బామ్మాయణం!

0
3

[dropcap]“మా [/dropcap]నాయన, రెండు ముక్కలు ఉత్తరం రాసి పెట్దూ” అని కాలేజి నుంచి వచ్చీ రాగానే అడిగేది మా బామ్మ, అడపా దడపా!!

అటు అడపాకి, ఇటు దడపాకి ఎంత వ్యవధి ఉండేదో గుర్తు లేదు కానీ, ఆమె ఎప్పుడు అడిగినా మొన్నీ మధ్యేగా రాసింది, ‘మళ్ళీనా’, అనిపించేది నాకు!

ఆమెకు మా ఇంట్లో హాల్లో  ఉండే చెక్క కుర్చీ, పర్మనెంట్ సింహాసనం! ఉన్న మిగతా ముగ్గురి కొడుకుల ఇళ్ళలో కొన్నాళ్ళు ఉండి, చిన్న కొడుకింటికి, అంటే మా ఇంటికి, అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు మాతో ఉంటూండేది!

మహా సత్తెకాలపు మనిషి! చదువు దాదాపు లేనట్టే! భర్త పోవటంతో, కొడుకుల దగ్గరే మకాం, ఆమెకు ఇష్టం వచ్చినన్ని నాళ్ళు, ఇష్టమొచ్చినప్పుడు!! ఆమె అదృష్టం, అందరు బాగా ఆదరణ గానే చూసుకునేవారు!

భోజనం ముగించి రాగానే, “చెప్పు బామ్మా, ఉత్తరం” అనేవాణ్ణి, ఆమె దగ్గర కింద చాప మీద కూచొని! చేతిలో పెట్టేది ఆమే జాగ్రత్తగా తెచ్చిన కార్డో ఇన్లాండ్ లెటరో!!

పెన్ను నాదేలెండి!  అప్పుడింకా, ఇంకు పెన్నులే!

నేనేమో, ‘రెడీ, స్టడీ, గో’, పోజులో!!

నవతి ఎప్పుడో దాటిన బామ్మ, చెక్క కుర్చీలో నిటారుగా కూర్చుని, ఉత్తరారంభం ఆలోచిస్తూ!! ఆమె లేడీ వ్యాసుడైతే, నేను ఏకదంత ధారియైన వినాయకుణ్ణి!! రాయబోయేది భారతమో, రామాయణమో నాకు తెలియదు!

చెప్పబోయేది ఏమిటో ఆమెకు తెలుసో లేదో, నాకు తెలియదు! అయినా పట్టు పట్టే! ఉత్తరం రాయాల్సిందే!

ఆమెది అవసరం, నాది బామ్మ భక్తి!

***

“కాయ 50 పైసల లెక్క కట్టినా,1000 కాయల కాపుకీ, 500/- రావాలి గదయ్యా, ఏమిటి మూడొందలే పంపించావని అడగమను నాయనా, మొహం మీదే!”, అంటూ కథాక్రమం ఎక్కడి నుంచో, నా కంతు బట్టని తీరం నుంచి మొదలు పెట్టేది, బామ్మ!

ఏం కాయలో, ఎవరి మొహమో నే నూహించుకోగలనని ఆమె నమ్మకమో, లేక ఆలోచనల వెల్లువలో మరిచి పోయేదో కానీ, నాకు మాత్రం ఇది స్టార్టింగ్ ట్రబులే!

సరే, పాత ఉత్తరం రాసిన ఎపిసోడ్ గుర్తు తెచ్చుకొని, ఆ మనిషి తెనాలిలో ఈమె కున్న పదో పాతికో చెట్ల  సంరక్షకుడైన సాంబయ్య అని, ఆ కాయలు కొబ్బరి కాయలనీ నిర్ధారించుకొనేవాణ్ణి!

నా సొంత భాషలో, అభ్యర్థిస్తున్నట్టు, ప్రశ్నిస్తున్నట్టూ అడగమని, రెంటికీ మధ్యగా రాసి, ఓ యాభై ఆరు ఎడిటింగ్‌ల తర్వాత, ఆమె ఆమోదంతో, మొదటి వాక్యం ముగించేవాణ్ణి!

