది. ఇకనుంచి నన్ను సర్ అనే సంబోధించాలి” అంటాడు జాన్. జాక్ ఖంగు తింటాడు. కానీ పైకి మాత్రం గంభీరంగా “సరే సర్” అంటాడు. జాన్ ప్యారిస్ వెళ్ళిన తర్వాత జాక్ అతని ఇంటికి వెళతాడు. తన అనుచరుడి సహాయంతో లోపలికి ప్రవేశిస్తాడు. మార్గెరీత్‌తో “నేను నీ ప్రేమలో తలమునకలై ఉన్నాను. అద్భుతమైన నిన్ను నీ భర్త ఇక్కట్లు పెడుతున్నాడు. మీ అర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసింది” అంటాడు. ఆమె అతన్ని ఛీత్కరించుకుని వెళ్ళిపొమ్మంటుంది. అతను ఆమెని వెంబడిస్తాడు. ఆమె వెనకాలే ఆమె గదిలోకి వెళతాడు. ఆమె ప్రతిఘటిస్తుంది. ఆమెని పట్టుకుని మంచం మీద పడేసి మానభంగం చేస్తాడు. “ఈ విషయం నీ భర్తకి చెబితే నిన్ను చంపేస్తాడు. మనమిద్దరం వివశులమై ఈ పని చేశాం. ఎవరికీ చెప్పకు” అంటాడు. తర్వాత చర్చికి వెళ్ళి వివాహితతో సంబంధం పెట్టుకున్నందుకు నామమాత్రపు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. అతని మీది అభియోగం విని పియెర్ అతన్ని ప్రశ్నిస్తాడు. “ఆమె నామమాత్రంగా బెట్టు చూపించింది కానీ ఆమె అంగీకారంతోనే మేం కలిశాం. ఇప్పుడు ఆమె ఎందుకిలా అంటోందో నాకు అర్థం కావటం లేదు. ఆమెని ప్రేమించిన మాట నిజం. తప్పని తెలుసు. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. మానభంగం అభియోగం మాత్రం నిజం కాదు” అంటాడు జాక్.

జాక్‌కి శృంగారమంటే ఒక ఆట. అతను కూడిన స్త్రీలు విచ్చలవిడిగా ఉండే స్త్రీలు. వారిలో కొందరు అతన్ని ఊరించినట్టు అతనితో దోబూచులాడతారు. వారిని తరిమి పట్టుకుని వశపరచుకోవటం అతనికి ఆట. మార్గెరీత్ కూడా అలాగే తనకి ఇష్టమైనా బెట్టు చేసిందని అనుకున్నాడు. ఇది నిజంగానే నమ్మాడు. ఆమెని మౌనంగా ఉండమనటానికి కారణం ఆమె వివాహిత కావటం. వివాహేతర సంబంధం పాపం అని మతం బోధిస్తుంది. అయినా వివశులై తప్పు చేశామని అతను అనుకున్నాడు. ఆమె మౌనంగా ఉంటుందనుకున్నాడు కానీ మానభంగం జరిగిందని అంటుందని ఊహించలేదు. పియెర్ వారిద్దరూ ఇష్టంగానే కలిశారని నమ్ముతాడు. అయితే వివాహేతర సంబంధం తప్పు కాబట్టి పియెర్ జాక్‌ని అసలు తనకి మార్గెరీత్‌తో సంబంధమే లేదని చెప్పమంటాడు. జాక్ అలాగే చెబుతాడు. జాన్ కావాలనే తన పేరుని బురదలోకి లాగుతున్నాడని అంటాడు. ఇది అబద్ధం. అతనికీ తెలుసు. ప్రేక్షకులమైన మనకీ తెలుసు. అయితే జరిగినది అతని దృష్టిలో మానభంగం కాదు కాబట్టి తన తప్పు లేదని అతని తర్కం. ద్వంద్వయుద్ధానికి ఒప్పుకుంటాడు.