ఇంతకీ ఈ ఉత్తరం డైరెక్టుగా సదరు తెనాలి సాంబయ్యకు కాదు రాయటం! అందుకనే ‘అడగమని’ అనటం!

ఆ ఊళ్ళో ఉండే, దూరపు బంధువూ, బామ్మకు నమ్మకస్తురాలు అయిన కామాక్షమ్మ గారికి! ఆమెగారు బామ్మకి ఫైనాన్స్ మేనేజర్, బిల్ కలెక్టర్ అన్న మాట!

ఈ రెండొందల తగ్గుదల ఎప్పుడూ మాయమవదు, ఏదో చెట్లకు పాదులు తీయించాను, నీళ్ళు పెట్టించాను వగైరా చెప్పేవాడతను, స్టాక్ జవాబుగా, స్మార్ట్ రిప్లైగా!

కానీ ఈమె అడగటం మానేది కాదు!

విధ్యుక్త బాధ్యతగా నేనూ మళ్ళీ మళ్ళీ ఈ కోత గురించి రాయటం మానేవాడిని కాదు, ససేమిరా!!

***

రెండో ఘట్టం బామ్మకు ఆ ఊళ్ళో, కాస్త దూరంగా, పెడగా ఉన్న  రెండు దుకాణాల అద్దెల గూర్చి! రెండూ ఒక పెద్ద కుటుంబం వారే తీసుకున్నారు! అందుకేనేమో కూడబలుక్కున్నట్టు కలిసే వాయిదాలు వేస్తారు అద్దె ఇవ్వటం!మూడు నెల్లో ఆ పైనో ఒకసారి, వారి వీలు చొప్పున ఇస్తుంటారు! ఏ మాట కా మాటే చెప్పుకోవాలి పాపం ఆలశ్యం చేస్తారే కానీ, ఎగ్గొట్టే ఉద్దేశం ఉన్నట్టు తోచదు వారికి!

ఈ మాట, సాధు మానస, మా బామ్మ చాలా సార్లు పొగుడుతూ చెపుతూ ఉండేది, మేం నవ్వాపుకుంటున్నది చూస్తున్నా పట్టించుకోకుండా!! ఆలస్యానికి పొగడ్తలు అని మా అబ్జెక్షన్!! ఆమె దాన్ని ఎప్పుడూ ఓవర్ రూలే చేసేది! కొంప తీసి ఈ సారి తెనాలి వెళ్ళి నప్పుడు సన్మానం కూడా చేయిస్తుందేమోనని మాకు అనుమానం కూడా ఉండేది!!

వాళ్ళు, ఏదో గొళ్ళాలు పెట్టించాము, మూడు చోట్ల, ఒక్కోటి 2 రూపాయలు అన్నారు క్రితం సారి. మూడు రెండ్రెళ్ళు నాలుగు రూపాయలూ మినహాయించుకొనే పంపమనవమ్మా కామాక్షీ, పాపం వాళ్ళ డబ్బు మనకెందుకూ!

ఇదీ బామ్మ మాటల సారాంశం,ఈ విషయంలో!!

మూడ్రెళ్ళు 6 బామ్మా అంటే ఏమో నాయనా ఎంతైతే అంత, సరిచేసి రాసేయ్, నేనేమన్నా బడి మొహం చూసిన దాన్నా ఏమిటీ, ఆ లెక్కలూ అవీ రావటానికి అనేది!

ముందే సరి చేసే రాసేవాణ్ణి, అనుకోండి, అయినా లేఖకుడిగా నా ధర్మం పాటించడానికి అడిగేవాణ్ణి!!

***

చివరి అధ్యాయం, ఆమెకున్న ఓ మోస్తరు ఇంటికి సంబంధించిన అద్దె వసూలు గురించి!

ఆ ఉంటున్నాయన ఒక బడిపంతులు.

“జీతాలే 4 నెలలకు ఒకసారి ఇస్తున్నారమ్మా, కొంచెం వీలు చూసుకొని సర్దుబాటు చేస్తాను, పెద్ద మనసు చేసుకోండి” అని ఆయన అడిగినట్టు కామాక్షమ్మ గారు రాయటం, బామ్మ ఏకంగా 4 కాదు 6 నెలల గడువు జాలిగా ఇచ్చేయడం, మామూలే! ఈ విషయం నాకు ఎట్లా తెలుసా అని అనుకోవాకండి!

బామ్మకు వచ్చే ఉత్తరాలను ఆమెకు చదివి వినిపించేది నేనేగా, అందుకని నాకు తెలిసేవి ఈ బాకీల, వసూళ్ళ, వాయిదాల ,అప్పుడప్పుడు ఋణమాఫీల లోగుట్టులు!

ఇప్పుడు, ఆ గడువు టైం అయిపోవడంతో, బామ్మ గట్టిగా పూనుకొని, అద్దె వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్ఠుంది!

నెలకు 50/- చొప్పున 6 నెలలదీ, 300/- తక్షణం పంపించమని బామ్మ, కాదు కాదు ఇంటి ఓనర్ గారి హుకుం! అట్లాగే రాశాను!

వాక్యం ఒడుపుగా, బామ్మే ‘మధ్యవర్తి’ని, శ్రీ కామాక్షికి రాసినట్టు, ఆశీర్వాదం ఒకటి అలంకరించి మరీ!

అవును మరి, ఎంత బంధువులైనా, బొత్తిగా మన డబ్బు విషయం రాసి ఊరుకుంటే, ఏం బాగుంటుంది!?

అందుకనే, కాస్త ఆమె శ్రేయస్సు కూడా ఆకాంక్షించే వ్యక్తే మా బామ్మ అని తెలియ చెప్పడానికి, ఆ గంగాభాగీరథీ ఘనాశీర్వాదం జత చేశాను.

నేనొక గొప్ప మేధావిని అని, గట్టిగా నమ్మేసింది బామ్మ, ఆ నా సొంత వాక్యం వినగానే,”మా నాయనే”, అని ముచ్చటపడిపోతూ!

ఉన్నట్టుండి మరీ కఠినంగా అడిగేస్తున్నానేమో అంత అద్దె అనుకొని, ఆయనేదో సున్నం వేయించానన్నాడు, నాలుగు గదులకు, నాలుగు అయిదులు,(4×5) పదిహేను రూపాయలూ మినహాయించుకొమ్మను నాయనా అన్నది! నేను ఆవిడ ఎక్కాల పాండిత్యంతో గతుక్కుమన్నాను! ఇందాక, తాను ఇవ్వాల్సిన చోట, 2×3= 4 అన్న ఆమె, ఇక్కడ వాళ్ళను తగ్గించి ఇవ్వమనటంలో కూడా లెక్కలో, (5×,4)=15 అనటంతో!

అంటే ఈ ఎక్కాలతో, ఎటు చూసినా మనకే లాభం అన్నమాట! ‘సౌలభ్య గణితం’ అనుకున్నాను నాలో నేను, ఎక్కాలు సరి చేసేసి రాస్తూ!

చివర్లో మళ్ళీ కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్యం సూత్రాలు కామాక్షికి చెప్పి, ఉత్తరం ముగించేది బామ్మ! ఉత్తరం పట్టినన్ని రాసి, ఖాళీ లేకపోతే కొన్ని వదిలేసే వాణ్ణి నేను!

ఆ మాత్రం లేఖక స్వాతంత్ర్యం ఉండకపోతే ఏం బాగుంటుంది చెప్పండి!!

***

మా బామ్మలో ఇంకో కోణం, పింగళి నాగేంద్రరావు గారి శైలి!

ఆయన మాటలెలా పుడతాయి ఎవరూ పూనుకోకపోతే అన్నట్టు, రేడియోలో ప్రాంతీయ వార్తలను ఈమె ‘శాంతీయ’ వార్తలు అనేది!

దేశం శాంతంగా ఉండాలని ఆశించి అట్లా అనేదో, ప్రాంతాలు శాంతంగా ఉంటే దేశం మొత్తం శాంతిగా ఉంటుందనే విస్తారమైన అర్థమో, తెలియదు!!

ఆ టైమ్‌కి ఆమె ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అడిగేది, “శాంతీయ వార్తలొస్తాయి, కాస్త రేడియో పెట్టు నాయనా”, అని!

వినేదే కానీ, ఏ నాడూ వ్యాఖ్యానం చేసేది కాదు, దేని మీదా! ఇంక సంగీత ప్పాటంటే చెవి కోసుకున్నంతే!