మార్గెరీత్ జాన్‌కి మానభంగం విషయం చెప్పినపుడు అతని దృష్టిలో అతను చాలా సానుభూతి చూపించాడు. “నిన్ను కాపాడలేక పోయినందుకు నన్ను క్షమించు” అన్నానని అతని భావన. కానీ నిజానికి ఆ సమయంలో అతను “నిన్ను అనుభవించిన ఆఖరివాడు జాక్ కావటం నాకిష్టం లేదు. నిన్ను నేను అనుభవించాలి” అని ఆమెని అనుభవిస్తాడు. ఆమెకి జరిగిన అన్యాయానికి ఆమెకి అండగా నిలిచిన మాట నిజమే. కానీ ఆమె తన సొత్తు అనే భావన అతనికి ఉంది. అది తప్పని కూడా అతనికి తట్టదు. ఆ స్థితిలో ఆమెని అనుభవించటం ఆమెకి బాధ కలిగిస్తుందని అతను అనుకోడు. ప్రేమతో సహజంగా శృంగారం జరిగితే అది వేరే విషయం. కానీ పంతంతో చేయటం ఎంత దారుణం! అయినా ఆ కాలంలో స్త్రీలను పురుషులు ఒక ఆస్తిగానే భావించేవారు. అది తప్పని కూడా తెలియని వాతావరణమది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

రాజుగారి ఎదుట విచారణ జరిగే సమయానికి మార్గెరీత్ గర్భం ధరిస్తుంది. ఆమెకి భర్తతో కలిసినపుడు భావప్రాప్తి కలిగేది కాదు. భావప్రాప్తి కలగకపోతే గర్భధారణ జరగదని అప్పుడు నమ్మేవారు! ఈ ఒక్క పాయింటు మీద ఆమెని ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తారు విచారణ చేసేవారు. “గత ఐదేళ్ళలో గర్భం ధరించలేదు కానీ ఇప్పుడు గర్భం ధరించావంటే నువ్వు ఎవరితోనో అక్రమసంబంధం పెట్టుకున్నావు. ఆ విషయం బయటపడకూడదని జాక్ మీద అభాండాలు వేస్తున్నావు” అంటారు. ఎంతటి అజ్ఞానం! భావప్రాప్తికి, గర్భధారణకి సంబంధం ఏమిటి? జాన్ ఎప్పుడూ యుద్ధాలంటూ వెళుతూ ఉండేవాడు కాబట్టి ఆమె గర్భం ధరించలేదు. ఇప్పుడు ధరించింది. ఆ బిడ్డ జాన్ బిడ్డా, జాక్ బిడ్డా అనేది తెలిసే అవకాశం లేదు. ఆ బిడ్డ ఆమె బిడ్డ. అంతే!

ఆమె తాను నిజమే చెబుతున్నానని చెబుతుంది. విచారణ చేసేవారు “నీ భర్త ద్వంద్వయుద్ధం చేస్తానంటున్నాడు. అందులో అతను ఓడిపోతే నువ్వు అబద్ధం చెప్పినట్టే. అప్పుడు నిన్ను సజీవదహనం చేస్తారు. దహనం చేస్తే ఇరవై నిమిషాల వరకు ప్రాణం పోదు. నీకు సమ్మతమేనా?” అంటారు. ఆమెలో కాస్త భయం కనిపిస్తుంది. అయినా “నేను చెప్పేది నిజం” అని మాత్రం అంటుంది. తర్వాత భర్తతో “ద్వంద్వయుద్ధంలో నువ్వు ఓడిపోవటమంటే నువ్వు మరణిస్తావు. తర్వాత నన్ను కాల్చేస్తారు. మన బిడ్డ అనాథ అయిపోతాడు. ఆ విషయం ఆలోచించావా? నీ విరోధితో తలపడి నీ అహాన్ని తృప్తిపరుచుకోవటానికి నన్ను వాడుకుంటున్నావు. నీ అహంకారం వల్ల నీకు ఇంకేం కనపడటం లేదు” అంటుంది. భర్త తన పగ తీర్చుకోవటానికి తనని వాడుకుంటున్నాడని ఆమెకి అర్థమైంది. ఓడిపోతే ఆమెని దహనం చేస్తారని అతనికి తెలుసు. అయినా ఆమెకి ఆ విషయం చెప్పడు. స్త్రీకి తన జీవితం మీద కూడా హక్కు లేని కాలమది. చివరికి ఆమె ప్రసవించిన తర్వాత ద్వంద్వయుద్ధం ఏర్పాటు చేస్తారు. ముందు రోజు రాత్రి ఆమె “ఈ పరిస్థితి వస్తుందని తెలిస్తే నేను మౌనంగా ఉండేదాన్ని” అంటుంది జాన్‌తో. “కానీ ధర్మం నీ పక్షాన ఉంది కదా” అంటాడతను. “తల్లికి ధర్మాత్మురాలు అనిపించకునే అవసరం కన్నా బిడ్డకి తల్లి అవసరం పెద్దది” అంటుందామె. ఏ తల్లికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇలాగే ఎందరో స్త్రీలు తమ పట్ల జరిగిన అకృత్యాలను భరించారు.