“బ్రోవ భారమా రఘురామ”, ఒకటి, “యెందుకయా యుంచినావు బందిఖానలో”, ఒకటి మహా ఇష్టం ఆమెకు!

ఏదైనా బ్రాడ్‌గా వెళ్ళిపోయే రకంగా ఉండేది ఆమె ధోరణి, లోతుల జోలి, ఎప్పుడూ పట్టినట్లు లేదు!!

***

ఒకసారి ఈవిడ హాల్లో చెక్క సింహాసనంలో కూర్చొని ఉండగా, ఒక మధ్యాహ్నం పూట, ఎవరో ఒకాయన, సుమారు 40 ఏళ్ళవాడు గేటు తీసుకొని వచ్చి, వరండా తలుపు వేసుంటే, “అమ్మాయి లక్ష్మీ”, అని పిలవటం మొదలెట్టాడుట!

కుర్చీలో కొంత కునుకుపాట్లు పడుతున్న బామ్మ ఒక్కసారి ఆ పిలుపుకి అదిరిపడి, పెద్దగా దొడ్లో దొండపాదు శుభ్రం చేస్తున్న లక్ష్మికి (అంటే మా అమ్మకు) వినబడేలా, విని దడుచుకునేలా, “ఇదిగో ఓ లక్ష్మీ, నీ కోసం ఎవ్వరో వచ్చారు”, అన్నదిట!

“నా కోసం ఎవరండీ?” అని విస్తుపోయి అమ్మ చేయి కడుక్కొని హాల్లోకి రాగానే, ఆ వచ్చినది ఆమెకు అన్నయ్య వరసైన సదానందం గారు.

ఆదరంగా ఆయనతో కాస్సేపు మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తరువాత, అమ్మ అడిగిందట, “ఏంటండీ అంతగా అరిచారు” అని!

“ఏమోనమ్మా, ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను, ఎదురుగా ఆయనను చూసేప్పటికి కంగారు పుట్టింది” అన్నదట బామ్మ, అమాయకంగా!

‘ఆయన పేరు సదానందం, సౌమ్య స్వరూపుడు! ఈమెకు కల్గింది, మహాభయం, బాగానే ఉంది’ అని అమ్మ అనుకొని, నవ్వి ఊరుకుందట!

అత్త కోడళ్ళిద్దరిది, మంచి స్నేహ బంధంగా ఉండేది! అత్తగారు అంటే ఈమెకు గౌరవం, కోడలు అంటే ఆమెకు మంచి సమర్థురాలు అన్న ప్రశంసా!

***

పాలకూర, తోటకూర కట్టలు తెచ్చేవారు పొలాల్లోంచి అమ్మకానికి! మా బామ్మ బేరం వైనం చూడాల్సిందే! ఆ అవ్వ పావలాకు నాలుగిస్తాను అంటే, ఈమె నాలుగేం చాలుతై మాకు, అర్ధ రూపాయి ఇస్తాను, ఆరు కట్టలివ్వు అని బేరం ఆడేది! ముందా వీరవ్వకు అర్థం అయ్యేది కాదు ఈ లొసుగు బేరం ఏమిటా అని!

రెట్టించి బామ్మ అర్ధ రూపాయి – ఆరు కట్టలు అంటూంటే, ఆ కూరలమ్మికి తెలిసి పోయేది, ఓహో ఈమె గారి కంటే మనమే ఎక్కువ చదివామని! వెంటనే ఇచ్చేది ఆరుకట్టలూ, అర్ధ రూపాయికి!

బుట్ట తలమీద పెట్టుకునే ముందే, ఎప్పట్నుంచో నా దగ్గరే కొంటున్నారు, ఇంద ఇంకో కట్ట, అని బలి చక్రవర్తి పోజులో ఇచ్చి పోయేది! బామ్మా సంతోషించేది!

అసలు సంగతి, ఇద్దరూ ఒక కట్ట లాభమే అయిందని సంతోషించడం! ఇద్దరూ సంతోషిస్తున్నారు కదా, అని అంతా గమనిస్తూనే ఉన్నా అమ్మ కలగచేసుకొనేది కాదు! కిచెన్ డిప్లమసీ అయ్యుంటుంది!!