చివరికి ద్వంద్వయుద్ధం జరుగుతుంది. జాక్ జాన్ మీద పైచేయి సాధించినట్టే ఉంటుంది కానీ జాన్ జాక్‌ని తొడ మీద గాయపరుస్తాడు. అతని మీద పట్టు సాధిస్తాడు. జాన్ “నిజం ఒప్పుకో” అని అరుస్తాడు. జాక్ “మానభంగం జరగలేదు” అంటాడు. అది అతను నమ్మిన నిజం. ‘నేనే తప్పు చేయలేదు’ అనటానికి అతను సాహసించడు. తప్పు చేశానని తెలుసు. అయితే అది ఇద్దరి ఇష్టంతో జరిగిందని అతను ఆఖరి శ్వాస వరకు నమ్మాడు. అయితే దేవుడికి సత్యాసత్యాలు తెలుసు. ద్వంద్వయుద్ధం ఆచారం ఎంత అనాగరికమైనా దేవుడి మీద భారం వేసి న్యాయనిర్ణయం చేయమంటే న్యాయమే జరుగుతుంది. ధర్మం మన పక్షాన ఉంటే మనం గెలుస్తాం. అదే ఇక్కడ జరుగుతుంది. జాన్ జాక్‌ని హతమారుస్తాడు. బంధనాల్లో ఉన్న మార్గెరీత్ విడుదల అవుతుంది. ప్రజలు హర్షిస్తారు. జాన్‌ని అందరూ దైవాంశసంభూతుడిలా చూస్తారు. మార్గెరీత్ భర్త నీడలోనే ఉండిపోతుంది.

మనిషి తాను తప్పు చేయలేదని నమ్మినా దైవం నిష్పక్షపాతంగా నిర్ణయం చేస్తుంది. విచ్చలవిడి శృంగారానికి అలవాటుపడటం జాక్ చేసిన పెద్ద తప్పు. ఇంద్రియాలకి దాసుడైపోయాడు. రావణుడు కూడా ఇదే తప్పు చేశాడు. రావణుడికి శాపం ఉంది కాబట్టి సీతని బలాత్కరించలేదు. జాక్ ఆ తప్పు చేశాడు. వివాహిత కాబట్టి బెట్టు చేసింది కానీ ఆమెకి తనంటే ఇష్టమే అనుకున్నాడు. ఇక్కడ స్త్రీల మీద చులకన భావం కనిపిస్తుంది. అదే అతని కొంప ముంచింది. స్త్రీలను క్షోభ పెట్టినవారు ఎప్పటికైనా అధోగతి పాలౌతారు. బలవంతులమని, ధనబలం ఉందని, పెద్దల అండ ఉందని అనుకుంటే పొరపాటే. కర్మఫలాల్ని తప్పించుకోవటం సాధ్యం కాదు. ఇదే నిజం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here