***

ఇక బామ్మతో నా హరికథానుభవం చెప్పి తీరాల్సిందే! అంటే నేను చెప్పిన హరికథల గురించి అని కాదులెండి! నేనూ, బామ్మా, ఆంజనేయ ఉత్సవాలలో జరిగే వారం రోజుల హరికథలు అటెండ్ అయిన ముచ్చట అన్న మాట!

రాత్రి 9, 9.30కి మొదలై, సుమారు 12 గంటల దాకా సాగేవి అవి. దాదాపు రోజూ వెళ్ళేవాళ్ళం! ఇద్దరం బాగానే లాభపడే వాళ్ళమనే చెప్పాలి, ఈ  వారం రోజులూ!

నాకు పురాణ కథలు బాగానే తెలిసేవి, ఆమెకు నిద్ర సులభంగా పట్టేది!!

అదేమిటి అంటే, అది ఇట్లా!

వెళ్ళి వెళ్ళగానే, ఆ షామియానా కింద, కాస్త వెనకాల ఓ గుంజ దగ్గరగా కూచునేది బామ్మ! అక్కడెందుకు ముందు కూచుందాం అని నా ఆరాటం! చెప్పే హరిదాసు గారికి కాస్త దగ్గరగా కూచుంటే, కృష్ణుడి శంఖమో, అర్జునుడి గాండీవమో, భీముడి గదో కనిపిస్తుందేమోనని నా బాలప్రాయపు టూహ!

కానీ బామ్మ వినకుండా వెనకాలే, గుంజ దగ్గరే కూచునేది, రోజూ! నువ్వు ముందు కూచో నాయనా, వెళ్ళేపుడు కలిసి వెళదాంలే అని ఊరడించేది కూడా!

ఈ బ్యాంక్ బెంచెస్ ప్రిఫరెన్స్ ఎందుకో నాకు మొదట్లో అర్థం అయ్యేది కాదు, ఎంత ఆలోచించినా! సరే నా పాటికి నేను ముందు కూచుని కథలో మునిగిపోయేవాణ్ణి, ఆ యా భారత పాత్రలను ఊహించుకుంటూ!

ఒక గంట అయిన తరువాత, బామ్మ క్షేమమే కదా అని తల తిప్పి వెనక్కి చూస్తే, బామ్మ గుంజ నానుకొని తృప్తిగా నిద్రపోయే సీన్ చూసేవాణ్ణి!

ఎంత ఆలోచించినా తట్టనిది, ఒక్క దృశ్యంతో తేటతెల్లమైంది. ఇందుకన్న మాట, ఆమె ఆ స్థానమే ఎంచుకునేది, అని తెలిసింది. నిద్రకు ఢోకా లేని చోటు చూసి మరీ కూచునేదన్న మాట!

మర్నాడు పొద్దున్నే కాఫీల మీటింగ్ దగ్గర, బామ్మ అమ్మతో అనటం వినేవాణ్ణి! “రాత్రి చాలా బాగా చెప్పారు కథ దాసుగారు, పూస గుచ్చినట్టు, కళ్ళకు కట్టినట్టు!!”

హమ్మా బామ్మా అనుకునేవాణ్ణి, అప్పటికి ఏమీ అనకపోయినా!!

కానీ మళ్ళీ, రాత్రి హరికథ టైమ్‌కి, బయల్దేరటానికి రెడీగా కూచునేది బామ్మ, నాదే ఆలస్యమన్నట్టు! అందరూ అక్కడే ఉండేవారు, వరండాలో! రాత్రి చూసిందీ, పొద్దున విన్నది కలగలిసి నా నోట విషయం అడిగించేసేవీ, రహస్యం చెప్పించేసేవి!

“నిద్ర కోసం అక్కడి దాకా ఎందుకు బామ్మా, ఇంట్లోనే పడుకోవచ్చుగా”, అని ఒకరోజు అనేశాను!

“హేమిటీ, బామ్మ హరికథ వినట్లేదూ, నిద్ర పోతోందా అక్కడ” అని అందరూ కాస్త నవ్వుకున్నారు. బామ్మ, ఈ హఠాత్పరిణామానికి కొంచెం నొచ్చుకున్నట్టు కూడా అనిపించింది, పాపం!

కానీ యథావిథిగా రోజూ తీసుకెళ్ళే వాణ్ణే ఆ తరువాతా, ప్రతి సంవత్సరము కూడా!

ఆమె కూడా ఏమీ మనసులో ఉంచుకోకుండా, ప్రతి రోజూ అక్కడే కూర్చుని నిద్ర పోయేది, తెల్లవారిం తరువాత అమ్మతో “రాత్రి కథ శానా బాగా చెప్పారు, లక్ష్మీ” అనిన్నీ అనేది!

అమ్మ నవ్వాపుకునేది మొదట్లో, తరువాత సీరియస్ గానే “ఏం కథ చెప్పారేమిటి”, అని అడిగి ఊర్కొనేది!

నేను మటుకు కిమ్మనకుండా ఉండేవాణ్ణి ఈ విషయంలో, బామ్మలను కష్ట పెట్టేవాడు, బాగుపడడు అనే గట్టి నమ్మకంతో!

***

అట్లాంటి బామ్మ, ఎన్నడూ జలుబు, జ్వరాలతో కూడా పెద్దగా బాధపడని వ్యక్తి, నిష్క్రమణం కూడా అంతే నిశ్శబ్దంగా చేసింది, చెప్పా పెట్టకుండా, ఒక రోజు!

పొద్దున, తన పెద్దబ్బాయి యింట్లోనే కాఫీ ముగించుకొని, “సూర్యం, నేను తమ్ముడి ఇంటికి వెళ్ళొస్తాన్రా, స్నానం కూడా వచ్చే చేస్తాను, చూడాలనిపిస్తుంది వాళ్ళను”, అని బయల్దేరిందిట!

రిక్షా మాట్లాడుతాను ఉండమ్మా అని ఆయన అన్నా వినకుండా, చల్లగానే ఉంది ఫర్వాలేదులే అని 2 మైళ్ళ అవతల ఉన్న రెండో అబ్బాయి ఇంటికి, నడిచి వెళ్ళిందిట!

ఓ రెండు గంటలు కూచొని, పిచ్చాపాటీ మాట్లాడి, మళ్ళీ వాళ్ళు చెప్పినా వినకుండా నడిచే మా యింటికి వచ్చిందిట.

“కాస్త మజ్జిగ ఇవ్వవమ్మ లక్ష్మీ”, అని అడిగి, నెమ్మదిగా తాగి, ఓ అరగంట కూచుందిట, అమ్మతో అవీ ఇవీ మాట్లాడుతూ “సరే ఇక వస్తానమ్మా, ఎన్నడూ లేనిది ఇవ్వాళ స్నానం కూడా ఆలశ్యమైంది,” అని కూతవేటు దూరంలో ఉన్న పెద్ద కొడుకు ఇల్లు చేరుకుందట!

స్నానం చేసి, రోజూ లాగే విభూతి పెట్టుకొని, తాను రోజూ చదువుకునే పద్యాలు చదువుకుని భోంచేసిందట!

కాస్త అలసటగా ఉంది, నడుము వాలుస్తాను, అని వాళ్ళ వరండాలో ఉన్న మంచం మీద పడుకున్నదట, సుమారు 11.30 సమయంలో!

ఇవన్నీ కాలేజికి వెళ్ళి, సాయంత్రం వచ్చిన తరువాత, నాకు తెలిసిన విషయాలు!

ఇంక లేవలేదు, మా బామ్మ, అదే ఆఖరి మజిలీ అయింది ఆమెకు! ప్రశాంతంగా, 93 ఏళ్ళ వయసులో, అనాయాస మరణం పొందింది.

సరళ జీవనానికి, సరళమైన ముగింపే ఇచ్చాడు, ఆ పై వాడు!

వాడే లోపల కూడా ఉంటాడు అంటారుగా, సమయం లేదని గుసగుసలాడేమో, ఆ రోజు పొద్దున, చూడవలసిన వారినందరినీ తృప్తిగా చూసి, తరలి వెళ్ళిపోయింది!

ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, దేవులపల్లి వారి మాటల్లో!!

ఉత్తరాలు రాయిస్తోందో, తానే రాస్తోందో, ఇప్పుడు ఇంకెక్కడైనా, తెలియదు మరి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here